Dictionary
-
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
మీకు తెలుసా? మైండ్లోనూ డిక్షనరీ ఉంటుదట!
డిక్షనరీ అనేది బుక్‌షెల్ఫ్‌లోనే కాదు మనలోనూ ఉంటుంది. దీన్ని మెంటల్ డిక్షనరీ అంటారు. ఫిజికల్ డిక్షనరీలాగే ఈ మెంటల్ డిక్షనరీలోనూ రకరకాల పదాలు, వాటికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మెంటల్ డిక్షనరీ విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య స్వల్ప తేడాలు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల కొందరి మెంటల్ డిక్షనరీలో పరిమితమైన పదసంపద మాత్రమే ఉండొచ్చు. కొందరి విషయంలో మాత్రం విద్య, కళలు, జీవితానుభవాలు...మొదలైన వాటి వల్ల పదసంపద ఎక్కువగా ఉంటుంది. 20 సంవత్సరాల అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్‌కు 40,000 పదాల వరకు తెలిసి ఉంటాయని, 60 ఏళ్ల వయసులో ఆ పదాల సంఖ్య 48,000లకు చేరుతుందని, కొందరి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని సందర్భాలలో మనం ఉపయోగించాల్సిన పదం గురించి తెలిసినా గుర్తు రాకపోవచ్చు. ఈ పరిస్థితిని టిప్–ఆఫ్–ది–టంగ్ ఫినామినన్ అంటారు, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే!
ఇది మూడు భాషల ముచ్చటైన పెన్ను. ఇది చేతిలో ఉంటే, మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! దీంతో రాయడానికి సాధ్యంకాదు గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. చైనీస్ కంపెనీ ‘స్మార్ట్ యుడావో’ ఇటీవలే ఈ పెన్నును మార్కెట్లోకి తెచ్చింది. చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే అనువదిస్తుంది. మామూలు పుస్తకం లేదా ఈ–బుక్‌లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. అంతేకాదు, తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయపదాలను చెబుతుంది. విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర 199.99 డాలర్లు (రూ.16,474) మాత్రమే! -
తనయుడి కోసం డిక్షనరీ రాసిన కలెక్టర్
వైఎస్సార్ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్): డిక్షనరీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆక్స్ఫర్డ్. కాస్త వెనకటి జనరేషన్‌కు సీపీ బ్రౌన్ రాసిన తెలుగు–ఇంగ్లీషు, ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీలు, శ్యామూల్ జాన్సన్ ఇంగ్లీషు నిఘంటువు పరిచయం. అయితే తన కుమారుని కోసం ఓ తండ్రి ఏకంగా డిక్షనరీ రాశారంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన ఎవరో కాదు.. 1923–24లో కడప కలెక్టర్‌గా పనిచేసిన ఎ.గెలెట్టి. ఆయన ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ట్రినిటీ కాలేజ్ స్కాలర్‌గా ఉండేవారు. రాయల్ బటవియా సొసైటీ కరస్పాండింగ్ మెంబర్‌గా పనిచేశారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చదివి మద్రాసు ప్రెసిడెన్సీకి వచ్చారు. సివిల్ సర్వేంట్స్ స్థానిక భాషలను నేర్చుకుంటేనే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించగలరన్న సర్ థామస్ మన్రో ఉపదేశాన్ని వంట పట్టించుకున్నారు. అందుకే తెలుగు పట్టుబట్టి మరీ నేర్చుకున్నారు. కేవలం భాషను నేర్చుకోవడమే కాకుండా దానిపై పట్టు సాధించారు. 1. సహకారుల పరపతి సంఘములు, 2.విమలాజ్ఞానోపదేశములు, 3. ద డచ్ ఇన్ మలబార్, 4.వీరేశలింగం రాసిన ‘వినోద తరంగిణి’కి అనువాదం వంటివి ఆయన కలం నుంచి జాలువారాయి. ఈ కోవలోనే తెలుగు–ఇంగ్లీషు నిఘంటువును ఆయన రూపొందించారు. డిక్షనరీ గురించి ఇండియన్ సివిల్ సర్వీసు పూర్తి చేసి అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొంది తన వద్దకే వస్తున్న తన కుమారుడు ఆర్.గెలెట్టి సులువుగా తెలుగుభాష నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కడప కలెక్టర్‌గా ఉన్న ఎ.గెలెట్టి తెలుగు–ఇంగ్లీషు డిక్షనరీ తయారు చేశారు. తన కుమారుడే కాకుండా ఇంగ్లాండ్‌కు చెందిన ఇతర అసిస్టెంట్ కలెక్టర్లు, యువ అధికారులు, వ్యాపారులు, క్రిస్టియన్ మిషనరీలకు ఈ డిక్షనరీ ఎంతో ఉపయోగపడుతుందని భావించారు. అలాగే ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే తెలుగు వారికి కూడా ఈ నిఘంటువు ఉపయోగపడగలదన్న ఆశాభావాన్ని ఆయన తన ముందు మాటలో పేర్కొన్నారు. నిజానికి దీన్ని ఒక డిక్షనరీ అనే బదులు తెలుగు లేదా ఇంగ్లీషు నేర్చుకునేందుకు ఉపయోగపడే మాన్యువల్‌గా చెప్పవచ్చని ఆయన అంటారు. కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నేటికీ పదిలంగా ఉన్న ఈ అపురూపమైన డిక్షనరీ ఇతర వాటికంటే భిన్నమైంది. అదెలా అంటే....నిత్యం సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు పదాలను ఇంగ్లీషు లిపిలో రాసి వాటి ఎదురుగా ఆంగ్ల అర్థాలను పొందుపరిచారు. అలాగే పర్యాయ పదాలు కూడా ఇచ్చారు. అపద్దాన్ని సంస్కృతంలో అసత్యం అంటారని చెప్పారు. ద్రవిడ భాషల్లో ఈ పదాన్ని తరుచూ వాడుతుంటారని కూడా తెలిపారు. అపబ్దమనే పదాన్ని సామెతల్లో ఎలా ఉపయోగిస్తారో కూడా సోదాహరణంగా ఆయన వివరించారు. ఉదాహరణకు ‘ఒక అబద్దం కమ్మడానికి వెయ్యి అబద్దాలు కావలెను, చేసేవి శివ పూజలు....చెప్పేవి అబద్దాలు, దేవుని ఎదుట అంతా నిజం చెబుతాను–అబద్దం ఆడను (కోర్టులో ప్రమాణం చేసే సందర్భంలో)’ ఇలా తెలుగు, ఇంగ్లీషు భాషలను సులభంగా నేర్చుకోవడానికి ఈ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 1935లో ఈ నిఘంటువును ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో ముద్రించారు. చీఫ్ ప్యాట్రన్‌గా బొబ్బిలిరాజు బొబ్బిలిరాజు రంగారావు అప్పట్లో చీఫ్ మినిస్టర్‌గా ఉండేవారట. ఆయన ఈ నిఘంటువుకు చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరించారు. దీని ముద్రణ ఖర్చు ఆయనే భరించారు. కలెక్టర్ గెలెట్టి ‘ఈ వ్యవహారిక భాషా డిక్షనరీ విద్య వ్యాపింపగలదని నమ్మి ప్రథమ మంత్రిగా ఉన్న బొబ్బిలి రాజాగారుల పాద పద్మముల సముఖమునకు సమర్పించినాను కానుకగా’ అంటూ తన వినమ్రతను చాటుకున్నారు. -
గిడుగు బాటలో విశిష్ట పదకోశం
మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూపించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాతథంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నానికి పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలుగువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి. అర్థం కాని చదువు వ్యర్థం కాబట్టి అర్థ వివరణతో కూడిన శబ్దం లేదా పదమే ఏ పుస్తకాని కయినా వన్నె తెస్తుంది. వాసికెక్కిస్తుంది. అగణిత సంఖ్యలో మానవజాతి విజ్ఞానానికి, వికాసానికి ఆరోగ్య భాగ్యానికి దోహదం చేస్తున్న సకల శాస్త్రాలను వాటిలో క్షణానికొక తీరుగా అనుక్షణం ముమ్మరిస్తున్న శబ్దజాలానికి అర్థ గౌరవం కల్గించే నిఘంటువులు ఎన్నో శరవేగాన వెలువడుతున్న రోజులివి. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క నిఘంటువు మాత్రమేకాదు, ఒక్కొక్క శాస్త్రంలో పలు విభా గాలకు సహితం ప్రత్యేక నిఘంటువులు వస్తున్నాయి. అందులోనూ ఈ వింగడింపు శాస్త్ర, సాంకేతిక విషయాలకు మరింత అవసరమవు తోంది. అలాంటి వాటిలో వైద్య, విజ్ఞాన, శాస్త్ర నిఘంటువు ఒకటి, కణ విభజనలా పెరిగిపోతున్న ఒకే శాస్త్రంలోని పలు విభాగాలలో నిత్యనూతనంగా దూసుకువస్తున్న పద సంపదకు అర్థ గౌరవం కల్పిం చాల్సి ఉంది. ఆయా శాస్త్రాలలోని సాంకేతిక పరమైన పదాలకు అవసరాలు గ్రీకు, లాటిన్ సంస్కృత భాషలలో ఉండగా, క్రమంగా వాటిని ఆంగ్ల భాషా శాస్త్ర నిపుణుల సాయంతో ఇంగ్లిష్ వైద్య నిఘంటువులను ఆంగ్లేయులు రూపొందించుకోగా ఈ మూడు భాషల పద సంపద ఆధారంగా ప్రపంచంలోని ఇతర వైద్య విజ్ఞాన నిఘంటువులూ వెలిశాయి. భాషావేత్త, కవి మోలియర్ అంటూండే వాడట. ‘ప్రతీ అంశం మీద ఎంతో కొంత జ్ఞానకాంతి ప్రసరిస్తుండా లని. ఆ పనిని నిఘంటువులు, ప్రత్యేక శాస్త్ర నిఘంటువులూ చేస్తూం టాయి. అందులోనూ ఒక భాషా నిఘంటువులోని పదజాలాన్ని మరో భాషలోకి బట్వాడా చేయడం క్లిష్టతరమైన పని. ఒక్కో పదానికే కాదు, ఒక్కొక్క వర్ణానికి (అక్షరానికి) సహితం భిన్న వర్ణాలు ఉంటాయి. ఇలాంటి బృహత్కార్యాన్ని ప్రపంచంలో తొలి ప్రయత్నంగా భుజాల కెత్తుకున్న వాడు క్రీ.శ. ఒకటవ శతాబ్దినాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. దాని విశేషమేమంటే, ఆ చైనీస్ నిఘంటువు రూపుదిద్దు కున్న ఆనాటి నుంచి ఈ క్షణం దాకా చెక్కు చెదరకుండా ప్రాచుర్యం లోనూ, వినియోగంలోనూ ఉండడం! తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్లనాటి సమేరియన్ అక్కాడియన్ ప్రతి, తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్– బాబిలోనియన్– హిట్టయిట్ భాషల్లో వెలువడింది. స్థానిక మాండలికాలలో ప్రపంచంలో తొలి సారిగా క్రీ.పూ. 15వ సంవత్సరంలో తొలి ప్రతి వెలువడిందట! ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) మొదటిసారిగా మెసపటోమి యన్ మట్టి పలకలపై అవతరించిందంటారు! మానవాళి విజ్ఞానం వికాస దశలలో కాలిడిన తరువాత శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూ పించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. ఆ తక్కువ లోనే వెలువడిన మిక్కిలిగా ఎన్నదగినవి ఒకటి రెండు కన్నా ఎక్కువ లేవనే చెప్పాలి. తెలుగు అకాడమీ వారు ఒక చిన్న పొత్తంగా వైద్య నిఘంటువు వెలువరించగా, డాక్టర్. పి.హెచ్.బి.ఎస్. శర్మ ‘మెడికల్ డిక్షనరీ’ మకుటంతో ఒక ఇంగ్లిష్– తెలుగు వైద్య నిఘంటువును వైద్య విద్యార్థులకోసమని ‘స్టూడెంట్ ఎడిషన్’ గా సంకలనం చేసారు. కాగా, విద్యార్థులకు పండితులకు, సాహితీవేత్తలకు వినియోగపడే విధంగా శ్రీపాదవారు తెలుగులో ఒక వైద్య నిఘంటువును 1948లో తొలి ముద్రణగా తీసుకొచ్చారు. పదాన్ని, విషయాన్ని శీఘ్రంగా అర్థం చేసుకోలేని సమయాల్లో ‘పండితులకున్నూ ఈ నిఘంటువు ఆవశ్యకం ఏర్పడుతుంద’ని తెలుపుతూ ఆయన ‘ఇది సమగ్రం కావు, ఇందులో చేరవలసినవే ఎక్కువ. అవి సేకరిస్తూనే ఉండాలి అని చెప్పడం. నిఘంటు నిర్మాణం ‘ఇదే ఆఖరిది, ఇదే ప్రమాణం, ఇదే పరసీమ’ అని మనం చెప్పలేమని చెప్పక చెప్పడమే! చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాత«థంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్ని స్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నంలోనికి ఇటీవల పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలు గువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహు డైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి. తాతపేరే మనవడి పేరు అయితే ఈ మనవడి తండ్రి సుప్రసిద్ధ సాహితీవేత్త డా. గిడుగు సీతాపతి కావడం మరో విశేషం. తాత, తండ్రులనుంచి సాహిత్యస్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న చిన్న రామ్మూర్తి చిన్నప్పటి నుండి కడుపులో పుండుతో ఏళ్లతరబడి బాధ పడుతూ రావడం వల్ల వైద్య విజ్ఞానంపై ఆసక్తి కలిగి, చివరికి ఈ వైద్య నిఘంటు నిర్మాణానికి పూనిక వహించడం విశేషం! సులభ గ్రాహ్యంగా చిన రామమూర్తి ఈ వైద్య నిఘంటువును కమ్మని తెలుగు లోకి (ఇంగ్లిష్–తెలుగు) తీసుకొచ్చినందుకు బహుధా ప్రశంసనీ యులు. వేల ఏళ్లుగా, తరాల తరబడి దేశవాళీ వైద్యులూ, ఆధునిక వైద్యులూ పెంచి పోషించుతూ వచ్చిన వైద్య విజ్ఞానం మీద ఆధా రపడిన పదసంపద ఎంతో రామమూర్తి– నిఘంటువులో ఉంది. అందరికీ అర్థమయ్యే పదాలూ, వివరణలూ ఈ అనువాద రచనలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాధికి చెందిన ఎన్నో రకాల పద సంపద ఉంది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన దేశాలలో ఈజిప్టు, భారత, చైనా దేశాలు ప్రాచీన వైద్య విధానాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘ఎడ్మిన్స్మిత్ పాపిరస్’ గ్రంథం ప్రకారం మన ఆయుర్వేదం ఎంత ప్రాచీన వైద్య విధానమో క్రీ.పూ. 3000 ఏళ్ళనాడే వెల్లడైంది. ఆయుర్వేద వైద్యం, వనమూలికల ప్రాశస్త్యం తెలిసిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుప రాతియుగం). క్రీస్తుపూర్వం తొలి వైదికానం తర కాలంలో ఈ వైద్యం ప్రజారోగ్యంలోకి దూసుకువచ్చింది. ఆనాటి వైద్య శిఖామణులు పెక్కుమంది భౌతికవాదులుగా ఉన్నందుననే మనిషి ఆరోగ్యం, అనారోగ్యం ‘విధి నిర్ణయం’ కాదనీ ముందే రాసి పెట్టిన తంతు కాదనీ చెబుతూ ‘మానవ ప్రయత్నం ద్వారా సంకల్పం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని’ చరకుడు తన వైద్య సంపుణం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. అలాగే శుశ్రుతుడు కూడా తన ‘శుశ్రుత సంహిత’ లో వైద్యం లక్ష్యమే ‘రోగుల రోగ లక్ష ణాల్ని’ కనిపెట్టి నయం చేయటం. అనారోగ్యవంతుల్ని కనిపెట్టి నయం చేయటం ఆరోగ్యవంతుల్ని కాపాడటం, జీవితాన్ని పొడిగించ డమని చెప్పాడు. ఆయుర్వేద గ్రంథాలు ప్రస్తావించిన ఏడు రకాల వైద్య చికిత్సలూ ఈనాటికీ అమలులో ఉన్నాయి. వీటిలోని పద జాలానికి శ్రీపాదవారు అర్థవివరణ ఇచ్చారు. ఆయుర్వేద వైద్య శాస్త్రం లోని ఎనిమిది శాఖలూ ఆధునిక వైద్యంలో కూడా ఉన్నాయి. ‘ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు’గా పేర్కొంటున్న గ్రీక్ వైద్య శిఖామణి హిప్పోక్రటెస్ క్రీ.పూ. 4–3 శతాబ్దులనాటివాడు. ఈయన వైద్యులకు ప్రవచించి, నిర్దేశించిన నైతిక సూత్రాలనూ, బాధ్యతలనూ, ‘హిప్పోక్రాటిక్ వోత్’ అంటారు. ఇవి ఈ రోజుకీ వైద్యులకు శిరో ధార్యాలే. నిజానికి ఈ ఆదేశాలను పాటించే వైద్యులు నిజమైన ప్రజా సేవకులుగా మారి ప్రజల గౌరవాభినందనలు పొందగలుగుతారు. అలాగే ఒక రోగం భవిష్యత్ స్వరూపాన్ని నిర్ధారించగలదాన్ని ‘ప్రొగ్నా సిస్’ అంటారు. అందానికి సంబంధించిన తన గ్రంథానికి హిప్పో క్రటిస్ అదే పేరు పెట్టుకున్నాడు. ఆధునిక కాలంలో జన్యు లక్షణాలను వంశపారపర్యంగా ‘జల్లెడ’ పట్టినట్టు వివరించే ‘డీఎన్ఏ’ నిర్మాణ రహస్యం కాస్తా బద్దలయిన తర్వాత జీవశాస్త్రాన్ని జాంబవంతుడి అంగలపైన వేగవంతం చేసే మోలిక్యూలర్ (పరమాణువుల సము దాయం) బయోలజీకి తలుపులు తెరచుకున్నాయి! లూయీపాశ్చర్, రాబర్డ్ కో, కాడి బెర్నార్డ్ వైద్య శాస్త్రంలో నవీన శాస్త్రీయ పద్ధతులకు అంకురార్పణ చేశారు. ఇలా వైద్యవృత్తికి చెందిన విభిన్న శాఖలు, ఉప శాఖల నుంచి నిరంతరం నవీన ప్రయోగాల ద్వారా కుప్పలు తెప్ప లుగా ఊడిపడే వైద్యశాస్త్ర, సాంకేతిక పదాలకు అకారాదిగానూ, ఆరో పాల పరంగానూ అర్థాలు, అర్థవివరణలూ ముంచుకొస్తున్న తరు ణంలో చిన గిడుగు రామమూర్తి సిద్ధపరిచిన ఈ అభినవ వైద్య నిఘం టువు చాలా విలువైనదిగా భావించాలి. అనేక వైద్య పదాలకు ఇంతకు ముందు వైద్య నిఘంటువులలో లేని సరళ సుబోధకమైన వివరణలు ఎన్నో ఉన్నాయి. బహుశా తెలుగు ప్రతికి సంబంధించినంత వరకు రామమూర్తి నిఘంటువు ఔషధ పరిశ్రమకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెర్క్ కంపెనీ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది మెర్క్ మాన్యువల్ ఆఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ గ్రంథానికి (2003 ప్రచురణ), ఆక్స్ఫర్డ్– హెచ్.బి. సంస్థ సంయుక్త ప్రచురణగా వెలువడిన ‘న్యూ మెడికల్ డిక్షనరీ’కి (2010 ప్రచురణ)గానీ తీసిపోదని అనిపిస్తోంది. మెర్క్ మాన్యువల్ 163 సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. చివరగా, నిఘంటు నిర్మాణం కత్తిమీద సాములాంటిది. ఇది వైద్యశాస్త్ర, సాంకే తిక పద నిఘంటువే అయితే దాని నిర్మాణం మరింత అసిధారా వ్రతమే. అందుకే 19వ శతాబ్దపు ఫ్రెంచి మేధావులలో ఒకరు. ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘం టువును ఎలా నిర్మించాను’ అన్న ఉత్తమ గ్రం«థాన్ని రచించిన ఎమిలీ లిత్రే అన్న మాటల్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. ‘‘నిఘంటు రచన మతి చెడిన వాడి వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కాని ఒకటి మాత్రం నిజం, అప్పుడ ప్పుడూ ఈ వృత్తి నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది. (a profession which drives one mad) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘పేద్ద’ పదం.. జుట్టు పీక్కున్న నెటిజన్లు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ, రచయిత శశిథరూర్ నెటిజన్లకు మరో సవాలు విసిరారు. కొత్త పదాలతో ఎప్పుడూ విన్యాసం చేసే ఆయన ఈ సారి పలకడానికి కూడా కష్టంగా ఉన్న పదాన్ని ప్రయోగించారు. అదే.. హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా. రెండు మూడు సార్లు చదివితే కానీ స్పష్టంగా పలకలేని ఈ పదానికి అర్థం ఏమిటా? అని అందరూ డిక్షనరీలు ముందేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కమెడియన్ సలోనీ గౌర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె శశిథరూర్ గొంతును అనుకరిస్తూ నటి సుస్మితా సేన్ వెబ్ సిరీస్ 'ఆర్య' చిత్రం కోసం మాట్లాడింది. (శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా) అంతేకాక 'ఆర్య'లోని నటుడు చంద్రచూర్ సింగ్‌కు, శశిథరూర్‌కు మధ్య కొంత పోలిక ఉన్నట్లు తెలిపింది. ఈ వీడియోను దర్శకుడు హన్సల్ మెహతా తిరిగి పోస్ట్ చేస్తూ "శశిథరూర్ మీరిది చూశారా?" అని ప్రశ్నించారు. దీనికి శశిథరూర్ బదులిస్తూ "ఇమిటేషన్ బాగుంది. అయితే నేను అలాంటి పేద్ద పదాలను ఉపయోగించే మాటకారిని కాదు. కానీ తెరపై కనిపించే నటుడికి మాత్రం కచ్చితంగా హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా ఉండదు" అని సమాధానమిచ్చారు. దీని గురించి తెగ గాలించిన నెటిజన్లు ఎట్టకేలకు దాని అర్థం "పెద్ద పదాలను పలకడానికి భయపడటం" అని కనుగొన్నారు. (ప్యాకేజి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో) -
‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్
సాక్షి, హైదరాబాద్: కరోనా (కోవిడ్).. కరోనా.. ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఎక్కడా అవే ఊసులు. లాక్‌డౌన్‌తో దేశ ప్రజానీకమంతా ఇళ్లకే పరిమితమైంది. ఆన్‌లైన్‌లోనూ ఇదే చర్చ. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉండే కొందరు యువత కరోనా/కోవిడ్‌కు సంబంధించి కొన్ని కొత్త పదాలు సృష్టించారు. కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను వ్యక్తీకరించేందుకు ఈ పదాలను విరివిగా వినియోగిస్తున్నారు. ఆయా పదాల ఉనికిని సులువుగా కనిపెట్టేందుకు ‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ ‘కరోనా సమయం’లో అలా వాడుకలోకి, ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని పదాల పరిచయం.. కోవిడియంట్ లాక్డౌన్ నిబంధనలను నియమం తప్పకుండా పాటించే వారిని ‘కోవిడియంట్’ అని పిలుస్తున్నారు. వీరి వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కోవిడ్.. ఒబిడియంట్ అనే రెండు పదాలను కలిపి ఈ పదం పుట్టించారు నెటిజన్లు. కోవిడియట్ లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ.. వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం పాటించని వారిని ‘కోవిడియట్’గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ పదానికి ఇడియట్‌ను కలిపి దీన్ని సృష్టించారు. కరోనిక్ కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ‘కరోనిక్’గా పిలుస్తున్నారు. ప్రెపర్ కరోనా నేపథ్యంలో కుటుంబం కోసం సరంజామాను సిద్ధం చేసేందుకు కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా కుటుంబంపై ఆర్థికభారం పడుతుంది. ఇలా అతిగా ముందుజాగ్రత్తలు తీసుకునే వారిని ‘ప్రెపర్’గా వ్యవహరిస్తున్నారు. కరోనా ఫోబియా కరోనా భయంతో 24 గంటలపాటు మాస్కులు ధరించడం, బయటికి వెళ్లకున్నా, ఏ వస్తువును ముట్టుకోకున్నా పదేపదే చేతులు కడుక్కుంటూ అతిశుభ్రతతో ఇతరులను ఇబ్బంది పెట్టే గుణాన్ని ‘కరోనా ఫోబియా’ అంటున్నారు. ఇది ఒకరకమైన మానసిక వ్యాధిగా అభివర్ణిస్తున్నారు. జూమ్ బాంబింగ్ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్లలోకి అనుమతి లేకుండా చొరబడి వారి సమావేశాన్ని.. కరోనాను బూచిగా చూపి ఉద్దేశపూర్వకంగా చెడగొట్టే వ్యవహారాన్ని ఇలా వ్యవహరిస్తున్నారు. కరోనపోకలిప్స్ కరోనా మహమ్మారి కారణంగా భూమిపై మానవాళి అంతమవుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మేవారు వాడే పదమిది. -
హాహా హూహూ ఎవరో తెలుసా?
ప్రహ్లాదుడు తెలుసు. అతడి తమ్ముడు? హ్లాదుడు. ‘వీనిని అనుహ్లాదుడు అనియు అందురు.’ ‘హాహా’ అంటే నవ్వుగా పొరబడే ప్రమాదం ఉంది. కానీ ఆయనొక గంధర్వరాజు. మరి ‘హూహూ’ కూడా ఉన్నాడా? ఇతడూ గంధర్వుడే. ‘దేవల ఋషి శాపముచే మకరి అయిపుట్టి అగస్త్య శాపమున గజరూపి అయిన ఇంద్రద్యుమ్నుని పట్టుకొని బాధించి విష్ణుచక్రముచే తల నఱకబడి శాపవిముక్తుడు ఆయె’. అన్నట్టూ విశ్వనాథ సత్యనారాయణ ఒక నవల పేరు: హాహా హూహూ. అంశుమాలి అంటే సూర్యుడు. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. అస్తి జరాసంధుని కూతురు, కంసుని పెద్ద భార్య. శ్రుతకీర్తి ఎవరు? ‘అర్జునునకు ద్రౌపదియందు జన్మించిన పుత్రుడు’. ఇదే సహదేవుడి కొడుకైతే? శ్రుతసేనుడు. శ్రుతసోముడు భీముని కొడుకు. ద్రౌపది కాక నకులునికి మరొక భార్య ఉందా? ఆమె పేరు రేణుమతి. అర్జునుడు సరే. అర్జుని ఎవరు? బాణాసురుని కూతురు. అలాగే, దశరథపుత్రుడు భరతుని భార్య పేరు? మాండవి. ‘కవి’ ఒక పేరు కూడా. ఇతడు ‘రుక్షయుని కొడుకు. ఇతని వంశస్థులు బ్రాహ్మణులయిరి’. ఇలాంటి విశేషాలు ఎన్నో తెలియజెప్పే పుస్తకం ‘పురాణ నామ చంద్రిక’. సుమారు 140 ఏళ్ల క్రితం 1879లో ముద్రింపబడింది. దీని కూర్పరి యెనమండ్రం వెంకటరామయ్య. ‘మన పురాణేతిహాస కావ్యములయందు తఱుచుగ కానబడు ననేక నామములను సులభముగా తెలిసికొనుటకు తగిన ఒక అకారాది నిఘంటువు లేదని యోచించి ఆ కొఱతను కొంతమట్టుకు పూర్తిచేయదలచి ఈ గ్రంథమును వ్రాసితిని’ అని వై.వి. తన ముందుమాటలో పేర్కొన్నారు. ‘ఇందు మన దేవతలు, ఋషులు, రాజులు, కవులు, దేశములు, పట్టణములు, నదులు, పర్వతములు, గ్రంథములు, మతాచార వ్యావహారిక పదములు మున్నగునవి’ కూడా ఉన్నాయి. కళింగ దేశానికి ఆ పేరెలా వచ్చింది? కళింగుడి వల్ల. ఇతడు ‘బలి మూడవ కొడుకు’. ఈ బలి చక్రవర్తి తండ్రి విరోచనుడు. ఈ విరోచనుడు ప్రహ్లాదుని కొడుకు. మల్లనకు ఇందులో ఇచ్చిన వివరం: ‘బమ్మెర పోతన కుమారుడు. రుక్మాంగద చరిత్రము అను గ్రంథమును రచియించెను. ప్రౌఢకవి మల్లన అనునది ఇతనికి బిరుదాంకము’. ఆర్యులు అన్నమాటను ఇలా వివరించారు: ‘వేదములయందు చెప్పబడినవారు. వీరు తొలుత సరస్వతీ దృషద్వతీ నదుల మధ్య ప్రదేశము నందు ఉండి పిదప ఆర్యావర్తమునందు ఎల్ల వ్యాపించిరి. ఈ దేశమునందలి యాచార వ్యవహారములు అన్నియు వీరే కల్పించినవారు’. శాలివాహనుడు, హిందూమతము లాంటి కొన్ని మాటలకు దీర్ఘ వివరణలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఆర్కైవ్.ఆర్గ్‌లో చదవొచ్చు. -
విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) : చదువుకు పేదరికం అడ్డుకాదని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించి నేడు గ్రూప్ 1 ఆఫీసర్‌గా మీ ముందుకొచ్చానని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇమాంపేట ఆదర్శపాఠశాలలో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే డిక్షనరీల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం చదువని, ఆ ఆయుధంతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు. అమ్మా పౌండేషన్ వ్యవస్థాపకులు పోలా గాంధీ, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
మేమున్నామని...
బండి చక్రాలు రెండూ విరిగిపోతే గమ్యమే కాదు, మార్గం కూడా శూన్యం అనిపిస్తుంది. బలమైన వాళ్లయితే ఇరిగిన చక్రాల బండిని కూడా లాక్కెళ్లగలుగుతారు. శక్తి లేని చిన్నారి దేవిక బండి... కదిలే పరిస్థితిలో లేదు. బతుకు బండి, చదువుల బండి, భవిష్యత్తు బండి.. అన్నీ ఆగిపోయాయి. క్లాస్‌మేట్సే ఈ బండిని, బాటసారినిభుజానికెత్తుకుని ముందుకు నడిపిస్తున్నారు. కంబాలపల్లి శివారు సండ్రలగూడెంకు చెందిన అమ్మాయి ఈసం దేవిక. కంబాలపల్లి జిల్లాపరిషత్ సెంకడరీ పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఎమినిదవ తరగతి చదువుతోంది. దేవిక తండ్రి ఈసం రమేశ్ హైదరాబాద్‌లో లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2012లో కాలు ఎముక విరగడంతో సండ్రలగూడెంకు వచ్చాడు. చికిత్స తీసుకుంటూనే మూడు నెలలకు అంటే ఏప్రిల్ 9న మరణించాడు. దేవిక తల్లి యశోద గృహిణి. ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతూ 2015, డిసెంబర్లో చనిపోయింది. ఆ దంపతుల ఏకైక కుమార్తె దేవికే కావడంతో ఆ ఇద్దరికీ ఈ చిన్నారే తలకొరివి పెట్టి జన్మరుణం తీర్చుకుంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఏకాకైన దేవిక తాత, మేనమామల పంచన చేరింది. దేవిక తలిదండ్రులకు సండ్రలగూడెంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, తాటాకుల గోడలు, రేకుల పైకప్పుతో ఒక్క గది ఇల్లు ఉన్నాయి. వర్షం వస్తే బురదమయమే ఆ ఇల్లు. ఇదీ దేవిక నేపథ్యం! వారం కిందట.. కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అంకటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు తాను దత్తత తీసుకున్న పేద విద్యార్థులు వల్లపు లావణ్య, హరిచంద్రప్రసాద్‌కు బ్యాగులు, చెప్పులు, నోట్ పుస్తకాలు, జామెట్రికల్ బాక్సు, డిక్షనరీ ఇచ్చారు. అప్పుడు దేవిక తన తల్లిదండ్రులు బతికి ఉంటే తనకూ ఇవన్నీ కొనిపెట్టేవారని బాధపడింది. అమ్మానాన్నను తలచుకొని ఏడ్చింది. ఈ విషయాన్ని ఆమె తోటి విద్యార్థులైన వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష, సుమాలిక, ప్రియాంక, ఉమామహేశ్వరి గమనించారు. ఎలాగైన దేవిక బాధను దూరం చేయాలని అనుకున్నారు. దేవికకు తమ వంతు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. తమ తరగతిలోని 47 మంది విద్యార్థులతో తమ ఆలోచనను పంచుకున్నారు. వాళ్ల నిర్ణయానికి ముక్తకంఠంతో మద్దతు తెలిపారు తోటి విద్యార్థులు. అంతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులెవరికీ చెప్పకుండా 47 మంది క్లాస్మేట్స్ కలిసి కొంత మొత్తం డబ్బును సమకూర్చారు. నోట్‌బుక్స్, దేవిక చదువుకోవడానికి ఉపయోగపడే ఇతర సామాగ్రిని అంటే తమ తల్లిదండ్రులు తమకు కొనిపెట్టిన వస్తువులన్నిటినీ దేవిక కోసం కొన్నారు ఆ పిల్లలు. నాలుగురోజుల కిందట... ఉదయం బడిలో ప్రార్థనా సమయమప్పుడు వాటన్నిటినీ ప్రధాన ఉపాధ్యాయుడు మైస శ్రీనివాసులు, పీఈటీ పిల్లి కాశీనాథ్ సమక్షంలో దేవికకు అందజేశారు. ఎనిదవ తరగతి విద్యార్థుల ఈ చొరవకు ఉపాధ్యాయ బృందంమంతా ఆనందాశ్చర్యాలకు లోనయింది. ఆ పిల్లల పెద్ద మనసు చదువుచెప్పే పెద్దలను కదిలించింది. తోటి మనిషికి చేయూనందించే విషయంలో స్ఫూర్తి పాఠం నేర్పించింది. అందుకే వాళ్ల క్లాస్‌టీచర్ గురునాథరావు వెంటనే స్పందించి దేవికకు స్కూల్ బ్యాగ్‌ను కొనిపెట్టారు. ‘మా దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలు చేసిన ఈ గొప్ప పని చూస్తుంటే నిజంగా మాకు గర్వంగా ఉంది. వాళ్ల పెద్ద మనసు మాకూ ప్రేరణే! నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వం ఉన్న మనిషనని నిరూపించుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు మా పిల్లలు చేసింది అదే. ఈ సంఘటనతో మమ్మల్ని కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు మా పిల్లలు. మేం చెప్పే పాఠాలే కాదు మా ఆలోచనా ధోరణి కూడా ముఖ్యమే అన్న విషయాన్ని గుర్తు చేశారు. గురువుల బాధ్యత పెంచారు!’ అన్నారు గురునాథరావు. బాధ అనిపించింది... ‘‘వెంకటేశ్వర్లు సార్ పుస్తకాలు డొనేట్ చేస్తున్నప్పుడు దేవిక పక్కకు వెళ్లి ఏడ్వడం మాకు మస్తు బాధనిపించింది. తనను చూసుకోవడానికి అమ్మానాన్న లేరనే కదా అట్లా ఏడ్చింది అనుకున్నాం. అమ్మానాన్న లేకపోతే ఏంది.. మనమున్నం కదా.. దేవికకు కావల్సినవి మనమే కొనిద్దాం అని మాట్లాడుకున్నం. మా క్లాస్మేట్స్ అందరూ ఒప్పుకున్నరు. దేవికకు మేమందరం తోడున్నమని చెప్పడానికే ఈ సహాయం చేసినం అంతే’ అన్నారు ఈ సాయానికి సారథ్యం వహించిన వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష. ‘ఆమెకు వాళ్ల తాత, మేనమామ ఉన్నా దేవిక అట్లా ఏడిస్తే మాకు మంచిగనిపించలేదు. ఆమె దోస్తులు ఆమెకు ఏదైనా చేయాలనిపించింది’ అన్నారు కల్లాకపటం లేని ఆ చిన్నారులు. దేవికకు 10వ తరగతి వరకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి పాఠశాల పీఈటీ పిల్లి కాశీనాథ్ ముందుకు వచ్చారు. ఇందుకు ఆయనను ఉపాధ్యాయ బృందమంతా అభినందించింది. కంబాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థుల ఈ స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాల కీర్తిని ఇనుమడింపచేసిందని, సర్కారు బడి ప్రగతికి దారివేసిందని కొనియాడారు ఆ స్కూల్ టీచర్లు. - బోనగిరి శ్రీనివాస్, సాక్షి మహబూబాబాద్ రూరల్, వరంగల్ మా ఫ్రెండ్స్, టీచర్లే ఆదర్శం మొదటి నుంచీ మేం పేదోళ్లమే. అయినా మా అమ్మ, నాన్న ఉన్నప్పుడు బాగానే చూసుకునేటోళ్లు. తాత, మేనమామ ఉన్నా అమ్మానాన్న బాగా గుర్తొస్తరు. బాధనిపిస్తుంటుంది. అందుకే ఆ రోజు వెంకటేశ్వర్లు సార్ లావణ్య, హరిశ్చంద్రప్రసాద్లను దత్తత తీసుకుని వాళ్లకు అన్ని కొనిస్తుంటే మా అమ్మానాన్న గుర్తొచ్చి బాగా ఏడ్పొచ్చింది. కాని ఆ సంఘటనే నాకు ఫ్రెండ్షిప్ వాల్యూని చెప్పింది. తోటివారికి ఎలా హెల్ప్ చేయాలో నేర్పింది. నా లైఫ్‌లో నాకు ఫ్రెండ్స్, మా టీచర్లే ఆదర్శం. అందుకే పెద్దయ్యాక నేనూ టీచర్నే కావాలనుకుంటున్నా. పూర్ స్టూడెంట్స్‌కి సహాయం చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిలకు. వీలైనంత వరకు తోటివారికి సహాయడాలనేదే నా లక్ష్యం. ఇప్పుడు నాకు అమ్మానాన్న లేరనే దిగుల్లేదు. నా ఫ్రెండ్స్, టీచర్లే నాకు అన్నీ. నాకు సహాయం చేసి నాకు అండగా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ థాంక్స్. వాళ్లను ఎప్పటికీ మరిచిపోలేను’ - ఈసం దేవిక ఆ బాధ నాకు తెలుసు ‘నాకు నాన్న లేడు. అమ్మ ఉన్నా నాన్న లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. అట్లాంటిది దేవికకు అమ్మానాన్న ఇద్దరూ లేరు. కాబట్టి ఆమెకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అందుకే దేవిక ఆ లోటు ఫీల్‌కాకుండా చూడాలనే ఫ్రెండ్స్ అందరం అనుకొని ఆమెకు కావల్సినవి కొనిచ్చినం’ - వల్లపు లావణ్య. దేవిక క్లాస్మేట్ ఇదే ఉదాహరణ ‘తోటి విద్యార్థి కష్టానికి క్లాస్‌లోని పిల్లలంతా స్పందించడం వాళ్లలోని మానవతా విలువకు నిదర్శనం. దీనినే ఆదర్శంగా తీసుకొని ప్రతి బడిలో పాఠ్యపుస్తకాలతోపాటు పిల్లలకు సామాజిక పరిస్థితుల గురించి, నైతిక విలువల గురించీ బోధించాలి. దేవిక విషయానికి వస్తే టెన్త్ పూర్తయ్యే దాకా ఆమె బాగోగులు మేమే చూసుకుంటాం. - మైస శ్రీనివాసులుప్రధానోపాధ్యాయుడు బాగా చదువుకోవాలి తనకు ఎవరూ లేరనే బాధతో, దిగులుతో దేవిక చదువునెక్కడ కేర్లెస్ చేస్తుందోనని భయపడ్డాం. ఆమె ఎప్పుడూ బాధపడొద్దని.. బాగా చదువుకోవాలని.. ఏ విషయంలో ఇబ్బందిపడొద్దనే దేవికకు ఈ హెల్ప్ చేసినం’ - గంధసిరి సుమాలిక దేవిక మరో క్లాస్మేట్ -
ఘటికుని జ్ఞానోదయం
హ్యూమర్ ఫ్లస్ సుబ్బారావు ఒక వేదాంతి. జ్ఞానం ఉంటే డబ్బు అక్కర్లేదని ఆయన నమ్మకం. డబ్బుంటే జ్ఞానంతో పని లేదని వాళ్లావిడ నమ్మకం. పరస్పర విరుద్ధ నమ్మకాల సంఘర్షణల సమ్మేళనమే దాంపత్యం. ప్రకృతి సహజంగా ఆమె వేధించేసరికి సుబ్బారావు వేదాంతిగా మారాల్సి వచ్చింది. వేదాంతం యొక్క ప్రత్యేకత ఏమంటే అది మనల్ని అర్థం చేసుకోదు. మనకి అర్థం కాదు. ఒకరోజు డిక్షనరీలు అమ్మే కుర్రాడు సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. దిండు కంటే దిట్టంగా ఉన్న డిక్షనరీని చూపించాడు. అన్ని పదాలకి అర్థాలు, అర్థవంతమైన అన్ని పదాలూ ఇందులో ఉన్నాయని చెప్పాడు. ‘‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు. మనం ఏదైతే అర్థమైందని అనుకుంటామో, దాని అర్థం అది కాకపోవచ్చు. అర్థం కానిదంతా అర్థశాస్త్రం. అర్థమైతే అది పరమార్థం. పురుషులు అర్థమవుతారు కాబట్టి పురుషార్థం అన్నారు. స్త్రీలు అర్థం కారు కాబట్టి స్త్రీ అర్థం లేకుండా పోయింది’’ అన్నాడు సుబ్బారావు తాపీగా. డిక్షనరీల కుర్రాడు బుర్ర గోక్కుని ‘‘సార్.. ఇందులో ప్రతి వర్డ్కీ..’’ అంటూ ఏదో చెప్పబోయాడు. ‘‘వర్డ్స్‌వర్త్ అనే కవి ఉన్నాడు కానీ, వర్డ్స్కి వర్త్ లేదు. అయినా పెళ్లయిన తర్వాత డిక్షనరీలతో పని లేదు. అంతా రియాక్షనీరినే’’ ‘‘దీనికి డిస్కౌంట్ కూడా ఉంది’’. ‘‘కౌంట్, డిస్కౌంట్, ఎకౌంట్, రీకౌంట్ అన్నీ ఒక్కలా కనిపించినా ఒక్కటి కావు. జాయింట్ ఎకౌంట్ ఉంటే జాయింట్స్ సేఫ్‌గా ఉంటాయి. మోకాళ్ల రీప్లేస్మెంట్ ఉండదు. మోకాళ్ల చిప్పల మార్పిడి ఎంత ఎక్కువగా జరిగితే సొసైటీకి అంత ఎక్కువ డేంజర్. ఎందుకంటే చాలామందికి మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టి’’. డిక్షనరీల కుర్రాడు ఘటికుడు. డిక్షనరీలు మోసి మోసి వాడు ఎక్స్ట్రార్డినరీగా మారాడు. ఎబిసిడిలు రాని వాళ్లకు కూడా డిక్షనరీలు అమ్మిన ఘనుడు. ‘‘డిక్షనరీల వల్ల జ్ఞానమొస్తుంది సార్’’ అని నోరు జారాడు. జ్ఞానం అనే పదం వింటే సుబ్బారావుకి పూనకం వస్తుంది. ‘‘డిక్షనరీల వల్ల డిసెంట్రీ, డిఫ్తీరియా, ధనుర్వాతం రావచ్చునేమో కానీ జ్ఞానం రాదు నాయనా. జ్ఞానమనేది దురద కాదు, హఠాత్తుగా వచ్చి గోక్కుంటే పోడానికి. మన శరీరంలో రక్తంలా అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనం గాయపడితే కనిపిస్తుంది. జ్ఞానాన్ని కళ్ల చూడాలంటే ప్రతివాడూ గాయపడాలి. ఎర్రగా కనిపించేదంతా రక్తం కానట్టే, జ్ఞానంలా కనిపించేదంతా జ్ఞానం కాదు. అజ్ఞానానికి మారువేషాలెక్కువ’’. ‘‘మీరు జ్ఞానులని ఒప్పుకుంటాను సార్, కానీ ఎంత జ్ఞానికైనా అర్థం తెలియని పదాలుంటాయి. అందుకే ఈ డిక్షనరీ’’. ‘‘అయితే అభిటృక్యనేక్సియాన్టక్స్ అనే పదానికి అర్థం చెప్పు’’. ‘‘అరబ్ పదానికి అర్థం అడిగితే ఎలా?’’అన్నాడా కుర్రాడు జడుసుకుంటూ. ‘‘అది అరబిక్ అని నీకెలా తెలుసు?’’ ‘‘సౌండ్‌ని బట్టి ఊహించా’’. ‘‘అది అరబిక్ కాదు, మక్యావో భాష’’. ‘‘ఏ దేశంలో మాట్లాడుతారు సార్’’. ‘‘ఎక్కడా మాట్లాడరు. మాటలు రానివాళ్లు మాట్లాడతారు. మనకు తెలిసిందే భాష కాదు. చూసిందే వేషం కాదు’’. డిక్షనరీలు అమ్మకుండా వెళ్లడం ఆ కుర్రాడి డిక్షనరీలోనే లేదు. ఎన్నో జిడ్డు గిరాకీలను చూశాడు కానీ, ఆముదంలో ఈదడం ఇదే మొదటిసారి. ‘‘మీరు ఫిలాసఫరా సార్’’ అని పొగడ్డానికి ప్రయత్నించాడు. ‘‘ప్రతి సఫరర్ ఫిలాసఫర్ కాకపోవచు కానీ, ప్రతి ఫిలాసఫర్ సఫరరే’’. ‘‘మీలాంటి వాళ్ల కోసమే ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సార్’’. ‘‘ఆక్స్ అంటే ఎద్దు. ఎద్దు.. చాకిరీ చేసే జంతువు. బానిస. స్లేవరీ పేరుతో ఉండే డిక్షనరీలు నేను కొనను’’ ‘‘మీకు కొనడం ఇష్టం లేదు. అందుకే ఈ జ్ఞానబోధ’’ ‘‘కొనుగోళ్లు, అమ్మకాలు మన ఇష్టాల ప్రకారం జరగవు. మనల్ని మనం అమ్ముకుంటేనే, మనకు కావాల్సినవి కొనగలం. వ్యాపారమైనా, కోళ్ల ఫారమైనా కంపు లేకుండా నడవదు. వాదం, వేదం, నిర్వేదం చివరికంతా జూదం. వెళ్లకపోతే నీకు ప్రమాదం’’. కుర్రాడు పారిపోతూ సుబ్బారావు ఇంటికి ‘నో ఎంట్రీ’ బోర్డు తగిలించి వెళ్లాడు. - జి.ఆర్.మహర్షి -
నిఘంటువు రూపొందించాలి
చర్చాగోష్టిలో వక్తలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగు భాషకు నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు భాషావేత్తలు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంత్రి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం నాంపల్లిలోని తెలుగువర్సిటీ సమావేశ మందిరంలో భాషాభివృద్ధి పీఠం, నిఘంటు నిర్మాణ శాఖ ‘తెలంగాణ తెలుగు నిఘంటువు-నిర్మాణ ప్రణాళిక’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. తెలంగాణ పది జిల్లాలలో ఉన్న భాషలోనుంచి అన్ని ప్రాంతాల పదాలను స్వీకరిస్తూ తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించాలని, ఆ తర్వాత నిఘంటు నిర్మాణం జరగాలని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణ ప్రామాణిక భాష రూపొందించుకున్నప్పటికీ ఇతర ప్రాంతాల మాండలికాలను సమానంగా గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక భాషను పాఠ్య పుస్తక రచనకు, అధికార వ్యవహారాలకు, మీడియా అవసరాలకు వినియోగించాలని అన్నారు. ప్రముఖ భాషావేత్త ఆచార్య ఎ.ఉషాదేవి మాట్లాడుతూ నిఘంటు నిర్మాణానికి అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతినే తెలంగాణ నిఘంటువు నిర్మాణానికి కూడా వర్తింప చేయాలని కోరారు. విషయ సేకరణ, వడపోత, అర్థ నిర్ణ యం నిఘంటు నిర్మాణంలో ప్రధానమని సూచించారు. డాక్టర్ భుజంగరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మాండలికాలనీ కలిపి ఒక ప్రామాణిక భాషగా రూపొందించాలని అన్నారు. తన వాదనకు ఆయన శాసనాధారాలు చూపారు. రెండవ సదస్సుకు ఆచార్య కె.ఆశీర్వాదం అధ్యక్షత వహించారు. జకోస్లోవేకియా రెండు గా విడిపోయిన..జక్ దేశం నుంచి వచ్చిన ఆచార్య ఎరస్లౌ వాచక్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు జి.ఉమా మహేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఆచార్య కె.రమణ య్య, జి.ఎస్.గాబ్రియేల్, వారణాసి మాధవ శర్మ, దేవీ లాల్, ఆచార్య వి.స్వరాజ్య లక్ష్మి, డాక్టర్ వడ్ల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిఘంటు నిర్మాణ శాఖ అధిపతి డాక్టర్ వై.రెడ్డి శ్యామల చర్చాగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్
స్థలం: ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్, హైదరాబాద్. సమయం: సాయంత్రం 4 గంటలవుతోంది. చేతికి గడియారం పెట్టుకోవడం ఎప్పుడూ అలవాటు లేని హీరో రవితేజకు తన బాడీ క్లాక్ మాత్రం టైమ్ చెప్పేసినట్లుంది. తలుపు వేసి ఉన్న ఆ ఏసీ ఆఫీసు గది బయట ఉన్న అసిస్టెంట్‌ను పిలిచి, టైమ్ ఎంతైందని అడిగారు. నాలుగు గంటలని అనగానే, ‘‘అయితే ప్రొటీన్లు పట్రా!’’ అనేశారు. సన్నగా, పొడుగ్గా ఉండే ఈ ఎనర్జిటిక్ హీరో ఇప్పుడు వ్యాయామం, ఆహారం విషయంలో మరింత క్రమశిక్షణ పాటిస్తున్నారు. బరువే తప్ప, ఉత్సాహం తగ్గని రవితేజ చేతిలోని ప్రొటీన్ షేక్‌ను నెమ్మదిగా సిప్ చేస్తూ, బాక్సులోని యాపిల్ ముక్కలు తింటూ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా మాట్లాడారు. కెరీర్లో కెల్లా అత్యంత కాస్ట్లీ చిత్రం ‘కిక్2’ ఈ శుక్రవారం విడుదల కానున్న వేళ... ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ఈ ‘మాస్ మహారాజా’ ‘సాక్షి’తో మనసు విప్పి పంచుకున్న కబుర్లు... *** చాలా సన్నబడ్డారు. కారణం? కారణమేమీ లేదు. ఇంతకు ముందు డిసిప్లిన్డ్గా ఉండేవాణ్ణి. ఇప్పుడు మరింత డిసిప్లిన్డ్గా మారా. రోజూ జిమ్‌కు వెళుతున్నా, వర్కౌట్లు చేస్తున్నా. మా అమ్మతో సహా అంతా ‘ఏంట్రా? చిక్కిపోయావ్’ అంటున్నారు కానీ, నాకు మాత్రం బరువు తగ్గాక ఎంత బాగుందో తెలుసా? *** మీరు గతంలో లావేమీ కాదే! ఎందుకు తగ్గారు? ఇదేదో సినిమాలో పాత్ర కోసం చేసిన పని కాదు. నేను నా కోసం చేసుకున్నది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా బాగుంది. వ్యాయామం చేశాక షూట్‌కు వెళితే, ఆ ఉత్సాహం ఎంతుంటుందో మాటల్లో చెప్పలేను. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకు నా మాటలు అర్థమవుతాయి. మా పిల్లలిద్దరూ మునుపటి కన్నా బాగున్నానంటున్నారు. నాలా అవుతామంటున్నారు. *** ఇంతకీ వర్కౌట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? నేనెప్పుడూ ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఇప్పుడు ఇంకా తొందరగా, తెల్లవారి 4.30 గంటలకే లేస్తున్నా. రొటీన్ అంతా పూర్తి చేసుకొని, రెండు గంటల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లతో సహా అన్నీ చేస్తా. ఆ తరువాత రెడీ అయిపోయి, షూటింగ్‌కు వెళతా. ఎప్పుడూ టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవడం అలవాటు. ఇప్పుడూ అంతే. కాకపోతే, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా. కొద్ది కొద్దిగా ఎనిమిదిసార్లు తీసుకుంటున్నా. *** తిండిలో రిస్ట్రిక్షన్స్ పెట్టి, కడుపు కట్టేసుకుంటున్నారన్న మాట! అదేమీ లేదు. కినోవా రైస్ వాడుతున్నా. ఓట్స్, చికెన్, ఫిష్, స్వీట్లు - అన్నీ తింటున్నా. పులిహోర నాకు చాలా ఇష్టం. ఏదీ వదలడం లేదు. కాకపోతే, మితంగా! టైమ్ ప్రకారం! మసాలాలు, నూనెలు మాత్రం పూర్తిగా మానేశా. స్వీట్లు కూడా మా అమ్మ చేసినవి తింటున్నా. అదీ పంచదారతో కాకుండా, బెల్లంతో చేసిన పూతరేకుల లాంటివి తింటున్నా. పంచదారతో చేసేవన్నీ బెల్లంతో చేయించుకొని, ప్రయోగాలు చేస్తున్నా. ఒకప్పుడు 82 కిలోల దాకా ఉండేవాణ్ణి. ఇప్పుడు 70 కిలోలకు వచ్చా. *** మరి పార్టీలు, విందు వినోదాల మాటేమిటి? నైట్ లైఫ్ అంతా ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ మానేశా. పార్టీలకు నో చెప్పేశా. చాలా సంవత్సరాలై పోయింది. ఇప్పుడు రాత్రి 9.30 కల్లా నిద్రపోతున్నా. మరీ తప్పనిసరి పార్టీకి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా, రాత్రి 12 గంటల కల్లా దుకాణం బంద్! *** సన్నబడ్డాక తొలి ఫిల్మ్ ‘కిక్2’కి ఎలా కనిపిస్తానన్న టెన్షన్ లేదా? నిజం చెప్పాలంటే, సన్నగా, పొడుగ్గా ఉన్నవాళ్ళు కెమేరా ముందు బాగుంటారు. కావాలంటే, హిందీ రంగం నుంచి ఇక్కడి దాకా అలాంటి వాళ్ళందరినీ మీరు చూడండి. కాకపోతే, సన్నబడడం వల్ల వార్డరోబ్ ఖాళీ అయిపోయింది. (నవ్వుతూ) కొత్త దుస్తులు షాపింగ్ చేసే పనిలో పడ్డా! *** మీ దృష్టిలో అందానికీ, ఆరోగ్యానికీ నిర్వచనం? ఆరోగ్యమే అందం. దాన్ని వేరు చేసి చూడలేం. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు అందంగా ఉంటే, ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకే, ‘పాజిటివ్‌గా ఉండండి’ అంటా! *** అందుకేనా చిన్న వేషాలతో మొదలై ఇంత స్టారయ్యారు? చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, ఇష్టపడి పనిచేయరు. ఇష్టపడి చేస్తే కష్టం తెలీదు. ఇష్టపడి కష్టపడితే ఎవరైనా పైకొస్తారు! *** మీలాగే ఇప్పుడు చాలామంది సినీరంగంలో అండ లేకుండా పైకి రావడం... (మధ్యలోనే అందుకుంటూ...) గాడ్‌ఫాదర్ ఎవరూ లేని నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివాళ్ళు చాలామంది రావాలి. వాళ్ళ సినిమాలు ఇంకా బాగా ఆడాలి. తమిళంలో ‘సూదుకవ్వవ్ు’ లాంటి చిన్న సినిమా 40 కోట్ల దాకా కలెక్ట్ చేసిందట. మన చిన్న సినిమాలూ ఆ స్థాయికి వెళ్ళాలి. అది ఇంకా ఎందుకో జరగట్లేదు. *** కొత్త సినిమాలన్నీ చూస్తుంటారా? బ్రహ్మాండంగా! తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, గుడ్...బ్యాడ్ అగ్లీ - ఇలా అన్నిరకాల సినిమాలూ హోవ్‌ు థియేటర్లో ‘క్యూబ్’తో చూస్తా. లేటెస్ట్ ‘సినిమా చూపిస్త మావ’ కూడా చూసేశా! *** మరి, ప్రేక్షకుల రియాక్షన్ ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు లైన్లో నిల్చొని, కొట్టుకొని టికెట్లు కొనుక్కున్న రోజుల నుంచి ఇప్పటికీ నాలోని ప్రేక్షకుడు అలానే ఉన్నాడు. ఏ సినిమా చూసినా హీరోలా కాక, ఆ దృష్టితోనే చూస్తా. ఇప్పటికీ తెరపై సన్ని వేశాన్ని బట్టి నవ్వొస్తే నవ్వేస్తా. ఏడుపొస్తే, ఏడ్చేస్తా. ప్రివ్యూకి వెళ్ళి, కదలకుండా కూర్చొనే రకంలా సినిమా చూడడం నా వల్ల కాదు. *** మీ సంతోషం, దుఃఖం పంచుకొనే సన్నిహితులు? నాకు నేనే పెద్ద ఫ్రెండ్‌ని. షూటింగ్‌లోనైనా, బయటైనా నా చుట్టూ ఎవరైనా ఈసురోమంటూ ఉన్నా, రిజర్వుడ్‌గా ఉన్నా నచ్చదు. వాళ్ళను చెడగొట్టి, నాలా ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తా. *** ఎలాంటివాళ్ళంటే మీకు ఇష్టం? సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళను ఇష్టపడతా. స్టుపిడిటీని భరించలేను. *** హార్డవర్కనే తప్ప విధిని నమ్మరా? దేవుడి మీద నమ్మకం లేదా? జరిగిపోయింది, జరగాల్సింది - దేని గురించీ ఆలోచించను. జరుగుతున్న దాని మీదే దృష్టి పెడతా. ఏదీ ముందుగా ప్లాన్ చేయను. అది కుదరదు కూడా. నా ట్రావెల్లో అనుకోకుండా కృష్ణ వంశీ, తరువాత పూరి జగన్నాథ్ తగిలారు. కలసి ప్రయాణించాం. పైకొచ్చాం. గుడులు, పూజలు, వారాలు, వర్జ్యాల లాంటి నమ్మకాలు లేవు కానీ, దేవుణ్ణి నమ్ముతాను. మనల్ని మించిన అతీతశక్తి ఉందని బలంగా విశ్వసిస్తాను. *** ఈ మధ్య రెండు చెవులకీ రింగుల లాంటి వాటితో కనిపిస్తున్నారే? ‘కృష్ణ’ సినిమా టైవ్‌ులో ఒక చెవికి పోగు లాంటిది పెట్టాం. అది బాగుందని, తరువాత రెండో చెవి కూడా కుట్టించి, పెట్టించా. అంతే తప్ప, మరేమీ లేదు. ఇప్పటికీ గొలుసులు, వాచీల లాంటివి పెట్టను. *** తెరపై మీరు చాలామందికి ఎనర్జీ. మరి మీకు ఎనర్జీ కావాలంటే? వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, నా జీవితంలో డల్‌నెస్ అనేదే లేదు. చిన్న వేషాల రోజుల నుంచి ఇప్పటి దాకా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. డిక్షనరీలో నాకు నచ్చనిపదమేదైనా ఉందంటే అది ‘డల్‌నెస్’. చిన్నప్పటి నుంచీ నేనింతే! ఎప్పుడూ యాక్టివే! ఒక్కమాటలో, నేనెప్పుడూ ‘కిక్’లోనే ఉంటా. *** మీడియా ముందుకు రారు. ఇంటర్వ్యూలూ తక్కువే. కారణం? మనం కాదు మన పని, మన సినిమాలూ మాట్లాడాలని నమ్ముతా. అందుకే అలా! అయావ్‌ు టోటల్లీ ఎ ప్రైవేట్పర్సన్. *** మీ పిల్లల గురించి చెప్పండి? మా అమ్మాయి మోక్షద. ఇప్పుడు 8వ తరగతి చదువుతోంది. అబ్బాయి మహాధన్ 4వ తరగతి. వాళ్ళిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స. ఈ తరం పిల్లాడు.. మా వాడు పిచ్చ హుషారు. *** మీ వాడెప్పుడూ నటిస్తానని అడగడా? తండ్రిని చూసి పిల్లలు అలా ఉండాలనుకుంటారు. మా అబ్బాయి అప్పుడప్పుడు చిన్న వేషం వేస్తానంటూ ఉంటాడు. నేను ‘ముందు బుద్ధిగా చదువుకో’ అంటా. (నవ్వులు...) *** ‘మాస్ మహారాజా, ఆంధ్రా అమితాబ్’ అంటే ఎలా ఉంది? (నవ్వుతూ...) ఏమీ అనిపించదు. ఆ పేర్లకూ, నాకూ సంబంధం లేదనిపి స్తుంది. దర్శకుడు హరీశ్ శంకర్ నన్ను ‘మాస్ రాజా... మాస్ రాజా’ అనేవాడు. దాన్నే ‘మాస్ మహరాజా’ అని టైటిల్స్‌లో ప్రేమగా వేస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇలా హీరోల ముందు బిరుదులు తగిలించడం మన తెలుగులో, తమిళంలోనే ఎక్కువ. *** మీకు తమిళ్, హిందీ బాగా వచ్చు. అక్కడ నటించాలని లేదా? కొన్ని అవకాశాలొచ్చాయి కానీ, నాకు నచ్చలేదు. మంచి ఛాన్సలు వస్తే చేయడానికి నేను ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నా. *** హిందీలో మీ తరహా ఎంటర్టైనర్స చాలా వస్తున్నాయే! చాలాభాగం మల్టీస్టారర్లు. అలాంటివి ఇక్కడా చేయచ్చు. కానీ, మన దగ్గర ఇతర హీరోలూ ముందుకు రావాలిగా. నేనైతే మల్టీస్టారర్సకి రెడీ. కొంతకాలం క్రితం వెంకటేశ్‌తో వీరూ పోట్ల దర్శకత్వంలో చేయాలనుకున్నాం. కుదరలేదు. *** ‘మసాన్, మాంఝీ’ లాంటి రియలిస్టిక్ ఫిల్మ్స్ చేయచ్చుగా! ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివశంభో’, ‘నేనింతే’ లాంటి వెరైటీ స్క్రిప్ట్స్ చేస్తే ఏమైందో చూశారుగా. అందుకే, (దణ్ణం పెట్టేస్తూ...) అవన్నీ మనకు వద్దు. హాయిగా అందరినీ నవ్వించే కమర్షియల్ సినిమాలు చేసుకుందాం. *** ఈ మధ్య ఏడాదికి ఒకటే చేస్తున్నారు. స్పీడ్ తగ్గించారా! 2012లో నాలుగు సినిమాలు చేస్తే, పెద్దగా ఆడలేదు. అందుకే, కొంచెం బ్రేక్ వేసి, ఆగా. రెండేళ్ళుగా ఒక్కో సినిమానే వచ్చాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంటున్నా. ఇక నుంచి మళ్ళీ వరసగా సినిమాలు చేస్తా. *** హీరోగా చేయకపోయినా, స్పెషల్ అప్పీయరెన్సలు, కన్నడంలో ‘వజ్రకాయ’ లాంటి సినిమాల్లో గెస్ట్‌గా చేస్తున్నారు! అవన్నీ ఫ్రెండ్షిప్ కొద్దీ చేసినవి. కన్నడ శివ్‌రాజ్ కుమార్ ఫోన్ చేసి అడగడంతో, ‘వజ్రకాయ’ చేశా. దర్శకుడైన కొరియోగ్రాఫర్ హర్ష ఫ్రెండ య్యాడు. హర్ష నా నెక్ట్స్ ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ కొరియోగ్రఫీ చేస్తున్నారు. *** ‘కిక్2’ దర్శక, నిర్మాతలకు విభేదాలొచ్చాయని ఒక పుకారు! అవన్నీ వట్టిదే. మీరే చూస్తున్నారుగా... పక్క గదిలో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరి మధ్య చిన్నచర్చ జరిగినా, చిలవలు పలవలు చేసి, మూడోవాడు ప్రచారం చేయడం సినీరంగంలో ఎక్కువ. *** అసిస్టెంట్ డెరైక్టర్‌గా మొదలయ్యారు. డెరైక్షన్ చేయాలని లేదా? తప్పకుండా చేస్తా. అదీ కమర్షియల్ సినిమానే చేస్తా. నేను నటించను, వేరే హీరోతో చేస్తా. అప్పట్లో నేను అనుకున్న రకరకాల స్క్రిప్ట్‌లు అలానే ఉన్నాయి. నేను అనుకున్నవి ఇప్పటిదాకా రాలేదు. వాటిని తీస్తా. *** మీ సహాయకులకు ఆర్థికసాయం, ఇల్లు కొనిపెట్టడం లాంటివి చేశారట... అదేమంత విషయం కాదండీ! నన్ను నమ్ముకొన్నవాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటా. అంతకు మించేమీ లేదు. *** అప్పటి భూపతిరాజు రవిశంకర్ రాజుకీ, ఇప్పటి రవితేజకీ వచ్చిన మార్పు? ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల మన మాట తీరు, ప్రవర్తన కొద్దిగా తేడా వస్తుందేమో కానీ, మౌలికమైన మన స్వభావమైతే ఎప్పటికీ మారదు. కాకపోతే, లోకంలో అవతలివాళ్ళు మనల్ని చూసేది మాత్రం ఎప్పుడూ మన బ్యాంక్ బ్యాలెన్సను బట్టే (నవ్వులు...)! ‘కిక్’కి ఇది సీక్వెల్ కాదు! *** ‘కిక్2’లో వినోదం, యాక్షన్ అన్నీ ఎక్కువే. నార్తిండియా బ్యాక్‌డ్రాప్. ‘కిక్’లోని హీరో పాత్ర కల్యాణ్‌కు రాబిన్ హుడ్ అనే కొడుకుంటే... అనే ఆలోచనతో చేశాం. అంతేతప్ప, ‘కిక్’కు ఇది సీక్వెల్ కాదు. *** రచయిత వక్కంతం వంశీ ఒక పాయింట్ చెప్పారు. దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో నా హిట్ఫిల్మ్ ‘కిక్’కు తగ్గట్లు తాత్కాలికంగా ‘కిక్2’ అని పేరు పెట్టుకున్నాం. స్క్రిప్ట్ పక్కాగా పూర్తయ్యాక, ఆ పేరే కరెక్టని ఫిక్సయ్యాం. *** హీరో కల్యాణరావ్ు నిర్మాతగా కూడా సూపర్బ. ఆయన బ్యానర్లో నాలుగైదేళ్ళ క్రితమే చేయాల్సింది. ఇప్పటికి కుదిరింది. *** ఇది నా కెరీర్లోనే అత్యంత కాస్ట్లీ ఫిల్మ్. సురేందర్‌రెడ్డి పర్ఫెక్షనిస్ట్. పోస్ట్‌ప్రొడక్షన్, డి.ఐ. వగైరా ఆలస్యమయ్యాయి. ‘బాహు బలి’ రిలీజ్ మారడంతో, మా డేట్లూ మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే లేట్. *** సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పట్నించి తెలుసు. గతంలో సీరియస్టోన్ సిన్మాలు తీసే ఆయన ‘కిక్’ నుంచి వినోదం, కామెడీ జానర్ రుచిమరిగాడు. ‘రేసుగుర్రం’లానే ఇప్పుడీ ‘కిక్2’ కూడా అదే. *** ఇందులో బ్రహ్మానందం ‘పండిత్ రవితేజ’ అని నా పేరుతో ఉన్న పాత్ర చేస్తున్నారు. బోలెడంత వినోదం ఉంది. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ బాగా చేసింది. ఆమె ఇప్పుడు లక్కీ. ఆమె చేసిన సినిమాలన్నీ ఆడుతున్నాయి. అలాగే తమన్ ఇచ్చిన మెలొడీ సంగీతం, మనోజ్ పరమహంస కెమేరా ‘కిక్2’కు చాలా ఎస్సెట్. *** ‘కిక్2’ జనానికి మంచి కిక్ ఇస్తుంది. అయావ్‌ు స్యూర్. ఇట్ వోంట్ డిజప్పాయింట్. అన్నీ బాగుంటే, ‘కిక్3’ కూడా కన్ఫర్మగా చేస్తా. *** ‘బాహుబలి’ వల్ల మన సినిమాకు కొత్త డోర్లు తెరుచుకున్నాయి. మార్కెట్ పెరిగింది. ఇతర భాషల్లో మనకు మర్యాద ఇస్తున్నారు. *** యువ హీరోలు ఎలాంటి బెరుకూ లేకుండా బాగా చేస్తున్నారు. వాళ్ళు నా లాగా చేస్తున్నారనడానికి కారణం... నాలోని ఫ్రీ స్టయిల్. ఆ క్రెడిట్ ‘ఇడియట్’లో చంటి పాత్ర చేయించిన దర్శకుడు పూరీది. *** నెక్ట్స్ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో రిలీజ్. - రెంటాల జయదేవ -
నేను - నా దెయ్యం!
కథ మీకు ఎంతమంది స్నేహితులు? ఒక్కరా? ఇద్దరా? చాలామందా? నాకు ఒకే ఒక స్నేహితురాలు! ఐతే తను ఒక దెయ్యం. దెయ్యాలన్నీ చెడ్డవి కావు. ఈ సంగతి నాకన్నా బాగా ఇంకెవరికీ తెలీదనుకుంటాన్నేను. మహానుభావుడెవడో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నాడు. ఐతే నా దెయ్యానికీ నాకూ మధ్యనున్న సంబంధం, అనుబంధం ఏ విధమైన ఆర్థికత్వమో నాకు అర్థం కాదు. దానికోసం ఆర్థికతకి నిర్వచనాన్ని పెంచాల్సి వస్తుందేమో! లేకపోతే అసలు పెద్దవాళ్లే ఆర్థికతకి ఏదైనా విస్తృతమైన నిర్వచనం ఇచ్చారేమో తెలుసుకోవాలి. నా సమస్య తీవ్రతను నేను గుర్తించినప్పుడు నాకు ఇంచుమించు ఇరవై ఏళ్లు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ ఒకటే సమస్య... నాలో నేను మాట్లాడుకోవడం. నేను మాట్లాడే కొన్ని మాటలు నా చుట్టూ ఉన్నవాళ్లకి అర్థం కాకపోవడం, ఆఖరికి మా అమ్మకి కూడా! శివకుమార్ పేరు (నా పేరే)తో ఓ డిక్షనరీ అచ్చేయిద్దాం అనుకున్నా కానీ, ఇవాళా రేపూ పెద్ద పెద్ద డిక్షనరీలకే దిక్కు లేదు... ఇంకెందుకు, ఖర్చు దండగ అని ఊరుకున్నాను. టీచర్ చెప్పేది నాకర్థం అయ్యేది, మా అమ్మ చెప్పేదీ బాగా అర్థమయ్యేది. కానీ నేను చెప్పే జవాబు వాళ్లకి అంతుబట్టేది కాదు. నేను మాట్లాడేది ప్రాకృతం, పాళీ కాదు తెలుగే! కానీ ఒక్కోసారి అది మాయగా ఉండేది. ‘‘ఒరే, నీ పలుకు ఆ దేవుడికే తెలియాలి’’ అనేది మా అమ్మ. నా పలుకు దేవుడికి అర్థం అవుతుందనే మా అమ్మ సలహా నా మనసులో బాగా నాటుకుపోయింది. కానీ దేవుడిని ఎలా వెతకడం? ఎక్కడో ఆకాశంలో పైన, పైపైన ఉంటాడు. అయినా అసలు నిజంగా ఉన్నాడో లేడో ఎలా తెలుస్తుంది? దేవుడు పోతే పోనీ, కనీసం దెయ్యం కనపడితే బావుణ్ణు అనుకున్నాను. ‘‘దేవుడున్నాడు. నాకు తెలుసు. దెయ్యం కూడా ఉంది. కానీ, దెయ్యాన్ని చూడాలని కోరుకోకు. తలచిందే తడవుగా ప్రత్యక్షం అయి, నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుడి కోసం ప్రార్థన చెయ్. పట్టు వదలకుండా వెతికితే ఆయన కరుణిస్తాడు. నీకోసం స్వర్గంలో బెర్త్ రిజర్వ్ చేసి ఉంచుతాడు.’’ ఒకాయన బోధించాడు! నాకు అర్థం అయింది. దేవుడిని కనిబెట్టాలంటే చాలా తతంగం ఉంది. అదే దెయ్యమైతే అందుబాటులో ఉంటుంది. పిలిచిందే తడవుగా ప్రత్యక్షం అవుతుంది. మాటలు కలిపితే విషయం తేలిపోద్ది.. నా మనసు, నా మాట దానికర్థం అవుతాయేమో! దెయ్యాలు ఎలా వుంటాయి? ఎక్కడ ఉంటాయి - పుస్తకాల్లో పరిశోధన చేశాను. చందమామ పుస్తకంలో తోకచుక్కల్లాంటి దెయ్యాలు, శివ పురాణంలో రౌద్రమైన దెయ్యాలు, ఈవిల్ డెడ్ సినిమాల్లో రోతగా ఉండే బొమ్మల్లాంటి దెయ్యాలు, మా అమ్మమ్మ కథల్లో మనసున్న బంగారు దెయ్యాలు - ఏదో ఒకటి, ఒక్కటంటే ఒక్కటే కనబడొచ్చుగా! రాన్రానూ, రాత్రీ పగలూ దెయ్యం కోసం పలవరిస్తూ ఇంచు మించు పిచ్చివాడిని అయిపోయాను. చింతచెట్ల దగ్గరా, శ్మశానాల లోపల, యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే చోట్ల అర్ధ రాత్రిళ్లు వెతికేవాడిని. సమయం గాని సమయంలో తప్పనిసరి పనుల మీద అటుగా వచ్చినవాళ్లు నన్ను చూసి నేనే దెయ్యాన్ననుకొని జడుసుకునేవాళ్లు. ఓ సారి కొట్టబోయారు కూడా! ఏదో సాకు చెప్పి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. కానీ దెయ్యం మీద ప్రేమ, ఆశ చావలేదు. చివరికి ఊరి చివర పాడుబడిన కొంపలో మూల కూచుని కనబడింది. మోకాళ్ల మీద తలపెట్టుకొని, తెల్ల డిజైనర్ చీర కట్టుకొని చూడచక్కని దెయ్యం. ఎగిరి గంతేసినంత పనిచేశాను. సంతోషం నుంచి తేరుకోవడానికి కాసేపు పట్టింది. మామూలు స్థితికి వచ్చాక నిదానంగా, స్నేహంగా దెయ్యం దగ్గరగా వెళ్లి అలికిడి చేశాను. ‘‘ఇక్కడున్నావా?’’ అన్నాను. తలెత్తి చూసింది. నీలం కళ్లతో పలకరింపుగా నవ్వింది. మళ్లీ అనుమానపడింది. ‘‘ఇక్కడికెందుకొచ్చావు?’’ గాబరాగా అడిగింది. ‘‘ఊరికే. నిన్ను కలుసుకోవాలని. నీనుంచి పెద్దగా ఏం ఆశించను. చాలా వెతికాను. ఇప్పటికి చిక్కావు. ఇంత వెతికితే దేవుడే దొరికే వాడేమో.’’ ‘‘దేవుడి పేరు నా దగ్గర ఎత్తకు. నేను భరించలేను.’’ ‘‘సరేలే. ఎత్తను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు?’’ ‘‘ఎవరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు నువ్వొచ్చావు.’’ ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’ ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘‘సరే, అదంతా వదిలెయ్. ఇక నుంచీ మనిద్దరం ఒకరికొకరు. సరేనా?’’దెయ్యం జవాబు చెప్పలేదు. నేను కబుర్లు మొదలుపెట్టాను. చాలాసేపు మాట్లాడాను. తను ఏం మాట్లాడలేదు. వింటూ ఉంది. నా భాష, భావన తనకి అర్థం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ కవళికలు మారుస్తోంది. దానితో మాట్లాడుతూంటే నాకు నా ఊపిరి లోపలికి వెళ్లడం, బైటికి పోవడం బాగా తెలుస్తోంది. ఎంతోసేపు దాని దగ్గర కూచొని తర్వాత శెలవు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాను.మాకు ఇంటినిండా బోలెడు‘మంది’ ఉన్నారు. రోజులు సరదాగా గడుస్తాయి. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి ఊపిరి ఆడనట్టు అని పించేది. వెంటనే పనులన్నీ వదిలి దెయ్యం దగ్గర వాలేవాడిని. దానితో మాట్లాడితే నాకు ఊపిరి తిరిగేది, బలం వచ్చేది. దెయ్యంతో నా స్నేహం రాన్రానూ గాఢం అయింది. ఎంతగా నంటే అది పూర్తిగా నా సొంతం అనుకోవడం మొదలెట్టాను. ఏ అవసరం వచ్చినా చెప్పమనేవాడిని. ప్పుడప్పుడూ బజార్లోకి డిజైనర్ తెల్లచీరలొస్తే తెమ్మనేది. వేరే రంగులు వాడొచ్చుగా? అంటే డ్రెస్ కోడ్ ఒప్పుకోదని చెప్పింది! దాని కళ్లు ఒక్కోసారి నీలం రంగు నుండి నలుపులోకి మారిపోయేవి. అవీ బానే ఉండేవి. మనిషై వుంటే దాన్నే పెళ్లి చేసు కునేవాడినేమో అనేంత అందంగా ఉంటుంది! నేను తెగ చదివీ చదివీ విసుగుపుట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరాను. బాగా జీతం, బాగా పని. కొన్నాళ్లకి పని చేసీ చేసీ విసు గనిపించి పెళ్లి చేసుకున్నాను! నా భార్య పార్వతి నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు తను అహ్మ దాబాద్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌లో చేరాలనుకుందంట. కానీ కుదరలేదంట. చిత్ర (చిత్తు) పటాలు గీయడం చాలా ఇష్టం అంది. ఏవో పిచ్చి గీతలు గీసిన పుస్తకాలు చూపించింది. నేనంత ఆసక్తి చూపలేదు. నా భార్య నాలానే అదో మాదిరిగా మాట్లాడుతుంది. ఆ ‘మాదిరి’ ఏంటో నేను చెప్పలేను గానీ మొత్తానికి అదేదో! నాతో ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతగా ఉంటుంది. సంసార పక్షంగా తన పనులు తను చేసుకుపోతుంది. నాతో ఆఫీసు విషయాలన్నీ చెబుతుంది. నేనూ తనతో అన్ని విషయాలూ పంచుకునేవాడిని. ఐతే ఈ దెయ్యం సంగతి రహస్యంగా ఉంచాను. చెబితే నమ్మదని పించింది. పైగా నా దెయ్యం ఆడది కాబట్టి అనుమానపడుద్దని భయపడ్డాను! మేం తీరిక దొరికితే కబుర్లు చెప్పు కునేవాళ్లం. ‘‘నేను పద్మజను ప్రేమిం చాను. కానీ పెళ్లి చేసుకోవడం కుదర లేదు’’ ఓసారి తనకి షాక్ ఇవ్వాలని అన్నాను. ‘‘ఔనా! నేను కూడా సుబ్బ రామయ్యను చేసుకోవాలని కలలు కన్నాను. కానీ వాడికి బొత్తిగా సంపాదన లేదు. అందుకే నిన్ను చేసుకున్నాను’’ పార్వతి ఎంతో మామూలుగా చెప్పేసింది. తనకి షాక్ ఇవ్వాలని నేను షాక్ తిన్నాను. తర్వాత్తర్వాత నాకు అర్థం అయింది - తను ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహానే చెబుతుంది. కానీ ఇంకా చెప్పనిదేదో ఉన్నట్టుగా నాకు తోస్తుంది! పెళ్లి తర్వాత చాలా రోజులు దెయ్యాన్ని కలుసుకోలేదు. పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెద్దాళ్లై నేను బాగా డబ్బు సంపాదించీ సంపాదించీ ఇక ఏం చెయ్యాలో తోచక ఊపిరి తిరగలేదు. కాసేపట్లో ప్రాణం పోతుందేమో అని పించింది. నా దెయ్యం గుర్తొచ్చి పరి గెట్టుకుంటూ వెళ్లాను. ఎప్పుడో నేను చూసినప్పుడు ఎక్కడ, ఎలా ఉందో ఇప్పుడూ అక్కడ అలానే ఉంది. ఇన్ని రోజులూ నేను తనని నిర్లక్ష్యం చేశానని కోపగించుకుంటుందేమో అనుకున్నా గానీ, ఆ ఛాయలే కనబడలేదు.‘‘నిన్ను కలుసుకోవడానికి రాలేక పోయాను. ఏం అనుకోకు. బావున్నావా?’’దెయ్యం జవాబు చెప్పలేదు. ‘‘ఏమైనా మాట్లాడు. నేను నీకోసం వచ్చాను కదా!’’మళ్లీ జవాబు చెప్పకుండా ఊరికే వుండిపోయింది. నేను చెప్పేది నిజం కాదు. నాకు తెలుసు! తనకోసం వెళ్లను. నాకోసమే తన దగ్గరికి వెళతాను. తను నాలోపలి ఉద్వేగాలకి ఒక అవసరం.నేను చాలాసేపు నా పిల్లల గురించీ, నా భార్య గురించీ చెప్పాను. జీవితానికి ఎలా అలవాటు పడిపోయానో తెలియ పరిచాను. చాలాసేపటికి వుషారొచ్చింది. ఇంక వెళ్లొస్తానని చెప్పి వచ్చేశాను. తర్వాత ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడిపోయాయి. పని ఆపేసి తనని బైటికి తీసుకువెళ్లాను. ‘‘నువ్విలా ఇక్కడికి రాకూడదు. ఇది నా ఆఫీస్. ఇక్కడ నేను పనిచేసుకోవాలి. తేడా వస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు’’ వివరించాను. వెళ్లిపోయింది. వెనక్కి తిరిగి ఓసారి నావంక చూసింది. నాకేదో తప్పు చేసిన భావన కలిగింది. నా బాధ ఎవరికైనా చెప్పి ఓదార్పు పొందేది కాదు. అది నా ఒక్కడికే పరిమితమైన రహస్యం. ఓ రాత్రి పడక గదిలో నిద్రపోతు న్నానా, ఎవరో తట్టి లేపినట్టు తోచింది. కళ్లు తెరిచి చూస్తే నా దెయ్యం! ఉలిక్కి పడ్డాను. దెయ్యం దాని కొంపలో ఉన్నప్పుడే బాగుండింది. ఇలా ఏకంగా ఇంటికి వచ్చేస్తే చాలా ఖంగారయ్యింది.‘‘చాన్నాళ్లుగా నన్ను పలకరించను రాలేదే?’’ అడిగింది. ‘‘పని ఒత్తిడిలో కుదర్లేదు’’ చెప్పాను. ‘‘ఏం పని?’’ ‘‘ఏం పనంటే ఏం చెప్పను? రోజువారీ చాలా పనులు ఉంటాయి.’’ ‘‘ఎన్ని పనులున్నా నీ భార్యాపిల్లల కోసం నీకు సమయం దొరుకుతుంది కదా. నన్నెందుకు పట్టించుకోకుండా వదిలేశావు?’’ నిష్ఠూరమాడింది. ‘‘అంటే మనుషులకి తప్పనిసరి బాధ్యతలు కొన్ని ఉంటాయి. నువ్వు నా బాధ్యత కాదు. మనసు నాకు ఇచ్చిన ఓ వెసులుబాటువి. నువ్వు నా అశాంతివీ, నా శాంతివి కూడానూ! దయచేసి తొందరగా ఇక్కణ్నించి వెళ్లిపో. నా భార్య చూస్తే బావోదు. భయపడుతుంది’’ అని పక్కకి తిరిగి చూస్తే పక్కన పార్వతి లేదు. బాత్రూమ్కి వెళ్లినట్టుంది. తనొచ్చేలోగా ఈ దెయ్యాన్ని పంపించేయాలి.‘‘నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నిన్ను కలవకుండా ఎన్నాళ్లని ఉంటాను? తప్పకుండా వస్తాను. నా భార్య నిన్ను చూస్తే అదురుబోతుంది. ఇంక వెళ్దూ’’ బతిమాలుతున్నట్టు అనేటప్పటికి విచిత్రంగా నవ్వుకుంటూ కిటికీలోంచి బైటికి పోయింది. ఇంక నిద్రపట్టలేదు. మొహమాటం పక్కనబెట్టి దెయ్యం సంగతి పార్వతితో చెప్పేయాలనుకున్నాను. పార్వతి ఎంతకీ రాలేదు. బాత్రూమ్ తలుపు కొట్టాను. తలుపు తీసే ఉంది. లోపల పార్వతి లేదు. నా గుండె ఝల్లుమంది. ఈ దెయ్యం నా భార్యని చూసి అసూయపడి ఎత్తుకు పోలేదు కదా. కానీ అది నాకు, నా వాళ్లకీ హానిచేసే రకం కాదు. మరైతే పార్వతి ఎటు వెళ్లినట్టు? ఇల్లంతా వెతికాను. బాల్కనీ తలుపు తీసుంది. ఇంత అర్ధరాత్రి వేళ బాల్కనీలోకి ఎందుకు వెళ్లింది? బాల్కనీ బెంచ్‌మీద పార్వతి కూచుని ఉంది. పక్కన ఎవరో మగమనిషి ఉన్నాడు! అతని భుజం మీద తల ఆనించి ఏదో మాట్టాడుతోంది. అతను వింటు న్నాడు. వెన్నెల వెలుగులో అతను నాకు కనబడ్డాడు. అరె, వాడు మనిషిగాదు, దెయ్యంగాడు! దెయ్యం సావాసం వల్ల చీకట్లో కూడా నే దెయ్యాన్ని గుర్తుపట్ట గలను. ఎలాగంటే దెయ్యాల తల చుట్టూ హీనమైన నీలం రంగు మెరుపు చక్రం ఉంటుంది! వాడి వంకీల జుట్టు, భుజాలూ నాక్కనబడుతున్నాయి. చొక్కా వేసుకో లేదు. ఇంకా ఏం వేసుకున్నాడో లేదో చూసే ధైర్యం నాకు లేకపోయింది (అంటే ఆడ దెయ్యాలకి డ్రెస్ కోడ్ ఉంది కానీ మగ వాటికి ఉన్నట్టు ఎక్కడా ఎవరూ చెప్పలేదు కదా! అందుకే వేసుకున్నట్టు లేదు) అతని ఒళ్లంతా పచ్చబొట్లు పొడిచి ఉన్నాయి! ఐతే ఒకటి గమనంలోకి వచ్చింది. నాలానే నా పెళ్లానికి కూడా ఓ పెంపుడు దెయ్యం ఉంది (దెయ్యం స్త్రీ లింగమో, దానికి పురుష లింగమో రెంటినీ వేరువేరుగా చెప్పడానికి వేరు వేరు పదాలున్నాయేమో కనుక్కోవాలి). కాసేపు అలానే చూసి నేను మెదలకుండా లోపలికి వచ్చేశాను. తీరా చూస్తే నా దెయ్యం నా మంచం మీద నాకోసం చూస్తూ ఉంది. ‘‘బాధగా ఉందా?’’ అడిగింది. లేద న్నట్టు తల ఊపాను. బాధ లేదు, పశ్చా త్తాపంగా అనిపించింది. కాసేపు చేతులు నలుపుకున్నాను. ఈ స్థితికి కారణం ఏంటో ఆలోచించాను. అసలు నిజంగా సమస్య ఏమైనా ఉందా లేదా అర్థం కాలేదు. నా దెయ్యం నాకేదైనా సాంత్వన ఇస్తుందేమో అని దాని కళ్లలోకి చూశాను. అది నా నుదుటిని ముద్దుపెట్టుకుని, చూస్తూండ గానే దట్టమైన పొగలా మారిపోయింది. నిదానంగా నా ఊపిరితోపాటు నాలోకి వెళ్లిపోయింది. నాకు క్షణకాలం అసౌక ర్యంగా అనిపించింది గానీ కాసేపటికి అలవాటైంది. తరవాత...!ఇది చాలా రహస్యం. నేను ఒకే మనిషిని కానీ నాలో రెండు ఆత్మలు న్నాయి. మీరు నాకు చాలా బాగా కావల సినవాళ్లు కావడం మూలాన ఇదంతా నేను మీకు చెప్పాను. మీరు మాత్రం ఎవరికీ చెప్పకండే! ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’ ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది. ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడి పోయాయి. -
రెచ్చగొట్టడం బాబు డిక్షనరీలోనే ఉంది: కోదండరాం
హైదరాబాద్: రెచ్చగొట్టడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిక్షనరీలోనే ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. తెలంగాణపై విషం కక్కడాన్ని బాబు ఇంకా మానుకోలేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెచ్చగొట్టడం జేఏసీ డిక్షనరీలోనే లేదన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినాన్నిఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ‘‘జూన్ ఒకటి రాత్రి 8 గంటలకు అమరవీరులకు నివాళులర్పిస్తాం. జేఏసీ జెండా ఎగరేస్తాం. ఆ రాత్రంతా తెలంగాణ ధూంధాం తో సంబురాలు జరుపుకుంటాం’’ అని తెలిపారు. జూన్ 2న ఎవరికి తోచినట్టు వారు సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జేఏసీ నేత సి.విఠల్‌ను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించడాన్ని నిరసిస్తున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామని చెప్పారు. జేఏసీ నేతలకు టీఆర్ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనడం సరికాదన్నారు. కేసీఆర్ మావాడే. ఆయనను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుస్తాం. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు’’ అని చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఉద్యోగులంతా అమరవీరులకు నివాళులర్పించి విధులకు హాజరు కావాలని జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్ కోరారు. మల్లేపల్లి లక్ష్మయ్య, పి.రఘు, విఠల్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.