Gulzar
-
పైజామా జేబులో బొంగరం
‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’... గుల్జార్ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్‌లో గుల్జార్ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు. సిక్కులు కష్టజీవులు. గుల్జార్ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్‌గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్‌కు కరెంటు లేని స్టోర్‌రూమ్ ఇవ్వబడింది. ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్ పఠనం స్టోర్‌రూమ్‌లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్ టాగోర్’ అంటాడు గుల్జార్. ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్‌కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్ సొట్టలుపోయిన కార్లకు పెయింట్ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్‌లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్ రాయ్‌కు పరిచయం చేశాడు. ‘కార్లకు పెయింట్ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్ రాయ్ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్ లైలె’. తర్వాత గుల్జార్ హృషీకేశ్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్ జైత్రయాత్ర. గుల్జార్ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్ డైరెక్టర్... ‘హర్ ఫన్ మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్. అయితే మన దేశంలో పాప్యులర్ కల్చర్‌లో ఉన్న వ్యక్తి సీరియస్ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు. గుల్జార్ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే కారణం. చిత్రమేమిటంటే గుల్జార్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు. ‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు. కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్ ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు. -
Jnanpith Awards 2023: గుల్జార్, రామభద్రలకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
ఆ విషయాన్ని సిగ్గులేకుండా అడిగేశా: విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్లో విద్యాబాలన్‌కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది. (ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్‌కు, నాకు పోలికే లేదు) విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్‌తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు. 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి) -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్‌కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. -
AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’
‘ఇప్పటివరకూ చాలా విన్నారు ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ అని భూమి తల్లి పిలుస్తోంది. ‘ఈ జగతి ఆశతో నిండి ఉంది. ఈ నేల నీలిమతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత పడండి’ అని చెబుతోంది. మహమ్మారి రోజులలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్ రాసిన ‘మేరి పుకార్ సునో’ పాటను రహమాన్ కంపోజ్ చేశారు. ఆరుగురు గాయనులు గానం చేశారు. ఈ కాలానికి అవసరమైన గీతం ఇది. కరోనా మహమ్మారి వేళ ప్రజలందరూ ధైర్యాన్ని కోల్పోయారు. స్థయిర్యాన్ని జార్చుకున్నారు. వారిని తిరిగి వారిలా చేయాలి. అందుకు అమ్మే పూనుకోవాలి. అలా భూమి తల్లి తన పిల్లలకు ధైర్యం చెప్పడానికి పిలుస్తున్న పిలుపునే ‘మేరి పుకార్ సునో’ పాటగా ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాశారు. మరో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రహమాన్ ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీమణులు– అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషాల్, సాధనా సర్గం, చిత్ర, షాషా తిరుపతి, అసీస్ కౌర్ ఆ భూమితల్లికి గొంతునిచ్చారు. సోనీ మ్యూజిక్ ఈ పాటను విడుదల చేసింది. ఈ వెలుతురు తీసుకోండి గుల్జార్ ఈ పాటను గొప్పగా రాశారు. ‘నా నేల మీది బతికే పిల్లలారా... నా మాట వినండి... ఇప్పటి దాకా చాలా విన్నారు... ఈసారి నన్ను వినండి’ అనే పల్లవితో మొదలెట్టారు. చరణంలో భూమి తల్లి చేత ‘సూర్యుని దగ్గర ఎంతో వెలుతురు ఉంది. తీసుకొని పంచుకోండి. ఆకాశం నిండా గాలే. గుండెల నిండా పీల్చుకోండి’... అని అనిపిస్తారు. రెండో చరణంలో ‘ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒక్కటి మీది... ఎన్ని మోకరింపులు ఎన్ని ప్రార్థనలో దీని మీద... జీవితం చాలా ఉంది... మీ మీ మట్టి పొత్తిళ్లను జీవితంతో నింపుకోండి’... అని రాశారు. ఇలా పాటంతా భూమి తన పిల్లలతో మాట్లాడుతుంది. ఏమిటి సందేశం? ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరిలో సంవేదన ఉంది. అయినా పర్వాలేదు. అందరం ఒక్కతాటిపై రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా నిలవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు... మానవులు ఎన్నో కష్టాలు దాటి వచ్చారు... ఈ కష్టం కూడా దాటేస్తారు... అందుకు భూమి తల్లే సాక్ష్యం... అని ఈ పాట చెబుతోంది. ‘ఈ పాట ఒక స్వాంతనం... ఓదార్పు. భూమి తల్లి తన కూతుళ్ల (గాయనుల) ద్వారా జనంతో మాట్లాడుతోంది. ఆమె గొంతును మహిళా సింగర్లు తప్ప ఇంకెవరు వినిపించగలరు. గుల్జార్ గారూ నేను కలిసి చేసిన ఆలోచన ఈ పాట’ అని దీనిని కంపోజ్ చేసిన ఏ.ఆర్.రహమాన్ అన్నారు. ‘ఈ నేల మన నుంచి వాగ్దానం అడుగుతోంది... జీవితాన్ని కోల్పోవద్దని. మనమంతా భూమికి వాగ్దానం చేయాలి... అవును.. మేము లేచి నిలబడతాం... ఈ గాలులు వీచనిస్తాం... ఈ కెరటాలు విరిగి పడుతూనే ఉండేలా చూస్తాం అని చెప్పాలి. ఆ మాటలే పాటలో రాశాను’ అంటారు గుల్జార్. బాధను మర్చిపోవడానికి ‘ఈ లాక్డౌన్ల కాలంలో ఇంట్లోనే ఉండటం కొన్నాళ్లు బాగానే ఉండింది. కాని ఆ తర్వాత బాధ మొదలైంది’ అంటారు చిత్ర. ఆమె ‘మేరి పుకార్ సునో’ పాటలో దక్షణాది ప్రతినిధిగా కనిపిస్తారు. ‘నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. ఎందుకంటే నా కూతురు నందన (మరణించింది) జ్ఞాపకాలు చుట్టుముడతాయి’ అంటారామె. ‘నాలాగే ఎందరో ఈ కరోనా కాలంలో ఎంతో బాధను, కష్టాన్ని భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పాటలాంటిది ఒక పెద్ద ఓదార్పు. రహమాన్ ఎప్పుడు పాడమన్నా నేను మూడు నాలుగు రకాలుగా పాడి వినిపిస్తాను. ఈసారి నేరుగా రికార్డింగ్ లేదు. ఇంటి నుంచి పాడి పంపించాను.’ అన్నారు చిత్ర. ‘అయినవారిని కోల్పోవడం కంటే మించిన బాధలేదు. నా కూతురు మరణించాక అలాంటి దుఃఖమే ఎదురైన వారు నా దగ్గరికొచ్చి ఆ బాధ ఎలా మర్చిపోవాలో చెప్పమ్మా అని అడుగుతుంటారు. నేనేం చెప్పగలను? పనిలో పడితే అదే కొంచమైనా తగ్గుతుంది అంటాను. నా కూతురు పోయిన దుఃఖాన్ని పనిలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాను. కాని అప్పుడప్పుడు కడుపు భగ్గుమన్న భావన కలుగుతూనే ఉంటుంది’ అంటారు చిత్ర. కష్టకాలంలో కళే మనిషికి ఓదార్పు. ఈ సమయంలో ఇలాంటి పాట స్త్రీల గొంతుక నుంచి వినడం నిజంగానే ఒక అమ్మ నుంచి విన్న నిశ్చింత. తల్లి ఒడిలో తల పెట్టుకున్నంత నెమ్మది. ఇక ఏ భయం లేదన్న దిటవు. ఆ దిటవే ఇప్పుడు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్ నటి
ముంబై: సినీ గేయ రచయిత గుల్జార్‌ను కలిసి తన జీవతచరిత్రను అందజేసినట్లు సీనియర్ నటి నీనా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖంపై నవ్వుతో పాటు, కాస్తంత భయాన్ని కూడా చూశానని సరదాగా వ్యాఖ్యానించారు. నీనా గుప్తా జీవితం సంచలనాలకు కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే. విండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం ఆమె.. పెళ్లికాకముందే ఆయన బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు మసాబాగా నామకరణం చేసి ఒంటరిగానే ఆమె బాధ్యతలు స్వీకరించి, తనను పెంచి పెద్ద చేసి.. డిజైనర్‌గా స్థిరపడేలా ప్రోత్సాహం అందించారు. ఈ క్రమంలో నీనా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు కూడా. ఇక బాలీవుడ్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నీనా గుప్తా.. ఇటీవలే తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’ను విడుదల చేశారు. తన జీవితంలోని ముఖ్య విషయాలన్నింటినీ ఇందులో లిఖించుకున్న ఆమె.. తన ప్రియమైన వ్యక్తులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని గుల్జార్ నివాసంలో ఆయనను కలిసిన నీనా గుప్తా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గేటు బయటే గుల్జార్‌ను కలిసిన ఆమె.. ‘‘ చదివి ఎలా ఉందో చెప్పండి.. నిజం చెప్పాలంటే ఆయన సంతోషించారు.. అలాగే భయపడ్డారు కూడా’’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. అందుకే నాపై ఆయన అరిచారు.. తన ఆటోబయోగ్రఫీలో ఎన్నెన్నో విషయాలు వెల్లడించిన నీనా గుప్తా.. దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఖల్నాయక్ సినిమాలో చోళీ కే పీచే క్యా హై పాట కోసం.. నిండుగా కనిపించాలంటూ అరిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నా అవుట్‌ఫిట్ చూసి ఆయన పెద్దగా అరిచారు. పాట అర్థానికి తగ్గట్టుగా వక్షస్థలం నిండుగా కనిపించేలా చూసుకోమని సూచించారు. ఆ మాట వినగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నిజమే కదా.. అనిపించింది. మరుసటి రోజు.. లోదుస్తులతో ఆ ఖాళీని పూడ్చి షూట్‌కు వెళ్లాను. చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అందుకే గొప్ప డైరెక్టర్ గుర్తింపు పొందారు’’ అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) చదవండి: సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి -
పెళ్లయ్యాక నువ్వు సినిమాల్లో నటించకూడదు
ఏక్‌సౌ సోలహ్ చాంద్ కీ రాతే .. ఏక్ తుమ్హారే కాంధే కా తిల్ గీలీ మెహందీ కీ ఖుష్బూ .. ఝూఠ్మూఠ్ కే శిక్వే కుఛ్.. ఝూఠ్మూఠ్కే వాదే భీ సబ్ యాద్ కరాదో సబ్ భిజ్వాదో మేరా వో సామాన్ లౌటా దో.. (నూటా పదహారు వెన్నెల రాత్రులు.. నీ భుజమ్మీది మచ్చ.. తడి ఆరని గోరింటాకు పరిమళం.. కల్లబొల్లి కబుర్లు, బాసలు... అన్నీ గుర్తు చేయ్.. వాటన్నిటినీ పంపించేయ్ నా సామాన్లతోపాటే) ఇది ‘ఇజాజత్’ సినిమాలో గుల్జార్ రాసిన ‘మేరా కుఛ్ సామాన్’ పాటలోని ఒక చరణం. ‘చాలా కవితలను ఆయన తన భార్య రాఖీని దృష్టిలో పెట్టుకొని.. ఆమె కోసమే రాస్తాడు’ అంటారు గుల్జార్‌ను ఎరిగిన వాళ్లు. ‘ఈ పాట కూడా అంతే.. ఫిమేల్ వెర్షన్లో వినిపించే గుల్జార్ మనసు’ అంటారు. రాఖీ.. గుల్జార్.. నటనతో ఆమె.. పాటలు, దర్శకత్వంతో అతను బాలీవుడ్‌కి సంతకాలయ్యారు. రాఖీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే కవిగా, రచయితగా, దర్శకుడిగా గుల్జార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తక్కువ కాలంలోనే రాఖీ కూడా బెస్ట్ హీరోయిన్గా.. గోల్డెన్ గర్ల్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది. రాఖీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేనాటికే ఆమెకు బెంగాలీ డైరెక్టర్ అజయ్ బిశ్వాస్‌తో పెళ్లి, విడాకులూ అయిపోయాయి. ఒక పార్టీలో.. సినీ ప్రముఖుల ఒక పార్టీలో గుల్జార్‌కి రాఖీని పరిచయం చేశారు ఎవరో. అతని బహుముఖ ప్రజ్ఞకు దాసోహమైంది రాఖీ. బెంగాలీ సంస్కృతి మీదున్న వల్లమాలిన అభిమానంతో ఆమె బెంగాలీ చార్మ్‌ను ఇష్టపడ్డాడు గుల్జార్. అది ప్రేమగా మారింది. పెళ్లితో కలిసి ఉండాలనుకున్నారు. ‘అయితే..’ అంటూ ఆగాడు గుల్జార్. ‘చెప్పండి.. ’ అంది రాఖీ. ‘పెళ్లయ్యాక నువ్వు సినిమాల్లో నటించకూడదు’ చెప్పాడు అతను. ‘సరే’ అంది రాఖీ. 1973లో పెళ్లి చేసుకున్నారు. గుల్జార్ నాయికగా.. సంతోషంగా మొదలైంది వాళ్ల వైవాహిక జీవితం. పెళ్లి తర్వాత నటించను అని రాఖీ నిర్ణయం తీసుకున్నా దర్శకనిర్మాతల అభ్యర్థనలు ఆగలేదు. మౌనంగానే ఉండిపోయింది రాఖీ. గుల్జార్ తన సినిమాల్లో ఆమెను కథానాయికగా తీసుకుంటాడని ఎదురుచూడసాగింది. బయటి సినిమాలు చేయొద్దన్నాడు కాని తన సినిమాల్లో చాన్స్ ఇస్తాడనే నమ్మకంతో. ఉండబట్టలేక అడిగేసింది కూడా భర్తను. ‘నో చాన్స్’ అన్నాడు గుల్జార్. అప్పుడు బయటి నుంచి వస్తున్న అవకాశాల గురించీ చెవినేసింది. వినిపించుకోకపోగా విసుక్కున్నాడతను. నొచ్చుకుంది ఆమె. పెళ్లయిన ఏడాదిలోపే మేఘనా పుట్టింది. దాంతో సినిమాల్లో నటించడం ఇంక మరిచిపోతుందనే నిశ్చింతతో ఉన్నాడు గుల్జార్. ఆంధీ.. గుల్జార్ దర్శకత్వంలో ‘ఆంధీ’ షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. రాఖీని కూడా తీసుకెళ్లాడు అతను. ఒకరోజు షూటింగ్ పూర్తయ్యాక సినిమా టీమ్ అంతా పార్టీ చేసుకుంటున్నారు. సంజీవ్ కుమార్ బాగా మందు తాగాడు. ఆలస్యమవుతోందని ఆంధీ హీరోయిన్ సుచిత్రా సేన్ పార్టీ నుంచి నిష్క్రమించడానికి లేచింది. ఇంకాసేపు ఉండమంటూ ఆమె చేయి పట్టుకున్నాడు సంజీవ్ కుమార్. సున్నితంగా వారించింది సుచిత్రా. మరింత బెట్టు చేశాడు సంజీవ్. ఇబ్బంది పడసాగింది సుచిత్రా. గ్రహించిన గుల్జార్ .. సంజీవ్ కుమార్ నుంచి నెమ్మదిగా సుచిత్రా చేయి విడిపించి ఆమెను ఆమె గదిలో దిగబెట్టాడు. అది గమనించిన రాఖీ.. సుచిత్ర గదిలో ఏం చేస్తున్నారని భర్తను ప్రశ్నించింది. చిర్రెత్తుకొచ్చింది గుల్జార్‌కు. ‘అందరి ముందు ఏంటిది?’ అన్నాడు. ‘జవాబు చెప్పండి’ అంటూ నిలదీసింది. అంతే కోపంతో ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు గుల్జార్. అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది రాఖీ. మళ్లీ సినిమాల్లోకి.. ఆ తెల్లవారే ‘కభీ కభీ’ కోసం రాఖీని ఒప్పించాలనే నిర్ణయంతోపాటు.. సినిమా కోసం లొకేషన్‌నూ చూసుకోవచ్చనే ఉద్దేశంతో కశ్మీర్ వచ్చాడు యశ్ చోప్రా. రాఖీని కలిసి ‘కభీ కభీ’లో నటించమని కోరి, గుల్జార్ దగ్గర అనుమతీ తీసుకోనున్నాని చెప్పాడు యష్. ‘ గుల్జార్‌ను అడగఖ్ఖర్లేదు..నేను నటిస్తున్నాను’ అంది రాఖి. ఆ నిర్ణయం గుల్జార్‌ను ఖిన్నుడిని చేసింది.. రెండేళ్ల ఆ వివాహ బంధాన్ని విడగొట్టింది. గుల్జార్ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది రాఖీ. సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది. ► ‘మేమిద్దరం ఒకరికొరం ఎప్పటికీ ఉన్నాం. నిజానికి మాకు బెస్ట్ స్ప్లిట్ కపుల్ అవార్డ్ ఇవ్వాలి’ అంటుంది రాఖీ. ► ‘మేమిద్దరం ఒకే ఇంట్లో లేకపోయినా అభిప్రాయభేదాలు, గొడవలు, పంతాలు పట్టింపులు, ఆనందాలు.. అన్నిటినీ కలిసే పంచుకుంటున్నాం. దీన్ని మించిన దగ్గరితనం, అనుబంధం ఇంకేం ఉంటుంది?’ అంటాడు గుల్జార్. బెస్ట్ స్ప్లిట్ కపుల్ వాళ్లిద్దరు విడాకులు తీసుకోలేదు. కలిసి ఒక ఇంట్లో ఉండనూ లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహితులుగా మిగిలిపోయారు. అలా కలిసి ఉంటూ విఫలమైన తమ ప్రేమను సఫలం చేసుకుంటోంది ఆ జంట. -ఎస్సార్ -
గుల్జార్ ఆకుపచ్చ కవితలు
ముసాఫిర్ హూన్ యారో నా ఘర్ హయ్ నా టిఖానా నాలుగు దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్’ సినిమాలోని పాటతో గుల్జార్‌తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. బినాకా గీత్ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీ వెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. అప్పుడే వచ్చిన ‘ఆనంద్’ సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావం చూపించింది. ‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహీ’ ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’ ‘మౌత్ తో ఏక్ పల్ హై’ లాంటి గుల్జార్ మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తూనే వుంటాయి. (జీవితం ఉన్నతమైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు; బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను; మరణం ఒక క్షణమే). అట్లా గుల్జార్‌తో మొదలయిన ప్రయాణం కోషిశ్, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్... ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది సినిమాలతో ఆగలేదు, ఆయన కవిత్వం వైపు మరలింది. ‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’ ‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’ ఇట్లా ఇన్నో పంక్తులు ఎవరినయినా పట్టేస్తాయి. ఆయన గజల్స్, కవితల అనువాదాలు ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ‘గ్రీన్ పొయెమ్స్’తో థ్రిల్ అయ్యాను. గుల్జార్ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరళత్వమూ, సూటితనమూ ఈ కవితల్లో నిండుగా వున్నాయి. ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. అనువాదం చేస్తున్నాను, పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జా్జర్కి మెయిల్ రాశాను. వెంటనే జవాబు వచ్చింది, మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తయింది. గ్రీన్ పొయెమ్స్ మూలం హిందీ. ఆ కవితల్ని పవన్ వర్మ ఇంగ్లిష్‌లోకి చేశారు. పవన్ వర్మ మౌలికంగా కవి. ఐ.ఎఫ్.ఎస్. అధికారి అయిన ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో ఈ ఇంగ్లిష్ అనువాదం ఎంతో తోడ్పడింది. -వారాల ఆనంద్ మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. గుల్జార్ -
'నా ఆలోచన కలంతోనే మొదలైంది'
కోల్‌కతా: తన ఆలోచన కలంతోనే ప్రారంభమైందని బాలీవుడ్ ప్రముఖ హిందీ సినీ గేయాలు, కవిత్వాల రచయిత గుల్జార్ అన్నారు. దాదాపుగా అర్థశతాబ్దకాలం నుంచి కవిత్వాలు, సినిమా గీతాలు రాస్తున్న ఆయన ఇప్పటికీ కూడా పెన్ను పేపర్ నే ఉపయోగిస్తున్నారట.' నా ఆలోచన విధానం మొదలైంది కలంతోనే. అందుకే రచనలకోసం ఎవరెవరు ఏం ఉపయోగించినా నేను మాత్రం ఇప్పటికి కాగితం, కలాన్ని నాతో ఉంచుకుంటాని అని చెప్పారు. తాను కంప్యూటర్ను, టాబ్లెట్‌ను ఉపయోగించనని చెప్పారు. అయితే, ఉర్దూలో సైతం చేతివ్రాతతోనే రాసే తాను కంప్యూటర్ పై రాసే వారిని కూడా గౌరవిస్తానని చెప్పారు. తాను గతంలో జీవించే మనిషిని కాదని, ఇప్పటి తరంతో కలిసి కూడా సాగగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. కజరారే, బీడీ జలై లే, జయహోవంటి ఎన్నో గొప్పగొప్ప లిరిక్స్ ఆయన రాశారు. -
షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్‌ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని.... హైదరాబాద్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్‌షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. నడిపించే శక్తి.. ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు. నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి ! ..:: సరస్వతి రమ -
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే
క్రీడలు .ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా ధోని ఐసీసీ ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపికయ్యాడు. ధోనితోపాటు మరో ముగ్గురు భారత క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్‌లకు కూడా ఈ జట్టులో స్థానం లభించింది. విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా శిఖర్ ధావన్ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌తోపాటు మరో నలుగురు క్రికెటర్లు.. ర్యాన్‌హారిస్ (ఆస్ట్రేలియా), క్రిస్‌రోజర్స్ (ఆస్ట్రే లియా), జో రూట్ (ఇంగ్లండ్), ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ ఎడ్వర్డ్స్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013లో కనబరిచిన ఉత్తమ ఆటతీరుకు వీరిని ఎంపిక చేశారు. విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నిలిచాడు. మానవ్‌జిత్‌కు స్వర్ణం ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ పురుషుల ట్రాప్ విభాగంలో భారత షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధు స్వర్ణం సాధించాడు. సంధు నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్లోను విజేతగా గెలిచాడు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన మైకేల్ డైమండ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20 టోర్నీ విజేతగా బరోడా జట్టు నిలిచింది. ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది. దక్షిణాసియా జూడోలో భారత్‌కు పది స్వర్ణాలు నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగిన దక్షిణాసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఏప్రిల్ 10 నుంచి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతో పాటు చెరో రజతం, కాంస్యం సాధించింది. టెక్సాస్ రన్నరప్ దీపిక భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ టెక్సాస్ ఓపెన్‌టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్‌ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక ఓడిపోయింది. జాతీయం ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 7న చేరింది. ఈ రైలు డెకర్గావ్ (అసోం) నుంచి ఇటానగర్‌కు సమీపం లోని నహర్లగున్కు చేరింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ 2008 జనవరి 31న ప్రకటించిన ప్యాకేజీలో ఈ రైలు సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో భారత రాజధాని న్యూఢిల్లీతో అనుసంధానిస్తూ రైల్వే సర్వీసులను ప్రవేశపెడతామని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌తుకీ ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించిన ‘హార్ట్‌బ్లీడ్ వైరస్‘ అత్యంత ప్రమాదకరమైన హార్ట్‌బ్లీడ్ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తోంది. హార్ట్‌బ్లీడ్ వైరస్‌తో లక్షలాది పాస్వర్డలు, క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని హ్యాకర్లు తేలిగ్గా చేజిక్కించుకోగలుగుతారు. హ్యాకింగ్‌పై పోరాడుతున్న భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం ఈ వైరస్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుమానిత ఈ-మెయిళ్లు, సందేశాలు,ఆడియో, వీడియో క్లిప్‌లు, ఈ-లింకులను వెంటనే తొలగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వినియోగదారులు తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని, ఓపెన్ ఎస్.ఎస్.ఎల్ ను 1.0.1జి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్,ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సైబర్ భద్రతా సంస్థ సూచిస్తోంది. ఉత్తమ రైల్వే స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో విజయవాడ ఉత్తమస్టేషన్‌గా ఎంపికైంది. అదే విధంగా పునర్నిర్మించిన ప్రాంగణాల్లో ఉత్త మ స్టేషన్ పురస్కారానికి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎంపికైంది. 59వ రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డులను ప్రక టించినట్లు రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. భారత వృద్ధిని అంచనావేసిన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ రేటును 2013లో 4.4 శాతం, 2012లో 4.7 శాతంగా పేర్కొంది. 2015-16 వృద్ధిని 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇది లా ఉండగా.. 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఏప్రిల్ 9న విడుదల చేసిన సౌత్ ఏసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బలపడుతున్న రూపాయి మారకపు విలువ, పలు భారీస్థాయి పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం లభించడంతో వృద్ధి రేటులో అనుకూలత చోటుచేసుకుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు తెలిపాయి. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం బ్లాక్-3 రకానికి చెందిన ఆధునీకరించిన అణ్వాయుధ సామర్థ్యం గల సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఏప్రిల్ 7న సైన్యం పరీక్షించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ఈశాన్యప్రాంత రాష్ట్రాల్లో చైనా చొరబాటును ఎదుర్కొనేందుకు పర్వత ప్రాంతాల్లో వినియోగించడానికి అనువుగా బ్లాక్-3 రకానికి చెందిన క్షిపణిని తీర్చిదిద్దారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకొనేందుకు భారత్ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ ను పశ్చిమ బెంగాల్‌లోని పానాఘర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన బ్రహ్మోస్‌ని ఇక్కడే మొహరిస్తారు. బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యానికి అప్పగించారు. దీన్ని ఉపరితలం, జలాంతర్గామి, ఆకాశం నుంచి ప్రయోగించేందుకు అనువుగా రూపొందించారు. బ్రహ్మోస్‌ను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వార్తల్లో వ్యక్తులు విజ్డ్డన్ ముఖచిత్రంపై సచిన్ విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్-2014 పుస్తకం 151వ సంచిక ముఖచిత్రంపై భారత మాజీ క్రికెటర్ సచిన్టెండూల్కర్ చిత్రాన్ని ప్రచురించింది. తద్వారా ఈ అల్మనాక్ పుస్తకంపై ముఖచిత్రంగా ప్రచురితమైన తొలి భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఈ పుస్తకం ఏప్రిల్ 10న లండన్‌లో విడుదలైంది. ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ రోహిణి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్రకెక్కారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తికి దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏప్రిల్ 11న ఆమోదముద్ర వేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోథా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోథా (64) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 27న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం తరువాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.ఎం.లోథాయే అత్యంత సీనియర్ న్యాయమూర్తి. వయో పరిమితి రీత్యా లోథా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనుండటంతో ఐదు నెలల కాలమే ఈ పదవిలో కొనసాగనున్నారు. జోధ్‌పూర్‌లో జన్మించిన లోథా రాజస్థాన్, బాంబే హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పాట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 డిసెంబర్ 27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు బృందానికి లోథాయే నేతృత్వం వహిస్తున్నారు. ఔషధ పరీక్షలకు సంబంధించిన కేసులనూ ఆయన నేతృత్వంలో ధర్మాసనమే విచారించింది. అలాగే మైనారిటీ పాఠశాలల్లో విద్యా విధానాలను పరిశీలించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలోనూ లోథా ఉన్నారు. నాస్కామ్ చైర్మన్‌గా ఆర్.చంద్రశేఖరన్ కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛీఫ్‌మేనేజింగ్ డెరైక్టర్ అయిన బీవీఆర్ మోహన్‌రెడ్డి నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అవార్డులు గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రముఖ కవి, సినీ గేయరచయిత, దర్శక-నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు, కథ, మాటల రచయితగా , దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ పురస్కారాన్ని అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. అవార్డు కింద రూ. 10 లక్షల నగదుతోపాటు స్వర్ణకమలం అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్‌సర్‌లో స్థిరపడింది. 2002లో ఆయనకు సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు గాను ఏఆర్‌రెహ్మాన్‌తో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది. రతన్‌టాటాకు బ్రిటిష్ అవార్డు టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాస్ లభించింది. బ్రిటన్, భారత్‌ల మధ్య సంబంధాలు, బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ఏప్రిల్10న ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీస్ వెల్లడించింది. 2014కి ఐదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటీష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్‌టాటా ఒకరు. 2009లో టాటాకు నైట్ కమాండర్ అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది. విజయ్ శేషాద్రికి పులిట్జర్ భారత సంతతికి చెందిన విజయ్‌శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. శేషాద్రి కవితా సంకలనం ‘3-సెక్షన్స్’ కుగాను ఈ పురస్కారం లభించింది. 98 వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ఎంపిక కమిటీ జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రకటించింది. అవార్డు కింద 10 వేల డాలర్లను అందజేస్తారు. శేషాద్రి 1954లో బెంగళూర్‌లో జన్మించారు. అమెరికాలోని కొలంబియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో సారాలారెన్స్‌లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో పద్యవిభాగంలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అంతర్జాతీయం స్వాతంత్య్రం ప్రకటించుకున్న తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్ తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్‌లో రష్యా అనుకూల కార్యకర్తలు ఏప్రిల్ 7న ఉక్రెయిన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. డొనెస్క్‌లోని ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ డొనెస్క్‌ను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ నుంచి విడిపోతున్న్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజాభిప్రాయం సేకరించి మే 11 లోగా రష్యాలో చేరాలని పీపుల్స్ కౌన్సిల్ నిర్ణయించింది. -
గుల్జార్‌కు ఫాల్కే పురస్కారం
అవార్డు కింద స్వర్ణకమలం.. రూ. 10 లక్షల నగదు ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగానికి సేవ చేసిన గుల్జార్ న్యూఢిల్లీ: ‘తుజ్సే నారాజ్ నహీ..’, ‘తెరె బిన జిందగీ సే..’ లాంటి మధురమైన పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఐదు దశాబ్దాలకుపైగా తన సాహిత్యంతో గుల్జార్ సినీ ప్రేక్షకులనే కాక.. ఆసేతు హిమాచలాన్నీ మైమరపింపజేశారు. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలతోనే కాదు.. కథ, మాటల రచయితగా.. దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కేకు 2013 సంవత్సరానికి గుల్జార్‌ను ఏడుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 45వ ప్రజ్ఞాశాలి గుల్జార్. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలంతో పాటు, పది లక్షల రూపాయల నగదు పురస్కారం, శాలువా అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలు పేరు సంపూరణ్‌సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్సర్ చేరింది. అయితే గుల్జార్ ముంబై చేరుకుని గ్యారేజ్ మెకానిక్‌గా పనిలో చేరారు. ఖాళీ సమయంలో కవిత్వం రాసేవారు. 1956లో సినీ గేయ రచయితగా గుల్జార్ సినీ జీవితం ప్రారంభమైంది. బిమల్ రాయ్ చిత్రం ‘బందినీ’తో గుల్జార్ దశ తిరిగింది. ఆ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత ఎస్డీ బర్మన్, సలీల్ చౌధురి, శంకర్ జైకిషన్, హేమంత్ కుమార్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, మదన్ మోహన్, రాజేశ్ రోషన్, అనూ మాలిక్, శంకర్-ఎహ్సాన్-లాయ్ తదితర ప్రముఖ సంగీత దర్శకులతో కలసి పని చేశారు. ఆర్డీ బర్మన్, ఏఆర్ రెహ్మాన్, విశాల్ భరద్వాజ్‌తో కలసి పలు అల్బమ్‌లకు, ప్రోగ్రామ్‌లకు ఆయన పనిచేశారు. దర్శకుడిగానూ ఎన్నో కళాత్మక చిత్రాలను రూపొందించారు. 1971లో ‘మేరే ఆప్నే’ చిత్రంతో గుల్జార్ తొలిసారి మెగాఫోన్ చేపట్టారు. పరిచయ్, కోషిష్, ఆంధ్రీ, మౌసమ్, అంగూర్, నమ్ఖీన్, ఖుష్బూ వంటి మేటి చిత్రాలు రూపొందించారు.ఆయన చివరిసారిగా టబు నటించిన ‘తుహుహు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నటి రాఖీని గుల్జార్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మేఘనా. మేఘనకు ఏడాది వయసు ఉండగా రాఖీ, గుల్జార్ విడిపోయారు. తండ్రిబాటలోనే నడిచిన మేఘన ఫిల్హాల్, జస్ట్ మ్యారీడ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 2002లో గుల్జార్‌ను సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. ఆయన అందుకున్న జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులకు లెక్కలేదు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జయ హో’ పాటకుగానూ ఏఆర్ రెహ్మన్‌తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది. గొప్ప గౌరవం: గుల్జార్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా గుల్జార్ స్పందిస్తూ.. ‘‘ఈ పురస్కారం దక్కడం గొప్ప గౌరవం. దీంతో పరిపుర్ణత సాధించినట్టు భావిస్తున్నా. ఇది ఒక పాట, స్క్రీన్ ప్లే రాసినందుకు వచ్చింది కాదు. ఒక వ్యక్తి చేసిన అన్ని సేవలకు దక్కిన గౌరవం. నన్ను ప్రేమించి, మద్దతు ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. గుల్జార్‌కు ఫాల్కే అవార్డు దక్కడంపై గాన కోకిల లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అనుపమ్ ఖేర్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. -
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
-
గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
ప్రముఖ సినీ గేయ రచయిత గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. దర్శకుడి, నిర్మాత, రచయిత, కథనం తదితర రంగాలలో భారతీయ సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా గుల్జార్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. భారతీయ సినిమా పురోగతికి విశేషమైన సేవలు అందించారని గుల్జార్‌ను ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. 45వ దాదాపాల్కే అవార్డును త్వరలో కేంద్ర ప్రభుత్వం గుల్జార్‌కు అందజేయనుంది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కర్లా.