సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విభజన సంబంధిత అంశాల పరిష్కారానికి మళ్లీ పీటముడి పడింది. ఈనెల 23న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫు అధికారులు గైర్హాజరయ్యారు. బడ్జెట్ తయారీ కసరత్తులో ఉన్నందున తాము రాలేమని తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి సమాచారం అందించారు. కాగా, రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఈనెల 27న భేటీ కావాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని సచివాలయంలో జరగాల్సిన ఈ భేటీకి హాజరయ్యేందుకు తెలంగాణ సీఎస్ విముఖత వ్యక్తం చేయడంతో ఈ సమావేశం కూడా వాయిదా పడింది. వరుసగా గతేడాదిగా జరుగుతున్న భేటీలతో ప్రయోజనమేమీ లేదని, భేటీల్లో తీసుకున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయట్లేదని, అందుకే సమావేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని తెలంగాణ పేర్కొంటోంది. గతేడాది గవర్నర్ సమక్షంలో జరిగిన మంత్రుల త్రిసభ్య కమిటీల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదని, పలుమార్లు లేఖలు రాసినా సచివాలయంలో ఏపీ అధీనంలో ఉన్న భవనాలను ఇప్పటికీ అప్పగించకపోవటాన్ని వేలెత్తి చూపుతున్నారు.
తొమ్మిదో షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ తేలకముందే ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లు తెలిసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల భేటీలకు కొంతకాలం దూరంగా ఉండాలని భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment