ప్రహ్లాదుడు తెలుసు. అతడి తమ్ముడు? హ్లాదుడు. ‘వీనిని అనుహ్లాదుడు అనియు అందురు.’
‘హాహా’ అంటే నవ్వుగా పొరబడే ప్రమాదం ఉంది. కానీ ఆయనొక గంధర్వరాజు. మరి ‘హూహూ’ కూడా ఉన్నాడా? ఇతడూ గంధర్వుడే. ‘దేవల ఋషి శాపముచే మకరి అయిపుట్టి అగస్త్య శాపమున గజరూపి అయిన ఇంద్రద్యుమ్నుని పట్టుకొని బాధించి విష్ణుచక్రముచే తల నఱకబడి శాపవిముక్తుడు ఆయె’. అన్నట్టూ విశ్వనాథ సత్యనారాయణ ఒక నవల పేరు: హాహా హూహూ.
అంశుమాలి అంటే సూర్యుడు. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. అస్తి జరాసంధుని కూతురు, కంసుని పెద్ద భార్య. శ్రుతకీర్తి ఎవరు? ‘అర్జునునకు ద్రౌపదియందు జన్మించిన పుత్రుడు’. ఇదే సహదేవుడి కొడుకైతే? శ్రుతసేనుడు. శ్రుతసోముడు భీముని కొడుకు. ద్రౌపది కాక నకులునికి మరొక భార్య ఉందా? ఆమె పేరు రేణుమతి. అర్జునుడు సరే. అర్జుని ఎవరు? బాణాసురుని కూతురు. అలాగే, దశరథపుత్రుడు భరతుని భార్య పేరు? మాండవి. ‘కవి’ ఒక పేరు కూడా. ఇతడు ‘రుక్షయుని కొడుకు. ఇతని వంశస్థులు బ్రాహ్మణులయిరి’.
ఇలాంటి విశేషాలు ఎన్నో తెలియజెప్పే పుస్తకం ‘పురాణ నామ చంద్రిక’. సుమారు 140 ఏళ్ల క్రితం 1879లో ముద్రింపబడింది. దీని కూర్పరి యెనమండ్రం వెంకటరామయ్య. ‘మన పురాణేతిహాస కావ్యములయందు తఱుచుగ కానబడు ననేక నామములను సులభముగా తెలిసికొనుటకు తగిన ఒక అకారాది నిఘంటువు లేదని యోచించి ఆ కొఱతను కొంతమట్టుకు పూర్తిచేయదలచి ఈ గ్రంథమును వ్రాసితిని’ అని వై.వి. తన ముందుమాటలో పేర్కొన్నారు. ‘ఇందు మన దేవతలు, ఋషులు, రాజులు, కవులు, దేశములు, పట్టణములు, నదులు, పర్వతములు, గ్రంథములు, మతాచార వ్యావహారిక పదములు మున్నగునవి’ కూడా ఉన్నాయి.
కళింగ దేశానికి ఆ పేరెలా వచ్చింది? కళింగుడి వల్ల. ఇతడు ‘బలి మూడవ కొడుకు’. ఈ బలి చక్రవర్తి తండ్రి విరోచనుడు. ఈ విరోచనుడు ప్రహ్లాదుని కొడుకు. మల్లనకు ఇందులో ఇచ్చిన వివరం: ‘బమ్మెర పోతన కుమారుడు. రుక్మాంగద చరిత్రము అను గ్రంథమును రచియించెను. ప్రౌఢకవి మల్లన అనునది ఇతనికి బిరుదాంకము’. ఆర్యులు అన్నమాటను ఇలా వివరించారు: ‘వేదములయందు చెప్పబడినవారు. వీరు తొలుత సరస్వతీ దృషద్వతీ నదుల మధ్య ప్రదేశము నందు ఉండి పిదప ఆర్యావర్తమునందు ఎల్ల వ్యాపించిరి. ఈ దేశమునందలి యాచార వ్యవహారములు అన్నియు వీరే కల్పించినవారు’. శాలివాహనుడు, హిందూమతము లాంటి కొన్ని మాటలకు దీర్ఘ వివరణలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఆర్కైవ్.ఆర్గ్‌లో చదవొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment