అగుపించని ఆవలి పార్శ్వం
ఊహే కాని ఉనికి కాదు
ఈత తెలిసినా ఒడ్డు దొరకదు
రాలిపడ్డ కలలు పడవ లేకనే
పయనమైపోతాయి
ఆనవాళ్లు దొరకని
వెలుతురు గాయాలతో
దేహాత్మలు పోటెత్తే ప్రవాహాలవడం
మూడో కంటికి తెలియదు
శూన్య ముఖానికి వేలాడుతున్న
తనలో తాను లేనితనాన్ని
రెప్పవాల్చని రేయి ఇట్టే పసిగడుతుంది
రోజుకో రంగు పులమలేని నిస్సహాయత
మోదుగ స్రావాల గుట్టు విప్పదు
తడిసి మోపెడైన గుండె
యుద్ధమంటేనే గాయమని గుర్తుచేయదు
నిర్మలమైన నవ్వు లోతైన నిజాయితీ
నీడలు లేని నిజాలు కాలేవని తేలిపోయాక
కొనసాగింపు మాధ్యమం
మసక బారిపోతుంది
జీవితాన్ని కావలించుకున్న
చేతుల బిగి సడలిపోయాక
విషాదం విశాలంగా విస్తరిస్తుంది
గూడు చెదరిన దృశ్యాన్ని
అభావంగా చూసిన గుడ్డి లోకం
అసంపూర్ణ వాక్యానిది
హత్యా? ఆత్మహత్యా?
అన్న చర్చ మొదలెడుతుంది
♦శారద ఆవాల
ఇంకేం లేదు
Published Mon, Oct 19 2020 1:09 AM | Last Updated on Mon, Oct 19 2020 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment