
‘మనిషి చనిపోయే ఆఖరి నిమిషాలలో ఏడు నిమిషాలపాటు ప్రాణం వుంటుంది. ఆ సమయంలో జీవితమంతా కళ్ళముందు కనిపిస్తుంది’ అని చాలామంది అంటుంటే విన్నాను కాని, దాన్ని అనుభవించే రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేకపోయాను.
చుట్టూ చీకటిగా వుంది. భయమేస్తోంది. అయినా ఇక భయమెందుకులే! జరగాల్సినదంతా గత రెండు గంటల్లోనే జరిగిపోయిందిగా! పన్నెండేళ్ళ క్రితం వార్తా కార్యక్రమాల్లో నిర్భయ సంఘటన గురించి విన్నప్పుడు అందరి ముఖాల్లోనూ ఆందోళన చూశాను. ఈరోజు మనిషి తోలు కప్పుకున్న మృగాలు నన్ను వెంటాడి క్షణక్షణం హింసిస్తూ, అటువంటి స్థితిలోకే నన్నూ నెట్టేస్తుంటే జీవచ్ఛవంలా పడుండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ నరరూపరాక్షసులు నన్ను అనుభవించి, దొంగల్లాగా పారిపోయారు.
పోలీసు సైరన్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు నన్ను వెతికి, ఎక్కడున్నానో కనిపెట్టేసరికి నా ఊపిరుంటుందో లేదో! అవునూ, ఇప్పుడు పోలీసులు వస్తున్నారంటే అమ్మానాన్న కూడా వస్తూ వుంటారేమోగా! ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడమే గాక ఫోన్ కూడా ఎత్తకపోవడంతో భయపడి, నాన్న తన క్లాస్‌మేట్ అయిన సీఐ రమణమూర్తి అంకుల్‌కి ఫోన్ చేసినట్టున్నారు. పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో! నన్ను ఇలా చూసి వాళ్ళు తట్టుకోగలరా? అమ్మకి అసలే బాలేదు. నాన్నేమో సున్నితమైన మనిషి. జరిగినదాని గురించి కన్నా, నన్ను తలచుకుని వాళ్ళేమైపోతారోనన్న బాధే ఎక్కువగా వుంది. అలా అని, లేచి వెళ్ళి వాళ్ళకి బాధపడొద్దని చెప్పే పరిస్థితిలో లేను. కాలూ, చెయ్యీ కదపలేకపోతున్నాను. గొంతులోంచి మాట రావడం లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పటివరకూ సాఫీగా సాగిన నా జీవితం, కొన్ని గంటల క్రితం కొన్ని ఊహించని మలుపులు ఎందుకు తిరిగింది?
‘అమ్మా! తలుపేసుకో, నేను వెళ్తున్నాను’‘వెళ్తున్నాను కాదే, వెళ్ళొస్తాను!’‘ఆ, అదే అదే. నువ్వు టైమ్‌కి మందులు వేసుకుని పడుకో, లేదంటే జ్వరం తగ్గదు. అసలే వైరల్ ఫీవర్’‘సరేరా. మర్చిపోకుండా వేసుకుంటానులేగాని, దేవుడికి దణ్ణం పెట్టుకునిరా. ఇవాళ ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు. శుభంగా జరగాలని కోరుకో!’‘అబ్బా! ఇంకా దణ్ణంపెట్టుకోమనలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఉండు, నీ ఆనందం కోసం కుంకుమ కూడా పెట్టుకుని వస్తా’‘జాగ్రత్త తల్లీ! వెళ్ళాక మెసేజ్ చెయ్యి. సర్వీస్ సెంటర్ వాడు కారు ఎప్పుడిస్తాడట?’‘ఇందాక ఫోన్ చేస్తే, రేపొద్దున్నకల్లా అయిపోతుందన్నాడమ్మా. ఇవాళ ఒక్కరోజూ ఆటోలోనో, క్యాబ్‌లోనో వచ్చేస్తాలే’ ‘సాయంత్రం కుదిరితే త్వరగా వచ్చెయ్యమ్మా.
నువ్వొచ్చే వరకు మాకు కంగారుగా వుంటుంది’‘అలాగేనమ్మా. బయలుదేరేముందు లైవ్ లొకేషన్ పెడతానులే. అయినా నాకు కరాటేలో బ్రౌన్ బెల్ట్ ఉంది కదా! నన్ను ఎవడూ ఏం చెయ్యలేడు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే, క్యాబ్ వచ్చింది. నేను వెళ్తాను. బై అమ్మా!‘ అమ్మకి ధైర్యమిచ్చాను కాని, ఈమధ్య జరుగుతున్న దారుణాలను తలచుకుంటే నాకు భయమేసింది. ఒకమ్మాయిని మానభంగం చేసినందుకు విధించిన పదేళ్ల జైలు శిక్షకుగాను ఏడేళ్లు జైల్లో ఉండి, సత్ప్రవర్తన వల్ల మూడేళ్ల ముందే విడుదలయిన వాడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్త చూస్తుండగా ఆఫీసు వచ్చింది. మనసును కలచివేస్తున్న ఆ విషయాన్ని ఆలోచనల్లోంచి పక్కకు నెట్టేసి ఆఫీసు లోపలికి అడుగుపెట్టాను.‘అమ్మా, తిన్నావా? నాన్న ఇంటికి వచ్చారా? ఫోన్ చేస్తే ఎత్తలేదు.‘‘నాన్న గంట క్రితమే వచ్చారమ్మా. ఇందాకే తిన్నాము. ఆయన నిద్రొస్తోందని ఇందాకే నడుం వాల్చారు. నువ్వు చెప్పు. కొత్త పోస్టులో ఫస్ట్ డే ఎలా ఉంది?’’
‘ఇప్పటివరకూ చాలా బావుందమ్మా. నాకు కొత్త షో ఇచ్చారు. ఈ వారం దానికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. పెద్ద బాధ్యత ఉంది కానీ బరువుగా అనిపించడం లేదు. ఆసక్తిగా వుంది. ఇంకో విషయం, కాలేజీలో అర్జున్ అని నా మిత్రుడుండేవాడుకదా! తను యూకే నుంచి మొన్నే వచ్చాడమ్మా. స్నేహితులందరమూ ఇవాళ కలుద్దామను కుంటున్నాము. తను రేపు వెళ్ళిపోతున్నాడు. అదీ కాక అందరినీ కలిసి చాలా రోజులయ్యింది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో! అందుకని ఇవాళే వెళ్తాను. కొంచెం ఆలస్యమవ్వచ్చు. మీరు తినేసి వుండండి. నాకోసం వేచుండద్దు’– అమ్మతో మాట్లడిన ఆఖరి మాటలు. నాన్నతో అయితే ఇవాళ మాట్లాడలేదు కూడా. ఇప్పుడు మళ్ళీ మాట్లడగలనో, లేదోనని భయమేస్తోంది.కాలేజీ స్నేహితులను కలిసి, వారితో విందు ముగించుకుని ఫోన్లో ఆటో బుక్ చేశాను. ఇరవై నిమిషాలకు ఒక రైడ్ కన్ఫర్మ్ అయ్యింది. వచ్చిన ఆటో డ్రైవర్‘మేడమ్, రైడ్ క్యాన్సిల్ చేసెయ్యండి. మీకు చూపిస్తున్న కిరాయిలో ఎక్కువ శాతం యాప్ వాళ్ళకే పోతుంది. రైడ్ క్యాన్సిల్ చేసి, దానికన్నా ఒక యాభై తక్కువిస్తే మీకూ, నాకూ లాభమే.’
‘క్యాన్సిల్ ఎందుకులే అన్నా. నేనే వంద రూపాయలు ఎక్కువిస్తాను’ అనుమానం వచ్చినా, ఇంకో ఆటో దొరకదేమోనన్న భయంతో, రైడ్ ట్రాక్ అవుతుందన్న ధీమాతో బండి ఎక్కేశాను. ఇంతలో ఫోన్ మోగింది.‘హాయ్ కీర్తీ! ఇప్పుడే ఆటో ఎక్కాను. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తానులే. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు.’ ఫోన్ మాట్లడుతూ వున్నా, ఒక కన్ను డ్రైవర్ తీరు మీద, రోడ్డు మీద వేసుంచాను. వెళుతూ వున్నంతసేపూ బానే ఉన్న డ్రైవర్, ఇంటి దగ్గరకొచ్చేసరికి స్పీడు పెంచి మా ఇంటిని దాటేశాడు. ఫోన్లో యాప్ ఓపెన్ చేసి చూస్తే, ‘డెస్టినేషన్ రీచ్డ్. హౌ వస్ యువర్ రైడ్ విత్ చెన్నకేశవులు?’ (మీరు మీ గమ్యాన్ని చేరుకున్నారు. చెన్నకేశవులుతో మీ ప్రయాణం ఎలా జరిగింది?) అని చూపించింది. ప్రమాదంలో ఉన్నానని అర్థమయ్యి అప్రమత్తమయ్యాను. ఇంటికి ఫోన్ చెయ్యబోయాను. ఇంతలో అతను ఏదో స్ప్రే కొట్టాడు.
కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా డ్రైవర్‌తో సహా ముగ్గురున్నారు– అర్ధనగ్నంగా. బ్రతిమాలాను. వేడుకున్నాను. ఒక్కరు కూడా కరగలేదు. కనికరం లేకుండా రెండు గంటల పాటు వారి పని ముగించుకుని, పోలీసు సైరన్ వినపడగానే పారిపోయారు. ఒకవేళ వీళ్ళని పోలీసులు పట్టుకున్నా, ఈ రాత్రి జరిగినది నా మనసులోనుంచి చెరిగిపోదుగా! అసలు నేను గురైన హింసని నా శరీరం తట్టుకుంటుందా? నేను బ్రతికుంటానా? అసలు ఇది అనుభవించడానికి నేనేం తప్పు చేశాను? పద్ధతిగానే బట్టలు వేసుకున్నాను కదా! ఏమిటి నేను చేసిన తప్పు? స్నేహితుల్ని అయిదేళ్ళ తరువాత కలవడమా? లేదా స్నేహితుడు ఇంట్లో దింపుతానన్నా, తనని ఇబ్బంది పెట్టడమెందుకని ఆటో ఎక్కడమా? అసలు నేను అమ్మాయిగా పుట్టడమే నా శాపమా? ఏమో. ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేను. అందుకే దీన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాను.
ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదూ! నాకు ఒక పేరంటూ లేదు. భారతదేశంలో రోజూ అఘాయిత్యానికి గురయ్యే తొంభైమంది అమ్మాయిల ప్రతిబింబాన్ని నేను. అందరూ పూజించే దేవిని నేను. కొందరు ఆర్పేయడానికి ప్రయత్నిస్తున్నా వెలగడానికి అనుక్షణం యత్నిస్తున్న జ్యోతిని నేను. ప్రాణం కొట్టుమిట్టాడుతున్నా, నా వాళ్ళ కోసం మృత్యువుతో పోరాడుతున్న యోధురాల్ని నేను. సుఖంగా, సురక్షితంగా ఉండే జీవితానికి నోచుకోలేని అభాగ్యురాలిని నేను. పోరాడకుండా ఒక రోజు కూడా గడవదే! నేను జీవితాంతం, అనుక్షణం, ఏ జంతువు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని జాగ్రత్తపడుతూ ఉండాల్సిందేనా?’’
‘ఇది ఈ వారం మనసులోని మాట కార్యక్రమంలోని కథ. ఇది ఎవరు పంపించారో కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంపించారు. చదివి వినిపిస్తున్న నాకే గుండె ఇలా బరువెక్కుతోంటే, తను దీనిని ఎలా అనుభవించారో ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. కానీ తను అన్నిటినీ ఎదుర్కొని మనతో ఇది పంచుకోవడమే ఒక గొప్ప విషయం. ఈ మనసులోని మాటను పంపించిన వారు ఇది వింటున్నారనుకుంటున్నాను. మీకు మా జోహార్లు. ఇంకో నిర్భయ, అభయ, దిశలు రాకుండా చేద్దామని మనందరం శప«థం చేద్దాం.
అది మనందరి బాధ్యత. వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మనసులోని మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకూ వింటూనే ఉండండి, నవోదయం ఎఫ్‌ఎం, ప్రతీరోజూ కొత్త ఆరంభం. నేను మీ ఆర్‌జే అను. ఇది మనసులోని మాట–మదిని హత్తుకుంటుంది.’ హెడ్‌ఫోన్స్ తీసి, బ్యాగు సర్దుకుని నా కథని చివరకి ఈ ప్రపంచానికి చెప్పానన్న సంతృప్తితో ఆఫీసు బయటకు వచ్చాను.‘లేటయ్యానా? నీ ప్రోగ్రాం వింటూ వచ్చా. చాలా బాగా మాట్లాడావు. ప్రౌడ్ ఆఫ్ యూ.’ వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ కనిపించాడు. కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన కొంత కాలానికి ఏర్పడిన మా పరిచయం ప్రేమకు దారితీసి, మూడేళ్ళ క్రితం మేము ఒకటయ్యేలా చేసింది. తన హాస్పిటల్‌కు, మా ఆఫీసుకు ఒక కిలోమీటరే తేడా. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు.
‘లేదు. సమయానికే వచ్చావు. ఆకలేస్తోంది. ఏమయినా తిందామా?’‘సరే, పద.’ పక్కనే వున్న చాట్ బండి దగ్గరకు వెళ్ళి కచోరీ ఆర్డర్ ఇచ్చాక, నా మనసు నన్ను బలవంతంగా గతంలోకి లాక్కెళ్ళింది. అయిదేళ్ళ క్రితం, ఆ భయంకరమైన రాత్రి నాడు తను ఏదో ఎమర్జెన్సీ కేసులో ఉండడంవల్ల పక్కరోజుకుగాని విక్రమ్‌కి జరిగిన విషయం తెలియలేదు. నాకు తెలివి వచ్చే సరికి చేతికి ఏవో ట్యూబ్లు తగులుతూ వున్నాయి. నేనింకా బ్రతికే ఉన్నానని అర్థమయ్యింది. ఆసుపత్రిలో వున్నాననుకుంటా! ఎదురుగా అమ్మా, విక్రమ్ మాట్లడుకుంటూ వున్నారు. వాళ్ళని చూడగానే ఆనందం, బాధ వలన కన్నీరు తన్నుకొచ్చింది. నాకు మెలకువ రావడం వాళ్ళిద్దరూ ఇంకా గమనించలేదు. వున్నట్టుండి నా మనసు నా చిన్ననాటి స్నేహితురాలు శాలిని మీదకు మళ్ళింది. తను చిన్నప్పటినుంచి ఎంతో చలాకీగా వుండేది. చాలా అందంగా వుంటుంది కూడా.
తన చదువు పూర్తయిన వెంటనే తన దూరపు బంధువుతో తనకి పెళ్ళి చేశారు. ఇద్దరూ మొదట్లో బాగానే వుండేవారు. కానీ ఒక సంఘటన వారిని విడదీసింది. శాలిని కాలేజీలో వున్నప్పుడు ఒకతను తనను పెళ్ళిచేసుకోమని వెంటపడేవాడు. అందుకు తను ఒప్పుకోకపోవడం అతని అహం మీద దెబ్బకొట్టింది. శాలినీకి పెళ్ళయ్యిందని తెలుసుకున్న అతడు, ఒకరోజు వచ్చి తనపై యాసిడ్ దాడి చేశాడు. తను సమయానికి మొహం మీద చెయ్యి అడ్డుపెట్టుకోవడంతో కళ్ళకు ప్రమాదం తప్పి, కేవలం నుదురు, చెయ్యిపై యాసిడ్ ప్రభావం పడింది. ఆ దుర్ఘటన తరువాత, కేవలం తన అందం మీద మోజుతో పెళ్ళి చేసుకున్న భర్త, తననుండి విడాకులు కోరాడు. అతని నిజస్వరూపం అందరికీ అప్పుడే అర్థమయ్యింది. అది శాలినీని ఎంతో మనోవేదనకు గురిచేసింది.
జరిగేవన్నీ మన మంచికే అనుకునే నేను, విక్రమ్ ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇంతలో నేను కళ్ళు తెరవడం చూసి అమ్మా, విక్రమ్ నా దగ్గరకు వడివడిగా వచ్చారు. అమ్మ ఏడుస్తూ వచ్చి కౌగిలించుకుని, నాన్నకు నేను స్పృహలోకి వచ్చిన విషయం తెలిపేందుకు వెళ్ళింది. విక్రమ్ వచ్చి ఏమీ మాట్లాడకుండా చెయ్యి పట్టుకుని నా మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. తను కూడా శాలిని మాజీ భర్తలా చేస్తాడా? జీవితాంతం తోడుంటానన్నవాడు ఇప్పుడు చెయ్యి విడిచి వెళ్ళిపోతాడా? అటువంటి ఆలోచనలు నా మదిని కలవరపెడుతుండగా తన కన్నీటి చుక్కలు నా చేతి మీద పడ్డాయి. ‘అనూ, మాకు చాలా భయమేసింది. నువ్వు పద్దెనిమిది గంటలపాటు స్పృహలో లేవు. నువ్వు మొత్తానికి లేచావు. పరిస్థితులు మళ్ళీ చక్కబడతాయి. మనం దీనిని కలిసి జయిద్దాం!’ నా అరచేతిలో తన తల వాల్చి, పసిపిల్లాడిలా ఏడుస్తూ, నాకు ధైర్యాన్నిస్తున్న తనని చూస్తే ముచ్చటేసింది. మనసు కుదుటపడింది.
‘ఓయ్’ అంటూ నా భుజాన్ని విక్రమ్ తాకడంతో వర్తమానంలోకి వచ్చాను.‘అసలు నేనిప్పటివరకూ మాట్లాడినవేమయినా విన్నవా? ఏమాలోచిస్తున్నావు?’‘ఏమీ లేదు. మన బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికయినా ఈ లోకం సురక్షితంగా మారకపోదా అని ఆలోచిస్తున్నా అంతే!’ తన భుజమ్మీద తల వాల్చాను. నన్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో భద్రతగా అనిపించింది. ‘ఆ!’– ‘ఏమైంది?’– ‘తను తంతోంది. చెయ్యి పెట్టి చూడు.’ తన చేతిని నా పొట్ట మీద ఆనించాను. ఆ చిన్ని ప్రాణాన్ని స్పృశిస్తూ గడుపుతున్న మధురక్షణాలలో అనిపించింది–‘నాట్ ఆల్ మెన్. బట్ సమ్ హౌ ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యాన్’. మగాళ్ళందరూ చెడ్డవారు కాదు. కానీ అటువంటి హానికరమయిన వారెవరో, మంచివారెవరో తెలుసుకొనుట ఎటుల? నా పసిపాప పెరిగే సమయానికయినా ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే బావుండు!