నేను - నా దెయ్యం! | my ghost! | Sakshi
Sakshi News home page

నేను - నా దెయ్యం!

Published Sun, Jul 26 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

నేను - నా దెయ్యం!

నేను - నా దెయ్యం!

  కథ
 మీకు ఎంతమంది స్నేహితులు? ఒక్కరా? ఇద్దరా? చాలామందా? నాకు ఒకే ఒక స్నేహితురాలు! ఐతే తను ఒక దెయ్యం. దెయ్యాలన్నీ చెడ్డవి కావు. ఈ సంగతి నాకన్నా బాగా ఇంకెవరికీ తెలీదనుకుంటాన్నేను. మహానుభావుడెవడో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నాడు. ఐతే నా దెయ్యానికీ నాకూ మధ్యనున్న సంబంధం, అనుబంధం ఏ విధమైన ఆర్థికత్వమో నాకు అర్థం కాదు. దానికోసం ఆర్థికతకి నిర్వచనాన్ని పెంచాల్సి వస్తుందేమో! లేకపోతే అసలు పెద్దవాళ్లే ఆర్థికతకి ఏదైనా విస్తృతమైన నిర్వచనం ఇచ్చారేమో తెలుసుకోవాలి.
 
 నా సమస్య తీవ్రతను నేను గుర్తించినప్పుడు నాకు ఇంచుమించు ఇరవై ఏళ్లు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ ఒకటే సమస్య... నాలో నేను మాట్లాడుకోవడం. నేను మాట్లాడే కొన్ని మాటలు నా చుట్టూ ఉన్నవాళ్లకి అర్థం కాకపోవడం, ఆఖరికి మా అమ్మకి కూడా! శివకుమార్ పేరు (నా పేరే)తో ఓ డిక్షనరీ అచ్చేయిద్దాం అనుకున్నా కానీ, ఇవాళా రేపూ పెద్ద పెద్ద డిక్షనరీలకే దిక్కు లేదు... ఇంకెందుకు, ఖర్చు దండగ అని ఊరుకున్నాను.
 
 టీచర్ చెప్పేది నాకర్థం అయ్యేది, మా అమ్మ చెప్పేదీ బాగా అర్థమయ్యేది. కానీ నేను చెప్పే జవాబు వాళ్లకి అంతుబట్టేది కాదు. నేను మాట్లాడేది ప్రాకృతం, పాళీ కాదు తెలుగే! కానీ ఒక్కోసారి అది మాయగా ఉండేది. ‘‘ఒరే, నీ పలుకు ఆ దేవుడికే తెలియాలి’’ అనేది మా అమ్మ. నా పలుకు దేవుడికి అర్థం అవుతుందనే మా అమ్మ సలహా నా మనసులో బాగా నాటుకుపోయింది. కానీ దేవుడిని ఎలా వెతకడం? ఎక్కడో ఆకాశంలో పైన, పైపైన ఉంటాడు. అయినా అసలు నిజంగా ఉన్నాడో లేడో ఎలా తెలుస్తుంది? దేవుడు పోతే పోనీ, కనీసం దెయ్యం కనపడితే బావుణ్ణు అనుకున్నాను.
 
 ‘‘దేవుడున్నాడు. నాకు తెలుసు. దెయ్యం కూడా ఉంది. కానీ, దెయ్యాన్ని చూడాలని కోరుకోకు. తలచిందే తడవుగా ప్రత్యక్షం అయి, నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుడి కోసం ప్రార్థన చెయ్. పట్టు వదలకుండా వెతికితే ఆయన కరుణిస్తాడు. నీకోసం స్వర్గంలో బెర్త్ రిజర్వ్ చేసి ఉంచుతాడు.’’ ఒకాయన బోధించాడు! నాకు అర్థం అయింది. దేవుడిని కనిబెట్టాలంటే చాలా తతంగం ఉంది. అదే దెయ్యమైతే అందుబాటులో ఉంటుంది. పిలిచిందే తడవుగా ప్రత్యక్షం అవుతుంది. మాటలు కలిపితే విషయం తేలిపోద్ది.. నా మనసు, నా మాట దానికర్థం అవుతాయేమో!
 
 దెయ్యాలు ఎలా వుంటాయి? ఎక్కడ ఉంటాయి - పుస్తకాల్లో పరిశోధన చేశాను. చందమామ పుస్తకంలో తోకచుక్కల్లాంటి దెయ్యాలు, శివ పురాణంలో రౌద్రమైన దెయ్యాలు, ఈవిల్ డెడ్ సినిమాల్లో రోతగా ఉండే బొమ్మల్లాంటి దెయ్యాలు, మా అమ్మమ్మ కథల్లో మనసున్న బంగారు దెయ్యాలు - ఏదో ఒకటి, ఒక్కటంటే ఒక్కటే కనబడొచ్చుగా! రాన్రానూ, రాత్రీ పగలూ దెయ్యం కోసం పలవరిస్తూ ఇంచు మించు పిచ్చివాడిని అయిపోయాను.
 
 చింతచెట్ల దగ్గరా, శ్మశానాల లోపల, యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే చోట్ల అర్ధ రాత్రిళ్లు వెతికేవాడిని. సమయం గాని సమయంలో తప్పనిసరి పనుల మీద అటుగా వచ్చినవాళ్లు నన్ను చూసి నేనే దెయ్యాన్ననుకొని జడుసుకునేవాళ్లు. ఓ సారి కొట్టబోయారు కూడా! ఏదో సాకు చెప్పి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. కానీ దెయ్యం మీద ప్రేమ, ఆశ చావలేదు.  చివరికి ఊరి చివర పాడుబడిన కొంపలో మూల కూచుని కనబడింది. మోకాళ్ల మీద తలపెట్టుకొని, తెల్ల డిజైనర్ చీర కట్టుకొని చూడచక్కని దెయ్యం. ఎగిరి గంతేసినంత పనిచేశాను. సంతోషం నుంచి తేరుకోవడానికి కాసేపు పట్టింది. మామూలు స్థితికి వచ్చాక నిదానంగా, స్నేహంగా దెయ్యం దగ్గరగా వెళ్లి అలికిడి చేశాను. ‘‘ఇక్కడున్నావా?’’ అన్నాను. తలెత్తి చూసింది. నీలం కళ్లతో పలకరింపుగా నవ్వింది. మళ్లీ అనుమానపడింది. ‘‘ఇక్కడికెందుకొచ్చావు?’’ గాబరాగా అడిగింది. ‘‘ఊరికే. నిన్ను కలుసుకోవాలని. నీనుంచి పెద్దగా ఏం ఆశించను. చాలా వెతికాను. ఇప్పటికి చిక్కావు. ఇంత వెతికితే దేవుడే దొరికే వాడేమో.’’
 
 ‘‘దేవుడి పేరు నా దగ్గర ఎత్తకు. నేను భరించలేను.’’
 ‘‘సరేలే. ఎత్తను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు?’’
 ‘‘ఎవరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు నువ్వొచ్చావు.’’
 ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’
 ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది.
 
 ‘‘సరే, అదంతా వదిలెయ్. ఇక నుంచీ మనిద్దరం ఒకరికొకరు. సరేనా?’’దెయ్యం జవాబు చెప్పలేదు. నేను కబుర్లు మొదలుపెట్టాను. చాలాసేపు మాట్లాడాను. తను ఏం మాట్లాడలేదు. వింటూ ఉంది. నా భాష, భావన తనకి అర్థం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ కవళికలు మారుస్తోంది. దానితో మాట్లాడుతూంటే నాకు నా ఊపిరి లోపలికి వెళ్లడం, బైటికి పోవడం బాగా తెలుస్తోంది. ఎంతోసేపు దాని దగ్గర కూచొని తర్వాత శెలవు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాను.మాకు ఇంటినిండా బోలెడు‘మంది’ ఉన్నారు. రోజులు సరదాగా గడుస్తాయి.
 
 కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి ఊపిరి ఆడనట్టు అని పించేది. వెంటనే పనులన్నీ వదిలి దెయ్యం దగ్గర వాలేవాడిని. దానితో మాట్లాడితే నాకు ఊపిరి తిరిగేది, బలం వచ్చేది. దెయ్యంతో నా స్నేహం రాన్రానూ గాఢం అయింది. ఎంతగా నంటే అది పూర్తిగా నా సొంతం అనుకోవడం మొదలెట్టాను. ఏ అవసరం వచ్చినా చెప్పమనేవాడిని. ప్పుడప్పుడూ బజార్లోకి డిజైనర్ తెల్లచీరలొస్తే తెమ్మనేది. వేరే రంగులు వాడొచ్చుగా? అంటే డ్రెస్ కోడ్ ఒప్పుకోదని చెప్పింది! దాని కళ్లు ఒక్కోసారి నీలం రంగు నుండి నలుపులోకి మారిపోయేవి. అవీ బానే ఉండేవి. మనిషై వుంటే దాన్నే పెళ్లి చేసు కునేవాడినేమో అనేంత అందంగా ఉంటుంది!
 
 నేను తెగ చదివీ చదివీ విసుగుపుట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరాను. బాగా జీతం, బాగా పని. కొన్నాళ్లకి పని చేసీ చేసీ విసు గనిపించి పెళ్లి చేసుకున్నాను! నా భార్య పార్వతి నాలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అసలు తను అహ్మ దాబాద్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌లో చేరాలనుకుందంట. కానీ కుదరలేదంట. చిత్ర (చిత్తు) పటాలు గీయడం చాలా ఇష్టం అంది. ఏవో పిచ్చి గీతలు గీసిన పుస్తకాలు చూపించింది. నేనంత ఆసక్తి చూపలేదు.
 
 నా భార్య నాలానే అదో మాదిరిగా మాట్లాడుతుంది. ఆ ‘మాదిరి’ ఏంటో నేను చెప్పలేను గానీ మొత్తానికి అదేదో! నాతో ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతగా ఉంటుంది. సంసార పక్షంగా తన పనులు తను చేసుకుపోతుంది. నాతో ఆఫీసు విషయాలన్నీ చెబుతుంది. నేనూ తనతో అన్ని విషయాలూ పంచుకునేవాడిని. ఐతే ఈ దెయ్యం సంగతి రహస్యంగా ఉంచాను. చెబితే నమ్మదని పించింది. పైగా నా దెయ్యం ఆడది కాబట్టి అనుమానపడుద్దని భయపడ్డాను! మేం తీరిక దొరికితే కబుర్లు చెప్పు కునేవాళ్లం. ‘‘నేను పద్మజను ప్రేమిం చాను. కానీ పెళ్లి చేసుకోవడం కుదర లేదు’’ ఓసారి తనకి షాక్ ఇవ్వాలని అన్నాను. ‘‘ఔనా! నేను కూడా సుబ్బ రామయ్యను చేసుకోవాలని కలలు కన్నాను. కానీ వాడికి బొత్తిగా సంపాదన లేదు. అందుకే నిన్ను చేసుకున్నాను’’ పార్వతి ఎంతో మామూలుగా చెప్పేసింది.
 
 తనకి షాక్ ఇవ్వాలని నేను షాక్ తిన్నాను. తర్వాత్తర్వాత నాకు అర్థం అయింది - తను ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహానే చెబుతుంది. కానీ ఇంకా చెప్పనిదేదో ఉన్నట్టుగా నాకు తోస్తుంది! పెళ్లి తర్వాత చాలా రోజులు దెయ్యాన్ని కలుసుకోలేదు. పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెద్దాళ్లై నేను బాగా డబ్బు సంపాదించీ సంపాదించీ ఇక ఏం చెయ్యాలో తోచక ఊపిరి తిరగలేదు. కాసేపట్లో ప్రాణం పోతుందేమో అని పించింది. నా దెయ్యం గుర్తొచ్చి పరి గెట్టుకుంటూ వెళ్లాను. ఎప్పుడో నేను చూసినప్పుడు ఎక్కడ, ఎలా ఉందో ఇప్పుడూ అక్కడ అలానే ఉంది. ఇన్ని రోజులూ నేను తనని నిర్లక్ష్యం చేశానని కోపగించుకుంటుందేమో అనుకున్నా గానీ, ఆ ఛాయలే కనబడలేదు.‘‘నిన్ను కలుసుకోవడానికి రాలేక పోయాను. ఏం అనుకోకు. బావున్నావా?’’దెయ్యం జవాబు చెప్పలేదు.
 
 ‘‘ఏమైనా మాట్లాడు. నేను నీకోసం వచ్చాను కదా!’’మళ్లీ జవాబు చెప్పకుండా ఊరికే వుండిపోయింది. నేను చెప్పేది నిజం కాదు. నాకు తెలుసు! తనకోసం వెళ్లను. నాకోసమే తన దగ్గరికి వెళతాను. తను నాలోపలి ఉద్వేగాలకి ఒక అవసరం.నేను చాలాసేపు నా పిల్లల గురించీ, నా భార్య గురించీ చెప్పాను. జీవితానికి ఎలా అలవాటు పడిపోయానో తెలియ పరిచాను. చాలాసేపటికి వుషారొచ్చింది. ఇంక వెళ్లొస్తానని చెప్పి వచ్చేశాను.
 
 తర్వాత ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడిపోయాయి. పని ఆపేసి తనని బైటికి తీసుకువెళ్లాను. ‘‘నువ్విలా ఇక్కడికి రాకూడదు. ఇది నా ఆఫీస్. ఇక్కడ నేను పనిచేసుకోవాలి. తేడా వస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు’’ వివరించాను. వెళ్లిపోయింది. వెనక్కి తిరిగి ఓసారి నావంక చూసింది. నాకేదో తప్పు చేసిన భావన కలిగింది. నా బాధ ఎవరికైనా చెప్పి ఓదార్పు పొందేది కాదు. అది నా ఒక్కడికే పరిమితమైన రహస్యం.
 
 ఓ రాత్రి పడక గదిలో నిద్రపోతు న్నానా, ఎవరో తట్టి లేపినట్టు తోచింది. కళ్లు తెరిచి చూస్తే నా దెయ్యం! ఉలిక్కి పడ్డాను. దెయ్యం దాని కొంపలో ఉన్నప్పుడే బాగుండింది. ఇలా ఏకంగా ఇంటికి వచ్చేస్తే చాలా ఖంగారయ్యింది.‘‘చాన్నాళ్లుగా నన్ను పలకరించను రాలేదే?’’ అడిగింది. ‘‘పని ఒత్తిడిలో కుదర్లేదు’’ చెప్పాను.
 
 ‘‘ఏం పని?’’
 ‘‘ఏం పనంటే ఏం చెప్పను? రోజువారీ చాలా పనులు ఉంటాయి.’’
 ‘‘ఎన్ని పనులున్నా నీ భార్యాపిల్లల కోసం నీకు సమయం దొరుకుతుంది కదా. నన్నెందుకు పట్టించుకోకుండా వదిలేశావు?’’ నిష్ఠూరమాడింది.
 
 ‘‘అంటే మనుషులకి తప్పనిసరి బాధ్యతలు కొన్ని ఉంటాయి. నువ్వు నా బాధ్యత కాదు. మనసు నాకు ఇచ్చిన ఓ వెసులుబాటువి. నువ్వు నా అశాంతివీ, నా శాంతివి కూడానూ! దయచేసి తొందరగా ఇక్కణ్నించి వెళ్లిపో. నా భార్య చూస్తే బావోదు. భయపడుతుంది’’ అని పక్కకి తిరిగి చూస్తే పక్కన పార్వతి లేదు. బాత్‌రూమ్‌కి వెళ్లినట్టుంది. తనొచ్చేలోగా ఈ దెయ్యాన్ని పంపించేయాలి.‘‘నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నిన్ను కలవకుండా ఎన్నాళ్లని ఉంటాను? తప్పకుండా వస్తాను. నా భార్య నిన్ను చూస్తే అదురుబోతుంది. ఇంక వెళ్దూ’’ బతిమాలుతున్నట్టు అనేటప్పటికి విచిత్రంగా నవ్వుకుంటూ కిటికీలోంచి బైటికి పోయింది.
 
 ఇంక నిద్రపట్టలేదు. మొహమాటం పక్కనబెట్టి దెయ్యం సంగతి పార్వతితో చెప్పేయాలనుకున్నాను. పార్వతి ఎంతకీ రాలేదు. బాత్‌రూమ్ తలుపు కొట్టాను. తలుపు తీసే ఉంది. లోపల పార్వతి లేదు. నా గుండె ఝల్లుమంది. ఈ దెయ్యం నా భార్యని చూసి అసూయపడి ఎత్తుకు పోలేదు కదా. కానీ అది నాకు, నా వాళ్లకీ హానిచేసే రకం కాదు. మరైతే పార్వతి ఎటు వెళ్లినట్టు? ఇల్లంతా వెతికాను. బాల్కనీ తలుపు తీసుంది. ఇంత అర్ధరాత్రి వేళ బాల్కనీలోకి ఎందుకు వెళ్లింది?
 
 బాల్కనీ బెంచ్‌మీద పార్వతి కూచుని ఉంది. పక్కన ఎవరో మగమనిషి ఉన్నాడు! అతని భుజం మీద తల ఆనించి ఏదో మాట్టాడుతోంది. అతను వింటు న్నాడు. వెన్నెల వెలుగులో అతను నాకు కనబడ్డాడు. అరె, వాడు మనిషిగాదు, దెయ్యంగాడు! దెయ్యం సావాసం వల్ల చీకట్లో కూడా నే దెయ్యాన్ని గుర్తుపట్ట గలను. ఎలాగంటే దెయ్యాల తల చుట్టూ హీనమైన నీలం రంగు మెరుపు చక్రం ఉంటుంది! వాడి వంకీల జుట్టు, భుజాలూ నాక్కనబడుతున్నాయి. చొక్కా వేసుకో లేదు.
 
 ఇంకా ఏం వేసుకున్నాడో లేదో చూసే ధైర్యం నాకు లేకపోయింది (అంటే ఆడ దెయ్యాలకి డ్రెస్ కోడ్ ఉంది కానీ మగ వాటికి ఉన్నట్టు ఎక్కడా ఎవరూ చెప్పలేదు కదా! అందుకే వేసుకున్నట్టు లేదు) అతని ఒళ్లంతా పచ్చబొట్లు పొడిచి ఉన్నాయి! ఐతే ఒకటి గమనంలోకి వచ్చింది. నాలానే నా పెళ్లానికి కూడా ఓ పెంపుడు దెయ్యం ఉంది (దెయ్యం స్త్రీ లింగమో, దానికి పురుష లింగమో రెంటినీ వేరువేరుగా చెప్పడానికి వేరు వేరు పదాలున్నాయేమో కనుక్కోవాలి). కాసేపు అలానే చూసి నేను మెదలకుండా లోపలికి వచ్చేశాను. తీరా చూస్తే నా దెయ్యం నా మంచం మీద నాకోసం చూస్తూ ఉంది.
 
 ‘‘బాధగా ఉందా?’’ అడిగింది. లేద న్నట్టు తల ఊపాను. బాధ లేదు, పశ్చా త్తాపంగా అనిపించింది. కాసేపు చేతులు నలుపుకున్నాను. ఈ స్థితికి కారణం ఏంటో ఆలోచించాను. అసలు నిజంగా సమస్య ఏమైనా ఉందా లేదా అర్థం కాలేదు. నా దెయ్యం నాకేదైనా సాంత్వన ఇస్తుందేమో అని దాని కళ్లలోకి చూశాను. అది నా నుదుటిని ముద్దుపెట్టుకుని, చూస్తూండ గానే దట్టమైన పొగలా మారిపోయింది. నిదానంగా నా ఊపిరితోపాటు నాలోకి వెళ్లిపోయింది. నాకు క్షణకాలం అసౌక ర్యంగా అనిపించింది గానీ కాసేపటికి అలవాటైంది. తరవాత...!ఇది చాలా రహస్యం. నేను ఒకే మనిషిని కానీ నాలో రెండు ఆత్మలు న్నాయి. మీరు నాకు చాలా బాగా కావల సినవాళ్లు కావడం మూలాన ఇదంతా నేను మీకు చెప్పాను. మీరు మాత్రం ఎవరికీ చెప్పకండే!                               
 
 ‘‘నువ్వెలా చచ్చిపోయావు?’’
 ‘‘గుర్తులేదు. బతికి వున్నప్పుడు తోటల్లో తిరుగాడుతూ కులాసాగా ఉండేదాన్ని. అంత మటుకే గుర్తుంది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది.
 
 ఓ రోజు ఆఫీసులో కూచుని పనిచేస్తున్నానా, హఠాత్తుగా నా దెయ్యం ఓ కుర్చీ లాక్కుని నా పక్కన కూచుంది. నాకు కాళ్లూ చేతులూ చల్లబడి పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement