
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది.
ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య
ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment