బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జాతీయోద్యమంలో ఉత్సాహంగా ఉరకలేశారు. కడప జిల్లాకు చెందిన వారు కూడా తెల్లదొరలపై తిరుగుబాటు బావుటా ఎగరేసి జైలు జీవితం గడిపారు. అలాంటి వారి గురించిన సంక్షిప్త సమాచారం సాక్షి పాఠకుల కోసం..
కడప కల్చరల్ : స్వాతంత్య్ర సంగ్రామంలో మన జిల్లాకు విశిష్ట స్థానముంది. 1847లో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై తిరుగుబాటుతో ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అనంతరం మన జిల్లాలో పుల్లంపేటకు చెందిన షేక్ పీర్‌షా ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో దేశ ద్రోహం నేరంపై ఆయనను అరెస్టు చేసి తిరునల్వేలి జైలులో పది సంవత్సరాలు బంధించారు. ప్రొద్దుటూరులో కలవీడు వెంకట రమణాచార్యులు, వెంకోబారావు తెల్లవారికి వ్యతిరేకంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అలీఘర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మహహ్మద్ హుసేన్, షఫీవుర్ రెహ్మాన్ 1921 నవంబరు 21న కడపలో బ్రిటీషు వ్యతిరేక సభలు నిర్వహించారు. ఖిలాఫత్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫలితంగా నెల్లూరు జైలులో బంధింపబడ్డారు.
1921లో గాంధీజీ జిల్లాలో పర్యటించినప్పుడు (27.09.1921) రాజంపేటలో ప్రసంగించారు. 28న కడప పట్టణంలో పర్యటించారు. మౌలానా సుబహాని ఉర్దూలో మాట్లాడి విదేశీ వస్త్రాలను త్యజించమని పిలుపునిచ్చారు. నాటి ప్రముఖులు కె.సుబ్రమణ్యం తన కరణం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈత చెట్ల నరికివేత, ఖద్దరు వ్యాప్తి, మద్య నిషేధం అమలు చేయడంలో జిల్లా వాసులు చురుగ్గా వ్యవహరించి జమ్మలమడుగులో నాలుగు ఖద్దరు అంగళ్లు ఏర్పాటు చేశారు. 1940లో జరిగిన సత్యాగ్రహంలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి, చందన వెంకోబరావు, స్వర్ణనాగయ్య, ఎంసీ నాగిరెడ్డి, భూపాళం సుబ్బరాయశెట్టి, రావుల మునిరెడ్డి, భాస్కర రామశాస్త్రి, చవ్వా బాలిరెడ్డి, గాజులపల్లె వీరభద్రరావు, వీఆర్ సత్యనారాయణ, పార్థసారథి, ఆర్.సీతారామయ్య పాల్గొన్నారు.
జమ్మలమడుగులోని పెద్ద పసుపులలో కడప కోటిరెడ్డి సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. నబీరసూల్, దూదేకుల హుసేన్ సాబ్ కూడా జైలు పాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రాయచోటికి చెందిన హర్షగిరి నరసమ్మ రహస్య కార్యకలాపాల్లో పాల్గొని గుంతకల్లులో అరెస్టు అయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ నాయకత్రయంగా వై.ఆదినారాయణరెడ్డి, భాస్కర రామశాస్త్రి, పోతరాజు పార్థసారథి స్వాతంత్య్ర పోరాటంలో తీవ్ర కృషి చేశారు. 11.12.1942 నుంచి 07.12.1944 వరకు జైలు జీవితం అనుభవించారు. సీతారామయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో ముద్దనూరు రైల్వేస్టేషన్ నుంచి తపాలా సంచులను తస్కరించి అరెస్టు అయ్యారు. టేకూరు సుబ్బారావు, టి.చంద్రశేఖర్‌రెడ్డి, కోడూరుకు చెందిన రాఘవరాజు, చమర్తి చెంగలరాజు తదితరులు కూడా ఉద్యమంలో జైలు పాలయ్యారు. నర్రెడ్డి శంభురెడ్డి, పంజం పట్టాభిరెడ్డి, పెద్ద పసుపులకు చెందిన ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, బొమ్ము రామారెడ్డి తదితరులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment