- హైకోర్టుకు తెలిపిన తెలంగాణ విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకే ఏపీ ఉన్నత విద్యా మండలి ఖాతాల స్తంభన నిమిత్తం బ్యాంకులకు లేఖలు రాశామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. తాము రాసిన లేఖపై ఎస్‌బీహెచ్ శాంతినగర్ శాఖ మాత్రమే సానుకూలంగా స్పందించిందని, ఆంధ్రా బ్యాంకు తమ లేఖను పెడచెవిన పెట్టిందని వివరించింది. తమ బ్యాంకు ఖాతాను ఎస్‌బీహెచ్, శాంతినగర్ శాఖ స్తంభింప చేయడంపై ఏపీ ఉన్నత విద్యా మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ విద్యాశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అదనపు కార్యదర్శి ఎ.కనకదుర్గ కౌంటర్ దాఖలు చేశారు.
పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలి హైదరాబాద్‌లో ఉన్నందున దానిపై అధికారం టీ సర్కారుకే ఉంటుందన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు టీ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని, కాబట్టి ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు రూ.100 కోట్లు అవసరమవుతాయన్న ఏపీ మండలి వాదనలో వాస్తవం లేదన్నారు. టీ సర్కార్ అనుమతి లేకుండా ఏపీ మండలి బ్యాంకు ఖాతాలను నిర్వహించడంతో పాటు, నిధులను విత్‌డ్రా చేస్తోందని ఆమె తెలిపారు. అందువల్ల ఏపీ మండలి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు.