సాక్షి, న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి 11 వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని, కొత్త జోన్ల విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. అదేవిధంగా కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో మైదానాన్ని ఇవ్వాలని, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కావాలని విజ్ఞప్తి చేశారు. వెనకబడిన జిల్లాలకు 450 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని, తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇలా 11 వినతిపత్రాలను కేసీఆర్ మోదీకి అందజేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొత్త జోనళ్లకు ఆమోదం, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళువెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను సత్వరమే పరిష్కరించాలని కేసీఆర్ ప్రధాని కోరారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను ఢిల్లీలో ఉండి స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రెండు,మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి, కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని మోదీకి వివరించి.. సాధించుకోవాలని సీఎం నిర్ణయించారు.
జోనల్ అవసరాన్ని చెప్పేందుకు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాదాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కొత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని ఆయన భావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించనున్నారు.
పీఎంవో వద్ద ఫైలు
ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపాయి. దీంతో ఫైల్ ఆమోదం కోసం తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment