పాలడుగు వెంకటరావు
పాలడుగు విద్యాధికుడు. రచయిత. మార్క్స్‌నీ, లెనిన్‌నీ, గాంధీనీ, నెహ్రూనూ చదివారు. ఆయన ఇంట్లో ఉన్నంత పెద్ద గ్రంథాలయం చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల ఇళ్ళలో ఉంటుంది. మార్కెట్లో ఏదైనా కొత్త పుస్తకం కనిపిస్తే కొనేవారు. తాను రాసి ప్రచురించిన పుస్తకాల సెట్టు పుస్తకాల షాపులలో ఉండాలని కోరుకునేవారు.
ఆయనది రాజకీయ వంశం కాదు. వారసత్వంగా ఆస్తిపాస్తులు రాలేదు. ముక్కు సూటిగా నడుచుకునే రాజీలేని ధోరణి. రాజకీయాలకు అవసరమైన లౌక్యం బొత్తిగా లేదు. పెద్ద నాయకుల పంచన చేరి భజన చేస్తూ పబ్బం గడుపుకునే వ్యక్తిత్వం కాదు. బలమైన నాయకులను ఎదిరించి కేవలం దీక్షాదక్షతలతో, నిజా యతీతో, నిర్భీతితో రాజకీయాలలో ఎదిగిన అరుదైన వ్యక్తి పాలడుగు వెంకటరావు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తనువు చాలించిన పాలడుగు కృష్ణా జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన నాయకుడు. ఉక్కు కాకాని కంటబడి ఆయన ఆశీస్సు లతో రాజకీయాలలో ప్రవేశించి నికార్సయిన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న మనిషి.
తూర్పు కృష్ణాలో పిన్నమనేని కోటేశ్వరరావు, పశ్చి మంలో చనుమోలు వెంకటరావుల ప్రాభవం అప్రతి హతంగా సాగుతున్న రోజులలో వారిద్దరినీ ధిక్కరించి తనదంటూ ఒక రాజకీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న పలుకున్న నాయకుడు పాలడుగు. చైర్మన్‌గా అందరి మన్ననలూ పొందుతూ జిల్లా పరిషత్తు, సెంట్రల్ బ్యాం కు రాజకీయాలను శాసించిన రాజకీయ చతురుడు పిన్నమనేనికి కొరుకుడు పడకుండా, చనుమోలు సహ కారం ఆశించకుండా ఒంటరి పోరాటం సాగిస్తూ నూజి వీడు జమీందారు ఎంఆర్ అప్పారావుకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించిన రైతు పక్షపాతి. భూక్రాంతి ఉద్యమ కారుడు. నూజివీడులో రైతు సేవా భవనం నిర్మించి రాజేశ్ పైలట్ చేత ప్రారంభోత్సవం చేయించారు. కేవ లం తన ఆదర్శాలతో, విలువలతో, ఆత్మవిశ్వాసంతో రాజకీయాలలో నిలదొక్కుకొని శాసనసభలో, శాసన మండలిలో ప్రజాసమస్యలపై ఎలుగెత్తిన ప్రజాప్రతినిధి. పౌరసరఫరా వంటి శాఖ నిర్వహించినప్పటికీ అవినీతి మలినం అంటని మంత్రి.
పాలడుగు రాజకీయాలలో ప్రవేశించినప్పుడే కొన్ని విలువలకు కట్టుబడి, ధర్మంగా, న్యాయంగా వ్యవహరిం చి సామాన్య ప్రజల హృదయాలలో స్థానం సంపాదిం చుకునే నేతగా ఎదగాలనే సంకల్పం చెప్పుకున్నారు. సుందరయ్య, లీలల మాదిరే పాలడుగు, సుశీల కూడా సంతానం ప్రజాసేవకు అవరోధం అవుతుందని అనుకు న్నారు. పాలడుగు విద్యాధికుడు. రచయిత. మార్క్స్‌నీ, లెనిన్‌నీ, గాంధీనీ, నెహ్రూనూ చదివారు. ఆయన ఇంట్లో ఉన్నంత పెద్ద గ్రంథాలయం చాలా తక్కువ మం ది రాజకీయ నాయకుల ఇళ్ళలో ఉంటుంది. మార్కెట్లో ఏదైనా కొత్త పుస్తకం కనిపిస్తే కొనేవారు. తాను రాసి ప్రచురించిన పుస్తకాల సెట్టు పుస్తకాల షాపులలో ఉండా లని కోరుకునేవారు.
పాలడుగు నెహ్రూ వీరాభిమాని. ఇందిరాగాంధీ అంటే గొప్ప గౌరవం. పీవీ అంటే ప్రేమ. స్వయంగా విప్లవకారుడు కాకపోయినా విప్లవాభిమాని. నెహ్రూ, ఇందిర, పీవీ ఫొటొలతో పాటు ఆయన ఇంట్లో యాసిర్ అరాఫత్ ఫొటో కూడా ప్రముఖంగా కనిపించేది. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రామకృష్ణ (ఆర్కే) నాయకత్వంలోని నక్సలైట్ల బృందంతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలకు రంగం సిద్ధం చేసినవారిలో పాల డుగు ఒకరు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం విధేయు డుగా ఉంటూనే పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణ యాలు సరైనవి కావని తాను భావించినప్పుడు వాటిని నిర్భయంగా విమర్శించేవారు. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలినీ, పీవీ నరసింహారావునూ, ప్రణబ్ ముఖ ర్జీనీ, ఇతర నేతలనూ కలుసుకొని తన మనసులో మాట చెప్పి వచ్చేసేవారు. అగ్రనాయకులకు తాను ఏమి చెప్పిందీ చిలువలుపలువలు చేసి విలేఖరులకు వివరిం చి వార్తలు రాయించుకునే బాపతు రాజకీయవాది కాదు పాలడుగు. వ్యవస్థని మార్చాలనీ, అది గాంధేయ మార్గంలో జరగాలనీ, మార్పులో తాను భాగం కావా లనీ ఆయన తాపత్రయం.
కేన్సర్ వ్యాధి లక్షణం తెలిసిన వ్యక్తి కనుక చర మాంకం సమీపించిందని గ్రహించి కాబోలు తాను రాసిన చివరి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆప్తమిత్రుడు గుత్తికొండ శివనాగేశ్వరరావు చేత ఏర్పాటు చేయించుకున్నారు. అంబులెన్స్‌లోనే హైదరాబాద్ నుంచి ఆ సమావేశానికి సన్నిహితుడు విజయకుమార్ వెంట వెళ్ళారు. కొన్ని వందలమంది అభిమానులు ఆ సభకు హాజరైనారు. తాను గౌరవించే మిత్రులు కొంద రిని ప్రత్యేకంగా ఆ సమావేశానికి ఆహ్వానించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కెఆర్ వేణుగోపాల్, సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ అధినేత డాక్టర్ ఎన్ భాస్క రరావు, మాజీ న్యాయమూర్తి భవానీ ప్రసాద్, నేనూ, తులసిరెడ్డి, నెహ్రూ, తదితర రాజకీయ నాయకులతో పాటు వేదికమీద ఉన్నాం. ఆ సభలో ఆయన పావుగంట సేపు మనసు విప్పి మాట్లాడిందే వీడ్కోలు ప్రసంగమని బహుశా ఆయనకూ తెలుసు. ఆయన తిరిగి కోలుకోవా లనీ, మరికొన్నేళ్ళపాటు ప్రజలకు సేవచేయాలనీ మేమంతా శుభాకాంక్ష వెలిబుచ్చినప్పటికీ కేన్సర్ మహ మ్మారికి మినహాయింపులు ఉండవని మాకూ తెలుసు. బరువెక్కిన గుండెలతో పాలడుగు దగ్గర సెలవు తీసు కు న్నాం. ఆ సభ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అపో లో ఆసుపత్రి ఐసీయూలో చేరిన పాలడుగు చివరి శ్వాస అక్కడే వదిలారు. జనహితమే ఊపిరిగా రాజకీయ జీవి తం గడిపిన పాలడుగు ధన్యజీవి. కొత్తగా రాజకీయాల లోకి వచ్చేవారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి.
కె. రామచంద్రమూర్తి