డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్ | I do not like the word in a dictionary dalnes | Sakshi
Sakshi News home page

డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్

Published Wed, Aug 19 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్

డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్

స్థలం: ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్, హైదరాబాద్.
 సమయం: సాయంత్రం 4 గంటలవుతోంది.

 చేతికి గడియారం పెట్టుకోవడం ఎప్పుడూ అలవాటు లేని హీరో రవితేజకు తన బాడీ క్లాక్ మాత్రం టైమ్ చెప్పేసినట్లుంది. తలుపు వేసి ఉన్న ఆ ఏసీ ఆఫీసు గది బయట ఉన్న అసిస్టెంట్‌ను పిలిచి, టైమ్ ఎంతైందని అడిగారు. నాలుగు గంటలని అనగానే, ‘‘అయితే ప్రొటీన్లు పట్రా!’’ అనేశారు. సన్నగా, పొడుగ్గా ఉండే ఈ ఎనర్జిటిక్ హీరో ఇప్పుడు వ్యాయామం, ఆహారం విషయంలో మరింత క్రమశిక్షణ పాటిస్తున్నారు. బరువే తప్ప, ఉత్సాహం తగ్గని రవితేజ చేతిలోని ప్రొటీన్ షేక్‌ను నెమ్మదిగా సిప్ చేస్తూ, బాక్సులోని యాపిల్ ముక్కలు తింటూ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా మాట్లాడారు. కెరీర్‌లో కెల్లా అత్యంత కాస్ట్‌లీ చిత్రం ‘కిక్2’ ఈ శుక్రవారం విడుదల కానున్న వేళ... ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ఈ ‘మాస్ మహారాజా’  ‘సాక్షి’తో మనసు విప్పి పంచుకున్న కబుర్లు...
 
 ***  చాలా సన్నబడ్డారు. కారణం?
 కారణమేమీ లేదు. ఇంతకు ముందు డిసిప్లిన్డ్‌గా ఉండేవాణ్ణి. ఇప్పుడు మరింత డిసిప్లిన్డ్‌గా మారా. రోజూ జిమ్‌కు వెళుతున్నా, వర్కౌట్లు చేస్తున్నా. మా అమ్మతో సహా అంతా ‘ఏంట్రా? చిక్కిపోయావ్’ అంటున్నారు కానీ, నాకు మాత్రం బరువు తగ్గాక ఎంత బాగుందో తెలుసా?
 ***  మీరు గతంలో లావేమీ కాదే! ఎందుకు తగ్గారు?
 ఇదేదో సినిమాలో పాత్ర కోసం చేసిన పని కాదు. నేను నా కోసం చేసుకున్నది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా బాగుంది. వ్యాయామం చేశాక షూట్‌కు వెళితే, ఆ ఉత్సాహం ఎంతుంటుందో మాటల్లో చెప్పలేను. ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళకు నా మాటలు అర్థమవుతాయి. మా పిల్లలిద్దరూ మునుపటి కన్నా బాగున్నానంటున్నారు. నాలా అవుతామంటున్నారు.
 ***  ఇంతకీ వర్కౌట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది?
 నేనెప్పుడూ ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఇప్పుడు ఇంకా తొందరగా, తెల్లవారి 4.30 గంటలకే లేస్తున్నా. రొటీన్ అంతా పూర్తి చేసుకొని, రెండు గంటల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లతో సహా అన్నీ చేస్తా. ఆ తరువాత రెడీ అయిపోయి, షూటింగ్‌కు వెళతా. ఎప్పుడూ టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవడం అలవాటు. ఇప్పుడూ అంతే. కాకపోతే, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా. కొద్ది కొద్దిగా ఎనిమిదిసార్లు తీసుకుంటున్నా.
 ***  తిండిలో రిస్ట్రిక్షన్స్ పెట్టి, కడుపు కట్టేసుకుంటున్నారన్న మాట!
 అదేమీ లేదు. కినోవా రైస్ వాడుతున్నా. ఓట్స్, చికెన్, ఫిష్, స్వీట్లు - అన్నీ తింటున్నా. పులిహోర నాకు చాలా ఇష్టం. ఏదీ వదలడం లేదు. కాకపోతే, మితంగా! టైమ్ ప్రకారం! మసాలాలు, నూనెలు మాత్రం పూర్తిగా మానేశా. స్వీట్లు కూడా మా అమ్మ చేసినవి తింటున్నా. అదీ పంచదారతో కాకుండా, బెల్లంతో చేసిన పూతరేకుల లాంటివి తింటున్నా. పంచదారతో చేసేవన్నీ బెల్లంతో చేయించుకొని, ప్రయోగాలు చేస్తున్నా. ఒకప్పుడు 82 కిలోల దాకా ఉండేవాణ్ణి. ఇప్పుడు 70 కిలోలకు వచ్చా.
 ***  మరి పార్టీలు, విందు వినోదాల మాటేమిటి?
 నైట్ లైఫ్ అంతా ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ మానేశా. పార్టీలకు నో చెప్పేశా. చాలా సంవత్సరాలై పోయింది. ఇప్పుడు రాత్రి 9.30 కల్లా నిద్రపోతున్నా. మరీ తప్పనిసరి పార్టీకి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా, రాత్రి 12 గంటల కల్లా దుకాణం బంద్!  
 ***  సన్నబడ్డాక తొలి ఫిల్మ్ ‘కిక్2’కి ఎలా కనిపిస్తానన్న టెన్షన్ లేదా?
 నిజం చెప్పాలంటే, సన్నగా, పొడుగ్గా ఉన్నవాళ్ళు కెమేరా ముందు బాగుంటారు. కావాలంటే, హిందీ రంగం నుంచి ఇక్కడి దాకా అలాంటి వాళ్ళందరినీ మీరు చూడండి. కాకపోతే, సన్నబడడం వల్ల వార్‌‌డరోబ్ ఖాళీ అయిపోయింది. (నవ్వుతూ) కొత్త దుస్తులు షాపింగ్ చేసే పనిలో పడ్డా!
 ***  మీ దృష్టిలో అందానికీ, ఆరోగ్యానికీ నిర్వచనం?
 ఆరోగ్యమే అందం. దాన్ని వేరు చేసి చూడలేం. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు అందంగా ఉంటే, ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకే, ‘పాజిటివ్‌గా ఉండండి’ అంటా!
 ***  అందుకేనా చిన్న వేషాలతో మొదలై ఇంత స్టారయ్యారు?
 చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, ఇష్టపడి పనిచేయరు. ఇష్టపడి చేస్తే కష్టం తెలీదు. ఇష్టపడి కష్టపడితే ఎవరైనా పైకొస్తారు!
 ***  మీలాగే ఇప్పుడు చాలామంది సినీరంగంలో అండ లేకుండా పైకి రావడం...
 (మధ్యలోనే అందుకుంటూ...) గాడ్‌ఫాదర్ ఎవరూ లేని నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివాళ్ళు చాలామంది రావాలి. వాళ్ళ సినిమాలు ఇంకా బాగా ఆడాలి. తమిళంలో ‘సూదుకవ్వవ్‌ు’ లాంటి చిన్న సినిమా 40 కోట్ల దాకా కలెక్ట్ చేసిందట. మన చిన్న సినిమాలూ ఆ స్థాయికి వెళ్ళాలి. అది ఇంకా ఎందుకో జరగట్లేదు.
 ***  కొత్త సినిమాలన్నీ చూస్తుంటారా?
 బ్రహ్మాండంగా! తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, గుడ్...బ్యాడ్ అగ్లీ - ఇలా అన్నిరకాల సినిమాలూ హోవ్‌ు థియేటర్‌లో ‘క్యూబ్’తో చూస్తా. లేటెస్ట్ ‘సినిమా చూపిస్త మావ’ కూడా చూసేశా!


 ***  మరి, ప్రేక్షకుల రియాక్షన్ ఎలా తెలుస్తుంది?
 ఒకప్పుడు లైన్‌లో నిల్చొని, కొట్టుకొని టికెట్లు కొనుక్కున్న రోజుల నుంచి ఇప్పటికీ నాలోని ప్రేక్షకుడు అలానే ఉన్నాడు. ఏ సినిమా చూసినా హీరోలా కాక, ఆ దృష్టితోనే చూస్తా. ఇప్పటికీ తెరపై సన్ని వేశాన్ని బట్టి నవ్వొస్తే నవ్వేస్తా. ఏడుపొస్తే, ఏడ్చేస్తా.  ప్రివ్యూకి వెళ్ళి, కదలకుండా కూర్చొనే రకంలా సినిమా చూడడం నా వల్ల కాదు.
 ***  మీ సంతోషం, దుఃఖం పంచుకొనే సన్నిహితులు?
 నాకు నేనే పెద్ద ఫ్రెండ్‌ని. షూటింగ్‌లోనైనా, బయటైనా నా చుట్టూ ఎవరైనా ఈసురోమంటూ ఉన్నా, రిజర్వుడ్‌గా ఉన్నా నచ్చదు. వాళ్ళను చెడగొట్టి, నాలా ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తా.
 ***  ఎలాంటివాళ్ళంటే మీకు ఇష్టం?
 సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళను ఇష్టపడతా. స్టుపిడిటీని భరించలేను.
 ***  హార్‌‌డవర్‌‌కనే తప్ప విధిని నమ్మరా? దేవుడి మీద నమ్మకం లేదా?
 జరిగిపోయింది, జరగాల్సింది - దేని గురించీ ఆలోచించను. జరుగుతున్న దాని మీదే దృష్టి పెడతా. ఏదీ ముందుగా ప్లాన్ చేయను. అది కుదరదు కూడా. నా ట్రావెల్‌లో అనుకోకుండా కృష్ణ వంశీ, తరువాత పూరి జగన్నాథ్ తగిలారు. కలసి ప్రయాణించాం. పైకొచ్చాం. గుడులు, పూజలు, వారాలు, వర్జ్యాల లాంటి నమ్మకాలు లేవు కానీ, దేవుణ్ణి నమ్ముతాను. మనల్ని మించిన అతీతశక్తి ఉందని బలంగా విశ్వసిస్తాను.   
 ***  ఈ మధ్య రెండు చెవులకీ రింగుల లాంటి వాటితో కనిపిస్తున్నారే?
 ‘కృష్ణ’ సినిమా టైవ్‌ులో ఒక చెవికి పోగు లాంటిది పెట్టాం. అది బాగుందని, తరువాత రెండో చెవి కూడా కుట్టించి, పెట్టించా. అంతే తప్ప, మరేమీ లేదు. ఇప్పటికీ గొలుసులు, వాచీల లాంటివి పెట్టను.
 ***  తెరపై మీరు చాలామందికి ఎనర్జీ. మరి మీకు ఎనర్జీ కావాలంటే?
 వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, నా జీవితంలో డల్‌నెస్ అనేదే లేదు. చిన్న వేషాల రోజుల నుంచి ఇప్పటి దాకా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. డిక్షనరీలో నాకు నచ్చనిపదమేదైనా ఉందంటే అది ‘డల్‌నెస్’. చిన్నప్పటి నుంచీ నేనింతే! ఎప్పుడూ యాక్టివే! ఒక్కమాటలో, నేనెప్పుడూ ‘కిక్’లోనే ఉంటా.
 ***  మీడియా ముందుకు రారు. ఇంటర్వ్యూలూ తక్కువే. కారణం?
 మనం కాదు మన పని, మన సినిమాలూ మాట్లాడాలని నమ్ముతా. అందుకే అలా! అయావ్‌ు టోటల్లీ ఎ ప్రైవేట్‌పర్సన్.
 ***  మీ పిల్లల గురించి చెప్పండి?
 మా అమ్మాయి మోక్షద. ఇప్పుడు 8వ తరగతి చదువుతోంది. అబ్బాయి మహాధన్ 4వ తరగతి. వాళ్ళిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్‌‌స. ఈ తరం పిల్లాడు.. మా వాడు పిచ్చ హుషారు.
 ***  మీ వాడెప్పుడూ నటిస్తానని అడగడా?
 తండ్రిని చూసి పిల్లలు అలా ఉండాలనుకుంటారు. మా అబ్బాయి అప్పుడప్పుడు చిన్న వేషం వేస్తానంటూ ఉంటాడు. నేను ‘ముందు బుద్ధిగా చదువుకో’ అంటా. (నవ్వులు...)
 ***  ‘మాస్ మహారాజా, ఆంధ్రా అమితాబ్’ అంటే ఎలా ఉంది?
 (నవ్వుతూ...) ఏమీ అనిపించదు. ఆ పేర్లకూ, నాకూ సంబంధం లేదనిపి స్తుంది. దర్శకుడు హరీశ్ శంకర్ నన్ను ‘మాస్ రాజా... మాస్ రాజా’ అనేవాడు. దాన్నే ‘మాస్ మహరాజా’ అని టైటిల్స్‌లో ప్రేమగా వేస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇలా హీరోల ముందు బిరుదులు తగిలించడం మన తెలుగులో, తమిళంలోనే ఎక్కువ.  
 ***  మీకు తమిళ్, హిందీ బాగా వచ్చు. అక్కడ నటించాలని లేదా?
 కొన్ని అవకాశాలొచ్చాయి కానీ, నాకు నచ్చలేదు. మంచి ఛాన్‌‌సలు వస్తే చేయడానికి నేను ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నా.
 ***  హిందీలో మీ తరహా ఎంటర్‌టైనర్‌‌స చాలా వస్తున్నాయే!  
 చాలాభాగం మల్టీస్టారర్లు. అలాంటివి ఇక్కడా చేయచ్చు. కానీ, మన దగ్గర ఇతర హీరోలూ ముందుకు రావాలిగా. నేనైతే మల్టీస్టారర్‌‌సకి రెడీ. కొంతకాలం క్రితం వెంకటేశ్‌తో వీరూ పోట్ల దర్శకత్వంలో చేయాలనుకున్నాం. కుదరలేదు.
 ***  ‘మసాన్, మాంఝీ’ లాంటి రియలిస్టిక్ ఫిల్మ్స్ చేయచ్చుగా!  
 ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివశంభో’, ‘నేనింతే’ లాంటి వెరైటీ స్క్రిప్ట్స్ చేస్తే ఏమైందో చూశారుగా. అందుకే, (దణ్ణం పెట్టేస్తూ...) అవన్నీ మనకు వద్దు. హాయిగా అందరినీ నవ్వించే కమర్షియల్ సినిమాలు చేసుకుందాం.
 ***  ఈ మధ్య ఏడాదికి ఒకటే చేస్తున్నారు. స్పీడ్ తగ్గించారా!  
 2012లో నాలుగు సినిమాలు చేస్తే, పెద్దగా ఆడలేదు. అందుకే, కొంచెం బ్రేక్ వేసి, ఆగా. రెండేళ్ళుగా ఒక్కో సినిమానే వచ్చాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంటున్నా. ఇక నుంచి మళ్ళీ వరసగా సినిమాలు చేస్తా.
 ***  హీరోగా చేయకపోయినా, స్పెషల్ అప్పీయరెన్‌‌సలు, కన్నడంలో ‘వజ్రకాయ’ లాంటి సినిమాల్లో గెస్ట్‌గా చేస్తున్నారు!  
 అవన్నీ ఫ్రెండ్‌షిప్ కొద్దీ చేసినవి. కన్నడ శివ్‌రాజ్ కుమార్ ఫోన్ చేసి అడగడంతో, ‘వజ్రకాయ’ చేశా. దర్శకుడైన కొరియోగ్రాఫర్ హర్ష ఫ్రెండ య్యాడు. హర్ష నా నెక్ట్స్ ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 ***  ‘కిక్2’ దర్శక, నిర్మాతలకు విభేదాలొచ్చాయని ఒక పుకారు!  
 అవన్నీ వట్టిదే. మీరే చూస్తున్నారుగా... పక్క గదిలో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరి మధ్య చిన్నచర్చ జరిగినా, చిలవలు పలవలు చేసి, మూడోవాడు ప్రచారం చేయడం సినీరంగంలో ఎక్కువ.
 ***  అసిస్టెంట్ డెరైక్టర్‌గా మొదలయ్యారు. డెరైక్షన్ చేయాలని లేదా?  
 తప్పకుండా చేస్తా. అదీ కమర్షియల్ సినిమానే చేస్తా. నేను నటించను, వేరే హీరోతో చేస్తా. అప్పట్లో నేను అనుకున్న రకరకాల స్క్రిప్ట్‌లు అలానే ఉన్నాయి. నేను అనుకున్నవి ఇప్పటిదాకా రాలేదు. వాటిని తీస్తా.
 ***  మీ సహాయకులకు ఆర్థికసాయం, ఇల్లు కొనిపెట్టడం లాంటివి చేశారట...  
 అదేమంత విషయం కాదండీ! నన్ను నమ్ముకొన్నవాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటా. అంతకు మించేమీ లేదు.
 ***  అప్పటి భూపతిరాజు రవిశంకర్ రాజుకీ, ఇప్పటి రవితేజకీ వచ్చిన మార్పు?  
 ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల మన మాట తీరు, ప్రవర్తన కొద్దిగా తేడా వస్తుందేమో కానీ, మౌలికమైన మన స్వభావమైతే ఎప్పటికీ మారదు. కాకపోతే, లోకంలో అవతలివాళ్ళు మనల్ని చూసేది మాత్రం ఎప్పుడూ మన బ్యాంక్ బ్యాలెన్‌‌సను బట్టే (నవ్వులు...)!
 
 ‘కిక్’కి ఇది సీక్వెల్ కాదు!
 ***     ‘కిక్2’లో వినోదం, యాక్షన్ అన్నీ ఎక్కువే. నార్తిండియా బ్యాక్‌డ్రాప్. ‘కిక్’లోని హీరో పాత్ర కల్యాణ్‌కు రాబిన్ హుడ్ అనే కొడుకుంటే... అనే ఆలోచనతో చేశాం. అంతేతప్ప, ‘కిక్’కు ఇది సీక్వెల్ కాదు.
 ***     రచయిత వక్కంతం వంశీ ఒక పాయింట్ చెప్పారు. దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో నా హిట్‌ఫిల్మ్ ‘కిక్’కు తగ్గట్లు తాత్కాలికంగా ‘కిక్2’ అని పేరు పెట్టుకున్నాం. స్క్రిప్ట్ పక్కాగా పూర్తయ్యాక, ఆ పేరే కరెక్టని ఫిక్సయ్యాం.
 ***     హీరో కల్యాణరావ్‌ు నిర్మాతగా కూడా సూపర్‌‌బ. ఆయన బ్యానర్‌లో నాలుగైదేళ్ళ క్రితమే చేయాల్సింది. ఇప్పటికి కుదిరింది.
 ***     ఇది నా కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లీ ఫిల్మ్. సురేందర్‌రెడ్డి పర్‌ఫెక్షనిస్ట్. పోస్ట్‌ప్రొడక్షన్, డి.ఐ. వగైరా ఆలస్యమయ్యాయి. ‘బాహు బలి’ రిలీజ్ మారడంతో, మా డేట్లూ మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే లేట్.  
 ***     సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పట్నించి తెలుసు. గతంలో సీరియస్‌టోన్ సిన్మాలు తీసే ఆయన ‘కిక్’ నుంచి వినోదం, కామెడీ జానర్ రుచిమరిగాడు. ‘రేసుగుర్రం’లానే ఇప్పుడీ ‘కిక్2’ కూడా అదే.
 ***     ఇందులో బ్రహ్మానందం ‘పండిత్ రవితేజ’ అని నా పేరుతో ఉన్న పాత్ర చేస్తున్నారు. బోలెడంత వినోదం ఉంది. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ బాగా చేసింది. ఆమె ఇప్పుడు లక్కీ. ఆమె చేసిన సినిమాలన్నీ ఆడుతున్నాయి. అలాగే తమన్ ఇచ్చిన మెలొడీ సంగీతం, మనోజ్ పరమహంస కెమేరా ‘కిక్2’కు చాలా ఎస్సెట్.
 ***     ‘కిక్2’ జనానికి మంచి కిక్ ఇస్తుంది. అయావ్‌ు స్యూర్. ఇట్ వోంట్ డిజప్పాయింట్. అన్నీ బాగుంటే, ‘కిక్3’ కూడా కన్‌ఫర్‌‌మగా చేస్తా.
 ***     ‘బాహుబలి’ వల్ల మన సినిమాకు కొత్త డోర్లు తెరుచుకున్నాయి. మార్కెట్ పెరిగింది. ఇతర భాషల్లో మనకు మర్యాద ఇస్తున్నారు.
 ***     యువ హీరోలు ఎలాంటి బెరుకూ లేకుండా బాగా చేస్తున్నారు. వాళ్ళు నా లాగా చేస్తున్నారనడానికి కారణం... నాలోని ఫ్రీ స్టయిల్. ఆ క్రెడిట్ ‘ఇడియట్’లో చంటి పాత్ర చేయించిన దర్శకుడు పూరీది.
 ***     నెక్ట్స్‌ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో రిలీజ్.  
 
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement