Viswanatha Satyanarayana
-
ఒకడు విశ్వనాథ
ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహా కవులు చరిత్రలో ఉన్నా, ఒకడు నాచన సోమన అని ఆయనే అన్నట్లుగా, ఆధునిక యుగంలో ‘ఒకడు విశ్వనాథ’. కవిసార్వ భౌముడు అనగానే శ్రీనాథుడు, కవిసమ్రాట్ అనగానే విశ్వనాథుడు తెలుగువారికి గుర్తుకు వచ్చి తీరుతారు. కావ్యాలు, నాటకాలు, శత కాలు, నవలలు, కథలు, పీఠికలు, వ్యాసాలు, గీతాలు, చరిత్రలు, విమర్శలు ఇలా... పుంఖానుపుంఖాలుగా రాసిన ఆధునిక యుగ కవి ఒక్క విశ్వనాథ సత్యనారా యణ తప్ప ఇంకొకరు లేరు. ఎన్ని రచనలు చేపట్టారో, అంతకు మించిన ప్రసంగాలు చేశారు. ఇంతటి కీర్తి ఇంకొకరికి అలభ్యమనే చెప్పాలి. సెప్టెంబర్ 10వ తేదీకి విశ్వనాథ జన్మించి 125 ఏళ్ళు పూర్తయ్యాయి. భౌతికంగా లోకాన్ని వీడి నాలుగు దశాబ్దాలు దాటినా, సాహిత్య లోకం అతన్ని వీడలేదు. వీడజాలదు. విశ్వనాథ ఎంచుకున్న మార్గం సంప్రదాయం. ఎదిగిన విధానం నిత్యనూతనం. తను ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. పట్టిందల్లా బంగారం చేశాడు. ‘ప్రతిభా నవనవోన్మేషశాలిని’ అన్నట్లుగా, ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి దశలోనూ అతని ప్రతిభ ప్రభవించింది, విశ్వనాథ శారద వికసించింది. విశ్వనాథ సృజియించిన శారద సకలార్ధదాయిని. విశ్వనాథ వెంటాడని కవి ఆనాడు లేడు. విశ్వనాథ చాలాకాలం నన్ను వెంటాడాడని మహాకవి శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నాడు. విశ్వనాథను ‘కవికుల గురువు’ అని అభివర్ణించాడు. కవికులగురువు అనేది కాళిదాసుకు పర్యాయపదం. శ్రీశ్రీ దృష్టిలో విశ్వ నాథ ఆధునిక యుగంలో అంతటి గురుస్థానీయుడు. విశ్వనాథలోని సాహిత్య ప్రతిభను విశ్లేషిస్తే రెండు గుణాలు శక్తిమంతమైనవిగా కనిపిస్తాయి. ఒకటి కల్పన, రెండు వర్ణన. వేయిపడగలు వంటి నవల రాసినా, శ్రీరామాయణ కల్పవృక్షం వంటి మహాపద్యకావ్యం రాసినా ఆ కల్పనా ప్రతిభ, ఆ ధిషణా ప్రవీణత అక్షర మక్షరంలో దర్శనమవుతాయి. చిక్కని కవిత్వం కిన్నెర సాని పాటల్లో ముచ్చటగా మూటగట్టుకుంది. ఋతువుల వర్ణనలో ప్రకృతి, పల్లెదనం పాఠకుడి కన్నుల ముందు నాట్యం చేస్తాయి. ఏకవీర, తెరచిరాజు వంటి నవలలు, హాహా హూహూ, మ్రోయు తుమ్మెద వంటి రచనలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం వంటి పద్య కావ్యాలు, నేపాల, కాశ్మీర రాజవంశ చరిత్రలు, పురాణవైరి గ్రంథ మాల మొదలైన అనేక చారిత్రక నవలలు, నర్తనశాల, వేనరాజు వంటి నాటకాలు, విశ్వేశ్వర శతకం వంటి శతకములు, గుప్తపాశుపతము వంటి సంస్కృత నాట కాలు, అల్లసాని అల్లిక జిగిబిగి, నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి వంటి విమర్శనా వ్యాసాలు, పీఠికలు కుప్పలుతెప్పలుగా రాశారు. ఇవన్నీ ఒప్పులకుప్పలే. విశ్వనాథలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడు చాలా ఎక్కువ. కొన్ని రచనలు స్వయంగా రాసినవి ఉన్నాయి. కొన్ని తను చెబుతూవుంటే వేరేవాళ్లు రాసినవి ఉన్నాయి. అది కథ, పద్యకావ్యం, సాంఘిక నవల, పాట, పీఠిక, వ్యాసం ఏదైనా కావచ్చు... ఉన్నపళంగా మొదలుపెట్టే శక్తి అచ్చంగా విశ్వనాథ ఐశ్వర్యం. దీన్ని మహితమైన ఆశుకవిత్వ ప్రతిభగా చెప్పవచ్చు. సంప్రదాయం, భారతీయత మధ్యనే తిరుగు తున్నప్పటికీ ఇంగ్లిష్ సాహిత్యాన్ని బాగా చదివేవాడు. విజయవాడ లీలా మహల్లో వచ్చే ప్రతి ఇంగ్లిష్ సినిమాను చూసేవాడు. ఇంగ్లిష్ సంస్కృతిని ద్వేషించాడు కానీ, భాషను ఎప్పుడూ ద్వేషించలేదు. రామాయణ కల్ప వృక్షం, వేయిపడగలు రెండూ కవిసమ్రాట్ నిర్మించిన మహా సారస్వత సౌధాలు. ఎంత కృషి చేశాడో, అంతటి కీర్తి కూడా పొందిన భాగ్యశాలి. తెలుగుసాహిత్య లోకా నికి మొదటి జ్ఞానపీఠ పురస్కారం ఆయనే సంపాయించి పెట్టాడు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అత్యున్న తమైన గౌరవాలు పొందాడు. డి.లిట్ కైవసం చేసుకు న్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందు కున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవి కూడా విశ్వనా థను వరించింది. శిష్య సంపద చాలా ఎక్కువ. శత్రు గణం కూడా ఎక్కువే. ఇంతటి కృషి చేసిన సాహిత్య మూర్తి ప్రపంచ సాహిత్య చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటారు. విశ్వనాథ అసామాన్యుడు. తెలుగువాళ్ళ ‘గోల్డునిబ్బు’. వ్యాసకర్త: మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్, మొబైల్ : 93931 02305 -
పట్టించుకోనందుకే పక్కన పెట్టారు
సాక్షి, విజయవాడ : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణను యువత ఆదర్శంగా తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ యువకులకు సూచించారు. మంగళవారం సత్యనారాయణ 125వ జయంతిని పురస్కరించుకొని లెనిన్ సెంటర్లోని ఆయన విగ్రహానికి మంత్రి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విశ్వనాధ సత్యనారాయణ తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని, ఆయన రచనలు మరువలేనివని తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సత్యనారాయణ నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాషను, కవులను పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని రచయిత జొన్నవిత్తుల చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
హాహా హూహూ ఎవరో తెలుసా?
ప్రహ్లాదుడు తెలుసు. అతడి తమ్ముడు? హ్లాదుడు. ‘వీనిని అనుహ్లాదుడు అనియు అందురు.’ ‘హాహా’ అంటే నవ్వుగా పొరబడే ప్రమాదం ఉంది. కానీ ఆయనొక గంధర్వరాజు. మరి ‘హూహూ’ కూడా ఉన్నాడా? ఇతడూ గంధర్వుడే. ‘దేవల ఋషి శాపముచే మకరి అయిపుట్టి అగస్త్య శాపమున గజరూపి అయిన ఇంద్రద్యుమ్నుని పట్టుకొని బాధించి విష్ణుచక్రముచే తల నఱకబడి శాపవిముక్తుడు ఆయె’. అన్నట్టూ విశ్వనాథ సత్యనారాయణ ఒక నవల పేరు: హాహా హూహూ. అంశుమాలి అంటే సూర్యుడు. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. అస్తి జరాసంధుని కూతురు, కంసుని పెద్ద భార్య. శ్రుతకీర్తి ఎవరు? ‘అర్జునునకు ద్రౌపదియందు జన్మించిన పుత్రుడు’. ఇదే సహదేవుడి కొడుకైతే? శ్రుతసేనుడు. శ్రుతసోముడు భీముని కొడుకు. ద్రౌపది కాక నకులునికి మరొక భార్య ఉందా? ఆమె పేరు రేణుమతి. అర్జునుడు సరే. అర్జుని ఎవరు? బాణాసురుని కూతురు. అలాగే, దశరథపుత్రుడు భరతుని భార్య పేరు? మాండవి. ‘కవి’ ఒక పేరు కూడా. ఇతడు ‘రుక్షయుని కొడుకు. ఇతని వంశస్థులు బ్రాహ్మణులయిరి’. ఇలాంటి విశేషాలు ఎన్నో తెలియజెప్పే పుస్తకం ‘పురాణ నామ చంద్రిక’. సుమారు 140 ఏళ్ల క్రితం 1879లో ముద్రింపబడింది. దీని కూర్పరి యెనమండ్రం వెంకటరామయ్య. ‘మన పురాణేతిహాస కావ్యములయందు తఱుచుగ కానబడు ననేక నామములను సులభముగా తెలిసికొనుటకు తగిన ఒక అకారాది నిఘంటువు లేదని యోచించి ఆ కొఱతను కొంతమట్టుకు పూర్తిచేయదలచి ఈ గ్రంథమును వ్రాసితిని’ అని వై.వి. తన ముందుమాటలో పేర్కొన్నారు. ‘ఇందు మన దేవతలు, ఋషులు, రాజులు, కవులు, దేశములు, పట్టణములు, నదులు, పర్వతములు, గ్రంథములు, మతాచార వ్యావహారిక పదములు మున్నగునవి’ కూడా ఉన్నాయి. కళింగ దేశానికి ఆ పేరెలా వచ్చింది? కళింగుడి వల్ల. ఇతడు ‘బలి మూడవ కొడుకు’. ఈ బలి చక్రవర్తి తండ్రి విరోచనుడు. ఈ విరోచనుడు ప్రహ్లాదుని కొడుకు. మల్లనకు ఇందులో ఇచ్చిన వివరం: ‘బమ్మెర పోతన కుమారుడు. రుక్మాంగద చరిత్రము అను గ్రంథమును రచియించెను. ప్రౌఢకవి మల్లన అనునది ఇతనికి బిరుదాంకము’. ఆర్యులు అన్నమాటను ఇలా వివరించారు: ‘వేదములయందు చెప్పబడినవారు. వీరు తొలుత సరస్వతీ దృషద్వతీ నదుల మధ్య ప్రదేశము నందు ఉండి పిదప ఆర్యావర్తమునందు ఎల్ల వ్యాపించిరి. ఈ దేశమునందలి యాచార వ్యవహారములు అన్నియు వీరే కల్పించినవారు’. శాలివాహనుడు, హిందూమతము లాంటి కొన్ని మాటలకు దీర్ఘ వివరణలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఆర్కైవ్.ఆర్గ్‌లో చదవొచ్చు. -
కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని చెప్పా..
కోదాడ : నాడు విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు కావ్యంలో ఉన్న ఓ పద్యంలో ‘కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని’ ఉందని దానినే తాను తరచుగా విద్యార్థులతో చెప్పేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ముదిగొండ వీరభద్రయ్య అన్నారు. కేసీఆర్ దానిని గుర్తు పెట్టుకున్నాడో ఏమోగాని రాష్ట్రంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన శిష్యుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌డేలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తనకు శిష్యుడని తెలిపారు. నాడు బక్కపలచగా ఉండే కేసీఆర్ పెద్ద బొట్టుపెట్టుకొని కళాశాలకు వచ్చేవాడని, విద్యార్థి దశలోనే ఎంతో చురుకుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషాలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని, ఎన్నో తెలుగు పద్యాలను అలవోకగా చెప్పేవాడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లో కేసీఆర్ తన దూరదృష్టితో కోనసీమగా మారుస్తాడనడంలో సందేహం లేదన్నారు. రైతును రాజును చేస్తానని కేసీఆర్ తనతో అన్నాడని అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. రాజకీయ చతురత, విషయ పరిజ్ఞానంలో కేసీఆర్‌ను ఆయన ప్రత్యర్ధులు కూడ మెచ్చుకోకుండా ఉండలేరన్నారు. పసిగుడ్డుగా ఉన్న తెలంగాణకు ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని, అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు పట్టంకట్టి మంచి పని చేశారని అన్నారు. -
మూడు స్మారక తపాళా బిళ్లలు
సందర్భం ‘రచనాకాలం నాటి సామాజిక స్థితిగతులను చక్కబెట్టడానికి కవి ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడో, దానిని 90 పాళ్లుగా పాత్రల చిత్రీకరణలో చూపించాలి. తన సృజనాత్మతను ధర్మోద్దీపనకు ఉపయోగించాలి’ అన్నారు విశ్వనాథ. తెలుగువారైన ముగ్గురు మహనీయుల జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ రేపు (ఏప్రిల్ 26) మూడు తపాలా బిళ్లలను విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజ్ఞాభారతి అధ్యక్ష హోదాలో 18 నెలల నుంచి చేసిన కృషితో ఇది సాధ్యపడింది. స్వాతంత్య్ర సమరవీరులు, మహర్షులు, కవులు, శాస్త్రవేత్తలు, కళా కారులు వారి విశిష్టతను అశేష ప్రజానీకానికి తెలియ జేసే కార్యక్రమాల్లో భాగంగా తపాలాశాఖ ఫిలాటలీ విభాగాన్ని ఏర్పరచి వారి గుర్తుగా తపాలా బిళ్లలను (స్టాంప్స్) ప్రచురిస్తోంది. నా ప్రయత్నంతో బళ్లారి రాఘవ, త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్‌ల స్మారక తపాలా బిళ్లలు గతంలో విడు దలయ్యాయి. ఇప్పుడు నాటి కవయిత్రులు ఆతుకూరి మొల్ల, తరిగొండ వెంగమాంబ; ఇటీవలి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణలను స్మరిస్తూ 3 తపాలా బిళ్లలను విశాల సాహితీ ప్రేమికుల, సహృదయుల సభలో ఒక సాహితీ గోష్టితో పాటు విడుదల చేయి స్తున్నాం (వేదిక: అన్నమయ్య కళావేదిక, వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణం, బృందావనం, గుంటూరు). ఈ ముగ్గురు మహనీయులూ దైవభక్తులు. 24వేల శ్లోకాలతో ఉన్న ఆరుకాండాల వాల్మీకి సంస్కృత రామా యణాన్ని 871 పద్య గద్యాలలో మూడు ఆశ్వాసాలుగా (కుమ్మరి) ఆతుకూరి మొల్లమాంబ (15వ శతాబ్దం ఆఖరి పాదం, 16వ శతాబ్దపు ప్రథమార్థ కాలం) లిఖిం చింది. మొల్ల శివకేశవుల భక్తురాలు, బాల వితంతువు, గోప వర గ్రామం (నెల్లూరు, కడప, రెండు జిల్లాల లోను గోపవర నామ గ్రామాలున్నయ్). సామాన్య ప్రజలకర్థమయ్యే భాష, సమకాలీన సమాజానికి రామాయణంలోని ఏ సందేశం, ఏ గాథ ద్వారా తెల పాలో, దానికి ప్రాధాన్యతనిచ్చిన కవయిత్రి. ఉదాహర ణకు పడవ నడిపి జీవించే గుహుని మనోభావం ఏమిటో సీతారామలక్ష్మణులకు వెల్లడించే ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందామె. ప్రజానీకంలో మొల్ల రామాయణానికున్న ఆమో ద్యం మరో రామాయణానికి లేదనడం అతిశయోక్తి కాదు. ప్రశ్నలకు ప్రత్యుత్తరాలిచ్చి తెనాలి రామలింగని మొల్ల కించపరచింది. ఉత్ప్రేక్షాలంకారయుత ఆశుకవి త్వాన్ని చెప్పి కృష్ణదేవరాయలను నిండు సభలో ముగ్ధుణ్ణి చేసింది. ఏ కులంలో, ఏ కుగ్రామంలో పుడి తేనేమి? రామభక్తి, దీ„ý ఉంటే ఎవరయినా రాణిం చవచ్చు. మొల్ల జీవితం నేర్పే పాఠం ఇదే. తరిగొండ వెంగమాంబ ఒక సాధ్వీ. తరిగొండ గ్రామ దేవాలయంలోని నృహింహస్వామికి చిరు ప్రాయం నుంచి భక్తురాలు. తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. మీరాబాయిలా భర్తను దూరంగా ఉంచింది. కాపురాన్ని నిషేధించింది. అనతికాలంలోనే వెంగమాంబ భర్త చనిపోయాడు. తిరుమలలోని వేంక టాచలపతే తన భర్త అని చాటింది. ఛాందస బ్రాహ్మణ బంధువర్గం ఆమెను బలవంతాన వితంతువులాగా శిరోముండనం చేయించబోయారు. దాంతో క్షురకునికి ఆమె భయంకర శక్తి స్వరూపిణిగా గోచరించింది. తన పని చేయకనే పారిపోయాడు. గ్రామస్థుల ప్రార్థనతో పుష్పగిరి స్వాములు వెంగమాంబకు బుద్ధి చెప్ప వచ్చారు. ఆయనతో నిర్భయంగా వాదించి, తాను నిత్య సుమంగళినని చెప్పింది. గురువుగారికెందుకు నమస్కరించవంటే, మీరు పెట్టించిన తెరను తీసివేయ మన్నది. తెర తొలగించగానే వెంగమాంబ ఇష్టదైవమైన నృసింహస్వామిని ధ్యానించి పుష్పగిరి స్వామికి వందనం గావించింది. తక్షణమే సింహగర్జన లాంటి ధ్వని వినిపించింది. పీఠంనుండి మంటలు లేచి పూర్తిగా తగు లబడిపోయిందని కథ. వెంగమాంబ సుమంగళే కాదు, దివ్యమూర్తి అని సమాజం విశ్వసించడం ఆరంభిం చింది. కొంతకాలానికి, వెంగమాంబ తిరుమల చేరింది. మరెన్నో మహిమలు ప్రజలు, భక్తులు కన్నారనీ, విన్నా రనీ ప్రతీతి. సరస్వతీ దేవి కటాక్షంతో వెంగమాంబ భక్తి ప్రధానమైన కవయిత్రిగా పరిణమించింది. వెంకటా చల మహత్మ్యమనే కావ్యాన్ని రచించింది. కవిసమ్రాట్ విశ్వనాథ గురించి ఎంత రాసినా సంపూర్ణ న్యాయం చేయలేం. 10,685 పుటలలో నిక్షిప్తమైన 57 నవలలూ, 27 పద్య కావ్యాలు, 16 నాట కాలూ నాటికలూ, 11 విమర్శనా గ్రంథాలు, 7 ఇత రములు మొత్తం 118. వారి ‘వేయిపడగలు’ 999 పుటల నవల. 29 దినాల్లో గ్రంథస్థమైంది. వారి జీవిత పరమార్థ రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం. 13 వేల పద్య గద్యాలు, 30 సంవత్సరాల కృషి, 170 ఛంద స్సుల్లో పద్యాలు, వారి మధ్యాక్కరలూ నిరుపమా నమైనవి. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలనం దుకొన్న ప్రథమాంధ్ర కవి. వందలమంది, దేశవి దేశాల్లో రామాయణాలు రాశారు, రాస్తున్నారు. ‘రచ నాకాలం నాటి సామాజిక స్థితిగతులను చక్కబెట్టడానికి కవి ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడో, అది తన రచనలో 90 పాళ్లుగా తన కృతిలోని పాత్రల చిత్రీకరణలో చూపిం చాలి. తన పాండిత్యాన్ని, సృజనాత్మతను ధర్మోద్దీపనకు ఉపయోగించాలి’ అన్నారు విశ్వనాథ. ఈ మువ్వురి స్మృత్యర్థం తపాలా బిళ్లలను ముద్రింపచేసేందుకు నా కృషి ఫలించడం నా భాగ్య మనుకుంటున్నాను. తపాలా శాఖ భరతమాత సేవలో తరిస్తూ, మరింతమంది మహనీయులను స్మరిస్తూ దేశ వాసుల హృదయాలలో దేశభక్తినీ, ఆధ్యాత్మికతనూ, ధర్మనిరతినీ పెంపొందింపజేస్తూ ఉండాలని ఆశిస్తున్నా. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి వ్యాసకర్త ప్రజ్ఞా భారతి అధ్యక్షులు ఫోన్ : 040–27843121 -
వినయాది గుణాల విశ్వనాథ
అహంకారమనే అపవాదే కాదు.. మూర్తీభవించిన సౌజన్యం ఆయన సొంతం గోదావరితో ఆయనకు సాహిత్యానుబంధం తెలుగు కవులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా గోదావరిని ప్రస్తుతించని వారు అరుదనే చెప్పాలి. కవిసామ్రాట్ విశ్వనా£ý lసత్యనారాయణ ఇందుకు మినహాయింపు కాదు. ఆంధ్రప్రశస్తిలో ‘గోదావరీ పావనోధారవాఃపరిపూరమఖిలభారతము మాదన్ననాడు’ అని ఎలుగెత్తి చాటారు. విశ్వనాథకు అహంకారం ఎక్కువని లోకంలో ఒక అపవాదు ఉంది. ‘ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి..’అని తనను గురించి రామాయణ కల్పవృక్షంలో పేర్కొన్న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణలో మూర్తీభవించిన సౌజన్యం, వినయాది గుణాలు పుష్కలంగానే ఉన్నాయి. ఆయన రాజమహేంద్రికి చెందిన సీనియర్ న్యాయవాది పోతుకూచి సూర్యనారాయణమూర్తికి రాసిన లేఖ ఒకటి ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. సాహితీగౌతమి తరఫున విశ్వనాథను రామాయణ కల్పవృక్షంపై ప్రసంగించాల్సిందిగా పోతుకూచి సూర్యనారాయణమూర్తి విశ్వనాథను ఆహ్వానించారు. ఆ రోజుల్లో విశ్వనాథ కరీంనగర్లో కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తుండేవారు.. ‘‘ నేడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి’ సందర్భంగా ఆ లేఖలో కొంతభాగం.. – రాజమహేంద్రవరం కల్చరల్ ‘‘ కరీంనగరము, 20–09–1960 నమస్కారములు. అయ్యా! తమరు వ్రాసిన జాబు చేరినది. తమఱందరు కలసియింత యెత్తుగడ యెందుకెత్తినారో నాకు తెలియదు. మిత్రులు, భావుకులు అయినవారికి నా గ్రంథము వినిపించవలయునని మాత్రమే నా వాంఛ. దానిని మీరు పెద్ద యుత్సవముగా మార్చినారు. కొందఱధికోత్సాహవంతులగు మిత్రుల దయ, కొంత మనస్సునకు ఇరుకు అనిపించినను సహించక తప్పదు. సాహిత్య విషయమున నాయందొక నిష్కర్షయున్నది. అది నేనకున్న యాదార్థ్యము– దీనిని లోకము ధూర్తత యనుకొనుచున్నది. అది ధూర్తత కాదని నాకు తెలియును. నేను సాధువనుట యిది నిజము. అందుచేతనే నాకట్టి యుత్సవములు బడాయిగా గనిపించి యొడలు కంపరమెత్తినట్లు యుండును. గుడివాడలో నేనుగు నెక్కుమన్నచో నెక్కలేదు. చూచిన వారేమనుకుందురో యని.. అది యట్లుంచి మీరు ఎంత తక్కువ హంగామాతో చేసిన నంత సంతోషింతును. అచ్చటికెందరో కవులు, పండితులు వత్తురు. వారు నా కావ్యము విని సంతోషించవలయుననియే నా ప్రధానోద్దేశము. వారందరిలో నేనుత్తముడనని నాయూహౖయెనట్లు భాసింపచేసినచో అది నాకు సుతరాం ఇష్టము లేదు. మధునాపంతులవారు , వెంపరాలవారు మొదలయిన వారుందురు. వారికంటె నేనెక్కువ పొడిచివేసిన దేమియు లేదు. శ్రీరామచంద్రకథాగతమైన భక్తిని నేను నా ప్రత్యేక జీవబాధతో వెళ్ళబోసికున్నది వారందరకు విన్నవించవలయునని మాత్రమే నా ప్రయత్నము.....’ విశ్వనాథ అంతరంగానికి అద్దం పట్టే ఈ ఉత్తరాన్ని నవితికి (90)చేరువలో ఉన్న‘సాహితీసర్వజ్ఞ’ పోతుకూచి సూర్యనారాయణమూర్తి నేటికీ పదిలంగా దాచుకున్నారు. కాగా, ఈ ఇన్లాండ్ లెటర్ ఖరీదు పది పైసలు. నాడు గోదావరిగట్టుపై ఉన్న రామకృష్ణమఠంలో విశ్వనాథ తాను రచించిన రామాయణ కల్పవృక్షంపై ప్రసంగాలు నిర్వహించారు.1939–40 మధ్యకాలంలో కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో విశ్వనాథ పాల్గొన్నారు. జిల్లాలోని కోరుకొండలో ఆయనకు కనకాభిషేకం జరిగింది. మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ పేజీ వస్తే అక్కడ నుంచి చెప్పమనేవాళ్లం మా సాహితీగౌతమి ఆహ్వానం మేరకు విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్షం గ్రంథాన్ని తీసుకుని ఏపేజీ వస్తే, అక్కడి నుంచి చెప్పేవారు. అప్పటికి ఇంకా యుద్ధకాండ రచన పూర్తికాలేదు. అప్పట్లో రామకృష్ణమఠం గోదావరిగట్టుపై, వాటర్‌వర్క్స్ వీధి మలుపులో ఉండేది. ఎందరో ఉద్దండ సాహితీమూర్తులు ఆయన ప్రసంగాలకు హాజరయ్యారు. – పోతుకూచి సూర్యనారాయణ మూర్తి, సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వసభ్యుడు అది నాకు దేవుడిచ్చిన వరం విశ్వనాథ ప్రసంగాలకు రాజమహేంద్రవరానికి వచ్చినప్పుడు, నేను పండిట్ ట్రెయినింగ్ అవుతుండేవాడిని. నా సమీప బంధువు చెరుకుపల్లి్ల జమదగ్నిశర్మ ఇంటిలో ఆయన మకాం. నేను ఆయనకు స్నానానికి నీళ్లు తోడివ్వడం, ఆయన్ను సభాస్థలికి తీసుకువెళ్లడం వంటిపనులు చేసేవాడిని. నాకు లభించిన శుశ్రూషాభాగ్యానికి నేటికీ నేను ఆనందపడుతున్నాను. – భారతభారతి శలాక రఘునాథ శర్మ -
సాహితీ జ్ఞానపీఠం
కృష్ణాతీరం కళలకు కాణాచి. అంతేనా! కవులకు పుట్టినిల్లు. తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడి వారే. కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో 1895 సెప్టెంబర్ 10న పుట్టారు ఆయన. చాలా చోట్ల పనిచేసినా, తన జీవితకాలంలో ఆయన ఎక్కువగా విజయవాడలో గడిపారు. ‘విశ్వేశ్వర శతకం’తో 1916లో రచనా వ్యాసంగాన్ని చేపట్టిన విశ్వనాథవారు సాహితీ రంగంలో చేపట్టని ప్రక్రియ లేదు. రాశిలోను, వాసిలోను వన్నెతరగని రచనా వైదుష్యం ఆయనది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’తో ఆయనను జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. ఎక్కువగా గ్రాంథిక భాషలో రచనా వ్యాసంగాన్ని సాగించిన విశ్వనాథవారు ‘కిన్నెరసాని పాటలు’, ‘కోకిలమ్మ పెళ్లి’ వంటివి వ్యావహారికంలో రచించడం విశేషం. ఆనాటి యువతరాన్ని కిన్నెరసాని పాటలు ఉర్రూతలూపాయి. స్వాతంత్య్రపూర్వ భారతీయ మధ్యతరగతి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన బృహత్తర నవల ‘వేయిపడగలు’ ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలను సంపాదించిపెట్టింది. ఇదే నవలను మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు హిందీలో ‘సహస్రఫణ్’ పేరిట అనువదించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావును తొలిసారిగా రంగస్థలంపైకి తీసుకొచ్చిన ఘనత విశ్వనాథ వారిదే. గుంటూరు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్ విశ్వనాథవారి శిష్యుడు. పల్నాటి చరిత్ర నేపథ్యంలో తాను రచించిన నాటకంలో విశ్వనాథవారు ఎన్టీఆర్ చేత నాగమ్మ పాత్ర వేయించారు. ఎన్టీఆర్ మీసాలు తీయడానికి నిరాకరిస్తే అలాగే మేకప్ వేసి, నాటకం ప్రదర్శించారు. విశ్వనాథ వారు అరవై నవలలు, రెండువందల ఖండకావ్యాలతో పాటు పలు నాటకాలు, కథలు, రేడియో నాటకాలు, పరిశోధన వ్యాసాలు రచించారు. భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. సనాతన సంప్రదాయాలను గౌరవించే విశ్వనాథ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారు. అందువల్ల ఆయనను చాలామంది పాశ్చాత్య వ్యతిరేకి అనుకునేవారు. అయితే, ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా ఆమూలాగ్రంగా అధ్యయనం చేసేవారు. -
వేయి పడగలు ఎందుకు చదవాలి?
రస రాజధాని: ‘విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది’ అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య- ‘వేయి పడగలు ఎందుకు చదవాలి?’ అన్న వ్యాసంలో. 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం ‘రస రాజధాని’లో ఇదొక వ్యాసం. ఆ మహా నవల ఔన్నత్యాన్నీ, వచ్చిన విమర్శలనీ సమాంతరంగా స్పృశిస్తూనే రచయిత ఈ వ్యాసం రాశారు. మళ్లీ కొన్ని కొత్త అంశాలను పరిచయం చేశారు కూడా. అయితే విశ్వనాథ ఆవిష్కరించిన అంశాన్ని, నిజానికి ఆయన వేదనని విమర్శకులు సరిగా అంచనా వేయలేకపోయారన్నదే సుప్రసన్నాచార్య ఆరోపణ. కానీ స్థలకాలాలను బట్టి విశ్వనాథ కొన్ని అవగాహనలలో ఇప్పుడు సామంజస్యం కనిపించకపోవచ్చునని కూడా రచయిత అంటారు. ఏ విధంగా చూసినా వేయిపడగలు నవల ఇతివృత్తం జీవలక్షణం కలిగి ఉంది. అభిమానులనీ, వ్యతిరేకులనీ కూడా అందుకే ఇంతగా ఆలోచింపజేస్తోంది. ఈ వ్యాసంతో పాటు ఇంకా ‘మహాకవి విశ్వనాథ’, ‘వేదమే సీతాదేవి- తపసా జ్వలన్తీం’, ‘కల్పవృక్షం- బాలకాండ’, ‘మరోసారి వేయిపడగలు చదివిన అనుభవం’, ‘గిరికుమారుని ప్రేమగీతాలు’, ‘తొలిచివేసే విరహం’ వంటి 12 వ్యాసాలు ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యం లేదా, అసలు సాహిత్యం మీద ఇటీవల వచ్చిన చిక్కనైన విమర్శ ‘రసరాజధాని’. కల్హణ రస రాజధాని: 120 ఏండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం; రచన: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య; పేజీలు: 158; వెల: 120; ప్రతులకు: రచయిత, ఇం.నం. 9-1-190, రాధికా థియేటర్ ఎదురుగా, గిర్మాజీపేట, వరంగల్-2 -
ఒక్కడు విశ్వనాథ
అది ఒక విశ్వవిద్యాలయం. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు చెదరరాదని గస్తీ తిరిగిన యుద్ధనౌక! గాఢ ప్రతిభాశాలి. ధిషణాహంకారి. ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ చేయని సేద్యం లేదు, పండించని పంట లేదు. తెలుగుజాతి పట్ల విశ్వనాథకు అలవిమాలిన ఆపేక్ష. ఉత్తరాదిన పుట్టి పెరిగిన రాముడు, విశ్వనాథ ప్రాపకంలో తెలుగురాముడు అయినాడు. నా రాముడని తనివితీరా కలవరించి పలవరించారు. విశ్వనాథకున్న అనుచర వర్గం, శిష్య వర్గం మరొకరికి లేదు. ఇష్టులు, అయిష్టులు కలిసి విశ్వనాథను నాడు నేడు కూడా సజీవంగా ఉంచుతూ వస్తున్నారు. సెప్టెంబర్10 ఆయన జయంతి. ఆ సందర్భంగా ఈ ‘వివరం’. సాహిత్యం, సంస్కృతి అవిభాజ్యమని, వాటి ఉద్ధరణ కూడా ఏకబిగిని జరగాలని విశ్వనాథ విశ్వాసం. మన దేశ రాజకీయ రంగంలో పండిత మదన్ మోహన మాలవ్యా గారెలాంటివారో, సాహిత్య రంగంలో సత్యనారాయణ అలాంటివారు. ఎన్ని ఎదురుదాడులు తగిలినా, తాను నమ్మిన సిద్ధాంతాలను వీడలేదు. తన మతం మార్చుకోలేదు. అందుకే ఆయనొక యుద్ధనౌక. ఒక మహాశిల్పి గొప్ప ఆలయాన్ని నిర్మించ సంకల్పించాడు. ఏడు ప్రాకారాలు, గాలి గోపురం, ముఖ మండపాలు, సింహద్వారాలు, మహాగోపురం, కోవెల కొలను, చుట్టూ మెట్లు... యింకా ఎన్నో కలిస్తే ఆలయం అవుతుంది. ఆ బృహత్కార్యాన్ని చేస్తూ మధ్య మధ్య ఆ శిల్పి కొన్ని చెక్కుళ్లను రూపొందిస్తాడు. విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం మహాలయం. సమాంతరంగా వారు వెలువరించిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, నవలలు, నాటకాలు, గీతాలు, ప్రసంగ వాక్యాలు కల్పవృక్షంతో పాటు పెరిగిన పొగడలు, పొన్నలు, పున్నాగలు. వి॥బాగానే రాస్తారు గానీ ఒక పట్టాన అర్థం కాదనేవారున్నారు. ‘పాషాణపాక ప్రభూ’ అని సంబోధించినవారున్నారు. అయినా కల్పవృక్ష మహా నిర్మాణాన్ని ఆయన ఆపలేదు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సీతా స్వయంవరాన్ని సీస పద్యంలో వర్ణించి, తర్వాత తేటగీతిలో: అతని దృష్టికి జానకి యాగలేదు అతని కృష్టికి శివధనుస్సాగలేదు సీత పూజడ వెన్నుగా శిరసు వంచె చెరుకు గడవోలె నడిమికి విరిగె ధనువు. సీతను చూపిన తీరు ఇది. కవి సమ్రాట్కి సందర్భ శుద్ధి ఉంది. ఒక్కొక్క సందర్భానికి తగినట్టు పూర్వకవిని ఆవాహన చేసుకుని ఆ మార్గంలో కథ నడిపించారు. ఆదికవి నన్నయ్య నుంచి నాచన సోమన్నదాకా కల్పవృక్షంలో సాక్షాత్కరిస్తారు. మీ కల్పవృక్షం చాలామందిని కదిలించింది. దాని ప్రేరణలో విషవృక్షం కూడా మొలిచిందండీ అంటే ‘‘ఔనౌను, ఎవరి మార్గం వారిది. నేను వెర్రివాడిని. నాకు ఏడు జన్మలకు గాని ముక్తి లేదు. వారిది వైరిమార్గం. జయ విజయులు చూపిన దారి. మూడు జన్మలకే ముక్తి!’’ అనేవారు, అలవాటుగా ఉండే థూ... థూల మధ్య. తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందిన విశ్వనాథ నవల వేయి పడగలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీ కోసం రాశారు. వెయ్యి పేజీల నవల. ఆ పోటీలో కడదాకా నిలచిన నవలలు మూడు. వేయి పడగలు, అడివి బాపిరాజు నారాయణరావు నవల, చలం మైదానం. మైదానం పేజీల నియమావళికి నిలవలేదు. ఇక నిలిచినవి రెండు. విశ్వవిద్యాలయం ప్రకటించిన వెయ్యి రూపాయల బహుమతిని చెరి సగం చేశారు. బాపిరాజుకి అయిదు వందల యాభై, విశ్వనాథకి అయిదు వందలు ఇచ్చారు. అందులో కథానాయకుడు నారాయణరావు బాపిరాజే. వేయి పడగల కథానాయకుడు ధర్మారావు విశ్వనాథే. వందేళ్ల తెలుగు జీవితాన్ని అద్భుతంగా చిత్రించి, వేయి పడగలు నవల తెలుగుజాతి స్వీయకథ అనిపించారు. నైతిక సూత్రాల పట్ల, సాంప్రదాయ జీవన మార్గం పట్ల విశ్వనాథకు ప్రగాఢ గౌరవం, తిరుగులేని విశ్వాసం ఉన్నాయి. ఆయన వేయి పడగలు నవలలో ప్రతిపాదించిన అంశాలు, వారి తర్వాతి నవలలకు విస్తరించి కనిపిస్తాయి. విశ్వనాథ ఏకవీర నవల తెలుగు కాల్పనిక సాహిత్యంలో విలక్షణమైనది. నాలుగు పాత్రలను నాలుగు స్తంభాలుగా మలచి మహామండపాన్ని నిర్మించారు. మధురై దగ్గరి వైగై నది చుట్టూ ఈ కథ తిరిగి, చివరకు వైగై నదిలోనే ముగుస్తుంది. ప్రేమ, ప్రణయం ఎంతటి గొప్ప ఉద్వేగపూరితమైనవి అయినా, శృంగార భావాలు మధురమైన కోరికలు ఎంతటి విశృంఖలమైనవి అయినా, హద్దు మీరకుండా నిగ్రహించుకోవడమే భారతీయ సంప్రదాయమని ఏకవీర తీర్మానిస్తుంది. విశ్వనాథ చెలియలికట్ట నవల మరో కడలి తరంగం. అప్పట్లో ‘ఫ్రీ లవ్ సొసైటీ’ పేరుతో ఒక సమాజం తెరమీదకు వచ్చింది. ఆ వెర్రితలని దృష్టిలో పెట్టుకుని చెలియలి కట్ట రచించారు. ఇది కేవలం సాంఘిక నవల మాత్రమే కాదు, మానసిక పరిణామ దశలను విశ్లేషించిన ఒక సూత్ర గ్రంథం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి భారతీయ మనో విశ్లేషణలన్నింటినీ పుక్కిలిపట్టిన విశ్వనాథ చెలియలికట్ట నవలలో రత్నావళిని విశిష్టంగా రూపొందించారు. చివరకు ఆమెనొక కర్మయోగినిగా మలచారు. చెలియలికట్ట చలం మైదానం నవలకి కౌంటర్‌గా రాశారని కొందరంటారు. కాని అది కాదు. బరి తెగించిపోతున్న నైతిక సూత్రాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెలియలి కట్ట. నవలల్లో యదార్థ జీవన చిత్రణ చేసే సంప్రదాయాన్ని అంటే డాక్యుమెంటరీలను విరివిగా విశ్వనాథ రాశారు. వేయి పడగలు నవలలో చాలా పాత్రలకు మాతృకలు ఉన్నాయి. తెరచిరాజు నవల ముంజులూరి కృష్ణారావు జీవితం. ఆయన గొప్ప నటుడు. విశ్వనాథ కొంతకాలం కరీంనగరం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అక్కడ లాయర్ వృత్తిలో ఉంటూ సంగీతాన్ని ఉపాసించే గాయక సార్వభౌముడు నారాయణరావు ఉన్నారు. కరీంనగర్ పరిసరాలలోనే మ్రోయు తుమ్మెద అనే వాగు ఉంది. నిరంతరం లయాత్మకంగా ధ్వనిస్తూ ప్రవహించే ఆ వాగు పేరుతో ఆ సంగీత సార్వభౌముని జీవితాన్ని సాక్షాత్కరింపజేశారు. విశ్వనాథ నవలలన్నింటినీ ఒక లక్ష్యంతో ఒక ప్రయోజనంతో రాశారు. వాటిని చాలామంది ఆ విధంగా అర్థం చేసుకోలేదని విశ్వనాథ ఆవేదన పడేవారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, దమయంతి స్వయంవరం వీటిలో విశ్వనాథ వ్యంగ్య వైభవపు అంచులు చూడచ్చు. బద్దన్న సేనాని, వీరవల్లడు వీటిదొక తీరు. మా బాబు, జేబుదొంగలు మరొక తీరు. తర్వాత్తర్వాత ఎమెస్కో పాకెట్ బుక్స్‌గా రాసిన కాశ్మీర పట్టమహిషి, చిట్లీ చిట్లని గాజులు, దిండు కింద పోకచెక్క, దంతపు దువ్వెన లాంటి కాశ్మీర కథల పరంపర వేరొక తీరు. విశ్వనాథ ఖండ కావ్యాలు రాసినా, వచనం రాసినా, లఘు కావ్యాలు రాసినా కండ పుష్టి గల రచనలే చేశారు. తన ప్రతిభను గ్రంథాలలోకి దించి, జాతికి అందించగలిగిన మహానుభావుడు విశ్వనాథ. సనాతన భారతీయ తత్వాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన జ్ఞాని. విశ్వనాథ రచనలలో ‘జీవుడి వేదన’ అనే మాట తరచూ వినిపిస్తుంది. ఇది ఆయన స్వేచ్ఛాచింతనకు ఒక ఉదాహరణ. ప్రతి మనిషికీ కొన్ని తనవైన ఆలోచనలు ఉంటాయి. సొంత ఘోష ఒకటి ఉంటుంది. అదే ఆయన ప్రతిపాదించిన జీవుడి వేదన. దీనిని విశ్లేషించి, సమగ్రంగా పరిశోధిస్తే ఒక వినూత్న తాత్విక సిద్ధాంతం ఆవిష్కృతమవుతుంది. విశ్వనాథ నాటకాలలో వేనరాజు, నర్తనశాల, అనార్కలి ప్రసిద్ధమైనవి. ప్రాచీన కవుల రచనలపై విశ్వనాథ విశ్లేషణ వ్యాసాలు నేటి విమర్శకులకు పాఠ్య గ్రంథాలు. ఏ కవిని ఎక్కడ ఎలా దర్శించాలో ఆయనకు తెలుసు. ‘మెంతి మజ్జిగ రుచి మెంతి మజ్జిగదే. పరవాన్నం రుచి పరవాన్నందే. బాగుండడమంటే వాటి జీవలక్షణాలను బట్టి తేల్చాలి’... ఇలాంటి కొలత బద్దలతో విశ్వనాథ విమర్శ సాగుతుంది. సాహిత్యంలో ఉన్న శాఖలన్నీ విశ్వనాథకు ఆటపట్లు. కోకిలమ్మ పెండ్లి, కిన్నెరసాని పాటలు, ఉయ్యాల తాళ్లు లాంటి గేయ కావ్యాలు, విశ్వనాథ మధ్యాక్కరలు వేటికవే ప్రత్యేకం. 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాథ కార్యక్షేత్రాన్ని కడదాకా బెజవాడనే చేసుకున్నారు. విశ్వనాథకు సాహిత్యంలోనే కాదు, జీవితంలోనూ ముందుచూపు ఉంది. తన పుస్తకాలు కనుమరుగు కాకుండా కొత్తతరాల వారికి లభిస్తూ ఉండాలంటే, స్వయంగా తనే ఒక ప్రచురణ సంస్థని స్థాపించి ముద్రించాలని అనుకున్నారు. ‘విశ్వనాథ సత్యనారాయణ అండ్ కో’ని ప్రారంభించారు. ఆయన రచనలన్నీ అప్పటికీ ఇప్పటికీ ఆ సంస్థ పేరు మీదే వెలువడుతున్నాయి. విశ్వనాథ సహస్ర మాసోప జీవి. పొందతగిన అన్ని గౌరవాలూ పొందారు. తీసుకోవలసిన అన్ని బిరుదులూ తీసుకున్నారు. ఆనాటి ప్రముఖులు పి.వి.నరసింహారావు, తెన్నేటి విశ్వనాథం, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, మండలి కృష్ణారావు ఆయన శిష్యవర్గంలోని వారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగా తమ సేవలు అందించారు. జాతీయోద్యమం నేపథ్యంలో తన మొదటి నవల ‘అంతరాత్మ’ని ప్రారంభించారు గాని, అది అసంపూర్ణంగానే మిగిలింది. ప్రచురితమైన తొలి నవల ఏకవీర. విశ్వనాథ మంచి భోజనప్రియులు. ఆయన రుచులు వింతగా ఉండేవి. తీవ్రస్థాయిలో ఆవకాయ కలుపుకుని, ఆ ముద్ద తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కునేవారు. అదీ ఆంధ్ర పౌరుషం! విశ్వనాథ సమకాలికులెవరూ సామాన్యులు కారు. చెళ్లపిళ్లవారు విద్య నేర్పిన గురువులు. అప్పుడప్పుడే రకరకాల ఇజాలు రెక్క విప్పుతున్న రోజుల్లో, విశ్వనాథ ఒంటరిపోరుకి తలపడ్డారు. తలపడి నిలిచారు. నిలిచి గెలిచారు. శతాధిక గ్రంథకర్త. ప్రతి గంథం ఒక ప్రత్యేకతను సంతరించుకుని బతికి బట్టకట్టింది. భోజన ప్రియులు విశ్వనాథ మంచి భోజనప్రియులు. ఆయన రుచులు వింతగా ఉండేవి. తీవ్రస్థాయిలో ఆవకాయ కలుపుకుని, ఆ ముద్ద తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కునేవారు. అదీ ఆంధ్ర పౌరుషం! విశ్వవేదన జీవితాన్ని సంపూర్ణంగా తరచి చూసినవాడు, అర్థం చేసుకున్నవాడు విశ్వనాథ. హాలాహలం ఎలాంటిదో తెలుసు, అమృతమేమిటో తెలుసు. ‘‘బాల్యంలో తల్లిని, యవ్వనంలో భార్యని, వృద్ధాప్యంలో కొడుకుని పోగొట్టుకున్నవాణ్ని. వేదనకి అర్థం నాకు తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది’’ అన్నారొక చోట. విన్నవారికి కనులు చెమర్చాయి. నూత్న యవ్వనంలో అంటే ఇరవై రెండేళ్ల వయసులో విశ్వనాథ రాసిన పద్యాలలోంచి - అతి సామాన్యమైన, సార్వజనీనమైన విషయాన్ని చెప్పి, కనిపించని దేవుణ్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది ఎన్నిసార్లు చదివినా మనసు ఆర్ద్రమవుతుంది. ఒక దిగులు, ఒక అశక్తత ఆవరిస్తాయి. విశ్వనాథ సామాన్యుడు. ఆయన ఆలోచనలు అసామాన్యాలు. ఈ పద్యపాదాలు శరణాగతికి పరాకాష్ట. నా కనుల యెట్టయెదుటన నా జనకుని నా జనని కుత్తుకలను కోసి నన్నెడిగెన తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నే నొదిగి యుండి నా కనుల యెట్టయెదుటన నా లతాంగి ప్రాణములు నిల్వునందీసి యడిగెనను న తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి యొదిగి తనుజు కుత్తుక నులిమి తానను నడిగెన తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి పోయి. ఉపమా విశ్వనాథస్య విశ్వనాథ ఉపమానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడా మనకు కనిపించవు. తర్వాత కనిపించడం లేదు. కారణమేమంటే విశ్వనాథ చూపు వేరు. - ఆమె మంచముపై పరున్న గోధుమవన్నె త్రాచువలెనున్నది. - ఒంటినిండ మసి పూసికొనిన దొంగవలె సంజ చీకటి తొంగి చూచినది. - జొన్న చేనిలో మంచెయే గాని సౌధము. - ఆమె వదనము పావురాయి పొట్టవలె మృదువుగా తళతళలాడుచున్నది. - ఆమె కంకె విడిచి మురువు వొలుకు పంటచేను. - ఆ సువాసనల చేత దీపం ఆరిపోవునేమోనని భయపడితిని. - ఇంద్ర ధనుసు ముక్క పులి తోకలా ఆకాశంలో కనిపిస్తోంది. - శరదృతువులో కొంగలబారు ఎగురుతుంటే, ఆకాశమనే పాముల చిన్నదాని మెడలోని నత్తగుల్లల పేరులా వుంది. - గుమ్మడి పువ్వులో కులికే మంచు బిందువు, తట్టలో కూర్చుండబెట్టిన నవవధువులా తోచింది. - గుండెలపై బోర్లించి పెట్టిన పుస్తకము వలె పసివాడు పడుకున్నాడు. గడ్డం అచ్చిరాని విశ్వనాథ (డాక్టర్ భార్గవి తెలుగు చేసిన గీతాంజలి పుస్తక ఆవిష్కరణ వేళ - విశ్వనాథ పరంగా శ్రీరమణ చెప్పిన పేరడీ మాటలివి.) పసిబిడ్డ బాలాది యాతని చిత్తరువుని చూడగనే టాగూర్యని గుర్తింతురు. ఘనమైన గుబురు గడ్డము ఆయనకు దేశాంతర గుర్తింపు తెచ్చినది. పైగా రవీంద్రనాథుడు కవి కూడా యగుట గడ్డమునకు వన్నె పెరిగినది. గుర్తింపునకై యారాటపడుట మానవ నైజము. ఆరాటములనేక విధములు. బెల్లముకొండ సుబ్బరావని ఒకడున్నాడు. ఆతడు చక్కని గాత్రము గలవాడు. స్ఫురద్రూపి. కృష్ణ పాత్రను ధరించుటలో కొంత సాధన చేసి యున్నాడు. అప్పటికే కృష్ణ పాత్రలో పేరుగాంచినవారెందరో యున్నారు. అయినచో తనకెట్లు పేరు రావలెను? మీసములు పెంచినాడు. మీసాల కృష్ణునిగా వాసికెక్కినాడు. కృష్ణునికి మీసములుండెడివా, లుండనివాయని బెద్ద చర్చయే నడిచినది. అదియెల్ల మీసాల కృష్ణునికి బ్రాచుర్యము పెంచినవి. భావ కవులకేమి బెంచవలనో తెలియక జులపాలు పెంచుటకుద్యమించినారు. వారి కదియే నొక గుర్తింపు అయినది. ఇది యొక వైచిత్రి! నేను బందరులో నుండగా గడ్డము పెంచుటకు పూనుకొంటిని. దాని పర్యవసానమేమి? కొందరు సుస్తీ చేసినదా యనియు, మరికొందరు తిరుపతి మొక్కాయని, ఇంకొందరు చనువుగా మరల అక్కయ్యగారు నీళ్లోసుకున్నారా యనియు నడుగ నారంభించిరి. ఇది నాకు అచ్చిరాలేదని గ్రహించి, ఆదిలోనే యా జ్ఞాన వూడలను తొలగించుకుని తేటపడితిని. అయినచో, గీతాంజలికిది యనువాదము. ఎన్ని అనువాదములు రాలేదు కనుక. అయిననూ ఎవని ఘోష వానిది. గీతాంజలి కావ్యములో మనకు పలుచోట్ల జీవుడి వేదన కానుపించును. డాక్టర్ భార్గవికిని నాకును యొక బాదరాయణ సంబంధమున్నది. నాది కృష్ణామండలము, ఆమెది పామర్రు, నదియును కృష్ణామండలము. ఆమె డాక్టరు. నేను కాను. అయినచో నేమైనది. ఈమెది ప్రసూతి వైద్యము. గ్రంథ రచనల విషయముననేమో గాని వైద్యమున మాత్రము హస్తవాసి మంచిదని వినియుంటిని. పురుళ్ల ఆసుపత్రిలోనొక వైచిత్రి యున్నది. ఒక్కరు వచ్చి ఇద్దరు వెళ్లెదరు. మిగిలిన చోట్ల నట్లు కాదు. ఒక్కరు వచ్చి యొక్కరు వెళ్లుటే గగనము. ప్రతి తల్లి జాతిని మరో తరమునకు నడిపించును. పచ్చి బాలింతలో ఆ గర్వము యా ఆనందము తొణికిసలాడుచుండును. అయినచో ఆనాటి నడికట్లు లేవు. పథ్యములు లేవు. పోషణలు లేవు. కన్నబిడ్డకు పాలిచ్చుట తల్లికవమానము. ఇంతకూనిది తెలుగు అనువాదము. సమకాలికులు విశ్వనాథని ఒక మెట్టుపైనే కూచోపెట్టి గౌరవించారు. కొందరాయన మార్గాన్ని అనుసరించలేక, కొందరాయన అభిప్రాయాలతో ఏకీభవించలేక దూరంగా జరిగారు. అభిప్రాయాల గురించి మాట్లాడితే, ఆయనకు చిరాకు. ఒకసారి ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు, ‘‘వారికీ మాకూ అభిప్రాయ భేదాలున్నప్పటికీ...’’ అనేసరికి, వి॥స॥నా రెచ్చిపోయారు. ‘‘ఏడ్చి, సొంత అభిప్రాయాలున్నవారికి భేదాలు గాని, నీకూ నాకూ ఎందుకు? మీరు మార్క్స్‌ని భుజాన వేసుకుని, నేను శంకరాచార్యుని పట్టుకుని వేలాడుతున్నాం. మనకెందుకు అభిప్రాయ భేదాలు...’’ అని వాదన పూర్తిచేశారు. సినిమా లాంటి శక్తివంతమైన మాధ్యమాలతో సంబంధం లేకున్నా, తెలుగునాట ఆబాల వృద్ధులకు విశ్వనాథ పేరు యెరుకే. అంతగా తెలుగువారిని చదివించినవారు లేరు. అంతగా అర్థం కానివారూ లేరు. విశ్వనాథతో పోల్చదగినవారు విశ్వనాథ మాత్రమే! అందుకే ఒకడు విశ్వనాథ. కాదంటే ఒకే ఒక్కడు విశ్వనాథ. - శ్రీరమణ -
వేడెక్కిన ‘పుర’పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల పోరు మరింత వేడెక్కింది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ఇక బలాబలాల ప్రదర్శనకు దిగనున్నారు. జిల్లాలోని ప్రధానమైన తాండూరు, వికారాబాద్, ఇబ్రహీంపట్నం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధానపార్టీలు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటాపోటీ పోరు జరుగనుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీరికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇబ్రహీంపట్నంలో 20 వార్డులకు గాను ఎనిమిదింటిలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపింది. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పోటీలో టీడీపీ తరఫున చిగుళ్లపల్లి రమేష్, టీఆర్ఎస్ నుంచి శుభప్రద పటేల్, కాంగ్రెస్ నుంచి విశ్వనాథ సత్యనారాయణ బరిలో దిగనున్నారు. తాండూరు, ఇబ్రహీంపట్నం స్థానాల్లో చైర్మన్ పదవి కోసం ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఆశావహులున్నారు. వీరిలో అసలైన పార్టీ అభ్యర్థి ఎవరనేది బీఫారాలు జారీ చేసిన తరవాత గానీ స్పష్టత వచ్చేలా లేదు. ‘పట్నం’లో ఖరారు కాని చైర్మన్ అభ్యర్థులు.. ఇబ్రహీంటపట్నం నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను 215 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 80 మంది నామినేషన్ వేశారు. ఎస్సీకి కేటాయించిన మున్సిపల్ చైర్మన్ పదవికి పార్టీ తరఫున యాలాల యాదయ్య అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలిసింది. జనరల్ స్థానమైన 12వ వార్డు నుంచి యాదయ్య పోటీలో దిగుతున్నారు. టీడీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిత్వం కోసం కప్పరి లక్ష్మయ్య, ఈగల రాములు పోటీపడుతున్నారు. వీరిద్దరిలో పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది వేచిచూడాలి. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న పెద్ద అంబర్‌పేట కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో రెండింటిలో ఒకచోట చైర్మన్ పదవికి మహిళా అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో టీడీపీ ఉంది. అలాంటి పరిస్థితే వస్తే ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవినే మహిళకు కేటాయించే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ తరఫున అసలు చైర్మన్ అభ్యర్థులే లేరు. వికారాబాద్‌లో నువ్వా..నేనా... వికారాబాద్ పురపాలక సంఘంలో మొత్తం 28 వార్డులకు గాను 249 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చిగుళ్లపల్లి రమేష్, విశ్వనాథ సత్యనారాయణ, శుభప్రదపటేల్ పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రభావవంతమైన రెబల్ అభ్యర్థులు అంతగా లేకున్నా కొన్ని వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. తాండూరులో రసవత్తరం... తాండూరు పురపాలక సంఘంలో 31 వార్డులకు గాను 311 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే పోటీ ఉంది. టీఆర్ఎస్ నుంచి విజయాదేవి చైర్మన్ రేసులో ఉండగా, కాంగ్రెస్ నుంచి సీహెచ్ అనురాధ, బి.సునీత పోటీలో ఉన్నారు. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. 20 వార్డుల్లో స్వత్రంత్రులుగా పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారు. -
సాహితీ బృందావనం
తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుబాళిస్తున్న ఉస్మానియా కళాశాల నేడు అంతర్జాతీయ సాహితీ సదస్సు ప్రారంభం దేశ, విదేశీ ప్రముఖ రచయితల హాజరు కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ప్రాంగణంలో ఒకప్పుడు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత తెలుగు సాహితీ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ పద్యం మారుమోగింది. నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ కవిత నిప్పులు చెరిగింది. నరాల రామారెడ్డి పద్యం ప్రేక్షకుల గుండెలను సుతిమెత్తగా సృశించింది. సాహితీవనంలో వాసంత సమీరాలైన షేక్ దావూద్, ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి, మేడూరి వెంకటసుబ్బయ్యల మధురమైన గళం నేటికీ ఆ ప్రాంగణంలో మారు మోగుతూనే ఉంది. రాయలసీమకే తొలి డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన ఉస్మానియా కళాశాల ప్రాంగణంలో సాహితీ సుగంధం అలుముకుని ఉంది. 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ కళాశాల ప్రాంగణంలో మంగళవారం తెలుగు భాష, సాహితీ సంస్కృతులపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమవుతోంది. ఉస్మానియా కళాశాలలో తెలుగు, సంస్కృత భాషల్లో ఉద్దండులైన ఉత్తమ అధ్యాపకులు షేక్ దావూద్ కవి, మేడూరి వెంకటసుబ్బయ్య, ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి, గాలి నారాయణరావు, ప్రొఫెసర్ కేఎస్ఎస్.శర్మ, రామచంద్రారావు, వరప్రసాద్, కాద్రి, గౌరీశ్వరప్పలు పని చేశారు. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తెలుగు సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు నిర్వహించి ఉస్మానియా ప్రాంగణంలో సాహితీ సుగంధాన్ని వెదజల్లారు. తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో ఈ కళాశాలలో ఎన్నెన్నో అద్వితీయమైన సాహిత్యోపన్యాసాలు, సాహిత్య సమ్మేళనాలు జరిగాయి. 1960 దశకం నుంచి ఏటేటా కళాశాల వార్షికోత్సవాలు, ఆ వార్షికోత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించి విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. అలనాటి ముఖ్యమంత్రి సాహితీవేత్త దామోదరం అంజయ్య, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి రాజకీయ దురంధరులు సైతం ఉస్మానియా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా కళాశాలలో ప్రస్తుత తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు మంగళవారం ప్రారంభం కానున్నది. ప్రపంచీకరణ-తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ భాషల మనుగడ అనే ప్రధాన అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధులైన కవులు, రచయితలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశ్వనాథ, శ్రీశ్రీల సాహిత్య సభలు.. తెలుగు సాహిత్య వినీలాకాశంలో విద్యుల్లతలై మెరిసిన విశ్వనాథ సత్యనారాయణ ఉస్మానియా కళాశాలలో జరిగిన సాహితీ సభలో పాల్గొన్నారు. ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఒక సభలో మహాకవి శ్రీశ్రీ పాల్గొని ప్రసంగించారు. 1980 దశకంలో గానగంధర్వగా పేరు గాంచిన రాజన్న కవి, శతావధాని నరాల రామారెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ ముకురాల రామారెడ్డి తదితరులు పాల్గొని ఆధునిక కవిత పట్ల ఆసక్తి పెంపొందించే సాహిత్యోపన్యాసాలు చేశారు. కళాశాలలోని ఆంగ్ల అధ్యాపకులు ప్రొఫెసర్ కేఎస్ఎస్.శర్మ ప్రతి క్లాసులో శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని కవితలు వల్లె వేస్తూ విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. 1969లో హైదరాబాద్ ప్రిన్స్ మొకర్రంజా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు కృష్ణ, చంద్రమోహన్లు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. రెండు రోజుల సదస్సులో మహా మహులు ప్రపంచీకరణ తెలుగు భాషా సంస్కృతులపై జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో మాజీ మంత్రి టీజీ వెంకటేష్, అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, రాయలసీమ యూనివర్సిటీ వీసీ కృష్ణానాయక్, ఉస్మానియా విద్యా సంస్థల కరస్పాండెంట్ అజ్రాజావేద్, సీఐఎల్ మైసూరు డెరైక్టర్ అవదేశ్‌కుమార్ మిశ్రా, ప్రముఖ సాహితీ విమర్శకులు యోగి వేమన యూనివర్శిటీ తెలుగు శాఖాధిపతి రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి మాడభూషి సంపత్‌కుమార్, మారిషస్ ఆంధ్ర లలిత కళా సమితి అధ్యక్షులు సంజీవ నరసింహ అప్పడు, ఆర్యు రిజిస్ట్రార్ పుణ్యశేషుడు పాల్గొనున్నారు. సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు ఈ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలి. - డాక్టర్ ఎం.అన్వర్ హుసేన్, హెచ్ఓడీ, తెలుగు శాఖ,ఉస్మానియా కళాశాల డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే.. కర్నూలులో 1901 ఫిబ్రవరి 21న ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే ఉస్మానియా కళాశాల. 1912లో కర్నూలులోని మునిసిపల్ హైస్కూల్(మెయిన్)లో ఆయన పాఠశాల విద్యను అభ్యసించారు. మద్రాసు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డి.ఫిల్ పట్టా పొందారు. మద్రాసులోని మహమ్మదన్ కళాశాలలో అధ్యాపకులుగా, ప్రెసిడెన్సి కళాశాల అధ్యక్షులుగా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి, ప్రొఫెసర్ వైస్ చాన్స్‌లర్‌గా, ఉమ్మడి మద్రాస్రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులుగా పని చేసిన అబ్దుల్ హఖ్ కర్నూలు విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల స్థాపించాలని సంకల్పించారు. 1947లో అబ్దుల్ హఖ్ రాయలసీమ వాసుల ఉన్నత విద్య కోసం తొలిసారిగా ఉస్మానియా డిగ్రీ కళాశాలను స్థాపించారు. హంద్రీనదీ తీరంలో చారిత్రాత్మకమైన గోల్ గుంబజ్ కట్టడం పక్కనే అత్యంత ఆకర్షణీయంగా నిర్మింతమైన ఉస్మానియా కళాశాల అలనాటి విద్యార్థుల ఉన్నత విద్యా కలల సౌధమై నిలిచింది.