పాలడుగు వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు వెంకట్రావు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రస్తుతం ఆయన ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. వెంకట్రావు మృతిపై కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పాలడుగు వెంకట్రావు 1940 నవంబర్ 11న కృష్ణా జిల్లా మునలూరు మండలం గోగులంపాడులో జన్మించారు. తండ్రి వామపక్ష భావాలు కలిగి ఉన్నా వెంకట్రావు మాత్రం కాంగ్రెస్ వైపే ఆకర్షితులయ్యారు. 1968లో యువజన కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన రాజకీయప్రస్థానం ప్రారంభమైంది. 1972లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1978లో నూజివీడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాలడుగు అంజయ్య కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
అయితే ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1989లో మళ్లీ నూజివీడు నుంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్‌లో పౌరసరఫరాలమంత్రిగా పనిచేశారు. 2007 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.