
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చంద్రబాబు జోక్యం లేని రాజకీయాలు ఉండాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కూటమి పొత్తుల పేరుతో తెలంగాణకు మరోసారి చంద్రగ్రహణం పట్టే పరిస్థితి వచ్చిందని ప్రజలు దానిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకే తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తమకు నాంది అని తెలిపారు. అందుకే రాష్ట్రంలో వందకు పైగా బీజేపీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందని ఆరోపించారు.
చంద్రబాబు ముక్త్ తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను బాబు నిర్దేశించాలనుకుంటున్నారని, చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలని మురళీధర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన నిర్దేశించే రాజకీయాలు నడవకూడదని అందుకు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. టీడీపీని తెలంగాణ ధోఖా పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment