‘గంటా’ అంటే గయ్‌ గయ్‌! | Chandrababu Childhood Friend Lakshminarayana Retired Officer Is A Key Person In The Skill Scam - Sakshi
Sakshi News home page

‘గంటా’ అంటే గయ్‌ గయ్‌!

Published Tue, Sep 26 2023 5:09 AM | Last Updated on Tue, Sep 26 2023 4:29 PM

Chandrababu childhood friend Lakshminarayana retired officer is a key player in the Skill scam - Sakshi

సాక్షి, అమరావతి: యాధృచ్ఛికమో.. తనకు కలిసొ­స్తుందని భావించారో తెలియదుగానీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు ‘గంటా’ అయితే మరోపేరు ‘లక్ష్మీనారా­యణ’!! విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గయ్‌ గయ్‌మంటున్నారు! ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతోంది! అటు అమరావతిలో అసైన్డ్‌ భూముల దోపిడీలో.. ఇటు స్కిల్‌ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అసైన్డ్‌ భూముల వ్యవహా­రంలో మాజీ మంత్రు­లు, వియ్యంకులైన గంటా శ్రీని­వాసరావు, పొంగూరు నారా­య­ణ కీలకం కాగా స్కిల్‌ స్కామ్‌లో గంటా సుబ్బారావు, రిటైర్డ్‌ అధికారి లక్ష్మీ నారా­యణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు! 

చిర్రుబుర్రులు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ పేర్లను సిట్‌ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పిట్లోనే ఉంది మరి!! అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయ­త్నించారు.

అక్రమ నిధుల తరలింపులో పాత్రధా­రులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విష­యాన్ని పక్క­దారి పట్టించేందుకు యత్ని­ంచారు. ఇంతకీ గంటా సుబ్బారావు, లక్ష్మీ నారా­యణలతోపాటు పెండ్యాల శ్రీని­వాస్, మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తా పేర్లను సిట్‌ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...??

అంతా ఒకే ఒక్కరే.. గంటా
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌­డీసీ)! తన అక్రమాలకు అక్షయపాత్రగా భావించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహి­తులైన ప్రైవేట్, రిటైర్డ్‌ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు. కానీ ఏకంగా ఏపీఎస్‌ఎస్‌­డీసీతోపాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులూ కట్టబెట్టేశారు.

గంటా సుబ్బారావును ఏపీఎస్‌ఎస్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌– చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండీ–సీఈవో)గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్‌ఎస్‌డీసీని ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్‌ చేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌–ఇన్నోవేషన్‌ అనే శాఖను ఏర్పాటు చేశారు.

ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్‌ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్‌ అఫీషియో కార్య­దర్శిగా నియమించారు. దాంతో ఏపీఎస్‌ఎస్‌­ఎస్‌­డీసీలో ప్రాజెక్ట్‌ ఫైళ్లు తయారు చేసేది, ఉన్నత విద్యా శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌–ఇన్నోవేషన్‌ శాఖల్లో  పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపేది, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి తుది ఆమోదం తెలిపేది అంతా ఒకే ఒక్కరే ఆయనే గంటా సుబ్బారావు కావడం గమనార్హం. ప్రైవేట్‌  వ్యక్తికి నాలుగు పోస్టులు కట్టబెడుతూ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి ఆమోదించారు.

ఆ ముగ్గురి ప్రస్తావనే రానివ్వకుండా
గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్ల­గొట్టిన స్కిల్‌ ప్రాజెక్ట్‌ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–­పల్లోంజీ కంపెనీ ప్రతి­నిధి మనోజ్‌ పార్థసాని, షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేశ్‌ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్‌ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వ­కుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిట్‌కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృథా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహ­­రించారు. ఉదయం 9.30 నుంచి సా­య­­ంత్రం 5గంటల వరకు విచారణ షెడ్యూ­ల్‌ అని ముందే కోర్టు నిర్ణయించింది.

అందులో ప్రతి గంటకు ఐదు నిముషాలు విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకు­న్నారు. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదు­వుతూ కాలహరణం చేశారు. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృథా చేశా­రు. రెండో రోజు తన రాజకీయ అను­భవం గురించి పాతచింతకాయ పచ్చ­డిలా కథలు చెబుతూ సమ­యాన్ని గడిపారు. గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ గురించి గానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తాల గురించి ప్రస్తావించగానే చంద్ర­­బాబు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం గమనార్హం. అంటే ఆ ఐదుగురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

బాబు బాల్య స్నేహితుడే..
విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్‌ అధికారి కె.లక్ష్మీనారాయణను ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారు. తాను ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తన స్వప్రయోజ­నాలకు అనుగుణంగా ఏపీఎస్‌ఎస్‌­డీసీలో వ్యవ­హా­రాలు సాగేలా చూసేందుకే లక్ష్మీనారాయ­ణను తెచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరించారు.

సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ రూపకల్పన, అందుకు అను­గు­ణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్‌ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు.. అంతా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. అంటే స్కిల్‌ స్కామ్‌ కీలక గుట్టు అంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారా­యణ వద్దే ఉంది. ఈ క్రమంలో వారిద్ద­రిని ఎందుకు నియమించారు? వారితో సాగించిన వ్యవహారాలేమిటి? అని సిట్‌ అధికారులు అడిగేసరికి చంద్రబాబు 
కంగుతిన్నారు.

ఎవరిని విచారించాలో బాబే చెబుతారట..!
ఎక్కడైనా దర్యాప్తు అధికారులు చట్ట ప్రకారమే విచారణ నిర్వహిస్తారు. దీనిపై ముద్దాయిలు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారు. స్కిల్‌ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారు­లుగా ఉన్న అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులు, సంబంధి­త కంపెనీల ప్రతినిధులను సిట్‌ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధి­కారులను ఎందుకు విచారించరంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

వాస్తవానికి ప్రేమచంద్రా­రెడ్డి ఆ పోస్టులోకి వచ్చేసరికే 90శాతం నిధులను టీడీపీ ప్రభుత్వం చెల్లించేసింది. దీంతో ఆయన మూడో పార్టీ నివేదిక కావాలని కోరారు. దీనిపై నాడు గంటా సుబ్బారావు, డిజైన్‌ టెక్‌ కంపెనీ ప్రతినిధులు సీఐటీడీ పేరుతో కనికట్టు చేశా­రు. స్కిల్‌ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పొందుప­రుస్తూ ఇచ్చిన ఓ నివేదికను మూడో పార్టీ మదింపు నివేదికగా మభ్యపుచ్చారు.

ఈ విషయాలన్నీ సిట్‌ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడ­య్యా­యి. సీఐటీడీ ఆ విషయాన్ని సిట్‌కు లిఖితపూర్వ­కంగా వెల్లడించింది కూడా. సీమెన్స్‌ కంపెనీ ఈ మెయి­ల్‌ ద్వారా తెలియజేయడంతోపాటు న్యా­య­­­స్థానంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూ­లం కూడా ఇచ్చింది. దీన్నిబట్టి సిట్‌ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తోందన్నది వెల్లడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement