విభజన పంచాయతీ..! | bifurcation panchayat | Sakshi
Sakshi News home page

విభజన పంచాయతీ..!

Published Wed, Mar 7 2018 11:49 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

bifurcation panchayat - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్‌ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల  కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం.          

సాక్షి, మెదక్‌: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌లో  మెదక్‌ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా  2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌ఈ, డీఈ,  అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు.  వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్‌ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు.  ఈ కమిటీ  అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్‌ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు.  ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్‌ ఇంజినీర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్, ఫోర్‌మెన్‌(గ్రేడ్‌ 1),  సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్, ఫోర్‌మెన్‌(ఎంఆర్‌టీ గ్రేడ్‌1), ఫోర్‌మెన్‌(ఎంఆర్‌టీ గ్రేడ్‌ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. 

విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  సంగారెడ్డి జిల్లాకు సబ్‌ ఇంజినీర్‌ మొదలు ఫోర్‌మెన్‌ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు.  మెదక్‌ జిల్లాలోని మెదక్, తూప్రాన్‌ డివిజన్‌లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు.

సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  సిద్దిపేటలో హుస్నాబాద్‌ డివిజన్‌లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి.  దీంతో ట్రాన్స్‌కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. 

మరోమారు పరిశీలించాలి..
పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్‌ జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్‌ఈ శ్రీనాథ్‌ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సీజీఎం, సంగారెడ్డి ఎస్‌ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్‌ఈ శ్రీనాథ్‌ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement