గెలుపే లక్ష్యంగా ‘ఎంపి’క | CM KCR Special focus on Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా ‘ఎంపి’క

Published Mon, Mar 11 2019 4:36 AM | Last Updated on Tue, Mar 12 2019 11:31 AM

CM KCR Special focus on Lok Sabha Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేంద్రంలో ఈసారి కీలకపాత్ర పోషించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీనికి అనుగుణంగా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలోని  17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుంది. స్వల్ప తేడాతో 2 స్థానాల్లో ఓటమిపాలైంది. ఈసారి మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలవాలని టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎక్కువ స్థానా ల్లో సిట్టింగ్‌లకే టికెట్‌ ఇవ్వాలని యోచిస్తోంది. గెలుపు ప్రాతిపదికగా అన్ని అంశాలపై  సర్వేలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఖరారులో సర్వే అంశాలే కీలకం కానున్నాయని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు.

► 16 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌ పది స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టతకు వచ్చింది. 9 స్థానాల్లో సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని   నిర్ణయించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వా లని భావిస్తోంది. పెద్దపల్లిలో మాజీ ఎంపీ జి.వివేకానంద పేరు దాదాపుగా ఖాయమైంది. నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీకి రాష్ట్రంలో కీలక పదవి ఇచ్చి ఈ లోక్‌సభ సెగ్మెంట్‌లో కొత్త అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉంది.  

► మల్కాజ్‌గిరి అభ్యర్థి కోసం మర్రి రాజశేఖర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, బండారి లక్ష్మారెడ్డి పేర్లతో టీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహిస్తోంది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాల ప్రాతిపదికగా అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.  

► సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంటేనే టీఆర్‌ఎస్‌ విజయం పరిపూర్ణమవుతుం దని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.   తలసాని సాయికిరణ్‌యాదవ్, బొంతు శ్రీదేవియాదవ్, దండె విఠల్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టా నం వీరి పేర్లతో సర్వేలు నిర్వహించింది.

► చేవెళ్లలో  టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.  జి.రంజిత్‌రెడ్డి, మాజీమం త్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ పేర్లతో ఇక్కడ సర్వేలు నిర్వహించింది. అయితే,  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కుమారుడు పి.కార్తీక్‌రెడ్డి పేరును కూడా ఈ స్థానానికి టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

► ఖమ్మం లోక్‌సభ ఎన్నికలతో ఈ జిల్లాలో పట్టు నిలుపుకోవాలని కేసీఆర్‌ యోచిస్తున్నా రు. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును అభ్యర్థులుగా పరిశీలిస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా టికెట్‌ కేటాయించనున్నారు.  

► మహబూబాబాద్‌ పరిధిలోని ఏడింటిలో 3 స్థానాల్లో టీఆర్‌ఎస్, నాలుగింట కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, సత్యవతి రాథోడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామచంద్రునాయక్‌ పేర్లతో  సర్వేలు నిర్వహించారు. సత్యవతిరాథోడ్‌కు ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరికి  అభ్యర్థిత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది.  

► గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో దక్కకుండా పోయిన నాగర్‌కర్నూల్‌ స్థానంలో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ఈసారి ధీమాగా ఉంది. మాజీ మంత్రి పి.రాములు, గాయకుడు సాయిచంద్, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇక్కడ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement