Sarojini Naidu
-
National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సమాజసేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా" ‘‘భారత కోకిల’’గాపేరొందిన సరోజినీ నాయుడు పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 13). మహిళా దినోత్సవంగా అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 వతేదీ గుర్తొస్తోంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టిన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ప్రతీక. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే ఆమె "లేక్ గర్ల్" అనే కవితను రాసింది.13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన 'లేడీ ఆఫ్ ది లేక్' కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకారం వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో అతని తొలి కవితా సంకలనం 'గోల్డెన్ థ్రెషోల్డ్' చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' బిరుదును ఇచ్చారు. గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు, యుకెలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు. 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1928లో ఇండియా వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఐ-హింద్ అవార్డుతో సత్కరించింది. జాతీయ పోరాటంలో, గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీని 21 నెలలు జైలులో పెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే సాహిత్యరంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు. ‘బర్డ్ ఆఫ్ ది టైం’, ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’, ‘దిఫెదర్ ఆఫ్ డాన్’ ‘గిఫ్ట్ ఆఫ్ ఇండియా’, ‘పాల్కీ క్యారియర్స్’ లాంచి రచనలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడేవారట అందుకే ఆమెను ‘భారత కోకిల’ అన్నారు. 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. -
ప్రశ్నించే నైజం: సరోజినీ నాయుడు
‘‘రాజకీయాలలో మీకు అంత ఆసక్తి ఎందుకు?’’ అని 1920లో జెనీవా సదస్సులో ఒకరు సరోజినీ నాయుడిని ప్రశ్నించారు. ‘‘నిజంగా భారతీయులైన వారందరికీ రాజకీయాలలో ఆసక్తి అనివార్యం’’ అని ఆమె బదులిచ్చారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన మహాత్మాగాంధీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతుండగా, సరోజినీ నాయుడు నేతృత్వంలో కొందరు మహిళా జాతీయవాదలు ఆ ఊరేగింపులో చేరారన్నది ఒక సన్నివేశంగా నా మనోపథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏంటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. ధైర్యం, దేనికీ తలవంచని తత్వం, జాతీయవాద ఉద్యమానికి కట్టుబడి ఉండటం, రాజకీయంగా సునిశిత ప్రతి.. అన్నీ ఆమె ప్రతిష్ట నుంచి పొంగి పొర్లుతాయి. ఆమె ఉప్పు సత్యాగ్రహంలోకి వచ్చేయడం చూసిన గాంధీజీ, ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను పలకరించారు. హైదరాబాద్‌లో జన్మించిన బాల మేధావి సరోజినీ చటోపాధ్యాయ. ఆమెకు కవిత్వం అంటే ప్రేమ. ఆమె సాహిత్యాభిరుచిని ప్రోత్సహించడంలో తల్లి, కవయిత్రి అయిన వరద సుందరీ దేవికి తండ్రి కూడా తోడు నిలిచారు. పై చదువుల కోసం ఆమెను ఇంగ్లండ్‌కి పంపారు. అక్కడి గోవింద నాయుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1898లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమె మద్రాసులో ఆయనను వివాహమాడారు. ఆ కాలంలో కులాంతర వివాహం సమాజానికి ఎదురీతే. మహిళల హక్కులు, స్వాతంత్య్రోద్యమానికి తొలినాటి ఉద్యమకారిణులలో ఆమె ఒకరు. హిందూ–ముస్లిం ఐక్యతను ప్రబోధించేవారు. 1947లో ఉత్తర ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలో ఆమె మొదటి మహిళా గవర్నర్. గవర్నర్‌గా ఉన్న సమయంలోనే 1949లో ఆమె అంతిమ శ్వాస విడిచారు. – ఊర్వశీ బుటాలియా, జుబాన్ బుక్స్ సంస్థ డైరెక్టర్ -
ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు
సాక్షి, హైదరాబాద్: నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల, ప్రముఖ కవయిత్రి, వక్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు అలుపెరగని పోరాటం చేసిన సరోజినీ నాయుడు 143వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ఆమెకు ఘనమైన నివాళి అర్పించింది. నగరంతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని స్మరించుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఆమె రాసిన కవితతో కూడిన పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఇది శాశ్వత స్ట్రక్చర్‌గా నిర్మించారు. ఒక స్టాండ్‌పై పుస్తకం, అందులో హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని పొందుపర్చారు. హైదరాబాద్ అంటే సరోజినీ నాయుడికి ఎంతో ఇష్టమనే విషయం పలు సందర్భాల్లో ఆమె రచనల ద్వారా వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌పై హృద్యమైన గేయాన్ని రాశారు. ఆమె జయంతి సందర్భంగా ఈ అపురూప కానుకను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు. (క్లిక్: వైన్‌షాప్ ఉండాలా.. వద్దా అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!) -
పరాయి పాలన నుంచి విముక్తికై..
భారతావని నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఎర్రకోటపై మువ్వన్నల జెండా రెపరెపలు చూసి భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మరి ఈనాటి ఈ సంతోషం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు ఎదురొడ్డి, వారు చేసిన అలుపెరుగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇక సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది మహిళామణులు కూడా విశేష పాత్ర పోషించారు. ‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించడానికి తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది ధీరోధాత్తలను నేడు స్మరించుకుందాం. ఆ ఆదిశక్తి స్వరూపాలను తలచుకుంటూ జై భరతనారీ అని నినదిద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి(1828-58) భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత, ‘ఝాన్సీ’కి రాణి మణికర్ణిక తాంబే. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి.(చదవండి: స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.(దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది) కస్తూర్బా గాంధీ(1869-1944) భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. సరోజిని నాయుడు(1879-1949) భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. -
వెండితెర సరోజిని
స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు ‘సరోజిని’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా టైటిల్ రోల్ చేయనున్నారు. ఆకాష్ నాయక్, ధీరజ్ మిశ్రా ద్వయం ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్ ఫిల్మ్ మీడియా సమర్పణలో కాను భాయ్ పటేల్ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. -
సరోజినీ నాయుడుగా...
స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. సరోజినీ నాయుడు పాత్రను దీపికా చిఖలియా పోషించనున్నారు. ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. ఆ తర్వాత నటిగా వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారామె. 1991లో ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో చంద్రమతిగా నటించారు దీపిక. హిందీ, తమిళం, గుజరాత్ భాషల చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. సరోజినీ నాయుడు బయోపిక్ గురించి దీపిక మాట్లాడుతూ– ‘‘సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో సరోజినీగారి గురించి వెతికాను. నాకు కావాల్సినంత సమాచారం దొరకలేదు. రైటర్ ధీరజ్ మిశ్రా ఈ బయోపిక్ గురించి చెప్పారు. అయితే నేనింకా సైన్ చేయలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ధీరజ్ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ టాక్. -
చెరగని ఈ ముద్రలు వెండితెరకెక్కవా?
మొఘల్ సామ్రాజ్యం చివరి రాణి బేగం జీనత్ మహల్, భర్త స్వాతంత్య్రోద్యమంలో జైలు కెళితే ఖుదాఫీజ్ చెప్పిన జులైకా బేగం, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి, ముత్తులక్ష్మీ రెడ్డి, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి వంటి భారతీయ ధీరమహిళల జీవితచరిత్రలను భారతీయ చిత్రపరిశ్రమ వెండితెరపై ఇంతవరకు ఎందుకు చిత్రించలేకపోయింది? భారతీయ పురాణాల చిత్రణపై మనకు పట్టు ఉంది కానీ చరిత్ర చిత్రీకరణలో తడబడుతుంటాం. వీరోచిత కార్యాలకు పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకమే. బ్రిటిష్ నాటకరంగంలో, సినిమాల్లో విశిష్ట నటి జూడి డెంచ్ వంటివారు భారతీయ చిత్ర రంగంమీదికి ఇంకా రాలేదు. ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, పసలేని వీరోచిత కృత్యాలను తోసిపడేస్తారని ఆశిద్దాం. బేగం జీనత్ మహల్ అత్యద్భుతమైన జీవితం ఇంతవరకు వెండితెరపై ఎందుకు కనిపించలేదు? చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అవశేష రాజ్యాన్ని పాలించిన చివరి భారతీయ రాణి ఈమె. ఆత్మగౌరవం, ఒంటరితనంతో, దర్పం, భయాందోళనల మిశ్రమ స్థితిలో ఎర్రకోటలోని పరిమిత పరిస్థితుల్లో జీవితం కోసం తపనపడిన ధీర వనిత ఈమె. దృఢచిత్తం ఉన్నప్పటికీ అదృష్టానికి నోచుకోని బేగం జీనత్ తన ఏకైక పుత్రుడు మీర్జా జావన్ బక్త్ని సింహాసనంపై కూర్చుండబెట్టడానికి తన రాణి హోదాను, దర్బారును ఎంతగానో ఉపయోగించి కూడా విఫలమైంది. షా జాఫర్ మునుపటి భార్యలకు పుట్టిన ఇద్దరు కుమారులకంటే తన కుమారుడికి ఆమె ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. తన కుమారుడిని గద్దెనెక్కించడానికి ఆమె విఫల ప్రయత్నాలు చేసింది. అతడికి భవిష్యత్ సింహాసనం కట్టబెట్టడం కోసం 1857లో చెలరేగిన సిపాయి తిరుగుబాట్లకు దూరంగా ఉంచింది. తన భర్తను దురదృష్టం కోరల నుంచి బయటపడేయటానికి చేయగలిగినంతా చేసింది కానీ నిష్ఫలమే అయింది. సింహాసనం కోల్పోయి ప్రవాస శిక్షకు గురైన భర్త షా జాఫర్‌తోపాటు ఆమె రంగూన్‌కి పయనమైంది. ఎర్రకోట నుంచి బేగం జీనత్ మహల్ నిష్క్రమిం చడం బాధాకరమైన ఘటన. రంగూన్‌లోనే చనిపోయిన తన భర్త సమాధి పక్కనే నాలుగేళ్ల తర్వాత ఆమెని కూడా సమాధి చేశారు. మన కాలంలో బేగం జీనత్ మహల్‌కు సరిసమానమైన వ్యక్తిత్వం కలిగిన మరొక ధీరవనిత జులైకా బేగం గురించి కూడా భారతీయ సినిమా చిత్రించకపోవడం శోచనీయం. ఈమె మౌలానా ఆజాద్ అని మనందరికీ తెలిసిన అబుల్ కలామ్ గులాం మొహియుద్దీన్ భార్య. విద్యాధికుడైన తిరుగుబాటుదారు, లౌకికవాద పునీతుడు అయిన మౌలానా ఆజాద్ పుస్తకాలూ పోరాటాలే ప్రపంచంగా జీవించిన వారు. 13 ఏళ్ల ప్రాయంలో ఆయన్ని పెళ్లాడిన జులైకా బేగం తన భర్త స్వాతంత్య్ర పోరాటంలో మునిగి తేలుతున్న సమయంలో కలకత్తాలో గడిపారు. ముస్లిం లీగ్ తన లక్ష్యం పాకిస్తాన్ ఏర్పాటేనని ప్రకటించిన తర్వాత అవిభక్త హిందూస్తాన్ కోసం మౌలానా పోరాడుతూ వచ్చారు. 1942లో గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన పోరాటంలోకి దిగినప్పుడు కలకత్తాలో తన గృహంలో ఉండిన ఆజాద్.. బొంబాయిలో క్విట్ ఇండియా కోసం పిలుపుని చ్చిన వెంటనే ఇంటిని వదిలి వెళ్లారు. ‘మరి కుటుంబం గురించి ఆలోచించు’ అని ఆమె అడిగి ఉంటారా? మనకు తెలిసినంతవరకు జులైకా బేగం వెళ్లిపోతున్న మౌలానాను అనుసరించి ఇంటి గేటు దాటి అక్కడే నిలబడి నిశ్శ బ్దంగా చూస్తూ, కారెక్కుతున్న భర్తకు ఖుదాఫీజ్ చెప్పారు. క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించగానే తనను కూడా అరెస్టు చేస్తారన్న విషయం ఆజాద్‌కు బహుశా తెలిసి ఉంటుంది. అలాగే నెహ్రూ, పటేల్, కృపలానీ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు ఆజాద్ కూడా మూడేళ్లపాటు అహ్మద్ నగర్ పోర్ట్ జైలులో గడిపారు. ప్రచురితమవుతాయా లేదా అని కూడా తెలీని పరిస్థితుల్లో తన జైలు గదిలోని రెండు ఊరపిచ్చుకల ప్రేమ జీవితాన్ని చూస్తూ, పరిశీలిస్తూ ఆయన ఉత్తరాల్లో రాస్తూ వచ్చారు. సుదీర్ఘ కారాగార ఏకాంత జీవితంలో ఇద్దరు దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత బలోపేతమవుతుంది. తన భర్త ఖైదీగా ఉండగానే జులైకా కలకత్తాలో మరణిం చారు. అక్కడే ఆమెను సమాధి చేశారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి బ్రిటన్‌లో చదువుకుని సంగీత సాహిత్యాల్లో ప్రావీణ్యత పొందిన సరోజినీ నాయుడిపైనా మనదేశంలో ఎలాంటి సినిమా తీయలేదు. తన ప్రవృత్తికి భిన్నమైన హైదరాబాద్ నివాసి, శస్త్రవైద్యుడు గోవిందరాజులు నాయుడిని పెళ్లాడి అయిదుగురు బిడ్డలకు తల్లి అయిన సరోజిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. అమెరికన్ రచయిత కేథరీన్ మేయో రాసిన ‘మదర్ ఇండియా’ దేశంపై కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆమె అమెరికాకు కూడా వెళ్లారు. దండి సత్యాగ్రహ సమయంలో పోలీసు చర్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రాజ్యాంగ సభలో సేవలందించారు. యునైటెడ్ ప్రావిన్స్ ప్రథమ గవర్నర్ అయ్యారు. తర్వాత అచిరకాలంలోనే స్వల్ప అస్వస్థతకు గురై మరణించారు. అంతిమ క్షణాల్లోనూ ఆమె తనకు సేవలందిస్తున్న నర్సును పాటపాడి వినిపించమన్నారు. అలాగే 20వ శతాబ్ది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి వంటి ధీరవనితలపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. వీరిలో మొదటివారు సోషలిస్టు, రెండోవారు కమ్యూనిస్టు, మూడో వ్యక్తి వ్యష్టివాదిగా ప్రసిద్ధులు. మృదులా సారాబాయి దేశ విభజన సమయంలో అపహరించబడి, త్యజించబడిన అనేకమంది మహిళలను కాపాడారు. అలాగే తదనంతర కాలంలో ముత్తులక్ష్మీ రెడ్డిగా పేరొందిన చంద్ర నారాయణ స్వామి ముత్తులక్ష్మిపై కూడా ఇంతవరకూ ఎవరూ సినిమా తీయలేదు. పుదుక్కోటై సంస్థానంలో దేవదాసీ కమ్యూనిటీలో పుట్టిన ముత్తులక్ష్మి చదువుకోవడానికి పెద్ద పోరాటమే చేశారు. తర్వాత పురుషుల కాలేజీలో సీటు సాధించిన తొలి విద్యార్థినిగా చరిత్రకెక్కారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి మహిళా హౌస్ సర్జన్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ ఇండియాలో తొలి శాసనసభ్యురాలిగా ఎన్నికై దేవదాసీ వ్యవస్థ రద్దుకు కృషిచేశారు. అలాగే దేవదాసీ తల్లికి పుట్టిన ప్రతిభావంతురాలైన కుమార్తెగా మదురైలో పెరిగిన ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. అనంతర కాలంలో సంగీత విద్మన్మణిగా అద్భుత ప్రావీ ణ్యత సాధించిన ఈమె స్వరాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి కానీ ఆమె జీవితం గురించిన అద్భుత సినిమా ఇంకా వెలువడలేదు. ఇలాంటి భారతీయ ధీరవనితల జీవితాలు ఇంతవరకు సినిమా రూపంలోకి ఎందుకు రాలేదు? ఎందుకంటే భారతదేశంలో పురాణాల గురించి మనకు బాగా తెలుసు కానీ చరిత్ర చిత్రణలో తడబడుతుంటాం. మానసిక సంక్షోభాలు, బుద్ధిజీవులకు చెందిన వ్యత్యాసాలను, డైలమాల చిత్రీకరణ మనకు సాధ్యం కాదు. వీరోచిత కార్యాలకు మనం పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకంగానే ఉంటోంది. మరొక కారణం ఉంది. మన కాలంలో కొంతమంది అతిగొప్ప నటీమణులను చూశాం. కానీ వ్యక్తిత్వ చిత్రణలను పండించే వారిని దొరకబుచ్చుకోవడం చాలా కష్టం. చారిత్రక హీరోయిన్ పాత్రల్లో ధరించేటటువంటి భారతీయ జూడి డెంచ్లు ఇంకా రంగంమీదికి రావడం లేదు. జూడి డెంచ్ బ్రిటన్ థియేటర్ నటి, వెండితెర నటి. ప్రస్తుతం ఆమె వయస్సు 85 ఏళ్లు. వర్జిన్ మేరీలో మేరీగా, హామ్లెట్‌లో ఒఫెలియాలా, రోమియో అండ్ జూలియట్లో జూలియట్‌లా, మాక్‌బెత్‌లో లేడీ మాక్బెత్లా, షేక్స్పియర్ ఇన్ లవ్‌లో క్వీన్ ఎలిజిబెత్‌లా, ది డచెస్ ఆఫ్ మాల్ఫిలో డచెస్లా, మిస్టర్ బ్రౌన్ టెలి ప్లేలో క్వీన్ విక్టోరియాలా, ఐరిస్‌లో ఐరిస్ మర్దోక్లా, జేమ్స్ బాండ్ సీరీస్‌లో ‘ఎమ్’ పాత్రధారిణిలా ఆమె విశిష్ట పాత్రలు పోషించారు. సమకాలీన, టెక్నో స్పై చిత్రాల్లో డెంచ్ పాత్ర ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం. జీరబోయిన ఆమె స్వరమే ఆమె సిగ్నేచర్‌గా మారిపోయింది. అయితే జ్వలించిపోయే ఆమె నేత్రాలు సకలభావాలను పలుకుతాయి. ఒక గొప్ప షాట్లో ఆమెను చంపబోతున్న హంతకుడు చేతిలో తుపాకితో ఆమెకు ఎదురు నిలబడతాడు. సరిగ్గా తుపాకి ట్రిగ్గర్ నొక్కుతుండగా డెంచ్ అతడికేసి తీక్షణంగా చూస్తుంది. మరుక్షణంలో ఆమె సురక్షితంగా ఒక డెస్క్ వెనుక పడిపోతుంది. సెకన్ల తేడాతో టెర్రరిస్టు తన తుపాకిని గురి పెట్టడం, ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అతడికేసి తీక్షణంగా చూడటం ఎంత ప్రతిభావంతంగా షాట్‌గా మల్చారంటే క్రెడిట్ మొత్తం ఆమెకు, దర్శకుడికి మాత్రమే దక్కుతుంది. మన గొప్ప నటీమణులలో జూడి డెంచ్ ఒకరై ఉండినట్లయితే, మన జీనత్ మహల్, జులైకా, సరోజినీ నాయుడు, కమలాదేవి తదితర భారతీయ ధీరవనితల పాత్రలన్నీ ఆమె పోషించి ఉండేది. కానీ మనం నిరాశచెందాల్సిన పనిలేదు. కానీ మనం కోల్పోయిన జాతి రత్నాలను మనం తిరిగి ఆవిష్కరించడానికి మరొక తరం గడిచిపోవాల్సి ఉంటుంది కాబోలు. 85 ఏళ్ల ప్రాయంలో జూడీ డెంచ్ జన్మ దినోత్సవాన్ని ఈ డిసెంబర్ 9న జరుపుకున్న తరుణంలో, ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, కళా, సంస్కృతీ సౌందర్యాన్ని చూడని మన క్షుద్ర సినీ జీవుల బుర్రలేని వీరోచిత కృత్యాలను ఈ భవిష్యత్ తారలు తోసిపడేస్తారని మనసారా ఆశిస్తూ సంబరాలు చేసుకుందాం. వ్యాసకర్త : గోపాలకృష్ణ గాంధీ, మాజీ ఐఏఎస్ అధికారి, దౌత్యవేత్త, మాజీ గవర్నర్ -
సమర సరోజం
జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్టే. దేశం అనుభవించే బానిసత్వం నువ్వూ అనుభవించినట్టే - సరోజినీ నాయుడు కలల అధరాల మీద దరహాసంలా తే లుతుందామె... మంచుబిందువు వంటి మా పాటలో ఓ తారకై వేలాడుతుంది..... భారత కోకిల సరోజినీ నాయుడు రాసిన ‘పల్లకీ బోయలు’ కవితలో పాదాలివి. ఉద్యమ భారతికి కాలం ఇచ్చిన కానుక సరోజినీదేవి (ఫిబ్రవరి 13,1879-మార్చి 2, 1949). కవిత్వం, ప్రేమ, స్వరాజ్యోద్యమం, కుటుంబం, పాలన - ఆ సరోజంలో ప్రతి ఒక్కటీ రమణీయంగా వికసించిన రేకలే. సరోజిని హైదరాబాద్ నగరంలోనే పుట్టారు. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ గొప్ప విద్యావేత్త. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపాల్. తల్లి వరదసుందరి కవయిత్రి. ఈ బెంగాలీ కుటుంబం హైదరాబాద్ వలస వచ్చింది. 12వ ఏటనే సరోజిని పేరు దేశమంతా మారుమోగింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రప్రథమురాలిగా నిలవడమే ఇందుకు కారణం. ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలీ, పర్షియన్ భాషలను నేర్చుకుని ఆ వయసులోనే ఆమె ఒక కవిత రాశారు. దాని పేరు ‘ద లేడీ ఆఫ్ ద లేక్’. ఇది ఆషామాషీ కవిత కాదు. మొత్తం 1300 పాదాలు. తరువాత పర్షియన్ భాషలో ‘మహేర్ మునీర్’ అనే నాటకం రాశారు. ఇది చదివిన నిజాం నవాబు సరోజిని విదేశీ విద్యకు వేతనం మంజూరు చేశారు. దాంతో 16వ ఏట లండన్‌లోని కింగ్స్ కాలేజీకి వెళ్లారు. తరువాత కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కాలేజీలో చదివారు. నిజానికి అక్కడ చదువు సంతృప్తికరంగా ఏమీ సాగలేదు. కింగ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు లండన్‌లో ఆనాడు గొప్ప సాహిత్యవేత్తలుగా పేర్గాంచిన ఆర్థర్ సైమన్, ఎడ్మండ్ గాసెలతో పరిచయం ఏర్పడింది. వారితో చర్చలతోనే కాలమంతా గడిచిపోయేది. గాసే ఇచ్చిన సలహా మేరకే భారతీయ నదులు, పర్వతాలు, సముద్రాల గురించి తన కవిత్వంలో రాయడం ఆరంభించారు సరోజిని.చదువు పట్ల ఆసక్తి తగ్గడానికి మరోకారణం ప్రేమ. తన పదిహేనో ఏటనే ముత్యాల గోవిందరాజులు అనే డాక్టర్‌తో ప్రేమలో పడ్డారు. ఆయన సరోజిని కంటే పదేళ్లు పెద్ద. ఇంగ్లండ్‌లోనే చదువుకునేవారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాలు సాగేవి. ఇంగ్లండ్ నుంచి వచ్చిన తరువాత 1898లో మద్రాస్‌లో ఆ ఇద్దరి వివాహం జరిగింది. ఇది కులాంతర వివాహం. వారికి నలుగురు సంతానం. 1905 నాటి బెంగాల్ విభజన భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక మలుపు. తన స్వస్థలానికి తెల్లజాతి చేయ పూనుకున్న అన్యాయం ఆమెను కలచి వేసింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. గోఖలే, అనిబిసెంట్, మహమ్మదాలీ జిన్నా నుంచి గాంధీ, నెహ్రూల వరకు ఆమెకు సంస్థ అంతటా మిత్రులు ఉండేవారు. టాగూర్ అంటే అపార మైన అభిమానం. ఆయనతో సాన్నిహిత్యం ఉండేది. జిన్నా జీవితం మీద తొలి పుస్తకం సరోజినీదేవే వెలువరించారు. 1925 సంవత్సరంలో కాన్పూర్ కాంగ్రెస్ సభలకు అధ్య క్షత వహించారు. ఆ సంస్థ సమావేశాలలో అధ్యక్ష స్థానంలో మహిళ కూర్చోవడం అదే మొదలు. తరువాత జరిగిన ప్రతి ముఖ్య స్వాతంత్య్రోద్యమ ఘట్టంలోనూ మహా నేతలతో పాటు సరోజిని పేరూ చరిత్రలో కనిపిస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో 21 మాసాలకు పైగా ఆమె కారాగారంలో గడిపారు.సరోజినీదేవి వివాహం, చదువు, కవిత్వం, ఉద్యమం ఇవన్నీ ఆమె కాలానికి అతీతమైన ఒక మహిళ అని నిరూ పిస్తాయి. మహిళలు ముందడగు వేయవలసిన అవసరం గురించి కూడా ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. తన అభిప్రాయాలను చెప్పడానికి ఆమె దేశమంతా పర్యటించారు. ఇన్ని కార్యక్రమాలున్నా సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ దూరం చేసుకోలేదు. ముంబైలోని తాజ్ హోటల్లో ఆమె పేరిట ఎప్పుడూ ఒక సూట్ ఉండేది. అందులో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించారు. ‘కోరమండల్ ఫిషర్స్, ఆటంసాంగ్, ఇండియన్ వీవర్స్, బ్యాంగిల్ సెల్లర్స్, ఎకాస్టసి, యాన్ ఇండియన్ లవ్ సాంగ్, క్రాడిల్ సాంగ్, ఎ లవ్ సాంగ్ ఫ్రం ది నార్త్ వంటివి ఎన్నో కవితలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో సరోజినీ ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. గాంధీజీని దైవ స్వరూపునిగా దేశమంతా భావిస్తున్న తరుణంలో ఆయనను ఒక ముద్దుపేరుతో సరోజిని పిలుచుకునేవారు, అది.. మిక్కీమౌస్. - జి.ఎన్.రావు -
స్వరాజ్య సమరగానంలో సుస్వరం
భారత కోకిలగా ప్రసిద్ధిగాంచిన సరోజిని నాయుడు గొప్ప రచయిత్రి, ఉపన్యాసకురాలు, గాయనీమణి, స్వాతంత్య్రో ద్యమ నాయకురాలు. నాటి భారత మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక. హైదరాబాద్‌లో సంప్రదాయ బెంగాలీ కుటుంబంలో 1879 ఫిబ్రవరి 13న సరోజిని జన్మిం చారు. తల్లితండ్రులు వరదా సుందరీదేవి, అఘోరనాథ్ చటో పాధ్యాయ. 12 ఏళ్ల ప్రాయంలోనే మద్రాస్ వర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణురాలైన అతి పిన్న వయస్కురాలిగా ఈమె రికార్డు కెక్కింది. నిజాం ఉపకార వేతనంతో లండన్ వెళ్లి, కింగ్స్ కాలేజీలో విద్య నభ్యసిస్తూ అనా రోగ్యంతో 1898లో హైదరాబాద్ తిరిగొచ్చారు. గోవిందరాజులు నాయుడిని కులాంతర వివాహం చేసుకున్నారు. పన్నెండేళ్ల ప్రాయంలో మహర్ మునీర్ అనే పర్షియన్ నాటిక రాసిన సరోజిని ఇంగ్లండ్‌లో రాయల్ లిటరరీ సొసైటీలో సభ్యురాలిగా చేరారు. ప్రముఖ ఆంగ్ల రచయితలు ఎడ్మండ్ గాస్సీ, సిమన్స్ల పరిచయంతో గద్యరచనను చేపట్టిన సరోజిని 1905లో గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పద్య సంకలనాన్ని లండన్‌లో ప్రచురించారు. తర్వాత ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్స్, ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మార్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పోయెమ్స్ లను ఆమె ప్రచురించారు. భారతీయ ఆత్మను ప్రతిఫలించిన ఆమె పద్యాలకు అరవిందుడు, రవీంద్రనాథ్ టాగూర్, జవహర్లాల్ నెహ్రూ ముగ్ధులయ్యారు. రాగయుక్తంగా, శ్రావ్యంగా, వినసొంపుగా ఉండే ఆమె గాత్రం వల్ల అందరూ ఆమెను భారతకోకిల అని పిలిచేవారు. నాటి కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు, 1905లో కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా చేరారు. 1915లో గాంధీని కలుసుకున్నాక క్రియాశీల రాజకీయాల్లోకి, జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. 1915-18 మధ్య కాలంలో దేశమంతా పర్యటించి వాగ్ధాటితో ప్రజలను కదిలించారు. ఖిలాఫత్ ఉద్యమం, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహం పోరాటాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. భారత హోంరూల్ ప్రతినిధిగా లండన్ వెళ్లారు. 1925లో కాన్పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన రెండవ మహిళగా, తొలి భారతీయ మహిళగా ఖ్యాతి పొందారు. ఈ కాలంలోనే ప్లేగు వ్యాధి నిర్మూలనకు కృషి చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఇ-హింద్ అనే బిరుదును ప్రదానం చేసింది. 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీ, మదన్ మోహన్ మాలవ్యలతో కలసి లండన్ వెళ్లారు. 1942లో క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి విదేశీ మద్దతు కూడగట్టడానికి ఆఫ్రికా, అమెరికా, కెనడాలో పర్యటించారు. స్వాతంత్య్రానంతరం 1947 ఆగస్టు 15 నుంచి 1949 మార్చి 2 వరకు నాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసి దేశంలో తొలి మహిళా గవర్నర్‌గా రికార్డుకెక్కారు. 70 ఏళ్ల వయస్సులో గవర్నర్‌గా పనిచేస్తూనే 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భారత కోకిల సరోజినికి నివాళి. (నేడు సరోజిని నాయుడు 136వ జయంతి) తండ ప్రభాకర్ గౌడ్ తొర్రూరు, వరంగల్ -
కవి గాయక నట వైతాళికుడు
ఆయన కవి గాయక నట వైతాళికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నింటికీ మించి అరుదైన ఆత్మజ్ఞాని. ‘షేపర్ షేప్డ్’ కవితలో ‘ఐ హావ్ సీజ్డ్ టు బి ది పాటర్... అండ్ హావ్ లెర్న్డ్ టు బి ది క్లే’ అనడంలోనే కవి ఆత్మజ్ఞానం తేటతెల్లమవుతుంది. ఇంతకూ ఈ కవిత రాసినదెవరో కాదు, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ సరోజినీ నాయుడు చిన్న తమ్ముడు, అఘోరనాథ ఛటోపాధ్యాయ ఆఖరి కొడుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ. అక్క సరోజినికి దీటైన కవి ఆయన. అంతే కాదు, నటుడు, గాయకుడు, రాజకీయవేత్త, సంస్కరణాభిలాషి కూడా. హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. అఘోరనాథ ఛటోపాధ్యాయ, బరదాసుందరీ దేవి దంపతుల ఆఖరి సంతానంగా 1898 ఏప్రిల్ 2న పుట్టాడు. విదేశీ విద్యాభ్యాసం తర్వాత నిజాం ప్రభువు ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న అఘోరనాథ ఛటోపాధ్యాయ, ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించారు. అప్పట్లో అఘోరనాథ నివాసం వివిధ రంగాల మేధావులకు ఆలవాలంగా ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన హరీంద్రనాథ్ సహజంగానే కవిగా, మేధావిగా ఎదిగాడు. సన్నిహితులు ఆయనను హరీన్ అని పిలిచేవారు. తనకు ఊహ తెలిసినప్పటికే అక్క సరోజినీ దేవి కవయిత్రిగా ప్రసిద్ధురాలు కావడంతో హరీన్పై ఆమె ప్రభావం కూడా ఉండేది. అయితే, అక్క సరోజిని మాదిరిగా హరీన్ కవిత్వానికి, రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. సంగీతం, రంగస్థలం, సినిమాల్లోనూ తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నాడు. రంగస్థలం మీదుగా బాలీవుడ్ ప్రస్థానం... చిన్నప్పటి నుంచే రంగస్థల నటుడిగా గుర్తింపు పొందిన హరీన్, బాలీవుడ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టాడు. అబు హసన్ (1918), ఫైవ్ ప్లేస్ (1937), సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ పీస్ (1956) నాటకాలను స్వయంగా రచించి ప్రదర్శించాడు. గాయకుడిగా అప్పుడప్పుడు ఆకాశవాణి ద్వారా పాటలు వినిపించేవాడు. షష్టిపూర్తి దాటిన దశలో 1962లో తొలిచిత్రం ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో ఘరీబాబు పాత్రలో ఆకట్టుకున్నాడు. 1972లో రాజేశ్ ఖన్నా కథానాయకుడుగా నటించిన ‘బావార్చీ’లో ఉమ్మడి కుటుంబ పెద్ద ‘దాదూజీ’ పాత్ర హరీన్‌కు బాగా గుర్తింపు తెచ్చింది. మాతృభాష బెంగాలీలో ముచ్చటగా మూడు చిత్రాల్లో మాత్రమే నటించిన హరీన్, మొత్తం పాతిక లోపు చిత్రాల్లోనే నటించాడు. ‘తేరే ఘర్‌కే సామ్నే’లో సేఠ్ కరమ్‌చంద్, ‘ఘర్బార్’లో మిస్టర్ ఛద్దా, ‘ఆశీర్వాద్’లో బైజూ ఢోలకియా వంటి పాత్రల్లో హరీన్ విలక్షణ నటనను అప్పటి తరం ప్రేక్షకులు నేటికీ మరువలేరు. తొంభయ్యేళ్ల ముదిమిలో నటించిన మలామల్ (1988) ఆయన చివరి చిత్రం. సంగీతంలోనూ విశేష ప్రావీణ్యం గల హరీన్ ‘సూర్య అస్త్ హోగయా’, ‘తరుణ్ అరుణ్ సే రంజిత్ ధరణీ’ వంటి పాటలను రచించడమే కాకుండా, స్వరకల్పన కూడా చేశారు. ‘ఆకాశవాణి’లో ఆయన తరచూ ‘రైల్ గాడీ’ కవితను వినిపించేవారు. హిందీలో హరీన్ రాసిన పిల్లల పాటలు రవీంద్రనాథ్ టాగోర్‌ను సైతం మెప్పించాయి. రాజకీయాల్లో స్వతంత్రుడు... అక్క సరోజినీ నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసినా, హరీన్ మాత్రం రాజకీయాల్లో స్వతంత్రుడిగానే కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చాక 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన హరీన్, పార్లమెంటులో ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ‘ఓ.. ది రైల్వే బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ ఫెయిర్.. ఇట్ డజ్ నాట్ టచ్ ది మినిస్టర్స్ హూ ఆల్వేస్ గో బై ఎయిర్’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఆయనవి ఇలాంటి చమక్కులెన్నో... పార్టీలకు అతీతంగా సభ్యులందరినీ అలరించేవి, ఆలోచింపజేసేవి. - పన్యాల జగన్నాథదాసు -
నైటింగేల్ ఆఫ్ ఇండియా
హైదరాబాదీ సరోజినీ నాయుడు ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా ఆధునిక భారతదేశ చరిత్రలో ఆమెది చెరగని ముద్ర. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ ఆమె. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ మహిళ కూడా ఆమే. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సరోజినీ నాయుడు ప్రస్తావన లేకుండా భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర చెప్పుకోవడం అసాధ్యం. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి డీఎస్సీ పూర్తి చేసుకున్నాక, స్వదేశానికి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్ కాలేజీని స్థాపించారు. అది కాలక్రమంలో నిజాం కాలేజీగా మారింది. అఘోరనాథ ఛటోపాధ్యాయ, బరదాసుందరీ దేవి దంపతులకు 1879, ఫిబ్రవరి 13న జన్మించిన సరోజిని బాల్యం నుంచే కవిత్వ రచనలో ప్రతిభా పాటవాలు చూపేది. తొలినాళ్లలో మాతృభాష బెంగాలీలో కవితలు రాసేది. అఘోరనాథ, బరదాసుందరి దంపతుల ఎనిమిది మంది సంతానంలో పెద్దదైన సరోజిని చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలూ కనపరచేది. నిజానికి సరోజినిని తన మాదిరిగానే శాస్త్రవేత్తగా తయారు చేయాలని తండ్రి అఘోరనాథ భావించారు. అయితే, సాహిత్యాభిలాషతో ఆమె కవిత్వం వైపు మళ్లింది. బాల్యంలోనే ‘ది లేడీ ఆఫ్ ది లేక్’ పేరిట పదమూడువందల పంక్తుల దీర్ఘకవిత రాసి తండ్రిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక అప్పటి నుంచి అఘోరనాథ ఆమె కవిత్వాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. మద్రాసు వర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాక నాలుగేళ్ల పాటు ఆమె చదువుకు విరామం ఏర్పడింది. తర్వాత నిజాం స్కాలర్షిప్ సాయంతో 1895లో ఇంగ్లండ్ వెళ్లి, లండన్‌లోని కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జిలోని గిర్టన్ కాలేజీలలో చదువుకుంది. అక్కడ పరిచయమైన డాక్టర్ గోవిందరాజులు నాయుడును ప్రేమించి, పెళ్లాడింది. డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ రాజకీయాల్లో సరోజినీ నాయుడు కలల స్వాప్నికురాలు. నాటి కాంగ్రెస్ నేత సీపీ రామస్వామి అయ్యర్ ఆమెను ‘డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్’గా అభివర్ణించారు. బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, మహ్మద్ అలీ జిన్నా, అనీబిసెంట్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి వారితో కలసి పనిచేశారు. లౌకికవాది అయిన సరోజినీదేవి దేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడ్డారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. బీహార్‌లోని చంపారన్ నీలిమందు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించారు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1925లో జరిగిన కాన్పూర్ సదస్సులో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక, దేశంలో ఐదేళ్లలోనే హిందూ ముస్లింల ఐక్యత నెలకొంటుందని కలగన్నారు. అయితే, ఆమె కల నెరవేరకపోవడమే విషాదం. గోల్డెన్ త్రెషోల్డ్ సరోజినీ నాయుడు కవితా సంపుటాల్లో ఒకటి ‘గోల్డెన్ త్రెషోల్డ్’. అబిడ్స్‌లోని ఆమె నివాసం పేరు కూడా ఇదే. ఇప్పటికీ అది సాంస్కృతిక కేంద్రంగా వర్థిల్లుతోంది. ‘ది బర్డ్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’ పేరిట మరో రెండు కవితా సంపుటాలనూ సరోజిని వెలుగులోకి తెచ్చారు. ఆమె కవితల్లో కొన్ని పాటలుగానూ ప్రసిద్ధి పొందాయి. ఒకవైపు స్వాతంత్య్రోద్యమంలో, కాంగ్రెస్ రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నా, ఆమె ఏనాడూ కవిత్వానికి దూరం కాలేదు. బెంగాలీ కవితలు రాస్తున్న బాల్యదశలోనే ఆమె తన తండ్రి సహాయంతో ‘మాహెర్ మునీర్’ అనే పర్షియన్ నాటకాన్ని రాసింది. ఆ నాటకం ప్రతిని చూసిన ఆరో నిజాం సరోజిని ప్రతిభకు ముగ్ధుడై, ఇంగ్లండ్ వెళ్లేందుకు ఆమెకు స్కాలర్షిప్ మంజూరు చేశారు. స్వాతంత్య్రానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సరోజిని, పదవిలో ఉండగానే 1949, మార్చి 2న లక్నోలో తుదిశ్వాస విడిచింది. -
మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు
ప్రయత్నం వేసవి వచ్చిందంటే నో(బో)రెండిపోతుంది. గుక్కెడు నీళ్ళు నోట్లో పోస్తేకాని దాహం తీరదు. అదే చేత్తో బోరులో కూడా కాసిన్ని నీళ్లు పోయమంటున్నారు ఆక్వాఫైర్ని కనుగొన్న బృందం. ఒకపక్క తాగడానికే గుక్కెడు నీళ్లు లేవని బోరుమంటుంటే... బోరులో నీళ్లు పోయడమేంటనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సరోజినీనాయుడు కాలనీకెళితే భూమిలోని నీటిని పెకైలా రప్పించాలో తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి పది గంటలవరకూ మెహర్‌బాబా మందిర ప్రాంగణంలోని మొక్కలను సాగు చేయడం కోసం ఓ ఇరవై ముప్ఫైమంది భక్తులు వస్తారక్కడికి. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ ఉంటారు. ఎకరం విస్తీర్ణంలో ఉన్న కొండపై సిమెంట్‌తో మడులు కట్టి అందులో మట్టి నింపి మొక్కలు పెంచుతున్నారు. అరటి చెట్ల నుంచి దానిమ్మ వరకూ అన్ని రకాల మొక్కలూ, చెట్లు ఉన్నాయక్కడ. వాటికి నీరు పోయడం కోసం మొదలైన జలయజ్ఞం ఫలితంగానే భూమిలోని నీటి నిల్వను పెంచే సరికొత్త పద్ధతిని కనుగొన్నామంటారు భక్తులంతా. దీన్నే ఆక్వాఫైర్ అంటున్నారు. బోరెండిపోవడంతో... పాతికేళ్లక్రితం కట్టిన మందిరం అది. అక్కడ వేసిన బోరు కూడా అప్పటిదే. పదేళ్లక్రితం ఉన్నట్టుండి బోరు ఎండిపోయింది. ఏం చేస్తారు...మందిర అవసరాలకోసం నీటిని ట్యాంకర్లతో తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఎత్తై ప్రదేశం కావడంతో ఒకసారి నీళ్లట్యాంకరు పెకైక్కుతూ బోల్తాపడింది. అప్పటి నుంచి ట్యాంకర్లవాళ్ళు అక్కడికి రావడానికి వెనుకాడసాగారు. అప్పుడిక చేసేది లేక... 550 అడుగుల లోతుగా బోరు వేశారు. ఆ బోరు కూడా మూడేళ్లక్రితం ఎండిపోయింది. ‘‘పాతికేళ్ల నుంచి ఇక్కడ ప్రాంగణంలో మొక్కలు పెంచుతున్నాం. అలాంటిది నీళ్ళు లేకపోతే... పచ్చని ప్రదేశమంతా ఇప్పుడు తిరిగి రాయిలా మారిపోతుండడంతో డాక్టర్ విజయసారథి మాకు ఒక ఉపాయం చెప్పారు. ఆయన చెప్పిన పద్ధతిని అనుసరించడం వల్ల ఎండిపోయిన బోరులో నుంచి వేసవిలో కూడా పుష్కలంగా నీరు వస్తోంది. మా మందిరం బోరులోనే కాదు... చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా నీళ్లకు కొదవలేదు’’ అని చెప్పారు చార్టర్‌డ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న రాజేందర్. నీటి నిల్వ పెంచడం కోసం... వర్షపు నీటిని ఫిల్టర్ చేసి బోరు ద్వారా భూమిలోకి పంపడం వల్ల ఇప్పుడు బోరులో బోలెడు నీరు ఉంది. బోరులోకి నీరెలా పంపాలంటారా? వర్షం వచ్చినపుడు మందిరం పైభాగంలో పడ్డ నీరంతా కిందకు పోతుంది. అలాగే కింద రాళ్లపై పడ్డనీరు కూడా పల్లపు ప్రాంతానికి పోతుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా వర్షంనీరు 40శాతం ఆవిరైపోతుంది, 40 శాతం డ్రైనేజీలో కలిసిపోతుంది. పదిశాతం మట్టి పీల్చుకుంటుంది. మరో పదిశాతం మాత్రమే భూమిలోని నీటి నిల్వలను చేరుతుంది. యాభైశాతం వర్షం నీటిని బోరుబావుల ద్వారా భూమిలోకి పంపగలిగితే ఏ కాలంలోనూ నీటికొదవ ఉండదు. ‘‘మా మందిరంపై కురిసే వర్షపు నీరు పడేచోట సిమెంటు ట్యాంకుతో తయారుచేసిన ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాం. ఆ ఇంకుడు గుంతకు కిందిభాగంలో ఒక పైపు పెట్టాం. ఈ ఇంకుడు గుంత వల్ల వర్షపు నీరు ఫిల్టర్ అయిపోతుంది. పది అడుగుల లోతు సిమెంటు, లేదా ప్లాస్టిక్ తొట్టిలో మొదట పెద్దసైజు కంకరరాళ్లు, తర్వాత సన్నకంకర, చివరగా ఇసుక ఒకదాని తరువాత మరొకటిగా పొరలు పొరలుగా పోయాలి. పైన దుమ్ము పడకుండా ఏదైనా ఒక మ్యాట్ని వేయాలి. దానిపై పైపులద్వారా పడుతున్న వర్షపునీరంతా ఫిల్టరయి కింద అమర్చిన గొట్టం ద్వారా మరో ట్యాంకులో వెళ్లిపోతాయి. ఆ ట్యాంకు నుంచి నేరుగా బోరుబావిలో పెట్టిన పైపులోకి వెళ్లిపోతాయి. బోరులో నీటికోసం ఎంతలోతు పైపు వేశామో దానికి ఆనుకునే మరోపైపుని వేసి దానిద్వారా ఈ ఫిల్టరయిన నీటిని లోపలికి పంపించాలి. మేం గత జూన్‌నెల నుంచి మా బోరులోకి కొన్ని లక్షల లీటర్ల నీటిని భూమిలోపలికి పంపించాం. దాని ఫలితం కనిపిస్తోంది. గతంలో మామూలు రోజుల్లో కూడా బోరు స్విచ్ వేశాక ఆరు నిమిషాలకు గానీ నీళ్ళు పైకి వచ్చేవి కావు. కానీ, ఇప్పుడు వేసవికాలంలో యాభై సెకన్లకే నీళ్ళు పైకి వస్తున్నాయి. అంటే మా బోరుకిందున్న నీటినిల్వలస్థాయి పెరిగిందన్నమాట. అంతేకాదు మా చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా వెంటనే నీళ్లు వచ్చేస్తున్నాయి’’ అని చెప్పారు గిరిధర్ అనే బ్యాంక్ ఉద్యోగి. ఇంకుడు గుంతల వల్ల నీరు నేరుగా నీటి నిల్వలను చేరుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా బోరుద్వారా కొన్ని వందల అడుగుల లోపలికి నీరు పంపించడం వల్ల మన నీటిని మనమే భద్రంగా దాచుకోవడంతో సమానమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తి. అపార్ట్‌మెంట్‌పై నీటితో... భవిష్యత్తులో 90లక్షల లీటర్ల నీళ్ళును నిల్వ చేసే అండర్‌గ్రౌండ్ ట్యాంకు నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు ఆక్వాఫైర్ బృందం. దాని ద్వారా వేసవిలో ఉచితంగా నీటిని సరఫరా చేయాలన్నది వారి లక్ష్యం. రోజురోజుకీ వేల సంఖ్యలో పెరుగుతున్న అపార్టుమెంట్ల వల్ల భూమిలోని నీరంతా మాయమైపోతోందన్న మాటలు వింటూనే ఉంటాం. అపార్టుమెంట్ల సంఖ్య పెరిగిన చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. అలాంటిచోట్ల ఈ నీటినిల్వ ఏర్పాటు పద్ధతి చాలా అవసరం. ఆక్వాఫైర్ బృందం ప్రతి ఆదివారం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎవరైనా తమ ప్రాంతంలో నీటి నిల్వలను పెంచుకోవాలనుకుంటున్నవారికి ఉచితంగా ఆ విధానాన్ని బోధించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఆకాశగంగను... నేరుగా పాతాళానికి పంపిస్తూ నీటికొరత అనే మాటకు చోటులేకుండా చేసిన వీరి విజయం అందరి సొంతమవ్వాలంటే... ఆక్వాఫైర్ బృంద సభ్యుడు రాజేందర్ (9849046848)ని సంప్రదించవచ్చు. - భువనేశ్వరి