
స్వాతంత్య్ర సమరయోధుడి ఆమరణ దీక్ష
95 ఏళ్ల వయస్సులో పొట్టి శ్రీరాములు శిష్యుడి సంకల్ప బలం
ఉదయగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాళెంకు చెందిన 95 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత పొట్టి శ్రీరాములు శిష్యుడు రెడ్డిబత్తిన అంకయ్య చౌదరి తన స్వగ్రామంలోని బస్టాండ్ సెంటర్‌లో గురువారం సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘1946 నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములుతో కలిసి ఆందోళన చేశాను. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టిన ఆమరణ దీక్షలో ఆయనతో కలిసి పాల్గొన్నానన్నారు.
ఆయన మరణం తర్వాత శవయాత్రలో మద్రాసీయులు తనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో మద్రాసు నుంచి బంధువుల ఒత్తిడిమేరకు స్వగ్రామం గండిపాళెం చేరుకున్నాను. అనంతరం గండిపాళెం, ఉదయగిరి మునసబుగా 33ఏళ్లు పనిచేశాను. కాంగ్రెస్ తనస్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించే ప్రయత్నానికి నిరసనగా తీవ్ర మనస్తాపం చెంది ఆమరణ దీక్ష చేపట్టాను. తెలంగాణ విభజన నిలిపేసి సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తాన’ని తెలిపారు. ఆయన దీక్షకు మద్దతుగా గ్రామంలోని పలు పాఠశాలల విద్యార్థులు బస్టాండ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు.