సాహితీ జ్ఞానపీఠం
కృష్ణాతీరం కళలకు కాణాచి. అంతేనా! కవులకు పుట్టినిల్లు. తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడి వారే. కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో 1895 సెప్టెంబర్ 10న పుట్టారు ఆయన. చాలా చోట్ల పనిచేసినా, తన జీవితకాలంలో ఆయన ఎక్కువగా విజయవాడలో గడిపారు. ‘విశ్వేశ్వర శతకం’తో 1916లో రచనా వ్యాసంగాన్ని చేపట్టిన విశ్వనాథవారు సాహితీ రంగంలో చేపట్టని ప్రక్రియ లేదు. రాశిలోను, వాసిలోను వన్నెతరగని రచనా వైదుష్యం ఆయనది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’తో ఆయనను జ్ఞానపీఠ్ అవార్డు వరించింది.
ఎక్కువగా గ్రాంథిక భాషలో రచనా వ్యాసంగాన్ని సాగించిన విశ్వనాథవారు ‘కిన్నెరసాని పాటలు’, ‘కోకిలమ్మ పెళ్లి’ వంటివి వ్యావహారికంలో రచించడం విశేషం. ఆనాటి యువతరాన్ని కిన్నెరసాని పాటలు ఉర్రూతలూపాయి. స్వాతంత్య్రపూర్వ భారతీయ మధ్యతరగతి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన బృహత్తర నవల ‘వేయిపడగలు’ ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలను సంపాదించిపెట్టింది.
ఇదే నవలను మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు హిందీలో ‘సహస్రఫణ్’ పేరిట అనువదించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావును తొలిసారిగా రంగస్థలంపైకి తీసుకొచ్చిన ఘనత విశ్వనాథ వారిదే. గుంటూరు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్ విశ్వనాథవారి శిష్యుడు. పల్నాటి చరిత్ర నేపథ్యంలో తాను రచించిన నాటకంలో విశ్వనాథవారు ఎన్టీఆర్ చేత నాగమ్మ పాత్ర వేయించారు. ఎన్టీఆర్ మీసాలు తీయడానికి నిరాకరిస్తే అలాగే మేకప్ వేసి, నాటకం ప్రదర్శించారు.
విశ్వనాథ వారు అరవై నవలలు, రెండువందల ఖండకావ్యాలతో పాటు పలు నాటకాలు, కథలు, రేడియో నాటకాలు, పరిశోధన వ్యాసాలు రచించారు. భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. సనాతన సంప్రదాయాలను గౌరవించే విశ్వనాథ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారు. అందువల్ల ఆయనను చాలామంది పాశ్చాత్య వ్యతిరేకి అనుకునేవారు. అయితే, ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా ఆమూలాగ్రంగా అధ్యయనం చేసేవారు.