హైకోర్టు విభజనలో కేంద్రం విఫలం
‘ఓల్డ్ హిస్టరీ-న్యూ జాగ్రఫీ’ తెలుగు అనువాదం ఆవిష్కరణలో జైరాం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జెరాంరమేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీలకు ప్రత్యేక ఉన్నత న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 6 నెలల వ్యవధిలోనే ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని చట్టంలో ఉందని చెప్పారు. ఆయన రచించిన ‘ఓల్డ్ హిస్టరీ-న్యూ జాగ్రఫీ’ తెలుగు అనువాదం ‘గడిచిన చరిత్ర- తెరచిన అధ్యాయం’ పుస్తకాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆదివారం తెలుగు వర్సిటీలో ఆవిష్కరించారు.
1956లో ఏపీ, తెలంగాణను కలిపేటప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘తెలంగాణ అనే అమాయకపు అమ్మాయికి ఆంధ్రా అనే గడుసరి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించినట్లు జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికీ ఆధారాలు లభించలేదన్నారు. విభజన సందర్భంగా తాను ఏం చేయాలో అర్థం కావడం లేదని గవర్నర్ పేర్కొన డం వల్లే సెక్షన్-8 తీసుకొచ్చినట్లు తెలిపారు.
త్వరగా జరగాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
హైకోర్టు విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు బాధాకరంగా ఉంటాయని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. బాధ్యతను విస్మరించి మాట్లాడకుండా తగిన సవరణ చేసి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సెక్షన్-8లోని అంశాలను పరిశీలిస్తే చాలా భయంకరంగా ఉన్నాయన్నారు.
కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు: ఉండవల్లి
‘ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తున్నప్పుడు కేసీఆర్ తారసపడ్డారు. 1.40 గంటల ప్రయాణంలో నదీజలాల విషయంలో 1.20 నిమిషాల పాటు నాకు క్లాస్ తీసుకున్నారు.ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వివరాలను నాకు గతంలోనే చెప్పారు’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించేవారి నోళ్లను జైరాం రమేశ్ పుస్తకం ద్వారా మూయించవచ్చని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కొన్ని ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు లభించలేదని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించిందో స్పష్టత ఇవ్వలేదన్నారు. దీని పై జైరాం రమేశ్ స్పందిస్తూ.. తన మిత్రుడు ఉండవల్లి రచించే పుస్తకంలో వాటికి సమాధానం లభించే అవకాశం ఉండవచ్చన్నారు. సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్, పుస్తక అనువాద రచయిత కృష్ణారావు, రచయిత జయధీర్ తిరుమలరావు పాల్గొన్నారు.