ఉమ్మడి హైకోర్టును విభజించండి
సీఎంలు-సీజేల సదస్సులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సీఎం కేసీఆర్ తరఫున సదస్సుకు హాజరు
జూన్ 2 కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటై పది నెలలు పూర్తయ్యాయని, ఇకనైనా విభజన చట్టం మేరకు హైకోర్టు విభజనకు చర్యలు చేపట్టాలన్నారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన రాష్ట్రాల సీఎంలు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తెలంగాణ సీఎం కేసీఆర్ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు హైకోర్టులు ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. హైకోర్టు విభజన డిమాండ్‌పై న్యాయవాదులు 45 రోజులపాటు సమ్మెచేశారని, ఎంపీల ప్రతినిధి బృందం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలసి వినతిపత్రం సమర్పించినా ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్నారు. హైకోర్టు విభజనకు ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరాలు లేవనెత్తకపోవడం, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా హైకోర్టు విభజనకు సానుకూలత తెలపడం సంతోషకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2 నాటికి ఏడాది పూర్తికానున్న సందర్భంలోనైనా హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు హైకోర్టులు పనిచేయడానికి వీలుగా సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలో సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి ప్రధాని మోదీ, సదానందగౌడకు లేఖలు అందించిన విషయాన్ని ఇంద్రకరణ్ ప్రస్తావించారు. హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి హైకోర్టు సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసి సభ్య కార్యదర్శితోపాటు అవసరమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల పదవీవిరమణ అనంతరం సౌకర్యాలు, ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. హైకోర్టు ప్రతిపాదించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మహిళలు, పిల్లలపై దాడుల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటును పరిశీలిస్తున్నామని, కేంద్రం నిధులివ్వకున్నా రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి సదానందగౌడను కలసి హైకోర్టు విభజన జూన్ 2 కల్లా పూర్తి చేయాలని విన్నవించారు.
సమస్యల పరిష్కారానికి చంద్రబాబే సహకరించట్లేదు
విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడంలేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణకు విద్యుత్ కేటాయింపులు, నీటి విడుదలలో ఏపీ సహకరించట్లేదని ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం తొలగిపోయాక హైకోర్టు నిర్మాణం చేస్తామని బాబు చెబుతున్నారని...కానీ వ్యాజ్యం ఎవరు, ఎవరి ప్రోత్సాహంతో వేశారో చూడాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు వనరులు పెంచుకోడానికి వాహనాలపై ప్రవేశపన్ను వసూలు చేస్తున్నామని, కావాలంటే ఏపీ ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేసుకుని వనరులు పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. వాహనాల పన్నులు వసూలు చేయకూడదనే ఒప్పందం విభజన చట్టంలో లేదన్నారు. జూలై 14 నుంచి గోదావరి పుష్కరాల నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు.