‘‘రాజకీయాలలో మీకు అంత ఆసక్తి ఎందుకు?’’ అని 1920లో జెనీవా సదస్సులో ఒకరు సరోజినీ నాయుడిని ప్రశ్నించారు. ‘‘నిజంగా భారతీయులైన వారందరికీ రాజకీయాలలో ఆసక్తి అనివార్యం’’ అని ఆమె బదులిచ్చారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన మహాత్మాగాంధీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతుండగా, సరోజినీ నాయుడు నేతృత్వంలో కొందరు మహిళా జాతీయవాదలు ఆ ఊరేగింపులో చేరారన్నది ఒక సన్నివేశంగా నా మనోపథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అయితే అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏంటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. ధైర్యం, దేనికీ తలవంచని తత్వం, జాతీయవాద ఉద్యమానికి కట్టుబడి ఉండటం, రాజకీయంగా సునిశిత ప్రతి.. అన్నీ ఆమె ప్రతిష్ట నుంచి పొంగి పొర్లుతాయి. ఆమె ఉప్పు సత్యాగ్రహంలోకి వచ్చేయడం చూసిన గాంధీజీ, ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను పలకరించారు.
హైదరాబాద్‌లో జన్మించిన బాల మేధావి సరోజినీ చటోపాధ్యాయ. ఆమెకు కవిత్వం అంటే ప్రేమ. ఆమె సాహిత్యాభిరుచిని ప్రోత్సహించడంలో తల్లి, కవయిత్రి అయిన వరద సుందరీ దేవికి తండ్రి కూడా తోడు నిలిచారు. పై చదువుల కోసం ఆమెను ఇంగ్లండ్‌కి పంపారు. అక్కడి గోవింద నాయుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1898లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమె మద్రాసులో ఆయనను వివాహమాడారు.
ఆ కాలంలో కులాంతర వివాహం సమాజానికి ఎదురీతే. మహిళల హక్కులు, స్వాతంత్య్రోద్యమానికి తొలినాటి ఉద్యమకారిణులలో ఆమె ఒకరు. హిందూ–ముస్లిం ఐక్యతను ప్రబోధించేవారు. 1947లో ఉత్తర ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలో ఆమె మొదటి మహిళా గవర్నర్. గవర్నర్‌గా ఉన్న సమయంలోనే 1949లో ఆమె అంతిమ శ్వాస విడిచారు.
– ఊర్వశీ బుటాలియా, జుబాన్ బుక్స్ సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment