'అమిత్ షాను తప్పుబట్టే స్ధాయికి ఎదిగిపోయారా'
హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన విషయాలన్నీ అబద్దమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అమిత్ షాను తప్పుబట్టే స్ధాయికి మీరు ఎదిగిపోయారా? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలంటూ ప్రజలను తప్పుబట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ప్రతి పథకానికి వస్తున్న నిధులను, గ్రాంట్లను దారి మళ్లించి ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. సీఎం తనకు తానో తానీషాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మణ్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- కేంద్రం అందజేస్తున్న నిధులు పేద ప్రజలకు చేరడం లేదనే అమిత్ షా ప్రభుత్వాన్ని విమర్శించారు.
- ఎర్రటి ఎండలో ప్రజలను కలిసేందుకు అమిత్ షా వెళ్లారని.. సీఎం మాత్రం ప్రగతి భవన్‌లో ఏసీ వేసుకుని కూర్చున్నారు.
- అమిత్ షా మీకు సారీ చెప్పడం కాదు.. మీరే అమిత్ షాకు క్షమాపణ చెప్పాలి.
- గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కేసీఆర్ మహిళలను అవమానాల పాలు చేస్తున్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మీరే వారందరికీ క్షమాపణలు చెప్పాలి కేసీఆర్.
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌లో భాగంగా అన్ని వర్గాల ప్రజల్లో సమభావన పెంపొందించేందుకు అమిత్ షా సహపంక్తి భోజనం చేస్తే దాని మీద బురదజల్లాలని చూడటం దురదృష్టం.
- ఎక్కడో వండిన భోజనాన్ని సహపంక్తి భోజనంగా అమిత్ షా తిన్నారనడం బాధాకరం.
- దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నాటకాలు ఆడింది మీరు. కంటి తుడుపుగా డిప్యూటీ సీఎం పదవిని దళితుడికి ఇచ్చి అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ లేకుండా తప్పించడం మీరు చేసిన కుట్రే.
- ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీడం లేదు. అమిత్ షా తెలంగాణకు రాక టీఆర్‌ఎస్ పీఠంలో కుదుపులు తీసుకొచ్చింది.
- కన్‌ఫ్యూజన్‌లో బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని సీఎం అన్నారు. మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మూడేళ్ల మీ పాలన సత్తా నిరుపించుకోండి. మీ బలం ఎంటో మీ పరిపాలన ఏంటో చూద్దాం.