ముసాఫిర్ హూన్ యారో
నా ఘర్ హయ్ నా టిఖానా
నాలుగు దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్’ సినిమాలోని పాటతో గుల్జార్‌తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. బినాకా గీత్ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీ వెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. అప్పుడే వచ్చిన ‘ఆనంద్’ సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావం చూపించింది.
‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహీ’
‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’
‘మౌత్ తో ఏక్ పల్ హై’
లాంటి గుల్జార్ మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తూనే వుంటాయి. (జీవితం ఉన్నతమైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు; బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను; మరణం ఒక క్షణమే).
అట్లా గుల్జార్‌తో మొదలయిన ప్రయాణం కోషిశ్, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్... ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది సినిమాలతో ఆగలేదు, ఆయన కవిత్వం వైపు మరలింది.
‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’
‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’
ఇట్లా ఇన్నో పంక్తులు ఎవరినయినా పట్టేస్తాయి. ఆయన గజల్స్, కవితల అనువాదాలు ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ‘గ్రీన్ పొయెమ్స్’తో థ్రిల్ అయ్యాను. గుల్జార్ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరళత్వమూ, సూటితనమూ ఈ కవితల్లో నిండుగా వున్నాయి. ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. అనువాదం చేస్తున్నాను, పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జా్జర్‌కి మెయిల్ రాశాను. వెంటనే జవాబు వచ్చింది, మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తయింది.
గ్రీన్ పొయెమ్స్ మూలం హిందీ. ఆ కవితల్ని పవన్ వర్మ ఇంగ్లిష్‌లోకి చేశారు. పవన్ వర్మ మౌలికంగా కవి. ఐ.ఎఫ్.ఎస్. అధికారి అయిన ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో ఈ ఇంగ్లిష్ అనువాదం ఎంతో తోడ్పడింది.
-వారాల ఆనంద్
మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి.
గుల్జార్
గుల్జార్ ఆకుపచ్చ కవితలు
Published Mon, Aug 13 2018 12:35 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment