వైఎస్సార్ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్): డిక్షనరీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆక్స్‌ఫర్డ్. కాస్త వెనకటి జనరేషన్‌కు సీపీ బ్రౌన్ రాసిన తెలుగు–ఇంగ్లీషు, ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీలు, శ్యామూల్ జాన్సన్ ఇంగ్లీషు నిఘంటువు పరిచయం. అయితే తన కుమారుని కోసం ఓ తండ్రి ఏకంగా డిక్షనరీ రాశారంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన ఎవరో కాదు.. 1923–24లో కడప కలెక్టర్‌గా పనిచేసిన ఎ.గెలెట్టి. ఆయన ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ట్రినిటీ కాలేజ్ స్కాలర్‌గా ఉండేవారు. రాయల్ బటవియా సొసైటీ కరస్పాండింగ్ మెంబర్‌గా పనిచేశారు.
ఇండియన్ సివిల్ సర్వీస్ చదివి మద్రాసు ప్రెసిడెన్సీకి వచ్చారు. సివిల్ సర్వేంట్స్ స్థానిక భాషలను నేర్చుకుంటేనే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించగలరన్న సర్ థామస్ మన్రో ఉపదేశాన్ని వంట పట్టించుకున్నారు. అందుకే తెలుగు పట్టుబట్టి మరీ నేర్చుకున్నారు. కేవలం భాషను నేర్చుకోవడమే కాకుండా దానిపై పట్టు సాధించారు. 1. సహకారుల పరపతి సంఘములు, 2.విమలాజ్ఞానోపదేశములు, 3. ద డచ్ ఇన్ మలబార్, 4.వీరేశలింగం రాసిన ‘వినోద తరంగిణి’కి అనువాదం వంటివి ఆయన కలం నుంచి జాలువారాయి. ఈ కోవలోనే తెలుగు–ఇంగ్లీషు నిఘంటువును ఆయన రూపొందించారు.
డిక్షనరీ గురించి
ఇండియన్ సివిల్ సర్వీసు పూర్తి చేసి అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొంది తన వద్దకే వస్తున్న తన కుమారుడు ఆర్.గెలెట్టి సులువుగా తెలుగుభాష నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కడప కలెక్టర్‌గా ఉన్న ఎ.గెలెట్టి తెలుగు–ఇంగ్లీషు డిక్షనరీ తయారు చేశారు. తన కుమారుడే కాకుండా ఇంగ్లాండ్‌కు చెందిన ఇతర అసిస్టెంట్ కలెక్టర్లు, యువ అధికారులు, వ్యాపారులు, క్రిస్టియన్ మిషనరీలకు ఈ డిక్షనరీ ఎంతో ఉపయోగపడుతుందని భావించారు. అలాగే ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే తెలుగు వారికి కూడా ఈ నిఘంటువు ఉపయోగపడగలదన్న ఆశాభావాన్ని ఆయన తన ముందు మాటలో పేర్కొన్నారు. నిజానికి దీన్ని ఒక డిక్షనరీ అనే బదులు తెలుగు లేదా ఇంగ్లీషు నేర్చుకునేందుకు ఉపయోగపడే మాన్యువల్‌గా చెప్పవచ్చని ఆయన అంటారు.
కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నేటికీ పదిలంగా ఉన్న ఈ అపురూపమైన డిక్షనరీ ఇతర వాటికంటే భిన్నమైంది. అదెలా అంటే....నిత్యం సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు పదాలను ఇంగ్లీషు లిపిలో రాసి వాటి ఎదురుగా ఆంగ్ల అర్థాలను పొందుపరిచారు. అలాగే పర్యాయ పదాలు కూడా ఇచ్చారు. అపద్దాన్ని సంస్కృతంలో అసత్యం అంటారని చెప్పారు. ద్రవిడ భాషల్లో ఈ పదాన్ని తరుచూ వాడుతుంటారని కూడా తెలిపారు. అపబ్దమనే పదాన్ని సామెతల్లో ఎలా ఉపయోగిస్తారో కూడా సోదాహరణంగా ఆయన వివరించారు. ఉదాహరణకు ‘ఒక అబద్దం కమ్మడానికి వెయ్యి అబద్దాలు కావలెను, చేసేవి శివ పూజలు....చెప్పేవి అబద్దాలు, దేవుని ఎదుట అంతా నిజం చెబుతాను–అబద్దం ఆడను (కోర్టులో ప్రమాణం చేసే సందర్భంలో)’ ఇలా తెలుగు, ఇంగ్లీషు భాషలను సులభంగా నేర్చుకోవడానికి ఈ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 1935లో ఈ నిఘంటువును ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో ముద్రించారు.
చీఫ్ ప్యాట్రన్‌గా బొబ్బిలిరాజు
బొబ్బిలిరాజు రంగారావు అప్పట్లో చీఫ్ మినిస్టర్‌గా ఉండేవారట. ఆయన ఈ నిఘంటువుకు చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరించారు. దీని ముద్రణ ఖర్చు ఆయనే భరించారు. కలెక్టర్ గెలెట్టి ‘ఈ వ్యవహారిక భాషా డిక్షనరీ విద్య వ్యాపింపగలదని నమ్మి ప్రథమ మంత్రిగా ఉన్న బొబ్బిలి రాజాగారుల పాద పద్మముల సముఖమునకు సమర్పించినాను కానుకగా’ అంటూ తన వినమ్రతను చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment