హైకోర్టు విభజన తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌కు వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఇందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును కోరారు. మూడురోజులపర్యటన నిమిత్తం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ శుక్రవారం జస్టిస్ దత్తుతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి తుగ్లక్‌రోడ్డులోని నివాసానికే పరిమితమైన కేసీఆర్ దాదాపు రోజంతా విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు తీస్ జనవరి మార్గ్-10లోని జస్టిస్ దత్తు నివాసానికి వెళ్లారు. 45 నిమిషాలకు పైగా వీరి భేటీ కొనసాగింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించి ఏపీకి ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించినట్టు సమాచారం.
హైకోర్టు ఉమ్మడిగా ఉండడంతో తలెత్తుతున్న ఇబ్బం దులను పేర్కొంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించినట్టు తెలిసింది. కేసీఆర్ గత పర్యటనలోనూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు హైకోర్టు విభజనపై వినతి పత్రాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కోర్టులను ఏర్పాటు చేసేందుకు సరిపడా మౌలిక వసతులున్నాయని కేసీఆర్ వివరించారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందని, కొత్తగా వచ్చే సీజేఐ హెచ్‌ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని కేసీఆర్‌కు కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కాగా మరో రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ శనివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకోనున్నట్టు తెలిసింది. మధ్యాహ్నం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలవనున్నారు. శుక్రవారం రాత్రి కేసీఆర్ సతీమణి, కుమారుడు కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీకి రానున్నారు. శనివారం ఢిల్లీలో జరగనున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.