మాకో హైకోర్టు ఇవ్వరూ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ముగింపు అనంతరం ఆయన గురువారం సాయంత్రమే బయల్దేరి ఢిల్లీ వచ్చారు. ప్రధానంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన ఆయన.. పనిలో పనిగా ఇతర కార్యక్రమాలు కూడా చక్కబెట్టుకోవాలని తలపెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును కలిసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల కోసం హైకోర్టును విభజించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాల హైకోర్టుగానే చలామణి అవుతోంది. అయితే, కేసుల భారం దృష్ట్యా రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు ఉండటం మంచిదని, అందువల్ల వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పనున్నట్లు తెలిసింది.