'నా గుండె తరుక్కుపోతోంది'
హైదరాబాద్: 'ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో మాట, పూటకో వాగ్దానంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడేళ్ల పాలనను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. దీని కోసమేనా పోరాడి తెలంగాణ తెచ్చుకుందని' బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రస్ కార్యక్రమాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అండగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన పార్టీలు కూడా ఏదో ఒక తెలంగాణ అన్నప్పటికీ మేము మాత్రం హైదరాబాద్‌తో కూడుకున్న పది జిల్లాలో తెటంగాణ కావాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేసిందన్నారు.
'తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులను, సంస్థలను పక్కన పెట్టి ప్రస్తుతం రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారితో జట్టుకట్టడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. లక్ష ఉద్యోగాల మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. అధికారం కేంద్రీకృతమై అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అసలు జవాబుదారితనం అనేదే కనిపించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావంతో, టీఆర్‌ఎస్ వైఫల్యాలతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తాం. కాంగ్రెస్ దేశంలోనే కాదు తెలంగాణలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. మజ్లీస్‌ను ఎదుర్కోవడం బీజేపీకే సాధ్యమని' లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.