తెలంగాణలో బీజేపీదే అధికారం: అమిత్ షా
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ బూత్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏం చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారని, కేంద్ర పన్నుల కింద కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు రూ.9వేల కోట్లు ఇస్తే... దాన్ని తాము పదింతలు పెంచామన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లుకు పైగా ఇచ్చామన్న మాటకు తాను కట్టుబడి ఉంటానని అమిత్ షా అన్నారు.
తెలంగాణకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎన్నో ఇచ్చామని, మౌలిక సదుపాయాల కోసం రూ.40వేల 800 కోట్లు కేటాయించామన్నారు. వివిధ పథకాల అమలుకు రూ.12వేల కోట్లు ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయమని, ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు.
ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీ విస్తరణలో భాగంగానే తెలంగాణలో తమ పర్యటన అని, తాము ఎవరినీ భయపెట్టేందుకు రాలేదని అన్నారు. అయితే తమ రాకతో ప్రత్యర్థులకు బీపీ వస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమని ఆయన తెలిపారు. ’సబ్ కా సాథ్...సబ్ కా వికాస్’ బీజేపీ లక్ష్యమన్నారు. ఈ సమ్మేళనానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.