సారథులు మీరే | kcr asks people to lead sc, st plan | Sakshi
Sakshi News home page

సారథులు మీరే

Published Sat, Jan 28 2017 1:50 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సారథులు మీరే - Sakshi

సారథులు మీరే

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏం కావాలో నిర్ణయించండి
- అఖిలపక్ష ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం
- ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా దళిత వర్గాల్లో పేదరికం పోవడం లేదు
- రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటవ్వాలి
- వందశాతం మార్పు తేవాలి.. అందుకు నేను చిత్తశుద్ధితో ఉన్నానిధుల ఖర్చుపై విధానానికి కమిటీలు
- కడియం సారథ్యంలో ఎస్సీ కమిటీ.. చందూలాల్‌ అధ్యక్షతన ఎస్టీ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కలిసికట్టుగా ఆలోచించి ఒక విధానం రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ... ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపుతామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. "ఇంతకాలం ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఇతరులు నిర్ణయించే వారు. కానీ తెలంగాణలో మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఆ వర్గాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులే నిర్ణయించాలి. వారితో ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది" అని అన్నారు. "బడ్జెట్‌ రూపకల్పనకు కేంద్రం చేసిన మార్పులకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ రూపకల్పన జరగాలి. మొత్తం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారి నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలి. వారి జనాభా శాతం కంటే కొంచెం అధికంగానే ఖర్చు పెట్టాలి. ఆయా వర్గాలకు నిధులు కేటాయించడం, ఖర్చు చేయడానికి అవసరమైన విధానం ఎస్సీ, ఎస్టీ కమిటీలు రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోవాలి. అదే లక్ష్యం కావాలి" అని సీఎం పేర్కొన్నారు.

ఎస్టీ కమిటీ ఇదే..
మంత్రి చందూలాల్‌ సారథ్యంలో సీఎం ఎస్టీ కమిటీని ప్రకటించారు. ఇందులో రెడ్యానాయక్, సీతారాం నాయక్, నగేశ్, రాము నాయక్, కోవ లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. కడియం ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. నంది ఎల్లయ్య, బాల్క సుమన్, ఎం.ఎస్‌.ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సంపత్‌ కుమార్, నల్లాల ఓదేలు, రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, కిశోర్, సంజీవ రావు కమిటీ సభ్యులుగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

ఎస్సీ, ఎస్టీ శాఖల ద్వారానే ఖర్చు
"ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఆయా శాఖల ద్వారానే ఖర్చు చేయాలి. నిధుల ఖర్చు, కార్యక్రమాల రూపకల్పనపై కమిటీæ సూచనలు చేయాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా విధానాలుండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకుంటే.. మరుసటి ఏడాదికి బదలాయించే పద్ధతి అవలంబించాలి. సబ్‌ ప్లాన్‌కు సవరణలు చేయాలి. అభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌ రూపొందించాలి. కమిటీ క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలి" అని సీఎం చెప్పారు. "వృద్ధులు, యువకులు, విద్యార్థులు... 10–25, 25–50, 50–75 వయసుల వారీగా అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీలకు ఒక ప్రణాళిక, సెమీ అర్బన్, గ్రామాల్లో ఉండే వారికొక వ్యూహం అనుసరించాలి. మూడు ప్రాంతాల్లో నివసించే వారి జీవన స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయి. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలతోపాటు పట్టణాల్లో చదివే అమ్మాయిలకు అన్ని వసతులు కల్పించాలి" అని సీఎం సూచించారు. "దళితులకు భూ పంపిణీ నిరంతర కార్యక్రమం. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు ఉపయోగంలోకి రావాలి. కమతాల ఏకీకరణ జరగాలి. ఏ ఊరిలో ఎవరి పేరిట భూమి ఉంది? సాగులో ఉందా? లేదా? సాగులోకి రావాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి" అని పేర్కొన్నారు.

చిత్తశుద్ధితో ఉన్నా
వంద శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని, అందుకు తాను చిత్తశుద్ధితో ఉన్నానని సీఎం చెప్పారు. "మనం తలుచుకుంటే తప్పకుండా వీరి జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా ఎస్సీ వర్గాలకేం అవసరమో, ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దాం. అంకితభావంతో పనిచేసి ఆ వర్గాల్లో మార్పు తెద్దాం. అప్పుడే ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా మనకు సంతృప్తి" అని అన్నారు.

అప్పుడే అభినందనలు వద్దు
రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌పై కార్యాచరణకు సీఎం చూపిన చొరవను తాము అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు మంచి నిర్ణయమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి సమావేశం నిర్వహించడం విప్లవాత్మక చర్య అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ అన్నారు. అందుకు స్పందించిన సీఎం.. అప్పుడే ప్రభుత్వాన్ని అభినందించవద్దని, ఎంతో కొంత మార్పు వచ్చాక అభినందించాలన్నారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అజ్మీరా చందూలాల్, జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, జీఆర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రసమయి బాలకిషన్, పిడమర్తి రవి, నల్లాల ఓదేలు, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, బాల్కసుమన్, సీతారాం నాయక్, పసునూరి దయాకర్, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. ప్లాన్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే భట్టి, సీనియర్‌ ఐఏఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement