breaking news
Childhood friend
-
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
ఇంతకు తెగించిన చిన్ననాటి స్నేహితుడు
-
‘గంటా’ అంటే గయ్ గయ్!
సాక్షి, అమరావతి: యాధృచ్ఛికమో.. తనకు కలిసొస్తుందని భావించారో తెలియదుగానీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు ‘గంటా’ అయితే మరోపేరు ‘లక్ష్మీనారాయణ’!! విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గయ్ గయ్‌మంటున్నారు! ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతోంది! అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో.. ఇటు స్కిల్ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు, వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కీలకం కాగా స్కిల్ స్కామ్‌లో గంటా సుబ్బారావు, రిటైర్డ్ అధికారి లక్ష్మీ నారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు! చిర్రుబుర్రులు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పిట్లోనే ఉంది మరి!! అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలతోపాటు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...?? అంతా ఒకే ఒక్కరే.. గంటా 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)! తన అక్రమాలకు అక్షయపాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డీసీ పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్, రిటైర్డ్ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు. కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డీసీతోపాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులూ కట్టబెట్టేశారు. గంటా సుబ్బారావును ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్– చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ–సీఈవో)గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్ఎస్డీసీని ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. దాంతో ఏపీఎస్ఎస్ఎస్డీసీలో ప్రాజెక్ట్ ఫైళ్లు తయారు చేసేది, ఉన్నత విద్యా శాఖ, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖల్లో పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపేది, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి తుది ఆమోదం తెలిపేది అంతా ఒకే ఒక్కరే ఆయనే గంటా సుబ్బారావు కావడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తికి నాలుగు పోస్టులు కట్టబెడుతూ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురి ప్రస్తావనే రానివ్వకుండా గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిట్‌కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృథా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది. అందులో ప్రతి గంటకు ఐదు నిముషాలు విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకున్నారు. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదువుతూ కాలహరణం చేశారు. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృథా చేశారు. రెండో రోజు తన రాజకీయ అనుభవం గురించి పాతచింతకాయ పచ్చడిలా కథలు చెబుతూ సమయాన్ని గడిపారు. గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ గురించి గానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి ప్రస్తావించగానే చంద్రబాబు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం గమనార్హం. అంటే ఆ ఐదుగురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. బాబు బాల్య స్నేహితుడే.. విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్ అధికారి కె.లక్ష్మీనారాయణను ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారు. తాను ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీలో వ్యవహారాలు సాగేలా చూసేందుకే లక్ష్మీనారాయణను తెచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ రూపకల్పన, అందుకు అనుగుణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు.. అంతా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. అంటే స్కిల్ స్కామ్ కీలక గుట్టు అంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వద్దే ఉంది. ఈ క్రమంలో వారిద్దరిని ఎందుకు నియమించారు? వారితో సాగించిన వ్యవహారాలేమిటి? అని సిట్ అధికారులు అడిగేసరికి చంద్రబాబు కంగుతిన్నారు. ఎవరిని విచారించాలో బాబే చెబుతారట..! ఎక్కడైనా దర్యాప్తు అధికారులు చట్ట ప్రకారమే విచారణ నిర్వహిస్తారు. దీనిపై ముద్దాయిలు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారు. స్కిల్ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులను ఎందుకు విచారించరంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి ప్రేమచంద్రారెడ్డి ఆ పోస్టులోకి వచ్చేసరికే 90శాతం నిధులను టీడీపీ ప్రభుత్వం చెల్లించేసింది. దీంతో ఆయన మూడో పార్టీ నివేదిక కావాలని కోరారు. దీనిపై నాడు గంటా సుబ్బారావు, డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు సీఐటీడీ పేరుతో కనికట్టు చేశారు. స్కిల్ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పొందుపరుస్తూ ఇచ్చిన ఓ నివేదికను మూడో పార్టీ మదింపు నివేదికగా మభ్యపుచ్చారు. ఈ విషయాలన్నీ సిట్ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడయ్యాయి. సీఐటీడీ ఆ విషయాన్ని సిట్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించింది కూడా. సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. దీన్నిబట్టి సిట్ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తోందన్నది వెల్లడవుతోంది. -
ఇంటివాడైన హార్దిక్ పటేల్..
బాల్య స్నేహితురాలు కింజాల్ పారిఖ్‌ను వివాహమాడిన పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని దిగ్సార్ అనే గ్రామంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు. -
బాల్యమిత్రుడే దోచేశాడు..
♦ మేడిపల్లి భారీ దోపిడీ కేసును చేధించిన పోలీసులు ♦ ఐదుగురి అరెస్టు, 33లక్షల నగదు, ♦ 15తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో : డబ్బుల కక్కుర్తి పడి తన మిత్రుడి ఇంట్లోనే దోపిడీకి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడుతో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.33 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో కమిషనర్ మహేష్ భగవత్ శనివారం వివరాలు వెల్లడించారు. పెయింటర్‌గా పని చేస్తున్న బోడుప్పల్ వాసి ఈతకోట గోపాల కృష్ణ, మేడిపల్లి సరస్వతీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి బాల్య స్నేహితులు. చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి తరుచుగా వచ్చే గోపాలకృష్ణ అతనితో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి పర్వతాపూర్‌లోని ఓ స్థలం విక్రయించగా రూ.30 లక్షలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ వాటని కాజేసేందుకు సమయం కోసం వేచి చూశాడు. ఈ నెల 5న చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వెళ్లడంతో ఇంట్లో అతని తల్లి బాలమణి ఒక్కతే ఉంటుందని తెలిసిన గోపాలకృష్ణ తన స్నేహితుడు రాగిరిబాబుతో కలిసి మద్యం తీసుకొని వారింటికి వెళ్లి ఆమె పీకలదాకా మందు తాగించారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు ముందస్తు పథకం ప్రకారం తమ స్నేహితులైన రాజేందర్, నవీన్‌కుమార్, మదుసూదన్ గౌడ్లను పిలిపించి ఇంట్లో నగదు, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తీసుకురావాలన్నారు. గోపాలకృష్ణ, రాగిరిబాబు, మధు సూదన్‌గౌడ్ బయట కాపలాగా ఉండగా, రాజేందర్, నవీన్‌కుమార్ లోపలికి వెళ్లి డబ్బు, నగలు తీసుకొస్తుండగా అలికిడికి లేచిన బాలమణి కేకలు వేయబోగా ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వచ్చారు. అనంతరం చోరీ సొత్తును పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తెల్లవారుజామున బాలమణి నోటికి ఉన్న ప్లాస్టర్ ఊడిపోవడంతో ఆమె కేకలు విన్న పక్కింటి వారు ఆమె కట్లను విప్పారు. దీనిపై చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48 గంటల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు చేధించిన మేడిపల్లి పోలీసులను సీపీ మహేష్‌భగవత్ అభినందించి రివార్డులు అందజేశారు. -
బాల్యమిత్రునికి కేసీఆర్ పట్టం
గజ్వేల్ : ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జహంగీర్ నియమితులయ్యారు. శుక్రవారం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ములుగు మండల టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న జహంగీర్ కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. ప్రస్తుతం ఫామ్‌హౌస్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మిత్రునికి కేసీఆర్ ఊహించిన విధంగానే మార్కెట్ కమిటీ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా జహంగీర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కేసీఆర్ తనకు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తూ తెలంగాణలోనే వంటిమామిడిని నెంబర్‌వన్ మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. -
బాల్యమిత్రుని కుమార్తె వివాహ వేడుకలో సీఎం
ములుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్య స్నేహితుడైన మహ్మద్ జహంగీర్ కుమార్తె అయేషా వివాహ వేడుకకు గురువారం రాత్రి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని సిద్ధి కన్వెన్షన్ హాల్లో అయేషా-జాఫరుద్దీన్ల కల్యాణ వేడుక జరిగింది. ఈ వేడుకకు మనవడు హిమాంషు, సతీమణి శోభతో కలిసి సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. సీఎం దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు కన్నుమూత
దుబ్బాక: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు చెప్యాల రాజయ్య మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య కొన్నిరోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. రాజయ్య, కేసీఆర్ దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. మృతుడికి మానసిక వికలాంగురాలైన కూతురుతో పాటు భార్య మణెమ్మ, కుమారుడు ఉన్నారు. కాగా, రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కనకవ్వ కోరారు.