Andhra Pradesh State Re-organization Bill
-
‘ముందస్తు’కు ముంపు మండలాల బ్రేకర్
-
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన షురూ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజన ప్రక్రియ మొదలైంది. నగదు భారం పడకుండా ఏపీ భవన్‌ను 58:42 లో పంచునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రా లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సచివాలయం లో బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల విభజన విభా గం అధికారుల తొలి భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఏపీ భవన్‌కు 19.437 ఎకరాల భూములున్నాయి. ఇందులో 3.73 ఎకరాల్లో శబరి బ్లాక్, 4.196 ఎకరాల్లో గోదావరి –స్వర్ణముఖి బ్లాకులతో పాటు ఏపీ సీఎం కాటేజీ ప్రాంగణం, 3.412 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.564 ఎకరాల్లో పటౌడీహౌస్ ఉన్నాయి. మధ్యలో 0.535 ఎకరాల మేర సర్వీసు రోడ్డు ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నీ రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58%, తెలంగాణ 42% నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచనలమేర పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పంపిణీపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందని గతంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి భవన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని గతేడాది మార్చిలోనే సూచించింది. -
బీజేపీ సిగ్గు పడాలి: మంత్రి నక్కా
సాక్షి,గుంటూరు : టీడీపీని వదులుకున్నందుకు బీజేపీ సిగ్గుపడాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ పతనం ఏపీ నుంచే మొదలవుతుందని జోస్యం చెప్పారు. అమిత్ షా లేఖ ఏపీని అవమానించేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆమిత్ షా పాత చరిత్ర తిరగేస్తే ఎవరు అవినీతి చేశారో తెలుస్తుందన్నారు. బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన 19 విభజన హమీల్లో ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పిన మోదీ ఇప్పడు కుట్రలు చేసి ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.ఇప్పటికిప్పడు అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ వారు కూడా మద్దతు ఇస్తారని మోదీ భయపడుతున్నారని ఆనంద్ బాబు అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో 40శాతం ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని ఆయన విమర్శించారు. -
పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ ఇచ్చిన స్ర్కిప్ట్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బీజేపీపై రుద్దడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు వెళతారని హెచ్చరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏ విధంగా ప్రత్యేక హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. యుజిడికి ఐదు వందల కోట్లను కేటాయించినా మూడు సంవత్సరాలలో పూర్తి చేయలేదని, ఫలితంగా అనేక మంది మృతి చెందారని వీర్రాజు విమర్శించారు. రూ.52వేల కోట్ల రూపాయలతో నిర్మించే పోలవరాన్ని 2018 నాటికి చంద్రబాబు ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలి రాజధాని నిర్మాణ కోసం అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు నిర్మాణాలపై ఎలాంటి చర్చ జరపలేదని, రాజధాని నిర్మాణ డిజైన్ ఇప్పటి వరకూ కూడా పూర్తిచేయలేదని అన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఇచ్చిన యుసిలో ఏమున్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విభజ బిల్లులోని అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అములు చేస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉందని వీర్రాజు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తట్టుకునే శక్తి బీజేపీకి ఉందన్నారు. త్వరలోనే నామినేటేడ్ పదవులకు రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్‌మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్‌మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్‌కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
విభజన సమస్యలపై పీటముడి
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విభజన సంబంధిత అంశాల పరిష్కారానికి మళ్లీ పీటముడి పడింది. ఈనెల 23న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫు అధికారులు గైర్హాజరయ్యారు. బడ్జెట్ తయారీ కసరత్తులో ఉన్నందున తాము రాలేమని తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి సమాచారం అందించారు. కాగా, రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఈనెల 27న భేటీ కావాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరగాల్సిన ఈ భేటీకి హాజరయ్యేందుకు తెలంగాణ సీఎస్ విముఖత వ్యక్తం చేయడంతో ఈ సమావేశం కూడా వాయిదా పడింది. వరుసగా గతేడాదిగా జరుగుతున్న భేటీలతో ప్రయోజనమేమీ లేదని, భేటీల్లో తీసుకున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయట్లేదని, అందుకే సమావేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని తెలంగాణ పేర్కొంటోంది. గతేడాది గవర్నర్ సమక్షంలో జరిగిన మంత్రుల త్రిసభ్య కమిటీల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదని, పలుమార్లు లేఖలు రాసినా సచివాలయంలో ఏపీ అధీనంలో ఉన్న భవనాలను ఇప్పటికీ అప్పగించకపోవటాన్ని వేలెత్తి చూపుతున్నారు. తొమ్మిదో షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ తేలకముందే ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లు తెలిసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల భేటీలకు కొంతకాలం దూరంగా ఉండాలని భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
అటు నేనే..! ఇటు నేనే..!
♦ త్రికాలమ్ ‘విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే సుప్రీంకోర్టుకు వెడతాం’ అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరవై నాలుగు గంటలు దాటకుండానే ఆ మాట తాను అనలేదని చెప్పారు. ఈ రెండు నాల్కల ధోరణి చంద్రబాబు రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించదు. అటూ, ఇటూ కూడా తానే ఆడే క్రీడలో ‘ఘనవిజయాలు’ సాధిస్తూ ముందుకుపోతున్న ఆయన ప్రస్థానం చిత్రవిచిత్రమైనది. దేశంలో చాలామంది ప్రాంతీయ పార్టీ నేతలను చూస్తున్నాం. కరుణానిధి, ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, మమతాబెనర్జీ, శరద్‌పవార్, నవీన్పట్నాయక్లలో ఎవ్వరూ ఇంతటి కపట రాజ కీయ విన్యాసాలు చేయలేదు. ఇందిరాగాంధీతో, వాజపేయితో, సోనియాగాం ధీతో రాజకీయంగా పట్టువిడుపులతో వ్యవహరించినవారు ఉన్నారు కానీ అ«ధికారంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలాగా హుంకరించడం, ఎన్నికలలో పొత్తుపెట్టుకున్న మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించడం, చేస్తున్నదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం వారిలో ఎవ్వరూ చేయలేదు. చంద్రబాబు వేదన చంద్రబాబు మనోవేదనను అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పనీ కావడం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రిని వేధిస్తున్న నాలుగు అంశాలూ చాలా కీలకమైనవి. ఒకటి–ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి. రెండు–పోలవరం ప్రాజెక్టు. మూడు– రాజధాని నిర్మాణం. నాలుగు– అసెంబ్లీ స్థానాల పెంపుదల. ప్రాధమ్య క్రమంలో తేడా ఉండవచ్చును కానీ ఈ నాలుగూ ఆయనను కుంగదీస్తున్న సమస్యలు. పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తానూ, వెంకయ్యనాయుడూ తిరుపతిలో ఒకే వేదికపైన చేసిన హామీ నీరుగారిపోయింది. తీరా ఢిల్లీలో, అమరావతిలో బీజేపీ, టీడీపీలు కలసి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యేక హోదాలో అంత ప్రత్యేకత ఏమీ లేదనీ, అది సంజీవని కాదనీ, దానితో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారనీ కేంద్రానికి వంతపాడుతూ ముఖ్యమంత్రి కొంతకాలం కాలక్షేపం చేశారు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ సైతం రాలేదంటూ తేల్చిపారేశారు. ఇతర రాష్ట్రాలతో సమానమైన స్థాయిని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలంటూ వాదిం చారు. కానీ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించడంలో దారుణంగా విఫలమైనారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య విశ్వాసరాహిత్యం కనిపిస్తోంది. ఈ సమస్యను చంద్రబాబు అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది స్వయంకృతాపరాధం. విభజన చట్టం ప్రకారం పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాల్వల తవ్వకం చాలావరకూ పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి చేయవలసిందిగా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావలసిన ముఖ్యమంత్రి తానే ప్రాజెక్టు శేషభాగాన్ని పూర్తి చేస్తానంటూ తనది కాని భారం నెత్తికెత్తుకున్నారు. అప్పుడైనా తన శక్తియుక్తులన్నీ అందుకోసమే వినియోగిస్తే ఆక్షేపించే అవసరం ఉండేది కాదు. ఆ విధంగా చేయకుండా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నెలకొల్పి గొప్ప ప్రాజెక్టు నిర్మించినట్టూ, నదుల అనుసంధానం చేసేసినట్టూ అట్టహాసంగా పదేపదే పండుగలు చేసుకున్నారు. అది చాలదన్నట్టు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా నిర్మించారు. ఈ స్కీంలు తోడే గోదావరి నీళ్ళు పోలవరం కాల్వల ద్వారానే ప్రవహిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు స్కీంల అవసరం ఉండదు. వాటిపైన ఖర్చు చేసిన రూ. 3,000 కోట్లు శుద్ధ దండగ. ఈ రెండు మైనర్ ప్రాజెక్టులు మినహా రాష్ట్రంలో తెలుగుదేశం–బీజేపీ సంకీర్ణ సర్కార్ సాధిం చిన ఘనకార్యం ఏదీ లేదు. ఇప్పుడు పోలవరం సైతం వివాదాలలో చిక్కుకుంది. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం లేదు. శ్వేతపత్రం ప్రచురించమంటే ససేమిరా అంటోంది. కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తాననీ, అన్ని నిర్ణయాలూ తీసుకుంటామనీ అంటున్నారు కానీ రావడం లేదు. వాయిదాలు వేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌ను నియమించాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు గడ్కరీ గండి కొట్టారు. ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్ళి గడ్కరీని సుముఖం చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ప్రాజెక్టు ప్రదేశంలో పూచికపుల్ల కదలడం లేదు. తిరగని చక్రం రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు విధేయవర్గం. రెండోది వ్యతిరేకవర్గం. లెక్కలు చెప్పాలనీ, అవినీతి తగ్గాలనీ వాదిస్తున్న బీజేపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకులు. విధేయవర్గం నాయకులు తెలుగుదేశం ఎంపీలను తీసుకొని ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ తర్వాతనే ఢిల్లీ రావలసిందిగా చంద్రబాబుకు ప్రధాని ఆహ్వానం అందింది. ప్రధాని–ముఖ్యమంత్రి సమావేశం అంత సంతోషదాయకంగా ముగిసినట్టు లేదు. సమావేశం జరిగి వారం రోజులు కాకముందే సుప్రీంకోర్టుకు వెడతాం అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడం దేనికి సంకేతం? అలా అనడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని మర్నాడు సంజాయిషీ చెప్పడం ఎందుకు? విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానానికి వెడితే ఎవరికి నోటీసులు అందుతాయి? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికే కదా? అంటే కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్టే కదా! అంత పని చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని వాదిస్తే ఎట్లా కుదురుతుంది? పోలవరం పీటముడి విడిపోయి ఎన్నికల లోపు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు చంద్రబాబు తనను తానే నిందించుకోవాలి. రాజధాని నిర్మాణంపై చెప్పుకోవలసింది ఏమున్నది? మూడేళ్ళపాటు సింగపూర్ చుట్టూ ప్రదక్షిణల తర్వాత డిజైన్లు ఖరారు చేశారని మాత్రం చెప్పుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదికపైన నిర్మాణం ఆరంభం కాలేదు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు తాత్కాలికమైనవే అయినా వాటి నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. అందుకు కారణాలు ఊహించుకోవలసిందే. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ‘మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను, వ్యాపారవేత్తలను చేస్తాను’అంటూ హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ రైతుల చుట్టూ తిరిగి ల్యాండ్‌బ్యాంక్ తయారు చేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ఆయన విదేశాలకు వెళ్ళి తన దగ్గర ల్యాండ్‌బ్యాంక్ ఉన్నదనీ, పరిశ్రమలు పెడితే భూమి ఉదారంగా ఇస్తాననీ చెబుతున్నారు. ఇటు భూములు ఇచ్చిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే సంకల్పంతో మూడున్నర సంవత్సరాలు ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న చంద్రబాబు పైకి గంభీరంగా కనిపించినా మనసులో బెంగటిల్లుతూ ఉండాలి. అందుకే మాటలు తూలడం. వెంటనే సర్దుకోవడం. సమతౌల్యం కోల్పోవడం ఇందుకు ప్రధాన కారణం. నయాపైస లేకుండా కేవలం తన తెలివితేటలతో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ చెప్పుకున్న బాబు చేష్టలుడిగినట్టు కనిపిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించినట్టు లేదు. ప్రతిపక్షానికి చెందిన రెండు డజన్ల శాసనసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు వచ్చే ఎన్నికలలో అసమ్మతి సెగ తగలకుండా ఉండాలంటే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకులకు టికెట్లు ఇవ్వాలి. అందుకు అదనపు స్థానాలు కావాలి. అందుకే స్థానాల పెంపు ఆ పార్టీకి ముఖ్యం. కానీ బీజేపీకి ఇది ప్రధానాంశం కాదు. దానికి పార్లమెంటు స్థానాలు ముఖ్యం. కేంద్ర పథకాలకూ, కేంద్రం సహాయంతో అమలు చేసే పథకాలకూ తన పేరూ లేదా ఎన్టిఆర్ పేరూ పెట్టుకుంటున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి నిధులు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులే వాదిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ స్థానాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇందుకోసం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి అనేక విడతలు కలుసుకున్నారు. మొన్న ప్రధానికి బాబు చేసిన వేడుకోళ్ళలో ఇది ప్రధానమైనది. మోదీ మన్నిస్తారో లేదో మరి. చంద్రబాబు 1995–2004 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఆయన శైలి ఇదే విధంగా ఉండేది కానీ ఇన్ని రకాల వైఫల్యాలు లేవు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఐకె గుజ్రాల్‌ని ప్రధాని పీఠంపైన కూర్చోబెట్టారు. చంద్రబాబు కోసం వాజపేయి తన పదవీకాలాన్ని కుదించుకొని ముందస్తు ఎన్నికలకు అంగీకరించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తర్వాత ప్రజలలో తన పట్ల సానుభూతి వెల్లువెత్తిందనే అభిప్రాయంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై వాజపేయిని సైతం ఒప్పించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఊహించగలమా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? తెలంగాణ ఇస్తే టీడీపీకి అభ్యంతరం లేదని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాసి, దమ్ముంటే రాష్ట్రాన్ని విభజించమంటూ సోనియాగాంధీని సవాలు చేసిన చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం అన్యా యంగా, అశాస్త్రీయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ వాపోతున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపైన చర్చలో తెలుగుదేశం సభ్యులు పాల్గొని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి, సవరణలు సూచించి, వాటిని ఆమోదించకపోతే యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం ఉంది. విభజన క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి రావలసిన రక్షణల కోసం పోట్లాడకుండా ఇప్పుడు యూపీఏని విమర్శించడం చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రత్యేకహోదా హామీని బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు సాధించారు కానీ తెలుగుదేశం ఎంపీలు కాదు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండాలి. గడువు ముగిసే లోగా అన్ని వసతులూ కలిగిన రాజధాని నగరం నిర్మించుకొని అక్కడికి తరలి వెళ్ళవచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందో లేదో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించి కట్టుబట్టలతో పంపించారంటూ యూపీఏని నిందించడం కపట రాజకీయం. తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అమలు చేయడానికీ, తెలంగాణలో టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడానికీ కారణం ఒకానొక భ్రమ. రెండు రాష్ట్రాలలోనూ తన ప్రాబల్యం ఉండాలనీ, తానే రాజ్యం చేయాలనే ఆకాంక్ష. ఇది అసాధ్యమని అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తెలుసుకోలేకపోవడం విచిత్రం. తాను రాజకీయ, నైతిక విలువలను తుంగలో తొక్కి, ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసి ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎంఎల్ఏలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాజేశారు. చివరికి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే మంచిదని మోత్కుపల్లి నరసింహులు సలహా ఇచ్చే వరకూ పరిస్థితి వచ్చింది. తెలంగాణ నుంచి ఆకస్మికంగా నిష్క్రమించడానికీ, ప్రధానమంత్రితో గట్టిగా మాట్లాడలేకపోవడానికీ, ఎన్ని అవమానాలు జరిగినా ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించకపోవడానికీ ఒకే ఒక కారణం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమే. ఆ దుస్సాహసం వెనుక దురాశ, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అనైతిక రాజకీయం ఉన్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఉన్నది. కానీ ధైర్యం చాలడం లేదు. అందుకే మాట తూలడం, నాలిక కరుచుకోవడం. కె. రామచంద్రమూర్తి -
‘వర్గీకరణ’ రాజకీయ అంశమైంది
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశంగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా భారతి అనే ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఆమె మృతదేహాన్ని గద్దర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి కుటుంబీకులకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, అఖిలపక్షానికి కార్యరూపం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టికల్ 341-డి కింద ఎస్సీ వర్గీకరణకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. -
మరికొంత సమయమివ్వండి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మరికొంత సమయం కావాలని ఉభయ రాష్ట్రాలు హైకోర్టును కోరాయి. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని గతంలో హైకోర్టు ఇరు రాష్ట్రాలకూ సూచించింది. ఈ క్రమంలో ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ, ఏపీల అడ్వొకేట్ జనరల్స్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గడువు మంజూరు చేస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఏపీ స్థానికత ఆధారంగా 1,242 మంది ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలు, తుది జాబితాలను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలులో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దీనిపై క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణం కోసం అంటూ ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కుంటోందని ఆరోపించారు. అదేవిధంగా చారిత్రక పరేడ్‌గ్రౌండ్స్‌లో కొత్తగా సెక్రటేరియట్ కోసం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం పూనుకోవటాన్ని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వృథా చర్య అని అభివర్ణించారు. -
విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
వేసవి తరువాత ప్రత్యేక కార్యాచరణ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని తాళ్లరేవు (ముమ్మిడివరం) : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాలని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలోని బాపనపల్లిలో పేరిచర్ల రాజగోపాల్‌రాజు ఫార్మ్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. ఉత్తరాదిలో ఓ రాష్ట్రానికి రూ.43వేల కోట్లు ఇచ్చి, మన రాష్ట్రానికి మాత్రం రూ.2500 కోట్లు ముష్టి వేశారన్నారు. ఏపీలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చట్టబద్ధత తీసుకొచ్చాం పండగ చేసుకోండి అనడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలంగాణాలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చారని, అయితే ఆంధ్రాలో కేవలం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారన్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరంపై సరైన స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.ఏడు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీం నుంచి ఇచ్చామంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.7500 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాల్సిన పరిస్థితి ఏంటన్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఉమ్మడి నిధులు సుమారు రూ.32 వేల కోట్లు రావాలని అంటున్నారని అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్‌నుంచి నీళ్లు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం విడుదల చేయాలి. దానిని సెంట్రల్ కమిటీకి అప్పగించమంటే దానిపై స్పందించడం లేదన్నారు. 2018లోపు మన రాష్ట్రంలో పోర్టును అభివృద్ధి చేయాలని విభజన చట్టంలో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రూ.25 వేల కోట్లతో తమిళనాడులో మూడో పోర్టు కొల్లేచల్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. విభజన చట్టం 108వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు జూన్ 1తో అయ్యిపోతున్నా, ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. తెలుగువాళ్ల మధ్య ఐక్యత లేకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనక్కిపోతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీలు భయం వదిలి పోరాడితే విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేరతాయన్నారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు గీతాలు, పుస్తకాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు. -
కేంద్ర హోంమంత్రిని కలిసిన గవర్నర్
-
కేంద్ర హోంమంత్రిని కలిసిన గవర్నర్
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చ జరిపారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మంత్రులతో విభజన చట్టం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమావేశం అంశాలను రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిపారు. అలాగే షెడ్యూల్ 9, 10, ఏపీ భవన్ విభజన తదితర అంశాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కమిటీ వేశామని, ఇప్పటికే రెండు సమావేశాలు జరిగాయన్నారు. మార్చి 26న మరోసారి భేటీ అవుతారని గవర్నర్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. -
రేపే పంచాయితీ..
‘విభజన’సమస్యలపై గవర్నర్ సమక్షంలో చర్చలు - రాజ్‌భవన్‌లో సమావేశం.. హాజరుకానున్న - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల స్థాయి కమిటీలు - అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు - సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతివారం సమావేశాలు - నరసింహన్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం వహించనున్నారు. గవర్నర్ సమక్షంలో తొలిసారిగా ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీలు బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమై చర్చలు జరపనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య పీటముడిలా తయారైన సమస్యలన్నింటి పైనా దృష్టి సారించనున్నారు. అన్ని అంశాలూ ఓ కొలిక్కి వచ్చేదాకా ప్రతీ వారం ఈ కమిటీలు సమావేశం కానున్నాయి. సమావేశాలకు ఎజెండా తోపాటు, వివిధ సంస్థల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు తొలిసారిగా ఒకే వేదికపై అభిప్రాయా లను పంచుకోబోతున్నాయి. సచివాలయం, ప్రభుత్వ భవనాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన, జల జగడాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సహా అన్ని ప్రధాన సమస్యలూ సమావేశాల ఎజెండా కానున్నాయి. కేంద్ర హోం శాఖ పరిష్కరించాల్సిన 9, 10 షెడ్యూల్ అంశాలను కూడా ఇక్కడే పరిష్కరించుకోవాలని ఇరు4 రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. భవనాల అప్పగింతే కీలకం! ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతికి తరలిపోతున్న నేపథ్యంలో... సచివాలయంతో సహా హైదరాబాద్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. విభజనకు ముందు రాష్ట్రపతి పాలన సమయంలో విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాల పంపకంపై గవర్నర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో... అనుకున్న సమయం కంటే ముందే ఏపీ కార్యాలయాలను అమరావతికి తరలించే ప్రక్రియ మొదలైంది. దీంతో హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. సరైన నిర్వహణ లేక అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే అభిప్రాయమూ వస్తోంది. పలు చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఏపీ అధికారులు అద్దెకు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ శాఖలు కొన్ని తమ కార్యకలాపాల కోసం అదనపు భవనాలు, స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలను తమకు స్వాధీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. వీటితోపాటు రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల ఎజెండాను సైతం బుధవారం నాటి భేటీలో నిర్ణయించనున్నారు. హైదరాబాద్‌లో స్థలం కోసం ఏపీ పట్టు విభజన తర్వాత తమకు వాటాగా వచ్చే ఆస్తుల జాబితా, వాటి విలువలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను తయారు చేసుకున్నట్లు సమాచారం. అలా వచ్చే భవనాలు, ఆస్తుల విలువ సుమారు రూ.50 వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆ మొత్తానికి పరిహారంగా హైదరాబాద్ శివార్లలో భూములు కేటాయిస్తే... ఆస్తుల విభజనకు బేషరతుగా సమ్మతించి ఒప్పందం కుదుర్చుకోవాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెరపైకి కొత్త సచివాలయం ప్రభుత్వ భవనాల అప్పగింత చర్చలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మార్చి తరవాత పాత సచివాలయం కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులు సైతం కేటాయించనున్నట్లు సమాచారం. ఒకే బ్లాక్‌గా 6 అంతస్తుల్లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి రూ.300 కోట్ల వ్యయంతో ఆర్ అండ్ బీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గవర్నర్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ గవర్నర్ వద్ద సమావేశాల కోసం తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేకానందతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అటు ఏపీ కూడా ఆ రాష్ట్ర మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్‌లతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల భేటీలో సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముందస్తుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విభజన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. -
చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు?
-
చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు మాట్లాడరు?
విజయవాడ: ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పైసా తేలేదని, అజ్ఞానంతో ఉన్నవారు మాత్రమే ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రత్యేకహోదా, విభజన హామీల సమితి విమర్శించింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ప్రత్యేకహోదా అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించింది. తమిళనాడు స్ఫూర్తితో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని కోరింది. ప్రత్యేకహోదా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. అధికారపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ఇంటిముందు ధర్నాలు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని పేర్కొంది. పన్నీరు సెల్వం కంటే చంద్రబాబు పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేసింది. జల్లికట్టును పట్టుబట్టి పన్నీరు సెల్వం సాధించారని తెలిపింది. అదే తరహాలో ప్రత్యేకహోదా సాధించేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని సాధన సమితి వెల్లడించింది. -
అడవి.. అటింత.. ఇటింత
అటవీ శాఖ భద్రాచలం డివిజన్ కనుమరుగేనా ? మిగిలింది మూడు రేంజ్‌లు.. ఒక డీఎఫ్ఓ పునర్విభజనతో డీఎఫ్ఓ, సబ్ డీఎఫ్ఓ బదిలీ భద్రాచలం : నాడు రాష్ట్ర విభజన.. నేడు జిల్లాల పునర్విభజన.. భద్రాచలం అటవీ డివిజన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్దదిగా పేరుగాంచిన ఈ డివిజన్ నేడు నిర్వీర్యమై పోయింది. తాజా పరిణామాలతో భద్రాచలం అటవీశాఖ డివిజన్ కనుమరుగు కానుందా అనేది ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం నడిబొడ్డున విశాలంగా కనిపించే డివిజన్ కార్యాలయం ఇప్పుడు బోసిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు నార్త్, సౌత్ డివిజన్ కార్యాలయాలు భద్రాచలం కేంద్రంగా ఒకే ప్రాంగణంలో ఉండేవి. విభజన తర్వాత నాలుగు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్న సౌత్ డివిజన్‌ను చింతూరుకు మార్చారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలో కలపడంతో, భద్రాచలం అటవీశాఖపై ఆ ప్రభావం పడింది. భద్రాచలం నార్త్ డివిజన్లో సుమారు 1.20 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉండగా, ఒక్క వెంకటాపురం రేంజ్‌లోనే (దీని పరిధిలోకి వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాలు వస్తారుు) సుమారు 81 వేల హెక్టార్లు ఉంది. దీంతో భద్రాచలం డివిజన్లో ఉన్న 60 శాతం అడవి భూపాలపల్లి జిల్లాలో విలీనమైంది. ఇక భద్రాచలం డివిజన్ పరిధిలో చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రేంజ్‌లు ఉన్నప్పటికీ, వీటి పరిధిలో సుమారు 40 వేల హెక్టార్ల అడవి మాత్రమే ఉంటోంది. ఈ మాత్రానికి డివిజన్ కార్యాలయం అవసరమా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కుర్చీలన్నీ ఖాళీ.. భద్రాచలం అటవీశాఖ డివిజన్ నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలను వేరు చేయటంతో ఆ ప్రభావం ఉద్యోగులపై కూడా పడింది. డీఎఫ్ఓ, సబ్ డీఎఫ్ఓ, ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లు, ఒక డ్రైవర్‌ను ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. డీఎఫ్ఓ శివాల రాంబాబు, సబ్ డీఎఫ్ఓగా ఆయన భార్య ప్రవీణ ఇక్కడ పనిచేశారు. అయితే రాంబాబును ఆదిలాబాద్‌కు, ప్రవీణను నిర్మల్ డివిజన్‌కు బదిలీ చేసినా, వారి స్థానంలో ఇప్పటి వరకూ అధికారులను నియమించకపోవటం గమనార్హం. ఇక్కడికి వచ్చేందుకు అధికారులు సైతం మొగ్గు చూపటం లేదని తెలుస్తోంది. డివిజన్ కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీ అవుతున్నా, భర్తీకి నోచుకోకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం డివిజన్లో మిగిలిన మూడు రేంజ్‌లను కూడా ఒకే అధికారి పర్యవేక్షిస్తుండంతో ఇది దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డివిజన్ పరిధిలో ఉన్నది వీరే.. మిగిలిన భద్రాచలం డివిజన్లో మూడు రేంజ్‌లు ఉన్నారుు. భద్రాచలం రేంజ్ పరిధి కేవలం పట్టణానికే పరిమితమైంది. దీంతో ఇక్కడి అధికారులు, సిబ్బందికి రామాలయం దర్శనం కోసం వచ్చే ఆ శాఖ ఉన్నతాధికారుల మర్యాదలు చూసుకోవటంతోనే సరిపోతోంది. కాగా మూడు రేంజ్‌ల పరిధిలో నలుగురు డీఆర్ఓలు, పది మంది ఎఫ్‌ఎస్‌ఓలు, 23 మంది ఎఫ్‌బీఓలు, 19 మంది ఏబీఓలు ఉన్నారు. కార్యాలయ విధుల్లో భాగంగా ఒక సూపరింటెండెంట్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు ఆఫీసు సబార్డినేట్లు పనిచేస్తున్నారు. వీరిందరినీ పర్యవేక్షించేందుకు మాత్రం ప్రస్తుతం డివిజనల్ అటవీశాఖ అధికారి లేరు. అడవి లేదు.. అటవీ సంపదా లేదు.. దట్టమైన అటవీ ప్రాంతానికి భద్రాచలం పెట్టింది పేరు. ఈ కారణంగానే అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ప్రత్యేకంగా భద్రాచలం కేంధ్రంగా గిరిజన సహకార సంస్థ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా అత్యంత నాణ్యమైన తునికాకు లభించటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు సైతం భద్రాచలం ప్రాంతంలో లభించే తునికాకు కొనుగోలుకు పోటీపడేవారు. కానీ రాబోయే రోజుల్లో తునికాకు సేకరణ ప్రక్రియ ఎక్కడ నుంచి జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఈ మొత్తం పరిణామాలు భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భవిష్యత్‌పై బెంగతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వాసులకు భరోసా కల్పించేందుకు పాలకులు ఏ తీరుగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. -
కొత్త పాలనకు.. 3 రోజులే
తుది దశకు చేరుకున్న విభజన ప్రక్రియ ప్రభుత్వానికి పంపిన ఆర్డర్ టు సర్వ్ జాబితాలు ఆదేశాలందిన వెంటనే ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. విజయదశమి నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను నాలుగు జిల్లాలకు పంపిణీ చేసేందుకు ఆర్డర్ టు సర్వ్ జాబితాలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం ఆ జాబితాలను ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి ఆదేశాలందిన వెంటనే ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులను మినహాయిస్తే జిల్లాలో 62 ప్రభుత్వ శాఖల్లో సుమారు 4,297 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు ముహూర్తం దసరాకు గడువు మూడు రోజులే ఉండటంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు చోట్ల జిల్లా కార్యాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి కాని శాఖలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆసిఫాబాద్‌లో కొనసాగుతున్న కార్యాలయాల వేట కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో కార్యాలయ భవనాల వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల కొరత ఉండటంతో అధికార యంత్రాంగానికి కొంత ఇబ్బందిగా మారింది. ఇక నిర్మల్, మంచిర్యాల్లో ఇప్పటికే జిల్లా కార్యాలయాలన్నీ సిద్ధమయ్యాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవనాలకు రంగులు వేసి, బోర్డులను సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు విభజన కూడా తుది దశకు చేరింది. అన్ని శాఖల్లో కలిపి సుమారు 50,481 కరెంట్ ఫైళ్లు, 73,063 క్లోజ్డ్ ఫైళ్లు ఉన్నాయి. నాలుగు జిల్లాలకు సంబందించిన ఫైళ్లన్నింటినీ ఇప్పటికే స్కానింగ్ చేసిన అధికార యంత్రాంగం వాటిని నాలుగు జిల్లాలకు పంపుతున్నారు. కొత్త డివిజన్లు, మండలాల్లోనూ.. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో కొత్త ఆర్డీవో కార్యాలయాలు, మండల కార్యాలయాలను కూడా దసరా రోజునే ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు చాలా మట్టుకు కొలిక్కి వచ్చింది. -
విడదీయొద్దు
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు ఇప్పటికే ముంపు మండలాలతో జిల్లా నష్టపోయింది.. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ప్రాంతాలను విడదీయొద్దు.. ఇప్పటికే పోలవరం ముంపు మండలాలు ఆంధ్రాలో కలవడంతో నష్టపోయాం.. జిల్లా విభజన పేరుతో మరోసారి గార్ల, బయ్యారం మండలాలను వేరే జిల్లాల్లో కలపొద్దు.. ఈ మండలాలను కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి.. అంటూ హైదరాబాద్‌లో శనివారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో కోరారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాజధానిలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, సభ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కష్ణారావు, కడియం శ్రీహరిలు జిల్లా పునర్విభజన సమీక్షలో పాల్గొని ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాకు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఉంటాయని, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పేరుతో భద్రాద్రి జిల్లాగా నామకరణం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఐదు నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటాయని పేర్కొన్నాం. మేనిఫెస్టోలో భాగంగానే ఐదు నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉండాలి. ఇల్లెందు, బయ్యారం, గార్ల ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారం వచ్చే అవకాశం ఉంది. గార్ల, బయ్యారంను మహబూబాబాద్‌లో కలిపితే ఈ పరిశ్రమను జిల్లా కోల్పోనుంది. ఇప్పటికే ముంపు మండలాలతో అపార అటవీ సంపదను కోల్పోయాం. ఈ మండలాలను ఒకే జిల్లాలో ఉంచాలి. గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు.. ఇల్లెందు నియోజకవర్గం అంతా కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి... నియోజకవర్గంలోని మండలాలను మూడు జిల్లాల్లో కలిపితే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంత్రివర్గ ఉపసంఘం ఎదుట తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఇల్లెందు నియోజకవర్గంగా ఒకే జిల్లాలో ఉండాలన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు ఇలా.. ఉపసంఘం భేటీలో ఏ జిల్లాలోకి ఎన్ని మండలాలు వస్తాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ ప్రతిపాదనల్లో ఖమ్మం జిల్లాలోకి 21మండలాలు, కొత్తగూడెం జిల్లాలోని 18 మండలాలు వస్తాయని పేర్కొన్నారు. అయితే వీటిలో గార్ల, బయ్యారం పేర్లు లేకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి, కొత్తగూడెం జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలు ఉంటాయని తెలిపారు. గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తాయని.. ఆ జిల్లా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనల్లో చూపించారని సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత హాజరయ్యారు. -
కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు
న్యూఢిల్లీ: కేంద్ర కమ్యూనికేషన్,టెక్నాలజీ(ఐటీ) శాఖ ను విభజించి కొత్తగా ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ శాఖ ఆధార్, ఇంటర్నెట్ సర్వీసులను ప్రత్కేకంగా పర్యవేక్షిస్తుంది. దీంతో ఈ రంగానికి సంబంధించి రెండు మంత్రిత్వశాఖలు వేర్వేరుగా పని చేయనున్నాయి. కమ్యూనికేషన్ల శాఖ కింద టెలీకమ్యూనికేషన్, పోస్టల్ డిపార్ట్ మెంటులు పనిచేయనున్నాయి. ఎలక్రానిక్స్, ఇన్ఫరేషన్, టెక్నాలజీ విభాగాలు కొత్త శాఖ కింద పని చేస్తాయి. కొత్తగా ఏర్పడిన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ పౌరుని ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంపై ప్రత్యేకంగా పని చేయనుంది. -
ఉమ్మడి జాబితాపై పెత్తనం వద్దు
►అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి ► కొత్త చట్టం తెస్తే రాష్ట్రాల సమ్మతి తీసుకోవాలి ► రాష్ట్రాలపై అదనపు భారం పడితే కేంద్రమే భరించాలి ► రాష్ట్రాల్లో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలి ► తెలంగాణ, ఏపీ మధ్య వివాదాస్పద అంశాలను పరిష్కరించాలి ► విభజన చట్టం మేరకు నియోజకవర్గాల సంఖ్య పెంచాలి ►నిబంధనల అమలుకు అవసరమైతే చట్ట సవరణ చేయండి ►తీవ్ర జ్వరం కారణంగా గంటన్నరపాటే భేటీలో పాల్గొన్న కేసీఆర్ ► ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివిన సీఎస్ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి జాబితాలోని అంశాలపై పెత్తనం ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నలుగుతున్న వివాదాస్పద అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలుకు అవసరమైతే చట్ట సవరణలు చేయాలన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో గంటన్నర పాటు సమావేశంలో పాల్గొని 11.30 గంటలకు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. - మేం సహకార సమాఖ్య వ్యవస్థ భావనకు మద్దతు పలుకుతున్నాం. రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు కేంద్రం చేయాల్సింది చాలా ఉంది. నిధుల పంపిణీ విషయంలో, మౌలిక వసతుల ఏర్పాటులో అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది. కేంద్రం రహదారులకు నిధుల కేటాయింపులు పెంచినా.. సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ నీటి పారుదల ప్రాజెక్టును కేటాయించాలి. - ఉమ్మడి జాబితాలోని అంశానికి సంబంధించి ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చినప్పుడు, లేదా సవరణలు తెచ్చినప్పుడు రాష్ట్రాల సమ్మతి తీసుకోవాలి. ఒకవేళ సదరు చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడితే దాన్ని కేంద్రం పూర్తిగా తిరిగి చెల్లించాలి. ఉదాహరణకు విద్యాహక్కు చట్టం అమలు చేయడం వల్ల ఒక్క తెలంగాణపైనే ఏటా రూ. 300 కోట్ల భారం పడుతుంది. మోడల్ స్కూళ్ల పథకం కూడా కేంద్రం ప్రవేశపెట్టినా ఇప్పుడు నిధులు ఆపేయడంతో రాష్ట్రాలపై చాలా భారం పడుతోంది. ఏదైనా పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే అందుకు అవసరమయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే భరించాలి. - ఉమ్మడి జాబితాల్లోని అంశాల్లో కేంద్రం పెత్తనం చేయడం ఆపాలి. ఉదాహరణకు రాష్ట్రాలు నిరభ్యంతర పత్రం ఇచ్చేంతవరకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదు. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు 356 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు అవి 172కి పరిమితమయ్యాయి. కళాశాలల్లో వసతులు లేనందున వర్సిటీలు అనుబంధ హోదాను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. - కేంద్రం యూజీసీ బడ్జెట్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 65 శాతం కేటాయించి, వందలాదిగా ఉన్న రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు కేవలం 35 శాతం నిధులను కేటాయిస్తోంది. - రాష్ట్రాల గవర్నర్లను నియమించేటప్పుడు రాష్ట్రాలను కూడా సంప్రదించాలన్న సిఫారసుకు మేం మద్దతు పలుకుతున్నాం. అలాగే గవర్నర్‌ను వర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉంచరాదు. గవర్నర్లకు రాజ్యాంగబద్ధమైన విధులు చాలా ఉన్నందున ఇది సరికాదు. తెలంగాణలో ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం. - ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలి. అలాగే ఏపీలోనూ పెంచాలి. కేంద్రం దీని అమలుకు అవసరమైతే జోక్యం చేసుకుని తగిన చట్ట సవరణలు చేయాలి. - రాష్ట్రాలు తమ వనరుల సమీకరణకు వీలుగా కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితులను సడలించాలి. - స్థానిక సంస్థలకు నిధులను నేరుగా ఇవ్వకుండా రాష్ట్రాల ద్వారా ఇవ్వాలి. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లకు నిధుల్లేవు. ఎందుకంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తోంది. ఈ కారణంగా జిల్లా స్థాయి లో ప్రణాళికలు చేయడంలో సమస్యలు వస్తాయి. - ఆధార్ ద్వారా నేరుగా రాయితీలు పంపిణీ చేయడాన్ని సమర్థిస్తున్నాం. తెలంగాణ ఈ విషయంలో ముందు వరుసలో ఉంది. ఉపకార వేతనాలను మేం 100 శాతం ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నాం. - రెసిడెన్షియల్ పాఠశాలలు పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్నాయి. అందువల్ల రెసిడెన్షియల్ పాఠశాలల విధానాన్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలి. అలాగే నియామక ప్రక్రియను మెరుగుపరచాలి. ఉపాధ్యాయ నియామకాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరపాలని తెలంగాణ నిర్ణయించింది. ఉపాధ్యాయులకు శిక్షణ ప్రమాణాలను ఎన్సీటీఈ ద్వారా మెరుగుపరచాలి. ఉపాధ్యాయుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేయాలి. విద్యార్థుల ప్రతిభను ఆన్లైన్లో నిరంతర మూల్యాంకన విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అమలు చేయాలి. - కేజీ టు పీజీ వరకు సమగ్ర విద్యావిధానం ఉండాలి. అందరికీ అందుబాటులో, నాణ్యతతో కూడిన విద్య అందాలి. ఇందుకు కేంద్ర సాయం అందాలి. - దేశ అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ ఆధునీ కరణ అత్యంత కీలకం. కానీ ఇందుకు కేంద్ర నిధుల కేటాయింపు తగ్గిపోయింది. టెక్నాలజీ వినియోగం విరివిగా ఉండాలి. మారుమూల ప్రాంతాల్లోనూ సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలి. - రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలను బలోపేతం చేయాలి. - కొత్తగా కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఏదైనా చట్టం తెస్తే అందుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలి. - వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిపరచడం ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని పరిష్కరించవచ్చు. కేంద్రం తగినన్ని నిధులు ఇచ్చి మౌలిక వసతులను మెరుగుపరచాలి. రహదారులు, విద్యావసతులు సమకూర్చాలి. రహదారుల నిర్మాణానికి తెలంగాణ పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలి. - కేంద్ర-రాష్ట్రాల సంబంధాలను అంతర్రాష్ట్ర మండలి వేదిక ద్వారా బలోపేతం చేసుకోవాలి. సీఎం కేసీఆర్‌కు తీవ్ర జ్వరం అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ శనివారం ఉదయం సమావేశానికి హాజరైనా తీవ్ర జ్వరం కారణంగా గంటన్నరపాటు మాత్రమే ఉన్నారు. సమావేశం ప్రారంభంలో ఆయన ప్రధానిని కలిశారు. అస్వస్థతకు గురైన విషయాన్ని వివరించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రసంగాలు అయ్యే వరకు ఉన్న కేసీఆర్.. 11.30 గంటలకు తన అధికార నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా జ్వరం వచ్చి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఆయుర్వేద వైద్య నిపుణుడిని రప్పించినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సీఎం ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నారు. జ్వరం తగ్గకుంటే వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా షెడ్యూల్లో ఉన్నా అందులో కేసీఆర్ పాల్గొనే అవకాశాల్లేవని పార్టీ వ ర్గాలు తెలిపాయి. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు పరిష్కరిస్తూ అవార్డు జారీ చేయడంలో నిర్దిష్ట కాలవ్యవధిని అనుసరించేలా కేంద్రం ఒక విధానం ప్రవేశపెట్టాలి. ఈ మేరకు పూంచీ కమిషన్ చేసిన సిఫారసును అమలు చేయాలి. కొత్త రాష్ట్రంగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను నెరపడంలో తెలంగాణ ముందుంది. గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకతో తాగునీటికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని కేంద్రం పరిష్కరించాలి. -
మిషన్ కాకతీయలో ఖమ్మం జిల్లా ఫస్ట్: తుమ్మల
ఖమ్మం: మిషన్ కాకతీయ పనుల్లో ఖమ్మం జిల్లాది మొదటి స్థానం అక్రమించిందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మరో రెండు నెలల్లో సాగు నీరందిస్తామన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరగాలని లేదా ఉన్న హైకోర్టును ఇరు రాష్ట్రాలకు విభజించి విధులు నిర్వహించాలని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. -
కొడుకు, అల్లుడి కోసమే కొత్త జిల్లాలు
కరీంనగర్: కొడుకు కే తారకరామారావు, అల్లుడు టీ హరీశ్ రావుల కోసమే సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. స్వార్థం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డ కోసం నిజామాబాద్ ఉంది. ఇప్పుడు కొడుకు కోసం సిరిసిల్ల, అల్లుడి కోసం సిద్ధిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. శాస్త్రీయంగా జిల్లాలను విభజిస్తే తామూ సంతోషిస్తామని, కుటుంబసభ్యుల కోసం చేస్తే ఊరుకోమని అన్నారు. కరీంనగర్ కు చెందిన గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం సీఎం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
వారు ఆంధ్రులను మోసగించారు
కాంగ్రెస్ నేత, రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరామ్ రమేశ్ రచన ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ ఈ నెల 15న విడుదల కాబోతోంది. అందులోని విభజన అంశం గురించి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరామ్ వివరించారు. ముఖ్యాంశాలు... ప్ర: త్వరలో విడుదలవుతున్న మీ పుస్తకం ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ (పాత చరిత్ర, కొత్త భూగోళ శాస్త్రం)లో ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసిన చారిత్రక కారణాలు చర్చించారా? జ: ఔను. 1950 నుంచి, వైఎస్ఆర్గారు మరణించేవరకు ఉన్న సుదీర్ఘ చరిత్ర గురించి ఇందులో చర్చించాను. విభజన ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. దానిని చాలామంది విభజన వ్యతిరేకులు సౌకర్యంగా మరచిపోతున్నారు. 1960లలో జై తెలంగాణ ఉద్యమం జరిగినట్టే, 1970లలో జై ఆంధ్ర ఉద్యమం జరిగిందన్న సంగతిని కూడా విస్మరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారా? అది అనివార్యమేనా? ఆ నిర్ణయం తప్పో ఒప్పో నేను చెప్పలేను గానీ, విభజన అనివార్యమనే నేనను కుంటున్నాను. ఒక్క సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు విభజన కోసం గట్టిగానే అడిగాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ లిఖితపూర్వకంగా కూడా కోరాయి. వాస్తవానికి టీడీపీ రెండుసార్లు కోరింది. కాలం గడిచే కొద్దీ విభజన ఫలితాలు అనుభవానికి వస్తాయని నా భావన. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ నగర చరిత్ర, సంస్కృతి, అక్కడ సాధిం చిన విజయాలు, దానికి ఉన్న బలం అన్నీ నాకు ఎంతో ఇష్టం. జరిగిందేమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగింది. మీకు ఇంకొంత సమయం ఇచ్చి ఉంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును మరింత మెరుగ్గా తయారు చేయ గలిగి ఉండేవారన్న వాదనతో ఏకీభవిస్తారా? 2014 బిల్లు ప్రాథమికంగా తీవ్రమైన లోపాలు ఉన్నదేమీ కాదని నా అభిప్రాయం. సున్నితమైన సమతౌల్య ప్రక్రియ ఫలితం ఈ బిల్లు. దీనితో తెలంగాణ ఏర్పాటు కావడమే కాకుండా, మిగిలిన సీమాంధ్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందిం చినది. ఈ చట్టం రాజీతో జరిగిన కూర్పు. ఇందుకు నేను క్షమాపణలేమీ కోరడం లేదు. ఆ బిల్లులో ఎన్నో కొత్త అంశాలు చేరాయి. ఇవన్నీ నా పుస్తకంలో విస్తృతంగా చర్చించాను. ఎన్నికలకు ముందు విభజన విషయంలో సోనియాగాంధీ అడ్డదిడ్డమైన సల హాలు తీసుకుని నిరాశా పూరితమైన నిర్ణయం తీసుకున్నారా? ఆ నిర్ణయమే పార్టీ ఘోర వైఫల్యానికి దారి తీసిందని కూడా రుజువైంది. తెలంగాణ ఏర్పాటు విషయంలో జరిగిన రాజకీయ చర్చల గురించి నాకు తెలియదు. నా ప్రమేయం ఎక్కడి నుంచి అంటే, అక్టోబర్ 8, 2013న సాధారణ అవగాహన ఒప్పం దంలో నేను సభ్యుడినైన తరువాత నుంచి మాత్రమే. ఇది కచ్చితంగా రాజకీయ నిర్ణ యమే. కానీ చరిత్రతో సహా, చాలా అంశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిర్ణయం. విభజన ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్విని యోగం చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానవర్గం ఎందుకు అనుమతించింది? అదొక వ్యూహమా? అదే కదా వికటించింది! ఈ విషయం కూడా ప్రస్తావించాను. సోనియాగాంధీనీ, మన్మోహన్సింగ్నూ కూడా అలక్ష్యం చేసినప్పటికీ, పార్టీనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ కూడా ఖాతరు చేయక పోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు కొనసాగిస్తున్నారోనని నేను ఆశ్చర్య పోయిన సంగతిని కూడా అందులో వివరించాను. అయితే అప్పుడు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదని తరువాత ఒక సీనియర్ నేత నాతో అన్నారు. పార్టీ రాష్ట్రాన్ని విభ జించాలనే నిర్ణయం తీసుకున్నాక, దానిని అమలు చేయడానికి ముఖ్యమంత్రి నిరాకరిం చినప్పుడు ఆయనను మార్చి ఉండవలసిందని నేను స్పష్టంగా భావించాను. నాయకురాలిని గందరగోళ పరుస్తూ దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు విశ్వసించడానికి వీలులేని రీతిలో పోషించిన పాత్రను గురించి ఏమంటారు? వారికి ఇష్టం లేని, వారు వ్యతి రేకించే విధానాన్ని అర్థమనస్కంగా అమలు చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. విశ్వసించదగని పాత్ర అంటూ ఎవరైనా పోషించారని నేను అనుకోను. ప్రతివారు తమకు పార్టీ లేదా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ను మధ్య ప్రదేశ్ నుంచి విభజించినప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగ్విజయ్‌సింగ్ ఉన్నారన్న సంగతిని విస్మరించరాదు. మీరు దిగ్విజయ్‌సింగ్ నిర్వహించిన బాధ్యతను విశ్వసించదగి నది కాదు అనడం అన్యాయమని నేను అనుకుంటున్నాను కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు మూలం విభజన చట్టమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ న్యాయమైనదేనా? ఎంతమాత్రం కాదు. చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత వైఫల్యాలను, ముఖ్యంగా ప్రధాని మోదీ చేత విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయించుకోవడంలో విఫలమై వాటిని కప్పిపుచ్చుకోవడానికే విభజన చట్టాన్ని తప్పుపడుతున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ఐదేళ్లు ఇస్తామని అంటే, ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇంతవరకు ఎందుకు అమలు కాలేదు? వెంకయ్య ఇచ్చిన హామీని మోదీ చేత చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలు చేయించుకోలేక పోయారు? ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలన్నీ విభజన చట్టం మేరకు ఏర్పాటు చేస్తున్నవే. విభజన విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణ నలోనికి తీసుకుని ఉంటే మరింత సున్నితంగా సాగి ఉండేదని మీరు భావిస్తున్నారా? ప్రతివారి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకున్నాం. పదేళ్ల పాటు చర్చలు జరి గాయి. సమస్య అంతా హైదరాబాద్ గురించే. దానితోనే విభేదాలు పెరిగాయి. జీహెచ్ ఎంసీని తెలంగాణకు ఇచ్చినప్పటికీ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఎందుకు ఉంచడం జరిగిందో కూడా పుస్తకంలో వివరించాను. ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో ఎందుకు చోటు చేసుకోలేదు? 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ను చట్టబద్ధంగా విభజించారు. అదే విధంగా తెలంగాణను కూడా విభజించడం జరిగింది. 2002లో ఆ రాష్ట్రానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. అప్పుడు కేంద్రమంత్రి మండలిలో తెలుగుదేశం భాగస్వామి కూడా. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మేం సరిగ్గా అదే బాటలో వెళ్లాం. ఈ అంశం కూడా నా పుస్తకంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోదీ, వెంకయ్యనాయుడు దగా చేశారు. -
'టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు'
- సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ అమలాపురం టౌన్(తూర్పుగోదావరి జిల్లా): విభజన చట్టంలోని అంశాల అమలులో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ, రాష్టంలోని టీడీపీ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వారం రోజులుగా సీపీఐ ఆధ్వర్యాన జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ శిబిరానికి హాజరైన ఆయన స్థానిక గడియారం స్తంభం సెంటర్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హామీలు ఇచ్చి విస్మరించడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, సామాన్యులు ఇలా ప్రతి వర్గం ప్రజలు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలవల్ల దేశ చరిత్రలో ఎప్పుడూ పడనంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టుకుని సాధించుకున్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సవరిస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రసంగించిన ప్రతి వక్తా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సామాన్యుడు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. సీపీఐ సీనియర్ నాయకులు కె.సత్తిబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చెల్లబోయిన కేశవశెట్టి, డాక్టర్ చలసాని స్టాలిన్, ఎల్.లెనిన్‌బాబు తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు. జనసేవాదళ్ శిక్షణ శిబిరానికి చెందిన యువకులు ఎర్రని దుస్తులు ధరించి, అరుణ పతాకాలు చేబూని.. పట్టణ వీధుల్లో గురువారం సాయంత్రం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
కేంద్రం పట్టించుకోవడం లేదు: చంద్రబాబు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని రూ. 15 వేల కోట్లు అడిగితే కేవలం రూ. 2,800 కోట్లే ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చడం లేదన్నారు. -
ఢిల్లీలో అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన విభజన అంశాలపై జైట్లీతో చర్చిస్తున్నట్టు సమాచారం. -
ఇక్కడ ఇలా ముగించినా...
పార్లమెంటులో ఏం జరిగింది- 47 పోలవరం గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తున్నారో, ఆయనను ఎలా ఒప్పించాలో కేసీఆర్ సవివరంగా చెప్పారు. చివరిగా, ఆ రోజు విమాన ప్రయాణంలో ఆయన ఉపన్యాసం ముగిస్తూ, సీమాంధ్ర నాయకులంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధించాలని కోరారు. ‘రాజమండ్రి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పొచ్చు కదా!’ అన్నాను. ‘రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి నా ఉపన్యాసం ఉంటే గొడవ చెయ్యకుండా ప్రజలు వింటారా?’ అని ప్రశ్నించారు కేసీఆర్. (ఆరోజు కేసీఆర్‌తో జరిగిన మొత్తం సంభాషణ గురించి నా పుస్తకం ‘ఏం జరిగింది?’లో రాశాను. త్వరలో విడుదల కాబోతున్న ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ధారావాహికంగా ప్రచురించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికీ, ముఖ్యంగా ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి గారికీ కృతజ్ఞతలు. ఈ ధారావాహికను చదివిన పాఠకులకూ, అభిప్రాయాలు చెప్పిన వారికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర విభజన విషయంలో ఏయే పార్టీ, ఎవరెవరు నాయకులు ఎలా ప్రవర్తించారో, ప్రభుత్వం-పార్లమెంట్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాయో, సుప్రీం కోర్టులో కేసుల వివరాలు, వాటి అనుబంధాలు సహా అందించే ప్రయత్నం అందులో చేశాను. 2013 జూలై నెలాఖరులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రకటన చేసిన రోజు నుంచి, 20-2-2014న రాజ్యసభలో విభజన బిల్లు ‘పాస్’ అయినట్లు ప్రకటించిన రోజు వరకు ... ఏ రోజు ఏం జరిగిందో నాకు తెలిసినంత వరకూ పుస్తకరూపంలోకి తెచ్చాను. ఇందులో కొన్ని విషయాలు ఇప్పటికే ప్రతికలలో వచ్చినవి ఉన్నా, పత్రికలలో, చానళ్లలో రాని విషయాలు కూడా ‘అనేకం’ ఉన్నాయి. దిగ్విజయ్‌సింగ్ ఆధ్వర్యంలో నేనూ, జైపాల్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు- నలుగురమూ ‘వార్‌రూం’లో ఏం చర్చించాం... చర్చలు ఎందుకు విఫలమయ్యాయి...? వర్కింగ్ కమిటీ తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ తీర్మానం విడుదల చేసిన రోజున, సీమాంధ్ర ఎంపీలం దరూ కలసినప్పుడు ఏం చర్చ జరిగింది...? ఎందుకు అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాం...? ‘వార్ రూం’లో ఎంపీలందరూ ఉన్న సమావేశంలో దిగ్విజయ్‌సింగ్ నామీద ఎందుకంత ఆగ్రహం వెలిబుచ్చారు? కేవీపీ మనవరాలి పుట్టినరోజు పార్టీలో సీమాంధ్ర ఎంపీలు ఎందుకు ‘తన్నుకునేంత’ స్థాయిలో గొడవ పడ్డారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సమావేశాలూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య గారితో ముఖాముఖీ, మరో విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్ పంపిన ‘ఒపీనియన్’, అటార్నీ జనరల్ వాహనవతి అభిప్రాయాలు మొదలైన అనేక విషయాలు, ఇప్పటి వరకూ బైటకు రాని అనేక ఇతర విషయాలను చర్చించాను. ‘తెలంగాణ రాష్ట్ర విభజన’ అనేది ఒక చాలెంజ్. కానీ ఈ సవాలును రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కొనడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నదే నా వాదన. 2009 ఎన్నికల్లో అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ మ్యానిఫెస్టోలు ప్రకటించి, ఎన్నికలైన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ ... ఎలా ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి అనే ఆలోచన పక్కనపెట్టి, ‘ఆ సమస్య’ ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలనే ఆలోచనే అన్ని పార్టీల్లోను అధికమయింది. దాని ఫలితమే-ఈ అఘాయిత్యం. ఈ రోజుతో ఈ ‘సీరియల్’ ముగిసింది. తొందరలోనే ‘ఏం జరిగింది?’ పుస్తకం మీ ముందు ఉంటుంది.) ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
కేసీఆర్‌తో గగనయానం
పార్లమెంటులో ఏం జరిగింది -46 హైదరాబాద్ వదిలిపొమ్మని మేమెందుకంటాం... ఈ ఆలోచన తెలంగాణ వారికి లేదు. మీ ప్రాంతానికి చెందిన ‘కొందరు’ చేస్తున్న తప్పుడు ప్రచారమిది. ఆ ‘కొందరి’ మీద ద్వేషమే అందరి మీదా రాకుండా ఉండాలనే నా ప్రయత్నం. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ‘బేగంపేట’ విమానాశ్రయానికి వెళ్లి, ఢిల్లీ విమానంలోకి ‘చెక్ ఇన్’ అయ్యాను. మొదటి రెండు సీట్లూ ఖాళీగా ఉన్నాయి. ‘ఎవరో మంత్రి వస్తున్నారన్న మాట!’ అనుకుని మూడో వరసలో నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నాను. సరిగ్గా విమానం బయలుదేరబోతుండగా ఇద్దరు మంత్రులు ముందు వరసలో ఆ రెండు సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఒకరు కేబినెట్ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరొకరు సహాయ మంత్రి ఆలె నరేంద్ర. నేను అప్పుడే కొత్తగా ఎంపీని అయ్యాను. నా మొహం చూసి గుర్తు పట్టేంత చనువు ఆ ఇద్దరికీ లేదు. నరేంద్ర గారిని అంతకు ముందు కలిశాను. ఆయన పలకరింపుగా నవ్వారనిపించింది. అయితే అది నన్ను చూసో, మరెవ్వరినైనా చూసో అనుకున్నాను. విమానం బయలుదేరిన అరగంటకి నరేంద్రగారు నా సీటు దగ్గరకు వచ్చారు. ‘అరుణ్! కేసీఆర్ పిలుస్తున్నారు’ అంటూ నన్ను ముందు సీట్లోకి వెళ్లమని, తను నా సీట్లో కూర్చుండిపోయారు. నేను వెళ్లి కేసీఆర్ పక్క సీట్లో కూర్చున్నాను. ‘మీరు రాజమండ్రి ఎంపీ అని ఇప్పుడే నరేంద్రగారు చెప్పారు’ అంటూ పలకరించారు. నన్నెందుకు పిలిచారో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకర్థం కాలేదు. అయితే ఆయన పలకరింపు మాత్రం చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. తర్వాత గంటంపావు మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మేం మాట్లాడుకున్నాం అనడం కన్నా, ఆయన మాట్లాడాడు, నేను వింటూ ఉన్నాను అనడమే కరెక్ట్. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయ్యే వరకూ ఆయన చెబుతూనే ఉన్నారు. ‘బ్రెయిన్‌వాష్’ అనే పదం ఎక్కువగానే విన్నాను గానీ, అది ఇలా ఉంటుందని ఆయనతో కూర్చుంటేనే తెలుస్తుంది. మామూలుగా పబ్లిక్ మీటింగుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంత నష్టపోయిందో ఆయన చెబుతుంటారు. ఆ రోజు మాత్రం ఉమ్మడి రాష్ట్రం వల్ల కోస్తా, రాయలసీమలు ఎంత నష్టపోతున్నాయో చెప్పటం మొదలుపెట్టారు. నేనాశ్చర్యపోయాను. గోదావరి, కృష్ణా నదుల నీరెంత, ఎవరెంత వాడుకుంటున్నారు, గోదావరి జిల్లాలకెంత అన్యాయం జరుగుతోంది... ఆయన స్కూల్ మాస్టారు లెక్కలు చెప్పినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోతే ఆ అన్యాయం ఎలా ఆపుకోవచ్చునో కూడా చెప్పారు. పారిశ్రామికంగా సీమాంధ్ర ప్రాంతంలో చెప్పుకోదగ్గ పరిశ్రమేది అని ప్రశ్నించారు. సముద్రం వల్ల వచ్చే అడ్వాంటేజ్‌ను విశాఖపట్నం వాడుకోగలిగిందా? అని అడిగారు. ‘మీ మాటలు వింటుంటే మీరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వదిలేసి, ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలుపెట్టేలా కనబడుతున్నారు’ అన్నాను. ‘నిజమే, మీ దగ్గర కూడా ప్రత్యేక రాష్ట్రం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ప్రచారం జరగాలి. 1972 ఉద్యమంలో మీరంతా యాక్టివ్‌గా పాల్గొన్నవారే కదా! ఇప్పుడెందుకు రెండు రాష్ట్రాల వాదనను వ్యతిరేకించాలి?’ అన్నారు. ‘అయ్యా... ఆనాడు హైదరాబాద్ వేరు. ఈ నాటి హైదరాబాద్ వేరు. మూడు దశాబ్దాలుగా ప్రపంచానికి అమెరికా ఎలాగో, తెలుగువాళ్లకి హైదరాబాద్ అలాగయిపోయింది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉపాధి కోసం హైదరాబాదే చేరుకుంటున్నారు. మీరు కోరుకునేది ప్రత్యేక తెలంగాణ... మాకర్థమయింది మాత్రం మమ్మల్ని హైదరాబాద్ వదిలి పొమ్మంటున్నారని...’ అన్నాను. ‘మద్రాస్ వదిలి వచ్చేశారు. ఎన్ని కుటుంబాలు మద్రాసు వదిలి వచ్చేశాయి. ఏమైనా తెలుగువారి పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చాయా? ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కన్నా తమిళరాష్ర్టంలోనే తెలుగు వారి వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా హైదరాబాద్ వదిలిపొమ్మని మేమెందుకంటాం... ఈ ఆలోచన తెలంగాణ వారికి లేదు. మీ ప్రాంతానికి చెందిన ‘కొందరు’ చేస్తున్న తప్పుడు ప్రచారమిది. ఆ ‘కొందరి’ మీద ద్వేషమే మొత్తం అందరి మీదా రాకుండా ఉండాలనే నా ప్రయత్నం (ఆ కొందరు ఎవరో కూడా ఆయన చెప్పారు). తెలంగాణ విడిపోతే బాగుపడతామని ఇక్కడి ప్రజల నమ్మకం. ఆ నమ్మకం 1956 నుంచీ అలాగే ఉంది. ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటుంది. లోపల మాత్రం ఆ నమ్మకం ఎప్పుడూ ఉంది. ఈసారి మాత్రం అన్ని ప్రాంతాలకు మంచి అవకాశం. పదేళ్ల తరువాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 1956 నుంచీ తెలంగాణ వాదం కాంగ్రెస్ వాళ్లు మొదలుపెట్టిందే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే ఆ విభజన జరిగిపోతే ఇరుప్రాంతాలకీ మంచిది కూడా!’ కేసీఆర్ చెప్పింది మొత్తం.. గంటసేపు.. ప్రతి అక్షరమూ నాకు జ్ఞాపకముంది. అలా చెప్పగల నేర్పు కేసీఆర్‌కి ఉంది. ‘నాకు చెప్పినట్లే మా వాళ్లందరినీ మీటింగ్‌కు పిలిచి చెప్పవచ్చు కదా! మీరు కేంద్రమంత్రి. మీ ఆఫీసుకి అందర్నీ పిలిచి చెప్పండి. నాకిచ్చిన ‘ప్రైవేటు క్లాస్’ కాకుండా అందరికి కలిపి క్లాసు ఇవ్వండి’ అన్నాను. ‘మీ రాజశేఖరరెడ్డి రానివ్వడు. ఎవ్వరినీ మీటింగ్‌కి రానివ్వడు.’అంటూ అసలు విషయంలోకి వచ్చారు కేసీఆర్. ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు
పార్లమెంటులో ఏం జరిగింది -45 యథావిధిగా.. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడిపోయింది. మళ్లీ సభ ప్రారంభమైంది. ఆ రోజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు’ ప్రవేశపెడ్తారని అందరూ అనుకుంటున్నారు గానీ ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’, ఆ రోజు లోక్‌సభలో జరగవలసిన వ్యవహారాల జాబితాలో ఎ.పి. బిల్లు ప్రస్తావన లేదు! 11 నుంచి 12 గంటల మధ్య, సభ వాయిదా పడినప్పుడు, అందరమూ సెంట్రల్ హాల్ లోనే ఉన్నాం. కొంత మంది ఒడిశా సభ్యులు ‘బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీలు కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారట గదా..’ అని ప్రశ్నించారు. ఈ విషయం, కొన్ని పత్రికల్లో బాగా ప్రచారం చేయబడింది. బిల్లుకు నిరసనగా స్పీకర్ సమక్షంలోనే విషం తాగి చచ్చిపోయే ప్రయత్నం కొందరు ఎంపీలు చేస్తారని గట్టిగా పుకారు నడిచింది గానీ, ఆ ఎంపీలు ఎవ్వరో మాత్రం ఎవ్వరికీ తెలియదు! 12 గంటలకు సభ మొదలవుతోందంటూ లోక్ సభ బెల్ మోగుతోంది. స్పీకర్ ముందు భాగం, రోజూ మేము నిలబడి నినాదాలు ఇచ్చే ‘వెల్’ ప్రాంతమంతా కాంగ్రెస్ ఎంపీలతో నిండిపోయి ఉంది. మొత్తం కాంగ్రెస్ ఎంపీలెవ్వరూ వారి సీట్లలో కూర్చునిలేరు. అవిశ్వాస తీర్మానం చదివేటప్పుడు ఎవరి సీట్లలో వారుండాలని మేమంతా ముందే అనుకున్నాం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడినప్పుడు, ఆ ప్రతిపాదన చదవకుండా స్పీకర్ మరే అంశమూ మొదలు పెట్టకూడదనేది.. రూల్! అవిశ్వాసాన్ని సమర్థిస్తున్న సీమాంధ్ర ఎంపీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంపీలూ, ఎన్డీయే భాగస్వామి శివసేన ఎంపీలూ లేచి నిలబడి మద్దతు చెప్తారని, దాంతో విభజన బిల్లు ఆగిపోతుందని, అందరూ అనుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు వచ్చి ‘వెల్’లో నిలబడ్డారో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా పెద్ద కేకలు వినబడ్డాయి. ‘వెల్’ అంతా యుద్ధభూమిలా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వాళ్ల చేతుల్లోని విషం బాటిల్ లాక్కోవడానికి వ్యూహం పన్నారనుకున్నా గానీ, అవిశ్వాసం చదవకుండానే షిండేగారి చేత బిల్లు ప్రవేశ పెట్టించాలనే కపట వ్యూహం ఏర్పాటయిందని నేనూహించలేదు. క్షణకాలంలో స్పీకర్ హడావుడిగా లోపలికి వెళ్లిపోయారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు సభ్యులందరూ దగ్గుతూ, ఆయాస పడుతూ సభలోంచి బైటకొచ్చేస్తున్నారు. ఇందాక ఆత్మహత్యా ప్రయత్నం జరుగుతుందా అని ప్రశ్నించిన ఒడిశా ఎంపీ, ‘పాయిజన్ గ్యాస్ వాడతారని నువ్వు చెప్పనే లేదు’ అంటూ ముక్కు కళ్లు ఖర్చీఫ్‌తో మూసుకుంటూ వెళ్లిపోయాడు. లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’ ఎవ్వరూ ఊహించని సంఘటన. ఈ సంఘటనతో లగడపాటి సీమాంధ్ర ప్రాంతంలో హీరో అయిపోయాడు. అని ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ బిల్లు ఆగిపోతే, మైకు విరిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్, సీమాంధ్ర ప్రాంతంలో హీరోలుగా నిలిచిపోతారని కూడా, ఉత్తరభారతంలో అత్యధిక సర్క్యు లేషన్ కల్గిన ‘హిందుస్తాన్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ఇక్కడ నాకర్థం కాని కొన్ని విషయాలూ, ప్రశ్నలూ మిగిలిపోయాయి. లగడపాటి రాజగోపాల్ మాలాంటి మామూలు ఎంపీ కారు! వేల కోట్ల రూపాయల లాంకో సామ్రాజ్యాధిపతి. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనేంత బలమైన కోరిక ఉన్న వారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి పాదయాత్రలో, ఆయన తోపాటు, చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకూ నడిచిన వారు.. చిన్న వయస్సులోనే, విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి పది మంది పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా నిలబడే స్థాయికి చేరిన వారు. అలాంటివాడు, ఎంతో ఆలోచించకుండా, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడతాడా! ‘‘పెప్పర్‌స్ప్రే’’తో దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కినవాడు, పర్యవసానంగా బిల్లు ఆగిపోతుందనే నమ్మకం లేకపోతే, ఇలా చెయ్యగలడా!? నువ్వు ‘పెప్పర్‌స్ప్రే’’ కొట్టు.. బిల్లు ఆగిపోతుందని లగడపాటికి ఎవరు చెప్పివుంటారు? ఒక వేళ ‘కాంగ్రెస్’ చెప్పినా లగడపాటి వింటారా!? అప్పటికే ‘కాంగ్రెస్’ సీమాంధ్రలో ‘జీరో’ అయిపోయిందనీ, యావద్భారతంలో ‘మోదీ’ గాలి వీస్తోందని పసిపిల్లవాడిక్కూడా తెలిసిందే! అలాంటిది, సర్వేల ఎక్స్పర్ట్ లగడపాటి, ఆమాత్రం ఊహించలేరా! నిజానికి, ఆ సమయానికి, లగడపాటి వ్యాపార సంస్థలూ సంక్షోభంలో కూరుకునిపోయి ఉన్నాయి. కొన్నివేల కోట్ల రూపాయల బ్యాంక్ బకాయిలు చెల్లించవల్సి ఉందని అందరికీ తెలుసు. ఆ స్థాయి వ్యాపారవేత్తలు, ప్రభుత్వంతోనూ ప్రతిపక్షంతోనూ మంచి సంబంధాలు కలిగివుండాలి. అటువంటిది, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎలాగోలాగున బిల్లు పాస్ చేయించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ‘లగడపాటి’ ఇంత తీవ్రవాద చర్యకు పాల్పడి కాంగ్రెస్, బీజేపీలను దూరం చేసుకుంటారా! కాంగ్రెస్, బీజేపీలిద్దరూ లగడపాటి ‘పెప్పర్‌స్ప్రే’కి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చివుంటారా? కాంగ్రెస్ ఎంపీలందరినీ రంగంలోకి దించకపోతే, పెప్పర్‌స్ప్రే అవకాశమే రాదు. ఎంపీల బదులుగా ‘మార్షల్స్’ని ‘వెల్’లోకి దింపినట్లైతే, కథ మరోలా నడిచి ఉండేది! ఆ ఎవ్వరినీ ‘వెల్’లోకి రాకుండా ‘మార్షల్స్’ వలయం చుట్టి ఉన్నట్లైతే, అవిశ్వాస తీర్మానం చదవక తప్పని పరిస్థితి. తీర్మానం బలపరుస్తూ యాభై మంది సభ్యులు నిలబడే పరిస్థితి, అన్ని బిల్లులూ పక్కనబెట్టి అవిశ్వాసం మీద చర్చ చేపట్టక తప్పని పరిస్థితి.. వచ్చి తీరుతాయి! లోక్‌సభ గడువు వారం రోజుల్లో ముగుస్తుంది.. అవిశ్వాసం దెబ్బతో అందరి వ్యూహాలూ దెబ్బతింటాయి! లగడపాటిని కాంగ్రెస్+బీజేపీ, ఏదో తీవ్ర చర్య జరిగితే తప్ప ‘ఈ బిల్లు ఆగదు’ అని ప్రోత్సహించి ఉంటాయా!? ఏం జరుగుతుందో, నిజానిజాలైతే నాకు తెలియదు గానీ, ‘పెప్పర్‌స్ప్రే’ బూచిని చూపించి సీమాంధ్ర ఎంపీలలో 15 మందిని సస్పెండ్ చేసేశారు. రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి అందరికీ మొహం తెలిసిన ప్రముఖులు కూడా ‘వెల్’లో దెబ్బలాడినా, వారినెవ్వర్నీ సస్పెండ్ చేయలేదు. ‘ఎందుకు చెయ్యలేదు’ అని విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల వారు కూడా స్పీకర్‌ని ప్రశ్నించలేదు! ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన సీమాంధ్ర ఎంపీలను ‘ఉగ్రవాదులు’గా చిత్రీకరించటానికి ఉపయోగపడిందే తప్ప ‘బిల్లు’ ఆపటానికి ఏ మాత్రం ఉపయోగపడలేదనేదే నా ఊహ! (నేనూ లగడపాటి, పలు సందర్భాల్లో చర్చించుకున్న రాజకీయ అంశాలు, ఆ రోజు సభలో ప్రవేశించబోయే ముందు, మేం మాట్లాడుకున్న విషయాలని బట్టి... లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని నేను నమ్మాను. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనే అంశంలో లగడపాటిది దృఢనిశ్చయం.. అందుకే, ‘లగడపాటి’ని వాడుకుని, సీమాంధ్ర ఎంపీలని ఏకాకులు చేశారేమోనని అనుకుంటున్నాను) ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
రాజ్యాంగ విరుద్ధమని తెలిసీ..
పార్లమెంటులో ఏం జరిగింది-41 అరుణ్ జైట్లీ, కపిల్ సిబల్ ఇద్దరూ సుప్రీం కోర్టులో పెద్ద పేరున్న న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు. రాజ్యాంగ విరుద్ధమో, కాదో... ముందు బిల్లు పాస్ చేసేద్దాం అనుకుని ‘పాస్’ చేసేశారు! లోక్‌సభ, రాజ్య సభల్లో జరిగింది జరి గినట్లుగా సాక్షిలో ప్రచురితమైనప్పుడు పాఠకుల్లో కనిపించిన ఆసక్తి... అంతంత మాత్రం! జైపాల్‌రెడ్డి గారి జోక్యం విష యమై, నేను ఊహిం చి రాసింది మాత్రం, చాలా మంది చదివినట్లు తెలుస్తోంది!! అత్యధిక సంఖ్యలో ఇ-మెయిల్స్ అభినందనలతో వస్తున్నాయి. కొన్ని మెయిల్స్ మాత్రం, ఎందుకిప్పుడీ విషయాలు రాస్తున్నారు, పాత గాయాల్ని ఎందుకు రేపుతున్నారు, ఏమి ఆశించి ఆ కథనాలు?! అంటూ ప్రశ్నిస్తున్నాయి. నిజానికి, రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అంశాలను, నేను గ్రంథస్తం చేసి చాలా కాలమయింది. అందులో భాగంగానే పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను కూడా అనువదించాను. మొన్నటి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో జైపాల్‌రెడ్డిగారి ప్రెస్‌మీట్‌ను టీవీలో చూసిన తర్వాతే ఆ నాలుగు ఆర్టికల్స్ రాశాను. నన్ను ప్రశ్నిస్తూ వచ్చిన ఇ-మెయిల్స్‌లోని ప్రశ్నలకు నా వ్యాసాల్లో సమాధానం దొరుకుతుంది. రాష్ట్ర విభజన విషయంలో ఏఏ పార్టీ ఎలా ప్రవర్తించింది... ఏఏ నాయకులు ఎలా ప్రవర్తిం చారు... నా ‘యాంగిల్’లో విశ్లేషించాను. విడు దల అవ్వబోయే నా ‘పుస్తకం’లో అవన్నీ ఉంటాయి. కోర్టు కేసు ఏమయ్యిందని కొందరు ప్రశ్నించారు. సుమారు నలభై మంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2013 నుంచే, జరుగుతున్న ప్రక్రియను ‘చాలెంజ్’ చేస్తూ పిటిషన్లు దాఖలవుతూ వచ్చాయి! కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘కౌంటర్’ దాఖలే చేయలేదు. వాయిదాలు పడ్తూనే ఉన్నాయి. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడూ అయిన అరుణ్‌జైట్లీ, 20-2-2014 నాడు, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, కోర్టు కొట్టేస్తుందని స్పష్టంగా చెప్పారు. దానికి సమాధానమిస్తూ, ‘ఒక వేళ కోర్టు కొట్టేస్తే, అప్పుడున్న ప్రభుత్వం కోర్టు చెప్పినట్లు నడుచుకోవచ్చు’ అన్నారు నాటి న్యాయమంత్రి కపిల్ సిబల్. ఇద్దరూ సుప్రీంకోర్టులో పెద్ద పేరున్న న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు. రాజ్యాంగ విరుద్ధమో, కాదో... ముందు బిల్లు పాస్ చేసేద్దాం అనుకుని ‘పాస్’ చేసేశారు! సుప్రీంకోర్టులో ‘కౌంటర్’ మాత్రం దాఖలు చెయ్యరు!! మన దేశ న్యాయ వ్యవస్థలో ‘ఆలస్యం’ అనేది అతి సాధారణం. ఆలస్య మైనా, అన్యాయం జరగదని ఒక ఆశ! ఇప్పుడు కోర్టు ఇవ్వబోయే తీర్పు వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి... మళ్లీ రెండు రాష్ట్రాలూ కలిపేస్తారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ బొమ్మైఅనే కర్ణాటక ముఖ్య మంత్రిని పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు. 1989లో ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన దాన్ని కోర్టులో ప్రశ్నించాడు. 1994లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చెయ్య లేదు గానీ, బొమ్మైకేసు భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక ‘మైలురాయిగా నిలిచి పోయింది. 1994 తర్వాత ‘రాష్ట్రపతి పాలన’ పేరిట కేంద్ర పెత్తనమే ఆగిపోయింది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 356ను అమలు చేయడానికి మార్గదర్శకంగా నిలిచే చరిత్రాత్మకమైన వ్యాఖ్యానం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన కేసు కూడా కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మైకేసుల్లాగే ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని అందిస్తుంది. ఫెడరల్ వ్యవస్థ గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయవల్సిన తీరు గురించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కాంగ్రెస్+ బీజేపీ తెలంగాణ విభజన చేసేయాలని నిర్ణయించు కున్నాక, అది అప్పుడైనా, ఇప్పుడైనా కచ్చి తంగా జరిగి తీరుతుంది! నా ‘పుస్తకం’ కేవలం నేను నిజమనుకున్న కొన్ని విషయాలు, అందరికీ తెలియని విషయాలు, ప్రజల ముం దుంచటానికే ఉద్దేశించబడింది. ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘సాక్షి’ ద్వారా తెలియచేస్తు న్నాను. జరిగిందేమిటో తెలుసుకోకపోతే, అది ప్రజాస్వామ్యమే కాదని నా భావన! నా ‘ఆర్టికల్స్’లో జరిగింది జరిగినట్లే రాశాను. ఊహించటానికి నాకెలా హక్కువుందో, నా ఊహతో విభేదించడానికి పాఠకులకు కూడా అంతే హక్కు ఉంది. అభినందిస్తున్న వారికి, విభేదిస్తున్న వారికీ కృతజ్ఞతలు... ఆర్టికల్స్ చదివినందుకు... ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
బిల్లు ఈ రోజే పాసై తీరాలి
పార్లమెంటులో ఏం జరిగింది-34 18-2-2014 సమయం 12.47 మధ్యాహ్నం. (లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమ యం జరగకుండా అడ్డుపడిన సీమాంధ్ర సభ్యులు, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల సభ్యులూ మళ్లీ నినాదాలు చేస్తూ సభ జరగనివ్వలేదు. పదిహేను మంది సీమాంధ్ర సభ్యుల్ని ‘సస్పెండ్’ చేసినా, ఇంకా ‘వెల్’లో గొడవ మాత్రం అలాగే జరుగుతోంది! చిదంబరం, ఫైనాన్స్ బిల్లు కాగి తాలతో సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ బిల్లు 15వ లోక్‌సభలో పాసయ్యే అవకాశాలు లేనట్టే కనబడుతు న్నాయి.) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ హడావుడిగా స్పీకర్ చాంబర్స్‌లోకి వెళ్లారు. వెనకాలే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెళ్లారు. కమల్‌నాథ్ స్పీకర్‌తో రెండు నిమిషాలు మాట్లాడి బైటికొచ్చారు. చుట్టూ చేరిన తెలంగాణ ఎంపీలతో క్లుప్తంగా ‘‘కష్టం... ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసవ టం కష్టం! బీజేపీ సహకరించటం లేదు!!’’ అని చెప్పి వెళ్లిపోయారు. హతాశులైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అక్కడే లోక్‌సభ మొదటి వరసలో కూర్చుని, ఎవరితోనో ముచ్చటిస్తున్న జైపాల్‌రెడ్డిగారి దగ్గరకు వెళ్లారు. ‘‘సార్ తెలంగాణ బిల్లు పక్కన పెట్టేశారట’’ అని చెప్పారు. ‘ఎందుకని’ అని ప్రశ్నించారు జైపాల్! ‘‘ఏమో, కమల్‌నాథ్, బీజేపీ కలిసిరావటం లేదంటూ’’ చెప్పి వెళ్లిపోయాడు ‘‘కమల్‌నాథ్ చాంబర్స్‌కి వెళ్లి ఉన్నా రేమో చూడండి... ‘నేనొస్తాను’ అన్నారు జైపాల్. కమల్‌నాథ్ ఉన్నారో లేదో చూద్దామని వెళ్లిన ఎంపీలు, లోక్‌సభ పక్కనే ఉండే ఆయన ఆఫీసు రూం నుంచి ఆయనను వెంటబెట్టుకుని వచ్చేశారు. ఎప్పుడైతే జైపాల్‌రెడ్డి మీ దగ్గరకు వస్తారట’ అన్నారో... కమల్‌నాథే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, లోక్‌సభలోకి వచ్చే శారు. జైపాల్‌రెడ్డి, కమల్‌నాథ్‌ని తన పక్కనే కూర్చో బెట్టుకుని, మిగతా ఎంపీలందర్నీ కొంచెం దూరంగా కూర్చోమన్నారు. ‘‘ఇలాగైతే కష్టం జైపాల్‌రెడ్డిగారూ, ఎన్డీఏలో బీజేపీ తప్ప మరే పార్టీ ఈ తరహా విభజనకి ఒప్పుకోవటం లేదు. యూపీఏకు మద్దతునిచ్చే పార్టీలూ వ్యతిరేకిస్తు న్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తూనే ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చెయ్యటానికి అంగీకరించా లంటూ మెలిక పెడుతోంది. అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మేమెలా సహకరిస్తామంటు న్నాయి ప్రాంతీయ పార్టీలు. బిల్లు పాసవ్వటానికి కావా ల్సిన బలం, అనుమానమే! బిల్లు పాసవటమే అను మానంగా ఉంటే, గవర్నర్‌కి ‘లా అండ్ ఆర్డర్’ అప్ప చెప్పాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటోంది బీజేపీ... కష్టం జైపాల్‌జీ... ‘పెప్పర్‌స్ప్రే’ను అడ్డం పెట్టుకుని పదిహేనుమంది ఆంధ్రావాళ్లని సస్పెండ్ చేసి బైట పెట్టేసినా లెక్క సరిపోవడం లేదు...’’ అన్నారు కమల్ నాథ్. ‘‘లెక్క సరిపోకపోవటమేమిటి కమల్... కాంగ్రెస్ వాళ్లమే రెండొందలు దాటి ఉన్నాం. బీజేపీ నూట పది హేను అనుకుంటా...! ఇదిగాక ఎన్సీపీ, మాయావతి పార్టీ ఇంకా చిన్న చిన్న పార్టీలూ... ముందునుంచి లెక్క పెట్టుకుంటూనే ఉన్నాంగా...!! రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే మూడింట రెండొంతులు మెజార్టీ ఉండాలి గానీ సింపుల్ మెజారిటీకి సరిపోకపోవటమేమిటి. రా... నేను సుష్మాస్వరాజ్‌తో మాట్లాడతా! అన్నారు జైపాల్. ‘‘స్పీకర్‌తో మరో గొడవ. ‘వెల్’లో సభ్యుల్ని సస్పెం డ్ చేసి, రేపు పెట్టండి బిల్లు అంటోంది ఆవిడ. సభ సజా వుగా జరక్కపోతే ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకోవటం ఎలా సాధ్యం... అంటోంది. సభ సజావుగా నడపటం, రూల్స్ ప్రకారం స్పీకర్ బాధ్యత. ఈ రోజు ‘వెల్’లో ఉన్నవాళ్లని సస్పెండ్ చేసి రేపు ఈ బిల్లు పెడ్దామంటే, రేపింకో పది మంది ‘వెల్’లోకి వస్తారు. ఈలోగా సస్పెన్షన్ గడువు ముగిసి ఆ పదిహేను మంది కూడా మళ్లీ వచ్చేస్తారు’’ కమల్‌నాథ్. ‘‘ఏం కంగారు పడకయ్యా... నేను చెప్తా. ఏం చెయ్యాలో’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పిలిచి ‘‘సుష్మాస్వరాజ్‌ని నేను పిలుస్తున్నానని చెప్పి స్పీకర్ చాంబర్స్‌కి తీసుకురండి’’ అన్నారు జైపాల్. ‘‘కమల్... నేను నాలుగు దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నాను. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు చేసె య్యటమే... చెయ్యకూడదనుకున్నప్పుడు, రూల్స్ చట్టాలు, రాజ్యాంగం మాట్లాడి చెయ్యకుండా ఎగ్గొట్ట వచ్చు! మనకి మంచిదనే గదా ఒక పని చేద్దామను కుంటాం... దానికి కూడా రూల్స్ అడ్డం వస్తే, ఇక ఆ రూల్స్‌కి ఎందుకు విలువివ్వాలి? నడు... స్పీకర్‌తో, సుష్మతో నేను మాట్లాడతా! బిల్లు ఈ రోజే పాసయి తీరాలి... లేకపోతే, ఇక ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాదు. నడు... స్పీకర్ చాంబర్స్‌కి వెడదాం’’ అంటూ లేవటానికి ఉపక్రమించారు జైపాల్. ఇంతలో సుష్మా స్వరాజ్ దగ్గరకు వెళ్లిన ఎంపీలు పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘సార్, మీతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు గానీ స్పీకర్ చాంబర్స్‌కి మాత్రం రానంటోంది సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ పార్టీ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాసయితే ఆ పేరు కాంగ్రెస్‌కి, అవ్వకపోతే ఆ చెడ్డ పేరు బీజేపీకి వచ్చేలా వ్యూహరచన చేశారని ఏదేదో మాట్లాడుతోంది ఆమె’’ అంటూ వాపోయారు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్‌కుమార్ -
కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు?
పార్లమెంటులో ఏం జరిగింది-33 ‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వాల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఇప్పటి వరకూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ‘పాస్’ అవ్వటం, అనే ‘ప్రహసనం’ పరిశీలించాం! ఉభయ సభల్లో జరిగిన సంఘటనలు యథాతథంగా అనువదించి మీ ముందుంచటమే జరిగింది తప్ప, ఎందుకలా జరిగింది అనే వివరాలలోకి వెళ్లలేదు. ఇప్పటిదాకా నా ‘ఆర్టికల్స్’ చదివిన వారు, ‘ఏం జరిగిందో రాశారు గాని, ఎందుకలా జరిగిందో కూడా రాయాలిగదా!’ అని అడిగారు. నిజమే... ‘ఎందుకిలా జరిగింది?!’ ‘డివిజన్’ చేసి, లోక్‌సభలో ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రికార్డింగ్ ద్వారా నిర్ణయించటానికి అభ్యంతరం ఏమిటి? అనవసరంగా డివిజన్ అడుగుతున్నారని భావించినప్పుడు ‘‘రూల్ 367(3) ప్రొవిజో’’ స్పీకర్ గారు ఉపయోగించి బిల్లు పాసయిపోయిందనిపించివచ్చు, అనే సలహా జైపాల్‌రెడ్డి గారు చెప్పినట్లు, వారిచ్చిందేనా! కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిపితే, బిల్లు ‘పాస్’ చేయించగలిగినంత మంది సభ్యుల సంఖ్యా బలమున్నప్పుడు, బిల్లును పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకొచ్చింది? లోక్‌సభలో సాక్షాత్తూ కేంద్రమంత్రులే ‘స్పీకర్ వెల్’లో నినాదాలు ఇస్తున్నా, తలలు లెక్కపెట్టినట్లు, బిల్లు పాసయినట్లు ‘కథ’ నడిపిన నేపథ్యంలో, సభలో ఆర్డర్ లేదు కాబట్టి ‘డివిజన్’ చేయటానికి ‘రూల్స్’ ఒప్పుకోవంటూ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ రూలింగ్ ఇచ్చి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు స్పీకర్ ‘డివిజన్’ చెయ్యను అన్నప్పుడు, సభలో ఏ పార్టీ వారూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటానికి కారణం ఏమిటి? తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ‘సౌగత్‌రాయ్’ ఒక్కరే తప్ప, మిగతా పార్టీలన్నీ ‘వెల్’లోనే ఉన్నాయా!? లోక్‌సభలోని కాంగ్రెస్ సభ్యులలో పదకొండు మంది, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, స్పీకర్ మీరాకుమార్... గంటసేపు స్పీకర్ చాంబర్లో ‘చర్చ’ జరిపిన ఫలితమే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం...అన్న జైపాల్ రెడ్డిగారి మాటల్లో అర్థమేంటి? పెపైచ్చు, సుష్మాస్వరాజ్ గారి ‘కాళ్లుపట్టుకుని’ తీసుకొచ్చాం- అన్నారు. ‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వా ల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఆర్టికల్ 3 ప్రకారం, అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలే తప్ప, ఆ అభిప్రాయం ప్రకారం నడవాలి అని ఎక్కడా లేదు, కాబట్టి, అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్ ‘పాస్’ చేసేయవచ్చు... అనే వాదననే వ్యతిరేకిస్తూ వచ్చాం! సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలోని వాదన కూడా ప్రధానంగా ఇదే!! ‘‘పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా బిల్లు ‘పాస్’ చేసేయవచ్చు’’ అనే విధానం మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా వినలేదు. అసలు నిజంగా, లోక్‌సభలో మెజార్టీ లేక బిల్లు పక్కన పెట్టేద్దాం అనుకున్నారా?! ఎవరైనా నాలాంటి మామూలు మనిషి ఈ మాటలని ఉంటే, అదేం పట్టించుకోనవసరం లేదు! కానీ ఈ మాటలన్నది సాక్షాత్తూ జైపాల్ రెడ్డి!! ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా దృష్టిలో జైపాల్రెడ్డిగారొక మేధావి. ఎన్సైక్లోపీడియా లాంటి వారు. భారత రాజకీయాలలో ‘అజాతశత్రువు’ అని పిలవొచ్చు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కూడా! ఆచితూచి మాట్లాడటం ఆయన నైజం. ఎన్నికల్లో గెలవటం కోసమో, ప్రయోజనాలను ఆశించో, ఏది పడితే అది మాట్లాడే సగటు పొలిటీషియన్ మాత్రం కారు!! అటువంటి జైపాల్‌రెడ్డి గారు అన్నమాటల్ని బట్టి విశ్లేషిస్తే... ఫిబ్రవరి 18, 2014 నాడు లోక్‌సభలో జరిగింది సీమాంధ్రకు ద్రోహం కాదు, దేశ రాజకీయ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలకే ద్రోహం... ఇక్కడ నుంచి నేను రాయబోయేది విశ్లేషణ మాత్రమే. అంటే ఒక ‘సంఘటన’ విషయమై నాకేర్పడిన అభిప్రాయం! ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’’ అనే ఒక చరిత్రాత్మక సంఘటన, పూర్వాపరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హైద్రాబాద్ అనే ఒక రాజ్యం ఇండియాలో విలీనమైనప్పటి నుంచి, 1953 లో కర్నూలు రాజధానిగా, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... హైద్రాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతాన్నీ ఆంధ్ర రాష్ట్రాన్నీ కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పరచినప్పటి నుంచి.. 1969 ప్రత్యేక తెలంగాణ, 72 నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమాలు, 2000లో మూడు రాష్ట్రాల ఏర్పాటు, 2001లో మళ్లీ, తెలంగాణ విభజన డిమాండ్, టీఆర్ఎస్ ఏర్పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, 2009 చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు... వగైరా. వగైరా సంఘటనలన్నీ అతి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తా! ఇప్పటి వరకూ ‘‘పార్లమెంట్లో ఏం జరిగింది’’ అనే ఆర్టికల్స్ శ్రద్ధగా చదివి నాకు ఈ-మెయిల్స్ పంపిన వారందరికీ నా అభినందనలు. ముందే చెప్పాను... ఇదంతా ఆసక్తిగా చదవగలిగే ‘నవల’ కాదు. ‘బోరు’ కొట్టే అవకాశం కూడా ఉంటుందని... అయినా ఇంత మంది చదువుతున్నారనేది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామం. - ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
చివరికిలా ముగిసింది!
పార్లమెంట్లో ఏం జరిగింది-32 రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో 20.02.2014 న జరిగిన చర్చకు సంబంధించిన చివరి భాగమిది. బిల్లు ఆమోదంతో చర్చ ముగిసింది. ఏచూరి: మాకు బిల్లు మీద ఓటింగ్ కావాలి. డిప్యూటీ చైర్మన్: ఏచూరిగారూ మీరు సభని... తపన్ కుమార్: ఓటింగ్ చెయ్యటం కష్టం కాదు. ఏచూరి: సార్, ఓటింగ్ జరపటం కష్టమేమీ కాదు. డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి. తపన్: సభ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఓటింగ్ జరిపించండి. డిప్యూటీ చైర్మన్: వెల్‌లో సభ్యులుండగా ఓటింగ్‌కు రూల్స్ అనుమతించవు. వాళ్లని వెనక్కి పిలవండి. తపన్: సర్, సభ ఆర్డర్‌లోనే ఉంది. ఓటింగ్ జరిపించండి. డిప్యూటీ చైర్మన్: నేను చెప్పేది వినండి. నా ఆర్డర్ వినండి. తపన్: సభ బాగానే ఉందిగా... డివిజన్ పెట్టండి. డిప్యూటీ చైర్మన్: డివిజన్‌కి అభ్యంతరం లేదు. కానీ ‘వెల్’లో సభ్యులుండగా ఓటింగ్ జరపకూడదనేది రూల్. ఏచూరి: అది మీ బాధ్యత సార్! డిప్యూటీ చైర్మన్: నేను ‘డివిజన్’ చెయ్యలేను. తపన్: సభ ఆర్డర్‌లోనే ఉంది సార్. డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి. బాధ్యత నాకే కాదు, సభ్యులకీ ఉంది. మీమీ సీట్లకి వెళ్లండి. మీ మిత్రులకి చెప్పి వెనక్కి పిలవండి. నేను నిస్సహాయుణ్ణి. (సమయం 8.05) వెంకయ్య నాయుడు: మీరు బిల్ పాస్ చెయ్యాలనుకుంటున్నారు. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీతో చేయి చేయీ కలిపిన వారు, కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నవారు, నినాదాలిస్తే నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏమిటంటే మేము పూర్తిగా సంతృప్తి చెందక పోయినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలూ దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తున్న ఆఖరి ఘడియల్లో, ప్రజల సెంటిమెంట్ గౌరవించే విధంగా... సీమాంధ్రకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము నమ్ముతూ బిల్లుకు మద్దతిస్తున్నాం. ఏచూరి: సభలో ఆర్డర్ తీసుకు రండి. సభ్యుల ప్రజాస్వామ్య హక్కు నిలబెట్టండి. అధ్యక్ష స్థానంలో ఉన్న వారి బాధ్యత అది. డిప్యూటీ చైర్మన్: చాలా ప్రయత్నించాను. తప్పు నాది అనకండి. ఏచూరి: మీరు గనక డివిజన్ చెయ్యకపోతే, నిరసనగా మేము వాకౌట్ చెయ్యదల్చాం. ఈ వాకౌట్ ‘అప్రజాస్వామ్య పద్ధతికి నిరసనగా’ అని రిజిస్టర్ అవ్వాలి. డిప్యూటీ చైర్మన్: ‘వెల్’లో సభ్యులుండగా డివిజన్ ఎలా చెయ్యను. ఏచూరి: ఇది చాలా అప్రజాస్వామికం. రాంగోపాల్ యాదవ్: డివిజన్ లేనందున నిరసనగా మేం వాకౌట్ చేస్తున్నాం. డిప్యూటీ చైర్మన్: గౌ॥మంత్రిగారు ప్రతిపాదించారు. బిల్లు పాసయ్యింది. సభ రేపు ఉదయం 11 గంటల వరకూ వాయిదా పడింది. (20-2-2014 గురువారం రాత్రి 8.07 నిమిషాలకు సభ ముగిసింది) రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన తతంగం అంతా ‘పుస్తకరూపంలో’ అందించాను. ఎలాంటి ఓటింగూ లేకుండానే లోక్‌సభలో బిల్లు పాసయినట్లు ప్రకటించడం... రాజ్యసభలో సభ్యులు తమ తమ స్థానాల్లో లేకుండానే ‘మెజారిటీ’ సభ్యుల అభిప్రాయం ఓటు ద్వారా తెలుసు కోకుండానే బిల్లు పాసయినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రణబ్ ముఖర్జీగారి ముందు రాజ్యాంగ సంబంధమైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. నేను లేవనెత్తిన ప్రశ్నలకు, ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికలో, జైపాల్‌రెడ్డి, దిగ్విజయ్‌సింగ్ మాట్లాడిన మాటల్లో సమాధానం దొరికింది. వారి మాటల్ని కూడా రాజ్యాంగాధినేత ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను. ఆ లేఖ అనువాదం ఇదీ... అత్యంత గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, పార్లమెంటులో 18.2.2014 న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాజ్యాంగ బద్ధంగా ఆమోదించబడిందా.. మన రాజ్యాంగ నిర్మాతలు పాటించిన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగానే విభజన బిల్లును ఆమోదించారా అనే అంశంపై వాస్తవాలను మీరు నిర్ధారించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 7-10-2015 న మీకు రాసిన లేఖలోని అంశాలను బలపర్చేలా మళ్లీ ఈ లేఖను రాసి మీకు పంపుతున్నాను. ఈ సందర్భంగా 18.11.2015 న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి గారు ఒక ‘ప్రెస్-మీట్’లో మాట్లాడిన మాటల ఇంగ్లీష్ అనువాదం మీకు పంపుతున్నాను (తెలుగులో వారన్న మాటలు యథాతథంగా జతపరుస్తున్నాను) ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసయ్యిన తీరును వారు మీడియా వారికి వివరిస్తూ 18.2. 2014 నాడు లోక్‌సభ స్పీకర్ ఛాంబర్లో తాను, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్, స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ భేటీ అయినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట వరకూ, ఏం జరిగిందో చెప్పారు. పై ముగ్గురూ, తన (జైపాల్‌రెడ్డిగారి) ప్రోద్బలంతో, కుట్రపన్ని, రాజ్యాంగాన్ని, నిబంధనలనూ పక్కకు నెట్టి ‘బిల్లు’ ఆమోదింపచేశారంటూ అన్ని సందేహాలకూ సమాధానంగా ఆయన వివరించారు. ఆ సమయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ అక్కడే ఉన్నారని ధృవీకరించారు. జైపాల్ రెడ్డి వివరణను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా బలపర్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ స్పీకర్ మీరాకుమార్‌ల వల్లనే తెలంగాణ రాష్ట్రమొచ్చిందని, ఆయన బహిరంగసభలో అన్న మాటలు కూడా మీకు పంపిస్తున్నాను. అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో రాజ్యాంగాధి నేత అయిన మీరు తగుచర్యలు తీసుకోవాలని, జరిగిన చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను క్రమబద్ధీకరించి పార్లమెంట్ గౌరవాన్ని మర్యాదను కాపాడ తారని నమ్ముతూ... మీ ఉండవల్లి అరుణ్‌కుమార్ 26.11.2015 బహిరంగ సభలో దిగ్విజయ్ సింగ్ ప్రసంగం: సోదర సోదరీమణులైన వరంగల్ ఓటర్లను నేను ప్రశ్నించద ల్చుకున్నదేమిటంటే, 544 మంది సభ్యులున్న పార్లమెంటులో తెలంగాణను సాధించడం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సాధ్యమేనా? అలాంటప్పుడు మీకు తెలంగాణను సాధించి పెట్టింది ఎవరు? సోనియా గాంధీ మీకు తెలంగాణను ప్రసాదించారు. డాక్టర్ మన్మోహన్సింగ్ మీకు తెలంగాణను ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న మీరా కుమార్ గారు.. ఈమే మీకు తెలంగాణను సాధించిపెట్టారు. జైపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్: జాతీయ పార్టీలు సపోర్టు చేసినందునే ఈ బిల్లు పాసయ్యింది. సీమాంధ్ర ఎంపీలందరూ కూడా, కారాలు మిరియాలతో సహా లోక్‌సభలో యుద్ధం చేసినా, జాతీయ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు దాదాపు నూరుమంది కాంగ్రెస్ ఎంపీలు నిలబడ్డారు... యుద్ధం చేశారు. మరొక్క విషయం... ఈ తెలంగాణ బిల్లు పాస్ చేసే క్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన, కీలకమైన దినం ఏమిటయ్యా... 18 ఫిబ్రవరి 2014... 18 ఫిబ్రవరి 2014 నాడు బిల్లు పాసయ్యింది. 12 గంటలకు లోక్‌సభ ఎడ్జర్న్ అయిపోయింది. నడవలేదు... ఇక బిల్లు రాదనుకున్నారు. నిజానికి 12 ‘0’ క్లాక్ తర్వాత లోక్‌సభలో వచ్చేది... దీని తర్వాత బడ్జెట్. మా చిదంబరం గారు బడ్జెట్ పేపర్స్‌తో సహా వచ్చేశాడు. అప్పుడు పొన్నం ప్రభాకర్‌గారు నన్ను తీసుకెళ్లాడు స్పీకర్ దగ్గరికి. స్పీకర్ రూంలో జరిగిన విషయాలు సున్నితమైనవి కాబట్టి, నా ఎన్నికలో నేను ఓడిపోయాను తప్ప, విషయాలు బైట పెట్టలేదు. ఎందుకంటే నేను దాదాపు అర్ధశతాబ్దం, రాజ్యాంగ మర్యాదలు కొంత వరకూ పాటించిన వాడిని. అప్పటికే మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ అక్కడున్నారు. సుష్మాస్వరాజ్ గారిని పొన్నం ప్రభాకరే కాళ్లు పట్టుకుని తోడుకొచ్చాడు. సుష్మా స్వరాజ్ మధ్య మరియూ మా మంత్రి కమల్‌నాథ్‌ల మధ్య సయోధ్య కుదరలేదు. నే వెళ్లిన తర్వాత స్పీకర్ సమక్షంలో స్పీకర్ ఛాంబర్లో సయోధ్య ఏర్పాటు చేశాను. ఏ రూల్ కింద ఈ బిల్లు పాస్ చేయవచ్చునో చూపెట్టాను. ఆ 12 నుంచి 1 ‘0’ క్లాక్, స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి చర్చ, తద్వారా వచ్చిన నిర్ణయం ద్వారానే బిల్లు పాసయ్యింది. 18 ఫిబ్రవరి నాడు బిల్లు పాస్ కాకపోతే, తెలంగాణ రాష్ట్రం అంటూ ఉండేది కాదు... అయ్యేది కాదు. - ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
మేము అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది
పార్లమెంట్లో ఏం జరిగింది-31 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. జైరాం రమేష్: పనులవుతున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటే... వెంకయ్యనాయుడు: లేదు లేదు. షెడ్యూల్ ప్రకారం దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి, రాయలసీమకు సాయం అందించాలనే అడుగుతున్నా. డిప్యూటీ చైర్మన్: జైరాం గారూ ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టారు. అదే మాట చెప్పండి. జైరాం రమేష్: బిల్లులో స్పష్టంగా ఉంది. ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులూ కొనసాగుతాయని షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయని ఉంది. అన్ని ప్రాజెక్టులూ... డిప్యూటీ చైర్మన్: ఏమంటారు వెంకయ్యనాయుడు గారూ! వెంకయ్యనాయుడు: సవరణ విషయమై ఒత్తిడి చెయ్యను. డిప్యూటీ చైర్మన్: సవరణ లేదు. 11వ షెడ్యూల్ ఓటింగ్‌కి పెడ్తున్నా. 11వ షెడ్యూల్ బిల్లులో కలపబడింది. 12వ షెడ్యూల్ బిల్లులో కలపబడింది. ఇప్పుడు 13వ షెడ్యూల్ పది సవరణలు ప్రతిపాదించారు. వెంకయ్యనాయుడు గారూ! వెంకయ్యనాయుడు: సార్, ప్రభుత్వం కొన్ని హామీ లు ఇచ్చింది. ‘‘తగు చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పిం ది. ప్రభుత్వం ‘‘ఫలానా సమయంలోపు పూర్తి చెయ్యాలి’’ అని కచ్చితంగా చెప్పాలని నేను ప్రతిపాదించాను. ఇవ్వాళ మీరు ‘చర్యలు’ అన్నారు. రెండు నెలల తర్వాత మీరు అక్కడ ఉండకపోవచ్చు. వేరే ఎవరో రావొచ్చు.. లేదు లేదు మేమే వస్తాం. మా ప్రభుత్వమే ఏర్పడుతుంది. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారూ, వాళ్లు ఒప్పుకోవటం లేదు. వెంకయ్యనాయుడు: మొత్తం దేశమంతా మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. వాళ్లు పోతున్నారు. అందులో సందేహమే లేదు. కానీ నేను వాళ్లని నిజాయితీగా ఉండమంటున్నా. స్పష్టంగా చెప్పండి. 70 వ పేజీలో విద్య అనే హెడ్డింగ్ కింద ఐఐటీల గురించి ప్రస్తావించారు. ‘‘చర్యలు తీసుకుంటాం’’ అనే బదులు.. చేస్తున్నాం (shall) అని చెప్పాలి. డిప్యూటీ చైర్మన్: స్పష్టంగా చెప్పాలి అని అంటున్నారు. జైరాం రమేష్: 13వ షెడ్యూల్ స్ఫటికమంత స్పష్టంగా ఉంది. ‘‘చర్యలు తీసుకుంటున్నాం’’ అంటే చర్యలు తీసుకోవాలి కదా. ప్లానింగ్ కమిషన్ అనుమతి తీసుకోవాలి, ఆర్థికశాఖ అనుమతి, కేబినెట్ అనుమతి... డిప్యూటీ చైర్మన్: ప్రభుత్వం అనేది నిరంతరం నడిచేది. జైరాం రమేష్: వెంకయ్య నాయుడు చాలా సీనియర్ సభ్యులు. ప్రభుత్వం 'may’ అనలేదు. ‘‘గవర్నమెంట్ shall’’ అన్నాం. అంటే కట్టుబడి ఉన్నాం. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారూ, ప్రభుత్వం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఎందుకు వర్రీ అవుతారు? వెంకయ్యనాయుడు: సార్ నేను చెప్పేది పద ప్రయోగం గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చోట 17వ పేజీలో ఒక సారి చదవండి. ‘‘ఆరు నెలల్లో పరీక్షించి’’ అని ఉంది. అంటే ‘‘పరీక్షించి తిరస్కరించి’’ అని కూడా అర్థం వస్తుంది. జైరాం రమేష్: నేను చెబుతాను. ప్రభుత్వమే చేయగలిగే పనులకు shall అన్నాం. కానీ కొన్ని ఎన్టీపీసీ లాంటి, స్టీల్ అథారిటీ, ఐఓసీ లాంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు చేయవల్సినవి ఉన్నాయి. వాటి తరఫున ప్రభుత్వం మాట ఇవ్వలేదు. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారు. జైరాం రమేష్: నన్ను పూర్తి చెయ్యనివ్వండి. డిప్యూటీ చైర్మన్: ఓకే. అదే నిర్ణయం అంటే. జైరాం రమేష్: నన్ను పూర్తి చెయ్యనివ్వండి. ప్రభుత్వరంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని మీరు గౌరవిస్తారనే నేననుకుంటున్నా. పబ్లిక్ రంగంలోని సంస్థల తరఫున మనం నిర్ణయాలు తీసుకోం. ఎన్టీపీసీ, సెయిల్, ఐఓసీలు పెట్టే పెట్టుబడుల విషయమై నిర్ణయం వారే తీసుకోవాలి. అందుకే, 6 నెలల్లో సాధ్యాసాధ్యాల విషయమై అధ్యయనం పూర్తి చెయ్యమన్నాం. ఈ అధ్యయనం చేయకుండా, పెద్ద పెట్టుబడులు రావటం అసాధ్యం. కానీ ఐఐటీ, ఐఐఎం, ఎఐఐఎంఎస్ వంటి వాటి విషయమై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అందుకే ‘గవర్నమెంట్ షల్’ అన్నాం. గౌరవ సభ్యులు ప్రభుత్వ పెట్టుబడి, పబ్లిక్‌రంగ సంస్థల పెట్టుబడుల సంఖ్య తేడా గమనించాలి. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారూ సవరణ విషయమై ఒత్తిడి లేదుగా... వెంకయ్య నాయుడు: లేదండి. డిప్యూటీ చైర్మన్: మంత్రిగారు ఇచ్చిన వివరణ నేపథ్యంలో... రవిశంకర్ ప్రసాద్: జైరాంగారూ! మీరు పబ్లిక్ రంగ సంస్థలు తొందరగా పని పూర్తి చేసేలా ప్రభుత్వం తరఫున ఒత్తిడి తేవాలి. తెస్తారా? జైరాం రమేష్: మేము మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెస్తాం. డిప్యూటీ చైర్మన్: సరే, ఇంతకంటే భరోసాగా ఎవరూ చెప్పలేరు. వెంకయ్యగారూ మీ సవరణ... ఒత్తిడి లేదుగా! వెంకయ్య నాయుడు: మంత్రి గారి మాట, రెండు నెలల్లో ఎలాగూ మేము అధికారంలోకి వస్తున్నామన్న నమ్మకం వలన నేనిక ముందుకెళ్ల దల్చుకోలేదు. డిప్యూటీ చైర్మన్: 13వ షెడ్యూల్ ఓటింగ్ పెడ్తున్నా. 13వ షెడ్యూల్ బిల్లులో చేర్చబడింది. డిప్యూటీ చైర్మన్: డెరిక్ ఒబ్రియిన్ గారు ఒక సవరణ ప్రతిపాదించారు. డెరిక్ ఒబ్రియిన్ గారూ... మీరు వెల్‌లో నిరసనలో ఉన్నారా? మిమ్మల్ని పట్టించుకోనవసరం లేదు. క్లాజ్-1 బిల్లులో చేర్చబడింది. డిప్యూటీ చైర్మన్: షిండే గారూ! షిండే: బిల్లు పాస్ చెయ్యవల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏచూరి: ఓటింగ్ డివిజన్ కావాలి... డివిజన్ కావాలి. డిప్యూటీ చైర్మన్: ఎలా ఓటింగ్ జరపగలం? ఇలా ఉంటే? - ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
పోలవరం బహుళార్థ సాధకం
పార్లమెంట్లో ఏం జరిగింది -30 విభజన బిల్లుపై 20-02- 2014 న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. ప్రొ. రాంగోపాల్ యాదవ్: సార్, ఓటింగ్ జరగడమే సాధ్యం కానప్పుడు, బిల్లు ఎందుకు పాస్ చేయిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్: ఓటింగ్ సాధ్యం కాదు... సాధ్యం కాదు... సభ్యుల్ని వాళ్ల స్థానాలకి తీసుకెళ్లండి... అందరూ ఎవరి స్థానాల్లో వాళ్లున్నారని మీరు చెప్పగలిగితే, నేను ఓటింగ్ పెడ్తాను. రూల్ ప్రకారం ఇలా ఉంటే ఓటింగ్ పెట్టలేం. రాజీవి: మీరెందుకు ఒకే సభ్యుడికి మూడుసార్లు అవకాశమిస్తున్నారు. మిగతా వారెవరికీ ఎందుకు ఇవ్వటం లేదు? డిప్యూటీ చైర్మన్: ఎవరికీ ఇవ్వకుండా లేను. రాజీవి: ఈయన సవరణలు పెడ్తానంటున్నాడు. డిప్యూటీ చైర్మన్: ఏమిటీ అడుగుతున్నారు? రాజీవి: ఒకే సభ్యుడికి మూడు ఛాన్స్‌లు ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్: మీరేమంటున్నారు రాజీవిగారూ! రాజీవి: ఈయన సవరణలు పెడ్తారట. డిప్యూటీ చైర్మన్: మాట్లాడతారా? రాజీవి: అవును. డిప్యూటీ చైర్మన్: మాట్లాడమనండి. నేను పిలిచాను. వారు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడమనండి. బెష్ణవ పరీదా: కాదు. కాదు మేం కొన్ని విషయాలు అడగాలి. డిప్యూటీ చైర్మన్: మహాపాత్రోగారూ! ఏం చెప్తారు. ఏచూరి: సార్, అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. డిప్యూటీ చైర్మన్: లేదు లేదు. ఏచూరి: మీరిందులో భాగస్వాములు కావొద్దు. డిప్యూటీ చైర్మన్: కానేకాదు, మ్యాచ్ ఫిక్సింగ్ - నాకు తెలిసి అలాంటిదేమీ లేదు. నేను రూల్ ప్రకారం నడుచుకుంటున్నాను. చెప్పండి మహాపాత్రోగారూ! మహాపాత్రో: సార్, 90(1) పోలవరం ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టు గా ప్రకటించారు. గోదావరి నది ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాలతో అనుసంధానమై ఉంది. డిప్యూటీ చైర్మన్: మీ సవరణల గురించి మాట్లాడుతున్నారా? మహాపాత్రో: అవును, సవరణలు గురించే మాట్లాడుతున్నా. డిప్యూటీ చైర్మన్: సరే, గవర్నమెంట్ ఏం చెయ్యాలని మీరనుకుంటున్నారో, ఆ విషయం చెప్పండి. మహాపాత్రో: అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఎందుకు పట్టుబడుతోంది.. ఒడిశాలో గ్రామస్తులు బాధలు పడతారు. ప్రభుత్వానికి ఏమిటి సమస్య. డిప్యూటీ చైర్మన్: ఓకే. మహాపాత్రో: నాకు స్పష్టమైన సమాధానం కావాలి. డిప్యూటీ చైర్మన్: జైరాం రమేష్ సమాధానం చెప్తారు. జైరాం రమేష్: మీ సవరణల విషయమై, వెంకయ్య నాయుడు గారివి, మావి, సవరణల విషయమై నేను వివరిస్తాను. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్. వెంకయ్యగారూ! బిల్లులో ‘ఇరిగేషన్ ప్రాజెక్ట్’ అని ఉన్నా, విశాఖపట్నానికి తాగునీరు, గోదావరి డెల్టాకి సాగునీరు, గోదావరి నుంచి కృష్ణలోకి మళ్లింపు... అందుకే దీనిని నేషనల్ ప్రాజెక్ట్‌గా ప్రకటించాం. దీనిలో విద్యుత్ ఉత్పత్తి కూడా ఉంది. 30 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మధ్య ప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు తమ ఆమోదం కూడా తెలిపాయి. తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, ఒడిశాలోని రత్నగిరి (మల్కనగిరి) జిల్లాలలో గ్రామాల ముంపు విషయమై... డిప్యూటీ చైర్మన్: బాలగోపాల్ గారూ! జైరాం రమేష్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అది ప్రశ్నేకాదు. భారత ప్రభుత్వం పోలవరం పూర్తి చేయటానికి కట్టుబడి ఉంది. డిప్యూటీ చైర్మన్: ఓకే. జైరాం రమేష్: ఆర్ అండ్ ఆర్ ముంపు గ్రామాలకు పూర్తిగా వర్తింపజేస్తూ పర్యావరణ, అటవీ చట్టాలన్నిటినీ అమలు చేస్తూ... డిప్యూటీ చైర్మన్: మహాపాత్రో, పరీడా గారి సవరణలు ఓటింగ్‌కు పెడ్తున్నా, సవరణలు తిరస్కరించారు. పరీడా: అయ్యా! మేము వాకౌట్ చేస్తున్నాం. (వెళ్లిపోయారు) డిప్యూటీ చైర్మన్: చెప్పండి వెంకయ్యనాయుడు. వెంకయ్య నాయుడు: నేను సవరణల విషయమై ఒత్తిడి చేయను. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందాను. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారు సంతృప్తి చెందారు. క్లాజ్ 90 ఓటింగ్‌కు పెడుతున్నా. క్లాజ్ 90 బిల్లులో భాగమయ్యింది. డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 93 వెంకయ్యగారూ! మీ సవరణ ఉంది. వెంకయ్య నాయుడు: నేను ఉపసంహరిస్తున్నా. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారు ఒత్తిడి లేదు. 93 ఓటింగ్ పెడుతున్నా. క్లాజ్ 93 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 94-108 వరకూ షెడ్యూల్ 1 నుంచి 10వ షెడ్యూల్ వరకూ బిల్లులో కలపబడ్డాయి. డిప్యూటీ చైర్మన్: పదకొండవ షెడ్యూల్... వెంకయ్యనాయుడు గారూ! మీ సవరణ 21 ఉంది. పట్టుబడతారా? వెంకయ్యనాయుడు: సార్, దుమ్ముగూడెం- నాగా ర్జునసాగర్ టైల్ పాండ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు అవసరమయిన ప్రాజెక్టు. 2009లో శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే రూ. 695 కోట్లు ఖర్చు చేశారు. కాని ఆ ప్రస్తావనే ఇక్కడ లేదు. అది పూర్తి చేస్తామని ప్రభుత్వం మాటివ్వాలి. డిప్యూటీ చైర్మన్: జైరాం రమేష్‌గారూ! ఇప్పటికే డబ్బు కూడా ఖర్చు పెట్టారు. జైరాం రమేష్: పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆమోదించాం... ఇంకా కొన్ని సాంకేతిక వివరాలు కావాలి. గవర్నమెంట్‌కి కొంత సమయమిస్తే, నిర్ణయం తీసుకుంటాం. వెంకయ్యనాయుడు: టెండర్లు పిలిచారు. పనులవుతున్నాయి. మీ ప్రభుత్వమే టెండర్లు పిలిచింది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
ఆ లోటును భర్తీ చేస్తాం
పార్లమెంట్లో ఏం జరిగింది -29 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. డిప్యూటీ చైర్మన్: హోం మినిస్టర్ ఒప్పుకుంటున్నారా? వెంకయ్య నాయుడు: బడ్జెట్ ప్రతిపాదించే లోపు... హోం మంత్రి: సార్, విషయం వచ్చింది. కొన్ని ఇబ్బందులున్నాయి కాబట్టే ప్రధాన మంత్రిగారు సభలో ప్రకటన చేశారు. అపాయింట్మెంట్ రోజు నుంచి పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి వరకు అవసరం లేదు. డిప్యూటీ చైర్మన్: సరే నరేష్ గుజ్రాల్ గారి సవరణ మీద ఓటింగ్. వెంకయ్య నాయుడు: సార్, మేము సవరణ మీద ఓటింగ్‌కు ఒత్తిడి చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కారణం... డిప్యూటీ చైర్మన్: నరేష్ గుజ్రాల్ గారి సవరణ ఓటింగ్ అయిపోనివ్వండి. నరేష్ గుజ్రాల్ గారి సవరణ సభ ముందుంచుతున్నాను. పేజీ 11లో 51వ లైన్ తర్వాత ఈ మాటలు కలప బడాలి. సవరణ తిరస్కరించబడింది. వెంకయ్య నాయుడు: సార్... డిప్యూటీ చైర్మన్: మీరు చెప్పారు. ప్రభుత్వం వాదన స్పష్టం చేసింది. వెంకయ్య నాయుడు: గవర్నమెంట్‌కి అసలు అర్థం కాలేదు. వారేమీ చెప్పలేదు. డిప్యూటీ చైర్మన్: అది వారిష్టం. నేను ఓటింగ్ పెట్టేస్తున్నాను. వెంకయ్య నాయుడు: మీరెలాగైనా చెప్పవచ్చు కానీ... డిప్యూటీ చైర్మన్: నేనెలాగైనా చెయ్యటం లేదు. అనవసర ఆరోపణలు చేయవద్దు. వెంకయ్య నాయుడు: నేను ఆరోపణ చేయటం లేదు. అపాయింట్మెంట్ రోజు నుంచి బడ్జెట్ అయ్యే లోపు ‘గాప్’ (లోటు) ఎలా భర్తీ చేస్తారో ప్రధాన మంత్రి లేదా హోం మంత్రిని వివరించమనండి. రవిశంకర్ ప్రసాద్: జైరాం రమేష్ గారూ! మీరు వివరించవచ్చుగదా... డిప్యూటీ చైర్మన్: మంత్రిగారూ... వినండి. హోంమంత్రి: సార్, ఎప్పాయింటెడ్ డే, ఉద్యోగ ఆర్థిక ఆస్తుల, అప్పుల పంపకాల విషయమై జరగవలసిన ముందస్తు ఏర్పాట్లన్నీ జరిగాకనే ఉండేలా ఫిక్స్ చేస్తామని ఇప్పటికే ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇక కొత్త రాష్ట్రం మొదటి సంవత్సరం ఎదురయ్యే అంశాలు, ప్రధానంగా అప్పాయింటెడ్ డేకి 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే రోజుకి మధ్యన ఎదురయ్యే లోటు, 2014-15 బడ్జెట్లో పెడ్తారు. డిప్యూటీ చైర్మన్: ఒకే, సరేనా వెంకయ్య నాయుడు గారూ! ఇంకా సవరణకు పట్టుబడతారా?! వెంకయ్య నాయుడు: పట్టుబడతాను. నేనడిగేది అదే... అప్పాయింటెడ్ డేకీ బడ్జెట్‌కీ మధ్య సమయం గురించే... డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారూ... ఆయన వివరించారు గదా. వెంకయ్య నాయుడు: జైరాంగారు చెప్తారట. చెప్పనివ్వండి. డిప్యూటీ చైర్మన్: ఒకే, జైరాం రమేష్. వెంకయ్య నాయుడు: ఎందుకు మీరంత తొందర పడుతున్నారు. డిప్యూటీ చైర్మన్: నేను తొందరేమీ పడటం లేదు. జైరాం రమేష్: గౌరవ సభ్యుని సంశయం... ప్రకటిత తేదీ ఒకటి (నోటీసు రోజు), నిర్ణీతమైన తేదీ రోజు (అప్పాయింటెడ్ డే) ఒకటి ఉన్నాయి. మేమింకా అప్పాయింటెడ్ రోజును నిర్ణయించలేదు. ఏ రోజుగా నిర్ణయం జరిగినా, మొదటి సంవత్సరం అంతరం (గ్యాప్) ఉన్నట్లయితే, ఆ లోటు భర్తీ చేయబడుతుంది. ‘‘భర్తీ చేయబడుతుంది’’ అన్నాం. లోటు భర్తీ అంటే, ఏదైతే గ్యాప్ (తేడా) ఉందో, అది బడ్జెట్లో సమానం చేయబడుతుంది. ‘పరిహారం’ అంటే అర్థమదే! ఫైనాన్స్ బిల్లు పాస్ అయింది. ఇన్‌టర్మ్ బడ్జెట్ కూడా అయి పోయింది. ఇన్‌టర్మ్ బడ్జెట్లో మేము ఏమీ చెయ్య టానికి లేదు. అందుకే నోటిఫైడ్ రోజుకి అప్పాయింటెడ్ రోజుకి మధ్య రోజుల కోసం ఏర్పాటు చేశాం. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మధ్య సమయం మూడు నెలలు పట్టింది. నేనిప్పుడు రెండా, మూడా, నాలుగు నెలలా చెప్పలేను. కానీ ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ‘గ్యాప్’ లేకుండా ఉండేలా ‘అప్పాయింటెడ్ డే’ ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి చెప్పడం జరిగింది. వెంకయ్యనాయుడు: నేనొక పరిష్కారం చెప్తాను. అంటే ఆ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి డబ్బు వాడుకుంటారనేగా అర్థం.. జైరాం గారూ! జైరాం రమేష్: అప్పాయింటెడ్ డే వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే కొనసాగుతుంది. ఎప్పాయింటెడ్ డే నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుంటాయి. డిప్యూటీ చైర్మన్: ఇంకా పట్టుబడతారా వెంకయ్య గారూ! వెంకయ్య నాయుడు: ఇప్పుడక్కర్లేదు. డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారు ఉపసంహరించుకున్నారు. క్లాజ్ 46, 47, 48 బిల్లులో కలపబడ్డాయి. క్లాజ్ 90 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు క్లాజ్ 90కి 6 సవరణలు ప్రతిపాదించారు. దేవేందర్‌గౌడ్ 2, 3 ఉపసంహరించుకున్నారు. రబీ నారాయణ మహాపాత్రో వైష్ణవ్ పరీడా 13, 14 వెంకయ్య నాయుడు 18, 19. మహాపాత్రో: పేజీ 24లో 28, 34, 35 లైన్లు తీసే యాలి. డిప్యూటీ చైర్మన్: మహాపాత్రోగారి సవరణలు సభ ముందు ఉంచుతున్నాను. రాజీవి (కేరళ): సార్, ఆయన ఓటింగ్ జరగాలంటున్నారు. డిప్యూటీ చైర్మన్: సభ ఇలాగుంటే ఓటింగ్ ఎలా జరపగలం... అసాధ్యం. -
సీమాంధ్ర రెవెన్యూ లోటుకు పరిష్కారం ఏదీ?
పార్లమెంట్లో ఏం జరిగింది -28 విభజన బిల్లుపై 20-02-2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు డిప్యూటీ చైర్మన్: 16 వ సవరణ ప్రతిపాదించారు. ప్రభుత్వం ఒప్పుకుంటోందా? హోంమంత్రి: నా ఉపన్యాసంలో వివరించాను. అందుచేత ఒప్పుకోవటం లేదు. డిప్యూటీ చైర్మన్: వెంకయ్య నాయుడు గారూ ప్రభుత్వం ఒప్పుకోవటంలేదు. వెంకయ్యనాయుడు: సార్, క్లాజ్ ఏమిటో, సవరణ ఏమిటో నాతో సహా ఎవ్వరికీ అర్థం కావటంలేదు. ఈ అరుపులు కేకల మధ్య. ఆయన చదువుతున్నాడో మాట్లాడుతున్నాడో... డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారి సవరణ సభ ముందుంచుతున్నా (16) such area పక్కనే ఈ పదాలు చేర్చాలి. సవరణ తిరస్కరించబడింది. క్లాజ్ 8, 9 బిల్లులో భాగాలయ్యాయి. క్లాజ్ 11, సుఖేంద్ శేఖర్‌రాయ్ గారి సవరణలో కూడా ఆయన ‘నో’ అన్నారు. క్లాజ్ 10, 11 నుంచి 29 వరకూ కలపబడ్డాయి. డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 30కి 32 సవరణ, రామాజోయిస్ గారి ప్రతిపాదన. రామాజోయిస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా లేకపోయినా హైకోర్టు మాత్రం ఉండాలి. ఆర్టికల్ - 231 ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండొచ్చు. నేను పంజాబ్ హర్యానా హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా పని చేశాను. చెప్తుంటే వినరే.. మీరు వినకపోతే నా పాయింట్ ఎలా చెప్పను? డిప్యూటీ చైర్మన్: నేను వింటున్నా చెప్పండి. అధ్యక్షస్థానం వింటోంది. రామాజోయిస్: నా సవరణ ఏమిటంటే, ఆర్టికల్ 214 ఈ యాక్ట్‌లోని సెక్షన్ 31 ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌కి మరో హైకోర్టు ఏర్పడేవరకూ’ అనే పదాలు తొలగించాలి. అందువల్ల హైదరాబాద్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుంది. డిప్యూటీ చైర్మన్: మీరేమయినా చెప్పాలా హోంమంత్రిగారూ! హోంమంత్రి: మేం రాజ్యాంగబద్ధులం. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం చేయాలి. అందుకే ఆ రకంగా బిల్లుతో కలిపాం. డిప్యూటీ చైర్మన్:రామాజోయిస్ సవరణ ఉంచాలా? రామాజోయిస్: నేను సవరణ కోరుతున్నా సభ సవరణను తిరస్కరించింది. క్లాజ్ 30 కలపబడింది. డిప్యూటీ చైర్మన్: రామాజోయిస్ గారి మరో సవరణ క్లాజ్ 31కి. ఉంచాలా.. రామాజోయిస్: ఇది చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 231 ప్రకారం రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోనే హైకోర్టు ఉండాలి. డిప్యూటీ చైర్మన్: సవరణ కావాలా? సభముందుంచాలా? రామాజోయిస్: అవును. 32 నుండి 41 పంక్తులు తొలగించాలి. సవరణ తిరస్కరించబడింది. క్లాజ్ 31 కలపబడింది. డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 32కి రామాజోయిస్ గారి సవరణ ఉంది. రామాజోయిస్: సార్, ఈ సవరణలన్నీ ఒక దానికొకటి అనుబంధం సవరణ సభ ముందుంచాలి. డిప్యూటీ చైర్మన్: సవరణ తిరస్కరించబడింది. క్లాజ్ 32 బిల్లులో కలుపబడింది. 32, 34 సవరణలు మీవే రామాజోయిస్ గారూ! రామాజోయిస్: ఇవన్నీ కలిపే ప్రతిపాదించాను. డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు సభ ముందుకు పెట్టనక్కర్లేదుగా... సరే ఆయన ‘నో’ అంటున్నారు. క్లాజ్ 34 బిల్లులో భాగమైంది. క్లాజ్ 35 నుండి 45 వరకూ బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 46 కి మూడు సవరణలు ఉన్నాయి. దీరక్ బిరేన్, అరుణ్‌జైట్లీ ‘నో’ అన్నారు. నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) గారూ మీ సవరణ ఏమంటారు? నరేష్ గుజ్రాల్: పేజీ 11లో 51వ లైన్ తర్వాత ఈ భాగం కలపాలి. సబ్‌క్లాజ్ (3) ప్రకారం, ఏదైనా ప్యాకేజీ ఇస్తున్నప్పుడు ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక లోటును పరిగణనలోకి తీసుకోవాలి. వెంకయ్యనాయుడు: పేజీ 11 లోని 45వ లైన్లో ' may’ బదులు 'shall' అని మార్చాలి. సవరణలు సభ ముందు ఉంచబడ్డాయి. వెంకయ్యనాయుడు: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే లోపు సీమాంధ్రకు రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఆ తేడా భర్తీ చేయడానికి చర్యలు చేపడతామని ప్రభుత్వం మాకు చెప్పింది. వచ్చే బడ్జెట్ వరకూ, మేం చూసుకుంటాం అని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఏమవ్వాలి? జీతాలు, పెన్షన్లు, ఇతర చెల్లింపులు ఎలా ఇస్తారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఒత్తిడి తెస్తున్నా. క్లాజ్ 46, పేజీ 11, లైన్ 48 లో పదాలు చూడండి. ‘రాష్ట్రం లోని ఏరియాలు’. ఒక స్వతంత్ర నిపుణుల కమిటీ నియమించి, ఆర్థికలోటు అంచనావేసి ప్రణాళికేతర గ్రాంట్లు సిఫార్సు చేయటమే కాకుండా, రెవెన్యూ లోటుకు సరిపడా గ్రాంటు కూడా సెక్షన్ 67 (ఎ)లో చెప్పినట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కనీసం పదేళ్ల పాటు అందించాలి. అప్పటిలోపు, మొట్టమొదటి సంవత్సరానికి, కన్సాలిడేటెడ్ ఫండ్(ఏకీకృత నిధి) నుండి 10,000 కోట్లు ఇవ్వాలి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే... -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
'ఈ విభజన ప్రమాదకరం!’
పార్లమెంట్లో ఏం జరిగింది -17 విభజన బిల్లు మీద 20-2- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాలు... ఏచూరి: విభజనను వ్యతిరేకిస్తున్నాను. నా పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది, వ్యతి రేకిస్తూ నినాదాలు చేస్తున్న సభ్యులు నేను కూడా వ్యతి రేకిస్తున్నానని పట్టించుకోక పోవటం దురదృష్టం. డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యులను ఉద్దేశించి) ఏచూరి మిమ్మల్ని సపోర్టు చేస్తున్నారు. అయినా మీరు ఆపుచేయరే...? ఏచూరి: ఈ విభజనను మేము వ్యతిరేకిస్తు న్నాం. ఈ దేశానికి ఈ చర్య హాని చేస్తుంది. గుర్తు చేసుకోండి అధ్యక్షా! స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత, రాజ్యాంగంలోని మొదటి క్లాజుకు మనం అంగీకరించాం. అదేమిటి- ‘ఇండియా, రాష్ట్రాల సమాహారం’. ‘ఇండియా అంటే భారత్, ఒక రాష్ట్రాల సమాహారం’. అప్పుడొక ప్రశ్న ఉత్పన్నమయింది. రాష్ట్రం అంటే ఏమిటి. చర్చలూ, ఉద్యమాలూ విరివిగా జరిగాక, భాష ప్రాతిపదికన రాష్ట్రం ఉండాలని నిర్ణయమయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొట్ట మొదటి ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశ యం మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రం, విశాలాంధ్ర ఏర్పడింది. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ విడదీయబడుతోంది. విశాలాంధ్ర నినాదం తర్వాతే సంయుక్త మహారాష్ర్ట, ఐక్య కేరళ వంటి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఆ రాష్ట్రం విడదీస్తున్నారు. మొదటి నుంచీ ఈ విభజనను మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. అందుకే వెంకయ్యనాయుడు గారు తప్పుడు అభిప్రాయం కలిగించేలా మాట్లాడినప్పుడు నేను లేచి సవరిం చాను. మేమెప్పుడూ ఈ విభజనను అంగీకరిం చలేదు. నేను వ్యక్తిగతంగా కూడా ఈ విభజన ఉద్యమాల వల్ల నష్టపోయాను. 40 ఏళ్ల క్రితం ప్రత్యేకాంధ్ర ఉద్యమ సమయంలో మేము రెండేళ్లు కోల్పోయాం. అప్పుడు ఇందిరాగాంధీ రాజ్యాం గంలో 371-డిని చేర్చి, రాజ్యాంగ సవరణ చేశారు. అదే సరిగ్గా అమలు జరిగివుంటే, ఈ రోజు ఈస్థితి వచ్చేది కాదు. ఆర్థిక ప్యాకేజీలు కావా లంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బేరాలాడటం అత్యంత దురదృష్టకరం. ఈ రెండు పార్టీల ‘మ్యాచ్‌ఫిక్సింగ్’ విభజనకు కారణం. సార్, గుర జాడ అప్పారావు గారి మాట నేను చెప్పదలిచా, ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషు లోయ్’. ఈ రోజు మనుషుల్ని విడదీస్తున్నారు. భాష కారణంగా కలిసిన మనుషుల్ని విడగొట్టేస్తు న్నారు. కొన్ని ప్రయోజనాల కోసం ఈ పని చేస్తు న్నారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఈ అవకాశవాద చర్యకు పాల్పడింది. రెండు యూపీఏ ప్రభుత్వాలూ ఆంధ్రప్రదేశ్ సీట్ల మీదే నిలబ డ్డాయి. మొదటిసారి 37, రెండోసారి 33. ఇప్పు డేమీ సీట్లొచ్చే అవకాశం లేకపోవడంతో, రాష్ట్రాన్ని విడదీసి లబ్ధి పొందాలని ఆలోచన చేశారు. కేవలం ఎన్నికల కోసం జరుగుతున్న ఈ విభజన వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో, అరాచకత్వం ప్రబ లుతుందో, నీటి కోసం, విద్యుత్ కోసం, ఉమ్మడి ప్రాజెక్టుల కోసం ఎన్ని ఆటంకాలు ఎదురవు తాయో... ఈ బిల్లును లోక్‌సభకు తిప్పి పంపుతూ, భాషాప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నానికి ఈ సభ అంగీకరించదని తెలియజేయాలని నేను కోరుకుం టున్నా! ఈ బిల్లును స్పష్టంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆపి, భారతదేశ భవిష్యత్కే ముప్పుగా పరిణమించే ఆంధ్రప్రదేశ్ విభజన విరమించుకోవాలని కోరు తున్నా. నాకు గుర్తుంది సార్! భిన్నత్వంలో ఏక త్వం, ఇదే ఇండియా... భిన్నత్వంలో ఏకత్వం అనేది భాషల ఏకత్వానికి ఉదాహరణ. ఆ ప్రాతిపదికను ఒకచోట మీరు పాడుచేస్తే, ఇక దీనికి అంతమే ఉండదు. ఒక తేనెతుట్టెను కదుపుతున్నారు. మీరు దేశానికి ఈ అపకారం తల పెట్టవద్దు. అందుకే, మీరు చేస్తున్న సవరణల జోలికి నేనుపోను. నేను విభజననే వ్యతిరేకిస్తున్నా. కాని సంపద విభజిస్తున్నప్పుడు అందర్నీ సమా నంగా చూడాలి. ఏ రాష్ట్రానికీ సవతితల్లి ప్రేమ అందించకూడదు. ప్రధానమంత్రిగారికి, ఈ సభ వివేకానికి నేను వదిలేస్తున్నా... మీరు చేస్తున్న విభజన పర్యవసానాలు అర్థం చేసుకోండి. దీని పర్యవసానం ఇండియాకు మంచి చెయ్యదు. మీ చర్య వల్ల దేశంలో ఏర్పడబోయే అల్లకల్లోలాల్ని అంచనా వేయాలి. అందుకే మీ చర్యను మేము సమర్థించం, తేనెతుట్టె మీద రాయి వేయకండి. ఈ చర్య దేశానికి మంచిది కాదు. ప్రొ॥రాంగోపాల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్): అధ్యక్షా! నేనీ బిల్లును సర్వశక్తులతోనూ వ్యతిరేకి స్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాదు. ప్రజల హృదయాల మధ్య అగాధం సృష్టిస్తోంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకూ, రాష్ట్రాల విభజన వ్యతిరేకించారు. పండిట్ నెహ్రూ, పెద్ద రాష్ట్రాలే దేశాన్ని కలిపి వుంచే ‘సిమెంట్’లా పనిచేస్తాయని నమ్మేవారు. సర్దార్ పటేల్ ఏర్పరిచిన యూనియన్ను విచ్ఛి న్నం చేస్తున్నారు. పటేల్, నెహ్రూ, ఇందిర ఆలోచ నలను విచ్ఛిన్నం చేస్తున్నారు. అధ్యక్షా! రాజ్యాం గం ప్రకారం రాష్ట్రాలలో లా అండ్ ఆర్డర్ కేంద్రం తీసుకునే అవకాశమే లేదు. కానీ ఈ బిల్లులో రాజ్యాంగ విరుద్ధమైన, ఆ ప్రయత్నం కూడా జరు గుతోంది. న్యాయస్థానాలలో ఈ అంశం కొట్టి వేయబడుతుంది. ఇలాంటి పని, వివేకం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. అధ్యక్షా! ఇది దేశ సమగ్రతకే పెద్ద విఘాతం. ఏ రాష్ట్ర విభజన జరిగినా అక్కడి ప్రజల అభీష్టం తెలుసుకుని, శాసనసభ అభిప్రా యంతో జరిగింది. మొట్టమొదటిసారిగా, శాసన సభ విభజన చెయ్యవద్దని నేను భావిస్తున్నాను. పొట్టి శ్రీరాములు మరణానంతరం, 1953లో మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం విభజిస్తున్న సమ యంలోనే, ఈ సభలో విభజన వలన ఏర్పడ బోయే భవిష్యత్ కష్టాల గురించి బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పి ఉన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
ఆద్యంతం అప్రజాస్వామికం
పార్లమెంట్లో ఏం జరిగింది -14 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20.02.2014 నాడు రాజ్యసభ కార్యక్రమాల వివరాలివి. ఆరోజు చిరంజీవి చేసిన ప్రసంగంలోని తదుపరి భాగం.) చిరంజీవి: కానీ జరుగుతున్న విధానం, రాష్ట్రాన్ని విడదీస్తున్న పద్ధతి - చాలా దురదృష్టకరం. తొందరపాటుతో వ్యవహరిస్తూ గబగబా నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ప్రజల్లో కోపం, వ్యతిరేకత, బాధ కలుగుతున్నాయి. శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినా, దానిమీద చర్చేలేదు. శ్రీకృష్ణ రిపోర్ట్‌లో రాష్ట్రం ఒకటిగా ఉండటమే అత్యుత్తమ పరిష్కారంగా సూచించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒకటిగానే ఉంటుందని అందరూ ఊహించారు. కాని తర్వాత, బీజేపీ, టీఆర్ఎస్లు ప్రత్యేక తెలంగాణ కోసం ఒత్తిడి పెంచారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు వేర్వేరు పాదయాత్రల్లో, మీటింగుల్లో ప్రభుత్వమే తెలంగాణను ఆలస్యం చేస్తోందంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు. కొందరు ఆ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం ప్రకటించింది. అందరం హతాశులైనాం. ఒక్క ముఖ్యమంత్రితో తప్ప, ఇతర మంత్రులతో గాని, ఎంపీలతో గాని చర్చించలేదు. కేబినెట్ ముందు టేబుల్ అయిటం చేయటం కూడా చాలా బాధాకరం. ఆఖరుగా, ఆంటోనీ కమిటీ. ఆ కమిటీ ఏర్పాటు చేయగానే, అందరి అభిప్రాయాలూ తీసుకుంటారని ఆశించాం. అదీ జరగలేదు. ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ ఏర్పాటు చేసినప్పుడూ, ప్రజల ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుంటారని ఆశించాం. అది కూడా జరగలేదు. ఏ ఒక్కరికీ సంతృప్తి కలిగించలేదు. ఏది ఏమైనా, కాంగ్రెస్ పార్టీనొక్కదానికే బాధ్యుల్ని చేయటం అసమంజసం. ఈ నిర్ణయం తీసుకున్న చివరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం ఈ సభ జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరుగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు, బీజేపీ ఎప్పుడూ తెలంగాణ ఇస్తామని చెప్పినా, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దాటవేసి మాట తప్పింది. ఇది సత్యం. రికార్డయిన నిజం. రెండ్రోజుల క్రితం లోక్‌సభలో తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీ, ఇక్కడ రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించి అడ్డుకుంటోంది. ఎంఐఎం, సీపీఐ(ఎం) పార్టీలు తప్ప, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ మొత్తం అన్ని పార్టీలూ ఈ స్థితికి బాధ్యత వహించక తప్పదు. టీడీపీ మద్దతుగా ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు సగం మంది ఎంపీలు వ్యతిరేకిస్తుంటే సగం మంది మద్దతిస్తున్నారు. వైఎస్సార్సీపీ మరో అడుగు ముందుకేసి ఆర్టికల్-3 ఉపయోగించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమన్నారు. వారు అనేక వేదికల మీద ఈ విషయం చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ వారు రాజకీయ ప్రయోజనాల కోసం యు టర్న్ తీసుకున్నారు. ‘సమన్యాయం’ అనే బదులు టీడీపీ వారు సీమాంధ్ర కోసం ఏమి చేయాలో అడిగితే బాగుంటుంది. కాని వారు అలా చెయ్యలేదు. సీమాంధ్ర ప్రాంతానికి వారు అందరికంటే ఎక్కువ నష్టం చేశారు. మీరు టీడీపీ అగ్రనాయకుణ్ణి అడగండి. ఆయనకే స్పష్టతలేదు. ‘సమన్యాయం’ అంటే ఏమిటి? అదేమిటో స్పష్టత లేదు. ఇప్పుడు బీజేపీ సవరణలు ప్రతిపాదిస్తోంది. నేను కూడా కొన్ని ‘ఎమెండ్మెంట్స్’ ప్రతిపాదిస్తున్నాను. టీడీపీ ‘సుప్రిమో’కు సమన్యాయమేమిటో తెలియదు. వాళ్లేం కోరుకుంటున్నారో చెప్పాలిగదా! మొదట్లో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించినప్పుడు ఆయన ఏం చెప్పారు. ‘రాజధానికి నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలి’ అన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పమనండి, ఎన్నివేల కోట్లు అవసరమో.. ఆయన సంప్రదింపుల్లో పాల్గొనక పోయివుంటే రాజధానికి 4 లక్షల కోట్లు అని ఎలా అనగలిగారు? ఇదే పత్రికల్లో వచ్చింది. మీ నాయకుణ్ణి అడగండి అన్నారో లేదో.. ఈ పార్టీలు అవలంబించిన అవకాశవాద వైఖరుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నిర్ణయం వారే తీసుకోవాలి. నిర్ణయించే వరకూ ఒత్తిడి చేసి నిర్ణయించాక కాంగ్రెస్‌ని మాత్రమే తప్పుబట్టడం సరికాదు. ప్రతిపార్టీ, ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే! ఆఖరికి బాధపడేది మాత్రం పార్టీలు గాదు తెలుగు ప్రజలే!! ఆఖరికి నష్టపోయింది తెలుగు ప్రజలే. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజు నుంచీ నేను హైదరాబాద్‌ను యూటీ చెయ్యమని అడుగుతూనే ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి కారణం తెలుగు ప్రజల సమష్టి కృషి ఫలితమేనన్న విషయం మర్చిపో కూడదు. గత 58 సంవత్సరాల తెలుగు ప్రజల ఉమ్మడి కృషి ఫలితమే హైదరాబాద్. అది జాయింట్ ప్రాపర్టీ. 1972లో వెంకయ్యనాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడు, జైఆంధ్ర ఉద్యమంలో ఎవ్వరూ హైదరాబాద్‌లో ఉండాలని కోరుకోలేదు. ఇప్పుడెందుకు కలిసుందామంటున్నారు? ఎందుకంటే, అందరి ప్రయోజనాలూ హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నందువల్ల. అందుకే నేను హైదరాబాద్ యూటీ కావాలంటున్నా. గత ముప్పై ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతీయుల వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి. అరుణ్ జైట్లీ : పాయింట్ ఆఫ్ ఆర్డర్ మంత్రివర్గ సభ్యుని హోదాలో సభ్యుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రివర్గ సభ్యుడు, ప్రధానమంత్రి సమక్షంలో, ‘‘నా ప్రభుత్వం తెలంగాణకు అనుకూలం నాకు మాత్రం కొన్ని అభ్యంతరాలున్నాయి’’ అని అనవచ్చా. ఆయన ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ తరఫునా? మంత్రివర్గం తరఫునా? మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక మంత్రి మాట్లాడవచ్చా? ఆయన గుండెఘోష చెప్పాలనుకుంటే, ముందు మంత్రి పదవికి రిజైన్ చెయ్యాలి. అది వదిలేసి విలువలు, మాట మీద నిలబడటం అంటూ చదువుతున్నారు. ఆయన తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణని సమర్థిస్తున్న మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన దృష్టిలో మాట మీద నిలబడటం అంటే అదేనేమో. మేము తెలంగాణకు అనుకూలం. పూర్వమూ ఇప్పుడూ కూడా! మేము ఎందుకు సవరణలు అడుగుతున్నామంటే, ప్రభుత్వం ప్రతిపాదించినట్లు లోపాలతో కూడిన తెలంగాణా ఆపటం కోసం. రాజ్యాంగబద్ధమైన తెలంగాణ ఏర్పాటు కోసం. అదీ మా పాయింట్. సార్, ఒక మంత్రి, మంత్రిమండలి ఉమ్మడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభలో మాట్లాడవచ్చా.. మీ ఆదేశం/ నిర్ణయం కోరుతున్నాను. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
అన్నదమ్ముల బంధం చెడపకండి
పార్లమెంట్లో ఏం జరిగింది- 12 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20-02-2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాల కొనసాగింపు. వెంకయ్య నాయుడు: గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజె క్టులు సీమాంధ్రకు, నెట్టెంపాడు తెలంగాణకు అత్యావ శ్యకం. ఈ బిల్లులో ఆ ఆరు/ఏడు ప్రాజెక్టుల విషయం, ప్రధానంగా కేటాయిం పులు జరపాలి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాం తాలు రెండూ కట్టు బడేలా, భవిష్యత్‌లో తగా దాలు రాకుండా వుండేలా చెయ్యాలి. కృష్ణా జలాల విషయమై అన్న దమ్ముల్లాంటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య గొడవలు రాకుండా ఒక యంత్రాంగాన్ని తయారు చెయ్యాలి. మళ్లీ వెనక్కి వస్తే బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, హెచ్‌సీఎల్, డిఫెన్స్ సంస్థలూ, దాదాపుగా అన్నీ హైద్రాబాద్‌లోనే వున్నాయి. ప్లానింగ్ కమిషన్ వారు, సీమాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు నెలకొల్పేలా ప్రభుత్వంతో చర్చించి పథకాల రూపకల్పన చెయ్యాలి. తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ అంతే వెనకబడి ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హైద్రాబాద్‌లో వున్న రైల్వేజోన్ తెలంగాణ ప్రాంత అవసరాలు తీరుస్తుంది. మేము సీమాంధ్ర- విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ప్రాంతాలను కలిపి కొత్త రైల్వే జోన్ కోరుకుంటున్నాం. సార్! ఇక ఇతర విషయాల్లోకి వస్తే, సరైన వాతావరణం ఏర్పడాలి. దురదృష్టవశాత్తూ భారత ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవటం లేదు. మొదటి సంవత్సరం సీమాంధ్రకు ఏర్పడబోయే ఆర్థిక లోటును భర్తీ చేయటానికి భారత ప్రభుత్వం రూ. 10,000 కోట్లు కేటాయించాలి. వాళ్లు ఈ విషయాన్ని ఫైనాన్స్ క మిషన్‌కు పంపించి, ఫైనాన్స్ కమిషన్ వారు రిపోర్టు పంపించేంత లోపుగా రాష్ట్రం ఇబ్బందులు పడకూడదు. అందువల్ల ప్రధాన మంత్రి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని ఉదారంగా సీమాంధ్రకు ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా హిమా చల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాటలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనకబడిన ప్రాంతాలకు కూడా పన్ను రాయితీలు, కేంద్ర సబ్సిడీలు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కు బంగారుగని వంటిది, యావత్ భారతదేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన ప్రాంతమైన హైద్రాబాద్‌ను కోల్పోతున్న సీమాంధ్ర ప్రాంతానికి సరైన నష్టపరిహారం అందాలి. సీమాంధ్రకు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్‘ ప్రకటిస్తే మాక్కూడా ఏదో జరుగుతుందనే నమ్మకం వారికి కలుగుతుంది. ఇక పరిస్థితుల్లోకి వస్తే, నేను అన్ని పార్టీలకూ మనవి చేస్తున్నా. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభజనకు సంబంధించిన ‘ఇమోషనల్’ అంశం. ఇద్దరూ తెలుగువారే- తెలంగాణకు చెందిన మిత్రులు, సీమాంధ్రకు చెందిన మిత్రులు - మనమందరమూ కలిసే వున్నాం. మనం ఒకే భాష మాట్లాడతాం. ‘‘అనేక భాషలు, వేషాలున్నా మన దేశం ఒకటే’’ (హిందీ) ‘‘భిన్నత్వంలో ఏకత్వం భారత్ యొక్క ఔన్నత్యం’’. కులం, జాతి, లింగ, ప్రాంత, మత వైరుధ్యాలకతీతంగా ఇండియా ఒక్కటే. మనమంతా ఒక దేశం. మనం దేశాన్ని విభజించటం లేదు. పరి పాలన సౌలభ్యం కోసం, త్వరితగతిన అభివృద్ధి కోసం ఒక రాష్ట్రాన్ని మాత్రమే విభజిస్తున్నాం. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇంతకు ముందు అనేక రాష్ట్రాల విభజన జరిగింది. అది మనసులో పెట్టుకుని, అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను పెరగనీయకూడదు. నేను రికార్డుని తేటతెల్లం చేయదలిచాను. దాదాపు అన్ని పార్టీలూ సీపీఐ (ఎం)తో సహా, ఎప్పుడో ఒకప్పుడు, రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపాయి. సీతారాం ఏచూరి: అది తప్పు. వెంకయ్యనాయుడు: అవును. ఆ విషయానికొస్తా. సీపీఐ(ఎం) వారు సమైక్య రాష్ట్రాన్నే మేము బలపరుస్తాం - అన్నారు. అయినా మీరు విభజిస్తామంటే మేము అడ్డం రాము అన్నారు. వైఎయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ‘‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభ జన కేంద్రం చేతుల్లో వుంది. మీరు చెయ్యాలంటే చెయ్యండి’’ అన్నారు. తెలుగుదేశం వారు ‘‘విభజన కావాలి కానీ ఇరు ప్రాంతాలకీ న్యాయం జరగాలి’’ అన్నారు. నేను కూడా అది ఒప్పుకుంటాను. ఈ విష యంలో నిజంగా నేరం చేసింది కాంగ్రెస్ పార్టీ. చూడండి నా మిత్రుడు చిరంజీవి నిలబడి ఉన్నారు. ఎందుకు? తన ప్రాంతానికి న్యాయం చేయ లేకపోతున్నారు... తన నియోజకవర్గానికి సమాధానం చెప్పుకోలేరు... అందువల్ల. ఈ అంకంలో ప్రధాన ప్రతినాయకుడు కాంగ్రెస్ పార్టీయే. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. సోనియా గాంధీ, టీఆర్ఎస్ నాయకుడూ వేదిక పంచుకున్నారు. 2004 నుంచి 14 వరకూ పదేళ్లు, ఏం చేశారని కాంగ్రెస్ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నా. ఇదే విభజన రెండేళ్ల క్రితమే మామూలుగా జరిగుంటే, ఈ స్థాయి పరిస్థితులు ఎదురయ్యేవి కావు. దురదృష్టవశాత్తూ, ఎన్నికల సందర్భంగా మీరీ పని చేస్తున్నారు. ఇంకో 45 రోజుల్లో, ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. సహజంగానే, ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ విషయమై ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ వారు, మంత్రులూ అందరికీ అదే ఆందోళన. అందుకే బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, అందర్నీ ఒప్పించి కలుపుకుపోయే విధంగా ప్రవర్తించవలసిన మంత్రి, బీజేపీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందంటూ ఆరోపిస్తారు! ఈ దేశంలో మాటకు కట్టుబడే జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే. మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం. సీమాంధ్ర అభివృద్ధికీ కట్టుబడి వున్నాం. సార్! కాంగ్రెస్సే ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి. ఆయన మీ నిర్ణయానికి వ్యతిరేకం. ప్రధాని ప్రతిపాదిస్తారు. ముఖ్యమంత్రి వ్యతిరేకి స్తారు. దీన్నేమంటారో కాంగ్రెస్ వివరించగలదా... మీ ప్రతిపాదన మీ సీఎం వ్యతిరేకిస్తారు. మీ పార్టీ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తారు. మీ సభ్యులు ‘వెల్’లోకి వస్తారు. మీ మంత్రులకి వారి భవిష్యత్ మీద చింత... వారూ ‘వెల్’లోకి వస్తారు. మీరు మాత్రం బీజేపీ మీద ఆరోపణలు చేస్తారు. ఎంత ధైర్యం. సార్, మా పార్టీ తెలంగాణ, సీమాంధ్రలలో ఒకేమాట మీదున్నాం. తెలంగాణ ఏర్పడాలి. సీమాంధ్రకు న్యాయం జరగాలి. అదే మా మాట. సార్- మమ్మల్ని రెచ్చగొట్టినా, మా ఆఫీసుల మీద దాడులు చేసినా మేము లెక్క చెయ్యలేదు. మేము మా ప్రిన్సిపుల్ మీదే నిలబడ్డాం. శాంతి యుతమైన సోదరభావంతో కూడుకున్న విభజన కోరుకున్నాం. సీమాంధ్ర ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. (తెలుగులో) తెలంగాణ సీమాంధ్ర బిడ్డలు శాంతియుతంగా కలిసి జీవించాలని కోరుకుం టున్నాను. డిప్యూటీ చైర్మన్: థాంక్యూ వెంకయ్యజీ, థాంక్యూ. వెంకయ్యనాయుడు: నేను కోరుకునేది శాంతి, సోదరభావంతో కూడిన విభజన. సమంజసమైన విభజన, మా నాయకుడు నరేంద్రమోదీ హైద్రాబాద్‌లో ఇటీవల జరిగిన మీటింగ్‌లో జై తెలంగాణ! జై సీమాంధ్ర అన్నారు. తెలంగాణ ప్రజలంతా కేరింతలు కొట్టారు. అలా ఉండాలి నాయ కత్వమంటే, ఈ దేశంలోనే అతి ఉన్నతమైన నాయకుడు లాల్ కృష్ణ అద్వా నీగారు, మా బీజేపీ నేత, ఈ విభజన ప్రజాస్వామ్యయుతంగా, శాంతియు తంగా జరగాలని కోరుకున్నారు- ఉన్మాద పద్ధతిలో కాదు! విషయం తిన్నగా చెప్తున్నా, మా పార్టీది ఒకేగళం. న్యాయం అడగటంలో తప్పులేదు. - ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
ఇంత అఘాయిత్యమా?
పార్లమెంట్లో ఏం జరిగింది -9 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 18.02.14 నాటి లోక్‌సభ సమావేశ వివరాల కొనసాగింపు... క్లాజ్ 49 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, మీ 48వ సవరణ, క్లాజ్ 49కి సంబంధించి, ప్రతిపాదిస్తున్నారా? ఒవైసీ: పేజీ 12లో 11-29 వరకు లైన్లు సవరించ ప్రార్థన. (ఆ లైన్లలో ఏముందో ఏమని సవరించాలో ఇచ్చిన వాక్యాలు 16 లైన్లు ఉన్నాయి. దీని తర్వాత ఒవైసీ క్లుప్తంగా సవరణ ఉద్దేశం వివరించారు. అందుకని ఈ 16 లైన్లు ఇక్కడ అనువదించి మీకందివ్వటం లేదు. క్లుప్తంగా నన్ను వివరించనివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు హైద్రాబాద్ రాష్ట్రముండేది. హైద్రాబాద్ హవుస్ అనే 8.79 ఎకరాలలో ఉన్న అత్యద్భుతమైన భవనాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ హవుస్ తీసు కున్నందుకు ప్రత్యామ్నాయంగా హైద్రాబాద్ రాష్ట్రానికి 19 ఎకరాల భూమినిచ్చింది. ఇప్పటి ఈ బిల్లు ప్రకారం - ఏపీ భవన్, పక్కనున్న బహామ్ హవుస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందు తాయి. ఇది తెలంగాణకు చేస్తున్న అన్యాయం కాదా? తెలం గాణా గొంతుకలు ఏమైపోయాయి? తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి, మీరిక్కడ నోరెత్తకుండా, తీవ్ర మైన అన్యాయం చేస్తున్నారు. కొంత మంది ముఖ్యమం త్రులవుదామనుకుంటున్న కాంగ్రెస్ వారు తెలంగాణా ఆస్తుల్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ 48వ సవరణ ఓటింగ్ కోరుతూ సభ ముందుంచుతున్నాను. ఒవైసీ: తలలు లెక్క పెట్టండి. ప్రపంచానికి తెలియాలి. సవరణ వీగిపోయింది. (ఇంక తలలు లెక్కపెట్టడం కూడా మానేశారు. ఇప్పటి దాకా కనీసం ఏవో లెక్క పెడుతున్నట్లు డ్రామా అన్నా చేశారు ఇప్పుడిక పూర్తిగా తెగించేశారు. అసలు లెక్కే పెట్టక పోతే, ఇక రాజ్యాంగానికి, చట్టసభలకీ, ప్రజాస్వామ్యానికీ అర్థముంటుందా?!) స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 49 బిల్లులో భాగమవుతుంది. ప్రతిపాదన ఆమోదించబడింది. క్లాజ్ 49 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 50 నుండి 54 వరకూ బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 55 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ క్లాజ్ 55కి మీ 49, 50 సవరణలు ప్రతిపాదిస్తున్నారా. (ర్రాష్ట్రాల అప్పులు ఏవిధంగా పంచాలి అనే విషయమై ఒవైసీ సవరణలు 12 లైన్లు ఇక్కడ రాయటం లేదు. ఆయన వివరణ చదివితే అర్థమయిపోతుంది.) ఇది చాలా అసమంజసం. జనాభాను బట్టి అప్పులెలా పంచుతారు? ఎక్కడ ఏ ప్రాజెక్టు వుందో దానిని బట్టి ఆ బకాయి ఆ రాష్ట్రానికి చెందాలి. అలా ప్రాజెక్టుల వారీగా అప్పు విడదీసిన తర్వాత, మిగిలిపోయిన రుణం రెండు రాష్ట్రాలకూ సమానంగా పంచాలి. ఈ విభజన చేసే పద్ధతే తప్పు. ఈ రుణాలు, అప్పులు ఎక్కడికెళతాయి? ఎవరు తీర్చాలి? ఇది తెలంగాణాకు అన్యాయం. ప్రభుత్వం ఈ క్లాజుకి ఎలా ఒప్పుకుంటోంది. తలలు లెక్క పెట్టమని మరొక్కసారి కోరుతున్నాను. స్పీకర్: ఒవైసీ గారి సవరణలు ఓటింగ్ నిమిత్తం సభ ముందుంచుతున్నాను. సవరణలు వీగిపోయాయి. ది క్వశ్చన్ ఈజ్. క్లాజ్ 55 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 56 నుండి 59 వరకు బిల్లుకు కలపబడ్డాయి. (ఇంక తలలు లెక్క పెట్టడం కూడా ఆపేశారు. విసుగు చెందని విక్రమార్కుడి లాగా అసదుద్దీన్ ఒవైసీ మాత్రం సవరణలు ప్రతిపాదిస్తూనే వున్నారు.) క్లాజ్ 60 = పెన్షనర్లు ఏ ప్రాంతానికి చెందిన వారిని, నేటివిటీ బట్టి ఆ రాష్ట్రానికి చెందినవారుగా చూడాలని క్లాజ్ 76 = పదవ షెడ్యూల్లోని సంస్థల సౌకర్యాల విభజన గురించి క్లాజ్ 78 = సర్వీసెస్ ఆప్షన్ల గురించి క్లాజ్ 84 = స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి క్లాజ్ 91 = ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని షెడ్యూల్ 8 = సింగరేణి కాలరీస్ గురించి షెడ్యూల్ 11 = ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి షెడ్యూల్ 12 = తెలంగాణ విద్యుత్ లోటు గురించి షెడ్యూల్ 13 = ఎన్టీపీసీ గురించి ప్లానింగ్ బోర్డులు, రీజినల్ బోర్డులు, హైద్రాబాద్ త్రాగునీరు, మెగాపవర్ ప్రాజెక్టులు, హైద్రాబాద్ ఓల్డ్ సిటీని వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించాలని, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం, ముస్లిం రిజర్వేషన్లు, ఉర్దూను రెండవ అధికార భాష, మైనారిటీల సంక్షేమం, వెనుకబడ్డ వర్గాల వారి లోకల్ బాడీ రిజర్వేషన్లు, వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీ, షెడ్యూల్ క్యాస్ట్ మరియు ట్రైబ్స్ సబ్‌ప్లాన్, మైనార్టీ సబ్‌ప్లాన్... ఒవైసీ సవరణలన్నీ, కనీసం తలల లెక్క కూడా పెట్టకుండా ‘వీగిపోయాయని’ ప్రకటించేశారు. 3 గంటల 24 నియొషాలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ 4 గంటల 24 నిమిషాలకు సభ వాయిదా పడటంతో ముగిసింది. ప్రొ॥సౌగత్‌రాయ్ అనే బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కూడా సస్పెండ్ చేసేసి వుండుంటే 3 గంటల 36 నిమిషాలకే సభ ముగిసిపోయేది! నిజానికి ‘‘2 నుంచి 109 క్లాజుల వరకూ మొత్తం అన్ని షెడ్యూళ్ళు సభ ముందు ఓటింగ్‌కు ఉంచుతున్నాను - సభ ఆమోదించింది’’ అని స్పీకర్ ప్రకటించటానికి రెండు నిమిషాలు చాలు.. కొన్ని సవరణలు ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది కాబట్టి ఇంకో పది నిమిషాలు పట్టి ఉండేది!! ప్రజాస్వామ్య భారతదేశంలో, రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఏర్పాటు చేయబడిన తర్వాత, మొట్టమొదటిసారి, అత్యున్నత సభ అయిన ‘లోక్‌సభ’లో ఇంతటి అఘాయిత్యం జరిగింది. సభలో ఎంతమంది రాష్ట్ర విభజనను సమర్థించారో, ఎందరు వ్యతిరేకించారో కూడా తెలియదు. సభలో ఎంత మంది సభ్యులున్నారు... నిజంగా ఓటింగ్ జరిగితే బిల్లు పాసవుతుందా... 13వ తారీఖున ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన ఎందుకు జరిగివుంటుంది. ఆ వివరాలన్నీ విశ్లేషించే ముందు, పెద్దల సభ రాజ్యసభలో ఏం జరిగిందో, ఎవరేం మాట్లాడారో చూద్దాం. 20-2-2015 నాడు రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు ఆపించలేదు. కాని గందరగోళంగా ఉన్న సభలో, ఎవరేం మాట్లాడుతున్నారో టీవీలో మనకు సరిగ్గా అర్థం కాలేదు! మాట్లాడుతున్న సభ్యుడి ముందుండే మైకుతో చెవిలో పెట్టుకునే ‘ఇయర్‌ఫోన్’కు వుండే ‘కనెక్షన్’ వల్ల, రిపోర్టర్లకి ఇతర సభ్యులకీ, సభాపతి అనుమతితో మాట్లాడే వారి మాటలు స్పష్టంగా వినబడతాయి. సభాపతి అనుమతి ఇవ్వగానే, ఆ సభ్యుని ముందుండే మైక్ పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇక రాజ్యసభ ‘తంతు’ పరిశీలిద్దాం! -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
విభజన బిల్లుపై ‘డిబేట్’ లేదు
ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్ గానీ అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో, ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా వెల్లడించి; ‘ప్రతిపాదన’ ఆమోదించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. పార్లమెంట్ ఉభయసభ లలో జరిగినటువంటి ఉదం తం పరిశీలించబోయే ముందు పార్లమెంట్ ఎలా నడవాలని రాజ్యాంగం కోరుకుందో, ఆ రాజ్యాంగానికి లోబడి ఏర్ప డిన రూల్స్ ఏం చెప్పాయో పరిశీలిద్దాం! భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 (1) ఉభయసభలలోగాని, ఉభయసభల ఉమ్మడి సమా వేశంలోగాని, ఏ ‘ప్రశ్న’ లేవనెత్తబడినా, ఆ ప్రశ్నకు సమాధానం ఆ సమయానికి సభలో హాజరై ఉన్న సభ్యు లతో ఓటింగ్ జరిపి, మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయించాలి. స్పీకర్ గాని, చైర్మన్ గాని; ఆ సమ యానికి ఆ బాధ్యత నిర్వహిస్తున్న వారుగాని ‘మొదట’ ఓటింగ్‌లో పాల్గొనకూడదు. ఒకవేళ ఇరుపక్షాల వారికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు స్పీకర్ / చైర్మన్ కూడా తమ ఓటింగ్ హక్కు వినియోగించవచ్చును. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 118 (1) పార్లమెంట్‌లోని ఉభయసభలూ, ఈ రాజ్యాంగం లోని అంశాలకు లోబడి, తమ తమ సభలు నడుపుకో వాల్సిన నియమాలూ, నిబంధనలూ (రూల్స్-రెగ్యులే షన్స్) రూపొందించుకోవచ్చును. ఆర్టికల్ 118కి లోబడి, లోక్‌సభ ఏ విధంగా నడు చుకోవాలో ‘రూల్-బుక్’ తయారు చేయబడింది. ఆ రూల్-బుక్‌లో ‘డివిజన్’ ఎలా జరపాలో, మెజారిటీ అభిప్రాయం ఎలా రికార్డు చెయ్యాలో, ఆ అభిప్రాయా నికి కట్టుబడి స్పీకర్ సభా నిర్ణయాన్ని ఎలా ప్రకటిం చాలో స్పష్టంగా నిర్దేశించబడింది. రూల్ 367 రూల్స్ బుక్ లోక్‌సభ ‘డివిజన్’ చేసే విధానం 1. ఇరుపక్షాల వాదనలూ (డిబేట్) పూర్తయిన తర్వాత, స్పీకర్ ‘ప్రశ్న’ను సభ ముందుంచి, ఎంత మంది అనుకూలమో వారు ‘ఆయ్’ అనమని, ఎంత మంది వ్యతిరేకమో వారిని ‘నో’ అనమని ఆహ్వానిస్తారు. (‘డిబేట్ అంటే, ఇరుపక్షాల వాదనలూ! ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం డిబేట్ నిర్వచనం: సభలో కానీ, చట్ట సభల్లో కానీ, పరస్పర విరుద్ధ వాదనలు సభముందు ఉంచబడతాయి. సాధారణంగా ఈ వాదనలు ‘ఓటింగ్’ తో ముగుస్తాయి! డిబేట్ పూర్తయిన తర్వాత మాత్రమే స్పీకర్ ప్రశ్నను సభ ముందుంచాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై మాత్రం డిబేట్ జరగలేదు. హోంమంత్రి షిండే, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, మరో మంత్రి జైపాల్‌రెడ్డి గార్లు మాత్రమే మాట్లాడారు. ముగ్గురూ విభజనను సమర్థిస్తున్న వారే! వ్యతిరేకిస్తున్న వారికెవ్వరికీ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. యూపీఏని సమర్థిస్తున్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ వారికి గాని, సీపీఎం వారికి గాని, ఎన్డీఏలోని శివసేన, బీజేపీ, జేడీ(యూ) తదితరులెవ్వ రికీ విభజన బిల్లుని వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.) 367 (2) ‘ఆయ్’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ, ‘నో’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ బట్టి స్పీకర్ అంచనా వేసుకుని, ‘ఆయ్’ ఎక్కువ మంది అనో, ‘నో’ అన్నవారు ఎక్కువ మంది అనో ప్రకటిస్తారు. ఆ ప్రకటనకు సభ నుంచి ఏ రకమైన వ్యతిరేక స్పందనా లేకపోతే రెండుసార్లు ‘ఆయ్’లు అధికం అనో, స్పీకర్ సభ నిర్ణయం ‘ఆమోదించబడింది’ అనో, ‘వ్యతిరేకించబడింది’ అనో సభా నిర్ణయం ప్రకటించాలి. 367 (3)(ఎ) ‘ఆయ్’లు ఎక్కువో ‘నో’ ఎక్కువో స్పీకర్ ప్రకటించినప్పుడు, స్పీకర్ అభిప్రాయాన్ని సవాల్ చేస్తే, స్పీకర్ ‘లాబీ’ ఖాళీ చెయ్యమని ఆదేశిం చాలి. (‘లాబీ’ అంటే లోక్‌సభ వరండా... అక్కడిదాకా మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర స్టాఫ్ వెళ్లడా నికి అనుమతి ఉంది. స్పీకర్ ఆదేశాల మేరకు, ఓటింగ్ జరపడానికి వీలుగా ‘లాబీ’ ఖాళీ చేయిస్తారు.) (బి) ఆ తర్వాత, మూడు నిమిషాల ముప్పై సెకన్లు సమయం గడిచిన తర్వాత, మరోసారి ‘స్పీకర్’ ప్రశ్నను మళ్లీ సభముందు చదవాలి. మళ్లీ అనుకూలురు ‘ఆయ్’ అనమని, వ్యతిరేకులు ‘నో’ అనమని కోరాలి. (సి) స్పీకర్ మళ్లీ ప్రకటించిన తర్వాత కూడా ఆ నిర్ణయాన్ని సభ్యులెవరైనా సవాల్ చేస్తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’-‘నో’ ముద్రించబడిన స్లిప్పులు సభ్యులకందించి అభిప్రాయం తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’ సభ్యులు లాబీ (వరండా)లో ఒకవైపునకు ‘నో’ సభ్యులు మరొకవైపునకు వెళ్లమని ఆదేశించాలి. ఒకవేళ అనవసరంగా ‘డివిజన్’ (ఓటింగ్) అడుగు తున్నారు అని స్పీకర్ భావించినట్లయితే , ‘ఆయ్’ (అను కూలురు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి ‘నో’ (వ్యతిరేకులు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి - సభా నిర్ణయం ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై ‘డివిజన్’ (ఓటింగ్) అనవసరంగా అడుగుతున్నారని స్పీకర్ భావించారు. 367(3)సికి అనుబంధంగా రాయబడిన ‘తలలు లెక్కపెట్టే’ పద్ధతిని ఎంచుకున్నారు. (ఈ విధంగా ‘డివిజన్’ నిరాకరించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ‘కౌల్ అండ్ షక్దర్’ ప్రాక్టీసు అండ్ ప్రొసీ జర్ ఆఫ్ పార్లమెంట్ బుక్‌లో చూశాను. 1955లోనూ 1956లో ఒకసారి మాత్రమే ‘డివిజన్’ నిరాకరించటం జరిగింది.) మొట్టమొదటి లోక్‌సభ జరుగుతున్నప్పుడు, 1955 లోనూ 1956లోనూ, స్పీకర్ ‘డివిజన్’ నిరాకరించి అధికార పక్షానికి అనుకూలంగా ‘ఆమోదం’ ప్రకటించ టం జరిగింది. ఆ రోజుల్లో, కాంగ్రెస్ సభ్యులు 364 మంది, కమ్యూనిస్టు 16, సోషలిస్టు 12, కిసాన్ మజ్దూర్ పార్టీ 9, పీడీఎఫ్ 7... మొత్తం 409 మంది సభ్యులలో 364. అంటే మూడింట రెండొంతుల మెజారిటీతో, అవసరమనుకుంటే ‘రాజ్యాంగ సవరణ’ కూడా ఒక్క కాంగ్రెస్ వారే చేసేయగలిగిన స్థాయిలో సంఖ్యాబలం కలిగి ఉన్నారు. 28.7.55న ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ (ఎమెండ్మెంట్) బిల్లుకు ప్రతిపాదించబడిన సవరణ విషయమై ‘డివిజన్’ నిరాకరించబడింది. సవరణకు అనుకూలంగా కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారని, వ్యతిరేకంగా చాలా ఎక్కువ మెజారిటీ ఉందని ప్రకటిస్తూ డిప్యూటీ స్పీకర్ సవరణ వీగిపోయి నట్లు ప్రకటించారు. 19.4.1956న అప్పటి హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్, గతంలో ప్రవేశపెట్టిన 6వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి సభ అనుమతి కోరారు. కొన్ని మార్పులు చేసి మళ్లీ బిల్లు ప్రవేశపెడతా మని కూడా చెప్పారు. ‘నో’ డివిజన్ కావాల్సిందే... మాకు సరైన నోటీసివ్వలేదన్నారు, ప్రతిపక్ష సభ్యులు. ‘ఆయ్’ ఎక్కువ మంది ఉన్నారు. అయినా ఇంత చిన్న విషయాలలో ‘డివిజన్’ కోరి సభాసమయాన్ని వృథా చేయటం కరెక్ట్ కాదు అన్నారు స్పీకర్. 1. ‘మూజువాణి’ అనే పదం ఉర్దూ భాషకు చెంది నది. మూహ్జుబానీ అంటే నోటితో వ్యక్తపరిచేది. ‘ఆయ్’ అనో ‘నో’ అనో నోటితో చేసే ధ్వని ద్వారా ఫలితం నిర్ణయించబడితే, దానిని మూజువాణి ఓటుతో ప్రతిపాదన ఆమోదించబడిందనో, వీగి పోయిందనో ప్రకటిస్తారు. 2. డివిజన్ - అంటే విభజించమని కోరటం. సభా ధ్యక్షులు మూజువాణి ఓటుతో ప్రతిపాదన వీగిం దనో, గెలిచిందనో ప్రకటించినప్పుడు సభ్యు లెవ్వరూ ఆ ప్రకటనతో విభేదించకపోతే, వాయిస్ ఓటు (మూజువాణి ఓటు)తో అధ్యక్షుని ప్రకటన ఆమోదించబడినట్లే... ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్‌గాని అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా ప్రకటించి ‘ప్రతిపాదన’ ఆమో దించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ ఏ సభలోనైనా, ఏ అంశంలోనైనా సభాభిప్రాయం తేలవల్సింది ‘డివిజన్’ ద్వారానే! వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్‌కుమార్ -
'హోదాతోనే సమస్యలు పరిష్కారం కావు'
-
'హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నగరంలోని మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశాన్ని నీతిఆమోగ్ పరిశీలిస్తోందని తెలిపారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నా వారు ఇంకా సహాయం కావాలని అడుగుతున్నారంటూ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే అయిందని, తమ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలుచేస్తున్నామని వెంకయ్య చెప్పారు. -
‘హోదా’ పోరు.. ఆగదు సత్యం
రాష్ట్రం సమతుల్యతతో అభివృద్ధి చెందడం ప్రత్యేక హోదాతోనే సాధ్యం. రాజ్యాంగబద్ధమైన హక్కులుగా హోదా, ప్రత్యేక ప్యాకేజీల విధివిధానాలు నిర్దేశితం కావాలి. అవి నేరుగా జిల్లాలకే అందేటట్లు కార్యాచరణ సాగాలి. ప్రత్యేక హోదా ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు గొప్ప వరం. ఈ అంశం పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కానిది. బిహార్‌కు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి లేని అడ్డంకులు ఏపీ ప్రత్యేక హోదాపైనే ఎందుకు వస్తున్నాయి? వెంకయ్యనాయుడు, మోదీ, చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాజకీయ కారణాలతో ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాం గ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు తత్పర్యవసానంగా తెలుగు ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సి వచ్చేసరికి పలాయన మంత్రం పఠి స్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాను, ఏడు వెనుకబడిన జిల్లాలకు (రాయల సీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు) ప్రత్యేక ప్యాకేజీని, జాతీయ ప్రాజె క్టుగా పోలవరం పరిపూర్తికి పార్లమెంటు సాక్షిగా అవి హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, విభజన చట్టంలో ప్రత్యేక హోదాను నమోదు చేయలేదని, అదే నేడు ప్రత్యేక హోదాను ప్రకటించడానికి కేంద్రానికి ప్రధాన అడ్డంకిగా మారిందని బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దబాయిస్తున్నారు. ఆయనే స్వయంగా నాటి బీజీపీ ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని నరేంద్ర మోదీతో కలసి తిరుపతి తదితర ఎన్నికల సభల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి పది సంవత్సరాల ప్రత్యేక హోదాను ఇచ్చి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. నేడు కాంగ్రెస్‌పై నెపం నెట్టేస్తూ వెంకయ్య నాయుడు తెలు గు ప్రజలను వంచించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రెండు కేంద్ర బడ్జెట్ గడి చినా పోలవరానికి కనీసం రూ.400 కోట్లయినా కేటాయించని కేంద్రం తీరుకు అర్థం ఏమిటి? ప్రత్యేక ప్యాకేజీకి జిల్లాలు ఏడికి నామమాత్రంగా రూ.350 కోట్లు దులపరించడంలోని అంతరార్థం ఏమిటి? ఏపీ ప్రజల ఇక్కట్లపై కేం ద్రం, వెంకయ్య నాయుడు కారుస్తున్నవి మొసలికన్నీళ్లనే కదా! ‘హైదరాబాద్’ గుణపాఠం మరిచారా? గత ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతుల, డ్వాక్రా మహిళల, నేతన్నల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతివంటి వాగ్దానాలను గుప్పించారు. వాగ్దానాలను అమలు పరచకపోవడం చంద్రబాబు నైజం అనుకున్నా... కేంద్రం కూడా అదే చేస్తోందెందుకు? నేడు రాష్ట్ర పరిస్థితి అత్యంత ఆందోళన కరంగా ఉంది. బడ్జెట్ లోటు భర్తీకి రూ.22,112 కోట్లు, రాజధానికి రూ.15, 175 కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, విశాఖ, విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలకు రూ.16,000 కోట్లు, వీటికి తోడు కడప స్టీల్ ఫ్యాక్టరీకి చేయాల్సిన సహాయాన్ని కలుపుకుంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ను హఠాత్తుగా కోల్పోవడంతో నేటి ఏపీ ఆర్థిక స్వావలంబనను కోల్పోయింది. మొత్తంగా అభివృద్ధి అంతా ఒక్క హైద రాబాద్ చుట్టూనే కేంద్రీకరించడం వల్ల కలిగిన నష్టం ఎంత తీవ్రమైనదో నేడు మనకు తెలిసివస్తోంది. అడ్డగోలు విభజన దుష్ఫలితాల భారాన్ని 13 జిల్లాల తెలుగు ప్రజలు మోయాల్సివస్తోంది. ఆ చేదు అనుభవం నుంచి ముఖ్య మంత్రి చంద్రబాబు గుణపాఠాలు ఏమీ నేర్చుకోలేదు. మళ్లీ అభివృద్ధినంత టినీ రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరిస్తున్నారు, అది కూడా కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని బంగారం పండే లక్ష ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ, సమీకరణల పేరిట లాక్కుని మరీ రాజధానిని నిర్మించడానికి నడుం బిగిం చారు. రాజధాని అంటే పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకునే పట్టణం. అందుకోసం ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేసి, అభివృద్ధినంతటినీ కేవలం రెండు జిల్లాలకు పరిమితం చేయాలనుకోవడం ముందు ముందు అనర్థదాయక పరిణామాలకు దారితీసేది. ‘హోదా’తోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి రాష్ట్రం సమతుల్యతతో అభివృద్ధి చెందడం హోదాతోనే సాధ్యం. రాజ్యాంగ బద్ధమైన హక్కులుగా ఆ హోదా, ప్రత్యేక ప్యాకేజీల విధివిధానాలు నిర్దేశితం కావాలి. అవి నేరుగా జిల్లాలకే అందేటట్లు ఆచరణ సాగాలి. ఉదాహరణకు వెనుకబడిన ఏడు జిల్లాలలో అనంతపురం జిల్లా వైశాల్యం రీత్యా పెద్దది. ఇక్క డ 25 లక్షల ఎకరాలలో వర్షాధారిత వ్యవసాయం సాగుతోంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు అదే విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతోంది. ఈ రెండు ప్రాంతాలకు జిల్లా ప్రాతిపదికపై నిధులను కేటాయిం చలేం. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మొత్తం సాగు భూమి అనంతపురం జిల్లా సాగు భూమికి సమానం. కాబట్టి అనంతపురం జిల్లాలో, మొత్తంగా రాయలసీమ జిల్లాల్లో సాగునీటి, తాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉండి, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు నిరంతర కరువు పీడిత ప్రాంతాలు. వాటికి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీల అమలు తీరు ఎలా ఉండాలి? ఆ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పథకాలేమిటి? వివరంగా చర్చించాలి. కొనసాగుతున్న సేద్యపు నీటి ప్రాజెక్టులకు కూడా కేంద్ర నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాల ప్రజ లకు గొప్ప వరం. ఇంతటి ప్రాముఖ్యతగల అంశం పట్ల చంద్రబాబు ప్రదర్శి స్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కానిది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని క్లాజు 94(1) రెండు రాష్ట్రాల పరిశ్రమల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి పన్ను మినహాయింపులుసహా తగు ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని పేర్కొంది. కాగా, 94(2) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి భౌతిక, సాంఘిక మౌలిక సదుపాయాల కల్పనసహా అవసరమైన ఇతర కార్యక్రమాలను అది చేపడుతుందని స్పష్టం గా కేంద్రం బాధ్యతలను నిర్వచించాయి. కేంద్రం ఆ పనిచేయకపోవడమే కాదు, చంద్రబాబు ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తిలోదకా లిచ్చి మళ్లీ అభివృద్ధి కేంద్రీకరణకు పట్టంగడుతోంది. పట్టిసీమ ప్రచార ప్రహసనం చంద్రబాబు ఆలోచనలన్నీ రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. రాజధాని ఆయనకు ఒక వ్యాపార సంస్థ, తన ఆర్థిక వృద్ధికి ఒక రాజకీయ సోపానం. ఒక్క రాజధాని కోసమే పట్టిసీమ పథకం చేపట్టారు. అది ఎంత లోపభూ యిష్టంగా, ఎంత దిగజారుడుతనంతో సాగిందో కూడా చూశాం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్ర నిధుల సాధన కోసం చంద్రబాబు చేసిన కృషి శూన్యం. పైగా పోలవరం నిర్మాణం క్లిష్టమయ్యేలా ఎగువ రాష్ట్రా లతో తగాదాలను కొనితెచ్చే పట్టిసీమను చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపా రుల చవుకబారు వ్యాపార ప్రచారంలా చంద్రబాబు సింగపూర్‌లో తాను గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించానని చెప్పుకోవడాన్ని మించిన సిగ్గుచేటుతనం మరొకటి లేదు. పైగా కరువు పీడిత ప్రాంతంలోని ఎత్తిపోతల పైపులను హంద్రీ-నీవా నుంచి రాత్రిపూట దొంగతనంగా హడావుడిగా పట్టి సీమకు తరలించడాన్ని మించిన వంచన, కుటిల నీతిని మనం ఎరుగం. ఇదంతా రాయలసీమను ఉద్ధరించడానికేననడం సీమవాసులను మరింత అపహాస్యం చేస్తోంది. అసలు రాష్ట్రవ్యాప్తంగా సమతుల్యతతో కూడిన అభి వృద్ధికే ఆయన విముఖుడనడానికి ఆయన వెనుకబడిన ప్రాంతాల విద్యా ర్థులకు తీవ్ర నష్టం కలిగించేలా జారీ చేసిన 120 జీవోనే నిదర్శనం. ‘హోదా’కు అడ్డంకి బాబు, కేంద్రాలే 13 జిల్లాల ప్రజలందరి సంతులిత సర్వతోముఖాభివృద్ధి కూడా రాజ ధాని అభివృద్ధితో పాటూ జరగడమే అత్యంత ముఖ్య అంశం. ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి గత ఏడాదిన్నరగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వివిధ ఆందోళనల్లో ఈ సంతులిత అభివృద్ధి, ప్రత్యేకహోదాలే కేంద్రాంశాలు. ప్రత్యే కహోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి అది మరచి, పర్సెం టీజీల వేటలో మునిగితేలుతున్నారు. బిహార్‌కు లక్షా 50 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడానికి లేని అడ్డంకులు ఏపీకి ప్రత్యేక హోదాపైనే ఎం దుకు వస్తున్నాయి? బిహార్ ప్యాకేజికి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ అను మతులున్నాయా? వెంకయ్యనాయుడు, మోదీ, చంద్రబాబు తెలుగు ప్రజ లకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో నేడు ప్రత్యేక హోదా కోసం జరు గుతున్న పోరును పోలీసు బలగంతో నిలువరించాలని ప్రయత్నిస్తున్న బాబు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? ప్రత్యేకహోదా కోసం జరగాల్సిన తిరుపతి సభకు అనుమతిని నిరాకరించడం, విశాఖపట్టణంలో నిషేధాజ్ఞలు విధించడం, గుంటూరు సభకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం హోదా ఉద్య మాన్ని నిరోధించాలని చేస్తున్న కుటిల ప్రయత్నం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వెంకయ్యనాయుడు, చంద్రబాబులు నిలువరించలేరు. రాష్ట్ర విభజనలో వంచనకు గురయ్యామని గుర్తించిన తెలుగు ప్రజలు 13 జిల్లాల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు. ఏపీ హక్కు ప్రత్యేక హోదాను నిరాకరిస్తున్న బీజీపీ, తెలుగుదేశాలకు కూడా అటు వంటి గుణపాఠమే చెప్పడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389 - ఇమామ్ -
ఏపీకి ఎన్ఐడీఎం హుళక్కే!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి ష్టాత్మక ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం... విపత్తుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు రూపొందించే, ప్రాంతీయ కేంద్రాలను పర్యవేక్షించే కీలకమైన ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉన్నా దానికి అవసరమైన హంగులేమీ లేవు. చిన్న కార్యాలయంలోనే ఇది నడుస్తోంది. సువిశాల తీరప్రాంతమున్న ఏపీలో పూర్తిస్థాయి ఎన్ఐడీఎం కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి ఢిల్లీలోని ప్రస్తుత కార్యాలయాన్ని ప్రాంతీయ కేంద్రంగా మార్చాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు స్థలం కేటాయించాలనీ రాష్ట్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో జాతీయ విపత్తు సహాయదళం(ఎన్డీఆర్ఎఫ్) కోసం గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుని జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిర్మాణ పనులు ఆరంభించినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకోవడంపై సంబంధిత అధికారులు కినుక వహించారు. ‘ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమిని నిర్మాణ పనులు ఆరంభించిన తర్వాత వెనక్కు తీసుకోవడం ఏమిటి? మరెక్కడా రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి లేదా?’ అని కేంద్ర హోంశాఖ అధికారులు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఐడీఎంకు స్థలం కేటాయింపులోనూ జాప్యం చేయడంతో ఏపీలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న ఢిల్లీలోనే కొంతకాలం కొనసాగించి తర్వాత అవసరమైతే వేరే రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం. రాష్ట్రానికి వచ్చిన సంస్థను పోగొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును అధికారులు తప్పుబడుతున్నారు. గన్నవరం మండలంలో... గన్నవరం మండలంలో వంద ఎకరాల్లో ఎన్ఐడీఎం, 50 ఎకరాల్లో ఎన్డీఆర్ఎఫ్, 50 ఎకరాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ కోరింది. తదుపరి కేంద్రం ఎన్ఐడీఎం విషయంలో నిర్ణయం మార్చుకున్నందున దీనికి పది ఎకరాలే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. -
రూటు మార్చిన టీఆర్ఎస్!
కేంద్రంతో ఢీ అంటే ఢీ * రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళం * రాష్ట్ర ఆకాంక్షలపై నిత్య నిరసన * కేంద్రంలో చేరికకు దారులు మూసుకుపోవడమే కారణమా? సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. గత నెల 21వ తేదీన ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ను పరిశీలిస్తున్న వారు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు తయారైన విధానం, పార్టీ అధినేత కేసీఆర్‌తో వారు జరిపిన భేటీలు, ముందస్తు వ్యూహం వంటి అంశాలను గమనిస్తే రూటు మార్చిన టీఆర్ఎస్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై గట్టిగానే నిలదీస్తున్నారు. గత ఏడాది అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక కేంద్రంతో టీఆర్ఎస్ కొంత దూరమే పాటించింది. కానీ కొద్ది నెలలు గడిచాక గులాబీ నేతలు కేంద్రంతో అంటకాగడానికే అత్యధిక పాధాన్యం ఇచ్చారు. ఈ కార ణంగానే టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరుతోందన్న ప్రచారమూ జోరుగా సాగింది. మొదట్లో దూరం పాటించి, ఆ తర్వాత దగ్గరైన తీరు ఈ వార్తలకు బలం చేకూర్చిం ది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, అవసరాల దృష్ట్యా అవకాశం వస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరడానికీ సిద్ధమేనని ఆ పార్టీ ఎంపీలు ఒకరిద్దరు బహిరంగంగానే ప్రకటించారు. మరో వైపు ప్రధానిమోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర రాజధాని వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్ ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. వాస్తవానికి స్వచ్ఛ భారత్ జరిగినప్పుడు కనీసం పట్టించుకోలేదు. రాష్ట్ర్రాభివృద్ధి కోసం కేంద్రంతో స్నేహ సంబంధాలే కొనసాగిస్తామని గులాబీ నాయకత్వం ప్రకటనలు గుప్పించింది. ఒక విధంగా టీఆర్ఎస్ ఇన్నాళ్లూ రాజీధోరణినే ప్రదర్శించింది. కానీ, పార్లమెంట్ సమావేశాలు వేదికగా రూటు మార్చింది. విభజన చట్టం అమలు పేర పోరాటం రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో కేంద్రం పట్టింపు లేని తనంపై గళమెత్తుతున్న టీఆర్ఎస్ వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు గెడైన్స్ ఇచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, తదితర అంశాలపై పట్టుబడుతోంది. ప్రధానంగా రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టింది. పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు వాదిం చారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో కేంద్రంతో అమీతుమీకి దిగారు. ఈ కారణంగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు టీఆర్ఎస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం కూడా జరిగిందంటున్నారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో టీఆర్ఎస్ ఎంపీలు విజయం సాధిం చారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోవడం వల్లే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరసలో ఉన్న పొలిటికల్ జేఏసీ.. రాష్ట్ర విభజన పూర్తిగా జరగలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని ఇస్తున్న ప్రకటనలతో కూడా టీఆర్ఎస్ ముందే మేల్కొని, కేంద్రంపై కాలుదువ్వుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
22, 23 తేదీల్లో కమలనాథన్ కమిటీ భేటీ
మరో పది శాఖల్లో ఉద్యోగుల పంపిణీ, అభ్యంతరాల పరిష్కారంపై చర్చ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ 22, 23 తేదీల్లో సమావేశం కానుంది. 22న మరో పది శాఖలకు చెందిన విభాగాల్లో ఉద్యోగులను పంపిణీ చేయనుంది. 23న ఉద్యోగుల అభ్యంతరాల పరిష్కారంపై చర్చించనుంది. కమిటీ ఇప్పటికే 94 శాఖలకు చెందిన 14,229 మందిని పంపిణీ చేసింది. ఇంకా పోలీసు శాఖలో 22 వేల మంది, వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల మంది, ఇతర చిన్న శాఖల్లో మరో 6 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన 50 వేల మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులను పంపిణీ చేస్తే ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుంది. -
వారంలో ఐఏఎస్‌ల విభజన
న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన అంశంపై ఏపీ, తెలంగాణ అధికారులతో శుక్రవారం జరిగిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. 2014 సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ భేటీకి తెలంగాణ తరుపున సీఎస్ రాజీవ్ శర్మ హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ తరుపున ఐఏఎస్ అధికారిణి వీణా ఈష్ హాజరయ్యారు. దీంతో వారం పది రోజుల్లోగా ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజన పూర్తి చేయనుంది. -
‘పునర్విభజన’ వివాదాలపై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టంలోని నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని గతంలోనే కేంద్రం సూచించింది. దీనిని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోకుండా తలో దారిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థల విభజనతో పాటు వాటిలో పనిచేసే ఉద్యోగుల పంపిణీలో వివాదాలకు న్యాయస్థానం ద్వారా తెరదించాలని కేంద్రం భావిస్తోంది. ఇంటర్మీడియెట్ బోర్డు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున షెడ్యూల్ 9, 10లో సంస్థల అంశాలనూ అదే న్యాయస్థానం ముందుంచాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలను జారీ చేయించిన పక్షంలో రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందనే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడగా ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. షెడ్యూల్ 9లో 89 సంస్థలున్నాయి. ఈ సంస్థల నిధులు, ఉద్యోగుల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంస్థల పంపిణీకి జనాభా నిష్పత్తి ప్రకారం అంగీకరిస్తోంది. కొన్ని సంస్థలకు ససేమిరా అంటోంది. అలాగే ఈ సంస్థల్లో ఉద్యోగుల పంపిణీని స్థానికత ఆధారంగా చేయాలని టీ సర్కారు పట్టుపడుతుండగా జనాభా నిష్పత్తి ప్రకారమే జరగాలని ఏపీ ప్రభుత్వం పట్టుపడుతోంది. షెడ్యూల్ 10లో 107 సంస్థలుండగా అదనంగా మరో 35 సంస్థలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ సంస్థలకు చెందిన నిధులు, ఉద్యోగుల పంపిణీలోనూ వివాదాలు నెలకొన్నాయి. కొన్ని సంస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, మరి కొన్ని సంస్థల్లోని నిధులను స్తంభింప చేసింది. ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఇవన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడంతో పాటు కొత్తగా ఈ సంస్థలను తాము ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపైనా కేంద్రం చేతులెత్తేసింది. ఈ వివాదాలన్నింటినీ న్యాయస్థానం ముందుకు తీసుకువెళ్లి పరిష్కరింప చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. -
అభ్యంతరాలు తేలేవరకు సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ విభజన జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన విభాగం ఇప్పటికే 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే వారిలో కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలను పరిష్కారం చేసేవరకు ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగానైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం సూచించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫైలును సర్క్యులేట్ చేసింది. ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనిని రిలీవ్ చేయడానికి వీలుండదు. అలాగే ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించిన పక్షంలో అభ్యంతరం లేకపోతే అతనిని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా రిలీవ్ చేయాలంటే ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేనందున... ఆ అభ్యంతరాలు పరిష్కారం అయ్యేవరకు తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టును సృష్టించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి జీత భత్యాలను కూడా ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా మార్చి నెలవరకైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఫైలు ద్వారా కోరింది. ఇలా ఉండగా రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన మొత్తం 118 విభాగాలకుగాను ఇప్పటివరకు రాష్ట్ర పునర్విభజన విభాగం 100 విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను జారీ చేసింది. అందులో ఇప్పటివరకు 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసింది. పంపిణీ పూర్తి చేస్తూ 56 విభాగాలకు చెందిన ఉద్యోగులతో నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా 30 విభాగాలకు చెందిన ఉద్యోగుల పంపిణీకి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇంకా 14 విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు రావడానికి మరికొంత సమయం ఉంది. ఈ నెలాఖరులోగా ఆ విభాగాలకు చెందిన ఉద్యోగుల ఆప్షన్లను పరిశీలించి ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయనున్నారు. -
విభజన హామీలన్నీ అమలవుతాయి : కేంద్ర మంత్రి గెహ్లాట్
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ తప్పకుండా అమలవుతాయని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు ఆంధ్రప్రదేశ్ సహకారం అవసరమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై వెంకయ్యనాయుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయాలో అవి తప్పకుండా చేస్తారని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వికలాంగ విద్యార్థులకు విదేశాలల్లో చదువుకునేందుకు అతి తక్కువ వడ్డీపై రూ.30 లక్షల రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో జాతీయ వికలాంగుల కేంద్రాన్ని రూ. 50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నెల్లూరులో మానసిక వికలాంగుల పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. -
ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే!
‘పవర్’ పంపకాలకు రంగం సిద్ధంఆస్తుల విభజన ముసాయిదాకు ఏపీ జెన్కో బోర్డు ఆమోదం హైదరాబాద్: విద్యుత్ సంస్థల ఉమ్మడి ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఏపీ ఉత్పాదక సంస్థ పాలక మండలి(అవిభక్త రాష్ట్రంలోని ఏపీ జెన్కో బోర్డు) ఆమోదించింది. దీన్ని కేంద్రం నియమించిన షీలాబిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీకి సమర్పించింది. ఈ వివరాలను బుధవారం అధికారవర్గాలు విడుదల చేశాయి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం 2014 మే 31న విడుదల చేయడం, దీనిప్రకారం బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించే బాధ్యతలను కేపీఎంజీ సంస్థకు అప్పగించడం తెలిసిందే. కేంద్రచట్టానికి అనుగుణంగా కేపీఎంజీ రూపొందించిన ముసాయిదాను ఏపీజెన్కో ఆమోదించడంతో ఓ అంకం ముగిసింది. అయితే ముసాయిదాపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు తమ అభ్యంతరాల్ని నిపుణుల కమిటీకి తెలపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించాక కమిటీ తుదినిర్ణయం తీసుకుంటుంది. అయితే కమిటీ కాలపరిమితి ఈ నెల 31వరకే ఉంది. దీన్ని కేంద్రం పొడిగించే అవకాశముంది. మొత్తంమీద మరో ఆరు నెలల్లో ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. తెలంగాణకే అప్పులు, ఆస్తులు.. ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే వెళ్తున్నాయి. అవిభక్త రాష్ట్రంలో ప్రతిపాదిత విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. కేటీపీపీ-2, లోయర్ జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, ఎగువ జూరాల.. ఇలా మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. స్థానికతనుబట్టి ఇవన్నీ తెలంగాణకే చెందుతాయి. కాబట్టి వీటి నిర్మాణానికి తీసుకున్న అప్పులన్నీ ఆ రాష్ట్రమే భరించాలని ముసాయిదా పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టుల స్థిరాస్తులన్నీ తెలంగాణకే సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీపీపీ-4 మాత్రమే నిర్మాణ దశలో ఉంది. దీని వ్యయం, స్థిరాస్తిని ఆ రాష్ట్రఖాతాలో చేర్చారు. ఫలితంగా రూ.7,168 కోట్లున్న నిర్మాణ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,201 కోట్లు, తెలంగాణకు రూ.4,967 కోట్లుగా విభజించారు. జెన్కో ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు, యంత్రసామాగ్రీ తెలంగాణలోనే ఉన్నందున స్థిరాస్తులు(ఇప్పుడున్నవి, కొత్త ప్రాజెక్టులు) రూ.12,748 కోట్లు ఉంటే.. ఇందులో ఏపీకి రూ.4,947 కోట్లు, తెలంగాణకు రూ.7,801 కోట్లు చొప్పున వాటా దక్కుతుంది. ఈ ప్రకారం మూలధనం, ఆదాయం, దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు, ఇతర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ఎక్కువగా ఉంటాయి. -
విడిపోయాక ఆగిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సామాన్యుల జీవితాల్లో ఇప్పటివరకు మార్పేమీ కానరాలేదు. కానీ రైల్వే శాఖ మాత్రం ఓ నిజాన్ని వెల్లడించింది. అదేంటంటే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు రాకపోకలు తగ్గాయట. అది కూడా మామూలు సంఖ్యలో కాదు. జూన్ 2014 నుంచి అక్టోబర్ 2014 మధ్య ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికులు తగ్గారట. ఆసక్తికరంగా ఉంది కదూ. మరో విషయమేంటంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో బస్సుల బంద్ కారణంగా.. బస్సుల్లో ప్రయాణించాల్సిన వారంతా రైల్వేను ఆశ్రయించారట. 70 లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో తమ గమ్యాలు చేరుకున్నారట. అయితే బందులన్నీ ముగిసిన తరువాత 2014లో మళ్లీ ఈ 70 లక్షల మంది ప్రయాణికులు రోడ్డు రవాణాను ఎంచుకున్నారట. ఈ గణాంకాలన్నీ ఇటీవల రైల్వే శాఖకు సంబంధించిన స్థాయీ సంఘం లోక్‌సభకు సమర్పించిన నివేదికలో కనిపించాయి. -
విభజన ప్రక్రియను వేగవంతం చేయండి
కమల్‌నాథన్‌కు గ్రూప్-1 ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తే అది సంపూర్ణ తెలంగాణ కాదని, తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల విభజన ఉందని గ్రూప్-1 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అరవింద్‌రెడ్డి, శశిధరాచారి, శరత్చంద్ర, సుధాకర్‌రెడ్డి అన్నారు. కమల్నాథన్ను కలసిన అనంతరం వారు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన ఉద్యోగ విభజన ప్రక్రియను చేపట్టాలని కమల్నాథన్ను కోరినట్లు వెల్లడించారు. -
ఉమ్మడి హైకోర్టును విభజించండి
సీఎంలు-సీజేల సదస్సులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున సదస్సుకు హాజరు జూన్ 2 కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటై పది నెలలు పూర్తయ్యాయని, ఇకనైనా విభజన చట్టం మేరకు హైకోర్టు విభజనకు చర్యలు చేపట్టాలన్నారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన రాష్ట్రాల సీఎంలు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తెలంగాణ సీఎం కేసీఆర్ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు హైకోర్టులు ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. హైకోర్టు విభజన డిమాండ్‌పై న్యాయవాదులు 45 రోజులపాటు సమ్మెచేశారని, ఎంపీల ప్రతినిధి బృందం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలసి వినతిపత్రం సమర్పించినా ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్నారు. హైకోర్టు విభజనకు ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరాలు లేవనెత్తకపోవడం, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా హైకోర్టు విభజనకు సానుకూలత తెలపడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2 నాటికి ఏడాది పూర్తికానున్న సందర్భంలోనైనా హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు హైకోర్టులు పనిచేయడానికి వీలుగా సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలో సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి ప్రధాని మోదీ, సదానందగౌడకు లేఖలు అందించిన విషయాన్ని ఇంద్రకరణ్ ప్రస్తావించారు. హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి హైకోర్టు సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసి సభ్య కార్యదర్శితోపాటు అవసరమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల పదవీవిరమణ అనంతరం సౌకర్యాలు, ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. హైకోర్టు ప్రతిపాదించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మహిళలు, పిల్లలపై దాడుల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటును పరిశీలిస్తున్నామని, కేంద్రం నిధులివ్వకున్నా రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి సదానందగౌడను కలసి హైకోర్టు విభజన జూన్ 2 కల్లా పూర్తి చేయాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి చంద్రబాబే సహకరించట్లేదు విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడంలేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణకు విద్యుత్ కేటాయింపులు, నీటి విడుదలలో ఏపీ సహకరించట్లేదని ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం తొలగిపోయాక హైకోర్టు నిర్మాణం చేస్తామని బాబు చెబుతున్నారని...కానీ వ్యాజ్యం ఎవరు, ఎవరి ప్రోత్సాహంతో వేశారో చూడాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు వనరులు పెంచుకోడానికి వాహనాలపై ప్రవేశపన్ను వసూలు చేస్తున్నామని, కావాలంటే ఏపీ ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేసుకుని వనరులు పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. వాహనాల పన్నులు వసూలు చేయకూడదనే ఒప్పందం విభజన చట్టంలో లేదన్నారు. జూలై 14 నుంచి గోదావరి పుష్కరాల నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. -
హైకోర్టు విభజనపై ముగిసిన ఏపీ వాదనలు
-
హైకోర్టు విభజనపై ముగిసిన ఏపీ వాదనలు
హైదరాబాద్: హైకోర్టు విభజనకు సంబంధించి బుధవారం హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదనలు పూర్తి అయ్యాయి. విభజన చట్టం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టత రావాల్సి ఉందని ఏపీ తన వాదనలలో పేర్కొంది. అలాగే విభజన చట్టం నిబంధనల మేరకు హైకోర్టు ఏర్పాటుకు తాము సిద్ధమేనని స్పష్టం చేసింది. కాకుంటే హైకోర్టు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని రాష్ట్రపతి నోటిఫై చేయాల్సి ఉందని ఏపీ గుర్తు చేసింది. అయితే హైకోర్టు విభజనపై మధ్యాహ్నం తర్వాత కేంద్రం తన వాదనలు వినిపించనుంది. -
హామీలన్నీ అమలు చేయాలి: వైఎస్ జగన్
* విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు మీరు జోక్యం చేసుకోవాలి * ప్రధాని మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో జగన్మోహన్రెడ్డి బృందం విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదాను అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం సాయంత్రం ప్రధానమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం.. రేస్‌కోర్స్ రోడ్ 7లో కలసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా అధర్మంగా విభజనకు గురైన తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఇక్కట్లకు గురవుతోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రస్తుత ఏపీ రాష్ట్రానికి పారిశ్రామిక పునాది లేదు. ఐటీ రంగం మొత్తం హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉంది. ఏపీలో ఐటీ రంగం లేకుండా పోయింది. మౌలిక వసతులు, ఉన్నత విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన రాజధాని నగరం మాకు కాకుండా పోయింది. కేంద్రం నుంచి భారీ మొత్తంలో సాయం అందకపోతే మాకు రాజధాని ఏర్పడే పరిస్థితి లేదు. ఒకవైపు భారీగా రెవెన్యూ లోటు ఉండగా.. మరోవైపు కొత్త రాజధాని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అందువల్ల మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయడానికి మీరు జోక్యం చేసుకోవాలి’’ అని ఆ వినతిపత్రంలో కోరింది. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... ప్రత్యేక ప్యాకేజీ మరిన్ని జిల్లాలకు ఇవ్వండి.. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరాపుట్ - బొలాంగిర్ - కలహండి (కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని నాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ ఇటీవల కేంద్రం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది చాలా నామమాత్రమైన కేటాయింపు. మరోవైపు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చే పథకమైన బీఆర్‌జీఎఫ్‌ను రద్దు చేశారు. అలాగే.. ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయం జిల్లాలకు కూడా ఈ ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వాలి. రాజధానికి భారీగా నిధులు కేటాయించాలి.. కొత్త రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న విషయాన్ని, కేంద్రం ఏమేర ఇస్తుందని, ఎప్పటిలోగా ఇస్తుందన్న విషయాలనూ విభజన చట్టంలో చెప్పలేదు. అయితే.. సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలి తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. అయితే 2015-16 కేంద్ర బడ్జెట్లో ఇందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాజధాని నిర్మాణానికి భారీగా నిధులివ్వాలని కోరుతున్నాం. విద్యాసంస్థలను త్వరితగతిన నిర్మించండి.. రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహాలో బోధనాసుపత్రి వంటి సంస్థలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రో వర్సిటీ, ట్రైబల్ వర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలను కూడా త్వరితగతిన ఏర్పాటుచేయాలని కోరుతున్నాం. రైల్వే హామీలన్నీ నెరవేర్చండి.. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుచేస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలు హామీ ఇచ్చింది. అలాగే కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర నగరాలకు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీని ఏర్పాటుచేస్తామనీ హామీ ఇచ్చింది. కానీ ఈ దిశగా ఏ చర్యలూ తీసుకోలేదు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం. ప్రాణహిత, దుమ్ముగూడెంలను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి... పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 10, 12, 13 షెడ్యూళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ వీలైనంత త్వరగా నెరవేర్చాలని కోరుతున్నాం. వీటికి తోడుగా ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టును, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని కోరుతున్నాం. అలాగే తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. స్పెషల్ స్టేటస్ అమలు చేయండి.. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ‘13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు స్పె షల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తాం...’ అని హామీ ఇచ్చారు. ఈమేరకు 2014 మార్చిలో ఏపీకి స్పెషల్ స్టేటస్ అమలుచేయాలని కేంద్ర కేబినెట్.. నాటి ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిని సత్వరం అమలు చేయాలని కోరుతున్నాం. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రం ఇటీవల రూ. 500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటిం చింది. కొత్త రాష్ట్రం సమస్యలను ఇది ఎంతమాత్రం తీర్చలేదు. అందువల్ల వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయగలరు. హిమాచల్, ఉత్తరాఖండ్‌ల తరహా రాయితీలు ఇవ్వాలి... ‘కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా పన్ను ప్రోత్సాహకాలు సహా సముచితమైన ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటుంది..’ అని విభజన చట్టంలోని సెక్షన్ 94(1)లో పేర్కొన్నారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఏపీకి కూడా ప్రకటించండి. అలాగే.. పన్ను ప్రోత్సాహకాలను కేవలం వెనుకబడిన జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల రాష్ట్రానికి ఎంతమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే 974 కి.మీ. పొడువు గల కోస్తాతీరం వెంట అంతర్జాతీయ స్థాయి ఓడరేవులున్నాయి. పెట్టుబడులు పెట్టేవారు నౌకాశ్రయాలకు సమీపంలోనే పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అందువల్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించండి. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలను పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటి అమలుతో పాటు.. చిత్తూరు జిల్లాలోని ఎన్టీపీసీ - బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయండి. ‘పట్టిసీమ’ నిలిపివేతకు ఆదేశించండి పోలవరం నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయండి ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సహాయ, పునరావాస కార్యక్రమాల అమలు ఖర్చుతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి హడావుడిగా శంకుస్థాపన చేయటం ఎందుకో అంతుపట్టని విషయం. పట్టిసీమ లిఫ్ట్ వల్ల పోలవరం ప్రాజెక్టును పూర్తిగా మూలన పెట్టేస్తారన్న బలమైన అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. పైగా.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు రెండో చాప్టర్ క్లాజ్-7లో.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే అంశంతో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుందని.. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తే, అధికంగా మళ్లించిన నీటినీ మూడు రాష్ట్రాలకు అదే దామాషాలో పంచాలని.. నిబంధనలు ఉన్నాయి. వీటిపై ఉన్న భయాలు నిజమైతే.. గోదావరి నుంచి చుక్కనీరు మళ్లించక ముందే, రాష్ట్రం 70 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అదీగాక.. పట్టిసీమ లిఫ్ట్ నుంచి కృష్ణా నది వరకు ఎక్కడా నీటి నిల్వకు అవకాశం లేదు. సాంకేతికంగా ఇన్ని అనుమానాలు, భయాలు ఉండగా.. పట్టిసీమ టెండర్‌ను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్రపడింది. తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి 21.9 శాతం అధిక వ్యయానికి కాంట్రాక్టు కట్టబెట్టింది. పట్టిసీమ లిఫ్ట్ కోసం భారీగా ప్రజా ధనాన్ని వృథా చేయడానికి బదులుగా.. పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని మీకు (కేంద్ర ప్రభుత్వానికి) విజ్ఞప్తి చేస్తున్నాం. సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం.’’ సింగపూర్ కంపెనీలకు 10 వేల ఎకరాలు ఉచితమట..! విభజన చట్టంలోని సెక్షన్ 94 (4) ప్రకారం రాజధాని అవసరాలకు డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నుంచి, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. బహుళ పంటలు సాగయ్యే దాదాపు 30,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎందుకు సేకరిస్తోందో అంతుపట్టని పరిస్థితి. ఇదే గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. పైగా వార్తాపత్రికల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం సింగపూర్‌లోని పలు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతోందని.. ఆ కంపెనీలకు దాదాపు 10వేల ఎకరాల భూమిని ఉచితంగా కట్టబెడతారని తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆ కంపెనీలు ఉచితంగా రాజధానిని నిర్మించి ఇస్తాయట. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అటు చట్టసభల్లో గానీ, ఇటు బయట గానీ చర్చించే ందుకు నిరాకరిస్తోంది. కొత్త రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చాం. అయి తే బహుళ పంటలు అందించే వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కోవడాన్ని.. వేలాది మంది రైతుల జీవనోపాధి దెబ్బతీసే ఈ చర్యలను మేం వ్యతిరేకిస్తున్నాం. -
'విభజన చట్టంలోని ప్రతి హామీ అమలుకు ప్రయత్నిస్తాం'
గుంటూరు: విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు నగరంలో రమేష్ కార్డియాలజి ఆసుపత్రిని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లురుతోపాటు చుట్టుపక్క నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ రాజధాని ఏర్పాటవుతుందని అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలలో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు మరన్ని రావాలని... అవి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని ప్రభుత్వమే చేయాలన్న ఆలోచన నుంచి జనం బయటకు రావాలని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు. -
ఔర్ ఏక్ దక్కా.. హైకోర్టు పక్కా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది మాసాలవుతోంది. తెలంగాణ కోర్టుల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు మాత్రం తెలంగాణలో ఉన్నట్లుగా భావించడం లేదు. పేరుకు మాత్రం హైదరాబాద్ హైకోర్టు. పరిపాలన చేస్తున్నది మాత్రం ఆంధ్ర న్యాయమూర్తులు, ఉద్యోగులు, న్యాయవాదులు. ఆధిపత్యం వాళ్లదే. ఇది ఒక్క హైకోర్టులోనే కాదు. అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్ నగరంలో రెండు సచివాలయా లు ఇద్దరు ముఖ్యమంత్రులూ పనిచేస్తూ ఉండగా రెండు హైకోర్టులు ఏర్పాటు చేయకపోవడానికి కార ణమేమిటో బోధపడదు. రెండు హైకోర్టుల ఏర్పాటు కు ప్రస్తుత హైకోర్టు భవన సముదాయం సరిపో తుంది. ప్రస్తుతం ఉన్న భవనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చి, హైదరాబాద్ హైకోర్టును వేరే భవ నంలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమం త్రి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. కానీ ఆ దిశగా ఎలాంటి చలనం కనిపించడం లేదు. రాజ్యాంగంలో అధికరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి హైకోర్టు విధిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయా రాష్ట్రాలు ఏర్పడిన రోజునే కొత్త హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చట్టంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయేంతవరకు హైదరాబాద్ హైకోర్టు రెండు రాష్ట్రాలకు కలిపి ఉంటుంది. అధికరణ 233లో చెప్పి నట్టుగా రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టు కాదు. పంజాబ్, హరియాణా పరిస్థితి వేరు. అది అధికరణ 233 ప్రకారం ఏర్పడిన ఉమ్మడి హైకోర్టు. హైదరా బాద్ హైకోర్టు పరిస్థితి వేరు. ఇది తాత్కాలిక వ్యవస్థ. దీన్ని ఇంకా కొనసాగించడం భావ్యం కాదు. తెలంగాణలో ఆంధ్రా న్యాయమూర్తుల దగ్గర పనిచేస్తున్న న్యాయవాదులు చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దాని ఫలితమే మం చిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన సంఘటనలు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడుతుంది. కానీ సుప్రీం కోర్టు, ఉమ్మడి హైకోర్టు సంసిద్ధత తెలియజేయా లన్న సాకుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరగ లేదు. ఆంధ్రా, తెలంగాణ న్యాయవాదులు ఇరు వురూ తమ హైకోర్టులు తమకు కావాలని కోరుకుం టున్నారు. అయినా కోర్టులు ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించడం లేదు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీన్ని ప్రభుత్వాలు వీలైనంత త్వరగా తొలగించాలి. రెండు రాష్ట్రాలకి ప్రత్యేక హైకోర్టులను తక్షణం ఏర్పాటు చేయాలి. ఇదిలా ఉంటే న్యాయమూర్తుల పరిస్థితి మరో లా ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 77 (2) ప్రకారం రెండు రాష్ట్రాలు ఆవిర్భవించిన తేదీ తర్వాత ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకు కేటాయిం చాలి. అన్ని విభాగాల్లో అలా కేటాయింపు జరుగు తున్నా, న్యాయవ్యవస్థలో అలాంటి సూచనలు కూడా కనబడటంలేదు. హైకోర్టులో రిజిస్ట్రార్లు అం దరూ ఆంధ్రా ప్రాంతం వారే. తెలంగాణ జిల్లాల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారూ పరి శేష ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లే. పదవీ విరమణ చేసి రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న న్యాయమూర్తులూ ఆంధ్రావాళ్లే. తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 25 శాతం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త నియామ కాలు చేపట్టడానికి హైకోర్టు అడుగులు వేసింది. ఇది అగ్నికి ఆజ్యం పోయడమే. రాష్ట్రంలో 220 జిల్లా న్యాయమూర్తులకు గానూ 38 మంది, 200 మంది సీనియర్ సివిల్ జడ్జీలకి గానూ 44 మంది, 500 మంది జూనియర్ న్యాయమూర్తులకు గానూ 150 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు. మొదటి నుంచీ అన్యాయానికి గురైంది వీరే. తెలంగాణ రాష్టంలో తెలంగాణ న్యాయవాదు లు, న్యాయమూర్తులు, ఉద్యోగులు గత 4 రోజులు గా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ కోర్టుల్లో ప్రవేశించడానికి మరో దేశం నుంచి వస్తున్న కాందిశీకుల్లా రావాల్సివస్తోంది. న్యాయమూర్తుల సంగతి సరేసరి. మాట్లాడలేరు. మాట్లాడి బతకలేరు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఒక్క న్యాయ వాదుల శక్తి సరిపోదు. ప్రజాసంఘాలు రాజకీయ జేఏసీలు, రాజకీయపక్షాలూ కలసికట్టుగా పనిచే యాలి. ‘ఔర్ ఏక్ దక్కా రెండు హైకోర్టులు పక్కా’. న్యాయవ్యవస్థలో తెలంగాణకు అన్యాయం జరుగు తున్న ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాందిశీకు ల్లా బతుకుతారో, సొంత రాష్ట్ర వాసుల్లాగా బతుకు తారో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎల్. విక్రంరెడ్డి న్యాయవాది, వరంగల్ -
‘హోదా’పై నిమ్మకు నీరెత్తారెందుకు?
బీజేపీ, టీడీపీలపై మేకపాటి మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.శనివారమిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మార్గమైన రీతిలో కాంగ్రెస్ విభజించిందని, అందుకు బీజేపీ మద్దతునిచ్చిందని, తానే విభజనకు మొట్టమొదటిగా ఓటు వేశానని టీడీపీ చెప్పిందని, అలాంటపుడు విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చకుండా గాలికెందుకు వదిలేశారని ప్రశ్నించారు. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిస్తే, ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి తామే వస్తాము కనుక పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని మేకపాటి గుర్తు చేశారు. ఇపుడు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అందరి ఆమోదం కావాలని చెప్పడం, మరలా ప్రత్యేకహోదా కోసం కృషి చేస్తున్నామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. రాష్ట్రం చీల్చేయడానికి ప్రధాన కారణం సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీయేనని మేకపాటి తప్పుపట్టారు. వారే ఇపుడు ప్రత్యేక హోదాకోసం ఆందోళన చేస్తామనడం విచిత్రంగా ఉందన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవట్లేదని దుయ్యబట్టారు. కృషి చేస్తోంది వైఎస్సార్సీపీ ఒక్కటే... విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పోరాడుతోంది వైఎస్సార్సీపీ ఒక్కటేనని మేకపాటి అన్నారు. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే మే 19న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని గుర్తుచేశారు. అలాగే జూన్ 11న రెండోసారి, తాజాగా కూడా ఢిల్లీ వెళ్లి ఆర్థిక, హోం, రైల్వే శాఖల మంత్రులను కలసి రాష్ట్రానికి న్యాయం చేయాలని, రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కూడా ఈ బడ్జెట్లో చేర్చాలని విన్నవించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటుగా విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల సాధనకు తమ పార్టీ పార్లమెంటులో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. -
చట్ట ప్రకారమే బ్యాంకులకు లేఖలు
- హైకోర్టుకు తెలిపిన తెలంగాణ విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకే ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాల స్తంభన నిమిత్తం బ్యాంకులకు లేఖలు రాశామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. తాము రాసిన లేఖపై ఎస్బీహెచ్ శాంతినగర్ శాఖ మాత్రమే సానుకూలంగా స్పందించిందని, ఆంధ్రా బ్యాంకు తమ లేఖను పెడచెవిన పెట్టిందని వివరించింది. తమ బ్యాంకు ఖాతాను ఎస్బీహెచ్, శాంతినగర్ శాఖ స్తంభింప చేయడంపై ఏపీ ఉన్నత విద్యా మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ విద్యాశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అదనపు కార్యదర్శి ఎ.కనకదుర్గ కౌంటర్ దాఖలు చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలి హైదరాబాద్‌లో ఉన్నందున దానిపై అధికారం టీ సర్కారుకే ఉంటుందన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు టీ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని, కాబట్టి ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు రూ.100 కోట్లు అవసరమవుతాయన్న ఏపీ మండలి వాదనలో వాస్తవం లేదన్నారు. టీ సర్కార్ అనుమతి లేకుండా ఏపీ మండలి బ్యాంకు ఖాతాలను నిర్వహించడంతో పాటు, నిధులను విత్‌డ్రా చేస్తోందని ఆమె తెలిపారు. అందువల్ల ఏపీ మండలి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. -
'విభజనహామీల్ని తక్షణం అమలు చేయాలి'
తూర్పుగోదావరి : విభజన చట్టంలోని హామీలను కేంద్రం తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. హామీల అమలుకు అవసరమైన పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడేది లేదన్నారు. హామీల అమలుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళితులు అన్ని కులాలు, వర్గాలతో కలిసి రాజ్యాధికారసాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతోద్యోగాలు పొందిన వారంతా తమ పిల్లలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతో ప్రజల్లోకి రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కోటి పంగనామాలు పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేస్తే ప్రజలు హర్షిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు కృష్ణమాదిగ కుయుక్తులు పన్నడం ఇకనైనా మానుకోవాలన్నారు. లేని పక్షంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన వర్గీకరణను కృష్ణమాదిగ భుజాన వేసుకోవడం తన ఉనికిని కాపాడుకునేందుకేనని, దాని వల్ల ప్రయోజనం లేదన్న సత్యాన్ని అందరూ గ్రహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొండాడ నూకరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నల్లి రాజేష్, సీమాంధ్ర ఇన్చార్జ్ కొంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. (మామిడికుదురు) -
10వ షెడ్యూల్‌పై ఏపీతో అమీతుమీ!
- ఆ షెడ్యూల్లోని సంస్థలు తెలంగాణలో ఉంటే అవి మావే - జోక్యం చేసుకోకుండా ఏపీని ఆదేశించాలని హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్ - ధర్మాసనానికి నివేదించిన సింగిల్ జడ్జి - ఏపీ విద్యామండలి బ్యాంకు కేసు కూడా ధర్మాసనానికే హైదరాబాద్: విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల విషయంలో ఏపీతో అమీతుమీ తేల్చుకోడానికి టీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉంటే వాటిపై పూర్తి హక్కులు తమవేనని, వాటి విషయంలో జోక్యం చేసుకోకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ధర్మాసనానికి నివేదిస్తూ న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఏపీ ఉన్నత విద్యామండలికి చెంది న బ్యాంక్ ఖాతా నిలిపివేత కేసును కూడా ధర్మాసనానికి నివేదిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ కూడా బుధవారం విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ ఆధారంగా తమ బ్యాంకు ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) శాంతినగర్ శాఖ నిలిపివేయడాన్ని (ఫ్రీజ్) సవాలు చేస్తూ ఏపీ మండలి హైకోర్టులో పిటిషన్ వేయడం, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీ మండలిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11కు జస్టిస్ భట్టీ వాయిదా వేయడం తెలిసిందే. బుధవారం వ్యాజ్యం విచారణకు రాగానే... అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తన వాదన వినిపించారు. ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ అభిప్రాయం కోరిన జస్టిస్ భట్టీ, ఆయన అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనంతరం 10వ షెడ్యూల్లోని సంస్థల హక్కులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ విలాస్ పుర్కర్ ముందుకొచ్చింది. ఏపీ మండలి పిటిషన్‌ను జస్టిస్ భట్టీ ధర్మాసనానికి నివేదించారని న్యాయమూర్తికి ఏజీ రామకృష్ణారెడ్డి వివరించారు. దాంతో ఈ వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనానికే జస్టిస్ పుర్కర్ నివేదించారు. -
హైకోర్టుకు విభజన సెగ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజణ జరిగి ఇప్పటికే ఏడు నెలలైనా ఇప్పటికీ చాలా విభాగాలు ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. అందులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్లైనా హైకోర్టు విభజన ప్రకియ ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనంగా తమ నిరసన తెలియజేశారు. -
ఆ టీమ్ లో నేను లేను: శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. సిద్ధాంతపరంగా తాను సెక్యులర్ వాదినని చెప్పారు. తనది బీజేపీతో సిద్ధాంతరపరమైన ఘర్షణ పడే విధానమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలన్న పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం ఆసక్తిగా లేనట్టుందన్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు, నాయకులు అప్రమత్తం కావాల్సిన అవసరముందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 12న అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే కాంగ్రెస్ టీమ్ లో ప్రస్తుతం తానులేనని, టీమ్ లో ఉన్నవారు ఆ పనిచేయాలని శశిధర్ రెడ్డి అన్నారు. -
'సవరణలు ఎమ్మెల్సీ సంఖ్యకు పరిమితం కావడం బాధాకరం'
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టసవరణ కేవలం ఎమ్మెల్సీల సంఖ్య పెంచేందుకు పరిమితం కావడం బాధాకరమని ఎంపి వినోద్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర అన్నారు. విభజన చట్టానికి అనేక సరవరణలు ప్రతిపాదిస్తున్నట్లు వారు తెలిపారు. వాటన్నిటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలన్నారు. పోలవరం ముంపు మండలాలు, భద్రాచలం ఆస్తులు తదితర అంశాలపై సవరణలు చేయాలని వారు కోరారు. -
సోనియాకు ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్’ బహూకరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో 2004 వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ వాయిస్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ డా. కెప్టెన్ పాండురంగారెడ్డి రాసిన ‘స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకాన్ని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా.చిన్నారెడ్డిలు సోనియాగాంధీకి అందజేశారు. శుక్రవారం టెన్ జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డాక్టర్ పాండురంగారెడ్డి విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు.‘ కెప్టెన్ పాండురంగారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన పీహెచ్డీ థీసిస్‌ని పుస్తక రూపంలోకి తెచ్చిన ‘స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను సోనియాగాంధీకి అంకితమిచ్చారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అందజేయాలనుకున్నాం. బిజీగా ఉండడంతో శుక్రవారం కలిసి అందజేశాం’అని తెలిపారు. -
విభజన పూర్తయ్యేదాకా పీఆర్సీ లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న పదో వేతన సవరణ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పదో పీఆర్సీ నివేదికను వేతన సవరణ సంఘం గత మేలో గవర్నర్ నరసింహన్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. జూన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు కాగానే... గవర్నర్ ఆ నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పీఆర్సీపై పెద్దగా ఒత్తిడి చేయని ఉద్యోగ సంఘాలు ఇప్పుడిప్పుడే వేతన సవరణ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెడుతున్నాయి. తనను కలసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బడ్జెట్ సమావేశాల తరువాత పీఆర్సీ సంగతి చూద్దామని సీఎం చెప్పడంతో తాజాగా ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే.. తెలంగాణ, ఏపీ మధ్య ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప.. వేతన సవరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. పదో వేతన సవరణకు సంబంధించి ఒకటే కమిషన్ రెండు రాష్ట్రాలకు సిఫార్సులు చేసిందని.. ఇప్పుడా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగుల విభజన కంటే ముందే ఇక్కడి ప్రభుత్వం వేతన సవరణపై ఒక నిర్ణయం ప్రకటిస్తే... తర్వాత విభజనలో ఇక్కడి వారు ఆ రాష్ట్రానికి, అక్కడివారు ఇక్కడికొస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఉద్యోగుల విభజన పూర్తికాకుండా వేతన సవరణ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఆర్థిక శాఖలో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నందున వేతన సవరణ కష్టమని అభిప్రాయ పడ్డారు. -
జీహెచ్ఎంసీని విభజించాలి: మర్రి శశిధర్‌రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నగరంలో పెరుగుతున్న జనాభా, వారి అవసరాల దృష్ట్యా... దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ ఎంసీని విభజించాలని తెలిపారు. జనాభా దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీ కార్పొరేషన్ కూడా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయాన్ని మర్రి శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. జాప్యమైన సర్వే డివిజన్ల పునర్ విభజన ప్రక్రియ శాస్త్రీయంగా చేపట్టాలని ప్రభుత్వానికి మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. జీహెచ్ ఎంసీ పాలక వర్గం పదవి కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. త్వరలో జీహెచ్ ఎంసీకి ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ను విభజించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనిపై ఇంకా ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. అయితే కార్పొరేషన్ విభజించాలని పలు రాజకీయ పక్షాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
రెండు రాష్ట్రాలా.. నాలుగు రాష్ట్రాలా?
* కృష్ణాజల వివాదాల్లో రాష్ట్రాల పరిధిపై నేడు మరోమారు బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై గురువారం మరోమారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివాదాలకే విచారణను పరిమితం చేయాలా, మహారాష్ట్ర, కర్ణాటకలను చేర్చాలా అన్న దానిపై ట్రిబ్యునల్ అందరి వాదనలు విననుంది. ఇందులో కేంద్రం వెల్లడించే నిర్ణయమే కీలకం కానుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. దీనిపై గతంలో జరిగిన విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ఏపీ, తెలంగాణలు నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరపాలని కోరగా, కర్ణాటక, మహారాష్ట్ర వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం చేసే నిర్ణయం కీలకంగా మారింది. దీనిపై గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన కేంద్రం, రెండు రాష్ట్రాలకే విచారణను పరిమితం చేయాలని తెలిపింది. నివేదిక రూపంలో అభిప్రాయాన్ని చెప్పాలని ట్రిబ్యునల్ సూచించినా అది జరుగలేదు. కాగా, కృష్ణా జలాలపై బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే నెల 1 న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
రూ.1.50 లక్షల కోట్ల అప్పులు పంపకం
* పంపకానికి రెండు రాష్ట్రాల సుముఖత * అకౌంటెంట్ జనరల్ వద్ద అంగీకారం * 58 : 42 లెక్కన విభజన * ఆర్ఐడీఎఫ్, ఉద్యోగుల పీఎఫ్నిధి రుణాలపై కుదరని ఏకాభిప్రాయం * మరిన్ని వివరాలు కోరిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల్లో ప్రస్తుతానికి 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు రెండు రాష్ట్రాలకు పంపిణీ కానున్నాయి. విభజన చట్టం ప్రకారం ఈ అప్పులను ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతంగా పంపకం చేయనున్నారు. అయితే ప్రాజెక్టుల వారీగా లేదా ఒక ప్రాంతంలో ఖర్చు చేసిన వాటికి మాత్రం ఇరు రాష్ట్రాలకు కాకుండా ఏ ప్రాంతంలో ఆ నిధులు వినియోగిస్తే.. ఆ రాష్ట్రమే రుణాలు భరించాలని రెండు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి. అకౌంటెంట్ జనరల్ వద్ద జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. కాగా, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకున్న అప్పులపై మరిన్ని వివరాలను టీ సర్కార్ కోరినట్లు సమాచారం. విదేశీ రుణాలున్నా.. అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే కావడంతో.. వాటిని కేంద్ర అప్పులుగా చూపించనున్నారు. ఇటీవల ఏజీ వద్ద జరిగినసమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌కల్లం, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులు పాల్గొన్నారు. ఈ అప్పుల్లో లక్ష కోట్లకుపైగా నిధులను బహిరంగ మార్కెట్ నుంచి రుణాల రూపంలో తెచ్చుకున్నారు. అలాగే జాతీయ పొదుపు రక్షణ నిధి (ఎన్ఎస్ఎస్ఎఫ్) నుంచి తెచ్చుకున్న నిధులు ఆరేడు వేల కోట్ల రూపాయల మేరకు ఉంటాయని అంచనా. కేంద్రం ద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో.. కొన్ని ప్రాజెక్టులకోసం ప్రత్యేకంగా వ్యయం చేసినందున, అలాంటి వాటిలో ఆ ప్రాజెక్టు ఎక్కడ ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా అంగీకారం కుదిరింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్ఐడీఎఫ్), అలాగే చిన్నమొత్తాల పొదుపు నిధులను కూడా ఏయే ప్రాంతంలో ఎంత ఖర్చు చేశారన్న అంశంపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు కోరినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం పంపిణీకి ఇబ్బందిలేని రుణాలే లక్షన్నర కోట్ల వరకు ఉంటాయని లెక్క తేల్చారు. ఇవి కాకుండా వివాదాస్పదం అనుకున్న రుణాలు మరో 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారిక వర్గాలు వివరించాయి. వివిధ వృత్తి సంఘాల సమాఖ్యలకు ఇచ్చిన రుణాల్లో కూడా.. ఈ సమాఖ్యలు ఎక్కడ రుణాలు ఇచ్చాయన్న విషయాన్ని తేల్చిన తరువాత వాటిని పంపిణీ చేయాలని ఇరుపక్షాలు కోరినట్లు సమాచారం. -
ఓపెన్ స్కూల్ సొసైటీ ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలోని ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు విభజిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో సూచించిన దామాషా ప్రకారం ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
రాష్ట్రానికి కాపలా ఉంటా!
* పునర్విభజన చట్టం హక్కుల కోసం పోరాడుతాం: జానా * సీఎల్పీ పదవి ఎవరడిగినా ఇచ్చేస్తా.. 2019 ఎన్నికల నాటికి రిటైర్ అవుతా * అంతా కోరుకుంటే.. ఎమ్మెల్యే కాకున్నా, సీఎం కాలేనా? అని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వచ్చే కష్టాలేమిటో తమకు తెలుసని, అందుకే పునర్విభజన చట్టంలో అన్ని హక్కులు కల్పించామని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన తమ బాధ్యతల నుంచి పారిపోబోమని, ఆ హక్కులను సాధించేందుకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రానికి కాపలాగా ఉంటానని జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించిన జానారెడ్డి.. అనంతరం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తీర్మానంలో మా ప్రమేయం లేదు సభలో ఒకరిది పైచేయి అంటూ ఏమీ ఉండదని, తమకు ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ఏమీ లేదని జానారెడ్డి చెప్పారు. ‘‘ఏది పడితే అది మాట్లాడను. అవసరమైనప్పుడే మాట్లాడతా. విద్యుత్ తీర్మానంలో మా ప్రమేయం లేదు. మేం ప్రభుత్వానికి, టీఆర్ఎస్కు కాదు.. ప్రజలకు మద్దతుగా వారి పక్షాన ఉంటాం. ముందు లెక్కలు తేల్చండి. ఏపీ ఎంత వాడింది..? తెలంగాణ ఎంత వాడిందీ తెలిస్తే.. నిజంగా ఏపీ కరెంటును దొంగిలిస్తే తప్పకుండా మద్దతుగా ఉంటాం. తెలంగాణ భవిష్యత్ కోసం పునర్విభజన చట్టం కల్పించిన హక్కులను సాధించుకోవాల్సిందే. విద్యుత్ సమస్యను ఊహించే కదా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు హామీ ఇచ్చింది. అన్నీ సాధించాలి. ఈ విషయంలో ప్రభుత్వానికీ అండగా ఉంటాం’’ అని జానా పేర్కొన్నారు. ఇక రిటైర్ అవుతా... ఇక తాను రిటైర్ అవుతావుతానని, 2019లో పోటీ చేయకపోవచ్చని జానారెడ్డి చెప్పారు. ‘‘రిటైర్ అయినా, పార్టీకి సేవలు అందిస్తా. సీఎల్పీ పదవి అంటారా? ఎవరడిగినా ఇచ్చేస్తా. ఈ పదవిలో ఉండడమే కష్టం. ఇన్నాళ్లూ రాజులా బతికాం. ఇప్పడు బంటు పని చేస్తున్నాం. మేం ధర్నాలు చేయబట్టే కదా ప్రభుత్వంలో ఇంతైనా స్పందన వచ్చింది. అయినా సీఎం పదవిలో ఏం ఉంది..? రసం లేదు.. పస లేదు. ఎమ్మెల్యే కాకపోయినా, అంతా కోరుకుంటే నేను సీఎం కాలేనా..?’’ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా కు కృతజ్ఞతగా, పార్టీకి కాపలా ఉండాలనే సీఎల్పీ పదవిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని, రాష్ట్రా నికి కాపలా ఉంటానని జానారెడ్డి అన్నారు. -
మాకో హైకోర్టు ఇవ్వరూ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ముగింపు అనంతరం ఆయన గురువారం సాయంత్రమే బయల్దేరి ఢిల్లీ వచ్చారు. ప్రధానంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన ఆయన.. పనిలో పనిగా ఇతర కార్యక్రమాలు కూడా చక్కబెట్టుకోవాలని తలపెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును కలిసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల కోసం హైకోర్టును విభజించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాల హైకోర్టుగానే చలామణి అవుతోంది. అయితే, కేసుల భారం దృష్ట్యా రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు ఉండటం మంచిదని, అందువల్ల వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పనున్నట్లు తెలిసింది. -
విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది
-
విభజన తర్వాత ఏపీ సమస్యల్లో ఉంది
తిరుపతి: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర పరిస్థితులను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించాలని వారిని కోరామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చి చూడరాదని చంద్రబాబు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని కోరామని, అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని, రాజధాని నిర్మాణానికి లక్షా 2 వేల కోట్లు అడిగామని తెలిపారు. ఆర్ధిక సంఘానికి రెండు విజ్ఞాపన పత్రాలు అందించామని, జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అభివద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. -
అభివృద్ధిపై రాజకీయం చేయ్యోద్దు: వెంకయ్య
-
ఎమ్మెల్సీ స్థానాలు 58కి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సవరించడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 50 స్థానాలను 58కి పెంచాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరైనవిధం గా, సంతృప్తికరంగా సంప్రదింపులు జరపకుం డా, ప్రధానమైన భాగస్వామ్యపక్షాలను పట్టిం చుకోకుండా, భవిష్యత్ దుష్ఫలితాలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా, హేతుబద్దత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన ప్రక్రియ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. శుక్రవారం మండలి చేసిన మరిన్ని తీర్మానాల వివరాలు.. - రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, సమతుల అభివృద్ధి లక్ష్య సాధనకు శాసనమండలి కట్టుబడి ఉంది. - ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఏర్పాటుకు కావాల్సిన వనరులను కేంద్రం అందించాలి. - ఏపీ పునర్విభజన చట్టం- 2014లో పొందుపరిచిన అన్ని ప్రతిపాదనలు, పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసి కొత్త రాష్ట్ర నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. - విభజన వల్ల ఏపీకి జరిగిన వివక్షను పూరిం చేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలన్నీ కేంద్రం తీసుకోవాలి. - రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్థిక మద్దతు, విధానపర మద్దతును కేంద్రం అందించాలి. - పోలవరం నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తయ్యేలా అన్ని చర్యలను కేంద్రం తీసుకోవాలి. - రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. -
అభివృద్ధిపై రాజకీయం చేయ్యోద్దు: వెంకయ్య
చెన్నై: రాజధానిలోనే అన్ని ప్రధాన కేంద్రాల నిర్మాణం సరియైన నిర్ణయం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విభజన బిల్లు ప్రకారమే రెండు రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని సంప్రదిస్తే నిబంధనల ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందని ఆయన అన్నారు. అభివృద్ధిపై రాజకీయం చేయ్యోద్దని వెంకయ్యనాయుడు అన్నారు. గత అనుభావాలరీత్యా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మంచిదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. -
'విభజన బిల్లులోని అన్ని అంశాలు నెరవేరుస్తాం'
విశాఖపట్నం: పాకిస్థాన్ ఒప్పందాలను ఉల్లంఘించి కాల్పులు జరుపుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. పాక్ కవ్వింపు చర్యలను గమిస్తున్నామన్నారు. శనివారం విశాఖపట్నంలో జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కమోర్తాను అరుణ్ జైట్లీ జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చైనా ... భారత దేశ భూభాగాన్ని దాటి వస్తుందిని... అయితే దాన్ని చొరబాటుగా పరిగణించలేమన్నారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ఏపీ విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలను కేంద్రం తప్పక నెరవేరుస్తుందని జైట్లీ స్పష్టం చేశారు. -
బైఫరికేషన్ జరిగేనా!
ప్రగతినగర్ : నిజామాబాద్ నగరంలో రేషన్‌దుకాణాల బైఫరికేషన్(విభజన) జరిగేనా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఒక్కో రేషన్ దుకాణాల్లో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు తెల్లకార్డులు ఉన్నాయి. పేదల బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత జేసీ వెంకటేశ్వరరావు బైఫరికేషన్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే రేషన్ డీలర్ల సంఘం నేతల ఒత్తడితో ఎలాంటి ముందడుగు పడలేదు. కాగా శనివారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థ సారథి జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనైనా రేషన్ దుకాణాల బైఫరికేషన్ సమస్య తేలిపోతుందని చిన్న డీలర్లు ఆశాభావంతో ఉన్నారు. దీంతోపాటు జిల్లాలో ఆధార్ సీడింగ్‌లో అవకతవకలు, బోగస్ కార్డులు, ఇటీవలే జిల్లాలో రూపాయి బియ్యన్ని రీసైక్లింగ్‌కు పంపిస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడ్డ రేషన్ డీలర్ల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ రేషన్ దుకాణాల బైఫరికేషన్ 2008 సంవత్సరంలోనే నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పట్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడానేతను రేషన్ డీలర్లు ఆశ్రయించగా షాపుల విభజనను అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. తిరిగి 2011 సంవత్సరంలో నగరంలోని రేషన్ షాపులను బైఫరికేషన్ చేయాలని అప్పటి జేసీ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆమె ఆదేశాలు సైతం ధిక్కరించి అధికారులు రేషన్ డీలర్ల సంఘంతో కుమ్మకై బైఫరికేషన్కు సవాలక్ష సమస్యలు ఉన్నాయని తప్పుదోవ పట్టించారు. తాజాగా ఇటీవల నగరంలోని రేషన్ దుకాణాలను బైఫరికేషన్ చేయాలని బదిలీపై వెళ్లిన జేసీ వెంకటేశ్వర్రావు ఆదేశాలు జారీ చేశారు. బైఫరికేషన్ చేస్తే ఎక్కడ తమ ఆదాయం తగ్గిపోతుందోనని భావించిన డీలర్ల సంఘం నేతలు వీలైనంత మేరకు బైఫరికేషన్ను కానివ్వకుండా అడ్డుతగులుతున్నారు. ప్రస్తుతం రేషన్ డీలర్ల సంఘంలో ప్రధానపాత్ర పోషిస్తున్న కొంద రు నాయకులకు నెలకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఆదాయం రేషన్ దుకాణాల ద్వారా వస్తున్నట్లు తెలిసింది. సంఘంలో ఉన్న ప్రధాన డీలర్లకు ఒక్కొక్కరి షాపులో 4 వేల నుంచి 5 వేల వరకు కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా రూపాయి బియాన్ని పక్కదారి పట్టించి ప్రతినెల లక్షల రుపాయల నిరుపేదల నోటికాడి కూడును కాజేస్తున్నారు. అయితే రేషన్ షాపుల బైఫరికేషన్ జరిగితే వీరి ఆదాయానికి ఎక్కడ చెక్ పడుతుందోనని బెంబేలెత్తుతున్నారు. దీని కోసం వీరు ఇటీవలె రైల్వేస్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైనట్లు సమాచారం. షాపుల బైఫరికేషన్కు అడ్డుతగలాలని లేనిఎడల తమ ఆదాయానికి గండి పడుతుందని సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీని కోసం ఎక్కువ కార్డులు ఉన్న వారి దగ్గర డబ్బులు వసూలు చేసి బైఫరికేషన్ నోటిఫికేషన్ నిలుపుదలకు పెద్ద ఎత్తున పన్నాగం పన్నినట్లు సమాచారం అందుతోంది. బైఫరికేషన్ నిలుపుదలకు సంబంధిత అధికారి వద్ద బేరసారాలు కూడా నడిచాయని అంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పట్టణాల్లో ఒక్కో రేషన్ షాపుల్లో 650 నుండి 700 కార్డులు, గ్రామాల్లో నైతే 400 నుండి 500 కార్డులు మాత్రమే ఉండాలని స్పష్టమైనా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత నెలలోనే ఇదంతా జరిగింది. ఎన్నికలు ముగిసిన వెంటనే నగరంలోని రేషన్ షాపుల బైఫరికేషన్కు ఆదేశాలు ఇచ్చింది. నగరంలో ప్రస్తుతం ఉన్నా 87 షాపులకు తోడు మరో 29 కొత్త రేషన్‌దుకాణాలకు నోటిపికేషన్ విడుదల చేయాలని ఉత్తర్వులు కూడా అందాయి. అంతే అంతలోనే తిరిగి సంబంధిత అధికారిపై డీలర్ల సంఘం నాయకులు రాజకీయ ఒత్తిళ్లు పెంచారు. అధికార పార్టికి చెందిన మంత్రి, ఓ ఎమ్మెల్సీలు కలిసి బైఫరికేషన్ను నిలిపివేయాలని సంబంధిత అధికారికి సూచించినట్లు తెలిసింది. కాగా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమైన నేతలు, అధికారులకు రేషన్ డీలర్లే భోజన ఖర్చులు చూసుకున్నట్లు ప్రచారం కూడా ఉంది. అవినీతి రహిత సమాజం నిర్మిస్తామని గూలాబీ దళపతి ఓ దిక్కు గొంతు పోయేలా అరుస్తుంటే కిందిస్తాయి శ్రేణులు మాత్రం అవినీతిపరులతో చేతులు కలిపుతున్నారని అపుడే ఆరోపణలు మొదలయ్యాయి. -
ఏపీ ఉన్నత విద్యామండలే కౌన్సెలింగ్ చేయాలి: సుప్రీం
-
ఏపీ ఉన్నత విద్యామండలే కౌన్సెలింగ్ చేయాలి: సుప్రీం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలని తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. ఇక ఏపీ ఉన్నతవిద్యామండలి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది: ఏపీ తరఫు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్ 95 ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలందని, అక్టోబర్ 31 వరకు పొడిగించాలని కోరితే కేసు డిస్మిస్ చేస్తానని సుప్రీం హెచ్చరించిందని శ్రీనివాస్ తెలిపారు. 371-డి కింద ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు. -
అనవసర రాద్ధాంతం చేయొద్దు
కేసీఆర్‌కు వెంకయ్యనాయుడు సలహా ప్రధానిపై మీ వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం మోడీ ‘ఫాసిస్ట్’ అన్న మాటను ఉపసంహరించుకుంటే మంచిది టీ బిల్లు ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్నారుగా.. అందులోని అంశాలను అమలు చేస్తే అభ్యంతరం ఎందుకు? సాక్షి, హైదరాబాద్: పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు కల్పించటంపై అనవసర రాద్ధాంతం చేయడం తగదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు. పార్లమెంట్ ఆమోదం పొందిన విభజన బిల్లులో పేర్కొన్న అంశాన్నే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తే అందులో అభ్యంతరం ఏముందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఫాసిస్ట్ అంటూ కేసీఆర్ మాట్లాడడం దురదృష్టకరమని, పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ప్రకారం ముందుకెళ్లడం ఎలా ఫాసిజమవుతుందని ప్రశ్నించారు. ఈ మాటలను కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజన బిల్లును నరేంద్రమోడీ ఒక్కరే ఆమోదించలేదని, యూపీఏ హయాంలోనే ఆమోదం పొందిన అంశం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న పార్టీ... బిల్లు ఆమోదం పొందినప్పుడు హర్షించిందని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాక ఆ పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం సమాఖ్య స్ఫూర్తి అయినా రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం ఇందులో మరో ప్రధాన అంశమని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం కలహించుకోవడం ఆపి సమస్యలుంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు ప్రజల భవిష్యత్ కోసం ఇరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ‘కేంద్ర ఎవరి పట్లా వివక్ష చూపదు. దేశ ప్రజలంతా సమానం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధికి బిల్లులోని అంశాల అమలుకు కేంద్రం కృషి చేస్తుంది. దేశ ప్రధానిపై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిపై పునరాలోచించుకోవాలి’ అని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘చౌకబారు మాటలకు నా స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని బదులిచ్చారు. అభివృద్ధి చర్యలను కాంగ్రెస్ అడ్డుకుంటోంది దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని వెంకయ్య ఆరోపించారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన బిల్లులను పార్లమెంట్లో ఆమోదించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటోందన్నారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా రాజ్యసభలో తగినంత బలం లేక కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయన్నారు. త్వరలో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత మెజార్టీ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా జరగనివ్వటం లేదని ధ్వజమెత్తారు. దేశ ప్రధాని కావాలనుకున్న వ్యక్తి లోక్‌సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాహుల్‌గాంధీని ఉద్దేశించి పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ బండారు దత్తాత్రేయ, నేతలు మురళీధరరావు, సుధీష్ రాంబొట్ల, దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండు నెలల్లో ఆర్టీసీ విభజన
ఏపీ రవాణా మంత్రి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన రెండు నెలల్లో పూర్తవుతుందని, 12 రీజియన్లతో ఆంధ్రా ఏపీ ఆర్టీసీ ఏర్పడనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత బస్సుల మరమ్మతుల వల్లే ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాటి స్థానంలో కొత్త బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద త్వరలో రాష్ట్రానికి 1,500 బస్సులు రానున్నాయని తెలిపారు. కేంద్ర రవాణా శాఖ నుంచి ఈ ఏడాది 500 కి.మీ. రాష్ట్ర రహదారులకు జాతీయ గుర్తింపు లభించిందన్నారు. -
‘కృష్ణా’ర్పణం!
కర్నూలులో బోర్డు ఏర్పాటుకు అధికార పార్టీ మోకాలడ్డు - విజయవాడలో ఏర్పాటుకు కోస్తా నేతల కుట్ర - అదే జరిగితే హంద్రీనీవాకు తాళమే... - తెలుగుగంగ, కేసీ, ఎస్‌ఆర్‌బీసీల కింద సాగుకు కష్టకాలం - మేల్కొనని సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు కర్నూలు(రూరల్): కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు వివాదాలకు తెర లేపుతోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లులో సూచించిన విధంగా జూన్ 2వ తేదీ తర్వాత 60 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు ఉద్దేశించిన బోర్డు ఏర్పాటుకు కర్నూలు అనుకూలమైన ప్రాంతమని నీటిపారుదల శాఖ అధికారులు కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక అందజేశారు. ఇందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణులు, ఉన్నతాధికారులు సైతం మద్దతిచ్చారు. అయితే కర్నూలులో ఏర్పాటైతే కృష్ణా డెల్టాలోని ఆయకట్టులో నారుమళ్ల సాగుకు కష్టాలు తప్పవని.. ఆంధ్ర ప్రాంతానికి నష్టం చేకూరుతుందనే భావనతో అధికార పార్టీకి చెందిన కోస్తా నేతలు బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో శ్రీశైలం జలాశయం అతి పెద్దది. ప్రాజెక్టులో 854 అడుగులకు పైగా నీరు ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమకు సాగునీటిని అందించే కాల్వలకు కృష్ణా జలాలను వినియోగించుకునే వీలుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు 848 అడుగుల నీటి మట్టం వరకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించారు. 834 అడుగుల వరకు నీరుంటే కృష్ణా డెల్టాకు నీరందించే వీలుంటుంది. అంతకంటే దిగువకు నీటి మట్టం చేరుకుంటే నీటి విడుదలకు వీలుండదని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు చేస్తే నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగుల నుంచి 854 అడుగుల దిగువకు పరిమితం చేయనున్నారు. అయితే 854 అడుగులకు పైబడి నీరుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరందనుండటంతో భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇదే జరిగితే రాయలసీమ ప్రాంతానికి కనీసం చుక్క నీరందని పరిస్థితి నెలకొంటుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలు చోటు చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాలు కలిసుండగానే ఆర్డీఎస్, సుంకేసుల డ్యాం, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులవిషయంలో జల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక కృష్ణా బోర్డు విజయవాడకు తరలిపోతే కొత్త వివాదాలు తప్పవని నీటి పారుదల శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవాకు తాళం కర్నూలులో బోర్డు ఏర్పాటైతేనే వరద జలాల ఆధారంగా నిర్మితమైన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీరందే అవకాశం ఉంటుంది. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు సాగునీటి విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల్లేవు. ఈ పరిస్థితుల్లో బోర్డు విజయవాడలో ఏర్పాటైతే అనుమతులను అడ్డుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా అనంతపురం జిల్లాకు అధిక నష్టం చేకూరనుంది. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగ పర్యవేక్షణకు సంబంధించిన బోర్డును నిబంధనల ప్రకారం ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఏర్పాటైన టీబీ బోర్డు కర్ణాటకలో ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అయితే ఎలాంటి అధ్యయనం చేయకనే కృష్ణా బోర్డును విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా ఉండడంతో బోర్డు ఆ ప్రాంతానికే తరలిపోవచ్చనే చర్చ జరుగుతోంది -
'ఆర్టీసీ విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం'
హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుందున్నారు. శుక్రవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జూలై 1 వ తేదీన ఆర్టీసీ నిపుణుల కమిటీ సమావేశం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆర్టీసీని విభజన జరుగుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
'జూలై 1న ఆర్టీసీ విభజన'
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఆ కమిటీ తన నివేదికను త్వరలో తమకు అందజేయనుందని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 1వ తేదీన ఆర్టీసీని విభజిస్తామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. -
మోడీ వద్దకు పంచాయితీ!
-
మోడీ వద్దకు పంచాయితీ!
పోలవరంపై 26న కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించనున్న నేతలు పీపీఏల విషయంలో ఏపీ ఏకపక్ష ధోరణిపైనా ప్రధానికి ఫిర్యాదు వాటి రద్దు నిర్ణయం విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని వాదన తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాకు విజ్ఞప్తులు విభజన చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలపైనా చర్చకు అవకాశం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపైనా కే సీఆర్ చర్చించనున్నారు. పోలవరం ముంపు మండలాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యుత్ కేటాయింపుల విషయంలో పీపీఏలను రద్దు చే యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ప్రధానికి కేసీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఉద్దేశించి పేర్కొన్న ప్రయోజనాలు, కేంద్ర సర్వీసు ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ, నీటి విడుదల, పన్ను మినహాయింపు తదితర విషయాలను కేంద్రం ముందుంచడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అఖిలపక్ష నేతలను వెంటబెట్టుకుని ఈ నెల 26న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై ప్రత్యేక నివేదికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు శాసనసభలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని అఖిలపక్ష నేతలు మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు ప్రధాని అపాయింట్మెంట్ను కోరినట్టు సమాచారం. అలాగే పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది రాష్ర్ట విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్న కేసీఆర్ దీనిపై ప్రధానితో చర్చించాలని నిర్ణయించారు. పీపీఏల రద్దు వల్ల తెలంగాణ రాష్ర్టం సుమారు 540 మెగావాట్ల విద్యుత్నుకోల్పోవాల్సి వస్తోందని, ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతుందని మోడీకి ఆయన వివరించనున్నారు. ప్రత్యేక హోదాల మాటేంటి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే.. తెలంగాణ కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి అఖిలపక్షం విజ్ఞప్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వివరించనుంది. అలాగే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోతుందని, పన్ను మినహాయింపుల వల్ల పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉందని అఖిలపక్ష నేతలు తమ ఆందోళన వెలిబుచ్చనున్నారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి పన్నుల్లోనూ ప్రోత్సాహాకాలు ఇవ్వాలని, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కల్పిస్తామన్న అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక కేంద్ర సర్వీసుకు సంబంధించిన అధికారుల విభజన పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం 44 ఐఏఎస్, 31 మంది ఐపీఎస్, 13 మంది ఐఎఫ్ఎస్ అధికారులనే రాష్ట్రానికి కే టాయించారు. డిప్యూటేషన్‌పై ఉన్న 11 మంది అధికారులు ఈ నెలాఖరులోగా వెళ్లిపోనున్నారు. దాంతో పరిపాలన ఇబ్బందిగా మారనుంది. రాష్ర్టంలో పాలన ఇంకా గాడిలో పడకపోవడానికి అధికారుల విభజన పూర్తిగా జరగకపోవడమే ప్రధాన కారణమని మోడీకి కేసీఆర్ వివరించనున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
ఇంకా గాడిలో పడని సచివాలయం
* అస్తవ్యస్తంగా ఆంధ్రా సర్కారు పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి పక్షం రోజులైనా పాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఆంధ్రా సర్కారు పరిస్థితి ఇంకా అస్థవ్యస్థంగానే ఉంది. ఏ శాఖ అధికారులకు, ఉద్యోగులకు కూడా విధులు నిర్వహించడానికి సరైన వసతి లేదు. విభజనకు ముందే వసతుల కల్పన గురించి ఆలోచించాల్సిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ దుస్థితి నెలకొందని అధికార యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కీలకమైన ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు ఇంకా విధులు నిర్వహించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వసతి కల్పించిన చోట పనిచేయడానికి వీలుగా సెక్షన్లు లే వు. ప్రధానంగా కంప్యూటర్ల ద్వారా పనిచేయడానికి వీలుగా విద్యుత్ కనెక్షన్లు లేవు. ఫోను, ఫ్యాక్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ డి బ్లాకులోని రెండు, మూడో అంతస్తుల్లో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు నార్త్ హెచ్ బ్లాకులో రెండో అంతస్థును కేటాయించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లినప్పటికీ అక్కడ ఇప్పటికీ ఫ్యాక్స్ సౌకర్యం లేదు. పెపైచ్చు ఇంటర్నెట్ నెమ్మదిగా పనిచేస్తుండటంతో ఆర్థిక శాఖ ఆన్‌లైన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉద్యోగులు డి బ్లాకు నుంచి బస్తాల్లో ఫైళ్లు పెట్టుకుని నార్త్ హెచ్ బ్లాకు చేరి పది రోజులవుతోంది. అయితే అక్కడ పనిచేయడానికి అనుగుణంగా వసతి లేకపోవడంతో బస్తాల్లోంచి ఇప్పటివరకు ఫైళ్లు బయటకు తీయలేదు. సెక్షన్లకు అనువుగా లేకపోవడంతో ఉద్యోగులు కారిడార్‌లో తిరుగుతూ కాలం గడుపుతున్నారు. -
అహ్లూవాలియా ప్రపంచబ్యాంకు ఏజెంటు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ అర్హమైనది కాదంటూ ప్రణాళికా సంఘం పేర్కొనడాన్ని సీపీఐ ఆక్షేపించింది. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఫిబ్రవరి 21న నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతారా అని ప్రశ్నించింది. ప్రణాళికా సంఘం చైర్మన్‌గా వ్యవహరించిన అహ్లూవాలియా పక్షపాతంతో వ్యవహరించారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. -
జాతీయ పార్టీకి ప్రాంతీయతత్వామా?
విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కొందరు బీజేపీ నేతలు ఏపీకి అన్యాయం జరిగిందని చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ప్రజలలోని సహోదర భావానికి చెరుపు చేస్తుంది. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే జాతి గా కలిసిమెలిసి అభివృద్ధి చెందాలనేదే తెలుగు ప్రజలందరి ఆకాంక్ష. రెండు రాష్ట్రాలలో రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటం ఆ ఆకాంక్షకు ఆటంకం కారాదు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన, తలెత్తనున్న సమస్యలను జాతీయ సమగ్రత, తెలుగు జాతి ఐక్యతలకు ప్రాధాన్యమిచ్చి సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన చారిత్రక బాధ్యత కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడు వంటి ఆ పార్టీ అగ్ర నేతలు రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యనించడం దురదృష్టకరం. విభజన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలను, అపోహలను పెంచుతాయని వారు విస్మరించడం శోచనీయం. దీర్ఘకాలంగా ఒకే ఆర్థిక యూనిట్‌గా ఉంటూ విడిపోయిన ఏపీ, తెలంగాణలు రెండూ కొంతకాలం పాటూ తీవ్ర సమస్యలకు గురికాక తప్పదు. ఏపీకి రాజధాని లేకపోవడం, తెలంగాణకు సకల హంగులతో కూడిన రాజధాని ఉండటం వాస్తవం. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా, సాం స్కృతికంగా హైదరాబాద్ తెలంగాణలో విడదీయరాని భా గం. అందులో ఎవరు ఎవరికి చేసిన అన్యాయమూ లేదు. అనివార్యమైన ఈ ఒక్క అననుకూలతను మినహాయిస్తే ఏపీ కి సకల వనరులు ఉన్నాయి. దాదాపు 1,000 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన తీరప్రాంతం, అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన విశాఖపట్నమేగాక క్రిష్ణపట్నం, కాకినాడ, గం గవరం ఓడ రేవులున్నాయి. అది అన్యాయమని తెలంగాణ ప్రజలు భావించడం లేదు. ఏపీలోని చమురు, సహజవా యు వనరులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు సత్వర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయి. అనుభవజ్ఞులు, సంపన్నులైన సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు... కేంద్రం ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హోదాను ఉపయోగించుకుని భారీగా పెట్టుబడులు పెడతారనడంలో సందేహం లేదు. ఈ వాస్తవాలను విస్మరించి రెండు రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంపొందింపజేయాల్సిన నేతలే ఏపీకి అన్యాయం జరిగిందనడం పొరబాటు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తదితర పరిశ్రమలు న్నాయి. అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలున్నాయి. కానీ విభజన తదుపరి తెలంగాణ 2,000 మెగావాట్ల విద్యు త్ లోటుతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఏపీ జెన్కో 8,925 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలోఉన్నాయి. కానీ తెలంగాణలోని 52 శాతం సామర్థ్యం రిజర్వాయర్లలోకి వచ్చి చేరే నీటి ప్రవాహంపై ఆధారపడ్డ అనిశ్చితితో కూడిన జలవి ద్యుత్తే. ఏపీ జెన్కో కొత్తగా చేపడుతున్న 3,210 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులలో 70 శాతం సీమాంధ్రలో ఉండగా, 30 శాతం మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఎన్టీపీసీ కొత్తగా చేపట్టనున్న 5,320 మెగావాట్ల ప్రాజెక్టులలో 4.000 మెగావాట్లు కోస్తాంధ్రలో, 1,320 మెగావాట్లు తెలంగాణలో ఉంటాయి. ‘సాగునీటికోసం, తాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపైనే ప్రధానంగా ఆధారపడ్డ తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుంద’నీ, ‘కేజీ-బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి పుంజుకోవడంతోనే గ్యాస్ ఆధారిత విద్యుత్తుతో ఏపీ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుతుంద’ని వై హరీష్ చంద్రప్రసాద్ అన్నారు. ఆయన తెలంగాణవాది కారు, ఒకప్పటి ఏపీసీఐఐ చైర్మన్, నేటి కో స్తారాయల అభివృద్ధి ఫోరం చీఫ్ కోఆర్డినేటర్. విద్యుత్ కొర త హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మా రంగాలు సహా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని కుంటుపరిచింది. పలు పరిశ్రమలు మూతపడ్డాయి. తెలంగాణ పారిశ్రామిక, వ్యవసాయ రం గాలు తీవ్రసంక్షోభం ముప్పును ఎదుర్కొంటున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి ప్రధాని నరేంద్రమోడీ ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు అగ్రతాంబూలం ఇస్తుండగా... బీజేపీ నేతలు ప్రాంతీయ సంకుచితత్వానికి గురికావడం ఆశ్చర్యకరం. కేంద్ర విద్యుత్ మం త్రి పియూష్ గోయల్ త్వరలో మిగులు విద్యుత్ రాష్ర్టం కానున్న ఏపీని 24 గంటల విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. సాటి తెలుగువారిగా దాన్ని స్వాగతిస్తున్నాం. తీవ్ర లోటు విద్యుత్ రాష్ట్రంగా అతి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలంగాణకు ఆ సదుపాయాన్ని కలిగించకపోవడం పక్షపాతం అనిపించుకోదా? - గుడిసె సాల్మన్‌బాబు (ఐఎన్టీయూసీ దక్షిణ భారత ఉపాధ్యక్షులు, ఖమ్మం) -
తెలంగాణ, ఏపీకి వేర్వేరు పర్యావరణ కమిటీలు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణపరమైన అనుమతులు ఇచ్చేందుకుగాను వేర్వేరు పర్యావరణ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ‘బీ’ కేటగిరీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను ఇచ్చే రెండు కమిటీల కాలపరిమితి గతేడాది అక్టోబరు 25నే ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పర్యావరణ కమిటీల్లో సభ్యులుగా నియమించేందుకు నిపుణుల పేర్లను సూచిస్తామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తమకు తెలిపిందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ఇంతకుముందు ఏపీలో పర్యావరణ కమిటీలు లేని నేపథ్యంలో కేటగిరీ బీ ప్రాజెక్టులను కూడా కేటగిరీ ఏ కింద పరిగణించి తానే పర్యావరణ అనుమతులు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. -
మరో ప్రయాణం
ఏవో.. ఏవేవో.. ఘోషలు వినబడుతున్నాయ్.. తెలుగు గుండెలు విడివడ్డాయ్. ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా.. వానకాలం ముసిరి రాగా.. నిలువు నిలువున నీరు కాలేదా.. శీతకాలం కోతపెట్టగ కొరుడుకట్టీ.. ఆకలేసి కేకలేశాం కదా. ఇదీ అంతే.. విభజన రక్కసి ఆంధ్రోళ్లను కాటేసింది. భయంలేదు మిత్రమా.. ‘విభజించు-పాలించు’ అనే సిద్ధాంతంతో కుటిల పాలన చేసిన తెల్లదొరల తుపాకీలకు గుండెల్ని ఎదురొడ్డి నిలిచిన ఆంధ్రకేసరి వారసులం మనం. శ్రీశ్రీ చెప్పినట్టు.. ‘నేను సైతం భువన భవనపు బావుటానై పైకిలేస్తాను.. నేను సైతం.. నేను సైతం..’ అంటూ తెల్లరేకై పల్లవిద్దాం. అభ్యుదయమే ఆయుధంగా పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి.. కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదాంతరాళం గర్జిస్తూ.. మరోప్రపంచం వైపు పయనిద్దాం. నరాల బిగువూ.. కరాల సత్తువ చూపిద్దాం. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని స్వస్తి వాక్యములు సంధానిద్దాం. స్వర్ణ వాద్యములు సంరావిద్దాం. భావి వేదముల జీవనాదముల నవీన గీతికి.. నవీన రీతికి సంకల్పం చెప్పుకుందాం. ఆంధ్రజాతి మహాప్రస్థానంలో మరో ప్రయూణం మొదలెడదాం. మనం ఆశావాదులం. పురోగమనం వైపు వడివడి అడుగులు కాదు.. ఒక్క ఉదుటున పరుగెడదాం. ‘జయహో నవ్యాంధ్ర’ అంటూ నవీన గీతికను కలసికట్టుగా ఆలపిద్దాం. సాక్షి, ఏలూరు:సువిశాల ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. మిగులు బడ్జెట్‌తో తెలంగాణ, లోటు బడ్జెట్‌తో సీమాంధ్ర తొలి అడుగులు ప్రారంభించాయి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం మనది అనుకుని మన జిల్లా ప్రజలు రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ఇక్కడి నుంచి వలస వెళ్లి, పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మించారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచీ ప్రయాణం ప్రారంభించాల్సి వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సదుపాయాలుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి. అవసరాలు తీర్చే వనరులు కావాలి. దాని కోసం జిల్లా ప్రజానీకం మరోసారి పునరంకితం కావాలి. నవ రాష్ర్ట నిర్మాణమనే బృహత్తర యజ్ఞంలో మన జిల్లా ప్రత్యేక భూమిక పోషించనుంది. పాడి పంటలతో తులతూగే ‘పశ్చిమ’ తాను అభివృద్ధివైపు పరుగులు తీయడంతోపాటు రాష్ట్ర ప్రజలకు అనేక అవసరాలు తీర్చనుంది. అన్నంపెట్టే అన్నదాత కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకలి తీర్చేందుకు జిల్లాలో 5,22,549 హెక్టార్లలో సాగుభూమి ఉంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సేద్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. కోస్తా లోని ఉభయగోదావరి జిల్లాలు ధాన్యాగారాలుగా నిలవనున్నాయి. జిల్లా విస్తీర్ణంలో 83.46 శాతం భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు. అత్యధికంగా వరి పండిస్తుండగా.. అరటి, చెరకు, కొబ్బరి, జొన్న, పొగాకు, పత్తి, మామిడి, పామాయిల్ పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అన్ని జిల్లాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రజల ఆహార అవసరాలు తీర్చవచ్చు. అంతేకాకుండా పొగాకు, జీడి పప్పు పరిశ్రమలను విస్తరించి అంతర్జాతీయ మార్కెట్లో వాటా సంపాదించవచ్చు. మానవ వనరులు జిల్లాలో మానవ వనరులకు కొదవులేదు. దాదాపు 40 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో అత్యధికులు విద్యావంతులు, యువకులే. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు ఇక్కడి ప్రజల సొంతం. సత్యం కంప్యూటర్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రామలింగరాజు, ఆంధ్రా బిర్లాగా పేరుగడించిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, దివంగత ఏఎస్ రావు, బీవీ రాజు వంటి ఎందరో ప్రముఖులను అందించిన మన జిల్లాలో నేటి తరంలోనూ అంతటి ఉద్ధండులు ఉన్నారు. పరిశ్రమలకు అనుకూలం పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వనరులు, మౌలిక సదుపాయాలు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. 7,742 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున తూర్పుగోదావరి, పడమర వైపు కృష్ణా జిల్లాలు ఉండటంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు మన జిల్లా కేంద్ర బిందువు కానుంది. ఇటు గన్నవరం, అటు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయాలు జిల్లాకు సమీపంలోనే ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో కొత్తగా విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. ఓ వైపు కృష్ణా, మరోవైపు గోదావరి నదులు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించనున్నారుు. నరసాపురంలో పోర్టు అభివృద్ధి చేస్తే జల రవాణా వృద్ధి చెందుతుంది. ఇప్పటికే జిల్లాలో నూనె శుద్ధి కర్మాగారాలు, పౌల్ట్రీ, చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. పర్యాటక వైభవం పర్యాటకంగా జిల్లాను మరింత ముం దుకు తీసుకువెళ్లవచ్చు. చిన తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకాతిరుమలను ఆధ్యాత్మిక రాజధాని చేయొచ్చు. పంచారామ క్షేత్రాలైన భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరారామం ఉన్నాయి. గుంటుపల్లి బౌద్ధారామాలు, పాపికొండలు, ముఖ్యంగా కొల్లేటి సరస్సు, అక్కడకు వచ్చే విదేశీ వలస పక్షులు జిల్లాకే తలమానికం. ఈ ప్రదేశాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చవచ్చు. సిరులు పంచే ఖనిజ సంపద జిల్లాకు ఆదాయం సమకూర్చడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమ్యే ఖనిజ సంపద జిల్లాలో సమృద్ధిగా ఉంది. తెల్లసుద్ద (బాల్ క్లే), బంకమట్టి నిల్వలు ద్వారకాతిరుమల వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 6 మీటర్ల లోతులో లక్షలాది టన్నుల సుద్ద నిల్వలు ఉన్నాయి. కూచింపూడి, కొత్తపల్లి ప్రాంతాల్లోనూ ఈ నిక్షేపాలున్నట్లు అంచనా. దీంతో సిరామిక్స్ పరిశ్రమను వృద్ధి చేసుకోవచ్చు. రెడ్డి బోడేరు వద్ద గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. జిల్లాలో సున్నపురాయి, మైకా మొదలైన ఖనిజాలున్నాయి. నరసాపురంలో పెట్రోల్, సహజవాయు నిల్వలున్నట్లు కనుగొన్నారు. ఇవే కాకుండా విదేశీమారక ఆర్జించి పెట్టే ఆక్వా, లేసు వంటి ఎగుమతులు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయి. వీటన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు వీటిపై మరింత దృష్టి సారిస్తే మన ప్రాంతం, మన ప్రజలు రానున్న కాలంలో అభివృద్ధి చెందడం అంత కష్టమేమీ కాదు. -
అపాయింటెడ్ డే తర్వాతే ఆ సంస్థల విభజన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపాయింటెడ్ డే నాటికి షెడ్యూల్ తొమ్మిదిలోని 20 సంస్థలను విభజించాలని ముందు నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడది సాధ్యం కాదని, రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి జెన్కో, ఆర్టీసీలో మాత్రమే విభజన ప్రక్రియ పూర్తయిందని.. బ్రూవరీస్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ, సీడ్స్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విద్యుత్ ఆర్థిక సంస్థ, రాష్ట్ర గిడ్డంగులు, పర్యాటకాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, వైద్య మౌలిక సదుపాయల సంస్థలను జూన్ రెండో తేదీకి విభజించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే వీటి విభజన అంత సులువు కాదని, అందుకు గడువు కావాలని ఆయా సంస్థల అధిపతులు కోరినట్లు సమాచారం. -
విభజన ఫైళ్లు తప్ప మరేవీ వద్దు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్లు తప్ప ఇతర ఫైళ్లు ఏవీ తనకు పంపించవద్దని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత విధానపరమైన, కీలకమైన ఫైళ్లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాలని అందులో సూచించారు. గవర్నర్ నుంచి వచ్చిన లేఖను ఆయన సలహాదారులు సలావుద్దీన్, ఏఎన్ రాయ్‌లకు సీఎస్ పంపించారు. -
మార్గదర్శకాలు లేకుండా ఉద్యోగుల పంపకాలా?
హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్‌తో తెలంగాణ దేవీప్రసాద్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ఉద్యోగుల పంపకాలు చేయడం సమంజసం కాదని కమలనాథన్‌తో అన్నారు. ముందు మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చి తర్వాత ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలని కమలనాథన్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. స్థానికత అంశాన్ని కమలనాథన్ వద్ద వారు ప్రస్తావించారు. -
అసెంబ్లీ ఉద్యోగుల విభజన: ఉద్యోగ సంఘాలు అభ్యంతరం
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి అసెంబ్లీలో ఉద్యోగులను ప్రభుత్వం శుక్రవారం విభజించింది. అసెంబ్లీలోని ఐదుగురు డిప్యూటీ సెక్రటరీలలో ముగ్గురుని ఆంధ్రప్రదేశ్‌కు, ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. అలాగే అసెంబ్లీలోని 15 మంది అసిస్టెంట్ సెక్రటరీలలో ఐదుగురిని ఆంధ్రకు, 10 మంది తెలంగాణకు విభజించారు. అయితే అసెంబ్లీలో ఉన్నతాధికారుల విభజనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
విభజన తీరుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కు కాబోయే చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విభజన తీరును పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల పంపకాల గురించి తెలిపారు. బడ్జెట్ తదితర వ్యవహారాల గురించి సవివరంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే పాలన సాగించడంపై సాధ్యాసాధ్యాల గురించి కూడా చంద్రబాబుకు అధికారులు వివరించారు. -
ఎక్కడి పెన్షనర్లకు అక్కడే పింఛను
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు వారు ప్రస్తుతం పింఛను పొందుతున్న ట్రెజరీ కార్యాలయాల నుంచే రాష్ట్ర విభజన తర్వాత కూడా పింఛను అందనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెన్షన్ భారాన్ని జనాభా నిష్పత్తి (58.32 శాతం సీమాంధ్ర, 41.62 శాతం తెలంగాణ)లో భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల పెన్షన్ భారాన్ని వారి సర్వీసు (ఏ ప్రాంతంలో ఎంతకాలం పనిచేశారు) ఆధారంగా రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఉద్యోగి సర్వీసు వివరాలతో కూడిన పార్ట్-2(సి) ఫారాన్ని రెండు రాష్ట్రాలకు పంపించే అధికారాన్ని ఆర్థిక శాఖ ప్రధాన అకౌంటెంట్ జనరల్‌కు ఇచ్చింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్లు చెల్లించడానికి, విభజన తర్వాత పదవీ విరమణ చేసి పెన్షన్ పొందనున్న వారికి రెండు రాష్ట్రాలు కలిసి పెన్షన్ చెల్లించడానికి వేర్వేరుగా ఖాతాలు తెరవాలని ట్రెజరీ శాఖను ఆదేశించింది. ఈ నెలఖారుకే పెన్షన్ ఖరారు విభజన నేపథ్యంలో మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల పెన్షన్‌ను కూడా 24నే సెటిల్ చేయాలని, నెలాఖరులోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
టీ-ఉద్యోగుల నేత విఠల్ సీమాంధ్రకు కేటాయింఫు
-
ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ఉద్యోగ నేత
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజన అంశం కాక రాజేస్తోంది. ఇప్పటికే సచివాయల ఉద్యోగుల మధ్య స్థానికత చిచ్చు రాజేసింది. విద్యాశాఖ ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వివాస్పదంగా మారింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింటారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా తనను సీమాంధ్రకు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ పుట్టి ఉద్యమాలు చేసిన నా పరిస్థితే ఇలా ఉంటే మిలిగినవారి పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని విఠల్ చెప్పారు. విఠల్ ఇంటర్ విద్యాశాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. -
'పెద్ద మాటలు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను పనిచేయనివ్వమంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్దమాటలు మాట్లాడుతున్నారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ అన్నారు. ఉద్యోగుల స్థానికతపై అనుమానాలుంటే కచ్చితమైన ఆధారాలతో బయటపెట్టాలని సూచించారు. ఉద్యమ నేతగా ఉండి ప్రభుత్వాధినేత అవుతున్న కేసీఆర్ అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామన్నారు. సచివాలయంలోని 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా ప్రభుత్వం పేర్కొనగా 193 మంది ఉద్యోగుల ‘స్థానికత’పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. -
193 మంది ఉద్యోగుల ‘స్థానికత’పై అభ్యంతరం
హైదరాబాద్: సచివాలయ ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 806 ఉద్యోగుల్లో 193 మంది తెలంగాణవారు కాదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ 193 మంది ఉద్యోగుల వివరాలను సర్వీసెస్ ముఖ్య కార్యదర్శికి సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, శ్రవణ్ అందించారు. సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వం మంగళవారం జాబితా వెల్లడించింది. వీరిలో 1,059 మంది ఆంధ్ర, 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఇటీవల ఆన్లైన్లో సేకరించిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులు తమ, ఇతర ఉద్యోగుల స్థానికత వివరాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని జాబితా వెల్లడించిన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సూచించింది. -
'తెలంగాణ ఉద్యోగులెవరో మేమే ప్రకటిస్తాం'
హైదరాబాద్: విభజన కోసం అధికారులు ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల లిస్ట్ తప్పుల తడకగా ఉందని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు ఆరోపించారు. నిజమైన తెలంగాణ ఉద్యోగులెవరో తామే ప్రకటిస్తామని చెప్పారు. వారు మాత్రమే తెలంగాణ సచివాలయంలో పనిచేయాలని సూచించారు. ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణలో పనిచేయనివ్వబోమని స్పష్టం చేశారు. అధికారులు ప్రకటించిన ఉద్యోగుల లిస్టే ఫైనల్ అయితే తెలంగాణ ఏర్పాటుకు అర్ధమే లేదన్నారు. సచివాలయంలో ఉద్యోగులందరి స్థానికత వివరాలను అధికారులు మంగళవారం ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఒక్కరోజులోనే తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. -
సచివాలయంలో తుదిదశకు విభజన
-
ఆర్టీసీ ‘విభజన’కసరత్తు పూర్తి
నేడు బోర్డు ముందుకు నివేదిక హైదరాబాద్‌లోని ఆస్తులపై కొనసాగుతున్న వివాదం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విభజనకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆర్టీసీ ఆస్తులు, అప్పుల్లో జరిపే కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. గురువారం జరగనున్న ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తుది నివేదికకు ఆమోదముద్ర వేసి గవర్నరుకు పంపనున్నారు. ఆరుగురు సభ్యుల ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఈ కసరత్తును పూర్తి చేసింది. బస్సుల సంఖ్య, జోన్లు, డివిజన్ల సంఖ్య, మంజూరైన పోస్టుల సంఖ్య ఆధారంగా సిబ్బంది, అధికారుల సంఖ్య లాంటివి మినహా.. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందనున్నందున వాటి వివరాలను ప్రత్యేకంగా నివేదికలో పొందుపరచలేదు. అయితే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లోని ఆస్తుల వివరాలను మాత్రం ప్రస్తావించారు. ఇప్పటికే విభజనకు సంబంధించి అధికారికంగా ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా సిబ్బంది పంపకం, ఇతర ఆదాయాలు, అప్పులపై స్పష్టత ఇచ్చారు. వాటి ఆధారంగానే ఉమ్మడి ఆస్తులను పంపకం చేయాలని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 53(1) ప్రకారం విభజిస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన గడువుకనుగుణంగా ఫైళ్ల విభజన, డిజిటలైజేషన్ పూర్తి చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం సిబ్బంది కేటాయింపు జరిగిందని పేర్కొన్న కమిటీ.. జిల్లా, జోనల్ స్థాయివి కాకుండా రాష్ట్రస్థాయి పోస్టుల్లోని అధికారులను 13:10 నిష్పత్తిలో విభజించినట్టు తెలిపింది. నివేదికలోని వివరాలు రవాణా సంస్థ ప్రధాన పరిపాలన భవనం అయిన బస్‌భవన్‌ను రెండుగా విభజించారు. ఇందులోని ‘ఎ’వింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు, ప్రస్తుతం ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ఉంటున్న ‘బి’ వింగ్‌ను తెలంగాణ రవాణాసంస్థకు కేటాయించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, బ్యాంకు, ఎటీఎంలను ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తూ రెండుగా విభజించారు. రెండుగా విభజించే వీలులేని ఉమ్మడి ఆస్తులుగా ఆసుపత్రి రేడియాలజీ విభాగం, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఓపీఆర్ఎస్, సీఐఎస్, వీటీఎస్ ఐటీ సేవల వ్యవస్థలను, అనంతపూర్‌లోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను గుర్తించారు. అంటే వీటిపై జనాభా సంఖ్య ఆధారంగా రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందన్నమాట. ఎంవీ ట్యాక్స్ రీయింబర్స్మెంట్, బకాయిలు, అంతర్రాష్ట్ర రవాణాసంస్థలతో ఉన్న ఒప్పందాలకు సంబంధించి జూన్ 2లోపు రెండు రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విభజన ప్రాతిపదికలపై తెలంగాణ ప్రాంత అధికారులు, సిబ్బంది, కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులను ఆ ప్రాంతానికి కేటాయించినపుడు.. తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్‌లోని ఆస్తులపై, నిజాం కాలంలో సంక్రమించిన ఆస్తులపై సీమాంధ్రకు హక్కు ఉండదని వారు వాదిస్తున్నారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. దీనిపై సీమాంధ్ర సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాంతాల ఆదాయంతో సమకూర్చుకున్న ఆస్తులపై జనాభా ప్రాతిపదికన వాటా ఉండాల్సిందేనని వారంటున్నారు. అయితే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లోని ఆస్తులకు సంబంధించిన వివరాలను మాత్రం అందులో ప్రస్తావించారు. ఇంతకాలం ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిగా వినియోగించుకుంటున్న ఆస్తులను విభజించాల్సి ఉన్నందున వాటి వివరాలను ఇందులో స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు డీఏ ఇవ్వండి: ఎన్ఎంయూ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులకు కూడా 8.1 శాతం చొప్పున కరువు భత్యాన్ని అందజేయాలని ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శి మహమూద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరువు భత్యాన్ని ఈ నెల వేతనంతో అందజేయాలని, దీనిని జనవరి నుంచి వర్తింపచేయాల్సి ఉన్నందున ఆ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని మరో కార్మిక నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. -
నిబంధనల ప్రకారమే విభజన
ఆర్టీసీ కార్మిక సంఘాలకు విభజన కమిటీ వివరణ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తులపై సీమాంధ్రకు వాటా కల్పించే విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కార్మిక సంఘాలతో బుధవారం ఆర్టీసీ విభజన కమిటీ సమావేశమైంది. నగరంలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్, ఆర్టీసీ ఆసుపత్రి, ప్రింటింగ్ ప్రెస్, బస్‌బాడీ కేంద్రం.. తదితర స్థిరాస్తులపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉంటున్నందున వాటి విలువలో సీమాంధ్రకు వాటా ఇస్తే మెరుపు సమ్మెకు దిగుతామంటూ తెలంగాణ ప్రాంత కార్మిక సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అయితే తమ ముందుంచిన విధివిధానాల మేరకే ఆస్తుల పంపణీ పూర్తి చేశామని కమిటీ ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆస్తులుగా తాము పేర్కొన్న వాటి విషయంలో భవిష్యత్తులో రెండు రాష్ట్రప్రభుత్వాలు చర్చించుకుని, తీసుకున్న నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు వారికి వివరించారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడిగా ఉండనున్నందున వాటిని ఇరు ప్రాంతాల సిబ్బంది వినియోగించుకుంటారని, సీమాంధ్రకు పూర్తిస్థాయి రాజధాని ఏర్పడ్డ తర్వాతే వాటి విలువ చెల్లించాల్సి ఉన్నందున, ఆప్పడు రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి తదుపరి చర్యలు ఉంటాయని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. ఆసుపత్రి, ప్రింటింగ్‌ప్రెస్, ఇతర సేవలు పొందినందుకు సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ్రపభుత్వానికి రుసుము చెల్లించేలా నిబంధన విధించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై తాము హామీ ఇవ్వలేమని, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో కార్మిక నేతలు వెనక్కు తగ్గారు. అయితే, నివేదికను గురువారం యథాతథంగా ఆర్టీసీ బోర్డు ముందుంచితే మాత్రం సమ్మె తప్పదని కార్మిక నేతలు మరోసారి హెచ్చరించారు. -
విభజనకు సీఐడీ కార్యాలయం రెడీ
ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోకి తెలంగాణ సీఐడీ విభాగం ఏసీ గార్డ్స్‌లోని సైబర్ క్రైమ్ భవనంలోకి ఏపీ సీఐడీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు శాఖలో విభజన ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించే పని వేగవంతమైంది. అలాగే రెండు రాష్ట్రాలకు అధికారులు, సిబ్బంది, రికార్డుల విభజనకు అవసరమైన చర్యలను ఆ విభాగం అధిపతి టి.కృష్ణప్రసాద్ సోమవారం పూర్తి చేశారు. రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ విభజనకు సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సీఐడీ కార్యాలయంగా ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోని మూడో అంతస్తును నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రస్తుతం ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ సైబర్‌క్రైమ్‌తోపాటు మరికొన్ని విభాగాలు కొనసాగుతున్న భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ భవనం చిన్నగా ఉండటంతో దాని సమీపంలోనే మరో భవనాన్ని తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మౌలికసదుపాయాలు, రికార్డులు, కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు అధికారులు, సిబ్బందిని కూడా పంపిణీ చేసే ప్రక్రియకు కృష్ణప్రసాద్ తుది మెరుగులు దిద్దారు. వీటిని ఆమోదానికి డీజీపీ ద్వారా గవర్నర్ నరసింహన్‌కు పంపినట్టు తెలిసింది. -
సీమాంధ్ర రాజధాని ఎంపిక... నేడు శివరామకృష్ణన్ కమిటీ రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ముగియడంతో సీమాంధ్రకు రాజధాని ఎంపిక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తే మేలన్న అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఉన్నతాధికారుల బృందం వస్తోంది. 9న విశాఖ, 10న రాజమండ్రి, 11న విజయవాడ, 12న గుంటూరు సందర్శించి 13న హైదరాబాద్‌లో అధికారులతో భేటీ అవుతుంది. 14న ఒంగోలు, తిరుపతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలించి ఢిల్లీ తిరిగి వెళ్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కమిటీ ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు సమావేశమైంది. 12 అనిల్ గోస్వామి రాక విభజన ప్రక్రియను సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి 12న హైదరాబాద్ వస్తున్నారు. విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది, వేగవంతం చేసే అవకాశాలు తదితరాలను పరిశీలించి సూచనలు చేయనున్నారు. గోస్వామితో పాటు హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, 22 కమిటీల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. విభజన ప్రక్రియను మే 15కల్లా పూర్తి చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే డెడ్‌లైన్ విధించడం తెలిసిందే. -
రెండు రాష్ట్రాలకు బడ్జెట్ విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఇక విభజన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రం జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ తేదీ తర్వాత ఏ రాష్ట్రమూ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు గాను విభజనకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆదేశాలను ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేస్తోంది. జూన్ నుంచి ఆగస్టు వరకు గల ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇరు రాష్ట్రాలకు విభజించిన ఆర్థిక శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి మూడు నెలల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను కూడా జారీ చేయనుంది. బడ్జెట్ విభజనలో భాగంగా ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద తెలంగాణ ప్రభుత్వానికి జూన్ నుంచి ఆగస్టు వరకు రూ.26 వేల కోట్లు కేటారుుంచింది. అదే కాలానికి సీమాంధ్రకు రూ.36 వేల కోట్ల బడ్జెట్‌ను కేటారుుంచింది. ఇందుకు సంబంధించిన ఫైలును గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం లభించగానే తెలంగాణ ప్రభుత్వానికి నిధుల వ్యయానికి అనుమతిస్తూ బీఆర్వోను ఆర్థిక శాఖ జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ విధంగా బీఆర్వో జారీ చేయకపోతే జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమస్య ఎదుర్కొంటుందనే ముందు చూపుతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు సీమాంధ్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు వరకు తమకు కేటాయించిన బడ్జెట్ నిధులను వ్యయం చేసుకునేందుకు అవకాశం చిక్కనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ కారణంగా వచ్చే సెప్టెంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉండనుంది. ఇక సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వాలు వేర్వేరుగా పూర్తి స్థాయి బడ్జెట్లను తమ తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటాయి. -
ఇంటర్ బోర్డూ విభజన
తొలుత కమిషనరేట్‌లో విలీనం తర్వాత రెండుగా విభజన నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులు పాఠశాల విద్య, రాజీవ్ విద్యా మిషన్ విలీనం.. ఆగస్టు నాటికి అడ్వాన్స్డ్ పరీక్షల ప్రక్రియ పూర్తి రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకే మరికొన్నింటిపై తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్టు మరో ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూల్లో ఉన్నా.. అధికారులు మాత్రం బోర్డు విభజన ప్రక్రియ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్‌ను ఇంటర్ బోర్డులో కలిపేస్తారు. తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సేవలందించటానికి వీలుగా విభజిస్తారు. ప్రస్తుత బోర్డు నేతృత్వంలో ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఇంటర్ విద్య, ఇంటర్ బోర్డు ఒకే విభాగంగా, ఒకే అధికారి పరిధిలో పనిచేసేలా విలీనం చేస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ నాటికి వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు బోర్డులు ఏర్పాటవుతారుు. ప్రస్తుతం ప్రాథమిక విద్య, సెకండరీ విద్య కు వేర్వేరుగా విభాగాలు, ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇవి రెండూ ఒకే విభాగంగా, ఒకే ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పని చేస్తాయి. పాఠశాల విద్యా డెరైక్టరేట్ (డీఎస్ఈ), రాజీవ్ విద్యా మిషన్లు(ఆర్వీఎం) ఒకే విభాగంగా ఉంటాయి. పదో షెడ్యూల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలను విభజించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని కూడా విభజిస్తారు. ఆయా సంస్థల్లోని ఉద్యోగుల విభజన ప్రక్రియ చివరకు దశకు చేరుకుంది. ఎవరెవరూ ఏయే ప్రాంతాలకు చెందినవారు.. ఆయా సంస్థలను విభజించాల్సి వస్తే.. ఏయే రాష్ట్రాలకు ఏయే కేడర్లలో ఉద్యోగులు అవసరమనే పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. పదో షెడ్యూలులోని సంస్థల విభజనపై ఉన్నత స్థాయిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పది పరీక్షల పరేషాన్.. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడడం, జూన్ రెండు లోపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పూర్తవుతుంది. కానీ, పదో తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెల్లడించే అవకాశం ఉంది. దీంతో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఓ అవగాహనకు వచ్చి.. ఈసారికి కలిపి పరీక్ష నిర్వహించాలనుకుంటే రెండింటికి కలిపి ఒకటిగానే నిర్వహిస్తారు. వేర్వేరుగా నిర్వహించాలనుకుంటే ఎక్కడివక్కడే జరుగుతాయి. ఇంటర్, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మూల్యాంకనం మాత్రం ఎక్కడివి అక్కడే చేస్తారు. డీఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు అక్కడే ప్రస్తుతం ఉపాధ్యాయులు జిల్లాల ఎంపిక కమిటీల ద్వారా నియమితులైన వారే కాబట్టి ఏ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆ జిల్లాల్లోనే ఉండనున్నారు. విభజన ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల సేవల విషయంలో ఎలాంటి సమస్య లేదు. మొత్తం 3.16 లక్షల మంది టీచర్లలో తెలంగాణలో 1.40 లక్షల వరకుండగా, మిగతావారు సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నారు. అయితే వేర్వేరు జిల్లాల్లో డిప్యూటేషన్లు, హైదరాబాద్ వంటి జిల్లాల్లో ఓపెన్ కోటాకు మించి నియమితులైన వారి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ప్రతి తూటా పంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా మావోయిస్టు, ఉగ్రవాద వ్యతిరేక విభాగాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్లనూ సీమాంధ్ర, తెలంగాణలకు పంచాలని ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. పోలీసుశాఖలో శక్తిమంతమైన అత్యాధునిక ఆయుధాలు ఈ రెండింటి వద్దే ఉండటంతో వాటితో సహా ప్రతి తూటానూ 58.37 : 41.63 నిష్పత్తిలో పంచడానికి జాబితా సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు సిబ్బంది పంపకాల మార్గదర్శకాలనూ పూర్తి చేశారు. - దట్టమైన అటవీ ప్రాంతాల్లో, గెరిల్లా ఆపరేషన్స్ చేసే గ్రేహౌండ్స్, అర్బన్ వార్ ఫేర్‌లో ఆరితేరిన ఆక్టోపస్‌లకు భిన్న తరహాలకు చెందిన అత్యుత్తమ ఆయుధాలను ప్రభుత్వం సమకూర్చింది. ఏకే-47 మొదలు ఇన్సాస్ వరకు, చిమ్మ చీకట్లలో సైతం శత్రువు కదలికల్ని సుదూరం నుంచే గుర్తించేందుకు తయారైన నైట్ విజన్ బైనాక్యులర్స్, గాగుల్స్, కార్నర్ షాట్ రైఫిల్స్, ఎంపీ-5 వంటివి ఈ విభాగాల అమ్ములపొదిలో ఉన్నాయి. - గ్రేహౌండ్స్‌లో ఉన్న 2,600 మంది, ఆక్టోపస్లోని దాదాపు 400 మంది సిబ్బందినీ విభజించేందుకు చేపట్టిన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. సీమాంధ్రలో విభాగాల హెడ్‌క్వార్టర్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైనా అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. - అవసరాన్నిబట్టి ఆక్టోపస్ బలగాలను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా తరలించాల్సిన అవసరం ఉండటంతో దీని ప్రధానకేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ నగర శివార్లలో పోలీసు విభాగానికి ఉన్న 70 ఎకరాల స్థలాన్ని దీనికోసం పరిశీలిస్తున్నారు. - సీమాంధ్రకు సంబంధించి మావోయిస్టుల సమస్య ప్రస్తుతం తూర్పు గోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోనే ఉండటంతో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న కార్యాలయాన్నే హెడ్-క్వార్టర్స్‌గా చేయాలని నిర్ణయించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న అధికారుల్లో కొందరు నిష్ణాతులు ఉన్నారు. తాజా విభజన నిర్ణయంతో స్థానికత ఇతర అంశాల ఆధారంగా వీరు రెండు రాష్ట్రాలకూ అవసరమైన స్థాయిలో పంపిణీ జరగకపోతే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు అలాంటి అధికారుల్ని సాంకేతికంగా ఏ రాష్ట్రానికి కేటాయించినా నిర్ణీతకాలంవరకు డెప్యుటేషన్‌పై కొనసాగిస్తూ లోటును భర్తీ చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన తుది కసరత్తుల్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘సచివాలయ’ పంపిణీ ఇలా..
* అత్యధికంగా సీమాంధ్ర వారే సహాయ, ఉప కార్యదర్శులు * డిప్యుటేషన్‌పై ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో సహాయ నుంచి అదనపు కార్యదర్శులు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. ఉద్యోగుల పంపిణీ జిల్లాల నిష్పత్తి ప్రకారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న సహాయ నుంచి అదనపు కార్యదర్శుల పోస్టుల్లో ఏ ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారు, కేడర్ సంఖ్య ఎంత అనే వివరాలను అధికారులు సేకరించారు. ప్రాంతాల వారీగా చూస్తే ప్రధానంగా సహాయ, ఉప కార్యదర్శుల్లో అత్యధికంగా సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే ఉన్నారు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తే పైన పేర్కొన్న పోస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తొలుత మంజూరైన పోస్టులను జిల్లాల నిష్పత్తి మేరకు రెండు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఆ తరువాత కొరత ఉన్న రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. సచివాలయంలో మంజూరైన సహాయ కార్యదర్శులు పోస్టుల సంఖ్య 161 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 108 మంది ఉండగా తెలంగాణకు చెందిన వారు 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిని జిల్లాల నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే సహాయ కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84 మంది, తెలంగాణకు 64 మంది రానున్నారు. ఉప కార్యదర్శుల పోస్టుల సంఖ్య 60 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 45 మంది, తెలంగాణకు చెందినవారు 15 మంది పనిచేస్తున్నారు. వీరు 20 మంది ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు 16 మంది రానున్నారు. సంయుక్త కార్యదర్శుల పోస్టు సంఖ్య 20 కాగా అందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు తెలంగాణకు చెందిన వారు పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు పది, తెలంగాణకు ఏడు పోస్టులు రానున్నాయి. అదనపు కార్యదర్శుల పోస్టుల సంఖ్య ఏడు కాగా అందులో ముగ్గురేసి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందినవారు పనిచేస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇద్దరేసి చొప్పున రానున్నారు. ఇందుకు సంబంధించి పంపిణీ ప్రతిపాదనలను త్వరలోనే గవర్నర్ నర్సింహన్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. -
వైఎస్ఆర్సీపీలో కదనోత్సాహం
కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికలు ఏవైనా.. తీర్పు ఏకపక్షమే. మార్పుతో పాటు యువ నాయకత్వాన్నే తాము కోరుకుంటున్నామని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించడం విశేషం. అదే ప్రత్యర్థి పార్టీల విషయానికొస్తే టికెట్ల విషయంలో స్పష్టత రాకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరి రాజకీయ భవిష్యత్ బలి అవుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది. విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ బలం పెరిగిందని చాటుకునేందుకు చేసిన ప్రయత్నం టికెట్ల విషయానికొచ్చే సరికి బెడిసికొడుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటం.. కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో కాంగ్రెస్, టీడీపీల్లోని ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాణ్యం, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలు.. టీడీపీ కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాల విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేకపోయాయి. కర్నూలు ఎంపీ టికెట్ కోసం కేఈ ప్రభాకర్ తన మార్కు రాజకీయం చేస్తున్నారు. ఇదే టికెట్‌ను ఆశిస్తున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథిపై అధినేత చంద్రబాబు సమక్షంలోనే ప్రభాకర్ వర్గీయులు దాడి చేయడాన్ని ఆ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్థసారథికే టికెట్ ఇవ్వాలంటూ వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురినీ కాకుండా భారీ ప్యాకేజీతో మరో అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పాణ్యం టీడీపీ అభ్యర్థిగా ఏరాసు ప్రతాప్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో ఇప్పటికే బాబు హామీతో ప్రచారం చేసుకుంటున్న కేజే రెడ్డి నిరాశకు లోనయ్యారు. తన ఆశలపై నీళ్లు చల్లిన నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడ్డారు. మొదటి విడతలో ఆదోని, ఆలూరు, బనగానపల్లె, నంద్యాల లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించగా.. రెండో విడతలో ఆళ్లగడ్డకు గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలానికి శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలుకు టీజీ వెంకటేష్, నందికొట్కూరుకు లబ్బి వెంకటస్వామి, నంద్యాలకు శిల్పా మోహన్‌రెడ్డి, డోన్‌కు కేఈ ప్రతాప్, పత్తికొండకు కేఈ క్రిష్ణమూర్తి పేర్లు ఖరారయ్యాయి. కోడుమూరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడి కావడంతో ఆ నియోజకవర్గంలోని మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పార్టీకి రాంరాం చెప్పేశారు. ఫలితంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మణిగాంధీకి ఎదురుండదని తెలుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో అధిక శాతం కొత్త ముఖాలే కావడంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నామమాత్రం కానుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నాలుగు మాసాల పాటు విరామం లేకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు సాగించిన పోరాటం అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించనుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అభ్యర్థుల్లో అధిక శాతం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో ప్రజలు వారిని చీకొట్టక మానరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. కర్నూలు మాజీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరడం వల్ల కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గ అభ్యర్థుల విజయం మరింత సులువవుతోంది. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, ఆదోని నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీల జనాభా అధికంగా ఉంది. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఆ నియోజకవర్గాల తెలుగు తమ్ముళ్ల రాజకీయ భవితవ్యంపై పెనుప్రభావం చూపనుంది. నంద్యాల ఎంపీ అభ్యర్థి ఫరూక్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా వర్గీయుల మధ్య విభేదాల కుంపటి రాజుకుంటోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఈ పరిస్థితి అనుకూలం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో వచ్చే ఎన్నికల్లో ఆ వర్గీయులు కృతజ్ఞత చాటుకోవడంలో భాగంగా పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
ఆర్థిక వృద్ధికి విభజన అక్కర్లేదు
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరును మెరుగుపర్చడానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు పరిష్కారం కాదని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ (ఇండ్-రా) సంస్థ తెలిపింది. 2006 - 2013 మధ్యకాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరును అధ్యయనం చేసిన ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే 11 రాష్ట్రాలు అధిక వేగంతో వృద్ధిని సాధించగా వీటిలో ఐదు మాత్రమే చిన్న రాష్ట్రాలు. అవి: ఉత్తరాఖండ్, కేరళ, హర్యానా, గోవా, హిమాచల్ ప్రదేశ్. 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లు మిశ్రమ పనితీరును కనబర్చడాన్ని బట్టి, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినంతమాత్రాన ఆర్థికాభివృద్ధికి భరోసా ఉండదని స్పష్టమవుతోందని, రాష్ట్రాల అభివృద్ధికి అక్కడి ప్రత్యేక పరిస్థితులు, విధాన నిర్ణయాలు కారణమని నివేదిక పేర్కొంది. కేవలం విభజన వల్లే వృద్ధి జరిగిందని చెప్పలేమని అభిప్రాయపడింది. -
రాజధాని కోసం నిపుణుల కమిటీ
-
టీచర్లకు ఆప్షన్లు లేవ్!
ఉపాధ్యాయ సంఘాలకు కమల్‌నాథన్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకూ ఆప్షన్ సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ తోసిపుచ్చారు. టీచర్లు రాష్ట్రస్థాయి క్యాడర్ కిందకు రారు కాబట్టి చట్ట ప్రకారం ఆప్షన్ సౌకర్యం ఉండదని ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు కమిటీని ఏం కోరాయంటే... సొంత రాష్ట్రాలకు పంపాలి: పీఆర్టీయూ ఓపెన్ కోటాలో వచ్చిన టీచర్లకు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం కల్పించాలి. 2000 డీఎస్సీ కంటే ముందు 30 శాతం, తర్వాత 20 శాతం ఓపెన్ కోటా అమల్లో ఉంది. ఫలితంగా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో నాన్ లోకల్ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. స్థానికతను గుర్తించి వారి సొంత జిల్లాలకు పంపించాలి. దంపతులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటే.. వారికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలి. ఉమ్మడి నిబంధన అమలు చేయాలి: ఎస్టీయూ కాగా రాష్ట్రంలో 7 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 93 శాతం మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఉన్నారని, అందరికీ ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని ఎస్టీయూ కోరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని, కొత్త రాష్ట్రాల్లోనూ టీచర్ల సమస్యలు కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ కోరింది. -
రాజధాని కోసం నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత రాజధాని హైదరాబాద్ కొత్త రాష్ట్రమైన తెలంగాణ పరిధిలోకి వెళ్లినందున ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇందుకోసం ఐదుగురు నిపుణులతో కూడిన ఒక కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. వీరందరికీ నగరీకరణ, నగర నమూనాలు, సంబంధిత శాఖలు, సంబంధిత విద్యాసంస్థలతో అనుబంధం ఉన్న నిపుణులే కావడం విశేషం. పశ్చిమబెంగాల్ 1958వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్, పట్టణాభివృద్ధి శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న కె.శివరామకృష్ణన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ సంస్థ డెరైక్టర్ ఆరోమర్ రేవి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ జగన్ షా, అర్బన్ డిజైన్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ చీఫ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రతీన్ రాయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నవిధంగా ఈ కమిటీ నోటిఫైడ్ తేదీ అయిన మార్చి 1 నుంచి ఆరు నెలల్లోపు కొత్త రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడం, నగర ప్రణాళికను ఏర్పాటుచేయడం, అవసరమైన ఆర్థిక అంచనాలను రూపొందించడం వంటి అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం, ఇతర వర్గాలతో సంప్రదించి ఈ కమిటీ నివేదిక తయారుచేసి కేంద్రానికి సమర్పించనుంది. కె.సి.శివరామకృష్ణన్ కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో చీఫ్ఎగ్జిక్యూటివ్గా, పర్యావరణ, పట్టణాభివృద్ధి శాఖలో కీలక విధులు నిర్వహించా రు.1992లో పదవీవిరమణ పొందారు. పాలసీ, పరిపాలన అంశాలపై అంతర్జాతీయంగా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. -
విభజనతో వీధిపాలు....మే నెలాఖరుకల్లా ఊస్టింగ్
-
లక్ష జనాభాకు 96 మంది పోలీసులే
ఉండాల్సింది కనిష్టంగా 125 మంది కేటాయించిన పోస్టుల్లో 30 వేలకు పైగా ఖాళీనే.. మహిళా ఫోర్స్ విషయంలో మరీ ఘోరం విభజన లెక్కల నేపథ్యంలో వెలుగులోకి మనకన్నా కర్ణాటక, తమిళనాడులే మిన్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు విభాగం పంపకాల కోసం తీస్తున్న లెక్కలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు కనిష్టంగా 125 మంది సివిల్ పోలీసులు ఉండాలి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాని ప్రకారం కేవలం 96 మందే ఉన్నారు. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలకు కలిపి కేటాయించిన పోస్టుల సంఖ్య 1,29,225 కాగా, అందుబాటులో ఉన్నది మాత్రం 96,978 మాత్రమే. మహిళా పోలీసుల అంశంలో పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఊహించని పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీస అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 665 మందికి కచ్చితంగా ఒకరుండాలి... నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి 665 మంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం ప్రతి 886 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు. ఫలితంగా శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో పదవీ విమరణలు చేస్తున్న స్థాయిలో ఎంపికలు జరగకపోవడంతో కేటాయించిన పోస్టుల్లోనూ అనేకం ఖాళీగా ఉంటున్నాయి. ఈ కారణంగానే అవసరమైన స్థాయిలో పోలీసులు అందుబాటులో లేరు. ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారుల కంటే క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన కానిస్టేబుల్ పోస్టుల్లోనే కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత నేపథ్యంలో మార్గదర్శకాల ప్రకారం ఓ దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 40 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉండగా... ఇప్పుడు ఒక్కోక్కరూ 150కి పైగా కేసుల దర్యాప్తు చేస్తున్నారు. దీని ప్రభావం నాణ్యతపై పడి శిక్షలు పడే కేసుల సంఖ్య పడిపోతోంది. ఎస్ఐ స్థాయిలోనూ తీవ్ర కొరత పోలీసింగ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా, దర్యాప్తు తదితర అంశాలు ప్రాథమికమైనవి. ఈ విధులు నిర్వర్తించడంలో క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులైన, జిల్లాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఎస్ఐల పాత్ర చాలా కీలకం. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల లేమి తీవ్ర సమస్యగా మారింది. కొన్నేళ్ల కిందట కేటాయించిన సిబ్బందిలో దాదాపు 24 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడంతో మూడు షిప్టుల్లో (8 గంటల చొప్పున) పనిచేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో (12 గంటల చొప్పున) పని చేస్తున్నారు. దీంతో పని భారం పెరిగి, పనిలో నాణ్యత కొరవడుతోంది. ఫలితంగా సిబ్బంది ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కానిస్టేబుల్ స్థాయిలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. స్వచ్ఛంద సేవగా పరిగణించే హోంగార్డులు, మాజీ సైనికాధికారుల్ని ఎంపిక చేసుకునే స్పెషల్ పోలీసు ఆఫీసర్లు (ఎస్పీఓ)లతోనే చాలా విభాగాల్లో పనులు చక్కబెడుతున్నారు. వీరిని కేవలం బందోబస్తు, భద్రతా విధులకు మాత్రమే వాడాల్సి ఉండటంతో అసలు సమస్య మాత్రం తీరట్లేదు. తీసికట్టుగా మహిళా సిబ్బంది... రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మహిళలే ఉంటున్నారు. అయితే వీరికి రక్షణ, సహాయ సహకారాల కోసమంటే ఏర్పాటు చేసిన మహిళా ఠాణాలు, సిబ్బంది మాత్రం ఎందుకూ కొరగాని సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యమాలతో పాటు నిరసన కార్యక్రమాల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. వీరిని అదుపు చేయడంతో పాటు వివిధ నేరాల్లో అరెస్టు అయిన మహిళల్ని విచారించడానికి, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి, భద్రతా ఏర్పాట్లలో భాగంగా మహిళల్ని సోదాలు, తనిఖీలు చేయడానికీ కచ్చితంగా మహిళా పోలీసులు అవసరం. వీరు అవసరమైన స్థాయిలో లేకపోవడంతో అనేక సందర్భాల్లో అపశృతులు చోటు చేసుకున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో 196 మహిళా పోలీసుస్టేషన్లు ఉండగా... మన రాష్ట్రంలో ఆ సంఖ్య కేవలం 32కు పరిమితమైంది. అక్కడ ప్రత్యేకించి మహిళా బెటాలియన్, కమాండో ఫోర్స్ ఉండగా... ఇక్కడ ఈ అంశం కేవలం ప్రతిపాదనలు మాత్రమే పరిమితమైంది. ఖాళీలు నింపాలి, సంఖ్యను పెంచాలి అరకొర సంఖ్యలో ఉన్న సిబ్బందితో పని భారం మొత్తం ఉన్న వారిపైనే పడుతోంది. పగలురాత్రి డ్యూటీలు చేస్తుండటంతో పోలీసులు అనేక శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి బారినపడి తీవ్రమైన దుష్ఫభ్రావాలు చవిచూస్తున్నారు. దీని ప్రభావం కుటుంబంపైన కూడా ఉంటోంది. ప్రతి 500 జనాభా ఒక పోలీసు ఉండాలన్నది పోలీసు సంస్కరణలు చెప్పే అంశాల్లో కీలకమైంది. ఏ స్థాయిలోనూ ఇది అమలు కావట్లేదు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీఐపీ బందోబస్తు, ఇతర డ్యూటీలపై సిబ్బంది వెళ్లిపోగా.. ఆ ప్రాంతంలో జరగరానిది జరిగితే కనీసం నలుగురు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. ఇవి మారాలంటే తక్షణం ఖాళీలు నింపాలి. పోలీసు సిబ్బంది సంఖ్యనూ మరో లక్ష పెంచాలి. దర్యాప్తు, బందోబస్తు విభాగాలను వేరు చేయాలి. - గోపిరెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు -
కిరికిరిగా మార్చుకో: చంద్రబాబు
* కిరణ్ పార్టీపై ధ్వజమెత్తిన చంద్రబాబు * సీఎంగా విభజన అడ్డుకోలేని ఆయన పార్టీ పెట్టి ఏం ఉద్ధరిస్తారు? * రాష్ట్రాన్ని ముక్కలుచేసి ఇప్పుడు రాజధాని పేరుతో ప్రజల్లో కాంగ్రెస్ చిచ్చు * తెదేపా అధికారంలోకి వస్తే మేమే రాజధానిని ఎంపికచేస్తాం * విశాఖలో గర్జించని ‘ప్రజా గర్జన’ సాక్షి, విశాఖపట్నం: ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం ఉద్ధరించలేదు. విభజనపై కనీసం పోరాడలేదు. ఏ న్యాయం చేయలేదు. అసలేం మేలు చేశావని ఇప్పుడు పార్టీ పెడుతున్నావ్? ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేని నీవు పార్టీ పెట్టి ప్రజలకు ఏం చేయగలవ్? ప్రజలపై ప్రేమతోకాదు... ఏదోలా ఓట్ల కోసమే పార్టీ పెడుతున్నావ్... నీ పార్టీ పేరు కిరికిరి పార్టీ అని పెట్టుకుంటే మేలు’’ అంటూ కిరణ్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మళ్లీ ఇప్పుడు రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్‌పార్టీ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చిన సోనియా, రాహుల్ విభజనపై ఏం మాట్లాడకపోయినా, వారి బంట్రోతులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం విశాఖనగరంలో తెదేపా ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆరవ ప్రజాగర్జన సభలో బాబు ప్రసంగించారు. ప్రజలను నిలువునా వంచిస్తోన్న పదితలల కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. విభజన తర్వాత సీమాంధ్రను అభివృద్ధిచేయగల సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు రాజధానిని తానే ఎంపికచేస్తానని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిలా తీర్చిదిద్దుతానన్నారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నాకే అభ్యర్థులను ఎంపికచేస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను చేర్చుకుంటున్నామని, దీనిపై నాయకుల్లో భేదాభిప్రాయాలు వద్దని చెప్పారు. గర్జించని గర్జన: తెదేపా విశాఖలో తలపెట్టిన ప్రజాగర్జన విశాఖలో దాదాపుగా విఫలమైంది. లక్ష మంది వస్తారని నేతలు ఊదరగొట్టినా 30 వేల మందికి మించలేదు. చంద్రబాబు 7.48 గంటలకు ప్రసంగం ప్రారంభించి 9.12 గంటల వరకు సుదీర్ఘ ప్రసంగం చేయడం, చెప్పిందే చెప్పడంతో జనం విసుగెత్తి బయటకు వెళ్లిపోయారు. దీంతో 8.30కి సభాప్రాంగణం సగానికిపైగా ఖాళీ అయిపోయింది. చంద్రబాబుపై అయ్యన్న గర్జన టీడీపీలో విభేదాలు అధినేత చంద్రబాబుకే చెమటలు పట్టిం చాయి. కాంగ్రెస్‌నుంచి వచ్చిన గంటాను పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రజాగర్జన సభలో విరుచుకుపడ్డారు. గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్య, విశాఖ నగర మాజీ మేయర్ రాజాన ర మణి తదితరులు టీడీపీలో చేరారు. వీరికి బాబు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అయ్యన్న ప్రసంగిస్తూ... ‘‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలియదు. మనం మాత్రం పార్టీలోనే కొనసాగుదాం’’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఒక్కసారిగా బాబు అవాక్కయ్యారు. అయ్యన్న తనను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేయడంతో గంటా సీటులోంచి లేచి గరికపాటిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. గరికపాటి ఓదార్చే ప్రయత్నంచేసినా ఆయన వినలేదు. ఇంతలో అయ్యన్న తన ప్రసంగాన్ని ముగిస్తూ... పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఒక్క మాట అంటూ బాబును ఉద్దేశించి... కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా పార్టీలో బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిదంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత తన కొడుకుతో సహా వేదిక దిగి విసురుగా వెళ్లిపోయారు. బాబు బుధవారం నగరంలోకి వచ్చిన వెంటనే అయ్యన్నను బుజ్జగించే ప్రయత్నంచేశారు. సభకు బయలుదేరేముందు వాహనంలో పక్కన నిల్చోబెట్టుకుని సభప్రాంగణం వద్దకు ర్యాలీగా వచ్చారు. కానీ అయ్యన్న మాత్రం గంటా విషయంలో బాబుకు ఝలక్ ఇవ్వడం విశేషం. -
ఆప్షన్లకే ఐపీఎస్‌ల మొగ్గు
అందరికీ అవకాశం కల్పించాలంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు శాఖ విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఈ పంపకాలపై అధికార వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని, తెలంగాణ అధికారులు మాత్రమే ఇక్కడ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ఎలాట్ అయిన అధికారులకు మాత్రమే ఎక్కడ పని చేయాలని కోరుకుంటున్నారనే ఆప్షన్ ఇస్తారనే వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ప్రధానంగా ఈ అంశం పైనే చర్చించింది. కేవలం ఇతర రాష్ట్రాల ఐపీఎస్‌లకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆప్షన్ సౌకర్యం ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అంటున్నారు. ఎవరిని, ఏ రాష్ట్రానికి కేటాయించినా అది నిబంధనల ప్రకారమే జరగాలని, ఒక్కో అధికారికి ఒక్కో విధానం వర్తింపజేయకూడదని స్పష్టం చేస్తున్నారు. అపోహలకు తావులేకుండా ఆప్షన్ కోరుకున్న అధికారికి ఆ రాష్ట్ర క్యాడర్ లభించనట్లైతే అందుకు కారణాలను సైతం కచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లాలని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయించింది. -
సమన్యాయం చేస్తాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హామీ డీసీసీ సమావేశంలో అధినేత్రిపై ప్రశంసల వర్షం టీఆర్ఎస్తో పొత్తూ వద్దన్న జిల్లా నేతలు కంచుకోటను నిలుపుకుంటామన్న ఎమ్మెల్యేలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర గైర్హాజరు సాక్షి, సంగారెడ్డి: ‘ఎన్నికల ముందు ఓట్ల కోసం తెలంగాణను ఏర్పాటు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల చేతిలో అధికారాన్ని పెట్టేందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం..’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అన్నీ సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన బీసీలు, మైనారిటీలకు న్యాయం చేయాలని ఆ పార్టీ జిల్లా నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ పై వ్యాఖ్యాలు చేశారు. సంగారెడ్డి మండలం పొతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు అక్కడే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు ఏర్పాటులో ఎదురైన అనుభవాలు, కాంగ్రెస్ అనుసరించిన వైఖరీని విషదికరించారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును సమర్థించిన బీజేపీ రాజ్యసభలో మాత్రం వ్యతిరేకించి ద్వంద్వ ప్రమాణాలు పాటించిందన్నారు. రాజ్యసభలో టీ-బిల్లు చట్ట విరుద్ధమంటూ బీజేపీ సభ్యులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. టీడీపీలో సగం మంది బిల్లుకు మద్దతు ఇస్తే సగం మంది వ్యతిరేకించారన్నారు. ఒకానొక దశలో బిల్లు పాస్ కావడం కష్టంగా మారినా కాంగ్రెస్ చిత్తశుద్ధి ముందు ఈ సమస్యలన్నీ చిన్నగా మారాయన్నారు. టీఆర్ఎస్తో పోత్తూ వద్దు.. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా..ఆ పార్టీతో పొత్తు లేకపోయినా ఒంటరిగా పొటీ చేసి గెలవగల సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్తో పొత్తు వద్దని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముందుండి నడిచారన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాల్లో మార్పులు వస్తాయని ఆ వర్గాలు భావిస్తున్నాయని..వారి ఆశలను సాకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 10 శాసనసభ స్థానాలుంటే రెండు స్థానాల్లో ఎస్సీలు, ఓ స్థానంలో బీసీ ఎమ్మేల్యేలు, మిగి లిన ఏడు స్థానాల్లో ఓసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. రాను న్న ఎన్నికల్లో జిల్లాలో బీసీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన డిమాండును జైరాం రమేశ్ చెవిలో వేసేందుకు ఆయన హిందీలో ప్రసంగించారు. సోని యా గాంధీని తెలంగాణ ప్రజలు దేవతగా పూజిస్తున్నారని ప్ర శంసలతో ముంచెత్తారు. జిల్లాలో మైనారిటీలకు సైతం ఓ సీటు ను కేటాయించాని నందీశ్వర్ కోరారు. దీనిపై సంగారెడ్డి ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ ..‘నీ పదవిని రక్షించుకోడానికి ఇతరుల పదవులకు ఎసరుపెడుతావా..?’ అని సరదాగా వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి, జహీరాబాద్ ఎ మ్మెల్యే జే గీతారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కోటాలో మాజీ మంత్రి ఫరీదొద్దీన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఈ సమావేశంలో మా జీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు పికి ష్టారెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి తదితరులుపాల్గొన్నారు. దామోదర గైర్హాజరు: కేంద్రమంత్రి జైరాం రమేశ్ పాల్గొన్న సమావేశానికి దాదాపు జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ సైతం గైర్హాజరయ్యారు. -
ఎన్నికళ తప్పిన కాంగ్రెస్!
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. ఎన్నికల ముందు ఉండవలసిన హడావుడి ఆ పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. అంతటా నిర్లిప్తత ఆవరించింది. ఎన్నికలంటేనే వారు భయపడిపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఆ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గెలిచే అవకాశం ఎలాగూ లేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేక త వ్యక్తం కాకతప్పదని మధనపడుతున్నారు. దీంతో చాలా మంది నేతలు పోటీ చేయడానికి ముందుకురావడంలేదు. ఇంకొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర విభజన... సమైక్యాంధ్ర ఉద్యమం... ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ విధించి న కర్ఫ్యూ... వెరసి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ దయనీయ స్థితి కి చేరింది. విజయనగరంలో ఇప్పుడా పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నేతలంతా డైలమాలో పడ్డా రు. అన్నీ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నా కాంగ్రెస్‌లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ నేతల అభద్రతా భావం బయటపడుతోంది. ప్రజాకంటక పాలనతో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ నాయకులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు నగరంలో విధించిన కర్ఫ్యూతో ప్రజల్లో తిరగలేని పరిస్థితి దాపురించింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ తీరును ఎండగట్టే విధంగా మాట్లాడుతుండడంతో తాము కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. కర్ఫ్యూతో ఎదురైన ఇబ్బందులు, కర్ఫ్యూ అనంతరం పెట్టిన కేసులతో తీవ్ర ఆవేదనతో ఉన్న జనాలు ఎన్నికలెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తూ వచ్చారు. నిరీక్షణకు తగ్గట్టుగానే వరుస ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. అన్నింటి కంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలొస్తే చాలు సందడి చేసే హస్తం నేతలు మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కిమ్మనడం లేదు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్నీ పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తూ, ఎన్నికల జోష్ కనబరుస్తున్నా కాంగ్రెస్‌లో మాత్రం కనీస చలనం లేదు. ప్రజల నాడిని పసిగట్టిన ఆ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు. ఏం చేశామని ప్రజల్లోకి వెళ్లగలమని, ఏం చెప్పి ఓటు అడగగలమని ప్రశ్నించుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉండడమే మేలన్న అభిప్రాయానికొచ్చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తే గెలుపు పక్కన పెడితే కనీసం ప్రచారంలోనైనా ఆదరిస్తారన్న ఆలోచనతో ఉన్నారు. లేదంటే ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడం మంచిదనే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా నాయకత్వానికి కూడా అవే సంకేతాలు పంపించినట్టు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన జిల్లా నాయకులు అప్రమత్తమై మాజీ కౌన్సిలర్లు, క్రియాశీలకంగా పనిచేసిన నాయకులతో సంప్రదింపులు చేసేందుకు రంగంలోకి దిగారు. అటువంటి ఆలోచన వద్దని, పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఒప్పిస్తున్నారు. కానీ నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ససేమిరా అంటున్నారు. అయితే అభ్యర్థి ఖర్చంతా భరిస్తానని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని కాంగ్రెస్ కీలక నేత ఒకరు భరోసా ఇస్తున్నారు. ఇంతలా చెబుతున్నా పోటీ చేసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆ మధ్య ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినా జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి పోటీ చేసేదెవరు అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇంతవరకు ఆ పార్టీ అభ్యర్థిగా ఏ ఒక్కరూ ప్రజలకు వద్దకు వెళ్లడం లేదు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసేదెవరనేది తేలాకే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఎన్నికల జోష్ ఏ మాత్రం కన్పించకుండా కాంగ్రెస్ స్థబ్దుగా ఉంది. బెల్టు దుకాణాలు మూసివేయూలి విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అనధికార బెల్టు దుకాణాలు మూసివేయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీసీ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘ సూచనలతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో మద్యం విక్రయాలు, సరఫరాపై నిరంతం నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల పరిధిలో బెల్టుదుకాణాలను మూసివేయించాలన్నారు. లెసైన్సు ఉన్న మద్యం దుకాణాలు నిబంధనల ప్రకారం నడిచేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సరిహద్దుల వెంబడి చెక్పాయింట్లు, ఇంటిలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మూడు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సముద్ర తీరం నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రత్యేకంగా ఒక నిఘా బృందాన్ని తీర ప్రాంతంలో కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనందరాజు, విజయనగరం, పార్వతీపురం ఎక్సైజ్ సూపరిండెండెంట్లు పి.శ్రీధర్, వెంకటేశ్వర్లు, పార్వతీపురం ఏఈఎస్ ప్రసాద్, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కిరణ్ పార్టీ కొత్త డ్రామా !
కురబలకోట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సహకరించి సీమాంధ్రులను మోసగించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు పార్టీ పెడుతూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె సమన్వయకర్త ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కురబలకోట మండలం తెట్టుగ్రామంలో గురువారం ఆయన గడగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పేరుతో జనాన్ని మోసగించిన కిరణ్ కొత్త పార్టీ పెట్టి చెవిలో పువ్యు పెడుతున్నారని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరిచేందుకు కొత్త పార్టీ వస్తున్నట్లుందన్నారు. రాష్ట్ర విభనకు చాపకింద నీరులా చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తెలుగు జాతి కలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం పదవి పోయాక ఉనికి కోసమే ఈ కొత్తపార్టీ పుట్టుకొస్తోందని విమర్శించారు. స్వార్థపరులను జనం నమ్మరన్నారు. ఎన్ మనోహర్‌రెడ్డి, ఎంజీ మల్లయ్య, కె ఫజరుల్లా, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. -
విభజన, సమీక్షే పాలన..!
లక్షల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్ల జిరాక్స్‌లు మరోవైపు గవర్నర్ సమీక్షకోసం ఫైళ్లను సిద్ధం చేస్తున్న వైనం సాధారణ ఫైళ్ల గురించి పట్టించుకునే నాథుడే లేడు సాక్షి, హైదరాబాద్: రాష్టంలో పాలన పడకేసింది. సచివాలయం నుంచి సాధారణ ప్రభుత్వ కార్యాలయాల వరకు.. ఐఏఎస్ అధికారులనుంచి సాధారణ ఉద్యోగుల వరకూ అందరూ విభజన పనిలోనే మునిగితేలుతున్నారు. మరోవైపు గత రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ నర్సింహన్ సమీక్షించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గవర్నర్ సమీక్షకు ఎటువంటి ఫైళ్లు పంపాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల ఐఏఎస్‌లకే అప్పజెప్పేశారు. దీంతో గత రెండు నెలల్లో తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను అన్నింటినీ పంపించేయాలని ఆయా శాఖలకు చెందిన ఐఏఎస్‌లు భావిస్తున్నారు. ఫలితంగా ఆయా శాఖల్లో దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. దీంతో సాధారణ ఫైళ్లు అంగుళం కూడా కదలడంలేదు. - ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీరు. మున్సిపల్ వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. అన్ని శాఖల్లో కలిపి లక్షల సంఖ్యల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్లు ఉన్నాయి. ఈ ఫైళ్లను తెలంగాణ, సీమాంధ్ర వారీగా విభజించడంపైనే ఉద్యోగులందరూ పనిచేస్తున్నారు. ఫైళ్ల విభజన పూర్తి చేసిన తరువాత వాటిని జిరాక్స్‌లు లేదా స్కానింగ్ చేసే పనిని చేపట్టనున్నారు. - అత్యంత ప్రాధాన్యత విభజనేనని, అందరూ ఈ పనిలోనే నిమగ్నమవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అన్ని శాఖలు ఈ పనిని తప్ప మరో పనిని చేపట్టడం లేదు. - ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటికీ సాధారణంగా జరగాల్సిన పనులను విభజన నేపథ్యంలో అధికార యంత్రాంగం పక్కన పెట్టేసింది. సచివాలయం సీ బ్లాకులోనే సలహాదారులు గవర్నర్‌కు పాలన అంశాల్లో సలహాదారులగా నియమితులయ్యే వారికి సచివాలయంలోని సీ బ్లాకు నాలుగో అంతస్తులో గతంలో సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం ఉన్న పేషీని, అలాగే ఐదో అంతస్తులో గతంలో సీఎం కార్యదర్శి రావత్ ఉన్న పేషీని కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. వారు బస చేయడానికి లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు. -
‘కొత్త రాజధాని’కి రాష్ట్ర కమిటీ
రంగాల వారీగా వేర్వేరు కమిటీలు రాష్ట్ర పునర్విభజన విభాగం ఏర్పాటు కేంద్ర కమిటీకి సహకారం అందించేందుకు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులపై రంగాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వుుఖ్యమైన కమిటీల వివరాలు... సీమాంధ్రకు కొత్త రాజధానిని గుర్తించేందుకు కేంద్రం నియమించే నిపుణుల కమిటీకి సహకారం అందించేందుకు వీలుగా రాష్ర్టస్థాయి కమిటీ ఏర్పాటు. జిల్లా కేంద్రాల నుంచి రైలు, జాతీయ రహదారి సంబంధాలతో పాటు కొత్త రాజధానికి హైదరాబాద్‌కు సంబంధం (కనెక్టివిటీ) ఉండేలా కొత్త రాజధాని గుర్తించాలి. రాష్ట్రస్థాయి కమిటీకి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మొత్తం విభజన ప్రకియ పర్యవేక్షణకు ఉన్నతస్థారుు కమిటీతో పాటు రాష్ట్ర పునర్విభజన విభాగం ఏర్పాటు. ఉన్నతస్థారుు కమిటీ కన్వీనర్‌గా టక్కర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా నాగిరెడ్డి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబాబు, రేమండ్ పీటర్, అజయ్ మిశ్రా, సమీర్ శర్మ, బి.వెంకటేశ్వరరావు, రాజీవ్ శర్మ ఉంటారు. పునర్విభజన విభాగాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయం చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భవనాలను, ఆస్తులను, బయట ఉన్న ఆస్తులు, భవనాలను మార్చి 15లోగా గుర్తించాలి. ఇందుకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ. రాష్ర్టంలోని 107 శిక్షణ సంస్థలను ఇరు రాష్ట్రాలు ఏడాది పాటు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు వీలుగా రూపొందించేందుకు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ. సీమాంధ్రలో ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల రూపకల్పనకు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ. కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ మండలి ఏర్పాటు, పనులు, ఆపరేషన్ మార్గదర్శకాలు, సిబ్బంది, బడ్జెట్, కార్యాలయాల పంపిణీపై సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన కమిటీ. 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా విద్యుత్ రంగం పంపిణీ ఎలా జరిగిందో అధ్యయనం చేసి రాష్ట్రంలో విభజనపై నివేదిక ఇచ్చేందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు, ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనకు సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన కమిటీ. -
2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు
‘సాక్షి’కి సీఎస్ మహంతి ప్రత్యేక ఇంటర్వ్యూ రాష్ట్ర విభజనలో, ఇరు రాష్ట్రాల సుపరిపాలనలో కీలక పాత్ర పోషిస్తా అవసరం లేని సంస్థలు, శాఖల మూత... మరికొన్ని విలీనం ఫైళ్లు ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం... ఉద్యోగులు ఇక రాజకీయాలు వదిలేయాలి సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి తెలిపారు. విభజన నేపథ్యంలో సీఎస్‌గా మరో 4 నెలల పొడిగింపుతో మహంతి ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలు, కేటాయింపులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో సుపరిపాలన తీసుకురావడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టడానికి కృషి చేయనున్నారు. నిజానికి శుక్రవారం పదవీకాలం పూర్తి కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో కంటిన్యుటీ ఉండాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి మహంతి పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా మహంతి సాక్షితో ప్రత్యేకంగా వూట్లాడారు. వివరాలు ఆయున మాటల్లోనే... కేంద్ర సర్వీసులో కార్యదర్శి హోదా పదోన్నతి వచ్చినప్పటికీ సీఎం కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చాను. వచ్చాక మూడు నెలలు మాత్రమే ప్రశాంతంగా ఉంది. తరవాత తుపాన్లు, వరదలు, ఉత్తరాఖండ్ దుర్ఘటన, తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలకు తోడు రాజకీయ అనిశ్చితి కూడా నెలకొంది. వీటన్నింటినీ అధికార యంత్రాంగం బాగానే అధిగమించింది. అధికారులకు ఎప్పుడూ అజెండా ఉండకూడదు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. విభజన అంత సులభతరం కాదు. సుదీర్ఘ కాలం పడుతుంది. ఇరు రాష్ట్రాలు అవసరమైన సంస్కరణల తో ముందే గట్టి పునాది నిర్మించుకోవాలి. అందుకోసం సుదీర్ఘకాలం పని చేస్తాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో సంస్కరణలు, సుపరిపాలనకు మార్గదర్శకాల రూపకల్పన చేస్తా. ఇందుకు 30 మంది యువకులతో పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. వాటిని ఇరు రాష్ట్రాలు మూసేసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక శాఖలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన విభాగాలున్నాయి. పరిశ్రమల శాఖలో నలుగురు ఐఏఎస్ అధికారులతో విభాగాలున్నాయి. విభజన తర్వాత అంతమంది అవసరం లేదు. అలాగే కొన్ని శాఖలను విలీనం చేయాలి. కొన్ని కార్పొరేషన్లలో, శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులున్నారు. మరికొన్నింట్లో ఉద్యోగుల కొరత ఉంది. వీటిని సంస్కరణల ద్వారా సరిచేయూలి. విభజన సమయంలో అధికారులెవరూ ఇళ్లకు ఫెళ్లు తీసుకువెళ్లరాదు. దీనిపై నిషేధం విధించాం. ఫైళ్లు తీసుకువెళ్లడంపై నిఘా కోసం జీఏడీ, ప్రత్యేక భద్రత, విజిలెన్స్‌తో కమిటీ ఏర్పాటు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల మంజూరు సంఖ్య 376. ప్రస్తుతం 299 మందే ఉన్నారు. దీంతో 77 మంది ఐఏఎస్‌ల కొరత ఉంది. విభాగాలు విలీనం, సంస్కరణల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఐఏఎస్‌లకు ఆప్షన్స్ అడుగుతారు. అయితే కొంతమంది ఐఏఎస్‌ల్లో ఆందోళన ఉంది. తమిళనాడుకు చెందినవారు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారు తెలంగాణలో పనిచేయడానికి సుముఖత చూపుతున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, ఆప్పుల పంపిణీ, ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పాలన చాలా క్లిష్టతరం. ఇందుకు చాలా పని చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను, మరి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేయాలి. సచివాలయంతో పాటు కొన్ని రంగాల్లో అధికారులు విభజన చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కాదు. అధికారులు ప్రతిపాదనలను తయారు మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. విభజనోద్యమం సందర్భంగా ప్రభుత్వోద్యోగులు క్రమశిక్షణారహితంగా వ్యవహరించారు. వారిక రాజకీయాలు వదిలి నియమావళి ప్రకారం, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. ‘మీ సేవ’లో వక్ఫ్‌బోర్డు సేవలు రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నాలుగు సేవలను ఇకపై మీ సేవ ద్వారా కూడా పొందవచ్చు. మీ సేవలో వక్ఫ్ బోర్డు సేవలను శుక్రవారం సీఎస్ మహంతి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఒమర్ జలీల్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై వక్ఫ్ బోర్డు ఆస్తుల ధ్రువీకరణ, వక్ఫ్ బోర్డు సంస్థల మేనేజింగ్ కమిటీల ధ్రువీకరణ, ముతవల్లీల నియామక ధ్రువీకరణ, వక్ఫ్ పరిధిలోని సంస్థల పర్యవేక్షకులకు అందించే ఆర్థిక సహాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి పొందవచ్చని జలీల్ తెలిపారు. -
సీమాంధ్రకు హామీలను అమలు చేయండి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్లోని అంశాలపై ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలను ప్రణాళికా సంఘం, కేబినెట్ ఆమోదించాలని, ఈ ప్రక్రియంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జరగాలని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో 20వ తేదీన సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీల పత్రాన్ని జతపరుస్తూ వినతి పత్రాన్ని అందచేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి వెంకయ్య నాయుడు గురువారం మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి హామీల అమలుపై చర్చించారు. అనంతరం తన నివాసంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, ఇతర ప్రస్తావిత ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక సంఘం, కేబినెట్ ఆమోదం తీసుకోడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరామన్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని తెప్పిస్తున్నట్టు అహ్లువాలియా చెప్పారన్నారు. పనులన్నీ సూత్రప్రాయంగా ఆమోదిస్తే మా ప్రభుత్వం వచ్చాక మందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇంకా వెంకయ్య ఏమన్నారంటే.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రలో పది, పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ మొహం చూపించే పరిస్థితి లేదు. జన్మలో కాంగ్రెస్‌ను క్షమించరు. సీమాంధ్రలో జనం బాధ ఆరలేదు. అప్పుడే విశాఖ, తిరుపతి, కర్నూలు.. ఇలా రాజధాని కోసం సంతకాల సేకరణ మొదలు పెట్టారు. దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సోనియా వల్లే ప్రత్యేక హోదా అని జైరాం అంటారు. సోనియా ఇవ్వదలుచుకుంటే లోక్‌సభలో బిల్లు పెట్టినప్పుడు రాహుల్, సోనియా, ప్రధాని సభకు ఎందుకు రాలేదు? సభలో చిర్చించి ఉంటే ప్రజలు నమ్మేవారు. -
అబద్ధాలు ఆపి అభివృద్ధిపై దృష్టి సారించండి
సీపీఐ సదస్సులో వక్తలు సీమాంధ్రకు ప్రత్యేక హోదా బోగస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడం మాని ఉభయ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో సముచిత ప్రాధాన్యత కల్పించాలని పిలుపునిచ్చారు. సీపీఐ అనుబంధ సంస్థ నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రొఫెసర్ కేఆర్ చౌదరి అధ్యక్షతన జరగిన సదస్సులో వివిధ రంగాల మేధావులు, నిపుణులు హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో నష్టపోయేది రాయలసీమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యుత్ చార్జీల భారం పెరుగుతుందన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని ప్రకటించిన ప్రత్యేక హోదా పెద్ద బోగస్ అని అభిప్రాయపడ్డారు. ఆదివాసీల సమస్యలపై నీటిపారుదల రంగ ప్రముఖుడు టి.హనుమంతరావు, వ్యవసాయాభివృద్ధిపై బి.యర్రంరాజు, ఖనిజాల వినియోగంపై టీబీ చౌదరి, కృష్ణాజలాల పంపిణీపై చెరుకూరి వీరయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, రాంనరసింహారావు, ఆర్థిక విశ్లేషకుడు డి.పాపారావు పాల్గొన్నారు. -
టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల ద్వంద్వ వైఖరులను ఎండగడతాం: దిగ్విజయ్
‘‘రాబోయే ఎన్నికల్లో ధైర్యంగా కలసి పోరాడతాం. టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీ ద్వంద్వ విధానాలను మేం ఎండగడతాం. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ సీపీలు రాతపూర్వకంగా లేఖలు ఇచ్చి మళ్లీ మాటమార్చాయి. ఇలా యూ టర్న్ తీసుకోవడం రాజకీయ పార్టీల విశ్వసనీయతను చూపుతాయి. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అలా కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు నిర్ణయం చెప్పాకే కాంగ్రెస్ మాట ఇచ్చింది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు రాజకీయ, సంస్థాగత అంశాలు చర్చించాం. విభజన బిల్లుకు సంబంధించి పన్ను మినహాయింపులు, ప్రత్యేక హోదా, సీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ విషయాలు చర్చించాం. పారిశ్రామిక, సర్వీసు రంగానికి ప్రత్యేక పన్ను మినహాయింపు 10 ఏళ్ల వరకు, ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తున్నాం. సీమాంధ్రకు సుదీర్ఘమైన కోస్తా తీరం ఉంది. అక్కడి వ్యాపార, వాణిజ్య నైపుణ్యతలు ఆ ప్రాంత అభివృద్ధికి, భారీ పెట్టుబడులకు దారితీస్తాయి. సీమాంధ్రకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటాం. ఈ విభజన వల్ల రెండు రాష్ట్రాలు అగ్రగామిగా నిలుస్తాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే.. మీరంతా ఎప్పటిలా కలిసి ఉండాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. పెట్టుబడులను ఆకర్షించడంలో, అభివృద్ధిలో పోటీ ఉండాలి..’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడుంటుందని ప్రశ్నించగా.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ రాబోతోంది. అందువల్ల సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చర్చ ఇంకా నడుస్తోంది..’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. రాష్ట్రపతి పాలన ఉంటుందా? అని ప్రశ్నించగా.. ‘‘మీకు తెలియపరుస్తాం..’’ అని మాత్రమే తెలిపారు. వీరికి ఆహ్వానమే లేదు.. ఈ సమావేశానికి సీమాంధ్ర మంత్రులందరినీ ఆహ్వానించలేదు. కాంగ్రెస్‌ను వీడతారనే సమాచారం ఉండటంతో గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్, డాక్టర్ శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గల్లా అరుణ కుమారిలకు ఆహ్వానం పంపలేదు. వీరు పిలిచినా రాలేదు.. మంత్రులు తోట నరసింహం, పార్థసారథి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, మహీధర్రెడ్డిలను సమావేశానికి ఆహ్వానించినా వివిధ కారణాలవల్ల వెళ్లలేదు. బొత్స విందు.. సమావేశానంతరం బొత్స సీమాంధ్ర మంత్రులకు విందునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త సీఎం ఎవరైతే బాగుం టుందనే దానిపై చర్చించుకున్నారు. సీఎం కావాలనే లక్ష్యంతోనున్న బొత్స మిగిలిన మంత్రులను తనవైపు తిప్పుకునేందుకే విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాల సమాచారం. -
నేడో రేపో గెజిట్ నోటిఫికేషన్
-
విభజన పనులకు సన్నద్ధం!
సీనియర్ అధికారులతో సీఎస్ సంప్రదింపులు సాధ్యాసాధ్యాలపై అధికారగణంలో మిశ్రమ స్పందన 70 నుంచి 90 రోజుల సమయం తప్పదంటున్న అధికారులు ఉభయ సభలు ఆమోదించిన బిల్లు సీఎస్‌కు పంపిన కేంద్రం వారంలో విభజన పని పూర్తవుతుందా అని ఆరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును హడావుడిగా ఆమోదింప చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విభజన పనులను ప్రారంభింప చేసేందుకు కూడా తొందరపడుతోంది. రాష్ట్రపతి ఆమోదం పొంది... గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే విభజన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తొందర పెడుతోంది. ఈ మేరకు కేంద్ర పెద్దలు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్‌చేసి... వీలైతే వారం రోజుల్లోగా విభజన ప్రక్రియను పూర్తి చేయగలరా? అని అడిగినట్లు సమాచారం. దీంతో వారం రోజుల్లో సాధ్యమేనా? ఎన్ని రోజుల సమయం పడుతుంది? అనే విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సీనియర్ ఐఏఎస్ అధికారులతో విభజనకు మంతనాలు జరిపారు. ప్రధానమైన ఆర్థిక, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల్లో విభజన ప్రక్రియకు సన్నద్ధం కావాల్సిందిగా సీఎస్ సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల స్థానికతతో పాటు ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతమంది అధికారులు, ఉద్యోగులున్నారనే వివరాలను సిద్ధంగా చేయాలని, వాహనాలతో పాటు, ఆస్తులు వివరాలను సిద్ధంగా ఉంచాలని, కేంద్రం నుంచి ఏ క్షణంలో మార్గదర్శక సూత్రాలు వెలువడతాయని, ఆ ప్రకారం విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ కీలక శాఖలకు సూచించారు. బిల్లులో పూర్తి వివరాలున్నందున ఆ ప్రకారం విభజన పనిని ఇప్పటినుంచే ప్రారంభింప చేస్తే త్వరగా ప్రక్రియ పూర్తి అవుతుందనే భావనలో కేంద్ర పెద్దలున్నట్లు తెలిసింది. ఎన్నికల ముందు యావత్తు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో ఉంటుందని, అలాగే ఇతర రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులగా ఐఏఎస్‌లను ఎన్నికల కమిషన్ నియమించనుందని, ఈ సమయంలో తక్కువ సమయంలో హడావిడిగా విభజన పూర్తి చేయడం సాధ్యం కాదని కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపి తేదీ నుంచి రాష్ట్ర ఏర్పడుతుందని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంటే తప్పనిసరిగా ఆ లోగా విభజనను పూర్తి చేయాలని కొందరు అధికారులు అంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసి మంత్రివర్గాలను ఏర్పాటు చేయడం సులభతరమేనని, అయితే పాలనా యంత్రాంగం, ఫైళ్లు, ఆస్తులు, ఆదాయం విభజన అంత సులభం కాదని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్సాల్డిడేట్ నిధిని విభజించకుండా ఇరు రాష్ట్రాలకు నిధులు వ్యయం చేయడం సాధ్యం కాదని, అలాగే ఫైళ్లు విభజన, శాఖల విభజన జరగకుండా ఏ ఫైళ్లు ఎక్కడకు ఎవరు పంపాలో గందరగోళం నెలకొంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కచ్చితంగా 70 నుంచి 90 రోజుల సమయం పడుతుందనేది అధికార వర్గాల అభిప్రాయం. ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా విభజించి కొన్ని బ్లాకులు సీమాంధ్రకు, కొన్ని బ్లాకులు తెలంగాణకు కేటాయించేందుకు రాష్ట్ర అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. సచివాలయంలోని ఎ, బి, సి, ఎల్ బ్లాకులను తెలంగాణ రాష్ట్రానికి, డి, జె, హెచ్ (నార్త్), హెచ్ (సౌత్), కె బ్లాకులను సీమాంధ్ర రాష్ట్రానికి కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ బ్లాకుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ చేయనుంది. -
నేడో రేపో గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే నేడో రేపో కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. అవతరణ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించుకోలేకపోతోంది. ఇప్పుడే విడగొట్టాలా? ఎన్నికల తరువాతనా? అన్న అంశం పై ఇంకా కసరత్తు పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు విముఖతతో ఉంది. రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆర్టికల్-353 ప్రకారం తిరిగి రెండు నెలల్లోగా పార్లమెంటు సమావేశమై దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన నిబంధనలను, రాజకీయపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. -
‘ఆప్షన్’తోనే ఉద్యోగుల ‘విభజన’
-
ఎవరెవరూ ఏమన్నారంటే..
పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం: పాలడుగు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగ నాయకుడి వల్లే ఉద్యమానికి విఘాతం పరోక్షంగా అశోక్‌బాబును తప్పుపట్టిన చలసాని శ్రీనివాస్ సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఉద్యోగ నాయకుడి నాయకత్వలోపం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమానికి విఘాతం కలిగిందని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తద్వారా పరోక్షంగా ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును తప్పుపట్టారు. ఆయన నాయకత్వ లోపమే సీమాంధ్ర పాలిట శాపంగా మారిందని, ఇకపై కొత్త వేషాలతో ప్రజల ముందుకొచ్చే నాయకుల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దని సీమాంధ్రులకు సూచించారు. శుక్రవారమిక్కడ ఏపీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు న్యాయంగా పోరాటం చేశారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పాతికేళ్ల వరకూ కాంగ్రెస్ కోలుకోదు: వట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పాతికేళ్ల వరకూ కోలుకునే అవకాశమే లేదని మంత్రి వట్టి వసంతకుమార్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు మంత్రులు శుక్రవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అంతా ఒక చోటకు చేరడంతో వారి మధ్య సరదా సంభాషణ సాగింది. భవిష్యత్ కార్యక్రమం గురించి ప్రస్తావన రాగా తాను పోటీ చేయాలనుకోవడం లేదని వట్టి చెప్పారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల జనాగ్రహం బాగా కనిపిస్తోందన్నారు. రామనారాయణరెడ్డిని మీరేం చేయబోతున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తానన్నారు. రఘువీరా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాటం: సీపీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాడాలని సీపీఎం నిర్ణయించింది. పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శుక్రవారమిక్కడ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రాల ఏర్పాటు అనంతర పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి రెండు తీర్మానాలను ఆమోదించింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన జరిగినా ప్రపంచ బ్యాంకు విధానాలే అమలవుతాయని, ఇప్పటి పాలకులే తిరిగి రెండుచోట్లా ఏలతారని, ఫలితంగా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్న అంచనాకు వచ్చింది. రాష్ట్రంలోని లక్షా 82 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించింది. సమ్మె తీవ్రతరం కాకమునుపే కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ‘సీమ’లోనే రాజధాని ఉండాలి: బెరైడ్డి అనంతపురం, న్యూస్‌లైన్: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోతే రణరంగం సృష్టిస్తామన్నారు. అనంతపురంలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. నికర జలాలు, సీమలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలు, సంపూర్ణ మద్యపాన నిషేధం తదితర డిమాండ్లతో ఈ నెల 24, 25 తేదీల్లో సీమ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీమ వ్యాప్తంగా 52 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. అసెంబ్లీ నిర్ణయం మేరకే రాజధాని: జేపీ సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడన్నది అక్కడి శాసనసభ నిర్ణయం మేరకు జరగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని, అసెంబ్లీ వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ పెద్దలెవరని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని వికేంద్రీకరించాలన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సత్తా పార్టీ శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత, గత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సన్నాహక కమిటీని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్‌కు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంపూర్ణ తెలంగాణ సాకారం కాలేదు: విరసం సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల పోరాటం ద్వారా కోరుకున్న తెలంగాణ సాకారం కాలేదని, పోరుబాటలో బాసటగా నిలిచిన పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం దుర్మార్గమైన చర్య అని విప్లవ రచయితల సంఘం(విరసం) విమర్శించింది. ఆంధ్రకు నష్టపరిహారంగానో, ప్యాకేజీగానో నిర్మించాలని నిర్ణయించిన పోలవరం ప్రాజెక్టు మూడు లక్షల మంది ఆదివాసులను, రెండు వందల గ్రామాలను, 3 లక్షల ఎకరాలను ముంచివేస్తుంటే, బాధితులను ఆంధ్రలో కలపడం ఏమిటని విరసం కార్యదర్శి వి. వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు పాణి, కాశిం, రాంకీ, రివేరా ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
‘ఆప్షన్’తోనే ఉద్యోగుల ‘విభజన’
జిల్లా, జోనల్ కేడర్ ఉద్యోగులపై ప్రభావం ఉండదు రాష్ట్ర కేడర్, సచివాలయ ఉద్యోగుల సంఖ్య 78 వేలు తెలంగాణకు 32.76 వేలు, సీమాంధ్రకు 45.24 వేలు రెండు రాష్ట్రాల్లోనూ జోనల్ వ్యవస్థ కొనసాగింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘ఆప్షన్’ అవకాశం ఇచ్చి ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. జిల్లా, జోనల్ కేడర్ పోస్టులపై విభజన ప్రభావం ఉండదు. మల్టీజోనల్ కేడర్ పోస్టుల విషయంలో మాత్రం స్వల్ప ప్రభావం తప్పదు. రాష్ట్ర కేడర్ అధికారులతో పాటు సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ సిబ్బంది, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచనున్నారు. ఈ విభాగాల్లో ప్రస్తుతం 78 వేల మంది పనిచేస్తున్నారని లెక్క తేల్చారు. వారిని జనాభా ప్రాతిపదికన 42 శాతం తెలంగాణకు, 58 శాతం సీమాంధ్రకు విభజించాల్సి ఉంటుంది. అంటే 32.76 వేల మందిని తెలంగాణకు, 45.24 వేల మందిని సీమాంధ్రకు కేటాయించనున్నారు. ఈమేరకు శాఖల వారీగా స్టాఫ్ ప్యాట్రన్‌ను నిర్ధారిస్తారు. తర్వాత ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకొనే అవకాశం ఇస్తారు. తొలుత ఎస్టీ, ఎస్సీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీల ఖాళీలు భర్తీ అయిన తర్వాత మిగిలిన ఖాళీలను మిగతా ఉద్యోగులతో భర్తీ చేస్తారు. ఎక్కువ మంది హైదరాబాద్ (తెలంగాణ)లో ఉండాలని కోరుకుంటే ఖాళీల కన్నా ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. అప్పుడు సొంత రాష్ట్రం వారికి ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సర్వీసులో అత్యంత జూనియర్ అయిన ఉద్యోగి అనివార్యంగా బదిలీ కావాల్సి ఉంటుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, హోం, ఆర్థిక శాఖల అధికారులతో కూడిన కమిటీ ఇవ్వనున్న మార్గదర్శకాల ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. దీన్ని పూర్తి చేయడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి కమల్‌నాథన్ అధ్యక్షతన కమిటీ త్వరలోనే ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ 371(డి) ఉంటుందని, అంటే జోనల్ వ్యవస్థ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న జోన్లనే కొనసాగిస్తారా? లేక జోన్లను పునర్వ్యవస్థీకరించే అధికారం ఉన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ‘సాక్షి’కి చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించాలని డిమాండ్ చేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు 52 శాతం లేరని, వారికి ఉద్యోగాల్లో న్యాయమైన వాటా లేదని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. అఖిలభారత సర్వీసు అధికారులకూ ఆప్షన్... అఖిలభారత సర్వీసు అధికారులను స్థానికత ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఏపీ క్యాడర్ అధికారులకు మాత్రం ఆప్షన్ ఇవ్వనున్నారు. 26 నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తిచేయడానికి ఈనెల 10వరకు ఉన్న గడువును 25కు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26 నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. -
ఎన్నిక లయ్యాకే రెండు రాష్ట్రాల ఏర్పాటు?
సాంకేతిక ఇబ్బందులు దాటాకే అధికారిక విభజన సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలంటున్న సీమాంధ్ర నేతలు సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయా, లేక రెండు రాష్ట్రాలు విడిపోయాకా? విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఈ అంశంపై చర్చ సాగుతోంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని సీమాంధ్ర నేతలు, కొత్త రాష్ట్రాల్లోనేనని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక అమలు తేదీ (అపాయింటెడ్ డే) నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రెండుగా విడిపోతుంది. అప్పటి నుంచి రెండు అసెంబ్లీలుంటాయి. ఇద్దరు సీఎంలుంటారు. అయితే ఆ అపాయింటెడ్ డే ఎప్పుడన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై ఆయన లాంఛనంగా ఆమోదముద్ర వేశాక గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అపాయింటెడ్ డేను అందులోనే రాష్ట్రపతి నిర్దేశిస్తారు. ప్రస్తుత బిల్లులో సాంకేతిక లోపాలున్నాయి. పైగా ఆస్తులు అప్పులు, ఆదాయాల పంపిణీ ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలు పూర్తవాల్సి ఉంది. అందుకు కనీసం నాలుగైదు నెలలైనా పడుతుందని అంచనా. కానీ మార్చి తొలి వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. షెడ్యూలు వచ్చిందంటే అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలోనే తలమునకలై ఉంటుంది. సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్ప ఆ సమయంలో మరే కార్యక్రమమూ చేపట్టే వీలుండదు. కాబట్టి ఎన్నికలయ్యేదాకా అధికారిక విభజన వీలు కాదన్నది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అంచనా. పైగా విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ ఎస్సీ, ఎస్టీల జనాభాలో తేడా వచ్చి, ఆ మేరకు చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కూడా సమస్యగా మారతాయి. ఎందుకంటే ఇప్పుడు సమైక్య రాష్ట్రం యూనిట్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ స్థానాలను విభజన అనంతరం ఒక్కో రాష్ట్రాన్నీ యూనిట్‌గా తీసుకుని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. లేదంటే వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం దక్కదు. రాజకీయంగా కూడా రాజకీయంగా చూసుకున్నా ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే పూర్తయితేనే మేలని అధిష్టానం భావిస్తోందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఆస్తులు అప్పులు, ఆదాయాలు, ఉద్యోగుల పంపిణీ, పెన్షన్‌దారుల వ్యవహారాలను ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా తలకెత్తుకోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ అంశాల్లో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగ సంఘాలు, తదితర సంస్థల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని బిల్లులో పేర్కొనగా, తెలంగాణ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెన్షనర్ల భారం కూడా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉంది. సాగునీరు, విద్యుత్తు తదితరాల పంపిణీ కూడా జటిలంగానే కన్పిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాలను ఎన్నికల ముందు తెరపైకి తెస్తే రెండు చోట్లా పార్టీ దెబ్బ తింటుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తే, ఈ సమస్యలనే సాకుగా చూపి, ‘మీకే ఎక్కువ న్యాయం చేస్తాం’ అని ఇరు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయించి లబ్ధి పొందవచ్చన్న ఆలోచన ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలను అధికారికంగా ఏర్పాటు చేయాలంటున్నారు. ఏదో సాకు చూపి వాయిదా వేస్తే ప్రక్రియ చిక్కుల్లో పడుతుందంటున్నారు. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అధికారికంగా విడివడ్డాక పరిష్కారమవుతాయన్నది వారి వాదన. -
అడ్డుగోలుగా పోలీసు యాక్సిలరీస్ !
అనర్హులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు సైటేషన్ల పరిశీలన లేకుండా తయారవుతున్న జాబితాలు నేడు భేటీ కానున్న శాఖాపరమైన పదోన్నతుల కమిటీ సాక్షి, హైదరాబాద్: యాక్సిలరీల పేరుతో మరోసారి ‘ప్రతిభావంతులైన’ పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. సైటేషన్లను పూర్తిగా పరిశీలించకుండా తయారైన తుదిజాబితాల ఆధారంగానే ఈ తతంగాన్ని పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన శాఖాపరమైన పదోన్నతల కమిటీ(డీపీసీ) శనివారం భేటీ కానుంది. కాగా, రాష్ట్ర విభజన ప్రక్రియ కూడా పూర్తికావడంతో ఆఖరి చాన్స్‌గా భావించిన కొందరు అధికారులు తమ విధేయులకు పట్టం కట్టించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధైర్య సాహసాలకు గుర్తింపుగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా యాక్సిలరీ(మధ్యంతర) పదోన్నతుల విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన వారితో పాటు ముష్కర మూకలతో ఎదురు కాల్పులకు దిగి సంఘ విద్రోహశక్తుల్ని మట్టుబెట్టిన వారికి గుర్తింపుగా, ప్రోత్సాహకంగా ఉండేందుకు యాక్సిలరీ పదోన్నతులను ప్రవేశ పెట్టారు. నిరోధించలేని నిఘా వ్యవస్థలో.. గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో జరిగే ఏఒక్క ఉగ్రవాద దుశ్చర్యనూ ముందుగా ఊహించి, నిరోధించిన దాఖలాలు కనిపించవు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు కొన్ని నెలల ముందే కేంద్ర నిఘా సంస్థ నిర్దిష్టంగా అప్రమత్తం చేసినా దాన్ని ఆపలేకపోయారు. 2007 నాటి జంట పేలుళ్లలోనూ అదే జరిగింది. అలాంటి వ్యవస్థలో పని చేస్తున్న వారికీ యాక్సిలరీ పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ‘మావోయిస్టుల’ విభాగంలో గంపగుత్తగా... మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేస్తున్న విభాగంలో పరిస్థితి మరోలా ఉంటోంది. అక్కడ నెలలు, ఏళ్ల తరబడి ఫీల్డ్ వర్క్ చేస్తూ మోస్ట్ వాంటెడ్, అనుమానితుల వివరాలను ఒకరో ఇద్దరో అధికారులు సేకరిస్తుంటారు. వాస్తవంగా వీరందించే సమాచారం ఆధారంగానే భారీ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటి ఆధారంగా అధికారులు ఓ వ్యక్తి చేసిన పనిని పూర్తి బృందానికి, మరికొందరికి ఆపాదిస్తూ అనర్హులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే విమర్శ ఉంది. కష్టనష్టాలకోర్చి విధులు నిర్వర్తిస్తున్న జిల్లాల్లోని అధికారులకు ఈ పదోన్నతుల విషయంలో మరింత అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. ఇదిలావుంటే, ఓ ఆపరేషన్‌కు సంబంధించి వాంటెడ్ వ్యక్తుల్ని పట్టుకున్నప్పుడు వారి తలపై ఉన్న రివార్డు మొత్తాల్ని క్యాష్ రివార్డులుగా తీసుకుంటున్నారు. అదేపని చూపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పతకాలనూ పొందుతున్నారు. మళ్లీ యాక్సిలరీ పదోన్నతల కోసమూ సైటేషన్లు రూపొందించుకుంటున్నారు. ఇదే ఆఖరి తరుణమని.. యాక్సిలరీ పదోన్నతుల్లో అనర్హులకు అందలం దక్కడమనేది ఏళ్లుగా ఉన్నా ఈసారి జోరెక్కువైంది. పదోన్నతి ఇచ్చే ముందు సైటేషన్లను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు ఆ పని చేయట్లేదని సిబ్బంది వాపోతున్నారు. కేవలం సైటేషన్లకు కవరింగ్ లెటర్స్‌గా ఉంటున్న లేఖల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేదా గవర్నర్ ద్వారా పదోన్నతులు పూర్తి చేసుకోవాలని ఆశావహులు భావిస్తున్నారు. -
సీఎం మినహా ఎవరితోనూ చర్చించలేదు: చిరంజీవి
విభజన నిర్ణయాన్ని రాజ్యసభలో తప్పుపట్టిన మంత్రి న్యూఢిల్లీ: రాజ్యసభలో తొలిసారిగా ప్రసంగించిన కేంద్రమంత్రి పర్యాటక మంత్రి చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడటంతో ఆయనతో పాటు.. కేంద్ర ప్రభుత్వానికీ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ ఆకస్మికంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని, దీంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారని, విభజనకు సంబంధించి ముఖ్యమంత్రితో మినహా ఇతర నాయకులెవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు’ అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నానని, అందులో సవరణలు చేయాలని కోరిన చిరంజీవి.. బీజేపీ కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని.. 2004లో ఎన్డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటుపై వెనుకడుగు వేసిందని ప్రతిపక్షంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘విభజనకు కాంగ్రెస్ పార్టీని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదు. బీజేపీ ఇస్తామంది. కానీ ఎన్డీఏలో ఇవ్వలేదు. సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ అన్ని పార్టీలను బ్లేం చేయాలి. టీడీపీ రెండుస్లారు లేఖలు ఇచ్చింది’ అంటూ విమర్శిస్తుండటంతో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఆగ్రహించారు. ఆయన లేచి నిల్చుని.. ‘‘ఆయన అధికార పార్టీ సభ్యుడు. పైగా మంత్రి. ప్రధానమంత్రి సమక్షంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లునే.. ఆయన తప్పుపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారా? మంత్రివర్గం తరఫున మాట్లాడుతున్నారా? ముందు రాజీనామా చేసి మాట్లాడండి.. అతను తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నందున మద్దతిస్తున్నారు.. మంత్రులు తమ మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? ప్రభుత్వం ఇచ్చిన బిల్లును వ్యతిరేకించవచ్చా? రూలింగ్ ఇవ్వండి’’ అని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ను అడిగారు. చిరంజీవి తన ప్రసంగం కొనసాగిస్తూ.. తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని, ప్రత్యేక రాష్ట్రంపై తన వ్యక్తిగత అభిప్రాయాలు మారలేదని.. కాంగ్రెస్ వాదిగా తన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరమని.. పార్టీ నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని పేర్కొన్నారు. విభజన బిల్లును చర్చకు చేపట్టినప్పటి నుంచీ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. -
ప్చ్! సమరం సమాప్తం..
సమైక్యాంధ్ర పరిరక్షణకు సుదీర్ఘంగా సాగిన పోరు చివరికి అరణ్యరోదనగానే మిగిలిన రణన్నినాదం తెలుగుజాతి చీలికకు పార్లమెంట్ ఆమోద ముద్ర సమ్మె విరమించి విధుల్లో చేరిన ఏపీ ఎన్జీఓలు 24 నుంచి మళ్లీ నల్లకోటు వేసుకోనున్న న్యాయవాదులు సాక్షి, కాకినాడ : కోట్ల గొంతులు ఒక్కటై.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రణన్నినాదం చివరికి అరణ్యరోదనగానే మిగిలింది. తెలుగుజాతి ఎన్నటికీ ఒక్కటిగానే ఉండాలన్న ఒకేఒక్క సంకల్పంతో బిగిసిన పిడికిళ్లకు ఫలితం..‘మొండిచెయ్యే’ అయ్యింది. సీమాంధ్ర చరిత్రలోనే అపూర్వంగా సాగిన సమరం.. తీరం చేరకుండానే విరిగిపోయిన కెరటమే అయ్యింది. సామాన్యుల్లో సైతం రగిలిన ధర్మాగ్రహజ్వాల ఆఖరుకు తాటాకుమంటగానే ఆరిపోక తప్పలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణకు సాగిన ఉద్యోగుల సుదీర్ఘ ఉద్యమానికి తెరపడింది. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడ్డ వెంటనే తొలుత 66 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన ఏపీ ఎన్జీఓలు అనంతరం ఆందోళనను విరమించి విధుల్లో చేరారు. అయితే విభజన బిల్లును రాష్ర్ట అసెంబ్లీకి పంపడాన్ని నిరసిస్తూ గత 15 రోజులుగా తిరిగి ఉద్యమపథంలోకి వచ్చారు. ఇప్పుడు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ‘యుద్ధ విరమణ’ అనివార్యమైంది. సమ్మెకు తెరపడడడంతో గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మళ్లీ తెరుచుకున్నాయి. రాష్ర్ట విభజన ప్రకటన జూలై 30న వెలువడగా ఆ మర్నాటి నుంచే సీమాంధ్ర లో సమైక్య ఉద్యమం మొదలైంది. ఏపీఎన్జీఓ సంఘం పిలుపు మేరకు 40కి పైగా ప్రభుత్వ శాఖలతో పాటు ఆర్టీసీ కార్మికులు ఆగస్టు 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వారికి మద్దతుగా యూటీఎఫ్ మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలన్నీ సమ్మె బాటపట్టాయి. ఆ తర్వాత దశల వారీగా ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు సైతం సమ్మెకు పూనుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు కూడా నాలుగురోజుల పాటు సమ్మె చేశారు. చివరకు ‘పై-లీన్’ తుపాను విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి విధుల్లో చేరారు. ఉవ్వెత్తున సాగిన ఉద్యమం అకస్మాత్తుగా సమ్మె విరమించడంతో ఒక్కసారిగా నీరుగారిపోయింది. న్యాయవాదులు మాత్రం ఉద్యమం ప్రారంభమైంది మొదలు నిరవధికంగా విధులను బహిష్కరిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. వీరి ఆందోళన కోర్టుల్లో పెండింగ్ కేసుల విచారణ పై తీవ్ర ప్రభావం చూపించింది. కాగా ఉద్యోగులు విధుల్లో చేరిన తర్వాత సమైక్య ఉద్యమం పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ఉద్యమంగానే సాగింది. ఎవరు ఎంత తీవ్రంగా ఉద్యమించినా, నింగీనేలా దద్దరిల్లేలా జనాభిమతాన్ని ఎలుగెత్తినా యూపీఏ సర్కారు కించిత్తు చలించలేదు. విభజన నిర్ణయం నుంచి వీసమెత్తు వెనకడుగు వేయలేదు. మళ్లీ ఉద్యమించినా.. విభజన బిల్లును శాసనసభకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం పిలుపు మేరకు ఈ నెల 6 నుంచి ఎన్జీఓలు మళ్లీ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. గత 15 రోజులుగా సాగిన ఈ సమ్మెలో జెడ్పీ, ట్రెజరీ, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి శాఖలు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖల సిబ్బంది భాగస్వాములయ్యారు. దీంతో కలెక్టరేట్ నుంచి గ్రామస్థాయిలో వీఆర్వో కార్యాలయం వరకు మూతపడ్డాయి. చివరికి తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో ఇక విభజనను ఆపలేమన్న నిర్ణయానికి వచ్చిన ఏపీఎన్జీఓ సంఘంఅధ్యక్షుడు పి.అశోక్‌బాబు సమ్మెను విరమించి గురువారం నుంచి విధుల్లో చేరాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. చలో ఢిల్లీకి వెళ్లిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా గురువారం విధుల్లో చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చలోఢిల్లీకి ప్రత్యేకంగా వేసిన రైలు గురువారం మధ్యాహ్నం కాకినాడ చేరుకోవడంతో వీరంతా శుక్రవారం విధుల్లో చేరనున్నారు. పూర్తిస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులు ఈ నెల 24 నుంచి మళ్లీ విధుల్లో చేరనుండడంతో కోర్టుల్లో కార్యకలాపాలు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విభజనను అడ్డుకునేందుకు తాము చివరి వరకు పోరాడామని, చేయగలిగినదంతా చేశామని ఏపీ ఎన్జీ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ చెప్పారు. తమ ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎన్నికలు వాయిదా వేయాలి
ఆర్నెల్లపాటు ఆపాలని కేంద్రానికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విన్నపాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే కావడంతో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచనలు సాగిస్తున్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో ఎన్నికలను ఎదుర్కొనడం సాధ్యంకాదన్న అభిప్రాయంలో సీమాంధ్ర నేతలున్నారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికలు జరిగినా అసెంబ్లీ ఎన్నికలను మాత్రం కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేయాలని అధిష్టానాన్ని కోరినట్టు పీసీసీ ముఖ్యనేత ఒకరు మీడియాకు వివరించారు. ఆర్నెల్లపాటు వాయిదా పడితే ఈలోగా ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు తగ్గుముఖం పడతాయని, ఆ తరువాత కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు, ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడిగేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరా రెడ్డిలు కలసిన సందర్భంగా కూడా అసెంబ్లీకి ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర గవర్నర్‌తో భేటీ అయిన వీరు రాష్ట్రపతి పాలన విధిస్తారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశమిస్తారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. కిరణ్ రాజీనామా గురించి అడగ్గా ‘దటీజ్ అండర్ కన్సిడరేషన్ (పరిశీలనలో ఉంది)’ అని గవర్నర్ ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. అంతకుమించి ఏం చేయబోతున్నారనేది నరసింహన్ వెల్లడించలేదు. ఇలా ఉండగా ఎన్నికల వాయిదాను తెలంగాణ ప్రాంత నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన పూర్తవుతున్నందున ఇరుప్రాంతాల్లో లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఊపులో ఎన్నికలకు వెళితేనే మంచి ఫలితాలు వస్తాయని వారంటున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాకుండా ఎన్నికలు జరిగితే ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వెళ్తాయని, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని వారు పేర్కొంటున్నారు. పైగా ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ టీఆర్ఎస్ విలీనంపై వెనకడుగు వేస్తే కాంగ్రెస్ రాజకీయంగా చాలా కోల్పోవలసి వస్తుందని వారు పార్టీ పెద్దలకు వివరించినట్టు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చెప్పారు. సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ కోరాం: బొత్స రాష్ట్ర సమైక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, విభజన అనివార్యం కావడంతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక సహకారమివ్వాలని కేంద్రాన్ని కోరామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం బొత్స మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, మంత్రుల బృందాన్ని కలసి సీమాంధ్ర సమస్యల గురించి వివరించామన్నారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందించాలని అడిగామన్నారు. -
టీబిల్లుకు బీజేపీ మద్దతు సిగ్గుచేటు
బుట్టాయగూడెం న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్విభజన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీని ఈదేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. సోనియా కనుసన్నల్లోనే కిరణ్ పనిచేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించారని దుయ్యబట్టారు. తెలుగుజాతి సమైక్యంగా ఉంచేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఓ పక్క రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నా ఎంపీలు కుంభకర్ణుడిలా నిద్రపోయారని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో పదవీకాలం ముగిసిపోతుండడంతో రాజీనామాలు చేస్తున్నట్టు నటించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపార్టీ నుంచి పోటీ చేయాలో అని ఆలోచనలో పడ్డారన్నారు. ఎంపీ లగడపాటి తన దగ్గర బ్రహ్మస్త్రం ఉందని మాయమాటలు చేప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం బీజేపీతో కుమ్మకైందని విమర్శించారు. బీజేపీ, టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయలకైనా సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, కరాటం కృష్ణ స్వరూప్, గట్టుముక్కల మల్లికార్జునరావు, దాకే శ్రీదేవి, కొదం కడియ, కోరం దుర్గారావు, కుక్కల లక్ష్మణరావు, గాడి వెంకటరెడ్డి, వెట్టి మాధవ ఉన్నారు. -
భద్రత కోసం వస్తూ...బలి
బీఎస్ఎఫ్ వాహనం బోల్తా, ధోబీ మృతి ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలు విశాఖ సెవెన్ హిల్స్‌కు క్షతగాత్రుల తరలింపు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అప్పుడే తెల్లవారుతోంది.... ఇంకా మం చుపొరలు వీడలేదు. చాలా దూరం నుంచి వస్తున్న వారంతా మరో 15 నిమిషాల్లో గమ్యం చేరుకుంటారు. ముందువెళుతున్న మూడు వ్యాన్లు వెళ్లిపోయాయి. నాల్గో వ్యాన్ కల్వర్టు దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా రోడ్డుపై గేదె ప్రత్యక్షమైంది. అంతే దాన్ని తప్పించబోయే యత్నంలో వ్యాన్ అదుపుతప్పింది. హాహాకారాలు మిన్నం టాయి. అంతలోనే తేరుకున్న వారంతా అప్రమత్తమయ్యారు. గాయాలతో బయటపడ్డారు. అయితే అలసి కునుకుతీసిన ఓ ధోబీ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బొండపల్లి, న్యూస్‌లైన్: బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఐదు గంటలకు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ధోబీ మృతి చెందగా ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా లక్ష్మీపురం నుంచి బీఎస్ఎఫ్ 28వ బెటాలియన్ సిబ్బంది 51 మందిని నాలుగు వ్యాన్లలో విజయనగరానికి రప్పించారు. అయితే గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. విజయనగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గేదె అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా వాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడపైకి వెళ్లి, పక్కనున్న గొతిలోకి బోల్తా పడిపోయింది. గోతిలో దట్టమైన పొదలు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే జవాన్లు అందరూ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై గాయాలతో బయటపడ్డారు. అప్పటికే నిద్రపోతున్న బీఎస్ఎఫ్కు చెందిన ధోబీ మునీంద్ర కుమార్ (40)పై ఆయుధాల కిట్లు పడిపోవడంతో తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ వ్యానులో మొత్తం పన్నెండు మంది ఉన్నారు. మునీంద్రకుమార్ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లా జమునీయా గ్రామం. ఏఎస్ఐలు రాజేంద్రభారతి, విజయేంద్రసింగ్, హెచ్‌సీలు శైలింద్రకుమార్, అఖిలేష్చంద్, బోలారామ్లతో పాటు జవాన్లు ధీరేంద్రసింగ్, టీసీ దాస్, మనోజ్‌కుమార్, బిస్వాస్, గోపీనాథ్, హర్భజన్‌సింగ్ గాయాలపాలయ్యారు. వీరిని తొలుత 108 వాహనం సాయంతో విజయనగరం తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ సెవెన్‌హిల్స్‌కు తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్అహ్మద్, సీఐ చంద్రశేఖర్, బొండపల్లి ఎస్ఐ జె.తారకేశ్వరరావు, గజపతినగరం ఎస్ఐ సాయికృష్ణ, మానాపురం ఎస్ఐ యు.మహేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఏకే47 గన్లు, బుల్లెట్లు తదితర ఆయుధాలు ఉండడంతో వాహనం వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాశారు. ఎస్పీ సందర్శన ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గజపతినగరం ఆస్పత్రిలో ఉన్న ధోబీ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని విశాఖపట్నం విమానాశ్రయానికి బాక్స్‌లో తరలించారు. -
తెలంగాణ బిల్లుకు సవరణ సంకటం!