షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్‌ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్‌ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని....
హైదరాబాద్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్‌షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్‌మెంట్ అలాంటిది.
నడిపించే శక్తి..
ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు.
నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి !
..:: సరస్వతి రమ