
దశరథుడు కైకకు ఇచ్చిన మాటను అమలు చేయడానికి సీతా సమేతంగా రాముడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వారికి తోడుగా బయలుదేరాడు. అయోధ్యను విడిచి సీతా రామ లక్ష్మణులు అడవుల వైపు సాగారు. అడవుల్లో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, ముందుకు సాగుతూ, కొన్నాళ్లకు వారు దండకారణ్యం చేరుకున్నారు. దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కీకారణ్యం. సీతా రామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతున్నారు. గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. కొనదేలిన రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. అడపా దడపా క్రూర మగాల గంభీర రావాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి.
అంతలోనే ఆకాశం మేఘావతమైంది. ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరవసాగాయి. కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది.‘నాథా! దాహం వేస్తోంది. దగ్గర్లో తటాకం ఏదైనా కనిపిస్తుందేమో చూడండి’ అందామె. దగ్గరలో నీటి జాడ కానరాలేదు. సీతా రామ లక్ష్మణులు ముగ్గురూ మాట్లాడుకుంటూ ముందుకు నడక సాగించారు. కొంత దూరం నడిచాక కనుచూపు మేరలో ఒక చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్ది, దాని చుట్టూ దట్టమైన ముళ్ల కంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైంది. లక్ష్మణుడు కత్తితో ముళ్ల కంచెలను కత్తిరించి, తోవ ఏర్పాటు చేశాడు. రాముడు కొంత దూరంలో చెట్టుకు ఆనుకుని నిలబడ్డాడు. సీత కూడా భర్త పక్కనే నిలబడింది. నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు.
అదే సమయంలో భీకర ధ్వని వినిపించింది. ఆ ధ్వని క్రూరమగాల గర్జనలా లేదు. అంతకు మించిన తీవ్రతతో కర్ణభేరులు అదరగొట్టే ధ్వని అది. ఉలిక్కిపడిన లక్ష్మణుడు తన వెనుకనే ఉన్న సీతా రాములకు ఆపద ఏమైనా రాలేదు కదా అనే అనుమానంతో వెనక్కు చూశాడు. దూరాన చెట్టుకు ఆనుకుని రాముడు కనిపించాడు. తన వెనుక సీత ఉన్న వైపు రాముడు చూశాడు.
అటువైపు భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. గుహలాంటి నోరు తెరిచి, వికటాట్టహాసం చేస్తూ వాడు సీతను ఒడిసి పట్టుకుని ఉన్నాడు. సీత ఎంతగా వదిలించుకుంటున్నా, ఏమాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేశాడు. రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు. ఇద్దరూ రాక్షసుడి వైపు విభ్రాంతులై చూశారు. వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతన చూసి రామ లక్ష్మణులు దిగ్భ్రాంతులయ్యారు.
సీతను పట్టుకుని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చాడు.
‘నా పేరు విరాధుడు’ అని వికటాట్టహాసం చేశాడు ఆ రాక్షసుడు.
రామ లక్ష్మణులు బదులు పలకక వాడి వైపు తీక్షణంగా చూశారు.
‘ఏం అలా చూస్తున్నారు? నా పేరు ఎప్పుడూ వినలేదా? చూడబోతే మీరు ఇదివరకు ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే! పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు నారవస్త్రాలు ధరించి, విల్లంబులు, ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు. ఈమెను చూడబోతే సర్వాలంకృతగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తోంది. మీరు మోసకారుల్లా ఉన్నారు. ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పట్టుకువచ్చారు? అంతఃపుర స్త్రీని పట్టుకొస్తే పట్టుకొచ్చారు గాని, బుద్ధి ఉన్నవారెవరైనా సుకుమారులైన స్త్రీలను అడవికి పట్టుకొస్తారా?’ అని గద్దించాడు.
రామ లక్ష్మణులు బదులివ్వకపోవడంతో విరాధుడు మళ్లీ ఇలా అన్నాడు: ‘అడవి జంతువులను తిని మొహం మొత్తింది. ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది. అయితే ముందు మీరెవరో చెప్పండి. మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను’ అన్నాడు. ‘అసలు నువ్వెవరివో చెప్పు. నువ్వెవరివో తెలియకుండా నిన్ను చంపము’ అన్నాడు లక్ష్మణుడు.‘మీరెవరని అడిగితే బదులివ్వకుండా, నన్నే నువ్వెవరివని అడుగున్నారే? ఒక్క పిడికిటి పోటు యమపురికి పోయే మీతో ఇంత మట్లాడటం అనవసరం’ అని రెచ్చిపోయాడు విరాధుడు.
అప్పుడు రాముడు ‘మేము రామ లక్ష్మణులం. ఈమె నా పత్ని జానకి. ఈమెను ఏ అంతఃపురం నుంచి పట్టుకు రాలేదు. స్వయంవరంలో శివధనుర్భంగం చేసి పెళ్లాడాను’ అన్నాడు. అప్పుడు విరాధుడు ‘నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద. నన్ను విరాధుడంటారు. తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాను. ఎలాంటి ఆయుధాలైనా నన్నేమీ చేయలేవు. ఈమెను ఇక్కడ విడిచిపెట్టి, మీ దారిన మీరు వెళ్లండి’ అని పలికాడు.రాముడు కుపితుడయ్యాడు. ‘ఓరీ, రాక్షసాధమా! భూమ్మీద బతకాలని ఉంటే నా సీతను వదిలి వెనక్కు వెళ్లిపో!’ అన్నాడు.‘నన్ను చంపుతానంటున్నారుగా! వ్యర్థప్రలాపాలు దేనికి? చూపించండి మీ ప్రతాపం’ అన్నాడు. అక్కడితో ఆగకుండా, తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు.
రాముడు నాలుగు బాణాలను వెనువెంటనే సంధించి, ఆ శూలాన్ని గాల్లోనే ముక్కలు చేశాడు. విరాధుడు రెచ్చిపోయి, సీతను అక్కడే వదిలేసి, రామ లక్ష్మణులిద్దరినీ చెరో చేత్తో ఒడిసి పట్టుకుని, అడవిలో పరుగులు తీశాడు.లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి, ఒడిసి పట్టుకున్నాడు.‘అన్నా! వీడి చెరో భుజాన్నీ ఇద్దరం ఒకేసారి నరికేద్దాం’ అన్నాడు.ఇద్దరూ ఒకేసారి విరాధుడి రెండు భుజాలను ఒక్కసారే నరికేశారు. వాడు పెడబొబ్బలు పెడుతూ కుప్పకూలాడు. అయినా, అతడి ప్రాణం పోలేదు. ‘తపశ్శక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు. నేను వీడి కంఠాన్ని తొక్కి పడతాను. నువ్వు గొయ్యి తవ్వు. అందులో వీణ్ణి పూడ్చేద్దాం’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు గొయ్య తవ్వుతుండగా, విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు. వెంటనే విరాధుడి ప్రాణం పోయింది.
∙సాంఖ్యాయన