గుల్జార్ ఇందర్ చహల్.. ఇన్‌సెట్‌లో హర్భజన్ సింగ్
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్‌లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి.
పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్‌కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు.
ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది.
ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment