బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావుకు భద్రతను ఉపసంహరించడంపై హైకోర్టు శుక్రవారం టీ సర్కారును వివరణ కోరింది.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావుకు భద్రతను ఉపసంహరించడంపై హైకోర్టు శుక్రవారం టీ సర్కారును వివరణ కోరింది. పూర్తివివరాలను తమ ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై కోర్టుల్లో ఫిర్యాదు చేసి, వారిపై విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయించినందుకు తనకు గతంలో ఉన్న భద్రత (1+1)ను తొలగించారని, భద్రతను పునరుద్ధరించేలా పోలీసులను ఆదేశించాలంటూ రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. కేసీఆర్ కుటుంబసభ్యుల అవినీతిపై విచారణ కోరు తూ సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమిషన్‌లతో పాటు హైకోర్టుతో సహా పలుకోర్టుల్లో ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేశానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై 2013లో భౌతికదాడులు జరిగాయని వివరించారు. దీంతో అప్పటి ప్రభుత్వం తనకు 1+1 భద్రతను కల్పించిందని ఆయన కోర్టుకు నివేదించారు. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రి, ఆయన కుమార్తె ఎంపీ అయ్యారని, అప్పటి నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం ఎక్కువయ్యానని తెలిపారు. ఈ విషయాలను మౌఖికంగా, రాతపూర్వకంగా మెదక్ జిల్లా ఎస్‌పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీల దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్టు 18న మెదక్ జిల్లా ఎస్‌పీ తనకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు నోటీసులు పంపారని వివరించారు. 22న భద్రతను పునరుద్ధరించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున తనకు ప్రాణహాని అధికమైందని, భద్రతను పునరుద్ధరించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను 17కి వాయిదా వేశారు.