ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రచురితమైన కథనం
దాని ఆధారంగా తెలిసిన మిత్రుడి ఆచూకీ
39 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు.
ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు
Comments
Please login to add a commentAdd a comment