వినోద్‌కుమార్‌ శుక్లాకు జ్ఞానపీఠం | Hindi Writer Vinod Kumar Shukla Selected For 59th Jnanpith Award | Sakshi
Sakshi News home page

వినోద్‌కుమార్‌ శుక్లాకు జ్ఞానపీఠం

Published Sun, Mar 23 2025 4:38 AM | Last Updated on Sun, Mar 23 2025 4:38 AM

Hindi Writer Vinod Kumar Shukla Selected For 59th Jnanpith Award

న్యూఢిల్లీ: ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా(88) 59వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపిౖకైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మొట్టమొదటి రచయితగా నిలిచారు. అదేవిధంగా, ఈ అవార్డు స్వీకరించనున్న 12వ హిందీ రచయితగా నిలిచారు. కథలు, కవితలతోపాటు వ్యాస రచనలో ప్రజ్ఞాశాలి అయిన శుక్లా సమకాలీన గొప్ప హిందీ రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

అవార్డు కింద రూ.11 లక్షల నగదుతోపాటు సరస్వతీ మాత కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం అందుకోనున్నారు. ప్రముఖ కథా రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్‌ సారథ్యంలో జ్ఞానపీఠ ఎంపిక కమిటీ సమావేశమై వినోద్‌కుమార్‌ శుక్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. హిందీ సాహిత్యంలో సృజనాత్మకత, విలక్షణమైన రచనాశైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషిని గుర్తిస్తూ శుక్లాను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాధవ్‌ కౌశిక్, దామోదర్‌ మౌజో, ప్రభా వర్మ, అనామిక, ఎ.కృష్ణారావు, ప్రఫుల్‌ శిలేదార్, జానకీ ప్రసాద్‌ శర్మతోపాటు కమిటీ డైరెక్టర్‌ మధుసూదన్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.

‘ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికవుతానని ఎన్నడూ అనుకోలేదు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. రచనా వ్యాసంగం ఇకపైనా కొనసాగిస్తా. ముఖ్యంగా చిన్నారుల కోసం రచనలు చేస్తా’అంటూ వినోద్‌ కుమార్‌ శుక్లా స్పందించారు. తన విలక్షణమైన భాషా పటిమ, లోతైన భావోద్వేగాలకు పేరుగాంచిన శుక్లా ‘దీవార్‌ మే ఏక్‌ ఖిడ్కీ రహతీ థీ’ పుస్తకానికి 1999లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

శుక్లా రచించిన నౌకరీ కీ కమీజ్‌(1979) అనే నవల అనంతరం మణి కౌల్‌ సినిమాగా తీశారు. సబ్‌ కుచ్‌ హోనా బచా రహేగా(1992)అనే కవితా సంకలనం ఆయనకు ఎంతో పేరు తెచి్చపెట్టింది. భారతీయ రచయితల కోసం 1961లో నెలకొల్పిన జ్ఞానపీఠ అవార్డును మొట్టమొదటిసారిగా 1965లో ‘ఒడక్కుజల్‌’అనే కవితా సంకలం వెలువరించిన మలయాళ కవి జి. శంకర కురూప్‌ అందుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement