హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
ఆయన కవి గాయక నట వైతాళికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నింటికీ మించి అరుదైన ఆత్మజ్ఞాని. ‘షేపర్ షేప్‌డ్’ కవితలో ‘ఐ హావ్ సీజ్‌డ్ టు బి ది పాటర్... అండ్ హావ్ లెర్న్‌డ్ టు బి ది క్లే’ అనడంలోనే కవి ఆత్మజ్ఞానం తేటతెల్లమవుతుంది. ఇంతకూ ఈ కవిత రాసినదెవరో కాదు, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ సరోజినీ నాయుడు చిన్న తమ్ముడు, అఘోరనాథ ఛటోపాధ్యాయ ఆఖరి కొడుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ. అక్క సరోజినికి దీటైన కవి ఆయన. అంతే కాదు, నటుడు, గాయకుడు, రాజకీయవేత్త, సంస్కరణాభిలాషి కూడా. హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే.
అఘోరనాథ ఛటోపాధ్యాయ, బరదాసుందరీ దేవి దంపతుల ఆఖరి సంతానంగా 1898 ఏప్రిల్ 2న పుట్టాడు. విదేశీ విద్యాభ్యాసం తర్వాత నిజాం ప్రభువు ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న అఘోరనాథ ఛటోపాధ్యాయ, ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించారు. అప్పట్లో అఘోరనాథ నివాసం వివిధ రంగాల మేధావులకు ఆలవాలంగా ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన హరీంద్రనాథ్ సహజంగానే కవిగా, మేధావిగా ఎదిగాడు. సన్నిహితులు ఆయనను హరీన్ అని పిలిచేవారు. తనకు ఊహ తెలిసినప్పటికే అక్క సరోజినీ దేవి కవయిత్రిగా ప్రసిద్ధురాలు కావడంతో హరీన్‌పై ఆమె ప్రభావం కూడా ఉండేది. అయితే, అక్క సరోజిని మాదిరిగా హరీన్ కవిత్వానికి, రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. సంగీతం, రంగస్థలం, సినిమాల్లోనూ తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నాడు.
రంగస్థలం మీదుగా బాలీవుడ్ ప్రస్థానం...
చిన్నప్పటి నుంచే రంగస్థల నటుడిగా గుర్తింపు పొందిన హరీన్, బాలీవుడ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టాడు. అబు హసన్ (1918), ఫైవ్ ప్లేస్ (1937), సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ పీస్ (1956) నాటకాలను స్వయంగా రచించి ప్రదర్శించాడు. గాయకుడిగా అప్పుడప్పుడు ఆకాశవాణి ద్వారా పాటలు వినిపించేవాడు. షష్టిపూర్తి దాటిన దశలో 1962లో తొలిచిత్రం ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో ఘరీబాబు పాత్రలో ఆకట్టుకున్నాడు. 1972లో రాజేశ్ ఖన్నా కథానాయకుడుగా నటించిన ‘బావార్చీ’లో ఉమ్మడి కుటుంబ పెద్ద ‘దాదూజీ’ పాత్ర హరీన్‌కు బాగా గుర్తింపు తెచ్చింది. మాతృభాష బెంగాలీలో ముచ్చటగా మూడు చిత్రాల్లో మాత్రమే నటించిన హరీన్, మొత్తం పాతిక లోపు చిత్రాల్లోనే నటించాడు. ‘తేరే ఘర్‌కే సామ్‌నే’లో సేఠ్ కరమ్‌చంద్, ‘ఘర్‌బార్’లో మిస్టర్ ఛద్దా, ‘ఆశీర్వాద్’లో బైజూ ఢోలకియా వంటి పాత్రల్లో హరీన్ విలక్షణ నటనను అప్పటి తరం ప్రేక్షకులు నేటికీ మరువలేరు. తొంభయ్యేళ్ల ముదిమిలో నటించిన మలామల్ (1988) ఆయన చివరి చిత్రం. సంగీతంలోనూ విశేష ప్రావీణ్యం గల హరీన్ ‘సూర్య అస్త్ హోగయా’, ‘తరుణ్ అరుణ్ సే రంజిత్ ధరణీ’ వంటి పాటలను రచించడమే కాకుండా, స్వరకల్పన కూడా చేశారు. ‘ఆకాశవాణి’లో ఆయన తరచూ ‘రైల్ గాడీ’ కవితను వినిపించేవారు. హిందీలో హరీన్ రాసిన పిల్లల పాటలు రవీంద్రనాథ్ టాగోర్‌ను సైతం మెప్పించాయి.
రాజకీయాల్లో స్వతంత్రుడు... అక్క సరోజినీ నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసినా, హరీన్ మాత్రం రాజకీయాల్లో స్వతంత్రుడిగానే కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చాక 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన హరీన్, పార్లమెంటులో ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ‘ఓ.. ది రైల్వే బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ ఫెయిర్.. ఇట్ డజ్ నాట్ టచ్ ది మినిస్టర్స్ హూ ఆల్వేస్ గో బై ఎయిర్’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఆయనవి ఇలాంటి చమక్కులెన్నో... పార్టీలకు అతీతంగా సభ్యులందరినీ అలరించేవి, ఆలోచింపజేసేవి.
- పన్యాల జగన్నాథదాసు