Paladugu Venkata Rao
-
ప్రభుత్వ లాంఛనాలతో పాలడుగు అంత్యక్రియలు
కృష్ణా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. నూజివీడులోని కృష్ణారెడ్డి కాలనీకి సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. అంతకముందు ఆయన భౌతికకాయాన్ని పోలీసు కవాతు నడుమ ఊరేగింపుగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, పులువురు నేతలు పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత
* ఇందిర భవన్లో ఆయన భౌతికకాయానికి నేతల ఘననివాళి * రేపు నూజివీడులో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు (78) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య సుశీలాదేవితో కలిసి ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడిని పెంచుకున్నారు. అయితే ఆయన కూడా ఇదివరకే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పాలడుగు మరణవార్త తెలిసి పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఆయన భౌతికకాయాన్ని తరువాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, అనంతరం ఇందిర భవన్‌కు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా నాయకులు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. తరువాత పాల డుగు భౌతికకాయాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కు తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం అక్కడ ఉంచి, బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడులోని పాలడుగు తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ పాలడుగు ప్రత్యేక చొరవ తీసుకుని భూ పోరాటాలు చేశారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థ లకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఉచితంగా ఇచ్చారని గుర్తుచేశారు. పాలడుగు మృతికి సీఎం సంతాపం పాలడుగు వెంకట్రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాలడుగు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన పాలడుగు మృతి కృష్ణాజిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్ సంతాపం పాలడుగు వెంకట్రావు మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యార్థినేతగా రాజకీయ ప్రస్థానం సాక్షి ప్రతినిధి, విజయవాడ: పాలడుగు వెంకట్రావు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సమసమాజ స్థాపన కోసం పోరాడిన కార్ల్‌మార్క్స్ జీవితాలపై పాలడుగు పీహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన 1940 నవంబరు 11న కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండ లం గోగులంపాడులో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. 1968లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1972 లో ఎమ్మెల్సీగా 1978, 1989ల్లో నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య, భవనం వెంకట్రామ్, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సభ్యుడిగా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా, పీసీసీ హైపవర్ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ, పీసీసీల్లో సభ్యుడిగా, పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
పలుకున్న అరుదైన నాయకుడు పాలడుగు
పాలడుగు విద్యాధికుడు. రచయిత. మార్క్స్‌నీ, లెనిన్నీ, గాంధీనీ, నెహ్రూనూ చదివారు. ఆయన ఇంట్లో ఉన్నంత పెద్ద గ్రంథాలయం చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల ఇళ్ళలో ఉంటుంది. మార్కెట్లో ఏదైనా కొత్త పుస్తకం కనిపిస్తే కొనేవారు. తాను రాసి ప్రచురించిన పుస్తకాల సెట్టు పుస్తకాల షాపులలో ఉండాలని కోరుకునేవారు. ఆయనది రాజకీయ వంశం కాదు. వారసత్వంగా ఆస్తిపాస్తులు రాలేదు. ముక్కు సూటిగా నడుచుకునే రాజీలేని ధోరణి. రాజకీయాలకు అవసరమైన లౌక్యం బొత్తిగా లేదు. పెద్ద నాయకుల పంచన చేరి భజన చేస్తూ పబ్బం గడుపుకునే వ్యక్తిత్వం కాదు. బలమైన నాయకులను ఎదిరించి కేవలం దీక్షాదక్షతలతో, నిజా యతీతో, నిర్భీతితో రాజకీయాలలో ఎదిగిన అరుదైన వ్యక్తి పాలడుగు వెంకటరావు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తనువు చాలించిన పాలడుగు కృష్ణా జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన నాయకుడు. ఉక్కు కాకాని కంటబడి ఆయన ఆశీస్సు లతో రాజకీయాలలో ప్రవేశించి నికార్సయిన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న మనిషి. తూర్పు కృష్ణాలో పిన్నమనేని కోటేశ్వరరావు, పశ్చి మంలో చనుమోలు వెంకటరావుల ప్రాభవం అప్రతి హతంగా సాగుతున్న రోజులలో వారిద్దరినీ ధిక్కరించి తనదంటూ ఒక రాజకీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న పలుకున్న నాయకుడు పాలడుగు. చైర్మన్‌గా అందరి మన్ననలూ పొందుతూ జిల్లా పరిషత్తు, సెంట్రల్ బ్యాం కు రాజకీయాలను శాసించిన రాజకీయ చతురుడు పిన్నమనేనికి కొరుకుడు పడకుండా, చనుమోలు సహ కారం ఆశించకుండా ఒంటరి పోరాటం సాగిస్తూ నూజి వీడు జమీందారు ఎంఆర్ అప్పారావుకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించిన రైతు పక్షపాతి. భూక్రాంతి ఉద్యమ కారుడు. నూజివీడులో రైతు సేవా భవనం నిర్మించి రాజేశ్ పైలట్ చేత ప్రారంభోత్సవం చేయించారు. కేవ లం తన ఆదర్శాలతో, విలువలతో, ఆత్మవిశ్వాసంతో రాజకీయాలలో నిలదొక్కుకొని శాసనసభలో, శాసన మండలిలో ప్రజాసమస్యలపై ఎలుగెత్తిన ప్రజాప్రతినిధి. పౌరసరఫరా వంటి శాఖ నిర్వహించినప్పటికీ అవినీతి మలినం అంటని మంత్రి. పాలడుగు రాజకీయాలలో ప్రవేశించినప్పుడే కొన్ని విలువలకు కట్టుబడి, ధర్మంగా, న్యాయంగా వ్యవహరిం చి సామాన్య ప్రజల హృదయాలలో స్థానం సంపాదిం చుకునే నేతగా ఎదగాలనే సంకల్పం చెప్పుకున్నారు. సుందరయ్య, లీలల మాదిరే పాలడుగు, సుశీల కూడా సంతానం ప్రజాసేవకు అవరోధం అవుతుందని అనుకు న్నారు. పాలడుగు విద్యాధికుడు. రచయిత. మార్క్స్‌నీ, లెనిన్నీ, గాంధీనీ, నెహ్రూనూ చదివారు. ఆయన ఇంట్లో ఉన్నంత పెద్ద గ్రంథాలయం చాలా తక్కువ మం ది రాజకీయ నాయకుల ఇళ్ళలో ఉంటుంది. మార్కెట్లో ఏదైనా కొత్త పుస్తకం కనిపిస్తే కొనేవారు. తాను రాసి ప్రచురించిన పుస్తకాల సెట్టు పుస్తకాల షాపులలో ఉండా లని కోరుకునేవారు. పాలడుగు నెహ్రూ వీరాభిమాని. ఇందిరాగాంధీ అంటే గొప్ప గౌరవం. పీవీ అంటే ప్రేమ. స్వయంగా విప్లవకారుడు కాకపోయినా విప్లవాభిమాని. నెహ్రూ, ఇందిర, పీవీ ఫొటొలతో పాటు ఆయన ఇంట్లో యాసిర్ అరాఫత్ ఫొటో కూడా ప్రముఖంగా కనిపించేది. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రామకృష్ణ (ఆర్కే) నాయకత్వంలోని నక్సలైట్ల బృందంతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలకు రంగం సిద్ధం చేసినవారిలో పాల డుగు ఒకరు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం విధేయు డుగా ఉంటూనే పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణ యాలు సరైనవి కావని తాను భావించినప్పుడు వాటిని నిర్భయంగా విమర్శించేవారు. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలినీ, పీవీ నరసింహారావునూ, ప్రణబ్ ముఖ ర్జీనీ, ఇతర నేతలనూ కలుసుకొని తన మనసులో మాట చెప్పి వచ్చేసేవారు. అగ్రనాయకులకు తాను ఏమి చెప్పిందీ చిలువలుపలువలు చేసి విలేఖరులకు వివరిం చి వార్తలు రాయించుకునే బాపతు రాజకీయవాది కాదు పాలడుగు. వ్యవస్థని మార్చాలనీ, అది గాంధేయ మార్గంలో జరగాలనీ, మార్పులో తాను భాగం కావా లనీ ఆయన తాపత్రయం. కేన్సర్ వ్యాధి లక్షణం తెలిసిన వ్యక్తి కనుక చర మాంకం సమీపించిందని గ్రహించి కాబోలు తాను రాసిన చివరి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆప్తమిత్రుడు గుత్తికొండ శివనాగేశ్వరరావు చేత ఏర్పాటు చేయించుకున్నారు. అంబులెన్స్‌లోనే హైదరాబాద్ నుంచి ఆ సమావేశానికి సన్నిహితుడు విజయకుమార్ వెంట వెళ్ళారు. కొన్ని వందలమంది అభిమానులు ఆ సభకు హాజరైనారు. తాను గౌరవించే మిత్రులు కొంద రిని ప్రత్యేకంగా ఆ సమావేశానికి ఆహ్వానించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కెఆర్ వేణుగోపాల్, సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ అధినేత డాక్టర్ ఎన్ భాస్క రరావు, మాజీ న్యాయమూర్తి భవానీ ప్రసాద్, నేనూ, తులసిరెడ్డి, నెహ్రూ, తదితర రాజకీయ నాయకులతో పాటు వేదికమీద ఉన్నాం. ఆ సభలో ఆయన పావుగంట సేపు మనసు విప్పి మాట్లాడిందే వీడ్కోలు ప్రసంగమని బహుశా ఆయనకూ తెలుసు. ఆయన తిరిగి కోలుకోవా లనీ, మరికొన్నేళ్ళపాటు ప్రజలకు సేవచేయాలనీ మేమంతా శుభాకాంక్ష వెలిబుచ్చినప్పటికీ కేన్సర్ మహ మ్మారికి మినహాయింపులు ఉండవని మాకూ తెలుసు. బరువెక్కిన గుండెలతో పాలడుగు దగ్గర సెలవు తీసు కు న్నాం. ఆ సభ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అపో లో ఆసుపత్రి ఐసీయూలో చేరిన పాలడుగు చివరి శ్వాస అక్కడే వదిలారు. జనహితమే ఊపిరిగా రాజకీయ జీవి తం గడిపిన పాలడుగు ధన్యజీవి. కొత్తగా రాజకీయాల లోకి వచ్చేవారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. కె. రామచంద్రమూర్తి -
పాలడుగు మృతి పై రఘవీరా సంతాపం
-
మొదటి నుంచి చివరివరకూ కాంగ్రెస్‌వాదే...
హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన పాలడుగు వెంకట్రావు మొదటి నుంచి కాంగ్రెస్‌వాది. చివరిదాకా ఆయన అలాగే కొనసాగారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన వెంకట్రావుకు నెహ్రూ-గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. పీసీసీ చీఫ్ రేసులో ఆయన పేరు చాలాసార్లు వినిపించినప్పటికీ సమీకరణాల కారణంగా పాలడుగుకు ఆ పదవి దక్కకుండా పోయింది. తుదివరకు కాంగ్రెస్‌వాదిగా కొనసాగిన వెంకట్రావు మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరోవైపు పాలడుగు మృత దేహాన్ని సోమవారం మధ్యాహ్నం ఇందిరాభవన్‌కు తరలించనున్నారు. అక్కడ ఆయన మృతదేహానికి వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పించనున్నారు. అనంతరం పాలడుగు భౌతికకాయాన్ని విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు తరలిస్తారు. పాలడుగు అంత్యక్రియలు బుధవారం నూజివీడులో జరుగుతాయి. -
పాలడుగు వెంకట్రావు కన్నుమూత
-
పాలడుగు వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు వెంకట్రావు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రస్తుతం ఆయన ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. వెంకట్రావు మృతిపై కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాలడుగు వెంకట్రావు 1940 నవంబర్ 11న కృష్ణా జిల్లా మునలూరు మండలం గోగులంపాడులో జన్మించారు. తండ్రి వామపక్ష భావాలు కలిగి ఉన్నా వెంకట్రావు మాత్రం కాంగ్రెస్ వైపే ఆకర్షితులయ్యారు. 1968లో యువజన కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన రాజకీయప్రస్థానం ప్రారంభమైంది. 1972లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1978లో నూజివీడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాలడుగు అంజయ్య కేబినెట్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1989లో మళ్లీ నూజివీడు నుంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్లో పౌరసరఫరాలమంత్రిగా పనిచేశారు. 2007 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. -
కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. -
'పవన్ కళ్యాణ్ హద్దులు దాటవద్దు!'
నూజివీడు: జనసేన పార్టీ స్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏదో ఒక సినిమా హిట్టు అయ్యిందని ఏదేదో మాట్లాడేస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని ధ్వజమెత్తారు. ‘‘పవన్ కళ్యాణ్ హద్దులు దాటవద్దు.రాజకీయాలలో అఆ లు నేర్చుకునే దశ నీది.నువ్వెంత?, నీ సర్వీసు ఎంత?, నీ శక్తి ఎంత? వెయ్యి జన్మలెత్తినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేవు'' అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. బీజేపీ తరుపున ప్రచారం చేసుకో. అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. నువ్వు సినిమాల్లో విశ్వరూపం చూపిస్తావేమో, అంతకంటే వంద రెట్లు ఎక్కువగా విశ్వరూపాన్ని రియల్‌గా తాను చూపించగలని హెచ్చరించారు. ఏ విషయంపైనైనా బహిరంగ సమావేశంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజెపీ అనే దీపం అనేక సార్లు వెలిగి ఆరిపోయిందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదన్నారు. తనది, పవన్‌ది గమ్యం ఒకటేనని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొనడం విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపుతాయన్నారు. పవన్‌కళ్యాణ్ కాంగ్రెస్ హఠావో అంటుంటే, ఇద్దరి గమ్యాలు ఒక్కటేనని ఎలా చెపుతారని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. చిరంజీవి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమేయండి అని పవన్ కళ్యాణ్ అంటుంటే ఏమని అర్థం చేసుకోవాలని విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన బెట్టి కాంగ్రెస్‌ను బతికిస్తాడని చిరంజీవికి ప్రచార బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశాడో, తెలియక చేశాడో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్‌ను అయోమయానికి గురిచేసేలా మాట్లాడిన చిరంజీవి తమ గమ్యం ఒక్కటి కాదని రాష్ట్ర ప్రజలకు స్పష్టంచేయాలన్నారు. -
దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు పాలడుగు హితవు హైదరాబాద్: దమ్ముంటే లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సవాలు విసిరారు. ఇటీవల రాజమండ్రిలో కొందరు స్వయంసేవక్‌లు సమావేశమై దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, మోడీ వస్తేనే దేశం బాగుంటుందని పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. సోమవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. స్వామీజీలు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇలా చేయిస్తోందని విమర్శించారు. జాతి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. దేశ వినాశనానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు -
'పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. -
ఎవరెవరూ ఏమన్నారంటే..
పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం: పాలడుగు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగ నాయకుడి వల్లే ఉద్యమానికి విఘాతం పరోక్షంగా అశోక్‌బాబును తప్పుపట్టిన చలసాని శ్రీనివాస్ సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఉద్యోగ నాయకుడి నాయకత్వలోపం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమానికి విఘాతం కలిగిందని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తద్వారా పరోక్షంగా ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును తప్పుపట్టారు. ఆయన నాయకత్వ లోపమే సీమాంధ్ర పాలిట శాపంగా మారిందని, ఇకపై కొత్త వేషాలతో ప్రజల ముందుకొచ్చే నాయకుల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దని సీమాంధ్రులకు సూచించారు. శుక్రవారమిక్కడ ఏపీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు న్యాయంగా పోరాటం చేశారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పాతికేళ్ల వరకూ కాంగ్రెస్ కోలుకోదు: వట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పాతికేళ్ల వరకూ కోలుకునే అవకాశమే లేదని మంత్రి వట్టి వసంతకుమార్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు మంత్రులు శుక్రవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అంతా ఒక చోటకు చేరడంతో వారి మధ్య సరదా సంభాషణ సాగింది. భవిష్యత్ కార్యక్రమం గురించి ప్రస్తావన రాగా తాను పోటీ చేయాలనుకోవడం లేదని వట్టి చెప్పారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల జనాగ్రహం బాగా కనిపిస్తోందన్నారు. రామనారాయణరెడ్డిని మీరేం చేయబోతున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తానన్నారు. రఘువీరా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాటం: సీపీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాడాలని సీపీఎం నిర్ణయించింది. పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శుక్రవారమిక్కడ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రాల ఏర్పాటు అనంతర పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి రెండు తీర్మానాలను ఆమోదించింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన జరిగినా ప్రపంచ బ్యాంకు విధానాలే అమలవుతాయని, ఇప్పటి పాలకులే తిరిగి రెండుచోట్లా ఏలతారని, ఫలితంగా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్న అంచనాకు వచ్చింది. రాష్ట్రంలోని లక్షా 82 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించింది. సమ్మె తీవ్రతరం కాకమునుపే కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ‘సీమ’లోనే రాజధాని ఉండాలి: బెరైడ్డి అనంతపురం, న్యూస్‌లైన్: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోతే రణరంగం సృష్టిస్తామన్నారు. అనంతపురంలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. నికర జలాలు, సీమలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలు, సంపూర్ణ మద్యపాన నిషేధం తదితర డిమాండ్లతో ఈ నెల 24, 25 తేదీల్లో సీమ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీమ వ్యాప్తంగా 52 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. అసెంబ్లీ నిర్ణయం మేరకే రాజధాని: జేపీ సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడన్నది అక్కడి శాసనసభ నిర్ణయం మేరకు జరగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని, అసెంబ్లీ వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ పెద్దలెవరని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని వికేంద్రీకరించాలన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సత్తా పార్టీ శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత, గత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సన్నాహక కమిటీని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్‌కు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంపూర్ణ తెలంగాణ సాకారం కాలేదు: విరసం సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల పోరాటం ద్వారా కోరుకున్న తెలంగాణ సాకారం కాలేదని, పోరుబాటలో బాసటగా నిలిచిన పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం దుర్మార్గమైన చర్య అని విప్లవ రచయితల సంఘం(విరసం) విమర్శించింది. ఆంధ్రకు నష్టపరిహారంగానో, ప్యాకేజీగానో నిర్మించాలని నిర్ణయించిన పోలవరం ప్రాజెక్టు మూడు లక్షల మంది ఆదివాసులను, రెండు వందల గ్రామాలను, 3 లక్షల ఎకరాలను ముంచివేస్తుంటే, బాధితులను ఆంధ్రలో కలపడం ఏమిటని విరసం కార్యదర్శి వి. వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు పాణి, కాశిం, రాంకీ, రివేరా ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'
హైదరాబాద్: సీఎం పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు అన్నారు. కిరణ్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర రాష్ట్రాన్ని నడపలనుకోవడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. 15, 25 రోజుల్లో సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అనేది కేంద్రమే తేల్చాలన్నారు. రాజధాని అంశంపై సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదని చెప్పారు. -
హోంశాఖ అధికారులతో సీమాంధ్ర నేతల భేటీ
కేంద్ర హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎస్. శైలజానాథ్, రుద్రరాజు పద్మరాజు, పాలడుగు వెంకట్రావు కలిశారు. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు తేనున్న తెలంగాణ నోట్‌పై నాయకులు ఆరా తీసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంశాఖలోని తమ మిత్రులమని కలవడానికి వెళ్లామని మీడియాతో శైలజానాథ్, రుద్రరాజు చెప్పారు. దేశ పౌరుడిగా ఎవరినైనా కలిసే హక్కు తమకుందని తెలిపారు. ఈ సమయంలో హోంశాఖకు ఎందుకు వస్తాం.. మీకు తెలియదా అంటూ ముక్తాయించారు.