సమర సరోజం
జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్టే. దేశం అనుభవించే బానిసత్వం నువ్వూ అనుభవించినట్టే
- సరోజినీ నాయుడు
కలల అధరాల మీద దరహాసంలా తే లుతుందామె... మంచుబిందువు వంటి మా పాటలో ఓ తారకై వేలాడుతుంది..... భారత కోకిల సరోజినీ నాయుడు రాసిన ‘పల్లకీ బోయలు’ కవితలో పాదాలివి. ఉద్యమ భారతికి కాలం ఇచ్చిన కానుక సరోజినీదేవి (ఫిబ్రవరి 13,1879-మార్చి 2, 1949). కవిత్వం, ప్రేమ, స్వరాజ్యోద్యమం, కుటుంబం, పాలన - ఆ సరోజంలో ప్రతి ఒక్కటీ రమణీయంగా వికసించిన రేకలే.
సరోజిని హైదరాబాద్ నగరంలోనే పుట్టారు. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ గొప్ప విద్యావేత్త. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపాల్. తల్లి వరదసుందరి కవయిత్రి. ఈ బెంగాలీ కుటుంబం హైదరాబాద్ వలస వచ్చింది. 12వ ఏటనే సరోజిని పేరు దేశమంతా మారుమోగింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రప్రథమురాలిగా నిలవడమే ఇందుకు కారణం. ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలీ, పర్షియన్ భాషలను నేర్చుకుని ఆ వయసులోనే ఆమె ఒక కవిత రాశారు. దాని పేరు ‘ద లేడీ ఆఫ్ ద లేక్’. ఇది ఆషామాషీ కవిత కాదు. మొత్తం 1300 పాదాలు.
తరువాత పర్షియన్ భాషలో ‘మహేర్ మునీర్’ అనే నాటకం రాశారు. ఇది చదివిన నిజాం నవాబు సరోజిని విదేశీ విద్యకు వేతనం మంజూరు చేశారు. దాంతో 16వ ఏట లండన్‌లోని కింగ్స్ కాలేజీకి వెళ్లారు. తరువాత కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కాలేజీలో చదివారు. నిజానికి అక్కడ చదువు సంతృప్తికరంగా ఏమీ సాగలేదు. కింగ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు లండన్‌లో ఆనాడు గొప్ప సాహిత్యవేత్తలుగా పేర్గాంచిన ఆర్థర్ సైమన్, ఎడ్మండ్ గాసెలతో పరిచయం ఏర్పడింది. వారితో చర్చలతోనే కాలమంతా గడిచిపోయేది.
గాసే ఇచ్చిన సలహా మేరకే భారతీయ నదులు, పర్వతాలు, సముద్రాల గురించి తన కవిత్వంలో రాయడం ఆరంభించారు సరోజిని.చదువు పట్ల ఆసక్తి తగ్గడానికి మరోకారణం ప్రేమ. తన పదిహేనో ఏటనే ముత్యాల గోవిందరాజులు అనే డాక్టర్‌తో ప్రేమలో పడ్డారు. ఆయన సరోజిని కంటే పదేళ్లు పెద్ద. ఇంగ్లండ్‌లోనే చదువుకునేవారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాలు సాగేవి. ఇంగ్లండ్ నుంచి వచ్చిన తరువాత 1898లో మద్రాస్‌లో ఆ ఇద్దరి వివాహం జరిగింది. ఇది కులాంతర వివాహం. వారికి నలుగురు సంతానం.
1905 నాటి బెంగాల్ విభజన భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక మలుపు. తన స్వస్థలానికి తెల్లజాతి చేయ పూనుకున్న అన్యాయం ఆమెను కలచి వేసింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. గోఖలే, అనిబిసెంట్, మహమ్మదాలీ జిన్నా నుంచి గాంధీ, నెహ్రూల వరకు ఆమెకు సంస్థ అంతటా మిత్రులు ఉండేవారు. టాగూర్ అంటే అపార మైన అభిమానం. ఆయనతో సాన్నిహిత్యం ఉండేది. జిన్నా జీవితం మీద తొలి పుస్తకం సరోజినీదేవే వెలువరించారు. 1925 సంవత్సరంలో కాన్పూర్ కాంగ్రెస్ సభలకు అధ్య క్షత వహించారు.
ఆ సంస్థ సమావేశాలలో అధ్యక్ష స్థానంలో మహిళ కూర్చోవడం అదే మొదలు. తరువాత జరిగిన ప్రతి ముఖ్య స్వాతంత్య్రోద్యమ ఘట్టంలోనూ మహా నేతలతో పాటు సరోజిని పేరూ చరిత్రలో కనిపిస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో 21 మాసాలకు పైగా ఆమె కారాగారంలో గడిపారు.సరోజినీదేవి వివాహం, చదువు, కవిత్వం, ఉద్యమం ఇవన్నీ ఆమె కాలానికి అతీతమైన ఒక మహిళ అని నిరూ పిస్తాయి. మహిళలు ముందడగు వేయవలసిన అవసరం గురించి కూడా ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. తన అభిప్రాయాలను చెప్పడానికి ఆమె దేశమంతా పర్యటించారు.
ఇన్ని కార్యక్రమాలున్నా సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ దూరం చేసుకోలేదు. ముంబైలోని తాజ్ హోటల్‌లో ఆమె పేరిట ఎప్పుడూ ఒక సూట్ ఉండేది. అందులో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించారు. ‘కోరమండల్ ఫిషర్స్, ఆటంసాంగ్, ఇండియన్ వీవర్స్, బ్యాంగిల్ సెల్లర్స్, ఎకాస్టసి, యాన్ ఇండియన్ లవ్ సాంగ్, క్రాడిల్ సాంగ్, ఎ లవ్ సాంగ్ ఫ్రం ది నార్త్ వంటివి ఎన్నో కవితలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో సరోజినీ ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. గాంధీజీని దైవ స్వరూపునిగా దేశమంతా భావిస్తున్న తరుణంలో ఆయనను ఒక ముద్దుపేరుతో సరోజిని పిలుచుకునేవారు, అది.. మిక్కీమౌస్.
- జి.ఎన్.రావు