సాక్షి, హైదరాబాద్ : దేశంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాని పక్షాలు బీజేపీపై చేస్తున్న విమర్శలు అర్థ రహితమని ఆపార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. 2014 కంటే ముందు దేశంలో 16లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండేవని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరున్నర కోట్ల కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. ఒక్క ఉజ్వల పథకం కిందే మూడున్నర కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. దీపం పథకం కింద 3300 రూపాయలు కూడా కట్టలేని వారికోసం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పడం లేదంటూ వెంకటేశ్వర్ రావు విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రధాన మంత్రి నిధులు ఇచ్చినట్లుగా చెప్పటం లేదంటూ మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చే నిధులు ఎక్కడ ఇచ్చినట్లు కనిపించడం లేదని, వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఇస్తున్న కిట్ రాష్ట్ర ప్రభుత్వానిది కాదని, కేంద్రం ఇస్తున్న పథకం అని అన్నారు.
ప్లీనరీలో కేసీఆర్ కేంద్రంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సంకినేని మండిపడ్డారు. ఫసల్ భీమా విషయంలో రైతాంగానికి సరైన అవగాహన కల్పించడం లేదని, తద్వారా రైతులు పెద్ద ఎత్తున మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి దాకా దేశానికి మోదీ దశ దిశ అంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు విమర్శించడం ఆయన భయానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్, చంద్రబాబుల్లో ఉందని, అందుకే ప్రధానిపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment