పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం: పాలడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
ఉద్యోగ నాయకుడి వల్లే ఉద్యమానికి విఘాతం
పరోక్షంగా అశోక్‌బాబును తప్పుపట్టిన చలసాని శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఉద్యోగ నాయకుడి నాయకత్వలోపం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమానికి విఘాతం కలిగిందని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తద్వారా పరోక్షంగా ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును తప్పుపట్టారు. ఆయన నాయకత్వ లోపమే సీమాంధ్ర పాలిట శాపంగా మారిందని, ఇకపై కొత్త వేషాలతో ప్రజల ముందుకొచ్చే నాయకుల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దని సీమాంధ్రులకు సూచించారు. శుక్రవారమిక్కడ ఏపీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు న్యాయంగా పోరాటం చేశారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
పాతికేళ్ల వరకూ కాంగ్రెస్ కోలుకోదు: వట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పాతికేళ్ల వరకూ కోలుకునే అవకాశమే లేదని మంత్రి వట్టి వసంతకుమార్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు మంత్రులు శుక్రవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అంతా ఒక చోటకు చేరడంతో వారి మధ్య సరదా సంభాషణ సాగింది. భవిష్యత్ కార్యక్రమం గురించి ప్రస్తావన రాగా తాను పోటీ చేయాలనుకోవడం లేదని వట్టి చెప్పారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల జనాగ్రహం బాగా కనిపిస్తోందన్నారు. రామనారాయణరెడ్డిని మీరేం చేయబోతున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తానన్నారు. రఘువీరా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు.
రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాటం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాడాలని సీపీఎం నిర్ణయించింది. పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శుక్రవారమిక్కడ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రాల ఏర్పాటు అనంతర పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి రెండు తీర్మానాలను ఆమోదించింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన జరిగినా ప్రపంచ బ్యాంకు విధానాలే అమలవుతాయని, ఇప్పటి పాలకులే తిరిగి రెండుచోట్లా ఏలతారని, ఫలితంగా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్న అంచనాకు వచ్చింది. రాష్ట్రంలోని లక్షా 82 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించింది. సమ్మె తీవ్రతరం కాకమునుపే కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
‘సీమ’లోనే రాజధాని ఉండాలి: బెరైడ్డి
అనంతపురం, న్యూస్‌లైన్: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోతే రణరంగం సృష్టిస్తామన్నారు. అనంతపురంలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. నికర జలాలు, సీమలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలు, సంపూర్ణ మద్యపాన నిషేధం తదితర డిమాండ్లతో ఈ నెల 24, 25 తేదీల్లో సీమ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీమ వ్యాప్తంగా 52 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు.
అసెంబ్లీ నిర్ణయం మేరకే రాజధాని: జేపీ
సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడన్నది అక్కడి శాసనసభ నిర్ణయం మేరకు జరగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని, అసెంబ్లీ వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ పెద్దలెవరని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని వికేంద్రీకరించాలన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సత్తా పార్టీ శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత, గత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సన్నాహక కమిటీని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్‌కు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సంపూర్ణ తెలంగాణ సాకారం కాలేదు: విరసం
సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల పోరాటం ద్వారా కోరుకున్న తెలంగాణ సాకారం కాలేదని, పోరుబాటలో బాసటగా నిలిచిన పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం దుర్మార్గమైన చర్య అని విప్లవ రచయితల సంఘం(విరసం) విమర్శించింది. ఆంధ్రకు నష్టపరిహారంగానో, ప్యాకేజీగానో నిర్మించాలని నిర్ణయించిన పోలవరం ప్రాజెక్టు మూడు లక్షల మంది ఆదివాసులను, రెండు వందల గ్రామాలను, 3 లక్షల ఎకరాలను ముంచివేస్తుంటే, బాధితులను ఆంధ్రలో కలపడం ఏమిటని విరసం కార్యదర్శి వి. వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు పాణి, కాశిం, రాంకీ, రివేరా ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఎవరెవరూ ఏమన్నారంటే..
Published Sat, Feb 22 2014 1:57 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement