వెలుతురు వెళ్లిపోయే వేళలో
గోడని తడుముతూ
గాయాల్ని లెక్కేస్తున్నాను
అటూ ఇటూ చూస్తూ
ఎటూ దూకలేక పిల్లి
గోడంతా ద్వేషపు జీర
చేయంతా నెత్తుటి వాసన
యుద్ధాల్ని లెక్కేస్తూ రేపటిని లెక్కగడుతుంటే
చిటికెడు రేపటిని మోసుకొచ్చి వాలిందో పిట్ట
మనుషులు పిట్టకథలు చెప్పుకుంటున్నట్టే
పిట్టలు మనుషుల కథలు చెప్పుకుంటాయంది
నాకూ చెప్పింది
ఇది తెలిసిన కథనే, తెలిసిన ప్రశ్నలే
తెలియనట్టు నటిస్తూ నడుస్తున్నామంతే
చెప్పుకుంటున్న అబద్ధాల్ని
ముక్కుతో పొడుస్తూ
గోడల్నీ, గాయాల్నీ
మనిషి కథగా విడిచింది
చిటికెడు గుండెలో
అశోకుని కన్నీటి బొట్లనీ
అక్కడే ఆరిన గొంతుల తడినీ
తనువంతా నెత్తురైన నేల శ్వాసనీ గుమ్మరించింది
మంచుకొండల్లోనూ, ఇసుకనేలల్లోనూ
మనిషి నిండని చోట
తుపాకీలు గీసిన గీతల గూర్చీ చెప్పింది
రాళ్లు విసిరే చేతులూ
గింజలు పరిచే గుండెలూ
తుపాకీల గీతలకు
ఇరువైపులా వున్నప్పుడు
అది ఏ విభజనకు సంకేతం!
సమాధానం వెతుక్కోమంటూ
పగుళ్లలో పొడుస్తూ చెప్పింది
పోతూ పోతూ
ఆకలి కోసం కాని పోరు
అసలు యుద్ధమెలా అవుతుందంటూ ఎగిరిపోయింది
అటూ ఇటూ కాకుండా
నింగినే చూస్తుంది పిల్లి
బహుశా పక్షవ్వాలన్న కల పుట్టిందేమో
- శ్రీ వశిష్ఠ సోమేపల్లి
Comments
Please login to add a commentAdd a comment