విభజన బిల్లు సీమాంధ్రపాలిట మారణశాసనమని, పార్టీలు విభేదాలు పక్కనపెట్టి కలసికట్టుగా అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాలని ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు.
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: విభజన బిల్లు సీమాంధ్రపాలిట మారణశాసనమని, పార్టీలు విభేదాలు పక్కనపెట్టి కలసికట్టుగా అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాలని ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. సోమవారం ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తూ మార్గమధ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎన్‌జీవోల సంఘం, ఉద్యోగసంఘాలు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, బిల్లుపై కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు.రాజకీయాలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కీలకఘట్టానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో ఐక్యత కనిపించడం లేదన్నారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకుడు మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం సబబుకాదన్నారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ వంశీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అసెంబ్లీలో ఓటింగ్‌లో పాల్గొని బిల్లును ఓడించాలని కోరారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బరాజు వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.