లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు.
ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్‌తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment