freedom fighters
-
Durgawati Devi: మూడేళ్ల కొడుకును పణంగా పెట్టి... భగత్‌సింగ్‌ను కాపాడిన భాభీ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్వీర్... వీరంతా ఆమెను ‘దుర్గా భాభీ’ అని పిలిచేవారు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో పిస్తోల్ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను హత్య చేసిన భగత్‌సింగ్‌ను లాహోర్ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తిందామె. చరిత్ర పుటలలో కనుమరుగై పోయిన ఆ త్యాగమయి గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...‘సైమన్ గోబ్యాక్’ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్ మీద బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్‌లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు ‘హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ (హెచ్ఎస్ఆర్ఏ) సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్ ఓహ్రా నడుపుతున్న గ్రూప్. చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితరులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి లాఠీచార్జిని ఆర్డర్ వేసిన బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్‌ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు పరచడమే తరువాయి.స్కాట్ బదులు సాండర్స్భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఈ ముగ్గురు 17 డిసెంబర్ 1928న లాహోర్‌లో పోలీస్ ఆఫీసర్ స్కాట్‌ను హతమార్చడానికి సిద్ధమయ్యారు. అయితే బైక్ మీద రావాల్సిన స్కాట్ కారులో, కారులోనూ రావాల్సిన మరో అధికారి సాండర్స్ బైక్ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్‌పై మొదట రాజ్‌గురు, ఆ తర్వాత భగత్ సింగ్ తుపాకీ పేల్చి అతణ్ణి హతమార్చారు. లాహోర్ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు... బస్టాండ్లు... రైల్వేస్టేషన్లు కమ్ముకున్నారు. లాహోర్‌లో ఉండటం భగత్‌సింగ్‌కు ఏ మాత్రం మంచిది కాదు. అతణ్ణి తప్పించేవారు ఎవరు?ఆమె వచ్చిందిభగవతి చరణ్ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాభాభీ అని పిలిచేవారు. సాండర్స్‌ని హత్య చేశాక భగత్‌సింగ్, రాజ్‌గురు నేరుగా దుర్గావతి దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆమె భర్త వేరే పని మీద కలకత్తా వెళ్లి ఉన్నాడు. జరిగింది తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్‌సింగ్‌ను లాహోర్ దాటించడానికి సిద్ధమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్ పెట్టి రూపం మార్చిన భగత్‌సింగ్‌కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో మరుసటి రోజు సాయంత్రం లాహోర్ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరదీసింది. వందలాది నిఘా కళ్ల మీద ఈ పని చేయడం చాలా ప్రమాదం... మూడేళ్ల కొడుక్కు కూడా ఏదైనా కావచ్చు అని భగత్‌సింగ్ ఆమెతో అన్నాడు. ‘నా కొడుక్కు మరణం సంభవిస్తే ఒక దేశభక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది’ అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్‌సింగ్ ఆధునికవేషంలో ఉన్న అధికారిగా, దుర్గావతి అతని భార్యగా, రాజ్‌గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటిష్ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్‌సింగ్‌ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కు వచ్చింది దుర్గావతి.గొప్ప దేశభక్తురాలుస్వతంత్ర పోరాటం చేస్తున్న భగవతి చరణ్ ఓహ్రాను వివాహం చేసుకునేనాటికి దుర్గావతికి 13 ఏళ్లు. పెళ్లి తర్వాతనే చదువుకుంది. ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. సాయుధ పోరాటం చేయాలన్న భర్త ఆశయానికి మద్దతుగా నిలిచిందామె. భగత్‌సింగ్‌ను తన కన్నబిడ్డలా భావించింది. భగత్‌సింగ్ పార్లమెంట్లో బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాక ఆ తర్వాతగాని అతడే సాండర్స్ హత్యలో ఉన్నాడన్న సంగతి పోలీసులకు తెలియలేదు. ఆ కేసు వాదనలను బ్రిటిష్ ప్రభుత్వం హడావిడిగా ముగించి అక్టోబర్ 7, 1930న తీర్పు వెలువరించి భగత్‌సింగ్‌కు మరణశిక్ష విధించింది. అయితే లాహోర్‌లో ఈ విచారణ జరుగుతున్నప్పుడు భగత్‌సింగ్‌ను తీసుకెళ్లే వ్యానుపై బాంబుదాడి చేసి అతణ్ణి కాపాడాలని ప్లాన్ చేసింది దుర్గావతి. వీలు కాలేదు.భర్తను కోల్పోయిభగత్సింగ్ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఞానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది దుర్గావతి. భగత్‌సింగ్ మరణశిక్ష విధించాక ఆగ్రహంతో బొంబాయి వెళ్లి బ్రిటిష్ గవర్నర్‌ను చంపాలనుకుంది. అయితే గవర్నర్ దొరకలేదు. మరో బ్రిటిష్ అధికారి మీద స్వయంగా గుళ్ల వర్షం కురిపించి పగ చల్లార్చుకుంది. భగత్ సింగ్ ఉరి (1931 మార్చి 23) తర్వాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం, పోలీసుల వెతుకులాట ఎక్కువ కావడంతో తనే వెళ్లి లొంగిపోయింది. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం మొదట లక్నో ఆ తర్వాత ఘజియాబాద్‌లో పెద్దగా పబ్లిక్‌లో ఉండటానికి ఇష్టపడక స్కూల్ నడుపుతూ 1999లో తన 92వ ఏట మరణించిందా గొప్ప దేశభక్తురాలు, భారత తొలి సాయుధ పోరాట సమరయోధురాలు దుర్గాభాభీ. -
సీతాఫలంపై మహాత్ముల బొమ్మలు
-
స్వరాజ్య పోరులో గర్జించిన మన్యం
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం (టీఎఫ్ఎఫ్ఎం) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్య పోరాటంలో గర్జించిన మన్యం మొనగాళ్ల చరిత్రను ఈ మ్యూజియం భావితరాల కళ్ల ముందు ఉంచనుంది. గిరిజన పోరాట యోధుల చరిత్రతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి స్ఫూర్తి నింపే సంకల్పంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. రూ.35 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియంను నాలుగు జోన్లు(భాగాలు)గా నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పూర్వ యుగం, బ్రిటిష్ పాలన, స్వాతంత్య్ర పోరాటం(తిరుగుబాటు), బ్రిటిష్ వాళ్లు పలాయనం (స్వాతంత్య్రం తర్వాత) అనే నాలుగు ప్రధాన విభాగాలుగా గిరిసీమ చరిత్రను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నానికి ఈ మ్యూజియం వారధిగా నిలవనుంది. మన్య సీమతో పెనవేసుకున్న ఖోండ్ తిరుగుబాటు (1835–37), సవరా తిరుగుబాటు (1853), లాగరాయ్ పితూరి (1914–16), మన్యం (రంప) తిరుగుబాటు(1922–24), మూకదొర తిరుగుబాటు (1924–26), చెంచు తిరుగుబాటు(1938)తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన ఘట్టాలకు ఈ మ్యూజియం నెలవు కానుంది. గాండ్రించిన మన్యసీమ స్వాతంత్య్ర పోరాటంలో మన్యసీమ కేంద్రంగా గాండ్రించిన మొనగాళ్ల చరిత్రతోపాటు అనేక వీరోచిత ఘట్టాలు ఈ మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతోపాటు గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను మ్యూజియంలో నెలకొల్పనున్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు. గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చోని వీక్షించేలా డిజిటల్ థియేటర్ నిర్మిస్తున్నారు. ట్రైబల్ థీమ్ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్ థియేటర్, స్వాగత ప్లాజా నిర్మిస్తున్నారు. చరిత్రను పదిలం చేసే పనులు షురూ.. మ్యూజియం నిర్మాణం పనులు వేగవంతం చేయడంతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన చరిత్రను పదిలం చేసే పనులు ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించి గత నెల 18న అల్లూరి జిల్లా సీతంపేట ఐటీడీఏలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ), వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, పశు సంవర్ధక శాఖ, జిల్లా పర్యాటక అధికారి, ఉప విద్యా అధికారి, గిరిజన ఉపాధ్యాయులు, వెలుగు సొసైటీ సభ్యులు, గిరిజన తెగల గ్రామ స్థాయి కమిటీల సమన్వయంతో చారిత్రక ఆధారాలను సేకరించేలా సమాయత్తం చేశారు. మన్యం కేంద్రంగా సాగిన స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన ఆధారాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన సామగ్రిని సేకరించేలా దిశానిర్ధేశం చేశారు. గిరిజన జీవన విధానానికి అద్దం పట్టేలా.. గిరిజన కళాఖండాలు, వస్తువులు, నమూనాలు రెండేసి చొప్పున సేకరించి ఒకటి మ్యూజియంకు, మరొకటి స్థానికంగా ఐటీడీఏలలో భద్రపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గిరిజన తెగకు సంబంధించిన వస్తువుల (కళాఖండాలు) జాబితాను సిద్ధం చేయనున్నారు. వాటిని వీలైనంత పెద్ద సైజులో ఫొటోలు తీయిస్తారు. వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. గిరిజనులు ఉపయోగించిన నీటి కుండలు, సీసా పొట్ల కాయలు, సంగీత పరికరాలు, చేపలు పట్టే సామగ్రి, వేటకు వాడిన ఉచ్చులు, నూనె వెలికితీత యంత్రాలు, చెక్క ఇల్లు, గుళిక విల్లు, విల్లు, బాణాలు, వ్రస్తాలు, ఆభరణాలు (పూసల తదితర లోహాలతో కూడిన నగలు), వ్యవసాయ పనిముట్లు, పరికరాలు సేకరిస్తారు. గిరిజన జాతరలు, పండుగలు, మౌఖిక సంప్రదాయాలు, పాటలు, దేవుళ్లు, దేవతలు, సంప్రదాయ నిపుణులు, వివాహ తంతు, స్మారక స్తంభాలు, చెక్క క్రాఫ్ట్, కుండలు, ఇనుప వస్తువులు, ముసుగులకు సంబంధించిన అనేక వస్తువులు, సవివరమైన చరిత్రను అందుబాటులోకి తెస్తారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017 నుంచి కనీసం భూమిని కూడా కేటాయించకపోడంతో దీని నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మ్యూజియం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ శాఖల సమన్వయంతో భూ కేటాయింపు సమస్యను సీఎం వైఎస్ జగన్ కొలిక్కి తెచ్చారు. 2021లో చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రం గర్వించే స్థాయిలో గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియం తాజంగిలో రూపుదిద్దుకుంటోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి శరవేగంగా నిర్మిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే తపనతో ఉన్నాం. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని 10 రాష్ట్రాలకు గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలను మంజూరు చేసింది. జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, గోవాలకు మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. వాటిలో మన రాష్ట్రానికి రూ.15 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతోపాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించింది. – కాంతిలాల్ దండే, కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ -
భారతదేశంలోని టాప్ 10 మహిళా స్వాతంత్ర్య సమరయోధులు (ఫోటోలు)
-
కాంగ్రెస్ బ్లండర్.. స్వాతంత్ర్య సమరయోధుల పక్కన సావర్కర్ ఫోటో
తిరువనంతపురం: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లో స్వాతంత్ర్య సమరయోధులతో పాటు వీర్ సావర్కర్ ఫోటో ఉంది. ప్రస్తుతం యాత్ర 14వ రోజుకు చేరుకుని కేరళలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ మద్దతుతో గెలిచిన స్వతంత్ర్య్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ కాంగ్రెస్ బ్యానర్లో సావర్కర్ ఫోటోను గుర్తించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ప్రింట్ మిస్టేక్ వల్లే బ్యానర్లో పొరపాటుగా సావర్కర్ ఫోటో పడిందని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. సావర్కర్ ఫోటోపై గాంధీ ఫోటోను అంటింటి తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్ ఏనాడూ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించలేదు. ఆయన బ్రిటీష్ వాళ్లకు క్షమాపణలు చెప్పిన బలహీనమైన వ్యక్తి అని విమర్శలు చేసింది. అలాంటిది ఆయన ఫోటో ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్లో కన్పించడం రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయింది. దీన్నే అదనుగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్‌పై సెటైర్లు వేసింది. హస్తం పార్టీ ఇప్పుడైనా నిజం తెలుసుకుని వీర్ సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించిందని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పుడైనా తేరుకోవడం శుభపరిణామం అని పంచులు వేసింది. చదవండి: ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్త పేరు -
భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. 76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి 3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి 5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి #WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National) https://t.co/7b8DAjlkxC — ANI (@ANI) August 15, 2022 -
ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!
నేడు ‘విభజన భయానక జ్ఞాపకాల దినం’... 2021 ఆగస్టు 14న భారత ప్రధాని మోదీ ఈ ‘డే’ని ప్రకటించారు. విషాదాలను మరిచిపోకూడదని, అవి పునరావృతం కాకుండా చూసుకోడమే ఈ విభజన భయానక జ్ఞాపకాల దినం (పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డే) ఉద్దేశం అని ఆయన వివరించారు. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలోమీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్దులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకుని కూర్చొన్న బాలుడు, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవీ విభజన జ్ఞాపకాలు. ఇవన్నీ అప్పటి ఫొటోలలో చూసి ఉంటాం. ఇంతకు మించిన విభజన ఘోరాలు కూడా ఉన్నాయి. అవి పుస్తకాలలో అక్షరబద్ధం అయ్యాయి. మతావేశాలలో చెలరేగిన ఆ కల్లోలంలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షల మంది అని అంచనా. అపహరణకు గురైనవారు, అత్యాచారాలకు బలైనవారు.. బాలికలు, యువతుల 75 నుంచి లక్ష వరకు ఉంటారు. తమస్ (భీష్మ సహానీ), ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్ (కుష్వంత్ సింగ్), ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ (ఊర్వశీ బుటాలియా), ఎ టైమ్ ఆఫ్ మ్యాడ్ నెస్, మిడ్నైట్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్, స్పున్నర్), ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ (ల్యారీ కోలిన్, డొమినక్ లాపిరె), మిడ్నైట్ ఫ్యూరీస్ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో; అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో విభజన విషాదం స్పష్టంగా కనిపిస్తుంది. హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం. అంతటి విషాదాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, అలాంటిది మరొకటి జరగకుండా జాగ్రత్త పడేందుకు. జాగృతం అయ్యేందుకు. -
ఉద్యమ స్ఫూర్తి.. కడప కీర్తి
బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జాతీయోద్యమంలో ఉత్సాహంగా ఉరకలేశారు. కడప జిల్లాకు చెందిన వారు కూడా తెల్లదొరలపై తిరుగుబాటు బావుటా ఎగరేసి జైలు జీవితం గడిపారు. అలాంటి వారి గురించిన సంక్షిప్త సమాచారం సాక్షి పాఠకుల కోసం.. కడప కల్చరల్ : స్వాతంత్య్ర సంగ్రామంలో మన జిల్లాకు విశిష్ట స్థానముంది. 1847లో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై తిరుగుబాటుతో ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అనంతరం మన జిల్లాలో పుల్లంపేటకు చెందిన షేక్ పీర్షా ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో దేశ ద్రోహం నేరంపై ఆయనను అరెస్టు చేసి తిరునల్వేలి జైలులో పది సంవత్సరాలు బంధించారు. ప్రొద్దుటూరులో కలవీడు వెంకట రమణాచార్యులు, వెంకోబారావు తెల్లవారికి వ్యతిరేకంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అలీఘర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మహహ్మద్ హుసేన్, షఫీవుర్ రెహ్మాన్ 1921 నవంబరు 21న కడపలో బ్రిటీషు వ్యతిరేక సభలు నిర్వహించారు. ఖిలాఫత్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫలితంగా నెల్లూరు జైలులో బంధింపబడ్డారు. 1921లో గాంధీజీ జిల్లాలో పర్యటించినప్పుడు (27.09.1921) రాజంపేటలో ప్రసంగించారు. 28న కడప పట్టణంలో పర్యటించారు. మౌలానా సుబహాని ఉర్దూలో మాట్లాడి విదేశీ వస్త్రాలను త్యజించమని పిలుపునిచ్చారు. నాటి ప్రముఖులు కె.సుబ్రమణ్యం తన కరణం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈత చెట్ల నరికివేత, ఖద్దరు వ్యాప్తి, మద్య నిషేధం అమలు చేయడంలో జిల్లా వాసులు చురుగ్గా వ్యవహరించి జమ్మలమడుగులో నాలుగు ఖద్దరు అంగళ్లు ఏర్పాటు చేశారు. 1940లో జరిగిన సత్యాగ్రహంలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి, చందన వెంకోబరావు, స్వర్ణనాగయ్య, ఎంసీ నాగిరెడ్డి, భూపాళం సుబ్బరాయశెట్టి, రావుల మునిరెడ్డి, భాస్కర రామశాస్త్రి, చవ్వా బాలిరెడ్డి, గాజులపల్లె వీరభద్రరావు, వీఆర్ సత్యనారాయణ, పార్థసారథి, ఆర్.సీతారామయ్య పాల్గొన్నారు. జమ్మలమడుగులోని పెద్ద పసుపులలో కడప కోటిరెడ్డి సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. నబీరసూల్, దూదేకుల హుసేన్ సాబ్ కూడా జైలు పాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రాయచోటికి చెందిన హర్షగిరి నరసమ్మ రహస్య కార్యకలాపాల్లో పాల్గొని గుంతకల్లులో అరెస్టు అయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ నాయకత్రయంగా వై.ఆదినారాయణరెడ్డి, భాస్కర రామశాస్త్రి, పోతరాజు పార్థసారథి స్వాతంత్య్ర పోరాటంలో తీవ్ర కృషి చేశారు. 11.12.1942 నుంచి 07.12.1944 వరకు జైలు జీవితం అనుభవించారు. సీతారామయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో ముద్దనూరు రైల్వేస్టేషన్ నుంచి తపాలా సంచులను తస్కరించి అరెస్టు అయ్యారు. టేకూరు సుబ్బారావు, టి.చంద్రశేఖర్‌రెడ్డి, కోడూరుకు చెందిన రాఘవరాజు, చమర్తి చెంగలరాజు తదితరులు కూడా ఉద్యమంలో జైలు పాలయ్యారు. నర్రెడ్డి శంభురెడ్డి, పంజం పట్టాభిరెడ్డి, పెద్ద పసుపులకు చెందిన ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, బొమ్ము రామారెడ్డి తదితరులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. -
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులకు ఏపీ గవర్నర్ ఘన సత్కారం
సాక్షి, విజయవాడ: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’లో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సన్మానించారు. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల, స్వాతంత్ర సమరయోధులు కోపల్లె హనుమంతరావు మనుమడు హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్ కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనుమడు ఇవటూరి కృష్ణకుమార్.. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చింతకాయల చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పెనుమత్స సుబ్బన్న భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. పింగళి వెంకయ్య.. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారంతా వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారు.. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించి మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో వారికి అందించారు. "పింగళి వెంకయ్య వ్యవసాయవేత్త, మచిలీపట్నంలోనూ విద్యాసంస్థను స్థాపించిన విద్యావేత్త. 1963లో పేదరికంతో మరణించారు. 2009 లో పింగళి స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. వారి మనుమరాలు సుశీలను గవర్నర్ నేడు ఘనంగా సత్కరించారు. కోపల్లె హనుమంతరావు కోపల్లె హనుమంతరావుగారు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాదిగా బందరులో పనిచేసారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఎం.ఏ, లా డిగ్రీ చదివి ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసారు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపుతో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల ఇప్పటీకీ నడుస్తున్నాయి. వీరు కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగక ప్రయత్నించి అప్పట్లోనే లక్షలాది రూపాయల ధనంతో ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ కళాశాల 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది. వీరి మనుమడు హనుమంతరావుగారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం ఉన్న ప్రాంతానికే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.. వారిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. కాకాని వెంకటరత్నం ప్రముఖ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కాకాని వెంకటరత్నంగారు ఉక్కు కాకాణిగా పేరుగాంచారు.. 1900 సంవత్సరం ఆగస్టు 3న తేదీన కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో జన్మించారు, మహాత్మాగాంధీ ఉపదేశాలకు స్ఫూర్తి చెంది 1924లో కాంగ్రెస్ లో పనిచేశారు, 1930 ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1955 లో శాసనభ్యులుగా తొలి అడుగులువేసి మంత్రిగా పనిచేసారు. 1972 లో జైఆంధ్రా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.. ఆ ఉద్యమంలో విద్యార్థుల పై పోలీసులు కాల్పుల్లో మరణించారు అన్న వార్త విని డిసెంబర్ 25 న గుండెపోటు తో మరణించారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వారి మనుమడు కాకాని విజయ్ కుమార్‌ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావుగారు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకర్.. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడిన మలితరం మహా నాయకులలో డా.పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారున్నారు. కాళేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించిన కాళేశ్వరరావు బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పనిచేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. వారి మనుమడు ఇవటూరి క్రిష్ణకుమార్ గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు విజయవాడవాసులు.. మొదటినుండి జాతీయ భావాలు కలిగిన వీరు జాతీయ ఉద్యమంలో ఈ ప్రాంతంనుండి ప్రాతినిధ్యం వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసారు. అనేకమార్లు అరెస్ట్ కాబడి బ్రిటిష్ పోలీసులచేత దెబ్బలు తిన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి ఆరోజుల్లో వారిచేతులతోనే భోజనాలు వండి పెట్టేవారు. వీరి కుమారులు చింతకాయల చిట్టిబాబు గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి వీరు ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిలకు జైలు శిక్ష పడగా వారికి కారాగారంలో పసల కృష్ణభారతి జన్మించారు. 1921లో గాంధీ సమక్షంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరిని 1931లో ఆంగ్లేయ సర్కారు జైలుకు పంపించింది. నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను ఒడిలో పట్టుకొనే జైలుజీవితం గడిపారు. పదినెలల గర్భంతోనే జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పసల కృష్ణభారతి గారి పాదాలకు నమస్కరించి ఆమెను సన్మానించారు. పసల కృష్ణమూర్తి అంజ లక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. పెనుమత్స సుబ్బన్న సుబ్బన్న గారు.. ప్రముఖ స్వతంత్ర పోరాట సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుజీవితం గడిపిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బన్న గాంధీజీ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశమంతా ప్రజల తిరుగుబాటుతో ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనను స్తంభించే విధంగా పనిచేశారు. ఆంగ్లేయులు ఆయనను ఏలూరు, బళ్లారి జైళ్లల్లో పలుసార్లు బంధించారు. ఆ జైలలో పొట్టి శ్రీరాములు వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహా నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. 2007 సెప్టెంబర్ 22న అనారోగ్యంతో మరణించారు. పెనుమత్స సుబ్బన్నగారి భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. -
Photo Feature: స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో భరతమాత
నంద్యాల (అర్బన్): స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ 375 మంది స్వాతంత్య్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలతో భరతమాత బొమ్మ గీశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోటేష్ కాఫీ పొడిని నీటిలో కలిపి 8 గంటల వ్యవధిలో చిత్రాన్ని గీశారు. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
అడుగుల్లో అడుగులై.. పోరు కెరటాలై!
స్వాతంత్య్రోద్యమంలో శ్రీకాళహస్తికి చెందిన ఉద్యమకారులు చురుగ్గా పాల్గొన్నారు. మహాత్ముడి పిలుపుతో యువకులు ఉద్యోగాలు, వ్యాపారాలు విడిచి కదంతొక్కారు. బ్రిటీష్ దురాగతాలను ఓర్పుతో సహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా భావితరాలకు స్వేచ్ఛావాయువులందించాలనే సంకల్పంతో ముందుకు ఉరిమారు. జాతీయనాయకుల అడుగుజాడల్లో నడుస్తూ.. శ్రీకాళహస్తి కీర్తి కిరీటాన్ని ఆసేతు హిమాచలం వరకు వ్యాపింపజేశారు. హర్ ఘర్ తిరంగా.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ నాటి పోరాట పటిమ, త్యాగాలను స్థానికులు స్మరించుకుంటున్నారు. ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతున్నారు. శ్రీకాళహస్తి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. అఖిల భారత కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అనేక ఉద్యమాల పురిటిగడ్డ. స్వాతంత్య్రోద్యమంలో స్థానిక నాయ కులు పసుపులేటి సుబ్బరామదాసు, కలిశెట్టి వెంకటాచలపతి, పసుపులేటి వెంకటప్పయ్య, సుబ్రహ్మణ్యంరెడ్డి, పసుపులేటి సుబ్బమ్మ, పిండి వీరాస్వామి, పవన్ వేణుగోపాల్, పాపాచారి, సామను సుబ్రహణ్యంరెడ్డి, వెంకటేశన్ బాసటగా నిలి చారు. వీరంతా జాతీయ నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు, అనంతశనయం అయ్యంగారి అడుగుజాడల్లో నడిచినట్టు ఉద్యమ నాయకుల వారసులు చెబుతున్నారు. దళితుల ఆలయ ప్రవేశానికి కృషి అప్పట్లో మూఢాచారాలు ఎక్కువ. దళితులు, గిరిజనులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సర్దార్ సుబ్బరామదాసు శిష్యుడు తాళిశెట్టి వెంకటాచలపతి బహదూర్‌పేటలో నివాసముండేవారు. 1944లో టంగుటూరి ప్రకాశం పంతులు, అనంతశయనం అయ్యంగారు శ్రీకాళహస్తికి విచ్చేసి, హరిజన సేవాసంఘాన్ని స్థాపించారు. తాళిశెట్టి వెంకటాచలపతి శ్రీకాళహస్తీశ్వర ఎస్టేట్ కమిటీ సభ్యుని హోదాలో స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. విద్యతోనే భవిష్యత్ అనే నినాదంతో అప్పట్లోనే ఎయిడెడ్ పాఠశాలల స్థాపనకు కృషి చేశారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1947లో అంబర్ చరకా శిక్షణ కేంద్రాన్ని బహదూర్‌పేటలో ఏర్పాటు చేశారు. ఈయన సేవలకు ప్రకాశం పంతులు చరకా ఉన్న జాతీయ జెండాను బహూకరించారు. ఇది ఇప్పటికీ తాళిశెట్టి వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి వద్ద ఉంది. ఉద్యమానికి ఊపిరి పోసిన సుబ్బరామదాసు శ్రీకాళహస్తికి చెందిన సుబ్బరామదాసు స్థానికంగా జాతీయోద్యమానికి ఊపిరి పోశారు. 1930లో జాతీయ కాంగ్రెస్ వీరాభిమానిగా అస్సాంలోని గౌహతిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి శ్రీకాళహస్తి నుంచి కాలినడకన వెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ నాయకులు సుబ్బరామదాసుకు సర్దార్ అనే బిరుదునిచ్చి సత్కరించినట్టు ఆయన కుమారుడు విశ్వనాథం చెబుతున్నారు. 1931లో కల్లు, సారాయి అంగళ్ల వద్ద పికిటింగ్ చేసి అమ్మకూడదని ఉద్యమం చేసినందుకు తన తండ్రికి అప్పట్లో తెల్లదొరలు రూ.24 అపరాధ రుసుం వేసినట్టు తెలిపారు. 1932లో కాంగ్రెస్ ఆదేశానుసారం మద్రాసు బందరువీధిలో విదేశీ వస్త్రాల బహిష్కరణ పికిటింగ్లో పాల్గొన్నట్టు చెబుతున్నారు. 1929లో శ్రీకాళహస్తికి మహాత్ముడి రాక స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో ప్రతి ఒక్కర్నీ ఉద్యమంలోకి ఆహ్వానించేందుకు దేశం మొత్తం గాంధీజీ పర్యటించారు. ఇందులో భాగంగా 1929లో శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఆయనకు స్థానిక నాయకులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. సమవేశం నిర్వహించేందుకు స్థలం లేకపోవడంతో స్వర్ణముఖి నదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అప్పట్లో స్వర్ణముఖి నదీ తీరం కిక్కిరిసిపోయినట్లు తన తండ్రి చెప్పారని స్థానిక స్వాతంత్య్రోద్యమ నాయకుడు వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి తెలిపారు. 1957 సంవత్సరంలో శ్రీకాళహస్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడున్న వీధులకు ఎలాంటి పేర్లు ఉండేవి కావు. ఆపై స్వాతంత్య్రోద్యమంలో భాగంగా నెహ్రూ, గాంధీ, పసుపులేటి సుబ్బరామదాసు తదితరులు వచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు నడయాడిన ఆయా ప్రాంతాలకు వారి పేర్లు పెట్టి స్థానికులు మురిసిపోతున్నారు. నాయకుల పేర్లతో వీధులు ∙స్వర్ణముఖి నది ఒడ్డున సమావేశాన్ని నిర్వహించడం వల్ల మహాత్మాగాంధీ ఘాట్ అని ∙పసుపులేటి సుబ్బరామదాసు ఉన్న వీధిని సర్దార్ వీధి అని ∙గాంధీ నడయాడిన వీధిని గాంధీ వీధి అని ∙బహుదూర్ పేటలో తాళిశెట్టి వెంకటాచలపతి నివసించే వీధిని తాళిశెట్టి వీధిగా నామకరణం చేశారు. అయితే ఆ తర్వాత ఈ వీధిని కంఠా వీధిగా మార్చేశారు. మళ్లీ తాళిశెట్టి వీధిగా మార్చా లని వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి అభ్యర్థిస్తున్నారు. ∙1936లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో శ్రీకాళహస్తికి వచ్చారు. ఆయన నడయాడిన ప్రదేశాన్ని నెహ్రూవీధిగా, ఆయన శంకుస్థాపన చేసిన భవనానికి గాంధీ భవన్‌గా పిలుస్తున్నారు. చాలా గర్వంగా ఉంది మా తండ్రి సుబ్బరామదాసుకు ఐదుగురు పిల్లలు. ఇందులో నలుగురు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నేను శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో నివాసముంటున్నా. స్వాతంత్య్ర సమరయోధు డైన మా తండ్రికి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న బీసీ హాస్టల్ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పా టు చేశారు. స్వాతంత్య్ర పర్వదినాలప్పుడు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంటుంది. – విశ్వనాథ్, స్వాతంత్య్రోద్యమ నేత వారసుడు ఆ జెండాను చూస్తే సెల్యూట్ చేస్తా మా తండ్రి తాళిశెట్టి వెంకటాచలపతి. మేము శ్రీకాళహస్తి పట్టణం, బహుదూర్పేటలో నివాసముండేవాళ్లం. ప్రకాశం పంతులు ఇక్కడకు వచ్చినప్పుడు చరఖాతో ఒడికిన జాతీయ జెండాను మా తండ్రికి బహూకరించారు. ఇది నేటికీ నా వద్దే భద్రంగా ఉంది. స్వాతంత్య్రసమరయోధుని కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. జెండా చూసినప్పుడు సెల్యూట్ చేయాలని పిస్తుంది. – రామ్మూర్తి, స్వాతంత్య్రోద్యమ నేత వారసుడు ఉద్యమాల గడ్డ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని 29 మంది స్వాతంత్య్ర సమ రయోధుల్లో సర్దార్ రామదాసు, వెంకటప్ప య్య, వెంకటాచలపతి ముఖ్యులు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మరో 26 మంది ఉన్నారని సమాచారం. వారిపై పరిశోధనలు చేస్తున్నా. – దీనదయాళ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కుర్తి.. క్విట్ ఇండియా కీర్తి 1942లో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న రోజులవి. అదే ఏడాది ఆగస్టులో బ్రిటీష్ సేనలు ఢిల్లీ నుంచి శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి మీదుగా కేరళకు వెళ్తున్నారని తెలుసుకుని వారిని తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాళహస్తి ప్రాంత ఉద్యమనేతలు పసుపులేటి సుబ్బరామదాసు, కలిశెట్టి వెంకటాచలపతి, వెంకటప్పయ్య తమ అనుచరులతో ప్రత్యేక ప్రణాళికలు రచించారు. తొట్టంబేడు మండలంలోని చోడవరం, శ్రీకాళహస్తి పట్టణంలోని ఎండీ పుత్తూరు, అక్కుర్తి ప్రాంతాలకు చెందిన 32 మందితో కలిసి అర్ధరాత్రి సమయంలో అక్కుర్తి వద్ద రైలు పట్టాలు తెగ్గొట్టారు. ఆ తర్వాత బ్రిటీష్ సేనలు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. వందలాది మంది సేనలు ప్రాణాలొదిలారు. ఈ ఘటనను బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉద్యమకారులు 29 మందిపై కేసులు బనాయించినట్టు స్వాతంత్య్ర సమరయోధుడు సుబ్బరామదాసు కుమారుడు విశ్వనాథందాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి చిత్తూరు కోర్టులో విచారణ జరగగా అప్పట్లో సర్దార్ సుబ్బరామదాసు, కృష్ణమ్మకు రెండేళ్లు, పాపాచారి, వెంకటేశన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడినట్టు చెప్పారు. చిత్తూరు జైలు నుంచి తమిళనాడులోని రాయవేలూరు జైలుకు తరలించారు. స్వాతంత్య్రానంతరం సుబ్బరామదాసుకు భారత ప్రభుత్వం 1972లో తామ్ర పత్రం ఇచ్చి సత్కరించింది. ఇది నేటికీ విశ్వనాథం దాస్ ఇంట్లో చూడవచ్చు. -
జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు
స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు! యూరప్‌లో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి. తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’ దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు. కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్ బోర్డుగా చేసి చాక్‌పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు. ఓకే పత్రిక... రెండు గోడలు! పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్‌పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు. తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది. విద్వాన్ విశ్వంకి జైలు! కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం బ్రిటిష్ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్‌గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. – రాఘవ శర్మ -
గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ
భారత జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలై, ఉద్యమం ఊపందుకున్న రోజులు అవి. దేశ ప్రజలందరిలో జాతీయత భావం ఒకేరకంగా ఉన్నప్పటికీ భాష వేరు కావడం వల్ల పోరాటం సంఘటిత శక్తిగా మారడంలో విఫలమవుతోందని గ్రహించిన గాంధీజీ ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. గూడూరులో బహిరంగ సభ హిందీ ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో ఎక్కువగా పర్యటించారు గాంధీజీ. అలాగే హరిజనోద్ధరణ కోసం కూడా ఆయన విస్తృతంగా గ్రామాలను సందర్శించారు. 1934లో గాంధీజీ చెన్నై నుంచి రైల్లో గూడూరు మీదుగా నెల్లూరుకు పర్యటిస్తున్నప్పుడు గూడూరులో ధర్మరాజు ఆలయం ముందు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి హిందీ, తెలుగు తెలిసిన వారొకరు కావలసి వచ్చారు. అప్పుడు గాంధీజీ ప్రసంగాన్ని తెనుగీకరించింది ఓ పదమూడేళ్ల అమ్మాయి! ఆమె పేరు తన్నీరు వెంకటసుబ్బమ్మ. అనువాదం ఒక్కటే కాదు, ఆనాటి జాతీయోద్యమంలో వెంకటసుబ్బమ్మగారు అనేక విధాలుగా పాల్పంచుకున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆమె కుమారుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ సాక్షి ‘జైహింద్’తో పంచుకున్నారు. ‘బాలకుటీర్’లో నేర్చుకుంద ‘‘మా అమ్మ పుట్టిల్లు తిరుపతి జిల్లా గూడూరు (అప్పటి నెల్లూరు జిల్లా). మా తాత తన్నీరు రమణయ్య సోడా వ్యాపారి. స్వాతంత్య్రపో రాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన గూడూరు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు కొంతకాలం బళ్లారిలో జైలు శిక్షను కూడా అనుభవించారు. గాంధీజీ హిందీ ప్రచారోద్యమాన్ని చేపట్టినప్పుడు హిందీ నేర్చుకోవడానికి మా అమ్మను గూడూరులోని ‘బాల విద్యాకుటీర్’లో చేర్పించారు మా తాతయ్య. గూడూరులో శిక్షణ తర్వాత చురుగ్గా ఉన్న ముగ్గురిని ఎంపిక చేసి ప్రయాగ మహిళా విద్యాపీఠంలో విదుషీ పట్టా కోర్సు కోసం అలహాబాద్‌కు పంపించారు వాళ్ల హిందీ టీచర్ గుద్దేటి వెంకట సుబ్రహ్మణ్యంగారు. అలా అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో హిందీ నేర్చుకుంటూ, కస్తూర్బా ఆశ్రమంలో జాతీయ నాయకులకు సహాయంగా పని చేసే అవకాశం వచ్చింది అమ్మకు. సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, అనిబీసెంట్, విజయలక్ష్మీ పండిట్ వంటి నాయకుల మధ్య జరిగే చర్చలను దగ్గరగా చూశారామె. ఆమెలో జాతీయోద్యమ స్ఫూర్తికి బీజాలు పడిన సందర్భం అది. బాపూజీ ముగ్ధులయ్యారు కోర్సు పూర్తయిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూడాలనే ఉద్దేశంతో అమ్మను గూడురుకు తీసుకువచ్చేశారు మా తాతయ్య. గాంధీజీ హరిజనోద్ధరణ మూవ్మెంట్లో భాగంగా దక్షిణాది యాత్ర చేసినప్పుడు అమ్మ దుబాసీగా గాంధీజీ ప్రసంగాన్ని తర్జుమా చేయడంతోపాటు బాపూజీకి స్వాగతం పలుకుతూ సన్మాన పత్రం చదివింది. స్పష్టమైన ఉచ్చారణకు, ధీర గంభీరంగా చదివిన తీరుకు ముగ్ధుడైన బాపూజీ అమ్మ చేతిని ముద్దాడి, తన మెడలో ఉన్న ఖాదీ మాలను తీసి అమ్మ మెడలో వేశారు. తాను రాసుకుంటున్న పెన్నును కూడా బహూకరించారు. ఆ సమయంలో అమ్మ నడుముకు వెళ్లాడుతున్న ఒక తాళం చెవిని గమనించారాయన. అది మా అమ్మ ట్రంకు పెట్టె తాళం చెవి. ‘చాబీ ఇస్తావా’ అని అడిగారట. అప్పుడు అమ్మ నిర్మొహమాటంగా ‘ఇవ్వను’ అని చెప్పిందట. అప్పుడాయన అమ్మ తల మీద చెయ్యి వేసి పుణుకుతూ నవ్వారట. అమ్మ తరచూ ఆ సంగతులను చెబుతూ ఉండేది. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా 80 ఏళ్ల వయసులో వెంకట సుబ్బమ్మ హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించినప్పటి చిత్రం అలహాబాద్ జ్ఞాపకాలు అమ్మకు పదిమంది సంతానం. నేను తొమ్మిదో వాడిని. నేను, మా ఆవిడ డాక్టర్లం కావడంతో అమ్మ ఆరోగ్యరీత్యా కూడా మా దగ్గర ఉండడమే ఆమెకు సౌకర్యం అనే ఉద్దేశంతో అమ్మను నేనే చూసుకు న్నాను. అలా రోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అమ్మ దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వినడమే నేను ఆమెకిచ్చిన ఆనంద క్షణాలు. ఆ సమయంలో నాకు ఆమె అలహాబాద్ జ్ఞాపకాలను ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఆమె 83 ఏళ్లు జీవించి 2004లో పరమపదించారు. ఆశ్చర్యం ఏమిటంటే... అంతకు ముందు మూడేళ్ల కిందట జాతీయపతాకావిష్కరణ సందర్భంగా ఆమె హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆమె మంచి రచయిత కూడా. చరణదాసు శతకాలు రెండు, కాలేజ్ అమ్మాయిల కోసం నాటకాలు, ప్రభోద గీతాలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె బయోగ్రఫీ రాసుకున్నారు. కానీ అప్పుడు కొంత అప్పుడు కొంత రాస్తూ ఉండడంతో కొన్ని పేజీలు లభించలేదు. ఆ రచనను పరిష్కరించి ప్రచురించడం నాకు సాధ్యం కాలేదు..’’ అని తన తల్లికి చేయాల్సిన సేవ మరికొంత మిగిలిపోయిందన్నట్లు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ రవి కుమార్. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఆయన ఇల్లు... తల్లి రాసిన పుస్తకాల ప్రతులు, ఆమె పుస్తకావిష్కరణల ఫొటోలతో వెంకటసుబ్బమ్మ జాతీయోద్యమ జ్ఞాపకాల దొంతరలా ఉంటుంది. – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
జైహింద్ స్పెషల్: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు
తొలినాళ్ల తెలుగు కథకుల చేతుల్లో స్వాతంత్య్రకాంక్షతో కథానిక నడిచింది. స్వాతంత్య్రోద్యమంలోని అంతర్భాగాలైన సంఘసంస్కరణ, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నివారణ, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలు ఆ కథలలో చోటుచేసుకున్నాయి. ఈ ఇతివృత్తాలతో దాదాపు ఓ యాబై కథలు వచ్చాయి. శ్రీపాద సుబ్రహ్యమణ్య శాస్త్రి, రాయసం వెంకటశివుడు, వజ్జ బాబూరావు, బందా కనక లింగేశ్వరరావు, కరుణకుమార, కనుపర్తి వరలక్ష్మమ్మ, అడివి బాపిరాజు, అందే నారాయణస్వామి, చలం.. ఇలా మరికొద్ది మంది కథకులున్నారు. అంతర్లీన సందేశాలు సంస్కరణవాదానికి చెందిన కథానిక బందా కనకలింగేశ్వరరావు రాసిన ‘గ్రుక్కెడునీళ్లు’ (1932). వెట్టి మాల వెంకటప్ప బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మమ్మ చుట్టూ తిరిగిన కథ అది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ (1934) కథలో హిందూ మాదిగలకు ఆ వూరి చెరువులో నీరు తెచ్చుకునే అవకాశం లేకపోవడంతో వారు ముస్లిం మతం స్వీకరించి ఆ హక్కును పొందటం ప్రధాన అంశం. ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో రాయసం వెంకటశివుడు రాసిన మంచి కథ ‘నీలవేణి’ (1934). మత్స్యకారుల కులానికి చెందిన నిరక్ష్యరాస్యురాలైన నీలమ్మ ఉద్యమ సందర్భంలో పోలీసులాఠీ దెబ్బలకు గురైన స్వాతంత్య్రోద్యమ కార్యకర్త ప్రసాదరావు చౌదరికి తన సపర్యల ద్వారా చేరువై అతనిని భర్తగా పొందుతుంది. ఈ కథానిక అంతర్భాగం మద్యపాన నిషేధం. సంస్కరణలకు ప్రేరణ కుక్కలనైనా చేరనిస్తాం కాని హరిజనులను దేవాలయంలోకి ప్రవేశించనీయబోమనే అమానుషాన్ని ప్రశ్నిస్తూ బ్రాహ్మణ భావజాలంపై దండెత్తిన కథ ‘పరివర్తనం’ (1940). కథారచయిత అందే నారాయణస్వామి హరిజనులకు దేవాలయం ప్రవేశంతో పాటు అస్పృశ్యతా నివారణ, కులాల మధ్య సామరస్యత అనే అంశాల నేపథ్యంలో ఈ కథను రాశారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో హరిజనుల దేవాలయ ప్రవేశం, యజమాని–పాలేరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని సంస్కరణ దృష్టితో ‘నరసన్న పాపాయి’ కథలో రచించారు అడవి బాపిరాజు. ఆయనే రాసిన మరో కథ ‘బొమ్మలరాణి’.. మీనాక్షి, కామేశ్వరరావుల కులాంతర వివాహం ద్వారా సంస్కరణాభిలాషను వ్యక్తం చేస్తుంది. మరోకథలో.. ‘‘రుక్మిణీ! ఆ పూలదండ సీమనూలుతో గట్టినదేమో నేను ముట్టను’ అంటాడు గోపాలరావు. ఆ యోధపత్ని ఇలా చెబుతుంది : ‘సీమనూలు చేతి నుండి తొలగి అయిదు మాసములు యిరువది దినములు’ అని. ఆ మాటల ద్వారా విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ఐదు నెలల ఇరవై రోజులుగా సాగుతున్నట్లు చెబుతారు కథలో కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరిదే మరొకటి స్వాతంత్య్రోద్యమ కథానిక ‘కుటీరలక్ష్మి’ (1931). ‘మల్లుపంచ’ కథానికలో వజ్జ బాబూరావు విదేశీ వస్తు వ్యామోహం, వస్త్రధారణపై వ్యంగ్య ధోరణిలో విమర్శించారు. (విదేశీ వస్త్ర బహిష్కరణ సందర్భంగా వాటిని దహనం చేసే సమయంలో కట్టుకోవటానికి గుడ్డ్డలేని పేదలు వాటిని తమకు దానం చేయమని కోరడమనే కోణాన్ని కొడవటిగంటి కుటుంబరావు తన ‘చదువు’ నవలలో చిత్రించారు). ఆంధ్ర విద్యార్థి పక్షపత్రికలో 15 డిసెంబర్ 1947న ప్రచురితమైన కె.వి. సుబ్బయ్య కథానిక ‘ఆత్మశాంతి’ అత్యంత నాటకీయతతో కూడుకున్నది. రహస్యోద్యమ సన్నివేశం ‘1942 ఆగస్టు విప్లవదినాలు’ ఉగ్రవాద కార్యకర్తల గురించిన కథానిక. రహస్యోద్యమ కార్యకర్త మాధవ పోలీసుల దాడి నుండి తప్పించుకొని తన సహ కార్యకర్తతో కలిసి ఒక పూరి కుటీరానికి చేరుతారు. ఆ పూరి పాకలో నివసించే జట్కావాలా.. మాధవకు అడ్డు నిలబడి పోలీసుల బారి నుండి కాపాడి తీవ్రంగా గాయపడతాడు. అంతకు మునుపే అదే జట్కాబండిలో మాధవ ప్రయాణించినప్పుడు అతను తన కొడుకే అని జట్కావాలా గుర్తిసాడు. ఆ సందర్భంలో జట్కావాలా.. మాధవతో తన తండ్రిని నేనే అని చెప్పుకుంటాడు. ‘‘నా పుత్రుడు అకుంఠితమయిన దేశభక్తుడు, మాతృ సేవకుడని తెలిసికొనగలిగాను. నా కుమారుని ప్రాణాలకు నా ప్రాణాలను ధారబోసి కాపాడుకొనగిలిగితిని. నేను కేవలము నా కుమారునికే మేలు జేసినట్లు గాదు. మాతృభూమికే సేవజేసినట్లు..’’ అన్న ఆత్మశాంతితో కన్నుమూస్తాడు. సాహిత్యంలో సంచలనాలు సృష్టించిన చలం 1924లో సహాయ నిరాకరణోద్యమ కాలంలో రాసిన కథ ‘సుశీల’. సుశీల నారాయణప్ప భార్య. పోలీసు అధికారి సులేమాన్‌తో సన్నిహితంగా వుంటుంది. ఈ ముక్కోణపు వ్యవహారంలో ఎంతో మధనపడి సుశీల చివరకు నారాయణప్ప మనిషే అవుతుంది. (1947లో రాసిన ‘1960’ కథానికలో గాంధీజీ సామాజిక ఆర్థిక సిద్ధాంతాలు అమలులోకి వస్తే దేశం ఎంత నిర్జీవంగా వుంటుందో వ్యంగ్య ధోరణిలో చెప్పాడు చలం.) – పెనుగొండ లక్ష్మీనారాయణ ‘అరసం’ జాతీయ కార్యదర్శి హరిజనోద్ధరణ పర్యటనలో భాగంగా 1933లో మద్రాసు చేరుకున్న మహాత్మాగాంధీ. కుల వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ఆ సమయంలో ఎన్నో రచనలు చేశారు. అనేక ప్రసంగాలు ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం) -
అమృతమూర్తిని మరిచిన మహోత్సవం
స్వాతంత్య్ర సమర యోధులకు ఘనమైన నివాళిగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్రం సాధించి డెబ్బై ఐదేళ్లు అయిన సందర్భంగా... గతేడాది మార్చి 12 (ఉప్పు సత్యాగ్రహం) నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) వరకు... సంకేతాత్మ కంగా డెబ్బై ఐదు వారాలపాటు మన సంగ్రామ చరిత్రలోని ప్రతిధ్వనులు ప్రతి ఒక్క భారతీయుడికీ తలపునకు వచ్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. అయితే మహాత్మా గాంధీ వంటి ఒక శిఖర సమానుడిని, ఆయన పాటించి ప్రబోధించిన సత్యాగ్రహం, అహింస వంటి మహోన్నత భావాల సమర శక్తిని ఈ ‘అమృత మహోత్సవాలు’ పూర్తిగా విస్మరించాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఈ ఏడాది పొడవునా మనం 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకొంటున్నాం. వివిధ అంశాలలో, వివిధ వర్గీకరణల కింద ప్రభుత్వం అనేక స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వాటిల్లో ఎక్కడా కూడా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇంకా మరికొందరు ముఖ్య సమరయోధులు స్వాతంత్య్ర సంగ్రామంలో పోషించిన పాత్రల ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘స్వాతంత్య్ర సాకారం వెనుక ఎవరి త్యాగా లైతే ఉన్నాయో వారి సమర గాథలను సజీవం చేసేందుకు’ ఉద్దేశిం చిన విభాగంలో ఈ ముఖ్య నాయకులిద్దరి ప్రస్థానం లేకపోవడం ఏమిటి? ఉండటానికైతే ఉంది. కానీ అది నామ మాత్రమే. కొంచెం కటువుగా చెప్పాలంటే సాధారణమైన రీతిలో జరగని తొలగింపు. ఆది వాసీ నాయకుడు బిర్సాముండా, సుభాస్ చంద్రబోస్‌లకు మాత్రమే ఇందులో చోటు కల్పించారు. వాళ్ల పోరాటం ప్రత్యక్షమైనదీ, రక్తసిక్త మైనదీ కావచ్చు. సత్యం, అహింస అనేవి యుద్ధ ఫిరంగులు కాలేవా? వాటికి గుర్తింపు ఉండదా? గాంధీ, నెహ్రూల నాయకత్వాలను పక్కన పెట్టి స్వాతంత్య్ర పోరాటాన్ని, స్వాతంత్య్ర సాధనను చూడటం అంటే వాళ్లు వదిలివెళ్లిన అడుగుజాడల్ని అపహాస్యం చేయడమే. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలోని స్మరణీయ మైలురాళ్లను తలచు కోవడం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లక్ష్యాలలో ఒకటైనప్పుడు... ముఖ్యంగా మహాత్మా గాంధీ వంటి ఒక శిఖర సమానుడిని; ఆయన పాటించి, ప్రబోధించిన సత్యాగ్రహం, అహింస వంటి మహోన్నత భావాల సమర శక్తిని, దేశ విముక్తి కోసం ఆయన అందజేసిన సంకల్ప బలాన్ని మనం ఎలా విస్మరించగలం? స్వాతంత్య్రానంతరం మనం గాంధీమార్గాన్ని దాదాపుగా విస్మ రించామన్నది వాస్తవం. దేశం ముందు గాంధీజీ పరచిన ఆదర్శాలు... రాజకీయ అధికారం కోసం జరిగే పాకులాటల కింద నలిగి పోయాయి. అయినప్పటికీ మన సామాజిక, రాజకీయ వైఫల్యాల నుంచి దేశానికి దారి చూపే ఒక వేగుచుక్కలా ఆయన నిలిచారు. గాంధీ ఒక ఆవాహన. లక్షలాది భారతీయుల్ని తరాలుగా కదలిస్తున్న ప్రచండ ప్రబోధాత్మక శక్తి. నిరాడంబరతకు, కారుణ్యానికి, అన్నిటినీ మించి నిబద్ధతకు, నిజాయితీకి ప్రతీకగా భారతీయులు మనసా వాచా స్వీకరించిన మహా మనిషి. తన ప్రజల మనోభావాలను ఒడిసిపట్టి, సైద్ధాంతిక ఆలోచనలుగా వాటిని మలిచినందువల్ల ఆయన నాయకుడయ్యారు. అందరు నాయకులలో ఈ గుణం ఉండేదే. కానీ వ్యత్యాసం ఎక్కడంటే... వారు మనల్ని నడిపించడానికి మన మనసులో ఉన్న సదాశయాలను బట్టి వెళుతున్నారా, అందుకు భిన్నంగా మన సంకుచితత్వాలను ప్రేరేపిస్తూ తమ సిద్ధాంతాలకు చోదక ఇంధనంగా మార్చుకుంటున్నారా అన్నదే. గాంధీ సమరశీలత మహోన్నతమైనది. సహనశీలత శతఘ్ని వంటిది. నమ్మిన సిద్ధాంతా లను ఆచరించడం కోసం పోరాట జీవనం సాగించి, ప్రాణత్యాగం చేసిన సంగ్రామ వీరుడు గాంధీ. భారతదేశంలోని అనేక భిన్న సమూహాల మధ్య, పైకి కని పించకుండా దాగి ఉండి, విద్వేషపు జ్వాలలకు చిచ్చుపెట్టే రాక్షస త్వాల గురించి గాంధీకి చాలా తెలుసు. అందుకే ఆయన హిందూ– ముస్లిం ఐక్యతనూ; బడుగు, అణగారిన వర్గాల, కులాల, సమాజాల దాస్య విముక్తినీ కోరుకున్నారు. గాంధీజీ మత విశ్వాసాలున్న హిందువే. అందులో సందేహం ఏమీ లేదు. ఆయనే... హిందూ– ముస్లిం అంటూ వేరుగా చూడటం వల్ల బలమైన హిందుత్వ నిర్మాణం జరగదని కూడా నమ్మారు. ముస్లింల పట్ల దేశంలో నేడు వ్యక్తమౌ తున్న నిర్దాక్షిణ్య అసహనం గాంధీజీ ఏమాత్రం ఇష్టపడనిది. దేశ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విభజనను భవి ష్యత్తులో చీముపట్టే ఒక ప్రాణాంతక గాయంగా ఆయన చూశారు. పరిస్థితి ఇప్పుడలా ఉంది. భారత రాయబారి అలన్ నజరేత్ చొరవతో ఏర్పడిన ‘సర్వోదయ ఫౌండేషన్’... గాంధీ ఆలోచనల్ని దేశంలోనూ, దేశం బయటా వ్యాప్తి చేస్తుంటుంది. నజరేత్ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో గాంధీ ప్రవచించిన విలువల ప్రాసంగికత అనే అంశపై ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న అనేక మంది విద్యావేత్తలు, ప్రముఖులు, ఆలోచనాపరులు... నాడు గాంధీజీ భారత ప్రజల సుదీర్ఘ సేవలో ఉన్న సంవత్సరాలలో వ్యక్త పరిచిన అనేక ప్రాథమిక ఆలోచనల నుంచి పునరుత్తేజం పొందవలసి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలు భారతదేశంలోని ప్రజల సంస్కృతి, సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయినవీ, సుస్థిర మైన సహజీవన సామరస్య భావనను పెంపొందించేవీ. విధానాల ఎంపికల పరంగా చూస్తే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఎలా ఉండాలనేదానికి గాంధీ చెప్పిన ఒక మాటను ఇక్కడ ఉదహ రించాలి. ‘‘నీకు తారసపడిన అత్యంత నిరుపేదను గుర్తుకు తెచ్చుకో. నువ్వు తర్వాత చేయబోయే పని వల్ల ఆ నిరుపేదకు ఏమైనా ప్రయో జనం ఉంటుందా అని అతడిని అడిగి తెలుసుకో’’ అంటారు గాంధీ. గాంధీ సిద్ధాంతాలలో ఉదాసీనతకు గురైన అంశాలలో ఒకటి పర్యావరణ సుస్థిరత కూడానని నాకు అనిపిస్తుంది. గాంధీ జీవించి ఉన్న కాలంలో వాతావరణ మార్పు అనేది ఆందోళన చెందవలసిన ఒక విషయమే కాదన్నట్లుండేది. అయితే పర్యావరణ అత్యవసర స్థితికి వాతావరణ మార్పు ఒక వాస్తవమైన లక్షణమన్నది నేటి ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది. భూగోళానికి పొంచి ఉన్న పర్యావరణ సంక్షోభాన్ని గాంధీజీ ఆనాడే తన విస్మయపరిచే శాస్త్రీయ దృక్పథంతో చాల ముందుగానే వీక్షించారు. భారతదేశ అభివృద్ధి అవకాశాలపై ఆయన మాట్లాడుతూ... ‘‘అభివృద్ధి సాధించడానికి బ్రిటన్‌కు భూగోళంపై సగం వనరులు కావలసి వచ్చాయి. మరి భారత్ వంటి దేశం అభివృద్ధి చెందడానికి ఎన్ని గ్రహాలు అవసరం?’’ అని ప్రశ్నించారు. ‘‘పాశ్చాత్యుల మాదిరిగా ఎప్పటికీ పారిశ్రామికీకరణ వైపు వెళ్లే అవసరం దైవానుగ్రహం వల్ల మనకు లేకున్నా... ఒకే ఒక రాజ్యపు ఆర్థిక సామ్రాజ్యవాదం నేడు ప్రపంచాన్ని సంకెళ్లలో ఉంచు తోంది. 30 కోట్ల మంది (ఆనాటి మన దేశ జనాభా) ఉన్న భారత దేశం కూడా ఇదే విధమైన దోపిడీకి గురవుతోంది. మిడతల దండు మీద పడినట్లుగా ప్రపంచాన్ని తొలిచేస్తోంది. భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ ప్రకృతిని తల్లిగా; జీవానికి, జీవికకు మూలంగా భక్తితో కొలుస్తుంది. మనం ఆ మాతృమూర్తి నుంచి తనను తను పునరు ద్ధరించుకోడానికి, పునఃశక్తి పొందడానికి అనుమతించేదానికి కంటే ఎక్కువ తీసుకోకూడదు.’’ పశ్చిమ దేశాల ఐశ్వర్యంతో ఆనాటికే అబ్బురపడి ఉన్న భారతదేశ ప్రజలకు గాంధీజీ అందించడానికి ప్రయ త్నించింది ఇదే. ‘‘మనం ఎంచుకున్న ప్రకృతి బహుమతులను మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ తల్లి ఖాతాలో వచ్చినవి, పోతున్నవి ఎప్పుడూ సమంగా ఉంటాయి’’ అంటారు గాంధీ. గాంధీ సందేశం నేటికీ ఔచిత్యాన్ని, అత్యవసరతను కలిగి ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకొంటున్న వేళ గాంధీ లోతైన ఆలోచనలు సమకాల ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. భారత దేశం తన స్వతంత్ర, శక్తిమంత, ప్రజాస్వామిక తదుపరి ప్రయాణ భాగాన్ని ప్రారంభించినప్పుడు గాంధీమార్గంలోనివి అయిన పరమత అంగీకారం, విభిన్న దృక్కోణాలకు చోటు కల్పించడం; సమతౌ ల్యాన్ని, సమ్మిళిత స్వామ్యాన్ని అనుసరించడం, పర్యావరణ, సాంఘిక స్థిరత్వాన్ని నిర్థారించే ఆర్థికవ్యూహం.. వంటి వాటిని అనుసరించే స్ఫూర్తిని దేశ ప్రజలలో కలిగించాలి. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను పునర్నిర్మించడంలోని ఈ అత్యంత విలువైన గాంధీ విలువల వారసత్వం ప్రస్తుత రాజకీయాల బారిన పడకూడదని కూడా ప్రతి ఒక్కరూ ఆశించాలి. శ్యామ్ శరణ్ వ్యాసకర్త భారత విదేశాంగ మాజీ కార్యదర్శి (‘బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
ప్రశ్నించే నైజం: సరోజినీ నాయుడు
‘‘రాజకీయాలలో మీకు అంత ఆసక్తి ఎందుకు?’’ అని 1920లో జెనీవా సదస్సులో ఒకరు సరోజినీ నాయుడిని ప్రశ్నించారు. ‘‘నిజంగా భారతీయులైన వారందరికీ రాజకీయాలలో ఆసక్తి అనివార్యం’’ అని ఆమె బదులిచ్చారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన మహాత్మాగాంధీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతుండగా, సరోజినీ నాయుడు నేతృత్వంలో కొందరు మహిళా జాతీయవాదలు ఆ ఊరేగింపులో చేరారన్నది ఒక సన్నివేశంగా నా మనోపథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏంటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. ధైర్యం, దేనికీ తలవంచని తత్వం, జాతీయవాద ఉద్యమానికి కట్టుబడి ఉండటం, రాజకీయంగా సునిశిత ప్రతి.. అన్నీ ఆమె ప్రతిష్ట నుంచి పొంగి పొర్లుతాయి. ఆమె ఉప్పు సత్యాగ్రహంలోకి వచ్చేయడం చూసిన గాంధీజీ, ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను పలకరించారు. హైదరాబాద్‌లో జన్మించిన బాల మేధావి సరోజినీ చటోపాధ్యాయ. ఆమెకు కవిత్వం అంటే ప్రేమ. ఆమె సాహిత్యాభిరుచిని ప్రోత్సహించడంలో తల్లి, కవయిత్రి అయిన వరద సుందరీ దేవికి తండ్రి కూడా తోడు నిలిచారు. పై చదువుల కోసం ఆమెను ఇంగ్లండ్‌కి పంపారు. అక్కడి గోవింద నాయుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1898లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమె మద్రాసులో ఆయనను వివాహమాడారు. ఆ కాలంలో కులాంతర వివాహం సమాజానికి ఎదురీతే. మహిళల హక్కులు, స్వాతంత్య్రోద్యమానికి తొలినాటి ఉద్యమకారిణులలో ఆమె ఒకరు. హిందూ–ముస్లిం ఐక్యతను ప్రబోధించేవారు. 1947లో ఉత్తర ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలో ఆమె మొదటి మహిళా గవర్నర్. గవర్నర్‌గా ఉన్న సమయంలోనే 1949లో ఆమె అంతిమ శ్వాస విడిచారు. – ఊర్వశీ బుటాలియా, జుబాన్ బుక్స్ సంస్థ డైరెక్టర్ -
శతమానం భారతి: లక్ష్యం 2047
స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో బ్రిటిష్ న్యాయం ఎలా ఉండిందో తెలిసిందే. భగత్‌సింగ్, సుఖ్‌దేశ్, రాజ్‌గురు, తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల్ని విచారించి, శిక్షలు విధించడంలోని వివక్షకు ఆనాటి కోర్టులు ప్రతీకలు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ఆ దుస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రభుత్వాధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. నవ భారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధల చట్రం ఏర్పడింది. మన న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రమైనదంటే.. పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించిన సవరణలను గానీ, మరే ఇతర మార్పు చేర్పులను కానీ చేయకూడదని 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. చదవండి: సామ్రాజ్య భారతి: జననాలు ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్ సిఫారసు చేస్తే దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్ నిర్ణయంలో సదుద్దేశం లేదని నిర్థారణ అయినట్లయితే బర్తరఫ్ అయిన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఎస్.ఆర్.బొమ్మై (1994) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఎన్నికల్లో పౌరుల ఓటు హక్కు వినియోగంపై న్యాయ వ్యవస్థ కల్పించిన ‘నోటా’ అవకాశం ఒక ప్రజాస్వామ్య సంస్కరణ అనే చెప్పాలి. వచ్చే 25 ఏళ్లల్లో మరిన్ని మెరుగైన మార్పులు రాగలవని ఆశించవచ్చు. -
సామ్రాజ్య భారతి: జననాలు
స్వామీ వివేకానంద, వినోదినీ దేశాయ్, మార్గరెట్ ముర్రే, మహాత్మ అయ్యంకాళి, అష్రఫ్ అలీ తన్వీ, ఉపేంద్ర కిషోర్ రాయ్ చౌదరి, నజ్ముల్ మిల్లత్, సత్యేంద్ర ప్రసన్న సిన్హా జన్మించారు. స్వామి వివేకానంద విశ్వవిఖ్యాత భారతీయ తత్వవేత్త. అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వివేకానంద జన్మస్థలం కలకత్తా. వినోదినీ దేశాయ్ ప్రముఖ బెంగాలీ రంగస్థల నటి. ఈమె కూడా కలకత్తాలోనే జన్మించారు. ఆమె తల్లి వేశ్య. రంగస్థల దిగ్గజం గిరీశ్ చంద్ర ఘోష్ ఆమెకు గురువు మార్గరెట్ ముర్రే జన్మించినదీ కలకత్తాలోనే. ఆంగ్లో–ఇండియన్ ఈజిప్టోలజిస్ట్, పురావస్తు పురాతత్వ పరిశోధకురాలు. బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా ఆర్కియాలజీ లెక్చరర్. మహాత్మ అయ్యంకాళి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆధునిక కేరళ పితామహులుగా పేర్గాంచారు. ఆయన అనుచరులు ఆయన్ని ‘మహాత్మ’ అని పిలిచేవారు. ఆయ్యంకాళి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఎడ్డెమంటే తెడ్డెం విధానాన్ని ఆచరించారు. అష్రఫ్ అలీ తన్వీ ఇస్లాం మత గురువు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జన్మించారు. ఆయన జన్మించిన ఏడాదిపై అస్పష్టత ఉంది. 1862 అని కొందరు, 1863లో అని కొందరు చరిత్రకారులు రాశారు. ఇదే సందిగ్ధత వినోదినీ దేశాయ్ జన్మ సంవత్సరం పై కూడా ఉంది. 1862, 1863 అనే రెండు రిఫరెన్సులు ఉన్నాయి. ఉపేంద్ర కిశోర్ రాయ్ చౌదరి బెంగాలీ రచయిత, తైల వర్ణ చిత్రాల లేఖకుడు. బంగ్లాదేశ్‌లో జన్మించారు. న జ్ముల్ మిల్లత్ న్యాయ నిపుణులు. ప్రాచీన జామియా నజ్మియా మత విద్యాలయ స్థాపకులు. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించారు. సత్యేంద్ర ప్రసన్న సిన్హా ప్రసిద్ధ న్యాయవాది. పశ్చిమబెంగాల్లోని రాయ్‌పుర్‌లో జన్మించారు. -
స్వయం పోషకత్వాన్ని దెబ్బతీసిన బ్రిటీష్ పాలన
మొగలుల సామ్రాజ్యం పతనమయ్యాక 1707 నుంచి ఆంగ్లేయుల రాక ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం నెపంతో వచ్చి రాజకీయ పెత్తనం చెలాయించింది. తొలి స్వాతంత్య్ర సమరాన్ని(1857) అణచివేసిన తర్వాత 1858 నుంచి భారత ఉప ఖండం యావత్తూ పూర్తిగా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లిపోయింది. 1947 వరకు సాగిన ఈ పరాయి దోపిడీ పాలనలో మన దేశ వ్యవసాయ రంగం అస్థవ్యస్థమైంది. బ్రిటీష్ వారు వచ్చే నాటికి భూమి ప్రైవేటు ఆస్తిగా లేదు. జమిందారీ, రైత్వారీ పద్ధతులను ప్రవేశపెట్టి రైతుల నుంచి పన్నులు వసూలు చేశారు. జనజీవనం కరువు కాటకాలతో చిన్నాభిన్నం అవుతూ ఉండేది. 1800 – 1900 మధ్య కాలంలో 4 దఫాలుగా విరుచుకు పడిన భీకర కరువుల వల్ల 2.14 లక్షల మంది చనిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం 1880, 1898, 1901 సంవత్సరాలలో వరుసగా 3 కరువు కమిషన్లను నియమించారు. 1903లో నీటిపారుదల కమిషన్, 1915లో సహకార కమిటీలు చేసిన సిఫార్సులతో ఆయా రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1920 నాటికి భూమి వ్యక్తిగత ఆస్తిగా మారింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల అధ్యయనానికి 1926లో ‘రాయల్ కమిషన్’ ఏర్పాటైంది. ‘దేశానికి ఆహార విధానం అంటూ ఏదీ లేదు. అంతేకాదు, అలాంటిదొకటి అవసరమనే స్పృహ కూడా అప్పటికి లేద’ని అప్పటి భారత ఉప ఖండం స్థితిగతులపై రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1928లో నివేదిక సమర్పించే నాటికి.. మొత్తం జనాభాలో పట్టణ జనాభా దాదాపు 11 శాతం మాత్రమే. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. రోడ్లు, రవాణా సదుపాయాలు చాలా తక్కువ. చాలా గ్రామాలు స్వీయ సమృద్ధæయూనిట్లుగా పనిచేస్తూ, తమ అవసరాలన్నిటినీ ఉన్నంతలో తామే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని కమిషన్ పేర్కొంది. భౌగోళికంగా ఇప్పటి మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన మొత్తం ‘బ్రిటిష్ ఇండియా’ ప్రాంతానికి సంబంధించి రాయల్ కమిషన్ నివేదించిన విషయాలివి. 8 కోట్ల ఎకరాలకు పైగా వరి.. 2.4 కోట్ల ఎకరాల్లో గోధుమ.. 3.3 కోట్ల ఎకరాల్లో జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు.. 1.8 కోట్ల ఎకరాల్లో పత్తి, 1.4 కోట్ల ఎకరాల్లో నూనెగింజలు, 1.4 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతున్నాయని కమిషన్ పేర్కొంది. ‘పశువులకు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ప్రాధాన్యత భారతదేశంలో ఉంది. పశువులు లేకుండా ఇక్కడ వ్యవసాయాన్ని ఊహించలేం. పాడి కోసం, ఎరువు కోసమే కాకుండా.. దుక్కికి, సరుకు రవాణాకు కూడా పశువులే ఆధారంగా నిలుస్తున్నాయి. 1924–25 నాటికి దేశంలో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు 15.1 కోట్లు, మేకలు, గొర్రెలు 6.25 కోట్లు, గుర్రాలు, గాడిదలు 32 లక్షలు, ఒంటెలు 5 లక్షలు ఉన్నాయని రాయల్ కమిషన్ తెలిపింది. భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి లార్డ్ కర్జన్ సారధ్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కృషి శ్లాఘనీయమని రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1903 జూన్ 4న బీహార్, దర్భాంగా జిల్లాలోని పూసలో జాతీయ వ్యవసాయ విద్య, పరిశోధనా స్థానం ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. పూస ఎస్టేట్‌లో దేశీ పశు సంపదపై పరిశోధనా స్థానాన్ని కూడా పెట్టించారు. ఆ క్రమంలోనే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా తొలి దశలో 1924కు ముందే 5 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. పాడి, పంటలతో గ్రామం స్వయం పోషకత్వం కలిగి వుండేది. వ్యవసాయానికి ఉపాంగాలుగా వృత్తి పరిశ్రమలు వుండేవి. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం మన వృత్తులను దెబ్బతీసింది. బ్రిటన్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముడిసరుకు కోసం ఇక్కడ వ్యాపార పంటలను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలను బ్రిటిష్ పాలకులు చావు దెబ్బతీశారు. దేశీ పత్తి పంట సాగు, కుటుంబ పరిశ్రమగా చేనేత వస్త్రాల తయారీలో భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. మస్లిన్స్, కాలికోస్ వంటి మేలు రకాల వస్త్రాలను ప్రపం^è దేశాలకు ఎగుమతి చేసిన వెయ్యేళ్ల చరిత్ర మనది. అటువంటిది బ్రిటిష్ పాలనలో తల్లకిందులైంది. బ్రిటన్‌లో యంత్రాలకు పొడుగు పింజ అమెరికన్ పత్తి అవసరం. అందుకని, మన దేశంలో దేశీ పత్తికి బదులు అమెరికన్ రకాలను సాగు చేయించి, పత్తిని బ్రిటన్‌కు ఎగుమతి చేయటం.. అక్కడ యంత్రాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలను దిగుమతి చేసి మన దేశంలో అమ్మటం.. ఇదీ బ్రిటిష్ పాలకులు స్వార్థంతో చేసిన ఘనకార్యం. దీని వల్ల మన దేశీ పత్తి వంగడాలు మరుగునపడిపోయాయి. చేనేత పరిశ్రమ చావు దెబ్బ తిన్నది. ఆహార ధాన్యాలు పండించే పొలాలు కూడా అమెరికన్ పత్తి సాగు వైపు మళ్లాయి. 1928 తర్వాతి కాలంలో దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాలు కూడా విస్తారమైన మార్పులకు గురయ్యాయి. 1757లో 16.5 కోట్లున్న దేశ జనాభా 1947 నాటికి 42 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభాకు తగినట్లుగా ఆహారోత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సదుపాయాలను బ్రిటిష్ ప్రభుత్వం 8 రెట్లు పెంచింది. పంజాబ్, సిం«ద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున నీటిపారుదల సదుపాయం కల్పించారు. అదేవిధంగా, కృష్ణా, గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించారు. 1920 తర్వాత పెద్దగా కరువు పరిస్థితుల్లేకపోవటంతో ఆహారోత్పత్తి కుదుటపడింది. అయినా, 1943లో 3 లక్షలకు పైగా బెంగాలీయులు ఆకలి చావులకు బలయ్యారు. ప్రకృతి కరుణించక కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విన్స్టన్ చర్చిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల కృత్రిమ ఆహార కొరత ఏర్పడి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దీనికి మించిన విషాదం ఆధునిక భారతీయ చరిత్రలో మరొకటి లేదు. -
కంగన ఎఫెక్ట్: గాంధీజీపై నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ మా నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానం’’ అన్నారు. ఉన్నట్లుండి నేతాజీ కుమార్తె.. తన తండ్రి గురించి, గాంధీజీ గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ వివరాలు.. స్వాతంత్య్రం గురించి వివాదం రాజేసి.. అది సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగన. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకున్న గాంధీజీ, నేతాజీకి మధ్య సిద్ధాంతపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. (చదవండి: మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?) ఈ క్రమంలో తాజాగా కంగన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కంగన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు, గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. మరోవైపు మా నాన్నకు గాంధీ గారంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు. ‘‘వారిద్దరు గొప్ప నాయకులు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేం. వారిద్దరిది గొప్ప కలయిక. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది అంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసు’’ అన్నారు అనితా బోస్. (చదవండి: మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్) ‘‘అలానే కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం వ్యర్థం. గాంధీజీ మా నాన్నతో సహా ఎందరికో ప్రేరణగా నిలిచారు. స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం’’ అంటూ పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్. చదవండి: బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్! -
ఆ మారణకాండను ప్రత్యక్షంగా చూసింది అతడే!!
ప్రపంచ నాగరికత మీద తడి ఆరని నెత్తుటి సంతకం జలియన్‌వాలాబాగ్ దురంతం. దీనిని సమకాలీన ప్రపంచం నిర్ద్వంద్వంగా నిరసించలేదు. చిత్రంగా శ్వేత జాత్యహంకారానికి నిలువెత్తురూపం వంటి విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘాతుకాన్ని నిరసించారు. దర్యాప్తు జరిపించాలని ప్రపంచ పత్రికారంగం అభిప్రాయపడింది. కానీ, నోబెల్ సాహిత్య పురస్కారం (1906) స్వీకరించిన రడ్యార్డ్ కిప్లింగ్ ఆ దురంతానికి పాల్పడిన జనరల్ డయ్యర్‌ను ‘భారతదేశ పరిరక్షకుడు’ అని శ్లాఘించాడు. రడ్యార్డ్ కిప్లింగ్ బొంబాయిలోనే పుట్టాడు. కవి, నవలాకారుడు. తండ్రి అక్కడే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షకుడు. ఈనాటికీ భారతీయ బాలలు చదువుకునే జంగిల్ బుక్ కథలు కిప్లింగ్ రాసినవే. భారతదేశంలోని అడవులలో నివసించే జంతువుల లక్షణాలను భారతీయులకంటే ఎక్కువగా కిప్లింగ్ ఆకళింపు చేసుకున్నాడని పేరు. కానీ బ్రిటిష్ జాతిలో మనిషి రూపంలో పుట్టిన జనరల్ రెజినాల్డ్ డయ్యర్లోని క్రూర జంతువు లక్షణాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. అందుకు ఆ నోబెల్ గ్రహీతకి జాత్యహంకారం అడ్డొచ్చింది. వైట్‌మ్యాన్స్ బర్డెన్ సిద్ధాంతకర్తలలో ఆయనా ఒకడు కదా! చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. బాగ్ దురంతం తరువాత జనరల్ డయ్యర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరిలో ‘భారత పరిరక్షకుడు’ జనరల్ డయ్యర్‌ను నిధితో సత్కరించాలని ‘మార్నింగ్ పోస్ట్’ అనే ఇంగ్లండ్ పత్రిక నడుం కట్టింది. అంతటి చర్య దిగకపోతే 1857 నాటి పరిస్థితులు తలెత్తేవనీ, తమ జాతీయులు ఎందరో బలైపోయేవారనీ వారి అంచనా. జనరల్ డయ్యర్ చర్యతో విప్లవం వస్తుందని చెబుతున్నవారు ఒక వాస్తవం గుర్తించాలనీ, అసలు విప్లవమే రాకుండా ఆ చర్య తోడ్పడిందనీ చెప్పినవారు ఉన్నారు. 1920 జూలై 17న డయ్యర్ సహాయ నిధికి కిప్లింగ్ పది పౌండ్లు అందించాడు. మరొక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత (1913) రవీంద్రనాథ్ టాగోర్ , బాగ్ నెత్తుటికాండ, ‘బ్రిటిష్ పాలితులుగా భారతీయుల నిస్సహాయ స్థితి ఎలా ఉందో వాళ్ల మెదళ్లకు తెలియచెప్పింది’ అన్నారు. యావద్దేశం వలెనే టాగోర్కూ ఆలస్యంగానే ఆ సమాచారం అందింది. వెంటనే 1919 మే 30న వైస్రాయ్ చెమ్స్‌ఫర్డ్‌కు లేఖ రాశారు. అందులో మొదటి వాక్యం అదే. చరిత్రలో కనీవినీ ఎరుగని ఇలాంటి రక్తపాతానికి పాల్పడిన ప్రభుత్వం ఇచ్చిన బిరుదును అలంకరించుకోలేను అంటూ ‘సర్’ పురస్కారాన్ని (1915) వెనక్కి తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారాయన. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! ఇంతటి దురాగతం పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఇంకా పెద్ద నేరమని టాగోర్ వాపోయారు. వంగి వంగి దండాలు పెట్టించుకోవడానికి బ్రిటిష్ జాతి భారతీయులకు నేర్పిన ‘పాఠం’ ఎలాంటిదో, దాని వెనుక అమానుషత్వం ఎంతటిదో ఆ పరిణామంతో సంబంధం ఉన్న అధికారులనైనా అడిగి తెలుసుకోకుండా మీ జాతీయులు పరస్పరం అభినందించుకుంటూ ఉండి ఉంటారని ఆవేదనతో రాశారు టాగోర్. బాగ్ ఘటన నూరేళ్ల సందర్భంగా కలకత్తాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో ఈ లేఖను కూడా ఉంచారు. ఆ అక్షరాలన్నీ కన్నీటి జడులలో తడిసినవే. గాంధీజీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘కైజర్ ఏ హింద్’ బిరుదును వదిలిపెట్టారు. కానీ జనరల్ డయ్యర్‌ను క్షమించదలచారు. బాగ్ నెత్తుటికాండకు ఆనాడు రక్తకన్నీరు కార్చినవారే ఎక్కువ. గుండెలో అగ్నిపర్వతాలు పగిలినవారూ ఉన్నారు. అలాంటివారిలో చరిత్ర విస్మరించలేని వ్యక్తి ఉద్దమ్ సింగ్. 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. ఆ తరువాత ఒక ఆశయం ఊపిరిగా ప్రపంచమంతా తిరిగాడాయన. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్సింగ్. తండ్రి తహల్సింగ్.. ఉపల్ అనే చోట రైల్వే క్రాసింగ్ కాపలాదారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తరువాత అమృత్‌సర్‌కు కాపురం మార్చిన తండ్రి కూడా 1907లో మరణించారు. దీనితో ఉద్దమ్‌ను, ఆయన అన్నగారు ముక్తాసింగ్‌ను ఎవరో సెంట్రల్ ఖాల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆ సోదరులకి సిక్కు దీక్ష ఇచ్చారు. షేర్సింగ్ ఉద్దమ్ సింగ్ అయ్యారు. ముక్తాసింగ్ పేరు సాధుసింగ్ అయింది. 1917లో సాధుసింగ్ కూడా మరణించారు. 1918లో మెట్రిక్యులేషన్ చదివిన తరువాత ఉద్దమ్ అనాథాశ్రమం వీడారు. జలియన్‌వాలా బాగ్ కాల్పులను చూసిన వారిలో ఉద్దమ్ ఒకరని చెబుతారు. సంవత్సరాది వైశాఖి సందర్భంగా ఆ రోజు బాగ్‌కు వచ్చిన అందరికీ ఉద్దమ్, ఆయన మిత్రులు స్వచ్ఛంద సేవకులుగా మంచినీళ్లు అందించారని కూడా కొందరు చెబుతారు. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? ఆ రోజు సాయంత్రం వేళ కాల్పులు జరిగాయి. కాల్పులలో రత్తన్‌దేవి అనే ఆమె భర్త గాయపడగా, ఆయనను మోసుకు వస్తూ ఉద్దమ్ కూడా గాయపడ్డారు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. చీకటి పడింది. చావుబతుకుల మధ్య ఉన్నవారికి వైద్య సదుపాయం అందలేదు. దిగ్భ్రాంతికి గురైన వారికి కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. 1200 మంది క్షతగాత్రులని ప్రభుత్వమే చెప్పింది. ఎంతటి దుర్భరస్థితిని ఆ చీకటిరాత్రి పంజాబీలు చూశారో ఊహించవచ్చు. తరువాతి కాలాలలో సైఫుద్దీన్ కిచ్లూ స్థాపించిన స్వరాజ్ ఆశ్రమంలో ఉద్దమ్ కొద్దికాలం ఉన్నారు. పంజాబ్ మీద గదర్ పార్టీ ప్రభావం ఎక్కువ. ఉద్దమ్‌కు భగత్‌సింగ్ ఆదర్శం. ఆయనను కలుసుకున్నప్పటి నుంచి గురువుగారు అని పిలవడం ప్రారంభించాడు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ కవిత్వం అంటే ప్రాణం. ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీగా చేరి, అతడి వెంటే ఆఫ్రికా వెళ్లాడు ఉద్దమ్. అక్కడ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడే గదర్ పార్టీ ఆశయాలకు మరింత చేరువయ్యారు. భగత్‌సింగ్ తదితరులు స్వదేశం వచ్చి పనిచేయమని ఉద్దమ్‌కు సూచించారు. ఒక అమెరికన్ మహిళ సాయంతో ఆయుధాలు సంపాదించి భారత్ చేరుకున్నాడాయన. లాహోర్‌లో ఉంటూ విప్లవ కార్యకలాపాలకు సహకరించేవారు. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఉన్నాడన్న ఆరోపణ మీద ఉద్దమ్‌ను 1927 ఆగస్ట్ 30న అరెస్టు చేశారు. ఇదే కాకుండా గదర్ పత్రిక ‘గదర్ ది గూంజ్’ ప్రతులు కూడా పోలీసులకు దొరికాయి. నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి 1931 అక్టోబర్ 23న జైలు నుంచి విడుదలయ్యారు. 1933లో మారుపేరుతో అతి కష్టం మీద ఇంగ్లండ్ చేరుకున్నాడు. 1940 మార్చి 13న ఈస్టిండియా అసోసియేషన్, రాయల్ సెంట్రల్ ఏసియన్ సొసైటీలు లండన్‌లోని కాక్స్టన్ హాలులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆ కార్యక్రమానికి అచ్చం ఆంగ్లేయుడి మాదిరిగానే ఉన్న నలభయ్ ఏళ్ల వ్యక్తి చేతిలో పుస్తకంతో వచ్చాడు. అతడే ఉద్దమ్. వేదిక మీద ఓడ్వయ్యర్ ఉన్నాడు. సభ ముగుస్తూ ఉండగా, వేదిక ముందుకు వెళ్లి, పుస్తకంలో లోపల అమర్చిన 45 స్మిత్ అండ్ వీసన్ రివాల్వర్ తీసి ఓడ్వయ్యర్‌కు గురిపెట్టి ఆరుసార్లు కాల్చాడు. 21 సంవత్సరాల నిరీక్షణ గురి తప్పకుండా చేసింది కాబోలు. ఒక తూటా గుండెలలో, మరొకటి మూత్రపిండాలలోకి చొచ్చుకుపోయాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓడ్వయ్యర్. ఆ సభలోనే పాల్గొన్న భారత స్టేట్ సెక్రటరీ జట్లండ్, పంజాబ్ మరో మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ లూయిస్ డేన్, బొంబాయి ప్రావిన్స్ మాజీ గవర్నర్ ల్యామింగ్టన్ కాల్పులలో గాయపడ్డారు. ఉద్దమ్ పారిపోలేదు. తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పుకున్నారాయన. ఉద్దమ్ తరఫున వీకే కృష్ణమీనన్ కేసు వాదించారు. 1940 జూన్ 12న ఇంగ్లండ్‌లోనే పెంటాన్విల్లె కారాగారంలో ఉద్దమ్‌ను ఉరితీశారు. ఆ అమరుడి చితాభస్మాన్ని 1975లో భారత్‌కు తెచ్చారు. చదవండి: ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!! -
మన్యంలో మ్యూజియం.. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు
సాక్షి, అమరావతి: తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ పాలకులపై వీరు సాగించిన సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన విశాఖ జిల్లా తాజంగిలో మన్యం వీరుల స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ప్రకృతి సహజసిద్ధమైన రమణీయ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్ర కాశ్మీరం’ లంబసింగి ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందమైన ఉద్యానవనం మధ్య అరుదైన విశేషాలతో రూపుదిద్దుకోనున్న ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మన్యం పోరాటాన్ని ప్రతిబింబించనుంది. మొత్తం రూ.35 కోట్లతో చేపట్టిన ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్–టీఎం–ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్) ఆధ్వర్యంలో ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో డిజైన్ చేశారు. యాంపి థియేటర్‌తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియోలను సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సంప్రదాయ గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. మ్యూజియం పరిసరాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆధునిక రెస్టారెంట్, రిసార్ట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ నిర్మాణం పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. మొదటి తిరుగుబాటు ఇక్కడే.. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం విప్లవ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఇది చాలా కీలక ప్రాంతం. పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి–నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునే వారు. వీరికి కూలీ సరిగ్గా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడేవారు. దీంతో తెల్లదొరల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగుబాటు బావుటా ఎగురవేశాడు. గాం గంటందొర, గాం మల్లుదొరలతో కలిసి పోరాటం చేసి వారిని తరిమికొట్టాడు. ఇంతటి విశిష్టత కలిగినందునే మన్యం వీరుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజంగి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. మ్యూజియంలో 4 జోన్లు.. విశాఖ మన్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియంను ఏ, బీ, సీ, డి అనే నాలుగు జోన్లుగా విభజించి పలు అంశాలను ప్రదర్శిస్తారు. అవి.. ► జోన్–ఏలో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు ముందునాటి గిరిజనుల పరిస్థితులు, వారి జీవన విధానం, అప్పటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. ► జోన్–బిలో గిరిజనుల జీవితాల్లోకి తెల్లదొరలు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష, జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటుచేస్తారు. ► జోన్–సీలో బ్రిటీషర్ల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, వారి పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. ► ఇక జోన్–డీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. -
స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధుల పోరాటం
బొమ్మలసత్రం: స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పాలకులను ఎదిరించారు. కుటుంబ సభ్యులకు దూరమై, ఆస్తులను త్యాగం చేసి స్వాతంత్ర పోరాటం చేశారు. కొందరు యోధులు బ్రిటీష్ పాలకుల చిక్కకుండా నల్లమలలో అజ్ఞాత జీవితం గడపగా, మరి కొందరు జైలు పాలై ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. నేడు వీరు భౌతికంగా లేకున్నా, వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. నంద్యాల ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ, వన్‌టౌన్ పోలీసు స్టేషన్, డీఎస్పీ బంగ్లా, తహసిల్దార్ కార్యాలయాల్లో బ్రిటీష్ పాలకులు ఉంటూ పాలన చేసేవారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో పోలీసు బలగాలు ఉండేవి. నంద్యాల 25వేల జనాభాతో, చిన్న పట్టణంగా ఉందేది. జాతీయ స్థాయిలో గాం«ధీజీ ఉప్పు సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపునిచ్చినా, ఏ నేతను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసినా నంద్యాల నేతలు త్రీవంగా స్పందించేవారు. 19వ శతాబ్ధంలో ఉద్యమం: నంద్యాలలో 19వ శతాబ్ధంలో నంద్యాలలో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకొనేది. బిట్రీష్ పాలకులకు వ్యతిరేకంగా నేతలు సభలు, సమావేశాలను నిర్వహించేవారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, టీఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, కోడి నరసింహం, దేశాయి కుప్పూరావు తదితరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. దీంతో బ్రిటీష్ పోలీసులు వెంట పడి, వీరిని అరెస్టు చేయడానికి యత్నించేవారు. దీంతో నేతలు నక్సలైట్లలా నల్లమల అడవిలోకి పారిపోయి, అజ్ఞాత జీవితం గడిపేవారు. వీరు మహానంది, బండి ఆత్మకూరు ప్రాంతాల్లోని అడవుల్లో తలదాచుకున్నప్పుడు, కొందరు నేతలు, గ్రామస్తులు వీరికి ఆహారాన్ని పంపేవారు. ఖ్యాతి తెచ్చిన గాడిచర్ల, నివర్తి స్వాతంత్య్ర సంగ్రామంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర స్థాయిలో నంద్యాలకు ఘనకీర్తిని తెచ్చారు. ఆంధ్రా తిలక్‌గా పేరొందిన గాడిచర్ల కర్నూలు ప్రాంతానికి చెందినవారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య పత్రికను స్థాపించి, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. తిలేస్వరంలో బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల సంఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిండి తలకు మురికి టోపీ పెట్టి, కాళ్లకు, చేతులకు గోలుసులు వేసి, మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడ్తూ, కొట్టినా ఆయన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత ఆయన నంద్యాల నుండి మద్రాస్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాలకు వలస వచ్చారు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యగ్రహంలో పాల్గొన్న నివర్తిని ఆయన 140మంది సహచరులను అక్టోబర్ 14, 1940లో ప్రభుత్వం ఆరెస్టు చేసి, 8నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుండి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో, కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్ధేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యూలర్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్రం వచ్చాక, 1968 నుండి 78వరకు శాసన మండలి అధ్యక్షుడిగా పని చేశారు. రథసారథులు వీరే...: ఖాదర్‌బాద్ నర్సింగరావు ఫిరంగి పాలనకు వ్యతిరేకంగా 1910లో కాంగ్రెస్‌లో చేరీ, ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1928లో బ్రిటీష్ పాలకులు భారతీయులు చదువుకోవడానికి పెద్దగా సహకరించలేదు. కాని స్థానిక బ్రిటీష్ పాలకులు వ్యతిరేకించినా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకొని వచ్చి, ఆరెకరాల భూమిని విరాళంగా ఇచ్చి నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ వేల మంది రాజకీయ నాయకులకు, శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇంజనీర్లకు, పారిశ్రామిక వేత్తలకు అక్షరాలను నేర్పించింది. ఖాదర్‌బాద్ నర్సింగరావు జైలు పాలైన దేశ భక్తుల కుటుంబ సభ్యులకు ఆశ్రయమిచ్చి నెలలు తరబడి భోజనాలను పెట్టి ఆదుకునేవారు. ఈయనతో పాటు దేశాయి కుప్పూరావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, టీ ఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, యరబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్‌లు ఉద్యమ పోరాటంతో నిస్వార్థంగా సేవలను అందించారు. స్వాతంత్ర ఉద్యమంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాక పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శనీయంగా నిలిచింది. బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీసులుగా పని చేసిన శ్యాముల్ బెనెటిక్ట్ సుభాష్‌చంద్రబోష్ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. కాంగ్రెస్ సభ్యురాలుగా పని చేసిన పద్మావతమ్మ స్వాతంత్య్ర అనంతరం కమ్యూనిష్టుగా మారారు. బైర్మల్ వీధిలో ఉన్న ఇప్పటి డాక్టర్ ఉదయ్‌శంకర్ హాస్పిటల్, వాసవీ భవన్, ప్రక్కనే ఉన్న దళితులు హాస్టల్ పలువురు నేతలు ఇళ్లలో సభల, సమావేశాలు జరిగేవి. నంద్యాలను సందర్శించిన గాంధీ, నెహ్రూ: జాతిపిత గాంధీజీ 1930లో నంద్యాలను సందర్శించి విక్టోరియా రీడింగ్ రూంలో జరిగిన సభలో ప్రసంగించారు. 1934లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 1937లో రాజాగోపాలచారి, 1952లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పర్యటించారు. వీరితో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు, వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు, ఆచర్య రంగా, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, గోపిరాజు రామచంద్రారావు, వెన్నెటి విశ్వనాథం, కడప కటిరెడ్డి, శ్రీమతి రామసుబ్రమ్మ, వాలిలాలు గోపాలక్రిష్ణయ్య నంద్యాలను సందర్శించారు. అప్పటి మున్సిపాలిటీ చైర్మన్ ఖాదర్‌బాద్ నర్సింగరావు వీరికి ఆహ్వానం పలికారు. -
Independence Day 2021: ఇండిపెండెన్స్ టూర్.. ఎందరో మహానుభావులు
ఒక అల్లూరి... ఒక ఆజాద్. ఓ మహాత్ముడు... ఓ ఉక్కు మనిషి. అందరిదీ ఒకటే నినాదం... జైహింద్. మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ... లక్ష్మీబాయి ఎత్తిన కత్తి... భగత్‌సింగ్ ముద్దాడిన ఉరితాడు... అందరిదీ ఒకటే సమరశంఖం. అదే... భారతదేశ విముక్తపోరాటం. డయ్యర్ దురాగతానికి సాక్షి జలియన్ వాలాబాగ్. దేశభక్తిని ఆపలేని ఇనుపఊచల అండమాన్ జైలు.సంకల్ప శుద్ధితో బిగించిన ఉప్పు పిడికిలి దండు. వీటన్నింటినీ ప్రకాశవంతం చేసిన దేవరంపాడు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా... దేశమాతకు సెల్యూట్ చేస్తూ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు. దేవరంపాడు: ప్రకాశ వీచిక ఆ రోజు 1928, అక్టోబరు నెల. స్వాతంత్య్ర సమరయోధులు మద్రాసు (చెన్నై) పారిస్ కార్నర్లో గుమిగూడారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ అంటూ ఏకకంఠంతో నినదించారు. బ్రిటిష్ అధికారుల ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపారు. పార్థసారథి అనే దేశభక్తుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. ఆ క్షణంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆవేశంగా ముందుకు వచ్చి ‘కాల్చండిరా కాల్చండి’ అంటూ శాలువా తీసి ఛాతీ విరుచుకుని ముందుకొచ్చారు. ఆ గొంతులో పలికిన తీక్షణతకు పోలీసులు చేష్టలుడిగిపోయారు. ఆ చోటులోనే ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. చెన్నై వెళ్లిన ప్రతి తెలుగు వారూ తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రకాశం పంతులు చివరిక్షణాల్లో జీవించిన దేవరంపాడు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. దేవరంపాడు గ్రామం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి స్థానిక రాజకుటుంబీకులు విరాళంగా ఇచ్చిన పన్నెండు ఎకరాల మామిడితోట ప్రస్తుతం జాతీయ స్మారక చిహ్నాల సుమహారం. ఇందులో వందేమాతర విజయధ్వజం, గాంధీ– ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా త్రివర్ణ స్థూపం ఉన్నాయి. ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఇక్కడే జీవించారు. ఏటా ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, మంత్రులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు ఒంగోలులో బస చేసి దేవరంపాడుకి వెళ్లి రావచ్చు. హుస్సేనీవాలా: విప్లవ జ్ఞాపకం పంజాబ్ రాష్ట్రం, ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉంది హుస్సేనీవాలా గ్రామం. ఇది అమర వీరుల స్మారక చిహ్నాల నేల. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల గౌరవార్థం రోజూ సాయంత్రం జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని భారత్– పాకిస్థాన్ సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఈ అమరవీరుల జ్ఞాపకార్థం వీరు ముగ్గురూ ప్రాణాలు వదిలిన రోజును గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 23వ తేదీన ప్రభుత్వం షాహీద్ మేళా నిర్వహిస్తారు. అహ్మదాబాద్: ఐక్యత వేదిక అహ్మదాబాద్ వెళ్లగానే మొదట సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ మహాత్ముని ఆశ్రమం వైపు అడుగులు పడతాయి. మన జాతీయోద్యమంలో అనేక ముఖ్యమైన ఉద్యమాలకు ఇక్కడే నిర్ణయం జరిగింది. అందుకే దీనిని సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో అణువణువూ గాంధీజీ నిరాడంబరమైన జీవితాన్ని, జాతీయోద్యమం పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో చూసి తీరాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవనం. అహ్మదాబాద్ నగరం షాహీబాగ్‌లో ఉన్న మోతీ షాహీ మహల్‌ను పటేల్ మెమోరియల్‌గా మార్చారు. సర్దార్ పటేల్ నేషనల్ మెమోరియల్‌లో పటేల్ జీవితంతోపాటు జాతీయోద్యమం మొత్తం కళ్లకు కడుతుంది. ఒక్కో గది ఒక్కో రకమైన విశేషాలమయం. పటేల్ జీవితంలో జైలు ఘట్టాలతోపాటు, బాల్యం, స్వాతంత్య్ర పోరాటం, జాతీయనాయకులతో చర్చల చిత్రాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు కూడా ఉంటాయి. కృష్ణదేవి పేట: అల్లూరికి వందనం తెలుగు జాతి గర్వపడే వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు... అల్లూరి సీతారామ రాజు సమాధి విశాఖపట్నం జిల్లా, గోలుగొండ మండలం, కృష్ణదేవి పేట (కె.డి. పేట)లో ఉంది. ప్రభుత్వం దీనిని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా అల్లూరి సమాధి అని మన మాట పూర్తయ్యేలోపు ఎలా వెళ్లాలో దారి చూపిస్తారు. ఈ ప్రదేశంలో సీతారామరాజు పేరుతో పార్కును అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు సమాధికి సమీపంలోనే సీతారామరాజు అనుచరులు మల్లుదొర, ఘంటం దొర సమాధులు కూడా ఉన్నాయి. ఒక భవనంలోని ఫొటో గ్యాలరీలో సీతారామరాజు జీవిత విశేషాలను, బ్రిటిష్ వారి మీద పోరాడిన ఘట్టాలను చూడవచ్చు. కృష్ణదేవి పేట గ్రామం విశాఖపట్నానికి పశ్చిమంగా నూటపది కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రయాగ్‌రాజ్: ఆజాద్ ఆఖరి ఊపిరి అలహాబాద్ నగరంలో 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఆజాద్ స్మారకం. చంద్రశేఖర్ ఆజాద్ తుది శ్వాస వదిలిన చోట ఆయన స్మారక విగ్రహాన్ని స్థాపించారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నగరంలో ఉంది. జాతీయోద్యమంలో భాగంగా ఆజాద్ 1931 ఫిబ్రవరి 27వ తేదీన పోలీసు అధికారుల మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను పట్టుబడుతున్న క్షణంలో ఆజాద్ తన తుపాకీలోని చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు ఆల్ఫ్రెడ్ పార్కుగా ఉన్న పేరును ఆజాద్ పార్కుగా మార్పు చేశారు. దండి: ఉవ్వెత్తిన ఉప్పు దండు గుజరాత్ రాష్ట్రం, దండి తీరాన గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలియని భారతీయులు ఉండరు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఎనభై మంది సత్యాగ్రహులు 1930, మార్చి నెలలో దండి గ్రామం వరకు 241 కి.మీల దూరం ఈ మార్చ్ నిర్వహించారు. అహింసాయుతంగా శాసనోల్లంఘనం చేసిన ఉద్యమంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్యమం ఇది. ఇక్కడ ఉన్న ‘నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్’ను ప్రతి భారతీయుడు ఒక్కసారైనా సందర్శించి తీరాలి. పోర్టు బ్లెయిర్: బిగించిన ఉక్కు పిడికిలి భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను తలుచుకుంటాం. వారితోపాటు లక్షలాది మంది సామాన్యులు కనీస గుర్తింపుకు కూడా నోచుకోకుండా జీవితకాలం పాటు జైల్లో మగ్గి దేశం కోసం ప్రాణాలు వదిలారు. వారికి నివాళి అర్పించాలంటే అండమాన్ దీవుల రాజధాని నగరం పోర్టు బ్లెయిర్‌లోని సెల్యూలార్ జైలును సందర్శించాలి. ఇది నేషనల్ మెమోరియల్ మాన్యుమెంట్. వీర సావర్కర్ వంటి ఎందరో త్యాగధనులు జైల్లో ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడిపారో కళ్ల ముందు మెదిలి గుండె బరువెక్కుతుంది. వాళ్లు ధరించిన గోనె సంచుల దుస్తులు, ఇనుస సంకెళ్లు, నూనె తీసిన గానుగలు వారిలోని జాతీయత భావానికి, కఠోరదీక్షకు నిదర్శనలు. జలియన్ వాలాబాగ్: డయ్యర్ మిగిల్చిన చేదు జ్ఞాపకం బ్రిటిష్ పాలకుల చట్టాలను వ్యతిరేకిస్తూ సమావేశమైన ప్రజల మీద జనరల్ డయ్యర్ ముందస్తు ప్రకటన లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ప్రదేశం పేరు జలియన్ వాలాబాగ్. ఇది పంజాబ్, అమృత్‌సర్‌లో ఉంది. వేలాది మంది ప్రాణాలను హరించిన దుర్ఘటన 1919, ఏప్రిల్ 13వ తేదీన జరిగింది. దేశం కోసం నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వారి జ్ఞాపకార్థం స్మారకం, అమరజ్యోతి, ప్రతీకాత్మక శిల్పాలు ఉన్నాయి. మౌనంగా నివాళులు అర్పించే లోపే మనోఫలకం మీద ఆనాటి బాధాకరమైన దృశ్యం కళ్ల ముందు నిలిచి, హృదయం ద్రవించిపోతుంది. మనదేశ చరిత్రలో అత్యంత కిరాతకుడిగా ముద్ర వేసుకున్న జనరల్ డయ్యర్ మీద బ్రిటిష్ ప్రభుత్వం... జలియన్ వాలా బాగ్ సంఘటన ఆధారంగా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. ఝాన్సీ: వీర తిలకం మనకు ఝాన్సీ పేరుతోపాటు రాణి లక్ష్మీబాయ్ పేరు పలకనిదే సంపూర్ణంగా అనిపించదు. బ్రిటిష్ పాలకుల మీద తొలినాళ్లలో కత్తి ఎత్తిన వీరనారి లక్ష్మీబాయ్. తొలి స్వాతంత్య్ర సమరంలో లక్ష్మీబాయ్ బ్రిటిష్ సేనలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించింది. ఆమె స్మారకాలు మూడు చోట్ల ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ కోట, నాటి ఝాన్సీ రాజ్యంలోని (మధ్యప్రదేశ్) పూల్‌బాగ్‌లో ఆమె సమాధి, స్మారక చిహ్నాలున్నాయి. వారణాసిలో ఆమె పుట్టిన చోట కొత్తగా మరో స్మారకనిర్మాణం జరిగింది. ఇందులో మణికర్ణిక పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాణిగా బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఘట్టాలన్నీ కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్యటించి తీరాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. బారక్‌పోర్: మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ కోల్‌కతాలోని బారక్‌పోర్ కంటోన్మెంట్ ఏరియాలో మంగళ్‌పాండే జ్ఞాపకార్థం ‘షాహీద్ మంగళ్ పాండే మహా ఉద్యాన్’ పేరుతో విశాలమైన పార్కును నిర్మించారు. మంగళ్‌పాండే బ్రిటిష్ అధికారుల మీద దాడి చేసిన తర్వాత అతడిని ఉరితీసిన ప్రదేశం ఇది. ఈస్టిండియా కంపెనీలో సిపాయిగా చేరిన పాండే సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర వహించాడు. పాండేని బ్రిటిష్ పాలకులు 1857, ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉరితీశారు. ఆ ప్రదేశంలో ఆయన స్మారక చిహ్నం ఉంది. -
తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం
కొమరాడ (విజయనగరం)/పద్మనాభం (భీమిలి): అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరిని శాశ్వతంగా స్మరించుకునేలా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను ప్రభుత్వం నిర్మించనుందని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్లతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి సీఎం జగన్ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అల్లూరి మ్యూజియం విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంగిలో ఆదివారం ప్రభుత్వ పరంగా నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడారు. పాండ్రంగిలో అల్లూరి పేరు మీద రూ.3 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.